వేదాలలోనే రాశుల రహస్యాలు

వేదాలలోనే రాశుల రహస్యాలు

ఇప్పటికి వేల ఏళ్ల కిందనే భారతీయులు జ్యోతిష తత్వాలను నేర్చుకున్నట్టు జైన గ్రంథాలు కూడా చెబుతున్నాయి. అలాగే ఆ కాలంలో మౌఖిక రూపంలో ప్రచారంలో ఉన్న జైన జ్యోతిష సిద్ధాంతాలు తరువాతి కాలంలో సాహిత్యాన్ని రూపాన్ని సంతరించుకున్నట్టు డాక్టర్‌ నేమి చంద్రశాస్త్రి తమ భారతీయ జ్యోతిషంలో అభిప్రాయపడ్డారు. వేదకాలంలో విజ్ఞానమంతా వేదరూపంలోనే ఉంది. ప్రత్యేక శాఖలుగా విభజించడం జరగలేదు. అందుకే ఏ విషయాన్ని పరిశీలించాలన్నా ఆ కాలానికి చెందిన సాహిత్యమేదీ నేరుగా దొరకదు. పైగా ఆ విజ్ఞాన విషయాలు కూడా కథలుగా రూపాంతరం చెందాయి. వైదిక సంస్కారాలకు చంద్ర నక్షత్రాన్ని గుర్తించి ముహూర్తాన్ని నిర్ణయించే పద్ధతి ఋగ్వేదంలో కనిపిస్తుంది. సూర్యుని పుత్రిక సూర్య. ఆమెకు చంద్రునితో పెళ్లయింది. కాబట్టి సూర్యకాంతి మీదే చంద్రడి వెలుగు ఆధారపడి ఉందన్న సంగతి ఈ కథతో వ్యక్తమవుతన్నది. ఆ సందర్భంలో వినిపించే ఋగ్వేదమంత్రంలో ఫల్గునీ నక్షత్రంలో ఆ వివాహమైనట్టు చెప్పారు.

ఖగోళ విజ్ఞానంలో భారతీయుల పరిజ్ఞానం విశేషమైనది. వేదాలలో కనిపించే నక్షత్ర పరిజ్ఞానం ఎలా ఉందో పరిశీలిద్దాం. అతి ప్రాచీనకాలంలోనే భారతీయులకు నక్షత్రాలకు సంబంధించిన పరిపూర్ణ పరిజ్ఞానమున్నది. తమ పర్యవేక్షణల ద్వారా సంపాత బిందువు భరణీ నక్షత్రం నాల్గవ పాదంలో ఉన్న సంగతిని గుర్తించి – కృత్తికా నక్షత్రం నుండి నక్షత్ర పరిగణన చేసినారు.

”అమీయ ఋక్షా నిహితాస

ఉచ్చా నక్తందదృశ్రే కుహచిద్దివేయుః |

అదబ్ధాని వరుణస్య

వ్రతాని విచాకశచ్చంద్రమాసక్తమేతి ||”

అనే మంత్రం ఉంది. ఇందులో రాత్రివేళ నక్షత్ర ప్రకాశం, వాటితో చంద్రుని కలయికలను ఇందులో వర్ణించారు.

యజుర్వేదంలో ఒక మంత్రంలో 27 నక్షత్రాలను గంధర్వులుగా కీర్తించడాన్ని గమనించవచ్చు. కాబట్టి ఆ సమయానికి 27 నక్షత్రాల గురించి ప్రచారం ఉన్నట్లు నిర్ధారించుకోవచ్చు. అధర్వణవేదంలో కృత్తిక మొదలైన 28 నక్షత్రాల వర్ణన ఉంది. అందులో మనం సామాన్యంగా పేర్కొంటున్న 27 నక్షత్రాలతో బాటు అభిజిన్నక్షత్రం గురించి కూడా తెలియచేశారు.

అలాగే తైత్తరీయ శ్రుతిలో నక్షత్రాల పేర్లు, వాటి దేవత, వచనం, లింగం గురించి కూడా ప్రస్తా వించడం కనిపిస్తుంది. దీనినుసరించి కృత్తికకు అగ్నిదేవత, స్త్రీ లింగం. బహువచనం. ఇందులో నక్షత్రాల అధిష్ఠాన దేవతలననుసరించి శుభాశుభాలను గుర్తించ వచ్చును. శతపథ బ్రాహ్మణం, ఐతరేయ సంహితలలో కూడా ఈ క్రమమే ఉంది.

అధర్వణవేదంలో మూలానక్షత్రంలో జన్మించిన బాలడి దోషశాంతి కోసం అగ్ని మొదలయిన దేవతలను గురించి చేసే ప్రార్థనలు ఉన్నాయి.

‘జ్యేష్ఠ ఘ్నాంజాతో విచృతోర్య

మస్యమూల వర్హణాత్‌ పరిపాలయేనం |

అత్యేనం నేషద్దురితాని విశ్వా దీర్ఘయుత్వాయ శతశారదాయ ||”

అనే మంత్రంలో మూలా నక్షత్ర దోషం తొలగిపోవడానికి, ఆ బాలునికి మేలు కలుగడానికి అగ్నిదేవునికి ప్రార్ధించడం కనిపిపిస్తున్నది.

వాజసనేయ సంహితలో ‘ప్రజ్ఞానాయ నక్షత్ర దర్శంయాదసేగణకమ్‌’ అనే సూక్తి ఉంది. ఇందులో నక్షత్ర దర్శగణక శబ్దాలు మిక్కిలి ముఖ్యమైనవి.

మన నక్షత్రనామాలు కూడా వాటి ఆకృతిని సంకేతిస్తూ ఉంటాయి.

ఉదాహరణకు హస్తా నక్షత్రం హస్తాకారంలోనే ఉంటుంది. చేతి ఆకారంలో ఉండే 5 నక్షత్రాలు హస్తా నక్షత్రం.

నక్షత్ర ప్రజాపతి

తైత్తిరీయ బ్రాహ్మణంలో నక్షత్రాల ఆకృతి ప్రజాపతి రూపంగా భావించడం కనిపిస్తుంది. ”యోనై నక్షత్రియం ప్రజాపతితం వేద, ఉభయోరేనం లోకయోర్విదుః, హస్త ఏవాస్య హస్తః, చిత్రాశిరః నిష్ట్యా హృదయం, ఊరూ విశాఖే, ప్రతిష్ఠానూరాధాః, ఏషనై నక్షత్రియః ప్రజాపతిః (తై.బ్రా. 1-5-2).

నక్షత్రరూపియైన ప్రజాపతికి చిత్త శిరస్సు హస్త హస్తములు, నిష్ట్య (స్వాతి) హృదయం, విశాఖ ఊరువులు, అనూరాధ పాదాలు. ఈ వేదంలోనే మరొక చోట ఆకాశం పురుషాకారంగా భావించడం కూడా గమనిస్తాం. ఆ పురుషునికి స్వాతి హృదయంగా పేర్కొనడం కనిపిస్తుంది. స్వాతి వాయు దేవతాకమైనదిగా గుర్తిస్తారు. వాయువు ప్రాణరూపం. అలాంటి వాయువునకు హృదయ స్థానానికి ప్రాముఖ్యం ఉంది కదా! చిత్త చుట్టును తొమ్మిది నక్షత్రాలు ఆధునిక కాలంలో యంత్ర పరికరాల ద్వారా కనిపిస్తున్నాయి. వాటిని కలుపుకొనినప్పుడు శిరస్సు ఆకారం దర్శనమిస్తుంది కదా!

శతపథ, తైత్తిరీయ బ్రాహ్మణాలలో నక్షత్రాల ఆకృతికి సంబంధించిన వివేచన ఎంతో స్పష్టం ఉన్నది. ఈ గ్రంథాల ద్వారా ప్రాచీనకాలంలో నక్షత్ర విద్య భారతదేశంలో విశేషంగా వికసించినదని స్పష్టమవుతుంది. ఈ నక్షత్రాల ప్రభావం, గుణాల వర్ణన కూడా అథర్వణ వేదంలోని కొన్ని మంత్రాలలో గోచరిస్తుంది. శతపథ బ్రాహ్మణంలోని ఒక మంత్రంలో సప్తర్షి మండల మిక్కిలి ప్రకాశించు నక్షత్ర పుంజంగా పేర్కొనడం జరిగింది. తైత్తిరీయ బ్రాహ్మణంలోని కొన్ని మంత్రాలలో అగ్న్యాధానం వంటి విశేష యజ్ఞాలు, ధార్మిక కృత్యములు చేయదగిన నక్షత్రాలను గూర్చి చెప్పడం జరిగింది. అధర్వణ వేదాంగ జ్యోతిషంలో తిథి కంటె నక్షత్రం బలీయమైనది అని చెప్పడం గమనిస్తాం.

”తిథిరేకగుణాప్రోక్తా నక్షత్రంచ చతుర్గుణం” అంటే తిథి కంటె నక్షత్రం నాల్గు రెట్లు బలమైనది.

తారాబలం

అలాగే జన్మనక్షత్రం నుండి ఆరోజు నక్షత్రం వరకు లెక్కించి తారాబలాన్ని నుగొనే విధానం కూడా చెప్పారు. ఇంకా తారాబలం ప్రాముఖ్యం కృష్ణ పక్షంలోనేనని చెప్పడం కూడా కనిపిస్తుంది. అట్లే గ్రహాలు, ఉల్కలు, మెరుపులు, భూకంపం మొదలలైన వాటిని గురించి వివరణలు గూడ అందులో ఉన్నాయి. ఈ విధంగా వేదంలో ఆరంభమై, వేదాంగ జ్యోతిషంలో వికసించిన నక్షత్ర విద్య తరువాతి కాలంలో మిక్కిలి విస్తరించింది. నక్షత్రాలతో బాటుగా మరికొన్ని చుక్కల గుంపులు తైత్తిరీయ సంహిత, మైత్రావరుణీయ, కాఠక సంహితలు అధర్వవేదం, శతపథ బ్రాహ్మణం మున్నగు వేద భాగాలలో వర్ణితములైనవి.

ధ్రువచలనం

”దృశస్యస్థానా దపసరణం” అను ఉపనిష ద్వాక్యం. దీని ద్వారా ధృవచలనం వ్యక్తీకరించినట్టు అర్థమవుతుంది.

వేద వాఙ్మయంలో నక్షత్రాల పరిగణన కృత్తి కాదిగా ఉంది. అగ్ని ముఖులు దేవతలు (అగ్ని ముఖావైదేవాః) అనే వేద వచనం ఈ అర్థాన్నే స్ఫురింపజేస్తున్నది.

అగ్ని – వృషభరాశి

అగ్ని ప్రార్థనా రూపమైన ”చత్వారిశృంగాత్రయో అస్యపాదా ద్వేశీర్షే సప్తహస్తాసో అస్య, త్రిధా బద్ధో వృషభోరోరవీతి మహోదేవో మర్త్యాగ్‌ం ఆవివేశ” అది వేద మంత్రం. 4 కొమ్ములు, 3 పాదాలు, రెండు శిరస్సులు ఇట్టి వృషభ రూపమున రంకెలు వేయు అగ్నికి అనగా కృత్రికా నక్షత్రానికి హస్తములు ఏడు. అగ్నికి సప్త జిహ్వుడను ప్రసిద్ధి ఉంది కదా! ఇందులో వర్ణించిన వృషభం వృషభరాశి కంటె వేరైనది కాదు.

అగ్నికి వాహనంగా వర్ణితమైన గొర్రె కూడా అగ్ని దేవతాకమైన కృత్తికకు సమీపంలో ఉన్న మేషరాశిగా గుర్తింపవచ్చును.

ఐతరేయ బ్రాహ్మణంలో ఒక గాథ ఉంది. సృష్టికర్త అయిన ప్రజాపతి తన కూతురైన రోహిణిని మృగరూపంతో బలాత్కరింపబోగా, దేవతలు మృగవ్యాధ రుద్రుని ప్రార్థించారు. ఆ మృగవ్యాధుడు బాణ ప్రయోగంతో ప్రజాపతిని కూల్చినాడు. మృగవ్యాధుడను నక్షత్ర పుంజమును గూర్చిన గాథగా దీనిని మనం గుర్తింపవచ్చును.

అర్ద్ర నక్షత్రం తైత్తిరీయ సంహితలో అధర్వణ వేదంలో ఆర్ద్ర అనే పేర్కొనడం జరిగింది. తైత్తిరీయ బ్రాహ్మణం మైత్రావరుణీయ సంహితలో కాఠక సంహితలలో దీనినే ‘బహు’ అను పేరుతో పిలవడం కనిపిస్తుంది.

”ప్రాతర్యావాణా ప్రథమాయజధ్వం” (ఋ.877-1) అనే ఋగ్వేద వచనాన్ని అనుసరించి ఆకాశంలో సూర్యోదయాకి ముందు ఏ నక్షత్ర మండలం ఉదయిస్తుందో ఆ మండలాధిష్ఠాన దేవతను ఆనాడు పూజించడం సంప్రదాయమైంది.

ఋగ్వేదంలో అర్జునీ నక్షత్రాలని పేర్కొన్న పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గునీ నక్షత్రాలు కృష్ణయజుర్వేదంలో ఫల్గునీ నక్షత్రాలుగా పేర్కొనడం చూస్తాం.

”వాయుర్నక్షత్రమభ్యేతినిష్ట్యాం, తిగ్మశృంగో వృషభోరోరువాణః, సమీరయన్భువనామాతరిశ్వా, అపద్వేషాగ్‌ంసినుదతామరాతీః” అనే మంత్రం మంత్ర పాఠంలో దర్శనమిస్తున్నది. స్వాతీ నక్షత్రం సమీపంలోని నక్షత్ర రూపమైన వృషభ మండలమే ఈ మంత్రంలో వర్ణితమైనది. మంత్ర పాఠంలోని ”కింతద్విష్ణోర్బలమహుః, కా దీప్తిః? కింపరాయణం? వాతాద్విష్ణోర్బలమహుః’ అక్షరాద్దీప్తి రుచ్యతే, త్రిపదాద్ధారయద్దేవః యద్విష్ణో రేకముత్తమమ్‌” అను మంత్రం స్వాతీ నక్షత్రాన్ని దాని సమీపంలోని విష్ణు పదాన్ని వర్ణిస్తున్నది.

”బ్రహ్మలోక మభిజయేయమితి తదేవం బ్రహ్మణేభిజితే” అనే మంత్రం కూడా మంత్ర పాఠంలోనే దర్శనమిస్తున్నది. చతుర్ముఖ బ్రహ్మ నాల్గు తారల సముదాయమయిన అభిజిన్నక్షత్రానికి అధిపతిగా గుర్తింపు పొందాడు.

”శృణ్వంతి శ్రోణామమృతస్య గోపాం, పుణ్యామస్యా ఉపశృణోమి వాచమ్‌” అనే మంత్రం శ్రవణా నక్షత్రంలోని గరుడాకృతిని స్తుతిస్తుంది.

ఋగ్వేదంలో ”యత్రగావో భూరిశృంగా అయాసః” అను వాక్యం విష్ణు పద సమీపవర్తులగు గోరూప నక్షత్రమండలాలను బోధించేదిగా మనం గుర్తించవచ్చును.

ఋగ్వేదంలో పేద్యఘాశ్వం ఎంతో ప్రసిద్ధమైనది. ”శ్యేనస్య పక్షాహరిణస్యబాహూ (ఋ.1-163-1) అని వర్ణించడం కనిపిస్తుంది. ఈ అశ్వం కూడా ఖగోళీయమైనదే. మంత్రపాఠంలో

”అజగరోనామసర్పస్సర్పిర్హ విషోమహాన్‌ తస్మిన్విసర్పిసుధితస్తే నత్వా స్వాపయామి|

సర్పస్సర్పో అజగరస్సర్పిర్హ విషోమహాన్‌ తస్యసర్పాత్సింధస్తస్యగామశీమహి”||

అను మంత్రంలో వర్ణితమైన అజగరము ఆశ్రేషా నక్షత్రం తరువాతనున్న పాము ఆకృతిని పోలిని నక్షత్రమండలమును వ్యక్తీకరిస్తున్నది.

”ద్వాదశ ప్రధయః శ్చక్రమేకం త్రీణి నభ్యానికుతచ్చికేత

తస్మిన్త్సాకంత్రిశతాన శంకవోర్పితాః సష్టిర్నచలాచలాసః||” .1-64-48

అనే ఋగ్వేద మంత్రం మూడు నాభులు ఉన్న రాశి చక్రాన్ని వర్ణిస్తున్నది.

ఈ విధంగా వేద విజ్ఞానంలో ఖగోళీయమైన విశేషాలు ఉన్నాయి. విశేషించి వృత్రాసురగాథ, తారాశశాంక కథ, మన్మథ సంహారం, వింధ్య పర్వత గర్వభంగం, అగస్త్యుడు సముద్రాన్ని తాగడం, ధ్రువుని గాథ, ఆకాశ గంగను శివుడు శిరస్సున ధరించడం, రాసలీల, దక్షశాపకథనం మొదలయిన గాథల ద్వారా సంకేతార్థాలతో ఖగోళియ విశేషములనెన్నిటినో మనవారు వ్యక్తీకరించారు. ఆ సంకేతితార్థముల గ్రహించలేక తారాశశాంక గాథ మొదలగు కథలలో జారత్వాది లక్షణాలను విమర్శించువారు ప్రజ్ఞావంతులని అనిపించుకోలేఉరు. గాథలలోని పరమార్థాన్ని గుర్తించడం కూడా క్లిష్టమైనదే. అలాంటి పరమార్థాన్ని గుర్తించనప్పుడు ఆ గాథ అసంభవంగా తోచే అవకాశం కూడా ఉంటుంది.

– డాక్టర్‌ చిర్రావూరి శివరామకృష్ణశర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *