బొఫోర్స్ మచ్చను మరిపించేందుకే రాఫెల్‌పై రాద్ధాంతం!

బొఫోర్స్ మచ్చను మరిపించేందుకే రాఫెల్‌పై రాద్ధాంతం!

ప్రజల ఆశీస్సులు మళ్లీ మాకే – మీడియాతో ప్రధాని మోదీ

బొఫోర్స్‌ భూతాన్ని వదిలించుకునేందుకు కాంగ్రెస్‌ అవతలి వారి మీద బురద జల్లుతూనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మూకదాడులకు పాల్పడడం హేయమైన చర్య అని, ఆ సంగతి ఇదివరకు కూడా వెల్లడించానని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి దాడుల వెనుక ఉద్దేశం ఏమైనప్పటికీ అది నేరమేనని స్పష్టం చేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విధానాలు తయారు చేయడం తమ ప్రభుత్వ సిద్ధాంతం కాదని కూడా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి విపక్షాలన్నీ ఒక కూటమిగా ఏర్పడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం సాధ్యం కాదని మోదీ అభిప్రాయపడ్డారు. జాతీయ పౌరుల పట్టిక (ఎన్‌ఆర్‌సి), ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవాలు లేవన్నారు. వ్యాపార నిర్వహణ ప్రక్రియను సరళం చేయడం, అన్యాయాలకు పాల్పడేవారిని చట్టం ముందు నిలబెట్టడమే సర్కారు ఉద్దేశమని కూడా ఆయన చెప్పారు. దాదాపు 2.6 లక్షల డొల్ల కంపెనీల నమోదును రద్దు చేయించామనీ, మరో 55,000 కంపెనీలను ఈ నెలలో రద్దు చేయించనున్నామని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ‘ఇ-మెయిల్‌ ముఖాముఖి’లో ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా అంశాల మీద ప్రధాని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వాటిలో కొన్ని.

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు గురించి కాంగ్రెస్‌ పార్టీ పదే పదే సందేహాలు వ్యక్తం చేస్తున్నది. ఈ ఒప్పందంలోని గోప్యత నిబంధన కేవలం సాంకేతిక అంశాలకు పరిమితమైనదే గానీ, వాటి ధరలకు సంబంధించినది కాదని ఆ పార్టీ చెబు తోంది. మరి ఈ వివాదానికి ముగింపు ఏమిటి ? అని అడిగిన ప్రశ్నకు ప్రధాని స్పందన ఇది.

”బొఫోర్స్‌ భూతాన్ని వదుల్చుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. అందుకే ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఇతరుల మీద కూడా ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ ఆయుధాన్ని కాంగ్రెస్‌ పార్టీ గతంలో జార్జి ఫెర్నాండెజ్‌ మీద కూడా ప్రయోగించింది. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య నేరుగా జరిగిన ఒప్పందం. ఇది నిజాయితీతో, పారదర్శకంగా జరిగింది. దీని మీద జరుగుతున్నది దుష్ప్రచారమే. జాతీయ ప్రయోజనాలను భగ్నం చేయడానికి జరుగుతున్న ప్రయత్నమే”.

గోరక్షణ పేరుతో జరుగుతున్న మూదాడులను మీరు ఇదివరకే ఖండించారు. కానీ అలాంటివి ఇంకా కొనసాగుతున్నాయి. మూకదాడుల ఘటనలు, హింస పెరిగిపోతూనే ఉన్నాయి. ‘సబ్‌ కా సాథ్‌ సబ్‌కా వికాస్‌’ నినాదం నేపథ్యంలో మైనారిటీలు, బడుగుల రక్షణకు ప్రభుత్వం చేపట్టే రక్షణ చర్యలు ఏమిటి ? అన్న ప్రశ్నకు కూడా ప్రధాని తీవ్రంగానే స్పందించారు.

”అలాంటి దుర్ఘటనల గురించి ఇప్పటికీ వినవలసి రావడం చాలా శోచనీయం. అలాంటి దుర్ఘటన దేశంలో ఏ ఒక్కటి జరిగినా అత్యంత దురదృష్టకరం. దానికి వ్యతిరేకంగా ఎలుగెత్తి చాటవలసిందే. మా ప్రభుత్వం చట్టాన్ని రక్షించడానికే కట్టుబడి ఉంది. ఈ దేశంలోని ప్రతి పౌరుని స్వేచ్ఛను కాపాడుతుంది. ఈ అంశం మీద ఎలాంటి సందేహాలకి తావు లేదు. మూకదాడులను అరికట్టడం గురించి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన, కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. మూకదాడి నేరమని నేను వ్యక్తిగతంగా కూడా చెబుతున్నాను. వాటి వెనుక ఉద్దేశాలు ఏమైనప్పటికీ కూడా అలాంటి దాడులు హేయమైనవే. చట్టాన్ని తమ చేతులలోకి తీసుకుని హింసకు పాల్పడే అధికారం ఈ దేశంలో ఎవరికీ లేదు. మూక దాడులనీ, ఆ పేరుతో జరుగుతున్న హింసనీ నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పటిష్ట చర్యలు తీసుకోవాలి. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా ఇలాంటి వాటిలో బాధితులను రక్షించడా నికి చర్యలు తీసుకోవాలి. హింసకు పాల్పడుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వంతో పాటు సమాజం, అధికార యంత్రాంగం కూడా ఇలాంటి బెడదను నివారించడానికి తమ వంతు కృషి చేయాలని నా విన్నపం. దీనిని నిరోధించడానికి అవసరమైన సిఫారసులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ¬ంశాఖ కార్యదర్శి నాయకత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ చేసిన సిఫారసులను పరిశీలించేందుకు ¬ంమంత్రి నాయకత్వంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశాం” అన్నారు ప్రధాని.

ప్రతిపక్షాలన్నీ మహాకూటమి పేరుతో ఏకం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నం ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలను దెబ్బ తీస్తుందని భావిస్తున్నారా ? అన్న ప్రశ్నకు మోదీ స్పందన ఇది.

”ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత అంతర్జా తీయంగా భారత్‌ ప్రతిష్ట పెరిగిందన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. 30 ఏళ్ల తరువాత కేంద్రంలో పనిచేసే, పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడింది. రాజకీయ కారణాలతో ఏర్పడిన సంకీర్ణాల చేదు అనుభవాలు ప్రజలకు తెలుసు. పేరు ఏదైనా ఇది ఎన్నికల కూటమి మాత్రమే. భారతీయ ఓటర్లు ఎప్పుడూ జాతీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారు. ఈ కూటమి ఎన్నికల కోసం ఏకమైనదే తప్ప, సూత్రబద్ధత ఉన్నది కాదు. నన్ను పదవి నుంచి తొలగించడమే వాటి ఆశయం. సిద్ధాంతపరమైన ఏకీభావం లేని పార్టీలు కూటమి కట్టడం రాజకీయంగా దుస్సాహసమే. 2019 ఎన్నికల్లో మేమే ఘనవిజయం సాధిస్తాం, 2014లో వచ్చినవాటి కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకుంటాం. ఎన్డీఏ ఇంతవరకు సాధించిన రికార్డులన్నింటినీ ఈసారి అధిగమిస్తాం. కష్టపడి పనిచేశాం. ప్రజల ముందుకు వెళ్లి ఆ విషయమే చెబుతాం. వారి ఆశీస్సులు మాకు తప్పకుండా లభిస్తాయి” అన్నారు.

ఇటీవల పార్లమెంటులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హఠాత్తుగా తననెందుకు ఆలింగనం చేసుకున్నారనే ప్రశ్నకు సమాధానాన్ని తాను కూడా వెతుకుతున్నానని మోదీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వారసత్వంతో వచ్చినవారు (నామ్‌దార్‌) ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని ద్వేషించాలో ముందే నిర్ణయించుకుంటారు. అభిమానాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చూపించాలో కూడా వారు నిర్ణయించు కుంటారు. మేం పనిచేసే వాళ్లం (కామ్‌దార్‌). మా దగ్గర అలాంటిదేమీ ఉండదు’ అని వివరించారు.

విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ వంటివారిని తిరిగి దేశానికి తీసుకురావడానికి, వారిపై విచారణ జరిపించేందుకు మీ ప్రభుత్వానికి ఉన్న అవకాశాలు ? అన్న ప్రశ్నకు నరేంద్ర మోదీ ఇలా చెప్పారు.

”ఇలాంటి వ్యక్తులు అప్పులు తీసుకుని, వాటిని ఎగవేసి ఇలా విదేశాలకు వెళ్లిపోగలుగుతున్నారంటే అందుకు కారణం గతంలో కాంగ్రెస్‌ రూపొందించి, అనుసరించిన విధానాలే. ఆర్థిక నేరాలు చేసి పలాయనం చిత్తగించిన వారి కోసం మేం చట్టాన్ని చేశాం. ఇదే అలాంటి నేరగాళ్లలో వణుకు పుట్టిస్తోంది. ఇలాంటి చట్టం ఇంకా ముందే రావలసి ఉందని మీకు అనిపించడంలేదా? మేం తీసుకున్న చర్యలు ఇప్పటికే ప్రభావం చూపిస్తున్నాయి. మా ప్రభుత్వ విధానం గురించి నేను మళ్లీ చెబుతున్నాను. ప్రజా ధనాన్ని దోచుకుని పోయే వారిని మేం ఉపేక్షించం”.

పాకిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌తో ఆ దేశ సంబంధాలు ఎలా ఉంటాయి? అన్న ప్రశ్నకు సమాధానంగా ప్రధాని, ”ఇరుగు పొరుగుతో శాంతి యుత సంబంధాలు కొనసాగిస్తే ఉప ఖండంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. ఇదే మా ప్రభుత్వం ప్రధానంగా కోరుకుంటున్నది. ఉప ఖండ సుస్థిరతకి, రక్షణకి, సౌభాగ్యానికి పాకిస్తాన్‌ పాటుపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం మొదటి రోజు నుంచీ మేం ప్రయత్నిస్తున్నాం” అన్నారు.

గతంలో పన్ను చెల్లింపుదారుల్లో ఒక శాతం మంది రిటర్న్‌లను పరిశీలనకు ఎంచుకునేవారనీ, దానిని 0.35 శాతానికి తగ్గించి, పూర్తిస్థాయి పరిశీలనను 0.2% కేసుల్లోనే చేయడం, పన్ను చెల్లింపుదారులపై తమకున్న విశ్వాసాన్ని చాటు తోందని మోదీ చెప్పారు. జీఎస్టీ విషయంలో పన్ను మదింపుదారులు ప్రభుత్వంతో, వ్యవస్థతో సహకరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ, కేంద్ర కార్మిక చట్టాల్లో సంస్కరణలు వంటి అనేక విషయాల్లో చెప్పుకోదగ్గ ముందడుగు వేశామని ప్రధాని చెప్పారు. బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరిగిపోవడానికి యూపీఏ సర్కారు విధానాలే కారణమని ప్రధాని ఆరోపించారు. 2008-14 మధ్య బ్యాంకులిచ్చిన రుణాలు ఆరురెట్లు పెరిగాయని గుర్తుచేశారు. దానిపై శ్వేతపత్రం విడుదల చేద్దామని అనుకున్నా అది ఆర్ధిక వ్యవస్థకు ప్రమాద ఘంటికలు మోగిస్తుందని భావించి, బ్యాంకుల్ని గాడిలో పెట్టే చర్యలపై దష్టి సారించినట్లు తెలిపారు. నిరుద్యోగ సమస్యపై మాట్లాడుతూ- 2017 సెప్టెంబరు నుంచి 2018 ఏప్రిల్‌ మధ్య ఒక్క సంఘటిత రంగంలోనే 45 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. భిన్న రంగాల్లో తాము చేపట్టిన చర్యల వల్ల 7.5% ఆర్ధికవద్ధి సాధ్యమయిందన్నారు.

సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు వార్తలు విస్తతంగా వ్యాప్తి చెందుతుండడం దురదష్టకరమని ప్రధాని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పరిమి తులు దాటకూడదని ఎవరికి వారు కట్టుబడితే ఈ సమస్యలన్నీ పరిష్కతమైపోతాయన్నారు. పౌరుల గోప్యత పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. డిజిటల్‌ వేదికల ద్వారా ప్రజలకు దగ్గర కావడం తనకెంతో ఇష్టమన్నారు.

అసోంలో జాతీయ పౌరుల రిజిస్ట్రేషన్‌ విషయంలో విపక్షాలు విభజన రాజకీయాలకు పాల్పడుతున్నాయనేది బీజేపీ ఆరోపణ. అయితే ఈ దేశ పౌరులు కారంటూ 40 లక్షల మందిని పేర్కొన్నారు. వీరి భవిష్యత్తు ఏమిటి ? అన్న ప్రశకు మోదీ ఇలా స్పందించారు.

”చట్ట విరుద్ధంగా దేశంలో ప్రవేశిస్తున్న కాందిశీకులను అడ్డుకోవడం 1972 నాటి ఇందిర, ముజిబ్‌ ఒప్పందంలో ఒక అంశం. అంతేకాదు, 1985లో రాజీవ్‌ గాంధీ, ఆసుల మధ్య కుదిరిన ఒప్పందంలో కూడా ఇదే ఉంది. కాంగ్రెస్‌ ఈ ఒప్పందాలను ఆమోదించింది. కానీ బుజ్జగింపు రాజకీయాలకు అలవాటు పడిన ఆ పార్టీ ఈ ఒప్పందాల అమలుకు మాత్రం అడ్డుపడుతోంది. అసోంలో పౌరుల నమోదు విషయంలో కాంగ్రెసుకు రాజకీయ సంకల్పం, ధైర్యం లోపించాయి. దానికి కారణం ఓటు బ్యాంకు రాజకీయాలే. ఎన్‌ఆర్‌సి విధానాన్ని పూర్తి చేస్తామని మేం దేశానికి హామీ ఇచ్చాం. ఇప్పుడు విడుదల చేసిన జాబితా కేవలం ముసాయిదా. ఏ దేశానికైనా సార్వభౌమాధికారం, పౌరసత్వం అంశాలు అత్యంత కీలకమని మన పౌరులు కూడా అంగీకరిస్తారని నా నమ్మకం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేం దీనిని చేపట్టాం. చిత్రం ఏమిటంటే భారత ప్రధాన న్యాయమూర్తి పట్ల విశ్వాసం లేని ప్రతిపక్షాలు ఇప్పుడు భారత అత్యున్నత న్యాయస్థానం పట్ల కూడా తమ అపనమ్మకాన్ని ప్రకటిస్తున్నాయి. ఇది పూర్తిగా జాతీయ ప్రయోజ నాలకు సంబంధించిన అంశం. జాతీయ ప్రయోజ నాల విషయంలో రాజకీయాలకు తావులేదు”.

2022 సంవత్సరానికల్లా సరికొత్త భారతదేశాన్ని ఆవిష్కరింపచేయడమే మీ ఆశయమని ప్రకటించారు. అయితే అందుకు దేశంలో నాణ్యమైన చదువు, సృజనాత్మకమైన ఆలోచన ఉన్న విద్యాలయాలు ఉండాలి. ఈ లోటును భర్తీ చేయడంలో మీ ప్రభుత్వం ఎంత వరకు విజయవంతమైందన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. ఇందులోనే యూజీసీ గురించి ప్రస్తావించారు.

”ఈ దేశంలోని ప్రతి విద్యార్థి తన అభిరుచి మేరకు ఉన్నత విద్యను అభ్యసించగలగాలన్నదే, దానికి చేరువ కావాలన్నదే నా స్వప్నం. స్థాయిని బట్టి విశ్వవిద్యాలయాలకు ప్రతిపత్తి కల్పిస్తున్నాం. దానితో వాటి పాఠ్య ప్రణాళికను అవే రూపొందించు కుంటాయి. వాటి పరీక్షలు అవే నిర్వహించు కుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వాటి విద్యా ప్రమాణాలను పెంపొందించుకోవడానికి యూని వర్సిటి గ్రాంట్స్‌ కమిషన్‌తో సంబంధం లేకుండా వాటి బాటలో అవి పయనిస్తాయి”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *