ఉగ్రవాదం కాదు, సమగ్ర దృష్టి కావాలి

ఉగ్రవాదం కాదు, సమగ్ర దృష్టి కావాలి

పాకిస్తాన్‌ ప్రేరిత ఉగ్రవాదులు సెప్టెంబర్‌ 18న యూరీ సైనిక స్థావరం మీద జరిపిన దాడిలో 17మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 30మంది గాయపడ్డారు. గత 26 ఏళ్లలో జరిగిన ఉగ్రదాడులలో ఇది కూడా తీవ్రమైనదే. సరిహద్దుకు దగ్గరగా ఉన్న ముఖ్యమైన స్థావరం కాబట్టి ఉగ్రవాదులు దీనిపై దాడికి తెగబడ్డారు. మూడు దారుల గుండా ఈ స్థావరాన్ని చేరే అవకాశం ఉంది. ఈ స్థావరం మీద దాడి కోసం ఎదురు చూసే ఉగ్రవాదులు హఠాత్తుగా తెల్లవారుఝామున గ్రెనేడ్లు, ఏ కె 47 తుపాకులతో విరుచుకువపడ్డారు. బారక్‌ల దగ్గర ఉన్న ట్యాంక్‌లలో సైనికులు డీజిల్‌ నింపుతున్న సమయంలో గ్రెనేడ్లు విసిరారు. దీనితో మంటలు అంటుకుని నలువైపులకు వ్యాపించాయి. సైనికులు నిద్రపోతున్న టెంట్లు అంటుకోవడంతో 13మంది సైనికులు చనిపోయారు. 30మంది గాయపడ్డారు. ఆ తరువాత మూడు గంటలపాటు జరిగిన కాల్పులలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. హఠాత్తుగా జరిగిన ఈ ఉగ్రదాడి సైనిక దళాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది అటు సైనిక దళాలలోనూ, ఇటు దేశ ప్రజానీకంలోను తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగించింది.

ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకులపై పాకిస్తాన్‌ గుర్తులు, పశ్తూన్‌ భాషలో ఉన్న మ్యాప్‌లు ఈ దాడి వెనుక పాక్‌ ప్రమేయాన్ని నిరూపిస్తున్నాయి. ఈ దాడి జరిగిన తీరు చూస్తే అది కచ్చితంగా జైషే మహమ్మద్‌ పనేనని తెలుస్తోందని, ఈ ఉగ్రదాడి పఠాన్‌కోట్‌ ఉదంతానికి కొనసాగింపులా ఉందని లెఫ్టినెంట్‌ జనరల్‌ రణ్‌బీర్‌ సింగ్‌ అన్నారు. పఠాన్‌కోట్‌ ఘటన జరగక ముందు వరకు భారత్‌ శాంతియుతమైన మార్గంలో, చర్చల ద్వారా సమస్యలను పరిష్క రించుకోవాలనే ధోరణిలోనే ఉంది. కానీ భారత్‌ అనుసరిస్తున్న విధానాన్ని చేతకానితనంగా పరిగ ణించిన పాకిస్తాన్‌ మరిన్ని దాడులకు తెగబడింది. ముఖ్యంగా జనవరిలో పఠాన్‌కోట్‌ సైనిక స్థావరంపై ఉగ్రదాడికి పాల్పడింది. దీనితో పాకిస్తాన్‌ పట్ల భారత్‌ వైఖరిలో మార్పు వచ్చింది. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి వేయాలనే ఆలోచన మరింత బలపడింది. అలాంటి పరిస్థితిలో కూడా పఠాన్‌కోట్‌ ఉదంతం మీద సంయుక్త దర్యాఫ్తుకు పాకిస్తాన్‌ ముందుకు వస్తే కాదనకుండా భారత్‌ అందుకు అంగీకరించింది. మరోవైపు మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌ సాగిస్తున్న సీమాంతర ఉగ్రవాదం వల్ల భారత్‌ ఎలా నష్ట పోతున్నదో ప్రపంచ దేశాలకు వివరించింది. వాటి మద్దతు కూడగట్టింది. మరోవైపు పాకిస్తాన్‌ వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. సరిహద్దు వెంబడి కాల్పులకు పాల్పడటం, ఉగ్ర వాదులను భారత్‌లోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిం చడం వంటి చర్యలకు పాల్పడుతూనే ఉంది. కశ్మీర్‌లో బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ తరువాత పాకిస్తాన్‌ ప్రేరిత మూకలు భారత దళాలపై అనేక దాడులకు పాల్పడ్డాయి. .

71వ యుఎన్‌ సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో కశ్మీర్‌ విషయాన్ని మరోసారి ప్రస్తావించాలని పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ప్రయత్నిస్తున్నప్పుడే ఉగ్రవాదులు భారత సైనిక కేంద్రమైన యూరిపై దాడిచేశారు. ఇలా ఐక్యరాజ్యసమితి సమావేశాల సమయంలో దాడులకు, కాల్పులకు పాల్పడటం పాకిస్తాన్‌కు అలవాటుగా మారింది. ఇలాంటి కవ్వింపు చర్యలకు ప్రతిగా భారత్‌ కఠిన చర్యలు ఏవైనా చేపడితే ప్రపంచం ముందు భారత్‌ను దోషిగా నిలబెట్టాలన్నది పాకిస్తాన్‌ ప్రయత్నం. యూరీ మీద ఉగ్రవాద దాడి భారత్‌ అంతటా తీవ్ర ఆగ్రహావేశాలు కలిగించింది. రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో దాడిని ఖండించడమే కాక తగిన ప్రతీకారం తీర్చు కోవాలని ప్రభుత్వాన్ని కోరాయి.

సెప్టెంబర్‌ 26న పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత దళాలు మెరుపు దాడి చేసి, వాటిని ధ్వంసం చేశాయన్న వార్త ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేసింది. అయితే భారత ప్రభుత్వం, సైనిక దళాలపై పలు సందేహాలు వ్యక్తంచేస్తు కొంత మంది అసలు మెరుపు దాడులు జరిగాయనడానికి సాక్ష్యాలు ఏవని ప్రశ్నించారు. యూరీ ఉగ్రదాడి వల్ల భారత సైనిక దళాల సన్నద్ధత, సామర్ధ్యం గురించి వచ్చిన సందేహాలు ఈ మెరుపుదాడులతో పటా పంచలయ్యాయి.

పాకిస్తాన్‌ మీద దీర్ఘకాలిక చర్యలు తీసుకోవ డానికి భారత ప్రభుత్వం సన్నద్ధమయింది. దౌత్య పరమైన చర్యలతో పాటు, రాజకీయ, ఆర్ధిక ఆంక్షలు విధించడానికి సిద్ధమయింది. ఐరాసలో పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ప్రకటనను తిప్పికొడుతూ ‘ప్రాచీన విద్యాకేంద్రమైన తక్షశిల నేడు ఉగ్రవాద కేంద్రంగా మారిపోయింది. ఉగ్రవాద శిక్షణ కోసం ప్రపంచం లోని అనేక దేశాల నుంచి ఇక్కడికి వచ్చి చేరుతున్నారు’ అంటూ పాకిస్తాన్‌లో సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను ప్రపంచం ముందు ఉంచింది. ‘సుదీర్ఘకాలంగా పాకిస్తాన్‌ అనుసరిస్తున్న ఉగ్రవాద విధానం మూలంగా ఈ ప్రాంతంలోనే కాక ప్రపంచమంతటా ఉగ్రవాదం వ్యాపించింది’ అని భారత్‌ స్పష్టం చేసింది. సరిగ్గా ఇదే సమయంలో యు ఎస్‌ సెనేటర్లు టెడ్‌ పో, రోహ్రాబాచర్‌లు పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలంటూ అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. ఇస్లామాబాద్‌లో సార్క్‌ సమావేశాలకు హాజరు కాకుండా భారత్‌ తీవ్రస్థాయిలో తన నిరసనను వ్యక్తం చేసింది. సార్క్‌ దేశాల ¬మ్‌ మంత్రుల సమావేశం సందర్భంగా ఎదురైన చెడు అనుభవాన్ని గుర్తు పెట్టుకున్న భారత్‌ ఆ తరువాత జరిగిన సార్క్‌ సమావేశాలన్నింటిని బహిష్కరించింది. బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, భూటాన్‌లు భారత్‌కు పూర్తి మద్దతు తెలిపాయి. దీనితో ఈ ప్రాంతంలో పాకిస్తాన్‌ ఏకాకిగా మిగిలింది. భారత్‌ జరిపిన మెరుపుదాడుల తరువాత సార్క్‌ గురించి నేపాల్‌, మాల్దీవులు, శ్రీలంకలు కూడా పలు సందేహాలు వ్యక్తం చేశాయి. దీనితో వెనుకంజ వేసిన పాకిస్తాన్‌ ఇస్లామాబాద్‌ సార్క్‌ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసింది.

పాకిస్తాన్‌పై మరింత ఒత్తిడిని పెంచేందుకు సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించనున్నట్లు భారత్‌ ప్రకటించింది. మొదట ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయాలని భావించిన భారత్‌ అది వ్యతిరేక ఫలితాలకు దారితీయవచ్చని సందేహించింది. దీనితో మూడు రకాల చర్యలు తీసుకుంది. ఒకటి, సింధు కమిషన్‌ సమావేశాలను పూర్తిగా రద్దు చేసింది. దీని వల్ల తన అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు పాకిస్తాన్‌కు ఒక వేదికంటూ లేకుండా పోయింది. రెండు, 1987లో పాకిస్తాన్‌ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని పక్కన పెట్టిన జీలం నదిపై నిర్మిస్తున్న తుల్బుల్‌ ప్రాజెక్ట్‌ను భారత్‌ తిరిగి ప్రారంభించింది. మూడు, రావి, బియాస్‌, సట్లెజ్‌, నదీజలాల వినియోగాన్ని పర్యవేక్షించడానికి మొదటిసారిగా మంత్రుల స్థాయి సంఘాన్ని ఏర్పాటుచేసింది. ఆ విధంగా నదీజలాలను పాకిస్తాన్‌ పరిమితికి మించి ఏ మ్రాతం ఎక్కువగా వినియోగించుకోకుండా చర్యలు చేపట్టింది.

మెరుపుదాడులు నిర్వహిస్తున్నప్పుడు కూడా భారత్‌ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. యుఎన్‌లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రసంగం పూర్తయ్యేవరకు వేచిచూసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో పాకిస్తాన్‌ నిర్వహిస్తున్న పాత్రను సుష్మా స్వరాజ్‌ ప్రపంచ దేశాల దష్టికి తీసుకువెళ్లిన తరువాతనే సైన్యం మెరుపుదాడులు చేసింది. అలాగే బెలూచిస్తాన్‌లో పాకిస్తాన్‌ పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను కూడా అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించారు భారత విదేశాంగ మంత్రి. అలాగే వివిధ వేదికలపై ప్రసంగించిన ప్రధాని మోదీ మాత్రం మెరుపుదాడులు జరగనున్నాయని ఏమాత్రం తెలియకుండా వ్యవహరించారు. దాడులు జరిగే వరకు ఎవ్వరికీ ఏమి తెలియలేదు.

భారత దళాలు జరిపిన మెరుపుదాడులు సరైన సమయంలో చేపట్టినవని స్పష్టమయింది. పూర్తి స్థాయి యుద్ధం కాకుండా ఇలాంటి దాడుల ద్వారా భారత్‌ పూర్తి ఫలితాన్ని రాబట్టగలిగింది. వేగంగా సాగుతున్న ఆర్ధికాభివృద్ధికి పూర్తిస్థాయి యుద్ధం ఆటంకం అయ్యేది. 138 ప్రపంచ దేశాల మధ్య ఆర్ధిక పోటీలో భారత్‌ ఒకేసారి 16 స్థానాలు దాటి 39 స్థానానికి చేరుకుంది. చైనా 28వ స్థానంలో ఉంది. అలాగే మెరుపుదాడుల వల్ల సెన్సెక్స్‌ సూచీలు కూడా బాగా పతనమయ్యాయి. అయినప్పటికీ వ్యాపారవర్గాలు మెరుపుదాడులను పూర్తిగా సమర్ధించాయి.

పాకిస్తాన్‌లో మెరుపుదాడుల కంటే ముందే భారత సైన్యం మయన్మార్‌ సరిహద్దులలో నాగాలాండ్‌ ఉగ్రవాద స్థావరాలపైన చర్యలు చేపట్టింది. అయితే ఈ దాడుల గురించి పాకిస్తాన్‌ ప్రతికూల వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్‌ మయన్మార్‌ కాదంటూ వ్యాఖ్యా నించింది. కానీ సరిహద్దు దాటి భారతదళాలు ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసేసరికి నిర్ఘాంత పోయింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని 6.5 కిలోమీటర్లు లోపలకు చొచ్చుకుని వెళ్లిన బలగాలు 8 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయని, ఇందులో 38మంది ఉగ్రవాదులు, ఇద్దరు పాక్‌ సైనికులు చనిపోయారని భారత సైనిక వర్గాలు ప్రకటించాయి. అయితే ఎప్పటిమాదిరిగానే పాకిస్తాన్‌ దాడులేవీ జరగలేదని, ఎవరు చనిపోలేదని బుకాయించింది. కానీ చనిపోయిన వారిలో పాక్‌ సైనికులు కూడా ఉండడం ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ సైన్యం పూర్తి సహాయసహకారాలు అందిస్తోందన్న విషయాన్ని నిరూపించింది. ప్రపంచ దేశాలన్నీ భారత్‌ చర్యను సమర్ధించాయి.

ఫిబ్రవరి 14న పుల్వామాలో సిఆర్‌పిఎఫ్‌ బలగాలపై జరిగిన ఉగ్రదాడి దేశ ప్రజానీకంలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. సంఘటన జరిగిన 100 గంటలలోపే ఆ దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కమ్రాన్‌ అలియాస్‌ ఘాజి రషీద్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులను ప్రత్యేక బలగాలు మట్టుబెట్టయి.

ఎప్పటిలాగానే ఉగ్రదాడితో తమకేమీ సంబంధం లేదని, ఏవైనా సాక్ష్యాధారాలు ఉంటే దొషులపై చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్‌ పాత పాటే పాడింది. కానీ కఠినమైన చర్యలు చేపట్టాలని నిశ్చ యించుకున్న భారత్‌ మాత్రం వెంటనే పాకిస్తాన్‌కు అత్యంత ప్రాధాన్యత హోదాను తొలగించింది. అలాగే పాకిస్తాన్‌ నుంచి వచ్చే వస్తువులపై సుంకాన్ని 200శాతం పెంచింది.

అలాగే ఇక్కడ ఉన్న పాకిస్తానీ సానుభూతి పరులపై కూడా చర్యలు చేపట్టింది. కశ్మీర్‌ వేర్పాటు వాదులకు భద్రతను తొలగించింది. జమాత్‌ ఈ ఇస్లామి వంటి సంస్థలపై నిషేధం విధించింది. అంతేకాదు పాకిస్తాన్‌లోని బాలాకోట్‌ లో ఉన్న జైషే కేంద్రంపై భారత యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించి దానిని పూర్తిగా ధ్వంసం చేశాయి. ఇందులో పలువురు ఉగ్రవాదులతో పాటు వారికి శిక్షణ ఇచ్చేవారు కూడా చనిపోయారు. ‘జైషే సంస్థ మరిన్ని దాడులు జరిపే ప్రమాదం ఉందని తెలుసుకుని ముందుస్తు నివారణ చర్యగా వైమానిక దాడులు చేసినట్లు’ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలా పాకిస్తాన్‌లోనూ, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోనూ ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడం ద్వారా భారత్‌ బలమైన సందేశాన్ని పంపింది. అణ్వస్త్ర బూచిని చూపి పాకిస్తాన్‌ ఏ మాత్రం తమను బెదిరించలేదని తేల్చిచెప్పింది. మెరుపుదాడుల తరువాత పాకిస్తాన్‌ ఎదురుదాడికి పాల్పడవచ్చని అంచనా వేసిన భారత్‌ చాలా అప్రమత్తంగా వ్యవహరించింది. అనుకున్నట్లుగానే పాకిస్తాన్‌ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి రావడమేకాక సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించాయి. కానీ అప్రమత్తంగా ఉన్న భారత వైమానిక దళం ఈ దాడిని తిప్పికొట్టడమేకాక పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్‌16 విమానాన్ని కూల్చి వేసింది.

ఇలా వ్యూహాత్మక వైమానిక దాడుల ద్వారా పూర్తి స్థాయి యుద్ధాన్ని భారత్‌ తప్పించింది. దాడులు చేసినట్లు ప్రకటించిన కొద్ది గంటలకే ఉగ్రవాద కార్యకలాపాలు కట్టిపెట్టలంటూ ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను హెచ్చరించింది. వైమానికదాడులను గట్టిగా ఖండించలేకపోయిన చైనా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరాదంటూ భారత్‌ను కోరింది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్‌ అజర్‌ను ఐక్యరాజ్యసమితి ప్రకటించకుండా మూడుసార్లు అడ్డుపడిన చైనా ‘ఉగ్రవాదాన్ని అదుపుచేయడం గురించి భారత్‌ చేస్తున్న వాదనను దృష్టిలో పెట్టుకుంటే ఈ పోరు ప్రపంచంలోని అన్నీ దేశాలు సాగిస్తున్నదే. దీనిని అంతర్జాతీయ సహకారంతో ముందుకు తీసుకు పోవాలి. అందుకు తగిన వాతావరణాన్ని నిర్మించేం దుకు భారత్‌ కృషి చేయాలి’ అంటూ సలహా ఇచ్చింది. పాకిస్తాన్‌ సాగిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలను పట్టించుకో కుండా ఆ ఉగ్రవాదం వల్ల నష్టపోతున్న దేశానికే సలహా ఇవ్వడం ద్వారా చైనా తన సంకుచిత, నిర్లక్ష్య ధోరణిని బయటపెట్టుకుంది.

– డా.రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *