పుట్టుక చేత ముస్లింను ! హిందువుగా జీవిస్తున్నందుకు గర్వపడతాను !

పుట్టుక చేత ముస్లింను !  హిందువుగా జీవిస్తున్నందుకు గర్వపడతాను !

ముంతాజ్‌ అలీఖాన్‌… ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త, రచయిత, చింతనాపరుడు, విద్యావేత్త. ప్రజలు ప్రేమాదరణలతో శ్రీ Mగా పిలుచుకుంటారు. వీరి పూర్వీకులు పఠాన్‌లు, పెషావర్‌లో ఉండేవారు. అప్పటి మహారాజులకు వారే అంగరక్షకులుగా ఉండేవారు. ఆ మహారాజులతోపాటు వీరి కుటుంబం కేరళలోని ట్రావన్‌కోర్‌కి వలస వచ్చింది. ముంతాజ్‌ అలీఖాన్‌ 1948 సంవత్సరంలో జన్మించారు. 19 సంవత్సరాల వయస్సులో ఇంటిలో ఎవరికీ చెప్పకుండా బెలూరు వెళ్లి రామకృష్ణ మఠంలో చేరారు. ఆ తరువాత దేశమంతటా పర్యటించారు. హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా సంచరించారు. ఆ క్రమంలో ‘వ్యాసగురు’ అనేచోట వీరి గురువు ‘బాబీజీ’ దర్శన భాగ్యం కలిగింది. బాబీజీ వీరికి ఆధ్యాత్మిక విషయం బోధించారు. ముంతాజ్‌ తరువాత కృష్ణమూర్తి సంస్థలో చేరారు. అక్కడ ఒక హిందూ యువతిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీ M ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో నివసిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడినవారికి పాఠశాల నిర్వహిస్తూ, మరోవైపు తన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

శ్రీ ఎం రాసిన పుస్తకాలలో ‘ఆత్మకథ’ చాలా ప్రాచుర్యం పొందింది. ఎక్కువ సంఖ్యలో ప్రతులు అమ్ముడుపోయాయి. శ్రీ M కి హిందూ సంస్కృతిపై ఎనలేని గౌరవం. హిందూ సంస్కృతిని ‘తాలిబనైజ్‌’ చేయలేమని అంటారాయన. శాంతి , సమరసతల కోసం శ్రీ M 2015లో “Apprenticed to Himalayam Master” అనే నినాదంతో పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలో 11 రాష్ట్రాలు, 7,500 కిలోమీటర్లు,16 నెలల లో చుట్టి వచ్చారు. తిరువనంతపురంలో ‘ఆర్గనైజర్‌’ విలేకరులతో జరిపిన ముఖాముఖిలోని ముఖ్య విషయాలు జాగృతి పాఠకుల కోసం.

”భారతీయ ముస్లింలు తమను తాము హిందూ ముస్లింగా చెప్పుకోవడానికి ఇష్టపడరు. నేను పురాతన సంస్కృతికి చెందినవాడను. నా సంస్కృతి పట్ల నేను గర్వపడతాను. సాంస్కృతికపరంగా చూసినపుడు భారతదేశములో నివసిస్తున్న ముస్లింలందరు ఇస్లాంను అనుసరిస్తున్నప్పటికీ వీరంతా హిందువులే.”

మీరు ముస్లింకుటుంబంలో జన్మించారు. సనాతన ధర్మానికి చెందిన ఎందరో సాధువులను కలుసు కున్నారు. మీ జీవన విధానంలో మార్పు వచ్చింది. ఛాందసవాదులైన ముస్లింల నుండి మీకు ఏవైనా అవరోధాలు ఎదురయ్యాయా?

మీరన్నది నిజమే. ఇప్పటికీ నాకు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. జీవితం చాలా చిన్నది కదా, మీరు మీ జీవితంలో ‘ఇస్లాం’ను బోధించకుండా ‘హిందుత్వం’ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అని. ప్రస్తుతం ఇస్లాం నిర్వచనం మారిపోయింది. అతివాదమనేది ఆధ్యాత్మికతకు కాని, మానవ సంక్షేమానికి దేనికీ మంచిది కాదు. నేను నా ఈ భౌతికశరీరం గురించి ఆలోచించను. ఇదెపుడైనా పోయేదే. అందుకే నాకేమి భయంలేదు.

భారతదేశంలో మతాల మధ్య సహిష్ణుత లోపించి వైషమ్యాలు తలెత్తుతుంటాయి. దీనికి నివారణ ఏమిటంటారు?

నా ఉద్దేశంలో భారతదేశంలో మతానికి తప్పుడు నిర్వచనాలు ఇస్తుంటారు. ఎందుకంటే మతమంటే ఏమిటో వారికి తెలియదు. ప్రజలకు నా విజ్ఞప్తి. మీరు సంస్కృతం నేర్చుకోండి. ముఖ్యంగా బాల్యా వస్థలో ఉన్నవారు నేర్చుకోవాలి. సంస్కృతం అందమైన ప్రాచీన భాష. ప్రజలు మతం అంటే పైపైన కాకుండా దాని గురించి లోతుగా అధ్యాయనంచేయాలి. అపుడు వైషమ్యాలు ఉండవు.

ఇస్లాం, క్రైస్తవం వందల సంవత్సరాలు హిందూ దేశంలో ఉన్నప్పటికీ, మిగిలిన విశ్వాసాల వారి లాగా ఆ రెండు మతాల వారు హైందవ సంస్కృతిలో మమేకం కాలేకపోయారు. ఎందుకు?

మీరు బలవంతంగా ఎవరినీ కలుపుకోలేరు. అది సాధ్యం కాదు. ఏదైనా ఒక మతం అంటే ఒకే ప్రవక్త, ఒకే పవిత్ర గ్రంథం అని ఎలా నిర్వచిస్తున్నామో అలాంటి వాటికి కొన్ని అవధులు ఉంటాయి. కొన్ని షరతులు ఉంటాయి. అయితే వాటిలోనూ కొన్ని మంచి విషయాలు ఉంటాయి. ముఖ్యంగా క్రమ శిక్షణ. నేనొక మఠంలో నివసిస్తున్నపుడు కొద్ది దూరంలో ఉన్న మసీదులో నమాజుకు పిలుపు లౌడ్‌స్పీకర్‌లో వినవస్తున్నది. మఠంలోని కొందరు స్వాములు తమ గురువుతో ముస్లింల ప్రార్థనవలవల్ల ఏకాగ్రతకు అంతరాయం కలుగుతున్నదని ఫిర్యాదు చేశారు. అపుడు ఆ గురువు వారితో, వారిని వారి ప్రార్థన చేసుకోనివ్వండి. మీరు అటు దృష్టిపెట్టకుండా మీ ప్రార్థన మీద దృష్టి ఉంచండి అని అన్నారు. గాంధీజీ కూడా మతాలన్నీ ఒకటే అన్నారు, ఋగ్వేదంలో చెప్పినట్లుగా ‘ఏకం సత్‌ విప్రా బహుదా వదంతి’. సత్యమొక్కటే దానిని పలు రకాలుగా చెబుతుంటారు. అన్ని మతాల లక్ష్యం ఒక్కటే- నీవు మరొకరి మతాన్ని గౌరవించు. అంతేగాని అతడి మతంలో జోక్యం చేసుకోకు.

వైదిక మతం గొప్పతనమేంటి?

వైదిక మతం ముఖ్యమైన లక్షణం, గొప్పదనం ఏమిటంటే ఇది ‘పిడివాదం’ చేసే మతం కాదు. ఇందులో ఇవి చేయాలి, ఇవి చేయకూడదు అని లేవు. ఇది నియమాలలో బందీ కాలేదు. తెలుసుకో వాలన్నదానికి ఇందులో ప్రాముఖ్యం ఉంది. వేల సంవత్సరాల క్రితం నుండే ఈ పద్ధతి ఉంది. ఈ సంస్కృతిని చూస్తుంటే నిజంగా ఇది మనిషి నిర్మించినదేనా అని అనిపిస్తుంది. ఆ రోజుల్లో మనుషులతో పాటు మరెవరైనా ఉన్నరేమో! వారివల్లే దివ్యమైన జ్ఞానం మనకు అంది ఉండవచ్చు.రుషులు ఉన్నప్పటికీ వారికి కూడా ఒక స్థితి తర్వాత మరెవరైనా సహకరించి ఉండవచ్చు.

స్రామాన్యంగా హిందువులు అన్య మతాల వారి ప్రయాణం గమ్యం, తమ ప్రయాణం గమ్యం ఒకటేనని ఒప్పుకుంటారు. దురదృష్టమేమంటే ఈ విషయాన్ని క్రైస్తవులు, ముస్లింలు అంగీకరించరు. ఎందుకు?

హిందూ సంస్కృతి, ఒక మహాసముద్రం లాంటిది. ఇందులో ఎందరో రుషులు, సాధువులు ఉన్నారు. ‘సత్యం’ అనేది ఒక తెగకు చెందినదికాదు. కాబట్టి వేరే వారిని Convert చేయాలనే ఆలోచనే రాదు. ప్రపంచ దేశాలలో యూదులను హతమారుస్తు న్నపుడు కేవలం భారతదేశం ఒక్కటే ‘శరణు’ ఇచ్చింది. మరోవైపు యూదు మతానికి చెందినవారు వారిదొక్కటె నిజమైన మతం అని అంటూ రాజకీయాలతో సంబంధం పెట్టుకున్నారు.

సనాతన ధర్మానికి చెందిన ఈ దేశం నేడు అంతర్గతంగా, బాహ్యంగా పలు బెడదలను ఎదుర్కొంటోంది. వీటి నుండి ఎలా బయటపడాలి?

రాజకీయాలలో మంచి వ్యక్తుల ప్రవేశించాలి. ఈ రాజకీయ నాయకులకి మన సంస్కృతిని బోధించాలి. ఉదాహరణకు వర్ణాశ్రమ ధర్మం అనేది ఒక గొప్ప ఆచరణ. కాని దానిని నేడు భ్రష్టు పట్టించారు. పురాతన సంస్కృతిలో విలసిల్లినంత కాలం ఈ దేశాన్ని ఎవరూ నాశనం చేయలేరు. ఇది ప్రపంచానికే ఆధ్యాత్మిక గురువు కాబట్టి తన స్థానాన్ని కోల్పోరాదు. నేను ఆశావాదిని. ఈ భూమికి గొప్ప భవిష్యత్తు ఉంది. పురాతన కాలంలో వచ్చినట్లుగా విదేశాల నుండి ప్రజలు వచ్చి అన్ని నేర్చుకుని వెళ్తారు. స్వామి వివేకానంద కూడా చెప్పారు. భారతదేశం ప్రపంచానికే గురువు అని.

ప్రపంచ వ్యాప్తంగా హిందుత్వాన్ని ఆమోదిస్తున్నారు. కాని భారతదేశంలో మాతృదేశంలోనే హిందువులు అపాయంలో ఉన్నారు. ఎందువలన?

సనాతన ధర్మం పలు సవాళ్లను ఎదుర్కొంటు న్నది. ఇపుడు మీరు చూస్తున్న బెడదలు, బెదిరింపులు అన్నీ రాజకీయ పార్టీల స్వార్థపర రాజకీయాలే. నేను ఒకసారి ఔరంగజేబు సోదరుడు దారాషికో గురించి నిర్వహించిన సమావేశంలో పాల్గొనడానికి కశ్మీర్‌ వెళ్లాను. దారాషికో ముస్లిం అవిశ్వాసి అని ఔరంగజేబు చంపించాడు. దారాషికోకు ఒక కశ్మీరీ గురువు ఉన్నాడు. దారా ఒక గొప్ప తాత్త్వికవేత్త. ఉపనిషత్తులను పర్షియన్‌ భాషలోకి మొదటిసారి అనువదించిన విద్యావేత్త. పాశ్చాత్య తత్త్వవేత్తలు ఇలాంటి అనువాదాలు చదివి భారతీయ తత్త్వ చింతన గురించి తెలుసుకున్నారు. నా ఊహలో ఏనాటికైనా కశ్మీరీ పండితులు వారి స్వస్థలానికి తిరిగి వస్తారని నమ్మకం ఉంది. హిందువులను రక్షించ డానికి గురుగోవింద్‌ సింహ్‌ ‘సిఖ్‌’ సంప్రదాయాన్ని స్థాపించాడు. ఎవరైనా మీ ఇంట తలుపులు బద్దలు కొట్టి మీ కూతురిని ఎత్తుకెళితే దీనికి ప్రతిస్పం దించాలి.

ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో మీరు ఒక పాఠశాల నడుపుతున్నారు. ప్రస్తుతమున్న విద్యావిధానంలో ఎలాంటి మార్పులు అవసరమంటారు?

అన్ని స్థాయిలలో సంభాషణల ప్రక్రియను ప్రోత్సహించాలి. ఇక బోధనలో పాశ్చాత్య శాస్త్రీయ విధానాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే మన గొప్ప సంస్కృతి గురించి తెలియజేయాలి. భగవద్గీత, శాస్త్రీయ నృత్యాలు, సంగీతం, సంస్కృతం, జ్యోతిష శాస్త్రం, మొదలైనవి బాల్యం నుండే నేర్పాలి. ఇది మతతత్త్వం కాదు. మా పాఠశాలలో యోగ, ధ్యానం ప్రవేశపెట్టాం. ప్రతి సంవత్సరం విద్యార్థులు స్వయంగా సంస్కృత భాషలో ఒక నాటకాన్ని రాసి ప్రదర్శన ఇస్తారు.

మతమార్పిడిపై మీ అభిప్రాయం

మతమార్పిడి ఎలాంటిదైనా అది బలత్కారం క్రిందకే వస్తుంది. అది వ్యక్తి స్వేచ్ఛను హతమారు స్తుంది. నిజంగానే ఎవరైనా వ్యక్తి తన మతం మారదలచుకుంటే అతడికి కావలసిన మతాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. హిందూ జీవన విధానం మతం మార్చుకునే వ్యవస్థ కాదు. అది వ్యక్తి తాను ఎంచుకున్న మార్గాన్ని అవలంబించే స్వేచ్ఛను ఇచ్చింది.

మీరు మిమ్ములను హిందువుగా భావిస్తున్నారా?

నేను హిందువుగా ఉన్నందుకు గర్వపడతాను. ఒక గొప్ప దేశం, గొప్ప సంస్కృతికి చెందిన వ్యక్తిగా గర్వపడతాను. నేనొక హిందువును. భారతదేశం నుండి హజ్‌యాత్రకు వెళ్లిన ముస్లింలను అరబిక్‌ భాషలో హిందూ ముస్లింలని అంటారు. ‘హిందూ’ అనగా ఇండియా. ఆశ్చర్యకరమైన విషయమేమంటే భారతీయ ముస్లింలను హిందూ ముస్లింలనగానే అప్‌సెట్‌ అవుతారు. నేను ఈ దేశ పుసనాతన సంప్రదాయానికి చెందినవాడను. అందుకు నాకు గర్వంగాఉంది. ఈ దేశంలో ఉన్న ముస్లింలందరు ఈ దృష్టితో సాంస్కృతిక పరంగా హిందువులే. ఇస్లాంను అనుసరిస్తున్నా, వారు హిందువులే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *