ఎందుకీ రగడ ?

ఎందుకీ రగడ ?

ఫిబ్రవరి 3 ఆదివారం రాత్రి హఠాత్తుగా ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రినన్న వాస్తవం మరిచిపోయారు. 8వ తేదీవరకు నిరసన శిబిరం నుంచే పాలన సాగుతుందని హుంకరించారు. కానీ 5వ తేదీ చీకట్లు పడుతుండగానే మళ్లీ అంతే హఠాత్తగా దీక్ష ముగిసిందని మూటా ముల్లే సర్దేశారు. ఇదంతా ఎందుకు? ఎవరి కోసం? పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత నిర్వాకమిది. ప్రహసనాన్ని మించినది. ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి మొదలైన ఆ ‘సంక్షోభ సూచన’ క్రమాన్ని గమనిస్తే ప్రజాస్వామ్యం పట్ల కనీస గౌరవం ఉన్నవారికి తీవ్ర క్షోభ కలుగుతుంది. ‘పశ్చిమ బెంగాల్‌లో పరిణామాలు రాజ్యాంగ సంక్షోభాన్ని సూచిస్తున్నాయి’… అంటూ కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫిబ్రవరి 4న పార్లమెంట్‌లో వ్యక్తం చేసిన అభిప్రాయం నిజమేననిపిస్తుంది. ఈ సంక్షోభాన్ని ఆరంభించినవారు మమతా బెనర్జీ. ఇందులో రెండో మాటకు తావు లేదు. ఆమెకు విపక్షాలు వందిమాగధులను మించి వంత పాడుతున్నాయి. గడచిన రెండువారాలలో బెంగాల్‌లో ఏర్పాటు చేసిన సభలకు రావాలనుకున్న ముగ్గురు బీజేపీ ప్రముఖులను ఆమె అవమానించారు. ఆ నేతల హెలికాప్టర్లు రాష్ట్రంలో దిగకుండా మమతా బెనర్జీ అడ్డుకున్నారు. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం ? అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న పోలీసును ప్రపంచం మొత్తం మీదనే అత్యంత ప్రతిభావంతుడైన అధికారిగా కీర్తించడం ఒక సిఎం చేయవలసిన పనేనా ? వీటి గురించి విపక్షాలు ఆలోచించవు. మోదీపై చిన్న విమర్శఅయినా వారు పెద్ద విజయంగా భావిస్తున్నారు.

మమత ఎంత అప్రజాస్వామికంగా ఈ రగడను ఆరంభించారో తెలుసుకోవడానికి కొన్ని ఘటనల క్రమాన్ని పరిశీలించాలి. ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి ఏడు గంటల ప్రాంతంలో సీబీఐ అధికారులు కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఇంటికి వెళ్లారు. పదివేల కోట్ల రూపాయల శారద చిట్‌ఫండ్స్‌ అక్రమ లావాదేవీలలో రాజీవ్‌ కుమార్‌ పాత్రపై అనుమానాలు ఉన్నాయి. ఆ విషయం ప్రశ్నించేం దుకు మొదట నలభయ్‌ మంది సీబీఐ అధికారులు దక్షిణ కోల్‌కతాలోని ఆయన నివాసానికి వెళ్లారు. కానీ ఆగమేఘాల మీద అక్కడికి వచ్చిన పోలీసు సిబ్బంది, ఏ వివరాలు కావాలన్నా కార్యాలయానికి వెళ్లాలని సీబీఐ అధికారులకి సూచించారు. తప్పులేదు. కానీ కమిషనర్‌ కార్యాలయానికి చేరుకోగానే వారందరినీ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. షేక్‌స్పియర్‌ సర్ని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి రెండుగంటల తరువాత విడిచిపెట్టారు. ఈ సమయంలోనే సీబీఐ అధికారుల మీద రాష్ట్ర పోలీసులు చేయి చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తరువాత కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయం చుట్టూ పశ్చిమ బెంగాల్‌ పోలీసు బలగాలు మోహరించడం మరొక పరిణామం. అది కొద్దిసేపే. తరువాత మళ్లీ పారా మిలటరీ దళాలు వచ్చి కార్యాలయం చుట్టూ మోహరించాయి. ఇది కేంద్రం అధీనంలోని సీబీఐ పట్ల ఆమె వ్యవహరించిన తీరు. సీబీఐ మీద ఆరోపణలు కొత్త కాదు. కానీ మమత కోల్‌కతా నగరంలోని సీబీఐ కార్యాలయాన్ని ఒక ఉగ్రవాద శిబిరం అన్న రీతిలో భావించలేదా? అలా కాకపోతే ఎందుకీ మోహరింపు? కోల్‌కతా కేంద్రంగా చిట్‌ఫండ్‌ వ్యవహారాలలో జరిగిన అవకతవకల మీద దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందానికి రాజీవ్‌ నాయకుడు. ఈ అవకతవకల వేళ్లు తూర్పు భారతమంతటా ఉన్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖుల మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. ఇది కాంగ్రెస్‌ నాయ కత్వంలోని యూపీఏ కాలంలోనే ఆరంభమైంది. రాజీవ్‌ కుమార్‌ను ఫిబ్రవరి 1న తమ ఎదుట హాజరు కావలసిందిగా సీబీఐ తాఖీదు ఇచ్చింది. ఆ రోజు నుంచి ఆయన కనిపించలేదు. నోటీసులు జారీ చేసినప్పటికీ రాజీవ్‌ సీబీఐ ఎదుట హాజరు కానందువల్లనే తమ బృందం అక్కడకు వచ్చిందని సీబీఐ తాత్కాలిక చీఫ్‌ ఎం. నాగేశ్వరరావు చెప్పారు. రాజీవ్‌ దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఆయన వాటిని ధ్వంసం చేసే అవకాశం ఉందని నాగేశ్వరరావు వాదన. వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగిన శారద, పోంజీ వ్యవహారాలలో ముఖ్యమైన పత్రాలు కనిపించకుండా పోయాయని, ఆ విషయం గురించి రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించాల్సిందేనని సీబీఐ చెబుతోంది. చిత్రం ఏమిటంటే 1989 ఐపీఎస్‌ బృందానికి చెందిన రాజీవ్‌ ప్రస్తుతం బెంగాల్‌ కేడర్‌లో ఉన్నారు. ఈయన ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులతో నిర్వహించిన సమావేశానికి కూడా గైర్హాజరయ్యారని సీబీఐ అధికారులు చెబుతున్నారు. కానీ ఆయన ఎక్కడికీ వెళ్లలేదనీ, ఒక్కరోజు మాత్రమే సెలవు పెట్టారని మమత అడ్డగోలుగా వాదనకు దిగుతున్నారు.

‘కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ దగ్గరకు సీబీఐ అధికారులు వచ్చిన కొద్ది గంటలకే మమతా బెనర్జీ తన పూర్వ అవతారమైన వీధి పోరాటయోధురాలిగా మారిపోయారు’. హుటాహుటిన పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి చేరుకుని రాజీవ్‌ కుమార్‌తో కొద్దిసేపు చర్చించారు. తరువాత సమీపంలోనే ఉన్న మెట్రో సినిమా ఎదుట టెంట్‌ వేయించి ధర్ణాకు దిగారు. ‘ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడమే ధ్యేయం’గా ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్టు వెల్లడించారు. ఈ ధర్ణా ఈ నెల ఎనిమిదో తేదీ వరకు సాగుతుందని కూడా చెప్పారు. 12వ తేదీ నుంచి విద్యార్థులకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో తరువాత నుంచి మైక్రోఫోన్‌లు వాడకం మీద నిషేధం ఉంది. అప్పటిదాకా ఆమె ఆ ధర్ణా శిబిరం నుంచే పాలన సాగిస్తారు. ఆఖరికి బడ్జెట్‌ సమావేశాలకు కూడా హాజరు కాలేనన్నట్టు ఆమె చెప్పారు. అక్కడికి ఒక్క కిలోమీటరు దూరంలోనే ఏర్పాటు చేసినప్పటికీ రైతుల సమావేశానికి కూడా ఆమె హాజరు కాలేదు. అక్కడ నుంచే ఫోన్‌లో ప్రసంగించారు. 2006లో సీపీఎం ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణ కార్యక్ర మానికి వ్యతిరేకంగా జరిగిన అకృత్యాన్ని స్మరించు కుంటూ ఏర్పాటు చేసిన సభ అది. అలీపూర్‌లో జరగవలసిన పోలీసు పతకాల బహూకరణ ఉత్సవాన్ని కూడా ఆమె అక్కడనే నిర్వహించారు. మంత్రి మండలి సమావేశం కూడా అక్కడే జరిగింది. ఆఖరికి పోలీసు ఉన్నతాధికారి, ఈ వివాదానికి కేంద్ర బిందువు రాజీవ్‌ కుమార్‌ కూడా ముఖ్యమంత్రితో పాటు అదే నిరసన శిబిరంలో దర్జాగా కూర్చున్నారు. మమత మాటలలోనే ఇదంతా ఎందుకు అంటే, ‘ఒక అత్యున్నత పోలీసు అధికారిని రక్షించుకోవలసిన బాధ్యత’ ఆమె మీద ఉన్నందుకేనని కనీవినీ ఎరుగని సమాధానం చెప్పారు. 2006 డిసెంబర్‌లో మమత సరిగ్గా అదే స్థలంలో 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. అప్పుడు సీపీఎం ఆగడాలకు వ్యతిరేకంగా ఆమె గళం ఎత్తారు. సీపీఎం కార్యకర్తలు ఆమె మీద భౌతికదాడులకు కూడా పాల్పడిన సంగతి ఆమె ఇంతలోనే మరచిపోయారు. అప్పుడు సీపీఎం ఎలాంటి పాత్ర నిర్వహించిందో ఇప్పుడు మమత నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ అదే పాత్రను నిర్వహిస్తున్నది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్‌ ప్రాంతంలో ఒక బీజేపీ కార్యాలయాన్ని ఆ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.

ఇవన్నీ ఎలా ఉన్నా రాజీవ్‌ కుమార్‌ నీతి నిజాయితీల మీద ఆమెకు ఉన్న గౌరవ ప్రపత్తులను చూస్తుంటే ఎవరికైనా మతి పోతుంది. నాలుగో తేదీన ఆమె మాట్లాడుతూ, ‘ఆ అధికారిని రక్షించుకోవడానికి ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను’ అన్నారు. ఒక ముఖ్యమంత్రి, నగర పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న పోలీసు ఉన్నతోద్యోగి గురించి ఇలాంటి స్థాయి వ్యాఖ్య చేయడం ఎప్పుడూ ఎవరూ విని ఉండరు. ఆ అవకాశం మమతా బెనర్జీ ఈ దేశానికి కల్పించారు. గడచిన వారం పదిరోజులలోనే మమత బీజేపీ పట్ల, ఆ పార్టీ నాయకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తేనే ఆమె ఎంతటి ప్రజాస్వామ్య ప్రేమికురాలో, రక్షకురాలో అర్థమవు తుంది. పశ్చిమ బెంగాల్‌లో ప్రసంగించడానికి వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా హెలికాప్టర్‌ను ముప్పు తిప్పలు పెట్టిన తరువాత మాత్రమే దిగేందుకు అవకాశం ఇచ్చారు. తరువాత స్మృతి ఇరానీ ప్రసంగించడానికి వచ్చినప్పుడు అసలు ఆమె హెలికాప్టర్‌ను దిగడానికి కూడా అనుమతించలేదు. తరువాత ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ హెలికాప్టర్‌కు కూడా అదే గతి పట్టించారామె. బీజేపీ తలపెట్టిన ప్రదర్శనలను ఆమె నిషేధించారు. కానీ చిత్రం ఏమిటంటే ఇప్పుడు మమతా బెనర్జీ అనే స్త్రీ మీద బీజేపీ జులుం చేస్తున్నదట. మరీ స్మృతి ఇరానీ పట్ల బెనర్జీ వైఖరికి ఏం పేరు పెట్టాలి?

యథాప్రకారం ఫిబ్రవరి 4న ‘సీబీఐ వైఖరికి’ నిరసనగా విపక్షాలు పార్ల మెంట్‌ను స్తంభింపచేశాయి. వాయిదా పడేటట్టు చేశాయి. ఇదెలా జరిగిందంటే మమతకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా తెలుగదేశం సహా చాలా విపక్షాలు సంఘీభావం తెలియచేశాయి. ఆ సందర్భంలో ¬ంమంత్రి చేసిన ప్రకటన కీలకమైనది. ‘ఇది అసాధారణ ఘటన. చట్టాలు అమలు చేసే విభాగాల మధ్య వివాదం తలెత్తడం సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధం. అరాచకానికి దారి తీస్తుంది. శారద కుంభకోణంలో దర్యాప్తునకు సహకరించని కోల్‌కతా పోలీసు కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను చట్టబద్ధంగా విచారించడానికి ఆయన ఇంటికి వెళ్లిన సీబీఐని అడ్డుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తవచ్చు. దేశంలోని ఏ ప్రాంతంలో అయినా సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. ఆదివారం జరిగిన సంఘటనలు రాజ్యాంగ సంక్షోభాన్నే సూచిస్తున్నాయి’ అని రాజ్‌నాథ్‌ వివరించారు. అలాగే పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠి కేంద్రానికి నివేదికను కూడా పంపించారు. మమతా బెనర్జీ సీబీఐని అడ్డు పెట్టుకుని నిరసనకు దిగి ఉండవచ్చు. ఈ ధర్ణా ఉద్దేశం రాజకీయం కాదని ఆమె చెప్పవచ్చు. ఈ మాటను ఎవరూ విశ్వసించ లేరు. తాము సీబీఐని అడ్డుపెట్టు కుని మోదీ మీద, బీజేపీ మీద ధ్వజమెత్తడమే ఆమె తాజా రగడ వెనుక ఉన్న లక్ష్యం. ఒక ముఖ్యమంత్రి రోడ్డు మీద తిష్ట వేసి ఐదు రోజుల పాటు పాలన సాగిస్తానని చెప్పడం ఎంత అప్రజాస్వామకమో ఆమె గ్రహించే స్థితిలో లేరు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి సీట్లు పెరుగుతున్నాయన్న సర్వేలే ఆమెను గాబరాకు గురి చేశాయి. ఇలాంటి చర్యలు బీజేపీకి మరింత మెరుగైన అవకాశాలను కల్పించడానికే పనికి వస్తాయి. ఇందుకు ఆమె ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అన్న సంగతి మరచిపోయి వీధి పోరాట యోధుల్లా వ్యవహ రిస్తున్నారు.

ఈ వివాదం మీద సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజీవ్‌కుమార్‌ను మరొకచోటికి తీసుకువెళ్లి విచారించవలసిందని సుప్రీంకోర్టు ఫిబ్రవరి ఐదో తేదీన ఆదేశించింది. షిల్లాంగ్‌లో విచారించవచ్చునని కోర్టు సూచించింది. ఇది మమతకు చెంపపెట్టు. అయినా ఆమె తన విజయంగా చెప్పుకోవడమే విచిత్రం. అక్కడ రాజ్యాంగ యంత్రాంగం ఛిన్నాభిన్నమైందన్న కేంద్ర ¬ంమంత్రి వ్యాఖ్యతో కోర్టు ఏకీభవించినట్టు కాదా?

మోదీనీ, బీజేపీనీ విమర్శించేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా విడిచిపెట్టకుండా ఉపయోగించు కోవాలని చూస్తారు రాహుల్‌ గాంధీ. ఈ ఉదంతం విషయంలోను అదే జరిగింది. దేశంలోని ప్రతిపక్షా లన్నింటి తరఫున ఆయన మమతకు భరోసా ఇచ్చేశారు. అన్ని ప్రతిపక్షాలు మీ వెనుక ఉన్నాయి అని ఫోన్‌ చేసి చెప్పారు. కోల్‌కతాలో తాజాగా జరిగిన రగడ కూడా వ్యవస్థ విధ్వంసం కొనసా గింపులో భాగమేనని యథా ప్రకారం తన పాత పాట పాడారాయన. ఆయన పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ మనుసింఘ్వి కూడా రాహుల్‌కు కోరస్‌ పాడారు. కానీ పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌ నాయకుడు, బెర్హంపూర్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌధురి అభిప్రాయం మమతకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. ‘మా అధిష్ఠానం మనుసులో ఏముందో నాకు తెలియదు. నేను మాత్రం రాష్ట్రంలో (పశ్చిమ బెంగాల్‌) రాష్ట్రపతి పాలన విధించాలని కోరు కుంటున్నాను’ అన్నారా యన. పైగా ఢిల్లీలో ఉండగానే ఆయన చెప్పారు. రంజన్‌ పశ్చిమ బెంగాల్‌ మాజీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కూడా. కానీ, చివరికి ఆ రెండు పార్టీలు కలసిపోతాయని కూడా ఆయన ఓ మాట అన్నారు. ఇదొక రకం రాజకీయమే తప్ప మరొకటి కాదు.

ఈ దేశాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నారు? అంటూ చంద్రబాబు, మమత, అఖిలేశ్‌ వంటివారు మోదీని ప్రశ్నించడం కాదు. వారికి నిజంగా వ్యవస్థల మీద, రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద మమకారం ఉంటే మమతను ప్రశ్నించాలి. ఆ వ్యవస్థలన్నింటిలో మరణ మృదంగం మోగిస్తున్న వారు మమతా బెనర్జీయే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *