జీవన క్షణాలను ఆవిష్కరించిన గీతాలు

జీవన క్షణాలను ఆవిష్కరించిన గీతాలు

‘నీవు నన్ను అనంతంగా సృష్టించావు….’

గురుదేవ్‌, విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ ‘గీతాంజలి’ మొదటి గీతంలో, మొదటి వాక్యమది.

కవి సమస్త మానవాళికి ప్రతినిధిగా నిలబడి చేసిన ప్రకటన. మానవ జన్మలను నీవు అనంతంగా సృష్టిస్తూనే ఉంటావని ‘ప్రభు’ను కవి స్తుతిస్తున్నాడు. గీతాంజలిలో ప్రతి గీతం తనదైన ప్రత్యేక ఉనికిని కలిగి ఉన్నట్టే అనిపిస్తుంది. మళ్లీ వరసగా చదువు తుంటే ఒక భావధారలో తడుస్తున్న అనుభూతి కలుగుతుంది. వీటికి ఒక అంతస్సూత్రం కూడా ఉంది. అది- తల్లి గర్భం నుంచి పుడమి గర్భం వరకు మనిషి సాగించే యాత్ర. ఈ మహాకావ్యంలో విశ్వకవి మనిషి జన్మించడం, జీవించడం, మళ్లీ ప్రభు సన్నిధికి చేరడం అనే ఒక నిరంతర ప్రక్రియను గురించి ఆవిష్కరించదలుచుకున్నారు. కానీ జన్మ అన్న తరువాత దానికి పరమార్థం ఉండాలని మాత్రం ఎలుగెత్తి చాటుతూ ఉంటారు. మనిషి జీవితం బుద్బుదప్రాయమైనది. అంటే నీటి బుడగ వంటిది. అది గిట్టడం లిప్తలలో పని. అయినా పుట్టుకకీ, మరణానికీ నడుమ ఎంతో కొంత జీవితం ఇస్తాడు ‘ప్రభు.’ అదే కాంతివంతంగా ఉండాలంటారు. ఆ గీతం మొత్తం చూద్దాం!

‘నీవు నన్ను అనంతంగా సృష్టించావు. అది నీ విలాసం.

తాకితే చాలు, పగిలిపోయే యీ పాత్రికను నీవు మాటిమాటికీ ఖాళీ చేసి మళ్లీ కొత్త జీవితంతో నింపుతూ ఉంటావు. ఈ చిన్న వేణువును ఊదుతూ కొండలూ కోనలూ తిరుగుతావు. నిత్యనూతనమైన మధురగీతాలు ఆలపిస్తావు.

నీ మృదుల కరాల అమృత స్పర్శ సోకితే చాలు నా చిన్నారి గుండెలో ఆనందం పరుగులు తీస్తుంది. ఏవో మాటలు నాలో పెల్లుబుకుతాయి.

నీవు ఇచ్చే మహాప్రసాదాన్ని స్వీకరించాలంటే- చూడు- నా చేతులెంత చిన్నవో! ఈ చిన్న చేతులతో ఆ మహా ప్రసాదాన్ని స్వీకరించగలనా?

ఇలాగ యుగాలు గడిచిపోతాయి. అయినా నీవు కొత్త జీవితాన్ని పాడుతూనే ఉంటావు. కొత్త పాటలు పాడుతూనే ఉంటావు. అయినప్పటికీ యీ పాత్రిక ను నింపడానికి ఖాళీ ఉంటుంది.’

తరాలు సాగిపోవడం గురించి, వారిలోని జ్ఞానతృష్ణ అనంతత్వాన్ని ఎంత గొప్పగానో చెప్పారని పిస్తుంది విశ్వకవి.

‘గీతాంజలి’ టాగూర్‌ బెంగాలీ భాషలో రాశారు. వాస్తవంగా ఆయన ఆ భాషలో అందించినవి 157 గీతాలని విమర్శకులు చెబుతారు. ఆగస్టు 14, 1910లో ఈ సంకలనం వెలువడింది. వీటిని టాగూర్‌ గారే ఆంగ్లంలోకి అనువదించారు. ఏదో వ్యాధికి గురై మంచం మీద ఉన్నప్పుడు ఆయన ఈ అనువాదం చేపట్టారు. 1912లో లండన్‌లోని ఇండియా సొసైటీ మేక్‌మిలన్‌ సంస్థ చేత వీటిని అచ్చువేయించింది. 1913లో నోబెల్‌ బహుమతి లభించింది. దీనితో ఆయన కీర్తి ఒక్కసారిగా విశ్వవ్యాప్తమయింది. ఎజ్రాపౌండ్‌ వంటి విమర్శకులు ఆయన కవిత్వానికి ముగ్ధులయ్యారు. ఆంగ్లాను వాదానికి ప్రఖ్యాత ఆంగ్ల భాషా కవి, విమర్శకుడు విలియం బట్లర్‌ యేట్స్‌ ముందుమాట రాశారు. ఒక బానిసదేశపు కవికి నోబెల్‌ ఇవ్వడమేమిటని ఆనాటి జాత్యహంకారం వేసిన ప్రశ్నకు దీటుగా సమాధానం ఇచ్చిన విశాల హృదయుడు యేట్స్‌. పైగా తాను నిత్యం రవీంద్రనాథ్‌ను చదువుతానని అన్నాడు. జార్జ్‌ బెర్నార్డ్‌ షా వంటి రచయిత కంటే ముందు టాగూర్‌కు ఈ పురస్కారం ఇవ్వడమేమిటని కూడా ఆనాటి శ్వేత జాత్యహంకారం విసుర్లు విసిరింది. 1912లో గీతాంజలి ఆంగ్లానువాదం వెలువడిన తరువాత రవీంద్రనాథ్‌ టాగూర్‌ కీర్తి విస్తరించింది. నిజమే, భారత్‌ వలసదేశమే. ఇంకొక మాటలో చెప్పాలంటే బానిసదేశమే. అయినా అక్కడ పుట్టిన కవి తాత్వికతను అర్థం చేసుకోవడానికి, సృజనను అందుకోవడానికి, ఆస్వాదించడానికి దురహంకారం సిద్ధం కాలేకపోయింది.

గీతాంజలి అధిభౌతిక దృక్కోణం నుంచి రాసిన గీతాల సమాహారం. జీవుడికీ, భగవానుడికీ మధ్య బంధాన్ని కవితాత్మకంగా టాగూర్‌ ఆవిష్కరించారు. మనిషి పుట్టుక, మరణం, భగవంతునిలో ఐక్యత వంటి వేదాంత రహస్యాలను నిక్షిప్తం చేసినవే అయినా, ఈ గీతాలలోని నిరాండబరత, కవితాత్మకత పాఠకులను పరవశులను చేస్తాయి. నేను నిత్యం రవీంద్రుని చదువుతానని యేట్స్‌ అనడంలోని రహస్యం ఇదే. టాగోర్‌ ఒక ఆదర్శ మానవుడిని చిత్రించుకున్నాడు. ఒక సృజనశీలిగా, కళాజీవిగా, సామాజిక చైతన్యం కలిగిన జీవిగా మనిషి పట్ల, అతడి జీవన ప్రస్థానం పట్ల ఒక సమున్నత భావననే టాగూర్‌ ఆవిష్క రించారు. అందుకే చావుకీ, పుట్టుకకీ మధ్య ఉండే జీవితాన్ని ఆయన ఈ విధంగా దర్శించారు.

జీవితం అంటే ఒక సమున్నత, ఏకైక సత్యం నుంచి విడవడి, ప్రస్థానం సాగించి, మళ్లీ ఆ సత్యం లోనే ఐక్యమవుతుందని టాగూర్‌ భావన. ఈ ప్రస్థానంలో ఉండే వివిధ మజిలీలను ఆయన వర్ణించారు. ఒక్కొక్క మజిలీ ఒక్కొక్క నైతిక సవాలును ఎదుర్కొంటుంది. బాల్యం, కౌమారం, అక్కడ నుంచి మరణం అంచుదాకా సాగే ఈ ప్రయాణం మధ్యలో మాతృభూమి పట్ల నిర్వర్తించ వలసిన కర్తవ్యం, వీటి కోసం అందవలసిన తర్ఫీదులను వర్ణించాడని విమర్శకులు చెబుతారు. అంటే ఒక పరిపూర్ణ మానవుడిని ఆయన కల్పన చేశారు. భగవంతునితో లేదా అంతిమ సత్యంతో మమేక మయ్యే దశ అదే నంటారు టాగూర్‌. కాబట్టి మృత్యువుని స్వాగతించ డానికి ఏ మానవుడు వెనుకాడ కూడదన్నదే ఆయన సందేశం (ఈ లోకం నా దృష్టి నుంచి అదృశ్యమయ్యే రోజు ఒకటి ఉన్నదని, జీవితం నా కళ్లపై కడపటి తెర దించి నిశ్శబ్దంగా సెలవు తీసుకుని వెళుతుందని నాకు తెలుసు- 92వ గీతం). ఇంతకీ తర్ఫీదంటే? నిరాడంబరంగా ఉండడం, అహానికి, భౌతిక సంపదలకు దూరంగా ఉండడం. ఒకటి నిజం. భగవంతుని మీద తనివితీరని ప్రేమను కలిగి ఉండడం, అనురాగాన్ని ప్రదర్శించడం భారతీయ సాహిత్యంలో కొత్త కోణం కాదు.

ఇక్కడ నిరాడంబరత అంటే మామూలు అర్థంలో కనిపించే నిరాడంబరత కాదు. సత్యాన్ని చూడడం దగ్గర పాటించవలసిన నిరాడంబరత. ఏడో గీతంలో ఇలా అంటారాయన.

‘నేను పాడే పాటకు ఆభరణాలు లేవు. అందచందాలు లేవు. సొమ్ములూ శోభలూ విసర్జిం చింది నాపాట. అహం లేదు నా పాటకు….’ అంటూ చివరికి ఇలా అంటారాయన, ‘నీవు నన్ను కౌగలించుకుని ఏవేవో గుసగుసలు వినిపిస్తూ ఉంటే ఆభరణాల గలగలలో నీ గుసగుసలు వినిపించవు. నేనొక కవినన్న గర్వం నీ సాన్నిధ్యంలో అంతరించి పోతుంది’ అని.

గీతాంజలి మాత్రమే కాదు, రవీంద్రుని అన్ని రచనలకు ఇతివృత్తాలకి నేపథ్యం ఎక్కడిది? అన్నింటి లోను అసాధారణమైన తాత్వికత ఉంటుంది. ఆ తాత్వికతకు మట్టి వాసన కూడా ఉంటుంది. ఉపనిషత్‌ బోధనల నుంచే రవీంద్రుడు తను రచనలకు తాత్వికతను కూర్చుకున్నారు. దీనికి తన నమ్మిన సిద్ధాంతాన్ని జోడించారు. పరులకు సేవ చేయడం వల్లను, ఆత్మక్షాళన జరుపుకోవడం వల్లను మనిషి దైవాన్ని చేరుకోగలుగుతాడన్నదే టాగూర్‌ గాఢ విశ్వాసం. ‘ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో’ అని సాగే గీతం గీతాంజలిలోని 35వ గీతం. దీనికి విశ్వవిఖ్యాతి ఉంది.

అసలు భగవానుని ప్రార్థించడం ఎందుకు? క్షాళన కోసం! 36వ గీతంలో ఆ అంశాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు టాగూర్‌.

‘నిన్ను నేను ప్రార్థించేది ఒకందుకే ప్రభు!

నాలోని లోభిత్వాన్ని సంకుచితత్వాన్ని సమూలంగా నిర్మూలించు.

కష్టసుఖాలను తేలికగా భరించే శక్తి నాకు ప్రసాదించు.

నా ప్రేమను నీ సేవలో ఫలప్రదం చేసుకునే శక్తిని నాకు యివ్వు.

పేదవారిని తిరస్కరించకుండా, అధికార గర్వం ముందు తలవంచకుండా ఉండే బలాన్ని నాకు అనుగ్రహించు.

సగర్వంగా తలయెత్తి రోజువారీ చిల్లర కష్టాలను చూచి నవ్వే తత్వాన్ని నాకు కలుగచేయి.

ప్రేమతో నా సర్వస్వాన్నీ నీ ఇచ్ఛకు సమర్పించే శక్తిని నాలో ప్రేరేపించు.’

టాగూర్‌ ప్రకృతి ఆరాధకుడు. సౌందర్యో పాసకుడు. అది కేవల ప్రకృతి ఆరాధన కాదు. దాని వెనుక కూడా సమున్నత దృక్పథం కనిపిస్తుంది. ప్రకృతి ఆరాధనే అంతిమ సత్యాన్ని చేరుకోవడానికి మార్గమని ఆయన అంటారు.

‘ఆమె’ అతడి దగ్గరకి చేరడం గురించి కవి 48వ గీతం దగ్గర వర్ణిస్తాడు. గర్భం దాల్చడం 60, 62 గీతాలలో కనిపిస్తుంది. ఆమె మృత్యువు కోసం సంసిద్ధురాలు కావడంం 86వ గీతం దగ్గర మొదలవుతుంది.

‘జీవితాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే మృత్యువును కూడా ప్రేమించగలుగుతున్నాను’ అన్నారు టాగూర్‌.

టాగూర్‌ నవల, నాటకం, కథ, కవిత్వం ప్రతిదాని లోను స్వేచ్ఛనే నిక్షిప్తం చేశారు. ఏ అక్షరమైనా స్వేచ్ఛా గీతమే. ప్రతి రచన మనిషిని స్వేచ్ఛ వైపు నడిపిస్తాయి. మనిషిని స్వేచ్ఛదిశగా నడిపించేదే సత్యమంటారాయన.

(రవీంద్రనాథ్‌ టాగూర్‌కు నోబెల్‌ సాహిత్య బహుమతి ప్రకటించి ఇప్పటికి 105 సంవత్సరాలు. ఈ సందర్భంగా.)

కుర్రవానికి రాకుమారుని దుస్తులు తొడిగి సింగారించారు. మెడనిండా సొమ్ములు దించారు. అప్పుడు అతడికి ఆటలో ఆనందం ఏమి వుంటుంది? అడుగడుగునా అతని సింగారం అడ్డువస్తుంది.

అలంకారం మాసిపోతుందేమోనని అతను ఒక మూల వొదిగి కూర్చుంటాడు. అడుగు కదపటానికి భయపడతాడు.

హాయిని, ఆరోగ్యాన్ని ఇచ్చే భూమాత ఒడినుంచి నన్ను విడదీసే ఈ అలంకారం నాకు వద్దమ్మా! ఇది నన్ను మానవ జీవన మ¬త్సవంలో పాల్గొనకుండా చేస్తున్నది.

(8వ గీతం)

మృత్యుదేవత నీ తలుపు తట్టినప్పుడు నీవు ఏమి సమర్పిస్తావు?

నా అతిథి ముందు నేను నా పరిపూర్ణ జీవన పాత్రికను ఉంచుతాను. వట్టిచేతులతో అతన్ని వెళ్లనివ్వను నేను.

వసంత, శరద్రాత్రులు, నేను కన్న తీయని కలలన్నీ అతనికి సమర్పిస్తాను. నా జీవన సంపాదనంతా అతని మ్రోల ఉంచుతాను.

చరమ దినమున మృత్యువు అతిథై వచ్చి నా తలుపు తట్టినా వెరవొందను.

(90వ గీతం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *