విపత్కర వాతావరణంలో విషపూరిత బాణాలు..

విపత్కర వాతావరణంలో విషపూరిత బాణాలు..

పుల్వామా దుశ్చర్య, మన దేశ మెరుపు దాడులు ఘటనలను అడ్డం పెట్టుకొని అధికార పార్టీని విమర్శించడం ద్వారా విపక్షాలకు కలిగే రాజకీయ ప్రయోజనం ఏ మేరకు ? అన్నది పక్కన పెదడాం. వీరి విమర్శలు దేశ ప్రయోజనాలకు భంగకరం అన్నది సుస్పష్టం. బాధ్యత కల రాజకీయ, రాజ్యాంగ పదవులలో ఉన్న వీరు ఇటువంటి బాధ్యతారహిత ప్రకటనలు చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు; ముఖ్యంగా పాకిస్తాన్‌కు, వారు పెంచి పోషిస్తున్న ఉగ్రమూకలకు ఎటువంటి సందేశం ఇస్తునట్లు?

ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టదో దారి అన్నట్లుంది కాంగ్రెస్‌ వంటి విపక్షాల వ్యవహారం. పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్రవాదుల దుశ్చర్య, ఆ తర్వాత మన వైమానిక దళం పాకిస్థాన్‌పై జరిపిన వీరోచిత దాడిపై దేశమంతా ఒక్కతాటిపై నిలిస్తే విపక్షాలకు చెందిన కొందరు నాయకులు మాత్రం ఇందులో రాజకీయ కోణం చూసుకుంటున్నారు. మన శత్రు దేశానికి ప్రయోజనం కలుగుతుందనే స్పృహ కూడా లేకుండా చౌకబారు విమర్శలు గుప్పిస్తున్నారు. 2016లో పాక్‌పై భారత్‌ జరిపిన మెరుపు దాడుల గురించి అనుమానాలు వ్యక్తం చేసిన విపక్షాలు, తాజా మెరుపు దాడులపై కూడా అదే ధోరణి అవలంబిస్తున్నాయి. మెరుపు దాడులని చెపుతూ సైన్యం విజయాలను మీ రాజకీయల కోసం వాడుకోవద్దు అంటూ వారే మొదట రాజకీయ డ్రామాకు తెరతీశారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటువంటి తీరును ప్రదర్శించడంలో ముందున్నారు. ఈ నాయకుల తీరును ప్రజలు ఏవగించుకుంటున్నారు.

ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాద సమస్యను పెనుముప్పుగా భావిస్తున్నాయి. ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇచ్చే దేశాలను ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాద ఘటనలను వ్యతిరేకించడంలో ఐక్యతను ప్రదర్శిస్తున్నాయి. విచిత్రంగా మన దేశంలో మాత్రం కొన్ని రాజకీయ పార్టీలకు దేశహితం కన్నా తమ స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమైపోయాయి.

పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తున్న జైషే మహ్మద్‌ సంస్థ జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న వాహన శ్రేణులపై హేయమైన దాడికి పాల్పడటం, ఆ ఘటనలో 40 మందికిపైగా జవాన్లు అమరులు కావడం తెలిసిందే. ఈ దారుణాన్ని దేశ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి మరీ నిరసించారు. పాకిస్థాన్‌ దుశ్యర్యను ఖండిస్తూ ఆ దేశ పతాకం, దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉగ్రదాడికి కారణమైన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని, వారికి గట్టి గుణపాఠం చెబుతామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు. ఇందుకోసం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన సైన్యం పుల్వామా దాడిలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పుల్వామా ఘటన జరిగిన 12వ రోజున భారత వైమానిక దళం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ దాటి పాక్‌ అధికార భూభాగం లోకి దూసుకెళ్లి, అక్కడి ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. బాంబులు కురిపించి, నేలమట్టం చేసింది. ఈ దాడిలో దాదాపు 350 మంది ఉగ్ర మూకల ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. మన వైమానిక దళం చేపట్టిన ఈ దాడులపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రజలంతా జాతీయ పతాకాలు పట్టుకొని ఊరేగింపులు జరిపి, మిఠా యిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. మరునాడు మన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను పాకిస్థాన్‌ అదుపులోకి తీసుకోగా, ప్రజలు అదే స్థాయిలో పాకిస్థాన్‌ పట్ల నిరసనలు వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ దౌత్యం ఫలించి పాక్‌పై అంతర్జాతీయంగా వత్తిడి పెరిగింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో అభినందన్‌ను తిరిగి మనకు అప్పగించారు. దేశమంతా అభినందన్‌కు ఘన స్వాగతం పలికింది. దేశమంతా ఒకతాటిపై నిలిచి శతృదేశం దుశ్చర్యలను నిరసించారని చెప్పడానికి ఇవన్నీ స్పష్టమైన సంకేతాలు

సంకుచిత రాజకీయం

దేశ ప్రజలంతా పాకిస్తాన్‌పై ఆగ్రహంతో రగిలిపోతున్న సమయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు ప్రవర్తించిన తీరు ఆశ్యర్యాన్ని కలిగించింది. పుల్వామా ఉగ్రదాడి, వైమానిక దళ ఎదురుదాడి ఘటనల్లో వారికి రాజకీయమే కనిపించింది. బహుశా అధికారంలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందనే ఆందోళనే వారి భయానికి కారణం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన సైన్యానికి స్వేచ్ఛ ఇవ్వడం, వైమానిక దళం ఎంతో తెగువతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులను చేపట్టినప్పుడు వారిని అభినందించడం విపక్ష నేతలకు రాజకీయంగా కనిపిస్తోంది. ప్రధాని పదవిలో ఉన్న మోదీ ఈ దాడులను స్వయంగా పర్యవేక్షించడం, సైన్యం శక్తి యుక్తులపై ప్రశంసలు కురిపించడం వారిని ఆందోళనకు గురి చేసింది. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు మన సైనిక దళాలు సాధించిన విజయంపై సంబరాలు జరుపుకోడాన్ని ఈ నాయకులు సహించలేకపోతున్నారు.

ప్రధాని మోదీ సైన్యాన్ని వ్యక్తిగత ఆస్తిగా వాడుకుంటున్నారని, మెరుపు దాడులపై రాజకీయం చేస్తున్నారని రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. యూపీఏ హయాంలోకూడా మెరుపుదాడులు చేపట్టినా గోప్యత పాటించామని అన్నారు. మరి శత్రువుపై దాడి చేసిన అంశాన్ని అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటో చెప్పలేదు. భారత వైమానిక దళం జరిపిన దాడిలో తమకు ఎలాంటి నష్టం కలగలేదని పాకిస్తాన్‌ చేసిన ప్రకటనను కాంగ్రెస్‌ నాయకులు మనీష్‌ తివారీ, కపిల్‌ సిబల్‌, చిదంబరం ప్రముఖంగా ప్రస్తావిస్తూ బీజేపీపై ఎదురు దాడికి దిగారు. వారు శత్రుదేశం సమాచారాన్నే విశ్వసిస్తూ, మన ప్రభుత్వం, సైన్యం చేపట్టిన చర్యలపై అనుమానం ప్రదర్శిస్తున్నారు. ఇటువంటి ధోరణి సైన్యాన్ని అవమానించడమే అవుతుంది.

ఇక మమతా బెనర్జీ వ్యాఖ్యలు మరింత బాధ్యతా రహితంగా ఉన్నాయి. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం లోక్‌సభ ఎన్నికలకు ముందు పాకిస్థాన్‌పై దాడికి దిగిందని ఆరోపిస్తున్నారామె. జవాన్లకు రక్షణ కల్పించకుండా, వారి శవాలపై రాజకీయం చేస్తున్నారని పసలేని విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో మత ఘర్షణలు సృష్టించేందుకే కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌పై షాడో యుద్ధానికి దిగిందని ఆరోపించారు. పుల్వామా దాడి నేపథ్యంలో నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ, ఇంటలిజెన్స్‌ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇది నిఘా వైఫల్యం అని ఆరోపించారు. మమతా బెనర్జీ ఇలా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డారో లేదో, వెంటనే చంద్రబాబు నాయుడు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ రంగంలోకి దిగారు. మమత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, పుల్వామా ఘటన వెనుక రాజకీయ లబ్ది దాగి ఉందా? అంటూ అనుమానం ప్రదర్శించారు. ప్రధాని మోదీ దేనికైనా సమర్దుడేనని చెపుతూ, పుల్వామా దాడితో తమకు సంబంధం లేదన్న పాకిస్థాన్‌ ప్రధాని ప్రకటనను ప్రస్తావించారు. పుల్వామా ఘటనకు నైతిక బాధ్యత వహించి మోదీ రాజీనామా చేయాలని అర్థం లేని డిమాండ్‌ ఒకటి చేశారు.

దిగజారుడు వ్యాఖ్యలు

రాహుల్‌ గాంధీ, మమతాబెనర్జీ, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజనులతో సహా దేశ ప్రజలంతా మండిపడ్డారు. మన శత్రుదేశం దొంగచాటుగా మన జవాన్లను బలి తీసుకుంటే, శత్రువుకు మద్దతుగా మీ దిగజారుడు మాటలు ఏమిటంటూ నిలదీశారు. పుల్వామా దాడి ఘటనలో ఇంటలిజెన్స్‌ వైఫల్యాన్ని ప్రస్తావించడంలో ఎలాంటి తప్పు లేదు. నిర్మాణాత్మక రాజకీయ పార్టీగా ప్రశ్నించాల్సిందే. కానీ పాకిస్థాన్‌ దురాగతాన్ని ప్రశ్నించాల్సిన సమయంలో ఆ దేశ ప్రధాని వ్యాఖ్యలతో ఏకీభవించే ప్రయత్నం చేయటం దేనికి సంకేతం ? వీరికి తమ స్వార్థ ప్రయోజనాలు, దుష్ట రాజకీయాలు తప్ప దేశ ప్రయోజనాలు, ప్రజల మనోభావాలు పట్టవా? ఇదేనా వీరి సీనియారిటీ ? జవాన్ల త్యాగాలను మసకబారుస్తూ ఇంత నీచంగా మాట్లాడుతున్న వీరేం సీనియర్‌ రాజకీయ నాయకులు? పుల్వామా ఘటనకు నైతిక బాధ్యత వహించి ప్రధాని రాజీనామా చేయడం సమంజసం అనిపిస్తే, రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట మృతికి ఎవరు బాధ్యత వహించి రాజీనామా చేయాలో కూడా చెబితే బాగుండేది.

దేశ ప్రయోజనాలను మరిచిపోయారు

పుల్వామా, వైమానిక దాడి ఘటనలను అడ్డం పెట్టుకొని అధికార పార్టీని విమర్శించడం ద్వారా విపక్షాలకు కలిగే రాజకీయ ప్రయోజనం ఏ మేరకు? అన్నది పక్కన పెదడాం. వీరి విమర్శలు దేశ ప్రయోజ నాలకు భంగకరం అన్నది సుస్పష్టం. వారి ప్రకటనలు పాకిస్థాన్‌ ప్రభుత్వం, ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులకు వత్తాసు పలికినట్లే కనిపిస్తున్నాయి. బాధ్యత కల రాజకీయ నాయకునిగాను, రాజ్యాంగ పదవులలోనూ ఉన్న వీరు ఇటువంటి బాధ్యతారహిత ప్రకటనలు చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా పాకిస్తాన్‌కు ఎటువంటి సందేశం ఇచ్చినట్లు? మోదీ ప్రభుత్వం రాజకీయం కోసం పాకిస్థాన్‌పై యుద్ధానికి దిగుతోందనే ప్రచారం అంతిమంగా మన శత్రుదేశాలకే ఆయుధంగా ఉపయోగపడుతోంది. మన అనైక్యత ద్వారా ప్రపంచ దేశాల ముందు మనం చులకన అవుతున్నాం అనేది వీరికెందుకు తోచదు! దేశాన్ని పాలిస్తున్న భాజపా రాహుల్‌గాంధీ, చంద్రబాబు, మమతకు రాజకీయంగా శత్రువు కావచ్చు. విధాన పరంగా వ్యతిరేకించడాన్ని తప్పు పట్టలేం. కానీ దేశ భద్రత, రక్షణ విషయాలలో అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై నిలిచి ఐక్యత చాటాల్సిన అవసరం; తమకు దేశహితమే ముఖ్యమనే సందేశాన్ని ప్రజలకు ఇతర దేశాలకూ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా, వారు తీసుకునే చర్యలకు నిర్మాణాత్మక సూచనలతో మద్దతు ఇవ్వాలి. సీనియర్లం అని చెప్పుకునే ఈ నాయకులకు ఈమాత్రం ఇంగితం లేకపోవడం దురదృష్టకరర.

– క్రాంతిదేవ్‌ మిత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *