ఉష్ణోగ్రతలు పెరిగితే అంతా ఉప్రదవమే

ఉష్ణోగ్రతలు పెరిగితే అంతా ఉప్రదవమే

ఈ నివేదికను ఆమోదించిన అనంతరం భవిష్యత్తులో పర్యావరణానికి వాటిల్లబోయే ముప్పును గురించిన ఆందోళనతో పలువురు ప్రతినిధులు కన్నీళ్ల పర్యంతమై ఒకరినొకరు కావలించుకున్నారు కూడా. వాతావరణంలో పెద్దమొత్తంలో పేరుకుపోయిన కార్బన్‌ డయాక్సైడ్‌ని తొలగించాలంటే ప్రపంచ దేశాలన్నీ పెద్దఎత్తున ప్రయత్నాలు చెయ్యాలని ఈ పత్రం స్పష్టంగా పేర్కొంది.

ఇటీవలి సంవత్సరాలలో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక విప్లవం ముందు కంటే ఒక డిగ్రీ సెంటీగ్రేడ్‌ అధికంగా ఉన్నాయి. దీని ఫలితంగా అమెరికాలో హరికేన్‌ తుపానులు, కేప్‌టౌన్‌ (దక్షిణా ఫ్రికాలో ఒక తీరప్రాంత నగరం) లో కరువు, ఆర్కిటిక్‌ వద్ద అగ్ని ప్రమాదాలు సంభవించడం వంటివి చూస్తున్నాం. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు సంబంధించిన పలు నివేదికలు భవిష్యత్తు గురించి తీవ్ర హెచ్చరికలు చేస్తున్నాయని ఐక్యరాజ్య సమితికి చెందిన Intergovernmental Panel on Climate Change (IPCC) అంటోంది.

ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరో పన్నెండేళ్ల తరువాత ఇప్పుడున్న దానికన్న 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ అధికంగా పెరుగుతాయని, ఆ పరిస్థితే వస్తే ఇక భూ ఉపరితల ఉష్ణోగ్రతలను అదుపుచేయడం అసాధ్యమని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చ రిస్తున్నారు. ఆపైన ఉష్ణోగ్రతలు మరో 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ అధికమైనా ప్రపంచం దుర్భర పరిస్థితు లను ఎదుర్కొంటుందని, పలుదేశాలలో విపరీతమైన వరదలు, కరువుకాటకాలు నెలకొని లక్షలాది ప్రజలు పేదరికంలో కూరుకుపోతారనీ పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భూ ఉపరితల ఉష్ణోగ్రతలను అదుపుచేయడంలో ప్రపంచ దేశాలన్నీ ఘోరంగా విఫలమైనాయి. ‘గ్లోబల్‌ వార్మింగ్‌’కు ప్రధాన కారకమైన కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలపై రాబోయే పదేళ్లలో కఠిన నియంత్రణ పాటించకపోతే ఆ తరువాత సంభవించబోయే వాతావరణపరమైన మార్పులు మనిషి అదుపులో ఉండవని పర్యావరణ శాస్త్రవేత్తలు తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నారు. భూ ఉపరితల ఉష్ణోగ్రతలను పారిశ్రామికీకరణ ముందునాటి స్థాయికి తీసుకు రావాలంటే మానవ నాగరిక జీవనంలో పెను మార్పులు రావాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

‘రాబోయే పర్యావరణపరమైన ఉపద్రవాలను అరికట్టడంలో ప్రపంచ దేశాలన్నింటి పాత్ర ఉంది. ఆ దిశలో తగిన చర్యలు చేపట్టే బాధ్యత ప్రతి ప్రభుత్వానికీ ఉంది’ అని జిమ్‌ స్కీ అంటారు. ఈయన ఐక్యరాజ్య సమితికి చెందిన IPCCకి చైర్‌పర్సన్‌, లండన్‌ ఇంపీరియల్‌ కళాశాల ప్రొఫెసర్‌ కూడా.

2015లో పారిస్‌లో జరిగిన వాతావరణ సదస్సులో శాస్త్రవేత్తల బృందం ఒక నివేదికను ప్రవేశపెట్టింది. ఆ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కార్బన్‌ డయాక్సైడ్‌ అత్యధికంగా, అంటే ప్రతి ఏటా నాలుగు వేల కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఇది ముందు ముందు ఇంకా పెరగనుంది.

పర్యావరణంలో సంభవించబోయే ప్రమాదకర పరిణామాలను నియంత్రించాలంటే రాబోయే పదేళ్లలో ఏడాదికి పది లక్షల టన్నులకి పైగానే కార్బన్‌ డయాక్సైడ్‌ ఉత్పత్తిని తగ్గించాల్సి ఉంటుంది. మరోవైపు బొగ్గు వినియోగం ఇలాగే కొనసాగి నట్లయితే 2050 నాటికి గనులలోని బొగ్గు వనరులు పూర్తిగా హరించుకుపోతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

‘వాతావరణంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రమాద ఘంటికలను మ్రోగిస్తున్నాయి. 2050 నాటికి కార్బన్‌ ఉత్పత్తులను పూర్తిగా అరికట్టడమో లేదా ఏ పద్ధతులలోనైనా సరే గాలిలోని కార్బన్‌ డయాక్సైడ్‌ని తొలగించడమో చెయ్యాలి’ అని Erik Solheim అంటారు. ఈయన ఐక్యరాజ్య సమితికి చెందిన ఎన్విరాన్మెంట్‌ ప్రోగ్రాంకి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌.

మరోప్రక్క ప్రపంచ జనాభా విపరీతంగా పెరుగుతోంది. 2050 నాటికి ప్రపంచ జనాభా మరో రెండు వందల కోట్లకు పెరుగుతుందని అంచనా. వీరందరికీ సరిపడ ఇంధన, శక్తి వనరులను సమకూర్చాలంటే పెద్ద మొత్తంలో ఆహారాన్ని అందించే పంట భూములను బొగ్గు ఉత్పత్తికి అవసరమైన కలపను అందించే చెట్లను పెంచేందుకు కేటాయించాలి. ఎందుకంటే 2050 నాటికి గనులలోని బొగ్గు వనరులు అంతరించిపోతాయని శాస్త్రజ్ఞులు అంచనా వేసారు కదా. అంతేకాదు, ఆ బొగ్గును మండించడం వల్ల ఉత్పత్తి అయ్యే కార్బన్‌ డయాక్సైడ్‌ గాలిలో కలవకుండా భూమిలో పాతిపెట్టేందుకు కొంత వ్యవసాయ భూములను వినియోగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను శాస్త్రజ్ఞులు Bio-Energy with Carbon Capture and Storage (BECCS) గా వ్యవహరిస్తున్నారు.

ఇలా పెద్ద మొత్తంలో భూ వినియోగ మార్పిడి వల్ల రాబోయే కాలంలో ప్రపంచం పెను సవాళ్లను ఎదుర్కోనుంది. వాటిలో ప్రధానమైనవి..

1. మానవులకు ఆహార కొరత

2. పశువులకు ఆహార కొరత

3. భూమిలో సహజంగా జరిగే వాయువుల ప్రక్రియ దెబ్బతినడం

4. జీవవైవిధ్యం దెబ్బతినడం

5. పర్యావరణ సంతులనం దెబ్బతినడం

వందమంది శాస్త్రవేత్తలు జరిపిన వివిధ పరిశోధనల ఆధారంగా IPCC ఒక నివేదికను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వేలమంది ఈ నివేదికపై చేసిన విమర్శలు, సూచనల ఆధారంగా ఃూ’Summary for Policymakers’ పేరుతో 2018 అక్టోబర్‌ మొదటివారంలో విడుదల చేసిన 34 పేజీల పత్రాన్ని ఇంచియాన్‌ (దక్షిణ కొరియా)లో జరిగిన 195 దేశాలకు చెందిన ప్రభుత్వాధికారుల, శాస్త్రవేత్తలతో జరిగిన సమావేశం ఆమోదించింది. ఈ నివేదికను ఆమోదించిన అనంతరం భవిష్యత్తులో పర్యావరణానికి వాటిల్లబోయే ముప్పును గురించిన ఆందోళనతో పలువురు ప్రతినిధులు కన్నీళ్ల పర్యంతమై ఒకరినొకరు కావలించుకున్నారు కూడా. వాతావరణంలో పెద్దమొత్తంలో పేరుకుపోయిన కార్బన్‌ డయాక్సైడ్‌ని తొలగించాలంటే ప్రపంచ దేశాలన్నీ పెద్దఎత్తున ప్రయత్నాలు చెయ్యాలని ఈ పత్రం స్పష్టంగా పేర్కొంది.

‘ఒకరకంగా చెప్పాలంటే ఈ నివేదిక ఇసుకపై వ్రాసిన ఒక సన్నని గీత మాత్రమే. నిజానికి ఇది సకల మానవాళికి శాస్త్రవేత్తలు వినిపించిన ఒక మృత్యుఘంటిక! ఇప్పటికైనా మనమంతా మేల్కొని కఠిన చర్యలు చేపట్టకపోతే సమీప భవిష్యత్తులో భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని డెబ్రా రాబర్ట్స్‌ అంటారు. ఆయన ఈ సదస్సులో కో-చైర్మన్‌గా వ్యవహరించారు.

2016లో ప్యారిస్‌లో జరిగిన వాతావరణ సదస్సులో పర్యావరణం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. కానీ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు, ఆయా దేశాల రాజకీయ నాయకులకు మధ్య అంతరం పెరుగుతుండడం వల్ల ఏ దేశంలోనూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. పర్యావరణ కాలుష్యంలో అతి పెద్ద భాగస్వామి అమెరికా. కానీ ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్యారిస్‌ ఒప్పందం నుంచి బయటకు వచ్చేశారు.

భూ ఉపరితల ఉష్ణోగ్రతలు అధికమైనట్లయితే పంటలు పండడానికి మొక్కల మధ్య పరాగ సంపర్కానికి దోహదం చేసే కీటకాలు అంతరించి పోతాయి. ఫలితంగా పంటల దిగుబడి తగ్గిపోతుంది. ఇది ఆహార కొరతకి దారితీస్తుంది. అంతేకాదు, ‘గ్లోబల్‌ వార్మింగ్‌’ వల్ల సముద్రంలోని 99% పగడాలు (Corals) అంతరించిపోతాయి. పెరుగుతున్న భూగోళ వేడిమిని కొంతైనా అదుపుచేయగలిగితే ఈ పగడాలను 10 శాతం వరకైనా మనం మిగుల్చుకోగలం.

అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇప్పటికే సాగరజలాలు పెద్దమొత్తంలో ఆమ్లపూరితాలై, ప్రాణవాయువు (ఆక్సిజన్‌) శాతం తగ్గిపోతోంది. ఫలితంగా భూ ఉపరితలంలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందుకన్నా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఎక్కువైతే ముప్పై లక్షల టన్నుల సాగరజీవాలు అంతరించిపోతాయి. ఈ ఉష్ణోగ్రతలు మరో 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరిగినట్లయితే అరవై లక్షల టన్నుల సాగరజీవాలు అంతరించిపోతాయి.

ప్రతి ఏటా భూగోళపు ఉత్తరార్థపు వేసవిలో ఆర్కిటిక్‌ వద్ద మంచు కరగడం సహజమే. ఈ మంచు కరగడం ప్రతి వందేళ్ళకూ సగటున మూడు రెట్లు అధికమౌతుంటుంది. అయితే భూ ఉపరితల ఉష్ణోగ్రతలు అధికమౌతుండడం వల్ల ఆర్కిటిక్‌ వద్ద మంచు కరగడంలో మూడురెట్ల పెరుగుదల ప్రతి పదేళ్లకే సంభవిస్తుందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భూ వినియోగం, సాంకేతికపరమైన మార్పులు, విద్యుత్‌ ఆధారిత రవాణా వ్యవస్థ, వాతావరణంలో కార్బన్‌ని నియంత్రించే టెక్నాలజీ – వీటిని దృష్టిలో పెట్టుకుని IPCC కొన్ని మార్గదర్శకాలను చేసింది.

2030 నాటికి కార్బన్‌ కాలుష్యాన్ని 45 శాతం అరికట్టాలి. ఇందుకోసం వివిధ దేశాల ప్రభుత్వాలపై వ్యయభారం పెరుగుతుంది. ఎందుకంటే కార్బన్‌ ఉత్పత్తిని అరికట్టాలంటే అందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో పనిచేసే వ్యవస్థలను ఏర్పాటుచేసుకోవాలి. ‘ఇంతవరకు మనం పర్యావరణం గురించి భౌతిక, రసాయనశాస్త్రాల అంశాల పరిధిలోనే ఆలోచిస్తున్నాం. కానీ దేశీయ, అంతర్జాతీయ రాజకీయాల కోణాన్ని మనం ఉపేక్షిస్తూ వచ్చాం. నిజానికి పర్యావరణం విషయంలో అది చాలా పెద్ద పాత్రనే పోషిస్తోంది. ప్రపంచ దేశాల రాజకీయాలలో, ఆ దేశాధినేతల రాజకీయ ఆలోచనలలో మార్పు వస్తే పర్యావరణపరంగా మన ఆశించిన పరిణామాలను చూడవచ్చు’ అని జిమ్‌ స్కియా అంటారు.

IPCCనివేదికపై చర్చలు జరిపిన పలువురు నిపుణులు ఆ నివేదికలోని పలు అంశాలను అమెరికా, పెట్రోల్‌ వనరులు గల సౌదీ అరేబియా వంటి దేశాలు ఆమోదించకపోవచ్చునని అనుమానం వ్యక్తంచేస్తూనే, ఆ నివేదికలో ఏ అంశాన్నీ మార్పులు చేయడానికి వీలులేదని స్పష్టం చేసారు.

IPCC రూపొందించిన నివేదికలో ప్రతిపా దించిన అంశాలు పర్యావరణపరంగా ఎంతో సురక్షితమైనవి. ‘వీటిని అనుసరించి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ‘పర్యావరణ శరణార్థుల’ సంఖ్య పెరగడాన్ని అరికట్టవచ్చు. అంతేకాదు, పెను నష్టాలను పూడ్చడానికి వీలులేని విధంగా సంభవించ బోయే పలు ఉపద్రవాలను కూడా ముందుగానే నిరోధించవచ్చు’ అని Grantham Research Institute on Climate Change and the Environment (GRI)కిి చెందిన బాబ్‌ వార్డ్‌ అంటారు. GRI అనేది London School of Economics and Political Science లో ఒక పరిశోధన సంస్థ.

IPCC రూపొందించిన ఈ నివేదికను 2018 సంవత్సరాంతంలో పోలెండులో జరగబోయే ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సులో ప్రవేశపెట్టనున్నారు (ఈ వ్యాసం వ్రాసిన తేదీ 24-12-2018). అయితే ఈ నివేదికలో వివరించిన అంశాలు సరిపోవనీ, ఇంకా ఎంతో అధ్యయనం చేయవలసిన అవసరం ఉందనీ ఎంతోమంది పర్యావరణ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా శిలాజ ఇంధన వనరుల (fossil fuel)విషయంలో ప్యారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా ఎవరూ చర్యలు చేపట్టలేదు. ‘గ్యాస్‌’ వనరులను అన్వేషించడంలో బ్రిటన్‌ తన ప్రయత్నాలను మరింత ఎక్కువ చేసింది. ఆర్కిటిక్‌ ప్రాంతంలో చమురు నిక్షేపాలను వెలికి తీసేందుకు నార్వే పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇక జర్మనీ అయితే బొగ్గు వనరుల కోసం Hambach అడవులను నరికివేసి త్రవ్వకాలను చేపడుతోంది.

పర్యావరణానికి సంబంధించి అంతర్జాతీయంగా వివిధ సంస్థలు చేస్తున్న హెచ్చరికలు, సూచనల విషయంలో ప్రపంచదేశాల నిబద్ధత ఎలా ఉందంటే, వారు అనుసరిస్తున్న విధానాలతో త్వరలోనే భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు కంటే 1.5 డిగ్రీలు కాదు, 3 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరిగే ప్రమాదం లేకపోలేదు. IPCC నివేదికను రూపొందించిన పర్యావరణ నిపుణులు మాత్రం ఎంతో పట్టుదలగా ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న పర్యావరణపరమైన ఉత్పాతాలను ప్రత్యక్ష ఉదాహరణలుగా చూపించి అయినా సరే ప్రపంచ దేశాల అభిప్రాయాన్ని మార్చవచ్చని వారు విశ్వసిస్తున్నారు.

‘భూ ఉపరితల ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ అధికమౌతాయంటే రెండేళ్ల క్రితం నేనూ ఒప్పుకోలేదు. కానీ జరుగుతున్న ఉపద్రవాలను చూక నా అభిప్రాయంలో మార్పు వచ్చింది. IPCC నివేదికలో చేసిన సూచనల ఆధారంగా చైనాలో పర్యావరణ కాలుష్య నివారణకు నా వంతు ప్రయత్నం చేస్తాను’ అని చైనాలో Energy Research Institute కి చెందిన జియాంగ్‌ కెజున్‌ అంటారు. 2050 నాటికి ఉష్ణోగ్రతలు మరింత అధికం కాకుండా ఉండడానికి చైనా ప్రభుత్వం ఇప్పటికే దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించింది.

‘భూ ఉష్ణోగ్రతలు 1.5 నుండి 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌ అధికమౌతాయంటే మొదట ఎవరూ నమ్మలేదు. అదంతా చిన్నచిన్న దేశాల రాజకీయ ప్రస్తావనలుగా కొట్టిపారేశారు. కానీ ఇటీవలి సంవత్సరాలలో వాతావరణ మార్పులలో చోటుచేసు కుంటున్న అస్థిరతను గమనించిన తరువాత ఉష్ణోగ్రతల పెరుగుదల గురించి శాస్త్రవేత్తల అభిప్రా యంలో మార్పు వస్తోంది’ అని Johan Rockstrom అంటారు. ఈయన అమెరికాలోని నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రచురించిన ‘Hothouse Earth’ నివేదికను రూపొందించిన వారిలో ఒకరు.

– డా|| దుగ్గిరాల రాజకిశోర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *