స్టీఫెన్‌ హాకింగ్‌ – మరణానన్నే వెనక్కు పంపారు

స్టీఫెన్‌ హాకింగ్‌ – మరణానన్నే వెనక్కు పంపారు

జీవితంలో నకారాత్మక స్థితిని (నెగెటివ్‌నెస్‌) భూతద్దంలో నుంచి చూడకుండా పాజిటివ్‌గా ఆలోచించడం; మానవాళికి ఉపయోగపడే విషయాలను, విజ్ఞానాన్ని పంచాలనే బలమైన కోరిక; దిట్టమైన ఆత్మవిశ్వాసాలే హాకింగ్‌ను 76 సంవత్సరాల పాటు జీవించేలా చేశాయి. హాకింగ్‌ తనకు సోకిన వ్యాధితో అవిశ్రాంతంగా పోరాడుతూనే తన పరిశోధనలను కొనసాగించారు. ప్రపంచానికి విలువైన జ్ఞానాన్ని అందించి వెళ్ళారు.

ఆధునిక ప్రపంచంలో భౌతిక శాస్త్రవేత్తలుగా ప్రసిద్ధి చెందినవారు ఇద్దరు మాత్రమే. ఒకరు అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, మరొకరు స్టీఫెన్‌ హాకింగ్‌. న్యూటన్‌ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ సిద్ధాంతానికి ప్రతిగా ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. హాకింగ్‌ మరో అడుగు ముందుకేసి బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. కృష్ణ బిలాలపై ఆయన పరిశోధించి వెల్లడించిన అంశాలు ప్రస్తుత పరిశోధకులకు ప్రామాణికంగా నిలుస్తున్నాయి. దాదాపు 150 పరిశోధనా పత్రాల ద్వారా విశ్వ రహస్యాలను ఆవిష్కరించడానికి ప్రయత్నించిన హాకింగ్‌ తన జీవిత పర్యంతం స్ట్రెచర్‌ (చక్రాల కుర్చీ) కే పరిమితమయ్యారనేది ఆశ్చర్యపరిచే విషయం. హాకింగ్‌ తన స్ట్రెచర్‌కు అమర్చిన కంప్యూటర్‌ ద్వారా తన మనోభావాలను వెల్లడించేవారు. గడిచిన 25 ఏళ్ళుగా ఆయన వివిధ అంశాలపై చేసిన వ్యాఖ్యానాలు పత్రికలకు పతాక శీర్షికలయ్యాయి. కృత్రిమ మేధస్సు మానవాళికి ప్రమాదకరమని, గ్రహాంతర వాసుల వల్ల భూగోళ వాసులకు ముప్పు ఉండవచ్చని, అంతరిక్షంలో కాలనీలు నిర్మించు కొనవలసిన సమయం వస్తుందని, వాతావరణ మార్పులపై తక్షణ నిర్దిష్ట చర్యలు తీసుకోకపోతే సూర్య గ్రహం మాదిరిగానే, భూగోళం కూడా అగ్ని గుండంగా మారే ప్రమాదం ఉందని హాకింగ్‌ హెచ్చ రించారు. మానవాళి భవిష్యత్తును, ఎదురయ్యే సవాళ్ళను, అద్భుతమైన ఆవిష్కరణలను, శాస్త్రీయ మైన సిద్ధాంతాలను మనకు మిగిల్చి హాకింగ్‌ వెళ్లిపోయారు.

ఐన్‌స్టీన్‌ తరువాత అంతటి మేధావి హాకింగ్‌. ఆయన 20వ శతాబ్దంలో భౌతిక శాస్త్రంలో చేసిన అనితర సాధ్యమైన పరిశోధనలు ప్రపంచాన్ని విస్తృతం చేశాయి. తన వ్యక్తిగత వైకల్యాన్ని గురించి బాధపడుతూ కూర్చొనేకన్నా తాను చేయగలిగిన పనులను సమర్థవంతంగా చేయాలనే ప్రగాఢ విశ్వాసం కలిగిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. విధివంచితులు నిరాశ పడకుండా భవిష్యత్తుపై ఆశతో జీవితాన్ని కొనసాగిస్తే, దేనినైనా సాధించవచ్చును. దీనిని నిరూపించారు హాకింగ్‌. దానికి హాకింగ్‌ జీవితమే మంచి ఉదాహరణ. పరిస్థితుల మీదో లేక ఇతరుల మీదో నెపం మోపి తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేవారు హాకింగ్‌ జీవితం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ఏదో ఒకరకమైన అంగవైకల్యంతో బాధపడే వారికి హాకింగ్‌ జీవితమే ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ఐన్‌స్టీన్‌ అంతటి మేధావి కావడానికి హాకింగ్‌కు ఉన్న వైకల్యం అడ్డురాలేదు. అందుకు ఆయనలో ఉన్న పట్టుదల, జీవితంపై చెరగని ఆశ, మమకారం మాత్రమే కారణం. వీటిని ప్రోది చేసుకుంటూ ముందుకు ప్రయాణించినందుకు మానవ ప్రపంచంలో ఆయన మనీషిగా నిలిచారు. కనుకనే నేర్చుకోవాలనుకునేవారికి హాకింగ్‌ జీవితం ఒక ఉద్గ్రంధమని చెప్పవచ్చు. ‘మరణం 57 సంవత్స రాలుగా నా వెంటే ఉంటున్నది. అయినా దానికి నేను ఎన్నడూ భయపడక, నా పరిశోధనలను కొనసాగిస్తున్నాను’ అని చెప్పేవారు హాకింగ్‌. స్టీపెన్‌ హాకింగ్‌ ఆత్మవిశ్వాసానికి మారుపేరై భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలిచారు. శరీరంలోని కండరాలన్నీ పనిచేయక పోయినప్పటికీ విశ్వ రసహ్యసాలను చేధించాలన్న తపన హాకింగ్‌ను ప్రపంచ భౌతిక శాస్త్రవేత్తగా నిలబెట్టింది.

ఏం వ్యాధి

ఎమియోట్రోఫిక్‌ లేటరల్‌ స్కెర్లోసిస్‌ (ఏఎల్‌ఎస్‌) అనే నాడీమండలానికి సంబంధించిన వ్యాధి హాకింగ్‌ను యుక్తవయస్సులోనే చుట్టుముట్టింది. ఈ వ్యాధి వల్ల క్రమంగా ఆయన అవయవాలన్నీ చచ్చుబడిపోతూ వచ్చాయి. అయితే ఆయన కేవలం భౌతిక శాస్త్ర పరిశోధనలకే జన్మించాడని చెప్పే టందుకేమో ఒక్క మెదడు మాత్రమే పనిచేస్తూ ఉండిపోయింది. ఈ వ్యాధి వల్ల హాకింగ్‌ పూర్తిగా చక్రాలకుర్చీకే పరిమితం కావాల్సివచ్చింది. అతని అన్ని పనులు కుర్చీలోనే ఉండి చేసుకోవలసిన పరిస్థితి. ఒక్క మెదడు తప్ప మిగతా ఏ అవయవమూ పనిచేయని పరిస్థితి. నిత్యజీవితంలో ఆయనకు సంబంధించిన అన్ని పనులను ఆయాలే చేసేవాళ్లు. హాకింగ్‌కు తన మనోభావాలను చెప్పటం కోసం భగవంతుడు మరో అవకాశాన్ని కల్పించాడనేందుకు రుజువుగా ఆయన కుడిచేతి చూపుడు వేలు పనిచేసేది. ఆ వేలితో ఆయన కంప్యూటర్‌లో టైప్‌ చేసి తన మనోభావాలను ఇతరులతో పంచుకొనే వారు. ఇటువంటి తీవ్రమైన వ్యాధితో హాకింగ్‌ జీవన పోరాటం భిన్నమైనదని చెప్పవచ్చును. ఆ భిన్నత్వమే హాకింగ్‌ దీర్ఘాయుష్షుకూ కారణం అయి ఉండవచ్చు.

సాధారణంగా ఈ వ్యాధి 55 సంవత్సరాలు దాటిన వారికి వస్తుంది. కానీ హాకింగ్‌కు 21 సంవత్సరాల వయస్సులోనే సోకింది. ఆయనను కదలలేని స్థితికి తెచ్చింది. ఈ వ్యాధికి సోకిన వారు ఎక్కువకాలం జీవించరు. కానీ హాకింగ్‌ దానినీ సాధించారు. ఎక్కువకాలం జీవించారు. వైద్యులు దానికి కొన్ని కారణాలనూ చెప్పారు. 30వ సంవత్సరానికి ముందు ఈ వ్యాధి రావడం వల్ల హాకింగ్‌లోని యువశక్తి దానిని ఆపగలిగింది. అలాగే వ్యాధి వచ్చిందని బాధపడుతూ కూర్చుంటే మెదడు కూడా చేతనత్వం కోల్పోయి ఉండేది. అలా కాక హాకింగ్‌ విజ్ఞానాన్ని పెంచే అంశాల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉండటం వల్ల శరీరంలోని కణాలు ఎప్పటి కప్పుడు చైతన్యమై వ్యాధితో పోరాడగలిగాయి. అందువల్లనే మెదడు ఎప్పుడూ చేతనత్వం కలిగి ఉంది. మెదడు చేతనత్వం పొందడానికి నిరంతరం చేసిన శ్రమ వల్ల అది మరింత పదునుగా, సూక్ష్మ అంశాలను కనుగొనేంత చురుకుగా తయారయింది. అలాగే హాకింగ్‌ వ్యాధి సోకిందనే విషయం కంటే తను తెలుసు కోవాలనుకున్న విజ్ఞాన విషయాల మీద తన మనస్సు లగ్నం చేయటం ఆయన ఆయుష్షు పెరగటానికి కారణమయింది. ముఖ్యంగా ఆయనకున్న ఆత్మస్థైర్యం, వీటితో పాటు సమయానికి తగిన వైద్య చికిత్స, వైద్య పరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండటం కూడ దీర్ఘాష్షుకు కారణ మయింది. హాకింగ్‌ తన వ్యాధి గురించి కుంగిపోయిన సందర్భాలు ఎప్పుడూ లేవు. ఓ సందర్భంలో ఆయన తనకున్న వ్యాధి గురించి చమత్కారంగా ఇలా మాట్లాడారు – ‘బహుశా నాకున్న వ్యాధికి కారణం నా శరీరం విటమిన్లను తప్పుగా జీర్ణించుకోవడమే’. ‘జీవితంలో నకారాత్మక స్థితిని (నెగెటివ్‌నెస్‌) భూతద్దంలో నుంచి చూడకుండా పాజిటివ్‌గా ఆలోచించడం; మానవాళికి ఉపయోగపడే విషయాలను, విజ్ఞానాన్ని పంచాలనే బలమైన కోరిక; దిట్టమైన ఆత్మవిశ్వాసాలే హాకింగ్‌ను ఇంతకాలం బతికించాయి’ అనేది న్యూరాలజిస్టుల అభిప్రాయం.

మరణాన్నే తిప్పి పంపారు

1942 జనవరి 8న ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించిన హాకింగ్‌ తనకు యుక్తవయస్సులో సోకినవ్యాధితో నరకం అనుభవించారు. అది 2009వ సంవత్సరం, ఏప్రిల్‌ 28. దశాబ్దాలుగా వైద్యులు భయపడుతూ వస్తున్న సందర్భం రానే వచ్చింది. క్రుంగి కృశింపచేసే వ్యాధితో ప్రపంచం గర్వించతగిన భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ జరిపిన సుదీర్ఘ పోరాటం ముగింపుకొచ్చింది అనే విషాద వార్తను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం విడుదల చేసింది. హాకింగ్‌ పరిస్థితి ప్రాణాంత కంగా ఉందని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటిం చడం, హాకింగ్‌ పరిశోధ నలు, జీవిత చరిత్రను గురించిన వ్యాసాలను వివిధ పత్రికలు ప్రచురించడం జరిగిపోయాయి. ఇక అంతా అయిపోయిందనే నిర్ధారణకు అందరూ వచ్చారు. అయితే తనకున్న అలవాటు ప్రకారం హాకింగ్‌ మరణాన్ని ‘మళ్లీ రా’ అని చెప్పి వెనక్కు తిప్పి పంపించారు. సరిగ్గా తన 67 ఏళ్ల వయసులో వచ్చిన మృత్యువు ఆయనను తనతో తీసికొని వెళ్లలేకపోయింది. అయితే 2018 మార్చి 14వ తేదీన తన పరిశోధనలకు ముగింపు పలకాలని హాకింగ్‌ భావించారేమో! మరణానికి స్వయంగా లొంగిపోయారు. మరణించేనాటికి ఆయన వయస్సు 76 సంవత్సరాలు. సాధారణంగా ఎఎల్‌ఎస్‌ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిన తరువాత 5 సంవత్సరాలకు మించి బతికినవాళ్లు లేరు. కానీ హాకింగ్‌ ఏకంగా 55 సంవత్సరాలు జీవించారు. వ్యాధితో అవిశ్రాంతంగా పోరాడి తన అధీనంలోకి తెచ్చుకోగలిగారు. తన పరిశోధనలతో ప్రపంచానికి విలువైన జ్ఞానాన్ని అందించి వెళ్ళారు. స్టీఫెన్‌ హ్యాకింగ్‌ మరణంపై ప్రపంచం నలుమూలల నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి. ఆయన మృతి శాస్త్ర ప్రపంచంతో పాటు అనేక ఇతర రంగాల ప్రముఖులనూ దిగ్భ్రాంతిపరచింది.

స్టీఫెన్‌ హాకింగ్‌ దైవకణంమీద పరిశోధన చేశారు. విశ్వంలో ఉన్న అనేక రకాల పరిణామాలకు దైవకణమే కారణం అని చెప్పారు. స్మార్టర్‌ అనే పుస్తకం ముందు మాటలో ఇదే ఉంటుంది. దైవకణం జోలికి ఎప్పుడూ వెళ్ళవద్దని కూడా హాకింగ్‌ హెచ్చరించారు. హాకింగ్‌ ప్రొఫెసర్‌ డెన్నిస్‌ సియమా వద్ద పి.హెచ్‌.డి. చేశారు. ఆయన హాకింగ్‌కు బాగా సహకరించేవారు. ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీ అవార్డు హాకింగ్‌ను వరించింది. ఐన్‌స్టీన్‌ వారసుడిగా ఆయన పేరు ప్రఖ్యాతిగాంచింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా హాకింగ్‌ను ఆహ్వానించింది. విశ్వం ఎలా పుట్టింది? విశ్వంలో జరుగుతున్న మార్పులకు కారకులు ఎవరు? తదితర విషయాలపై హాకింగ్‌ పరిశోధనలు భవిష్యత్తు పరిశోధకులకు మార్గదర్శనం చేస్తాయి. యువతకు రోల్‌మోడల్‌ స్టీఫెన్‌ హాకింగ్‌.

–   డా. జి.వెంకటేశ్వర్రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *