సౌదీ యువరాజు పర్యటన ఒకపక్క మోదం – మరోపక్క ఖేదం

సౌదీ యువరాజు పర్యటన  ఒకపక్క మోదం – మరోపక్క ఖేదం

ఉగ్రవాద దాడి నేపధ్యంలో సౌదీ అరేబియాతో పాటు జారీ చేసిన సంయుక్త ప్రకటనలో పాకిస్తాన్‌ పేరు చేర్చలేకపోయారంటూ విమర్శకులు మోదీని నిలదీయవచ్చు. అయితే ప్రధాని చూపిన దౌత్యపరమైన చతురత వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. కానీ పాకిస్తాన్‌కు ఆర్ధిక సహాయం అందించబోమని హామీ ఇవ్వడంలో సౌదీ యువరాజు విఫలమయ్యారని చెప్పక తప్పదు.

పుల్వామా ఉగ్రదాడి తరువాత మన దేశ పర్యటనకు వచ్చిన సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఏం చెపుతారోనని రాజకీయ పరిశీలకులు, వ్యూహ నిపుణులు ఆసక్తిగా ఎదురు చూశారు. సౌదీ అరేబియాలోని ఇస్తాంబుల్‌లో జరిగిన అమెరికా జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గి హత్య తరువాత మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు చాలా చెడ్డ పేరు వచ్చింది. అమెరికా తప్ప యూరోపియన్‌ దేశాలన్నీ సౌదీతో సంబంధాలను కాస్త తగ్గించు కున్నాయి. ఇలాంటి సంఘటనల మధ్య ప్రధాని మోదీ అర్జెంటైనాలో జరిగిన జి-20 సమావేశాల సందర్భంగా సౌదీ యువరాజుతో సమావేశమయ్యారు. తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్‌తో సమావేశం కావడమేమిటని పత్రికలు, ఉద్యమకారులు విమర్శించారు. పశ్చిమాసియా దేశాలతో సంబంధాలను మెరుగుపరచడం పైనే దష్టి పెట్టిన ప్రధాని మోదీ ఈ విమర్శలను పట్టించుకోలేదు. అంతేకాదు భారత్‌లో పర్యటించవలసిందిగా సౌదీ యువరాజును ఆహ్వానించారు.

1979 తరువాత పశ్చిమాసియా దేశాలతో భారత్‌ సంబంధాలు క్షీణించాయి. అయితే గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా అబ్దుల్లా రాజు హాజరుకావడం, ‘ఢిల్లీ ఒప్పందం’పై సంతకాలు చేయడంతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయి. ఆ తరువాత 2010లో సౌదీలో పర్యటించిన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ‘రియాద్‌ ఒప్పందం’ కుదుర్చుకుని సంబంధాలను మరింత సుదఢం చేశారు. అలాగే 2016లో ప్రధాని మోదీ పర్యటన కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలను ఉన్నత స్థాయికి చేర్చింది. భారత-సౌదీ సంబంధాలు సాంస్క తిక, నాగరిక, చారిత్రక అంశాలపై ఆధారపడి ఏర్పడితే, పాక్‌-సౌదీ సంబంధాలకు మతం మాత్రమే ఆధారం. ఇస్లామిక్‌ సహకార సంస్థ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోపరేషన్‌ – ూIజ)లో సభ్యులైన ముస్లిం దేశాలన్నీ కాశ్మీర్‌ విషయంలో ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌కే మద్దతుగా నిలిచాయి. అలాగే సౌదీ అరేబియా కూడా భారీగా నిధులు అందజేసి పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ఆర్ధిక ఆంక్షల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది.

అయితే కాలక్రమేణా సౌదీ, పాక్‌ సంబంధాలు క్షీణించాయి. ఇరాన్‌తో సంబంధాల కోసం పాక్‌ ప్రయత్నాలు, యెమన్‌లో ఇరాన్‌ మద్దతు ఇస్తున్న హైతీ తిరుగుబాటుదారులను అణచివేయడానికి ప్రయత్నిస్తున్న సౌదీకి సహాయంగా సేనలను పంపడానికి పాక్‌ నిరాకరించడం వంటివి సౌదీతో పాక్‌ సంబంధాలను మరింత దెబ్బతీశాయి. ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయింది. అమెరికా కూడా ఆర్ధిక సహాయాన్ని పూర్తిగా నిలిపివేసింది. ఒక పక్క ఉగ్రవాదం, మరోపక్క ఖాళీ ఖజానాతో పాకిస్తాన్‌ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది.

మరోవైపు అమెరికా జర్నలిస్ట్‌ హత్య పట్ల పశ్చిమ దేశాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న సౌదీ అరేబియాకు రాచకుటుంబంలో కలహాలు, ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలు తలనొప్పిగా మారాయి. ఇరాన్‌ మిస్సైల్‌ తయారీపై దష్టి సారించడంతో ఇరుకున పడ్డ సౌదీ అరేబియా విరుగుడు వేయాలని చూస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని సౌదీకి అందించడానికి అంగీకరించారని సౌదీ రేడియో ప్రకటించింది. అణు పరిజ్ఞానం ఉన్న పాక్‌ సౌదీ అరేబియాను ఆకర్షించింది. తగిన సమయంలో సౌదీ ఆర్ధిక సహాయం అందించడంతో తమ దళాలు యెమన్‌లో ఇస్లామిక్‌ సంకీర్ణ దళాలతోపాటు కలిసి పోరాడటానికి పాకిస్తాన్‌ అనుమతిచ్చింది. ఇలా ఆర్ధిక సహాయం, అణు సహకారం, రక్షణ ఒప్పందాలు, గ్వాదర్‌ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం, పిడివాద ఇస్లాం వ్యాప్తి చేయడానికి సంప్రదాయ ముల్లాలు, మౌల్వీలను పంపడం వంటివి సౌదీ అరేబియా, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలను బలపరచాయి.

పాశ్చాత్య దేశాల ఆగ్రహాన్ని, అసంతప్తిని ఎదుర్కొంటున్న సౌదీ యువరాజు ఆసియా దేశాల పర్యటనకు బయలుదేరారు. వరుసగా పాకిస్తాన్‌, భారత్‌, చైనా, దక్షిణ కొరియాలలో పర్యటిస్తున్నారు. మొదట మలేషియా, ఇండోనేషియా కూడా వెళతారని అనుకున్నారు. అనుకోని కారణాలవల్ల ఆ పర్యటన రద్దయింది. సల్మాన్‌ పర్యటన ప్రారంభం కావడానికి ముందే పాకిస్తాన్‌ మద్దతు కలిగిన జైష్‌ ఏ మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిపిన దాడిలో భారతీయ భద్రతాదళానికి చెందిన 40 మంది చనిపోయారు. ఈ దాడితో ఉపఖండంలో ఉద్రిక్తతలు పెరగడమే కాక భారత, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాడిపట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన భారత్‌ దౌత్యపరంగా పాకిస్తాన్‌ను ఏకాకిని చేయడానికి నిశ్చయించుకుంది. సౌదీ యువరాజు సల్మాన్‌కు ఘనస్వాగతం పలికిన పాకిస్తాన్‌ బంగారు తాపడం చేసిన తుపాకిని బహూకరించింది. ఆయన పర్యటన జరుగుతున్న రోజుని సెలవు దినంగా కూడా ప్రకటించింది. అలాగే అత్యున్నత పౌర పురస్కారం నిశాన్‌ ఏ పాకిస్తాన్‌ను సౌదీ యువరాజుకు అందించింది.

ఇస్లామాబాద్‌ చేరుకున్న సల్మాన్‌ ఉద్రిక్తతలు తగ్గించాలని ప్రయత్నం చేశారు. పాకిస్తాన్‌ ప్రభుత్వంతో కలిసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ‘ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో కలిసి పనిచేస్తాం. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రెండు దేశాలు చేసిన త్యాగాలు అందరికీ తెలుసు. ఈ కార్యంలో అమరులైనవారికి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి అంతర్జాతీయ సమాజంతో కూడా కలిసి పనిచేస్తాము. ఐక్యరాజ్య సమితి నిషేధం అనే బూచిని చూపడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలనే ప్రయత్నాలు మానుకోవాలి’ అంటూ పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటన పాకిస్తాన్‌ పట్ల భారత్‌ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోని విధంగా ఉంది.

పాకిస్తాన్‌ అందించిన ఘనస్వాగతం, ఆతిథ్యం చూసి సౌదీ యువరాజు ముగ్ధుడైపోయి ఉగ్రవాదంపై పాకిస్తాన్‌ చేస్తున్న పోరు ప్రశంసించదగినదని కితాబు ఇచ్చేశారు. అంతేకాదు కర్తార్పూర్‌ నడవా తెరవడం ద్వారా పాకిస్తాన్‌ ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు ఎంతో ప్రయత్నిస్తోందని మెచ్చుకున్నారు. ఇలా సౌదీ యువరాజు భారత్‌కు అసంతప్తిని కలిగించారు.

కానీ ఇటీవలి కాలంలో ఆధునిక, సహనశీల దేశంగా పేరు సంపాదించడానికి సౌదీ అరేబియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే పాకిస్తాన్‌ పర్యటనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపించ కూడదనే ఉద్దేశ్యంతో సౌదీ యువరాజు పాకిస్తాన్‌ నుంచి నేరుగా తమ దేశం వెళ్లి అక్కడ నుంచి మళ్లీ ఢిల్లీ చేరుకున్నారు. ఇలా ఇస్లామాబాద్‌ నుంచి రియాద్‌ వెళ్లి ఆ తరువాత ఢిల్లీ రావాలన్న తమ సూచనను మన్నించినందుకు ప్రధాని మోదీ ప్రోటో కాల్‌ను పక్కన పెట్టి సౌదీ యువరాజుకు ఆహ్వానం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లారు. సౌదీ రాజును ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.

2015లో యెమెన్‌లో చిక్కుకుపోయిన 4వేల మంది భారతీయులను అక్కడ నుంచి తరలించేం దుకు సహకరిస్తామని సౌదీ రాజు సల్మాన్‌ ప్రకటించ డంతో భారత్‌, సౌదీల మధ్య వ్యూహాత్మక సంబంధా లకు దారి ఏర్పడింది. జెడ్డాలోని అమెరికా కాన్సులేట్‌ ముందు జరిగిన ఆత్మాహుతిదాడిలో పాకిస్తాన్‌ జాతీయుడు పాల్గొన్నాడని తెలిసినప్పటి నుంచి సౌదీ ప్రభుత్వం పాకిస్తాన్‌ పౌరులపై గట్టి నిఘా ఉంచింది. భద్రతా కారణాల పేరు చెప్పి 2015లో సౌదీ ప్రభుత్వం 40 వేలమంది పాకిస్థానీయుల్ని బయటకు పంపేసింది. ఇలాంటి ఉగ్రవాద వ్యతిరేక చర్యలు సౌదీపట్ల నమ్మకాన్ని కలిగించాయి.

సౌదీ అరేబియాలో ఉన్న 3.2 మిలియన్‌ మంది భారతీయులు ప్రతి ఏటా స్వదేశానికి 10 బిలియన్‌ డాలర్ల సొమ్ము పంపుతున్నారు. అలాగే తమ రెండు పవిత్ర స్థలాలు సౌదీలోనే ఉండడం వల్ల ముస్లింలకు కూడా ఆ దేశం గమ్యం అయింది. గల్ఫ్‌ కోపరేషన్‌ కౌన్సిల్‌ వంటి సంస్థలలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తోంది. మధ్య ప్రాచ్యానికి ఉద్యోగరీత్యా వెళ్లే భారతీయుల సంక్షేమాన్ని ఈ సంస్థలు చూస్తాయి. అలాగే ఒపెక్‌, ఓఐసి సంస్థల వ్యవస్థాపక సభ్యత్వం కలిగిన సౌదీ అరేబియాకు ప్రపంచవ్యాప్తంగా మంచి పలుకుబడి ఉంది. జి-20 సందర్భంగా సౌదీ యువరాజు, భారత ప్రధాని మోదీల మధ్య సమావేశా నంతరం చమురు ఉత్పత్తిని తగ్గించాలన్న నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు సౌదీ చమురుశాఖ మంత్రి ఖాలిద్‌ అల్‌ ఫలిహ్‌ ఒపెక్‌ సమావేశంలో ప్రకటిం చారు. దీనివల్ల ముడి చమురు ధరలు స్థిరపడ్డాయి. ప్రస్తుతం భారత్‌ ప్రతిరోజు 8లక్షల బ్యారల్‌ల ముడి చమురు సౌదీ నుంచి దిగుమతి చేసుకుంటోంది. 2024 నాటికి ఇది 8.2 మిలియన్‌ బ్యారల్‌లకు చేరుకుంటుంది. దేశ ప్రగతి కుంటుపడకుండా ఉండాలంటే నిరంతరమైన చమురు సరఫరా చాలా అవసరం. ఆ దష్ట్యా సౌదీ అరేబియా సహకారం చాలా కీలకమైనది. ఆధునిక ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ అన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. నూతన రాజ్యవిధానం ద్వారా సౌదీ అరేబియా అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్‌లకు దగ్గరయింది. వ్యూహాత్మకంగా కీలకమైన మధ్య ప్రాచ్య భౌగోళిక రాజకీయాలలో ప్రధానమైన పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ ఘర్షణలతో సంబంధం లేకుండా మధ్య ప్రాచ్యంలోని మూడు ప్రధాన దేశాలైన సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌, ఇరాన్‌లతో సత్సంబంధాలను ఏర్పరచుకోవడంలో ప్రధాని మోదీ చక్కని విదేశాంగ విధానాన్ని అవలంబించారు.

ఘనస్వాగతం అందుకున్న తరువాత సౌదీ యువరాజు ప్రధాని మోడీని తన ‘పెద్దన్న’గా అభివర్ణించారు. ‘భారత్‌, సౌదీల మధ్య సంబంధాలు మా డిఎన్‌ఏలో ఉన్నాయి’ అని పేర్కొన్నారు. ఆ తరువాత ఇరు నేతలు ప్రతినిధి స్థాయి సంభాషణల్లో పాల్గొని వ్యూహాత్మక భాగస్వామ్య కౌన్సిల్‌ ఏర్పాటు చేయడం ద్వారా ‘వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ మరింత బలోపేతం చేసుకోవాలని అంగీకరించారు. మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటకం, ప్రసార సాధనాలు, గహనిర్మాణం మొదలైన రంగాలకు సంబంధించి 5 ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. అంతర్జాతీయ సౌరశక్తి కూటమి (ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌)లో సౌదీ సభ్యత్వాన్ని స్వీకరించింది. ప్రభుత్వాల మధ్య ఒప్పందాలేకాక సౌదీ అరేబియా సాధారణ పెట్టు బడుల సంస్థ 28 మిలియన్‌ డాలర్ల విలువైన 11 ఒప్పందాలను కుదుర్చుకుంది. శక్తి, చమురుశుద్ధి, పెట్రో కెమికల్స్‌, వ్యవసాయం, ఖనిజతవ్వకం, విద్యా, ఆరోగ్యం వంటి రంగాల్లో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సౌదీ యువరాజు సల్మాన్‌ ప్రకటించారు. చమురు సరఫరాలో ఎలాంటి లోటు ఏర్పడినా వెంటనే దానిని భర్తీ చేయడానికి సౌదీ అరేబియా సిద్ధంగా ఉంటుందని సల్మాన్‌ హామీ ఇచ్చారు. అలాగే భారత్‌ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల విషయంలో కూడా పాలుపంచుకుంటామని తెలిపారు. సంయుక్తంగా నౌకాదళ విన్యాసాలను నిర్వహించడమేకాక ఇతర రంగాల్లో కూడా కలిసి పనిచేయాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి.

రెండు దేశాల సంయుక్త ప్రకటనలో పాకిస్తాన్‌ పేరును ప్రస్తావించకపోయినా ‘రాజ్య విధానంగా ఉగ్రవాదాన్ని అనుసరించడాన్ని వదిలిపెట్టాలని’ ఇద్దరు నేతలూ పిలుపునిచ్చారు. అలాగే పుల్వామా దాడులను తీవ్రంగా ఖండించారు. ‘ఉగ్రవాదం, తీవ్రవాదం సమాజాలకు, దేశాలకు పెను ప్రమాదంగా పరిణమించాయి. వీటిని ఏ జాతి, మతం, సంస్కతికి ముడిపెట్టకూడదు. ఇతర దేశాలపై ఈ ఉగ్రవాదాన్ని ఉపయోగించడం మానుకోవాలి. అలాగే ఉగ్రవాద స్థావరాలను కట్టిపెట్టాలి. ఉగ్రవాద సంస్థలకు ఆర్ధిక సహాయం అందించడం మానుకోవాలి. ఇతర దేశాలపై ఉగ్రవాద దాడులకు పాల్పడకూడదు. అలాంటి దాడులకు పాల్పడినవారిపై చర్యలు చేపట్టాలి’ అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. పాకిస్తాన్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేయాలని ప్రయత్నిస్తున్న భారత్‌కు ఈ ప్రకటన ఉపయోగపడుతుంది.

అంతేకాదు ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా చర్యలు చేపట్టడం, అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక ప్రకటన చేయడం, ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై ఐక్యరాజ్య సమితి నిషేధాన్ని తేవడం వంటి చర్యలు చాలా అవసరం’ అని సంయుక్త ప్రకటనలో రెండు దేశాలు పేర్కొన్నాయి. ఒకప్పుడు ఐక్యరాజ్యసమితి నిషేధం రాజకీయమైన చర్య అంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన సౌదీ అరేబియా ఇప్పుడు ‘ఐక్యరాజ్య సమితిచే సంపూర్ణ నిషేధం’ కోరుతూ ప్రకటన చేయడం పెద్ద మార్పే.

భారత్‌ హజ్‌ కోటాను 2 లక్షలకు పెంచుతున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. అలాగే సౌదీ జైల్లో మగ్గుతున్న 850 మంది భారతీయులను వెంటనే విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. అలాగే సరైన వలస విధానాన్ని రూపొందించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి. అనేకమంది భారతీయ కార్మికులకు ముప్పుగా పరిణమిస్తున్న కఠినమైన కార్మిక చట్టాలను కూడా సరళతరం చేయడానికి సౌదీ అంగీకరించింది.

ఉగ్రవాద దాడి నేపధ్యంలో సౌదీ అరేబియాతో పాటు జారీ చేసిన సంయుక్త ప్రకటనలో పాకిస్తాన్‌ పేరు చేర్చలేకపోయారంటూ విమర్శకులు మోడీని నిలదీయవచ్చు. అయితే ప్రధాని చూపిన దౌత్య పరమైన చతురతవల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. కానీ పిడివాద పాకిస్తాన్‌కు ఆర్ధిక సహాయం అందించబోమని హామీ ఇవ్వడంలో మాత్రం సౌదీ యువరాజు సల్మాన్‌ విఫలమయ్యారని చెప్పక తప్పదు.

– డా.రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *