ఆర్‌ఎస్‌ఎస్‌ అందించిన రాజనీతిజ్ఞుడు

ఆర్‌ఎస్‌ఎస్‌ అందించిన రాజనీతిజ్ఞుడు

పుట్టినవానికి మరణం తప్పదు.

కానీ ఒక దేశాన్ని దుఃఖసాగరంలో ముంచెత్తిన మరణం, జాతి జనులందరి చేత నిట్టూర్పు విడిచేటట్టు చేసిన మరణం ఆ మనీషి జీవితం ఎలాంటిదో చెప్పకచెబుతుంది. ఆ కాలం ఆయనను ఎంత ఆరాధించిందో అదే ప్రకటిస్తుంది. అటల్‌ బిహారీ వాజపేయి జీవితం, మరణం అలాంటివేే. ఈ దేశం చూసిన, ప్రపంచం గౌరవించిన రాజనీతిజ్ఞుడు వాజపేయి. ఆయన మాటలు తూటాలే. అయినా ఎవరినీ గాయపరచకుండా విరోధులను సైతం గెలిచిన మహావక్త ఆయన. ప్రజాస్వామిక వ్యవస్థలకి మకుటాయమానం భారత్‌. అలాంటి భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్వానికే మకుటాయమానమైన వ్యక్తి అటల్‌జీ. దేశ అత్యున్నత చట్టసభను ఓలలాడించిన ఆయన ఉపన్యాసాలు చిరస్మరణీయాలు. తొంభయ్‌ శాతం రాజకీయవేత్తలలో లేని గుండెతడి ఆయన సొంతం. రాజకీయాలలో కొత్తదారి, ఆ కవితాఝరి దాని ఫలితమే. ఒక్క ఓటుతో తన ప్రభుత్వం పడిపోతున్నా లెక్కచేయకుండా నైతిక విలువల రక్షణకే ఓటేసిన వ్యక్తిత్వం ఆయనది.

ఇదంతా ఇక గతం.

వాజపేయి ఇక చరిత్రలో భాగం

ఇవన్నీ ఉన్నా, ఆయన ఆత్మ ఒక్కమాట వినాలని ఎదురుచూస్తూ ఉంటుందని అనిపిస్తుంది. తన ఆత్మ అంటే మరేదో కాదు, రాష్రీయ స్వయంసేవక సంఘ ఆశయమే. అటల్‌ బిహారీ వాజపేయి భరతమాత ముద్దుబిడ్డ. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ఆయనను తీర్చిదిద్ది, సంస్కారం అందించి తిరిగి దేశసేవకు అందించింది. ఈ దేశం చూసిన పదిమంది ప్రధానమంత్రులలో, ఎందరో విదేశాంగ మంత్రులలో, ఎంతో చరిత్ర కలిగిన మన పార్లమెంట్‌ భవనం వీక్షించిన వేలాది మంది ప్రజాప్రతినిధులలో వాజపేయి విశిష్టమైనవారు. ఇది ప్రథమ ప్రధాని నెహ్రూ మొదలు అనేక మంది మహోన్నతుల నోటి నుంచి వినిపించిన వాస్తవం. అలాంటి విశిష్ట నేతను దేశానికి అందించిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. ఒక సందర్భంలో అటల్‌జీయే చెప్పుకున్నారు కూడా, ‘నా ఆత్మ ఆర్‌ఎస్‌ఎస్‌’ అని. భారతదేశ రాజకీయాలలో నిన్నటి తరానికి చెందిన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, నేటికీ దేశసేవలో ఉన్న లాల్‌కృష్ణ అడ్వాణీ, నరేంద్ర మోదీ, గోవిందాచార్య, ఖట్టర్‌, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వంటి వారెందరినో ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ రంగానికి అందించింది. కానీ అందరిలోను తనను తాను సమున్నతునిగా నిలుపుకునే అవకాశం దక్కించుకున్నవారు వాజపేయి. ఆయన కాలం, ఆయన దేశం కోసం చేసిన కృషి, ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు, వాటి పట్ల ఆయన స్పందన ఇందుకు ప్రధాన కారణం. ఆయా సందర్భాలలో వాజపేయి చూపించిన విజ్ఞత, రాజనీతిజ్ఞత, దేశభక్తి, విలువల పట్ల చూపించిన నిబద్ధత మహోన్నతమైనవి.

కత్తిరించిన ఒత్తులే దివ్యంగా వెలుగుతాయి. స్వయంసేవక్‌గా, రాజకీయవేత్తగా, పార్లమెంట్‌ సభ్యునిగా, ప్రధానమంత్రిగా వాజపేయి మెలిగిన కాలం ఏదీ కూడా ఆయనకు అనుకూలం కాదు. అయినా ఆయన నిరాశ పడలేదు. ఆ కాలాన్ని నిందించలేదు. ఆ కాలం లక్షణమదేనన్న వాస్తవాన్ని మాత్రం గుర్తించారు. ఆ పరిస్థితులను ఆయన తన వ్యక్తిత్వంతో, పోరాటపటిమతో, అనుభవంతో తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు. అదే ఆయన విశిష్టత. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో ఆయన ప్రచారక్‌. గాంధీజీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, పురుషోత్తమదాస్‌ టాండన్‌, జేబీ కృపలానీ, రాజేంద్రప్రసాద్‌ వంటివారిదే ఆనాడు ఉద్యమమంతా. ఒకరిద్దరు విదేశీ విద్యాధికులు తప్ప మిగిలినవారు భారత జాతీయ కాంగ్రెస్‌ వెంటే ఉన్నారు. పోరాడేందుకు వారు ఎంచుకున్న మార్గం ఏదైనా, వేదిక ఏదైనా గానీ జాతీయ ప్రయోజనాల విషయంలో వారంతా రాజీ లేకుండా వ్యవహరించిన వారే. అయితే వారి మాట చెల్లుబాటు కాలేదు. దాని ఫలితం దేశం చవిచూసింది. దేశం విడిపోయింది. ఇది ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద విషాదం. అతి పెద్ద రక్త పంకిల ఘటన కూడా. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఈ స్వాతంత్య్రం మీద అన్నీ ప్రశ్నలే. అలాంటి సమయంలో గాంధీజీ హత్య జరిగింది. ఈ హత్యానేరం నీలాపనిందలా ఆర్‌ఎస్‌ఎస్‌ భరించవలసి వచ్చింది. నిజానికి ఇప్పటికీ ఆ నిందను ఆర్‌ఎస్‌ఎస్‌ మీద వేసి ఆనందించే అంగుష్ట మాత్రులకు దేశంలో కొదవలేదు. గాంధీజీ హత్య తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించారు. కార్యకర్తల మీద తీవ్ర నిర్బంధం కొనసాగింది. కానీ సంస్థ తట్టుకుంది. తిరిగి నడక సాగించింది.

ఆ తరువాత హిందూ మహాసభ నేత, వీర సావర్కర్‌ అనుయాయి డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ నాయకత్వంలో ఆరంభమైన భారతీయ జనసంఘ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వెళ్లిన కార్యకర్తలు స్వతంత్ర భారత పునర్‌ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. వారిలో అటల్‌జీ ఒకరు.

ఎదురుగాలిలో నౌకను నడిపిన సరంగుకు ఉండే సాహసం, అనుభవం వేరు. వాజపేయి రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే ఇదే గుర్తుకు వస్తుంది. పార్లమెంట్‌లో వాజపేయి ఉపన్యాసం ఉన్నదంటే పండిట్‌ నెహ్రూ కూడా తప్పనిసరిగా హాజరయ్యే వారంటేనే అర్థమవుతుంది. అది కేవలం వాక్పటిమ కాదు. సమస్యల మీద అవగాహనకు నిదర్శనం. జాతీయ, అంతర్జాతీయ సమస్యల పట్ల ఆనాటి యువ వాజపేయికి ఉన్న శ్రద్ధకు తార్కాణం. దేశంలో తిరుగులేని నాయకునిగా చెలామణీలోఉన్న నెహ్రూ కూడా వాజపేయి నిజాయితీనీ, పార్లమెంటేరియన్‌గా ఆయనకు ఉన్న భవిష్యత్తునూ, అన్నింటికి మించి జాతికి అలాంటివారితో ఉన్న అవసరాన్నీ కూడా గుర్తించారు. ఇదంతా తనదైన వ్యక్త్తిత్వంతో శిల్పించు కున్నారు వాజపేయి. కానీ వాజపేయి చాలా విషయాలలో నెహ్రూ దృష్టికోణాన్ని అర్థం చేసుకోవ డానికి ప్రయత్నించినప్పటికి కశ్మీర్‌ విషయంలో నెహ్రూ, ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగానే దుయ్యబట్టారు.

ఇందిర హయాంలోను దేశ రాజకీయాలలో వాజపేయి తనదైన ముద్రను వేయగలిగారు. ఇలాంటి మాటలతో చరిత్రలో వాజపేయి స్థానాన్ని విశేషంగా చిత్రించడం ఇక్కడ ఉద్దేశం కాదు. ‘భారతజాతి జ్ఞాపకాల నుంచి నెహ్రూ జాడను కూడా తొలగించాలన్నంత’ కోరిక ఇందిరది. అలాంటి సమయంలోను వాజపేయి తనదైన ముద్రను రాజకీయాల మీద వేశారు. ప్రజాస్వామ్యవాదిగా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిరక్షకునిగా పేర్గాంచిన నెహ్రూ ముద్దుల కుమార్తె హయాంలో కాంగ్రెస్‌ పరువు, దేశం ప్రతిష్ట పలచబారాయని వాజపేయి సన్నిహిత మిత్రుడు, కాంగ్రెస్‌ భక్తుడు పీవీ నరసింహారావే తన ‘లోపలిమనిషి’ నవలలో విమర్శించారు. ఆ నవలను ఆవిష్కరించినవారు కూడా వాజపేయినే. అత్యవసర పరిస్థితి వంటి ఒక తీవ్ర చర్యలకు ఆమె పాల్పడక తప్పదన్న రీతిలోనే ఆ నవలలో పీవీ ఇందిర పాత్రను చిత్రించారు. చివరికి అత్యవసర పరిస్థితి విధించా రామె. 1975 నాటి ఈ దుర్ఘటన అంతిమంగా బీజేపీ అనే రాజకీయ పక్షం ఏర్పాటుకు దారితీసింది. ఇంకోమాటలో చెప్పాలంటే తనను చెత్తబుట్టలోకి విసిరివేయగల ఒక శక్తిని సాక్షాత్తు కాంగ్రెస్‌ పార్టీయే సృష్టించుకుంది. కానీ ఈ మధ్యలో జరిగిన అణచివేత, అరాచకం దారుణమైనవి. వీటి దుష్ఫలితా లను నేరుగా అనుభవించినవారిలో అటల్‌జీ, అడ్వాణీ, వేలాదిమంది సంఘ కార్యకర్తలు ఉన్నారు. మళ్లీ ఆర్‌ఎస్‌ఎస్‌ మీద నిషేధం. సంఘ్‌ సారథ్యంలో రహస్యోద్యమం సాగింది. వేలాదిమంది స్వయం సేవకులు జైళ్లకు వెళ్లారు. దారుణ హింసను అనుభవించారు. కానీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధ రించారు. ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఒక అపురూప ఘట్టం. దీనికి ప్రత్యక్ష సాక్షి, బాధితుడు వాజపేయి.

జనతా ప్రభుత్వం ఏర్పడింది. అందులో విదేశ వ్యవహారాల బాధ్యతను ఐక్యరాజ్య సమితికి వెళుతున్న ప్రతినిధుల బృందంలో వాజపేయి పేరుని ప్రథమ ప్రధాని చేర్చిన విషయం మొరార్జీ మరచిపోలేదు. వాజపేయి హయాం భారత విదేశీ వ్యవహారాల చరిత్రలో సువర్ణఘట్టం. ఈ అన్ని పరిణామాలు ఆర్‌ఎస్‌ఎస్‌ మీద కమ్యూనిస్టులు, హిందూ వ్యతిరేకులు వేస్తూ వచ్చిన అనేక నీచమైన ఆరోపణలకు సమాధానాలు చెప్పాయన్న మాట వాస్తవం. ఆనాడు ఇందిర ఒక దారిలోను, జనతాపార్టీలో భాగస్వాములైన హిందూ వ్యతిరేకులు, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకులు మరొక దారిలో మళ్లీ దాడి మొదలుపెట్టారు. ద్వంద్వ సభ్యత్వం పేరుతో జనతా పార్టీ నుంచి మాజీ జనసంఘీయులను తొలగించే వరకు నిద్ర పోలేదు. కానీ అది జనతా పార్టీ ఉసురు తీయడమేనని ఆనాడు వారికి అర్థం కాకపోవడమే పెద్ద వింత. పైగా మళ్లీ కాంగ్రెస్‌కు ప్రాణ ప్రతిష్ట చేస్తున్నామన్న స్పృహ కూడా ఆ తరహా నేతలకు పూర్తిగా లోపించింది. చివరికి మాజీ జనసంఘ్‌ సభ్యులు బీజేపీని ఏర్పాటు చేసుకున్నారు.

అప్పుడే ఖలిస్తాన్‌ ఉద్యమం, ఫలితంగా ఇందిర హత్య జరిగాయి. ఈ పరిణామాల సమయంలో బీజేపీ, ఆ పార్టీ నేతగా వాజపేయి నిర్వహించిన పాత్ర ప్రత్యేకమైనవి. అయినా ఎప్పుడూ తిరుగులేని రీతిలో ఎన్నికవుతూ వచ్చిన వాజపేయి పార్టీ పెట్టిన తరువాత ఓటమిని చవి చూడవలసి వచ్చింది. అది కూడా తన స్వస్థలమైన గ్వాలియర్‌ లోక్‌సభ స్థానంలోనే. ఆ తరువాత ఢిల్లీ రాజకీయమంతా కుంభకోణాల చరిత్రే. ఇందులో మచ్చలేకుండా మిగిలినవారు బీజేపీ సభ్యులే. హవాలా కుంభకోణంలో అడ్వాణీ పేరు వచ్చింది. వెంటనే పార్లమెంట్‌కు రాజీనామా చేసి, ఆ వివాదం తేలేవరకు పోటీ చేయబోనని ఆయన ప్రకటించి ఒక ఉన్నత పార్లమెంటరీ విలువకు శ్రీకారం చుట్టారు. వీపీ సింగ్‌ ప్రధానిగా ఎన్నికైన సందర్భం దేశానికి ఒక పీడకల. ఉప ప్రధాని దేవీలాల్‌ రాజకీయ కుట్రలకు పాల్పడడం, దాని నుంచి బయటపడడానికి వీపీ సింగ్‌ మండల్‌ కమిషన్‌ తేవడం దేశాన్ని ప్రమాదపుటంచులకు తీసుకుపోయింది.

తరువాత రాజీవ్‌ గాంధీ హత్య జరిగింది.

ఇవన్నీ సంక్షోభాలే. అతి పెద్ద పార్టీగా, కాంగ్రెస్‌కు దీటుగా ఎదుగుతున్న బీజేపీ మీద ప్రతికూల ప్రభావం చూపినవే. అయినా పార్టీని చెక్కుచెదరకుండా నిలబెట్టినవి వాజపేయి నాయకత్వం, వ్యక్త్తిత్వం వంటి అంశాలే. ఇందులో ఆయనకి సంఘ నేపథ్యం పరిపూర్ణంగా ఉన్న పెద్దమనిషి అడ్వాణీ చేయూత కూడా ఉంది. మండల్‌ కమిషన్‌ తరువాత అయోధ్య రథయాత్ర సాగింది. దీనికి భారతీయులలో విశేషమైన ఆదరణ ఉండేది. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా కూడా భారతీయ సమాజంలో చీలికను నివారించిన చారిత్రక ఘట్టం అయోధ్య రథయాత్ర. కానీ పత్రికలలో, పార్లమెంటులో ఉన్న కుహనా మేధావులకు, కుహనా లౌకికవాదులకు ఈ విషయం వెల్లడి కావడం ఇష్టం లేదు. మళ్లీ దుష్ప్రచారం. అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూలింది. నాలుగు రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు కూలిపోయాయి.

ఇన్ని ఒడిదుకుల తరువాత మొదటిసారి కేంద్రంలో 1996లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అంటే బీజేపీ పంథాను ప్రజలు ఆమోదించారనే కదా అర్థం! వాజపేయి ప్రధాని అయ్యారు. కానీ 13 రోజులకే దిగిపోయారు. ఆ సందర్భంగా ఆయన పార్లమెంటులో ఇచ్చిన ఉపన్యాసం ఇప్పటికీ ఒక అద్భుతం. మళ్లీ 1998లో ఎన్నికలు వచ్చాయి. బీజేపీ అత్యధిక స్థానాలు ఉన్న పార్టీగా లోక్‌సభలో స్థానం సాధించింది. 13 మాసాలకు కూలింది. ఆఖరికి 1999లో మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అలా మూడుసార్లు వాజపేయి ప్రధానిగా ప్రమాణం చేశారు.

ఒక సంకీర్ణం తరువాత మరో సంకీర్ణం కూలిపోయాయి. అయినా దేశానికి ఆ సమయంలో అలాంటి అనివార్యత ఉంది. అందుకే ప్రభుత్వాలు కూలిపోతున్నా, పాత మిత్రులు వెళ్లిపోతున్నా వాజపేయి విశ్వాసం కోల్పోలేదు. 19 పార్టీలతో ఆయన సంకీర్ణ ప్రభుత్వం నడిపి రికార్డు సృష్టించారు. అయినా పాలనకు లోపం లేదు. ఆయన ప్రభుత్వం చేపట్టిన పథకాలు గొప్పవి. ఆ కాలం అలాంటిది. పాకిస్తాన్‌తో సమస్యలు పెరిగాయి. బీజేపీని అడ్డం పెట్టుకుని అడ్డుతోవలలో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని భావించేవారు పెరిగారు. వీటిని అడ్డుకోవడానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఏం చేసినా కాషాయీకరణ పేరుతో ఎదురుదాడికి దిగడం రివాజయింది. మిత్రపక్షాల నుంచి ఎదురైన ఒత్తిళ్లు కూడా తక్కువేమీ కాదు. మొదటిసారి ఆయన ప్రధాని అయినప్పుడు కమ్యూనిస్టులు బ్లాక్‌డే పాటించిన సంగతి గుర్తు చేసుకోవాలి. అయినా వాజపేయి దేశ శ్రేయస్సు కోసం ఆ ఒత్తిళ్లను తట్టుకుంటూ, ఆ కువిమర్శలను అధిగమిస్తూ అనేక నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టారు. స్వర్ణ చతుర్భుజి, కశ్మీర్‌ పరిష్కారం కోసం కృషి, పాకిస్తాన్‌తో సయోధ్యకు యత్నం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.

పార్లమెంటేరియన్‌ నుంచి ప్రధాని వరకు సాగిన వాజపేయి రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం. తొలిసారి 1957లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 5, 6, 7, 10, 11, 12, 13 లోక్‌సభలకు ఎన్నికయ్యారు. 1962, 1986లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్లమెంటేరియన్‌గా వాజపేయిది అరుదైన ఘనత. నాలుగు రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటేరియన్‌ వాజపేయి. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యారు. వాజపేయి హయాంలో చేపట్టిన కార్యక్రమాలు స్వతంత్ర భారత చరిత్రలో చిరకాలం నిలిచిపోతాయి. దేశ ప్రధానిగా వాజపేయి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 1996లో తొలిసారి ప్రధానమంత్రి పదవి చేపట్టిన ఆయన కేవలం 13 రోజులే అధికారంలో ఉన్నారు. తరువాత 1998-99 మధ్య రెండోసారి ప్రధానిగా 13 నెలలు పనిచేశారు. 1999 నుంచి 2004 వరకూ పూర్తికాలం ప్రధాన మంత్రిగా దేశానికి ఎనలేని సేవ చేశారు వాజపేయి. కేంద్రంలో ఐదేళ్ల పాటు పూర్తికాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ యేతర ప్రధాని వాజపేయి.

పోఖ్రాన్‌-2 అణు పరీక్షలు

వాజపేయి పదవిని చేపట్టిన కొన్ని వారాలకే 1998 మే నెలలో ఇండియన్‌ ఆర్మీ ఆధ్వర్యాన పోఖ్రాన్‌-2 పరీక్షలు దిగ్విజయంగా జరిగాయి. భారత్‌ అణు పరీక్షలను రష్యా, ఫ్రాన్స్‌ తదితర దేశాలు సమర్ధించాయి. యుఎస్‌, కెనడా, జపాన్‌ తదితర దేశాలు సహాయ నిరాకరణ చేసినా వాజపేయి రాజకీయ చతురత, సమర్ధవంతమైన పాలన వల్ల దార్లోకి రాకతప్పలేదు (మరిన్ని వివరాలు వెనుక పేజీలలో).

లాహొర్‌ బస్సు యాత్ర

కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి వాజపేయి చేసిన కృషికి చరిత్రలో ఒక స్థానం వచ్చింది. పాకిస్తాన్‌ కవ్వింపుచర్యలకు పాల్పడుతున్నప్పటికీ పూర్తిస్థాయి దౌత్య చర్యలు ప్రారంభించారు. ఫలితంగా 1999లో ఢిల్లీ-లాహోర్‌ మధ్య బస్సు సర్వీస్‌ ప్రారంభమైంది. పాకిస్తాన్‌తో నూతన ఒప్పందం కోసం ఆ దేశాన్ని చర్చలకు ఆహ్వానించారు. లాహోర్‌ ఒప్పందం, ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించాలని, వర్తక సంబంధాలు విస్తతం కావాలని ఆకాంక్షించి ఆ దిశంగా కార్యాచరణ చేపట్టారు. 1999లో చేసుకున్న లాహోర్‌ ఒప్పదం ఇరు దేశాలకే కాకుండా దక్షిణాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించింది.

కార్గిల్‌ యుద్ధం

పాకిస్థాన్‌ తన కుయుక్తులను ప్రదర్శించిన ఫలితమే కార్గిల్‌ సంఘర్షణ.1999 మే-జూలై మధ్య భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కార్గిల్‌ యుద్ధం జరిగింది. పాక్‌ సైనికులు, కశ్మీరీ తీవ్రవాదులు ఎల్‌ఓసీని దాటి దేశంలోకి చొరబడ్డారు. ఇది కశ్మీరీ తిరుగుబాటు దారుల చర్య అని పాక్‌ చెప్పినా వాజపేయి నాయకత్వంలోని ప్రభుత్వం దాడికి దీటుగా సమాధానం ఇచ్చింది. వాస్తవాధీనరేఖ దాటి పాక్‌ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత్‌ సైన్యం స్వాధీనం చేసుకుంది. భారత్‌ అలాగే అంతర్జాతీయ ఒత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్‌ వెనుదిరిగింది.

ఆగ్రా శిఖరాగ్ర సమావేశం

దాయాది దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం సడలించేందుకు వాజపేయి అనేక చర్యలు తీసుకున్నారు. అందులో ఆగ్రా శిఖరాగ్ర సమావేశం ఒకటి. 2001 జూలై నెలలో ఇరుదేశాల మధ్య సమావేశం జరిగింది. రెండు రోజుల పాటు ఆగ్రాలో జరిగిన కీలక సమావేశంలో దశాబ్దాలుగా అపరిష్కతంగా ఉన్న కాశ్మీర్‌ సమస్యతోపాటు అణ్వాయుధాలను తగ్గించుకోవాలన్న అంశాలపై చర్చలు సాగాయి. పాకిస్తాన్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌తో ప్రధాని వాజపేయి పలు దశల్లో చర్చలు సాగాయి. అయితే ముషారఫ్‌కు చిత్తశుద్ధి కొరవడడంతో చర్చల ప్రక్రియకు విఘాతం కలిగింది. ఎలాంటి ఒప్పందం లేకుండానే అర్ధంతరంగా ఆగిపోయాయి. అయితే పాక్‌ దుర్నీతిని ఎండగట్టడంలో వాజపేయి ప్రభుత్వం సఫలీకతమైంది.

ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం హైజాక్‌

1999 డిసెంబర్‌లో తాలిబన్‌ ఉగ్రవాదులు ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేసినప్పుడు కేంద్రంలోని వాజపేయి ప్రభుత్వం సమయోచితంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడింది. ఖాట్మండు నుంచి ఢిల్లీ వస్తున్న ఐసీ 814 విమానాన్ని ఐదుగురు ఉగ్రవాదులు ఆఫ్గన్‌లోని కాందహార్‌కు హైజాక్‌ చేశారు. భారత్‌ బందీగా ఉన్న మసూద్‌ అజర్‌ సహా పలువురు ఉగ్రవాదులను విడిచిపెట్టాలన్నది తాలిబన్ల డిమాండ్‌. అనేక ఒత్తిళ్లు, చర్చలు తరువాత ఉగ్రవాది మసూద్‌ను అప్పగించిన ప్రయాణికులకు విముక్తి కల్పించారు.

మూడు కొత్త రాష్ట్రాల ఏర్పాటు

వాజపేయి ప్రభుత్వ హయాంలోనే దేశంలో కొత్తగా మూడు రాష్ట్రాలు ఆవిర్భవించాయి. చత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌ 2000 నవంబర్‌ 1, 9, 15వ తేదీల్లో ఏర్పాటయ్యాయి. దీంతో అప్పటి వరకూ 25 రాష్ట్రాలుండగా కొత్త రాష్ట్రాల ఏర్పాటుతో ఆ సంఖ్య 28కి చేరింది. మధ్యప్రదేశ్‌ నుంచి చత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌, బిహార్‌ నుంచి జార్ఖండ్‌ ఆవిర్భవించాయి. వీటిని ఏర్పాటు చేయడంలో వాజపేయి చూపించిన సమ్యమనం అద్భుతం. లాలూ ప్రసాద్‌ ఎంత తీవ్రంగా వ్యతిరేకించినప్పటికి ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ వాజపేయి బిహార్‌తో పాటు మిగిలిన రెండు రాష్ట్రాలను విడగొట్టారు.

పార్లమెంటుపై ఉగ్రదాడి

పాకిస్థాన్‌తో శాంతి కోసం సాచిన స్నేహహస్తాన్ని అత్యంత దారుణంగా పరిహాసం చేసిన ఫలితమే పార్లమెంటు మీద దాడి. స్వతంత్ర భారత చరిత్రలోనే ఇదో మాయని మచ్చగా మిగిలిపోతుంది. 2001 డిసెంబర్‌ 13న సాయుధ ఉగ్రవాదులు పార్లమెంట్‌ హౌస్‌పై తెగబడ్డారు. ఈ దాడిలో పలువురు భద్రతాసిబ్బంది చనిపోయారు. దాడి నేపథ్యంలో సైన్యాన్ని వాజపేయి ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, కాశ్మీర్‌లో భారీగా సైన్యాన్ని మోహరించాలని ఆదేశించారు. దీన్నే ఆపరేషన్‌ పరాక్రమ్‌ అంటారు. పార్లమెంట్‌ తరువాత రెండేళ్ల వరకూ పాక్‌-భారత్‌ మధ్య ఎలాంటి సంబంధాలు లేవు.

గుజరాత్‌ అల్లర్లు

గుజరాత్‌లో అల్లర్లు వాజపేయి ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా నిలిచాయి. హిందూ-ముస్లింల మధ్య జరిగిన హింసలో వేలాదిమంది చనిపోయారు. 2002లో ఈ ఘటన చోటుచేసుకుంది. హింసను ప్రేరేపిస్తున్న వారిని ఉపేక్షించేది లేదని ప్రధాని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అయితే అల్లర్లను అదుపుచేయడంలో తమ వైఫల్యం ఉందని ఒప్పుకోవడం వాజపేయికున్న నిజాయితీకి నిదర్శనం. దీనిని పత్రికలు, కుహనా మేధావులు వినియోగించుకోవడానికి చూశారు. అన్ని మతాల పట్ల ముఖ్యమంత్రి సమన్వయ దృష్టితో ఉండాలని వాజపేయి పత్రికల వారి సమావేశంలో అన్నారు. నేను అదే చేస్తున్నాను సార్‌! అని నేటి ప్రధాని, నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్నది అదే అని వాజపేయి చెప్పారు. దీనిని చాలా పత్రికలు, పత్రికా రచయితలు ఇప్పటికీ వక్రీకరించి రాస్తున్నారు. ప్రజలు పట్టించుకున్నారో లేదో వారికి అక్కరలేదు.

అటల్‌జీని తలుచుకోవడం అంటే స్వతంత్ర భారత చరిత్రను తలుచుకోవడం. ఆయన రాజకీయ జీవితాన్ని పరిశీలించడమంటే భారత పార్లమెంటరీ వ్యవస్థ చరిత్రను చదవడమే. ఆయన దృష్టి కోణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమంటే ఒక గొప్ప రాజనీతిజ్ఞుడి అంతరంగాన్ని పలకరించడమే. అటల్‌జీని స్మరించుకోవడమంటే ఒక స్వయంసేవక్‌ దేశం కోసం ఎంత చేయగలడో అంచనా వేయడం. ఒక స్వయంసేవక్‌ త్యాగం ఎంత విశిష్టమైనదో, ఎంతటి చరితార్థమైనదో గ్రహించడం కూడా.

వాజపేయి అంటే భారత ప్రధాని అయిన తొలి స్వయంసేవక్‌.

ఓం శాంతి శాంతి శాంతిః

వాజపేయి అంతిమయాత్ర బీజేపీ కార్యాలయం నుండి స్మృతిస్థల్‌కు సాగుతోంది. ఆ దూరం 7 కి.మీ.లు. భౌతికకాయం ఉంచిన వాహనాన్ని ప్రధాని మోది సామాన్యుడిలా నడుస్తూ అనుస రించారు. వాజపేయి ఆరోగ్యం విషమించిందని తెలిసినప్పటి నుండీ మోదీ స్పందిస్తూనే ఉన్నారు. 24 గంటల్లో రెండుసార్లు ఆస్పత్రికెళ్ళి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. వాజ్‌పేయి మరణించిన తరువాత అంతిమ సంస్కారాల వరకు పార్థివదేహం వెంటే ఉన్నారు. ఇదే కదా పెద్దలు, గురువుల పట్ల చూపాల్సిన నిజమైన వినయం, విధేయత ! మాజీ ప్రధాని అంతిమయాత్రలో ప్రధాని నడుస్తూ పాల్గొనడం ఆధునిక ప్రపంచ చరిత్రలో మొదటిదేమో. ప్రధానిని ఆయన మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అనుసరించడం స్వతంత్ర భారత చరిత్రలో ఎంతటి ఉన్నత ఆదర్శం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *