ఆధ్యాత్మికతను, ఆరోగ్యాన్ని ప్రసాదించే శ్రావణమాసం

ఆధ్యాత్మికతను, ఆరోగ్యాన్ని ప్రసాదించే శ్రావణమాసం

వేసవి ముగిసిన తరువాత వచ్చే మొదటి పవిత్ర మాసం శ్రావణమాసం. ఈ ఆగస్టు 12న ప్రారంభమయ్యే శ్రావణమాసం వచ్చే నెల 9తో ముగుస్తుంది. ప్రారంభ, ముగింపు దినాలు రెండూ ఆదివారాలే కావడం గమనార్హం. ఈ పవిత్ర మాసంలో ప్రతి ఇంటిలోనూ పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇంటిలోని మహిళలు ప్రతిరోజూ తలంటు స్నానాలు చేస్తూ, నూతన వస్త్రాలు ధరించి, దైవపూజలు చేస్తూ, దేవాలయాలు సందర్శిస్తూ, దేవునికి ధూప, దీప నైవేద్యాలు సమర్పిస్తూ నిత్యం ఉత్సాహంగా ఉంటారు.

శ్రావణమాసం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావం చూపే మాసము.

ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు ఉన్నాయి. హిందూధర్మంలో చాంద్రమానం ప్రకారం వస్తున్న పన్నెండు మాసాల్లో ఐదవది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. శ్రావణమాసంతో వర్ష ఋతువు ప్రారంభమవు తుంది. మహావిష్ణువుకు ఆయన భార్య మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసం. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్క ష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ పూజలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి.

శ్రావణ మాసంలో ప్రత్యేకమైనవి శుక్రవారాలు, మంగళవారాలు. మహిళలు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి అమ్మవారిని పూజిస్తారు. ఈ మాసంలో రెండో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం వల్ల లక్ష్మీదేవి కపాకటాక్షాలు లభించి సకల సిరిసంపదలు, సుఖసంతోషాలు కలుగుతాయి.

ఈ మాసంలో వచ్చే పండుగలు లేదా వ్రతాలలో ముఖ్యమైనవి వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతం. ఇవి కేవలం మహిళలకు మాత్రమే పరిమితమైనవి కాగా సమాజంలోని స్త్రీ, పురుషులందరూ పాల్గొనే పండుగ, అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ రాఖీ పూర్ణిమ లేదా రక్షాబంధన్‌.

వరలక్ష్మీ వ్రతం

శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణమాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకం పఠించాలి. ‘బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివద్ధించ దేహిమే రమే’ అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మాంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి.

మంగళ గౌరీ వ్రతం

ఈ మాసంలో వచ్చే మరో వ్రతం మంగళగౌరీ వ్రతం. దీనిని ఈ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లోనూ చేయాలి. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన మహిళలు ఆచరిస్తే వారికి ఎంతో శుభం జరుగుతుందని పండితులు అంటారు. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. వ్రతం రోజున మహిళలు ఉదయమే మంగళస్నానం చేసి కొత్తబట్టలు ధరించి, పూజ గదిలో మండపం కట్టి దాని మధ్యలో ముగ్గులతో తీర్చిదిద్దుతారు. కొబ్బరికాయకు లక్ష్మీరూపం అలంకరించి కలశస్థాపన చేస్తారు. మంగళగౌరిని ఆవాహనం చేసి పూజిస్తారు. పూజానంతరం పసుపు పూసిన తోరణం చేతికి కట్టుకుని, సాయంకాలం హారతి ఎత్తి పేరంటం చేస్తారు. మంగళగౌరి కథ చదువుతారు. ఫలాలు, కుడుములు సిద్ధం చేస్తారు.

ఈ మాసంలోని అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఇలా వరుసగా ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి.

నాగ పంచమి

శ్రావణమాసంలో వచ్చే షష్ఠితో కూడిన పంచమిని నాగపంచమి అని వ్యవహరిస్తారు. ఆనాడు నాగపూజను ఆచరించాలని, అలా ఆచరించిన వారికి పాము భయం తొలగుతుందని పండితులు చెపుతారు. శ్రావణ పంచమిని గరుడ పంచమిగా కూడా వ్యవహరిస్తారు. ఆనాడు గరుత్మం తుండిని, అధిరో హించిన శ్రీమ హావిష్ణువును కూడా ఆరాధిస్తారు. కొన్ని ప్రాంతాలలో శ్రావణ శుద్ధ చతుర్థిని నాగచతుర్థిగా ఆచరిస్తారు.

రాఖీ పౌర్ణమి

శ్రావణమాస పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపు కుంటారు. ఈ రోజు సోదర, సోదరీ బంధానికి సూచికగా అక్కాచెల్లెళ్ళు తమ అన్నా తమ్ముళ్ళకు రక్షా కంకణం (రాఖీ) కట్టి తమ అను బంధాన్ని తెలియ చేస్తారు. జీవితాంతం తమకు తోడుగా, రక్షగా ఉండమని చెపుతారు. ఈ పండుగలో పాల్గొనడం కోసం పట్ట ణాలలో ఉండేవారంతా తమ సోదరీ సోదరులుండే తమ సొంత ఊళ్ళకు ప్రయాణ మవుతారు. తద్వారా రవాణా రంగానికీ పండుగే అని చెప్పవచ్చు.

పైన చెప్పుకున్న ముఖ్యమైన వ్రతాలూ, పండుగలే కాక కష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణమాసంలోనే. కష్ణాష్టమి, పోలాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి (మొదటి ఏకాదశి) నాడు ఉపవాసం ఉండి మహావిష్ణునువును పూజించి నట్లయితే మోక్షం లభిస్తుంది అంటారు పండితులు.

అనారోగ్యానికి చెక్‌

ఎండలు పోయి వర్షాలు ప్రారంభమయ్యేది శ్రావణమాసంతోనే. వర్షాలు ప్రారంభమైనప్పుడు అన్ని ప్రదేశాలు తడిగా (తేమతో) ఉంటాయి. తేమ ఉన్న చోట రోగ కారక క్రిములు చేరతాయి. వీటి వలన సమాజంలో అనేక రోగాలు బయలుదేరతాయి. ఈ రోగాల నుండి సమాజాన్ని రక్షించాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. అంటే ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండటం, ఉతికిన దుస్తులను ధరించడం, పసుపు రాసుకోవడం, ధూపం వేయడం మొదలైన రోగ నిరోధక పద్ధతులను పాటించాలి. పూజ చేయవలసిన రోజున తెల్లవారుఝామునే నిద్ర లేచి, ఇల్లు శుభ్రం చేసి, తలంటు స్నానం చేసి, కొత్త బట్టలు కానీ, ఉతికిన బట్టలు గానీ ధరించి పూజ చేస్తారు. పూజ చేసినప్పుడు మహిళలు ముఖానికి, పాదాలకు పసుపు, గంధం రాసుకుని, ధూపం వేస్తారు. వీటన్నిటి వల్ల క్రిములు పోయి, ఇల్లు శుభ్రపడి, ఆరోగ్య వాతావరణం నిండుతుంది. పసుపు వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి వస్తుంది.

పూజలు, వ్రతాలూ చేసే రోజుల్లో మాంసాహారం (మాంసం, గుడ్లు, చేపలు మొదలైనవి) తినకూడదని కూడా పెద్దలు చెపుతారు. ఎందుకంటే మాంసం జీర్ణం కావాలంటే వాతావరణం సహజంగా వేడిగా ఉండాలి. వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి త్వరగా జీర్ణం కాదు. జీర్ణం కాకపోతే లోపలే కుళ్లిపోయి వివిధ రకాల రోగాలు బయలుదేరతాయి. ఈ రోగాల నుండి మనలను రక్షించాలనే ఉద్దేశ్యంతోనే ఈ మాసంలో మాంసం తినకుండా ఉంటే పుణ్యం వస్తుందని చెప్పి మన పెద్దలు ఈ సంప్రదాయం పెట్టారు. అంతేకాక ఈ పద్ధతి వలన జంతుజాలానికి రక్షణ లభించి, పర్యావరణానికి మేలు జరుగుతుంది.

కాబట్టి శ్రావణమాసంలో మనం ఆచరించే వ్రతాలు, నోములు వంటి రకరకాల పూజల వలన మన మనస్సుకి ఆధ్యాత్మిక శక్తితో పాటు శరీరానికి ఆరోగ్యం కూడా చేకూరుతుంది.

– జాగృతి డెస్క్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *