ఇలాంటి ఘోరాలు ఇంకానా?

ఇలాంటి ఘోరాలు ఇంకానా?

స్త్రీలు, బాలికల పట్ల గౌరవంతో, మానత్వంతో సమాజం వ్యవహరించకపోతే అది నాగరికత అనిపించుకోదు. అది అధర్మం. అంతకు మించి అన్యాయం.

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం దీని గురించే ఆక్రోశిస్తున్నది. కొన్ని సంస్థలు ఈ దుష్ట సంస్కృతికి వ్యతిరేకంగా నినదిస్తున్నాయి. ఉద్యమిస్తున్నాయి. ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి. భారతీయ ధర్మం స్త్రీని, బాలికను సగౌరవంగా చూడమని వందల ఏళ్లుగా ప్రబోధిస్తున్నది.

కానీ వాస్తవం ఏమిటి ? జరుగుతున్నదేమిటి ?

స్త్రీని అసభ్యంగా చిత్రించడం ఇప్పుడు సర్వేసర్వత్రా కనిపిస్తున్న దారుణం.

అంతేనా! ముక్కుపచ్చలారని బాలికల పట్ల సమాజం అత్యంత క్రూరంగా వ్యవహరించడం మరొకటి. చిన్నారులని వ్యభిచారకూపాల పాల్జేయడం ఇంకా హేయమైన పరిణామం. లైంగిక అత్యాచారాలు, స్త్రీలను, బాలికలను అపహరించడం, అవమానించడం, నీచంగా చిత్రించడం, విక్రయిం చడం.. ఈ చర్యలన్నింటి వెనుక ఉన్నది అమానుష మైన ఒక వ్యాపారం. అది స్త్రీ శరీరం మీద వ్యాపారం.

ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లలోని రెండు అనాథాశ్రమా లలో ఇటీవల బయటపడిన అకృత్యాలు ఈ నీచ సంస్కృతి ఎంతగా వెర్రితలలు వేస్తున్నదో చెబు తున్నాయి. అంతేకాదు, మనం పరమ పవిత్రంగా చూసుకునే యాదాద్రిలోనూ అలాంటి పాపకూపాలు యథేచ్ఛగా పనిచేస్తున్నాయి. ఇటీవలే వాటి నుంచి బయటపడిన బాలికల దీన వదనాలు, వారి కళ్లల్లో కనిపించిన విహ్వలత, వారి చేతుల మీద కనిపించిన వాతలు మన ఆధునికతలోని నిజాయితీని నిలదీసేవే. స్త్రీలు, బాలికల రక్షణ పట్ల, వారి ఆత్మగౌరవం పట్ల సమాజానికీ, ప్రభుత్వాలకీ ఉన్న నిబద్ధతను బాధతో, క్షోభతో ప్రశ్నించేవే.

ఇవి వెలుగు చూసినవి మాత్రమే. వెలుగులోకి రానివి ఇంకా ఎన్నో!

ఈ నైచ్యాన్ని నిరోధించడానికి అసలు ఏమీ జరగడం లేదా? అలా అనుకోవడానికి వీలులేదు. చట్టాలు ఉన్నాయి. అడపా దడపా ఈ పాపకూపాల మీద దాడులు జరిపి, కొందరికి విముక్తి కల్పించినట్టు చెప్పే వార్తలు వెలువడుతున్నాయి. కానీ ఈ ప్రయత్నం చాలడం లేదు. పాత చట్టాలకు కొత్తవి తోడవుతు న్నాయి. ఇవేవీ సమాజాన్ని ప్రభావితం చేయలేక పోతున్నాయి. అంటే ఇలాంటి నేరాలకి పాల్పడేవారిదే ప్రస్తుతం సమాజంలో పై చేయిగా ఉందా?

పన్నెండేళ్లలోపు మైనర్‌ బాలికల మీద అత్యాచారం చేసే వారికి మరణ దండన విధించడా నికి ఉద్దేశించిన క్రిమినల్‌ లా (సవరణ) చట్టం 2018కి రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ఒక వారం క్రితమే ఆమోదముద్ర వేశారు. మహిళల మీద అత్యాచారాలు చేసే వాళ్లకి విధించే కనీస శిక్షని పదేళ్ల నుంచి ఇరవై ఏళ్లకి పెంచుతున్నారు. పదహారేళ్ల లోపు బాలికల మీద అత్యాచారాలకు పాల్పడిన వారికి శిక్షను పదేళ్ల నుంచి ఇరవై ఏళ్లకు పెంచారు. పన్నెండు సంవత్సరాల లోపు బాలికల మీద అత్యాచారం జరిగితే దోషులకు ఇరవై ఏళ్ల కారాగారం విధిస్తారు. ఇంకా మరణ శిక్ష విధించే అవకాశమూ ఉంది. సామూహిక అత్యాచారానికి పాల్పడిన మృగాళ్లకు ఇత జీవితాంతం కారాగారమే.

ఇలాంటి చట్టాలు తీసుకురావలసినంతగా సమాజం ఎందుకు దిగజారిపోయింది? ఇలా ఎందుకు జరుగుతోంది?

ఇది మామూలు ప్రజలు వేసుకుంటున్న ప్రశ్న కాదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు కూడా అడుగుతోంది. ఈ ప్రశ్న ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లలో అనాథ శరణాలయాలలో అనాథ బాలికలపై జరుగుతున్న అకృత్యాలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన నేపథ్యంలో వేసినది. ఉత్తర ప్రదేశ్‌లోని దేవరియో శరణాలయం నుంచి పలువురు బాలికలు గల్లం తయినట్టు వార్తలు వచ్చాయి. అక్కడి బాలికలపై లైంగిక అత్యాచారాలు జరిగాయి. ఇలాంటి అత్యాచారాలకు అంతం ఎప్పుడంటూ కోర్టు ఆవేదన వ్యక్తం చేయడం అర్థం చేసుకోవలసిందే.

యాదాద్రిలో ఏం జరుగుతోంది ?

‘సంతానం బాగుండాలని మొక్కుకోవడానికి యాదాద్రి పుణ్యక్షేత్రానికి వస్తాం. ఈ క్షేత్రం సమీపంలోనే బాలికలను వ్యభిచారంలోకి దింపడం దారుణం. ఇలా ఎంతమంది ఆడబిడ్డలు బలై పోయారో ! ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఇందుకు కారకులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు వ్యభిచార వృత్తిని నిర్మూలించాలి’. యాదాద్రి కేంద్రంగా జరుగుతున్న ఘోరాల మీద స్పందిస్తూ బీజేపీ మహిళా మోర్చా తెలంగాణ శాఖ ఉపాధ్యక్షు రాలు యమునా పాటిల్‌ అన్నమాటలివి. అక్కడేం జరిగిందో పరిశీలిస్తే ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది.

దాదాపు యాభయ్‌ ఏళ్ల నుంచి యాదాద్రి లేదా యాదగిరిగుట్టలో ఈ దారుణం సాగిపోతూనే ఉంది. గణేశ్‌నగర్‌ కాలనీ, పాతగుట్ట ప్రాంతం ఇందుకు కేంద్రం. యాదగిరిపల్లె, గుండపల్లి అనే రెండు గ్రామాలు కలిపి యాదగిరి పంచాయతీగా ఏర్పా టైంది. ఇప్పుడు మునిసిపాలిటీగా కూడా అవతరించ బోతున్నది. ఏభయ్‌ ఏళ్ల క్రితం అక్కడికి వచ్చిన కొన్ని కుటుంబాలు (పడుపు వృత్తినే ఆశ్రయించుకునేవి) ఈ కిరాతకానికి పాల్పడుతున్నాయని అందరికీ తెలుసు. ఇవి దాదాపు 110 కుటుంబాలు. అందులో 15 వరకు కుటుంబాలు బాలికలను అపహరించి తేవడం, వ్యభిచార వృత్తిలోకి దించడమనే నేరాలకు యథేచ్ఛగా పాల్పడేవి. ప్రస్తుతం వీటిలో ఎక్కువ కుటుంబాలు ఇళ్లకు తాళాలు పెట్టి పరారీలో ఉన్నాయి. చిత్రం ఏమిటంటే ఈ ప్రాంతంలోని కీలక పదువులన్నీ ప్రస్తుతం మహిళల చేతిలో ఉన్నాయి. ఎంపీపీ ఒక మహిళ, జడ్‌పీటీసీ మహిళ, ఒక మహిళ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శాసనసభ్యు రాలు కూడా మహిళే కావడం విశేషం. ఆఖరికి యాదాద్రి దేవస్థానం ఈవో కూడా మహిళే. ఇలాంటి సమయంలో కూడా యాదాద్రిలో ఇంతటి ఘోరం యథేచ్ఛగా సాగడం అందరినీ విస్తుగొలుపుతోంది.

బాలికలను, అభాగినులను పడుపు వృత్తిలోకి తీసుకురావడమే కాదు, వారిని యాదాద్రి నుంచే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒరు ఇద్దరు కాదు. ఎందరో దళారులు ఒక్కొక్కరు పది నుంచి పదిహేను మంది బాలికలను, స్త్రీలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. కొంత గడువు ముగిసిన తరువాత ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనాథ బాలికలు, సినిమా మోజులో పడి దిక్కు తోచకుండా మిగిలిన వారు, ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వారు.. ఇలాంటి వారికి దళారులు ఆశలు చూపిస్తా రని తెలిసింది. అలా ఈ ఉచ్చులోకి దింపుతారు. ముందు నుంచి పడుపు వృత్తిలో ఉన్న కుటుంబాల ఆడపిల్లలను కూడా మళ్లీ అదే పాపకూపంలోకి నెట్టివేసే పని కూడా జరుగుతుంది. ఈ కుటుంబాల వారు సంతానంలో పెద్ద పిల్లకు పెళ్లి చేసి, మిగిలిన ఆడపిల్లలను ఈ వృత్తిలోకి నిర్దాక్షిణ్యంగా దించడం రివాజుగా వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఎనిమిది సంవత్సరాలు ఉన్న బాలికలను కూడా వీరు వదిలిపెట్టరు. వయసుకు మించి కనిపించేందుకు వీలుగా కొన్ని రకాల ఇంజెక్షన్‌లు ఇస్తారు. ఇదంతా దర్యాప్తులో తేలిన వాస్తవం. వీళ్ల మనుషులు చుట్టూ ఉండే జిల్లాలలోనే కాదు, ఇరుగు పొరుగు రాష్ట్రాలలో కూడా ఉంటారు.

యాదాద్రిలో వెలుగు చూసిన ఘోరాలు ఇంకా ఎన్నో. అక్కడి కుటుంబాలలో చాలా వరకు పది నుంచి పదిహేను మంది యువతులను కాంట్రాక్ట్‌ మీద తీసుకువచ్చి అక్రమ కార్యకలాపాలలో భాగస్వాములను చేస్తున్నాయి. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. అంటే ఎంతమంది అభాగినులు ఈ నరకంలో చితికిపోతున్నారో ! అపహరించి తెచ్చిన బాలికలను త్వరితంగా వృత్తిలోకి దించడానికి చేసే పనులు ఘోరమే. ఇంజెక్షన్‌లు ఇవ్వడంతో పాటు అత్యంత హేయమైన రీతిలో ఆ ఘోరానికి ఒప్పిస్తారు. ఈ ఇళ్ల మీద దాడి చేసి కొందరు పిల్లలను బయటకు తీసుకువస్తున్నప్పుడు వారి చేతుల మీద కనిపించిన వాతలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వచ్చే విటులను మోసం చేయడం కూడా పరిపాటి. ఫోన్‌లలో వీరి చిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తారు. మొత్తం దోచుకుంటారు.

యాదాద్రిని అభివృద్ధి చేసే క్రమంలో వ్యభిచార కేంద్రాలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయినా ఎవరికీ పట్టడం లేదు. ఆరెస్సెస్‌, బీజేపీ, వీహెచ్‌పీ వంటి సంస్థలు, ఎన్నో ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు ఈ అకృత్యాలను ఆపాలని ప్రభుత్వానికి పలుసార్లు విన్నపాలు చేశాయి. ఉద్యమాలు చేశాయి. వివాదం కొంచెం వేడిక్కితే కొద్దికాలం అంతా గప్‌చుప్‌గా ఉంటారు. మళ్లీ మామూలే. ఇప్పుడు కూడా ఈ కుటుంబాల వాళ్లు కొందరు ఇదే భరోసాతో ఉన్నారు. ఈ హడావిడి ఎంతోకాలం ఉండదనీ, మళ్లీ యథావిధిగా తమ పనులు సాగించుకుంటామని నిశ్చింతగా చాటుతున్నారు.

ఒకసారి ఈ వృత్తిలోకి దిగిన వారు మనసు మార్చుకుని మంచి జీవితంలోకి ప్రవేశించాలని కోరుకున్నా, ఈ దళారులు సాగనీయరు. వెతికి తెచ్చి మళ్లీ దించుతారని ప్రతీతి. ప్రభుత్వం కూడా ఇలాంటివారి కోసం కొన్ని పునరావాస పథకాలు చేపడుతోంది. అవి మంచి ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. గతంలో యాదాద్రి చుట్టుపక్కల ఉన్న కొన్ని అంగన్‌వాడి పోస్టులను ఇలాంటి వారి కోసం రిజర్వు చేశారు. వాటిలో చేరేందుకు అలాంటి మహిళలు మొగ్గు చూపలేదు. అక్కడ వచ్చే నెల జీతం తమకి ఒక్క రోజులోనే వస్తుందని చెబుతున్నారు. కానీ వృద్ధాప్యంలో ఎలాంటి జీవితం గడపవలసి ఉంటుంది? వీరి సంతానం ఎలాంటి జీవితం గడపవలసి ఉంటుంది? వీటి గురించి ఆలోచింప చేస్తూ, వారిని చైతన్య పరిస్తే కొంత ఫలితం ఉండవచ్చు.

మా పిల్లలు ఉంటే చెప్పండి!

ఏ మహిళా కూడా ఇలాంటి హేయమైన బతుకును కోరుకోదు. కానీ కొంతమంది ఒకసారి ఇందులోకి ప్రవేశించిన తరువాత మళ్లీ ఇళ్లకు వెళ్లడానికి ఒప్పుకోలేరు. కానీ ఆ పరిస్థితి మారుతోంది. ఎప్పుడో తప్పిపోయిన తమ బిడ్డల కోసం తాపత్రయం పడేవారు కూడా ఉంటారని యాదాద్రి ఘటన తెలియచేసింది. ఈ పాతకాల గుట్టు రట్టుయిన నేపథ్యంలో కొందరు బాలికల ఆచూకి బయటపడింది. వీరంతా ఎప్పుడో తప్పినపోయిన వారే. ఇలా దొరికిన బాలికలలో తమ ఆడబిడ్డ ఉన్నదేమో తెలియచేయవలసిందని భువనగిరి జిల్లా బొమ్మల రామారానికి చెందిన ఒక కుటుంబం పోలీసులను కోరింది. దాడుల సందర్భంగా దొరికిన పిల్లలు క్షేమంగా ఉన్నారని, వారికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించిన తరువాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇలా కుటుంబాలు ముందుకు రావడం మంచి పరిణామం.

దేవరియో అనాథ శరణాలయం

మతి స్థిమితం లేని ఆడపిల్లలని, రైల్లో వదిలేసిన పిల్లలని, ఎక్కడో తప్పిపోయిన ఆడపిల్లలని, కొన్ని కారణాల వల్ల ఇంట్లోంచి పారిపోయిన వారిని, మొగుళ్లని విడిచి పెట్టి వచ్చిన వాళ్లని ఉత్తర ప్రదేశ్‌లోని ఈ అనాథ శరణాలయానికి పంపడం రివాజు. దీని పేరు మా వింధ్యవాసిని బాలికల, మహిళల రక్షణ గృహం. గిరిజా త్రిపాఠి, ఆమె భర్త మోహన్‌, కుమార్తె కాంచనలత నిర్వహిస్తున్నారు. పదేళ్ల బాలిక అదృష్టవశాత్తు తప్పించుకుపోయి, అక్కడి మహిళా పోలీసు స్టేషన్‌లో అంతా చెప్పడంతో ఈ గుట్టు రట్టయింది. ఆగస్టు ఆరున ఈ గృహాన్ని పోలీసులు మూయించారు. అదే సమయంలో 23 మంది మహిళలను, బాలికలను రక్షించారు. ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. నిజానికి ఈ ప్రభుత్వేతర సంస్థ అనేక అకృత్యాలకు పాల్పడుతున్నదన్న ఆరోపణతో సంవత్సరం క్రితమే నిధులు ఆపేశారు. మూతకు అప్పుడే ఆదేశాలు కూడా వెళ్లాయి. అయినా ప్రభుత్వ నిధులు ఉన్నట్టే చెబుతూ ఈ గృహాన్ని నడుపుతున్నారు. ఇందులో ఉండే ఆడపిల్లలను ఎవరికీ కనిపించనిచ్చేవారు కాదు. ఒక్కొక్కసారి కొందరు ఆడపిల్లలు సాహసించి ఇంటిపై నుంచి పక్క దుకాణాల మీదకు దూకి పారిపోయే ప్రయత్నం కూడా చేసేవారు. కానీ మళ్లీ పట్టుకుని తీసుకు పోయేవారు. ఇలాంటి వారిలో మతిస్థిమితం లేని ఆడవాళ్లు కూడా ఉన్నారు. ఇంటి నుంచి ఎప్పుడైనా కుటుంబ సభ్యులు వచ్చినా, లేదా అధికారులు వచ్చినా నోరు విప్పడానికి వీల్లేదని ముందే చెప్పేవారు నిర్వాహకులు. ఒకవేళ సాహసిస్తే ప్రాణాలు దక్కవని బెదిరించేవారు. పోలీసులు దాడి చేసిన తరువాత ఇక్కడ దొరికిన రిజిస్టర్‌ ప్రకారం 48 మంది ఉండాలి. కానీ 23 మందినే కాపాడగలిగారు. మిగిలిన వారు ఎక్కడ ఉన్నదీ ఇప్పటికీ ఆచూకీ లేదు. ప్రతి వారంతంలో తనను ఎవరో ఒక అపరిచితుని వద్దకు పంపేవారని, అతడు లైంగిక వాంఛలు తీర్చుకునే వాడని పదిహేనేళ్ల ఒక బాలిక తరువాత అధికారుల ముందు వాపోయింది.

వేరే దిక్కులేక అనాథ శరణాలయమనుకుని చేరితే, అలాంటి బాలికల చేత వ్యభిచారం చేయించడం దారుణమనుకుంటే, వారిని అర్థాకలితో ఉంచడం ఇంకొక ఘోరం. అక్కడ చేరిన బాలికలకు చాలీచాలని తిండి మాత్రమే ఉండేది. ఇంతకీ గిరిజా త్రిపాఠి ఆమె ఇద్దరు కుమార్తెలు సంఘ సేవకులుగా పేరు గడించినవారే కావడం విశేషం. గిరిజ సామూహిక వివాహాలు జరిపించడం, సంక్షేమ కార్యక్రమాల పేరిట కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, వీటికి జిల్లా అధికారులని పిలవడం, ఆ ఫొటోలు పత్రికలలో ప్రచురించేటట్టు చూసుకోవడం నిత్యం చేసేది.

గిరిజా త్రిపాఠి ఈ స్వచ్ఛంద సంస్థను 1990లో రిజిస్టర్‌ చేయించారు. దేవరియోకు సమీపంలోనే ఉన్న బట్నీ అనే చిన్న పట్టణంలో ఉండే గిరిజ తరువాత దేవరియోకు మకాం మార్చారు. 2009, 10 ఆర్థిక సంవత్సరంలో, అంటే బీఎస్పీ హయాంలో ఈ అనాథ శరణాలయానికి ప్రభుత్వ గుర్తింపు వచ్చింది. అప్పుడే మహిళా, బాలికా రక్షణ కేంద్రంగా కూడా గుర్తించారు. దానితో చుట్టుపక్కల నుంచి అనాథలను ఇక్కడకే తెచ్చేవారు. 2012 నుంచి 2017 వరకు ఈ సంస్థకు వెళ్లిన నిధులు రూ.90 లక్షలు. అనతికాలంలోనే గిరిజా త్రిపాఠి, ఆమె భర్త గోరఖ్‌పూర్‌లో ఒక వృద్ధాశ్రమం కూడా స్థాపించారు.

మతి స్థిమితం లేని ఒక బాలిక, నలుగురైదుగురు మూగ, చెవిటి బాలికలు ఇక్కడ ఉన్నారని తేలింది. వారు ఇక్కడికి ఎలా వచ్చారన్న అంశం ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఈ దారుణాలు వెలుగు చూసిన తరువాత దొరికిన ఆ 23 మందిలో ఎప్పుడో కిడ్నాప్‌ అయిన తమ ఆడపిల్లలు ఉన్నారేమోనని వెతుక్కుంటూ వస్తున్న తల్లిదండ్రులు ఉండడం విశేషం.

కాస్త సాంత్వన, చేయూత చాలు!

దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలలో స్త్రీలు, బాలికల అక్రమ రవాణా ఒకటి. దీనిని అంగీక రించడం అవమానంగా భావించడం సరికాదు. దాని గురించి ప్రస్తావించడం అమర్యాదగా భావించడమూ పొరపాటే. ఇటీవలి పరిణామం గురించి సమాజం గమనించాలి. కొందరు బాలికలు, స్రీలు బయటి ప్రపంచంలోనే కాదు, ఇంట్లోనూ అలాంటి నీచమైన వాతావరణాన్ని భరించవలసి వస్తున్నది. మానవహక్కుల కార్యకర్త, స్త్రీలు, బాలికల అక్రమ రవాణాను ఎదుర్కొంటున్న మహిళా ఉద్యమకారిణి సునీతా కృష్ణన్‌ ఒక ఆంగ్లపత్రికకు రాసిన వ్యాసంలోని విషయాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి.

ఎనిమిది, పన్నెండేళ్లు ఉన్న అక్కాచెల్లెళ్లు ఒక పాఠశాలలో చదువుతున్నారు. వారి పరిస్థితిని బట్టి ఆ పిల్లల చేత ఎవరో వ్యభిచారం చేయిస్తున్న సంగతిని ఉపాధ్యాయురాలు గ్రహించి సునీత సాయం కోరారు. ఆరా తీస్తే ఆ పనికి ఆ బాలికలను బలవంతపెడుతున్నవారు సొంత కుటుంబంలోని వారే. తల్లే ఇలాంటి పనికి ప్రోత్సహిస్తూ ఉండగా, తండ్రి మౌనంగా ఉంటున్నాడు. సోదరుడు వీరికి మనుషులను సమకూర్చి పెడుతున్నాడు. మొత్తానికి ఆ ఇద్దరు పిల్లలను సునీత రక్షించారు. చిత్రంగా సంవత్సరం గడిచినప్పటికి అప్పటి అకృత్యాలు ఆ బాలికలను పట్టి పీడించాయని ఆమె చెప్పారు. కొన్ని కుటుంబాల వారు తమ ఇంట పుట్టిన బాలికలను ఇలా వ్యభిచారంలోకి దింపడం లేదా అమ్ముకోవడం వంటి నీచానికి దిగజారడం కనిపిస్తున్నదని కూడా ఆమె వెల్లడించారు. ఇలా ఎందరో ఈ దేశంలో! మరిన్ని విషయాలు కూడా సునీత దర్యాప్తులో వెలువడినాయి.

ఇలా అంగడి సరుకుగా మారుతున్న బాలికలలో మూడున్నర సంవత్సరాల వారి నుంచి పదకొండు సంవత్సరాల పిల్లలు ఉంటున్నారు. పోలీసులు దాడి చేసినప్పుడు దొరికిన పిల్లల్లో ఈ వయసుల వారే ఎక్కువ. ముక్కు పచ్చలారని బాలికలు కూడా యుక్త వయసు వచ్చిన వారిలా కనిపించడానికి ఎస్‌ట్రోజన్‌, ఆక్సిటోజిన్‌ ఇంజక్షన్‌లు ఇస్తామని వ్యభిచార గృహం నడిపే ఒక వ్యక్తి వెల్లడించిన సంగతిని కూడా సునీత రాశారు.

కానీ అనాథ బాలికలు, దిక్కు లేని బాలికల కోసం ఏర్పాటు చేసిన అనాథాశ్రమాలలో కూడా వారి చేత నీచమైన పనులు చేయించడం, వారి పట్ల క్రూరంగా వ్యహరించడమే ఇప్పుడు అతి పెద్ద విషాదం. అందుకే బయట ప్రపంచంలోనే కాదు, కొందరు ఆడపిల్లలకు తమ ఇల్లు కూడా రక్షణ ఇవ్వలేకపోతోందని సునీత అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్య ఒక క్యాన్సర్‌లా వ్యాపించడానికి కారణం సమస్యనీ దానిలోని తీవ్రతనీ బాధితుల వైపు నుంచి సమాజం చూడడం ఇప్పటికీ నేర్చుకోలేదు. అదొక పరువుకు సంబంధించిన అంశంగానే చూస్తున్నది. అది సామాజిక సమస్య. ఒకచోట నిప్పు రాజుకుంటే మిగిలిన ప్రాంతాలకు వ్యాపించుకుంటూ పోవడం దాని లక్షణం. ఎప్పుడో రెడ్‌లైట్‌ ఏరియా పేరు చెప్పేవారు. ఇప్పుడు ఇలాంటివన్నీ చిన్న చిన్న రెడ్‌ లైట్‌ ఏరియాలే కదా! బాధితురాలి వైపు నుంచి ఎందుకు చూడాలంటే, ఆ కూపంలోకి దిగడంలో వారి ప్రమేయం దాదాపు ఉండదు. అందుచేతనే వారికి న్యాయం చేయాలి. రక్షణ కల్పించాలి. ఇది సమాజం లేదా ప్రభుత్వాల బాధ్యత. దీని కోసమే వారు ఎదురు చూస్తున్నారు కూడా. ఇప్పుడు కొత్తగా తయారైన చట్టం (2018) బాధితులను దృష్టిలో ఉంచుకుని చేయడం ఆహ్వానించదగినదని కూడా సునీత అభిప్రాయపడుతున్నారు.

మనుషుల అక్రమ రవాణా రాజకీయ అంశం కాదు. చర్చలతో పరిష్కారమయ్యేది కాదు. దాని నిర్మూలనను సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ఒక మనిషి ఆత్మ గౌరవం, శరీరం, మనసు విధ్వంసం కాకుండా చూడడమే ఆ బాధ్యత పరమార్థం. కొన్ని లక్షల మంది దీనిని కోల్పోతున్నారు. చరిత్రలో కనిపించే అత్యంత మానవీయ విషాదాలలో ఈ అక్రమ రవాణా కూడా ఉంది. ప్రస్తుతం పోరాడవల సింది.. ఆ వృత్తిలో కూరుకుపోయిన వారిని రక్షించ డంతో పాటు, దాని నుంచి బయటపడి సగౌరవంగా బతుకుదామని మనస్ఫూర్తిగా భావిస్తున్నవారికి చేయూతను ఇవ్వడం గురించి కూడా.

ముజఫర్‌పూర్‌ దురంతం

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ బాలికల అనాథ శరాణాలయం వ్యవహారం ఇంకా దారుణమైనది. దీనిని నడుపుతున్న బ్రజేశ్‌ ఠాకూర్‌ 34 మంది మైనర్‌ బాలికల మీద లైంగిక అత్యాచారం జరిపాడని బయటపడింది. ఇతని కుమారుడికి కూడా ఇందులో సంబంధం ఉంది. 2017లో జేడీయూ ప్రభుత్వం రాష్ట్రంలో సర్కారు నిధులతో నడుస్తున్న 110 అనాథ శరణాయాల మీద ఒక నివేదిక తయారు చేయమని టాటా ఇనిస్టిట్యూట్‌ సోషల్‌ సైన్సెస్‌ విభాగానికి పురమాయించింది. అప్పుడే ఈ సంగతి బయటపడింది. ఇక్కడ 42 మంది బాలికలు ఆశ్రయం పొందుతూ ఉండగా వారిలో 34 మంది మీద కొంతకాలంగా ఠాకూర్‌ అకృత్యాలకు పాల్పడ్డాడు. వీరంతా ఏడు, పదిహేడేళ్ల వయసు మధ్య వయసు గల మైనర్లే. ఇందులో ఎక్కువ మంది బధిరులు. రాత్రివేళ భోజనంలో మత్తు మందు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టేవారు.

దీనికి వ్యతిరేకంగా, బాధితులకు న్యాయం చేకూర్చేందుకు పోరాడతామంటూ రాష్ట్రీయ జనతాదళ్‌ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌ ఢిల్లీలో ఆర్భాటం చేశారు. ప్రతిపక్షాల వారిని కూడగట్టే ప్రయత్నం చేశారు. ఇంతకీ తేజస్వి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యదర్శిగా పనిచేసిన మణి ప్రకాశ్‌ యాదవ్‌కు ఈ దురాగతంలో పాత్ర ఉందని అధికార జేడీ(యు) మహిళా నాయకురాళ్లు ఆరోపిస్తున్నారు. అతడిని మళ్లీ దగ్గరకు రానీయవద్దని మాజీ ముఖ్యమంత్రి రబ్దీదేవికి వారు ఒక లేఖ రాశారు కూడా. ఇలాంటి దురంతాన్ని రాజకీయాలకు వాడుకోవాలని చూడడం ఘోరం. దీని మీద సీబీఐ దర్యాప్తు జరుగుతోంది.

ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నా చట్టసభలు స్పందించవలసినంతగా స్పందించడం లేదని చెప్పడం తొందరపాటు కాదు. నిజంగానే మనం ఈ సమస్యను బాధితుల వైపు నుంచి చూడడం లేదా? లేదా ఆ విషయాన్ని చర్చించడమే పరువు తక్కువ అనుకుంటున్నామా? కానీ బాధితులు నిజం. వారిపై అకృత్యాలు ఇంకా నిజం. వారు దారుణమైన జీవితం గడుపుతున్న మాట కూడా నిజం. దీనిని సాంఘిక సమస్యగా భావించి అంతా స్పందించడం నేర్చుకోవాలి. లేకపోతే ఇప్పటికే రాజకీయనాయకుల పాత్ర, పోలీసుల పాత్ర ఇలాంటి ఘోరాల వెనుక ఉన్నదంటూ వస్తున్న ఆరోపణలు నిజమని నమ్మక తప్పదు. అదే నిజమని తేలితే ఈ దేశానికి అంతకంటే అవమానం లేదు.

– జాగృతి డెస్క్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *