బెడిసికొట్టిన బెదిరింపు

బెడిసికొట్టిన బెదిరింపు

ఈసారి పాకిస్తాన్‌ పెద్ద తప్పిదానికే పాల్పడింది. ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామాలో నలభయ్‌ మంది భారత సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల ప్రాణాలు బలిగొని కనీవినీ ఎరుగని రీతిలో విమర్శల పాలైంది. మా సహనానికీ హద్దుంటుందని భారత్‌ సరిహద్దులలోని నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ధ్వంసం చేసింది. దీనితో కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న భారత్‌ విదేశాంగ విధానం కొత్త పంథాలోకి మారిపోయింది. పుల్వామా దాడి, తదనంతరం భారత్‌ ప్రతీకార దాడి, దరిమిలా ప్రపంచ దేశాల వైఖరి పాకిస్తాన్‌ను మునుపెన్నడూలేని రీతిలో ఏకాకిని చేసేశాయి. చైనా కూడా ఈసారి పాకిస్తాన్‌ను రక్షించలేకపోయింది. యుద్ధ వాతావరణం నెలకొన్నా కూడా కాలు దువ్వే సాహసం చేయలేదు పాకిస్తాన్‌. తాను తీసుకున్న గోతిలో తానే పడింది పొరుగు దేశం. సైన్యం గెలిపించిందని కూడా చూడకుండా ప్రజాప్రతినిధులు పార్లమెంటులోనే అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కానీ ఈ అంశంలో భారత్‌ వైఖరిని పరదేశాలు అర్థం చేసుకున్నట్టు మన ప్రతిపక్షాలు అర్థం చేసుకోలేకపోవడం మొత్తం ఉదంతానికి కొసమెరుపు.

పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రవాద దాడి దేశ ప్రజానీకంలో తీవ్ర ఆగ్రహావేశాలు కలిగించింది. ఉగ్రదాడికి సిఆర్‌పిఎఫ్‌ సిబ్బందిలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. దీనితో దేశం మొత్తంలో ఎన్నడూ లేని ప్రతిస్పందన కనిపించింది. ఎంతటి ఆగ్రహం ఉన్నప్పటికి దేశ ప్రజానీకం ప్రభుత్వం తీసుకునే చర్యల కోసం మౌనంగా, సహనంతో వేచి చూశారు. ఉగ్రదాడి జరిగిన 100 గంటలలోపే ఆ దాడికి ప్రధాన సూత్రధారి అయిన కమ్రాన్‌ అలియాస్‌ ఘాజీ రషీద్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చాయి. కొన్నిగంటలపాటు సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మేజర్‌ తోపాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. పుల్వామా దాడికి తప్పక ప్రతీకారం చేస్తామని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

దశాబ్దాలుగా పాకిస్తాన్‌ సాగిస్తున్న పరోక్ష యుద్ధం దుష్ఫలితాలను భారత్‌ మౌనంగా భరిస్తూ వచ్చింది. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు మాత్రం సాక్ష్యాధారాలు చూపిస్తే దోషులను శిక్షిస్తామంటూ పాకిస్తాన్‌ కల్లబొల్లి మాటలు చెపుతూ వచ్చింది. పాక్‌ కపట నాటకం తెలిసినప్పటికి భారత్‌ అనేక సందర్భాల్లో సాక్ష్యాధారాలు చూపుతూనే ఉంది. భారత్‌ అందించిన సాక్ష్యాధారాల ఫైళ్లు గుట్టలుగా పేరుకుని, దుమ్ముకొట్టుకుపోయాయి తప్ప పాక్‌ ఎప్పుడూ ఎవరి మీదా ఎలాంటి చర్య చేపట్టలేదు. పైగా ఎప్పటికప్పుడు కొత్త కుట్రతో భారత్‌లో అల్లకల్లోలం సష్టించడానికే ప్రయత్నించింది. భారత్‌ చూపిన సహనం పాక్‌కు అలుసైపోయింది. కానీ ఉరి దాడి తరువాత భారత సైన్యం చేపట్టిన సర్జికల్‌ దాడులతో పాక్‌ ఉలిక్కిపడింది. అయితే తాత్కాలికమే. అయినా తన పాత పద్ధతిని మాత్రం మార్చుకోలేదు.

పుల్వామా దగ్గర భద్రతా దళాలపై జరిగిన ఉగ్రదాడి చాలా తీవ్రమైనది, ఇప్పటివరకు కనీవినీ ఎరుగనిది. దీనికి ప్రతీకారంగా సైనిక చర్యతో పాటు పాకిస్థాన్‌ మీద ఆర్ధిక, దౌత్య, వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలని భారత్‌ నిర్ణయించుకుంది. పుల్వామా దాడి తరువాత కొన్ని రోజులకే పాక్‌కు అత్యంత’ ప్రాధాన్య దేశం’ హోదాను భారత్‌ ఉపసంహరించు కోవడమేకాక పొరుగు దేశం నుంచి వచ్చే వస్తువులపై 200 శాతం పన్ను విధించింది. ఆ విధంగా సంక్షోభంలో ఉన్న పాక్‌ ఆర్ధిక వ్యవస్థను మరింత బలహీనపరచే చర్యలు చేపట్టింది. ఇలా వాణిజ్యాన్ని నిలిపివేయడం ద్వారా పాకిస్తాన్‌లో ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేయగలిగింది. ఎందుకంటే పాక్‌ నుంచి ప్రధానంగా వచ్చే సిమెంట్‌, ఎరువులు అక్కడ సైన్యం అధీనంలో ఉన్న కర్మాగారాలలో తయారవుతాయి. ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌కు 13 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం ఆగిపోవడం అంటే మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లే. అలాగే తూర్పు నదుల నుంచి తన వాటా నీటిని వెళ్లకుండా నిలిపేయాలని కూడా భారత్‌ నిర్ణయించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నివేదిక ప్రకారం తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్న దేశాల్లో మూడవ స్థానంలో ఉన్న పాక్‌కు ఈ నిర్ణయం ఆందోళన కలిగించేదే. ఆ దేశం సాగిస్తున్న పరోక్ష యుద్ధం, దానివల్ల జరుగుతున్న నష్టాన్ని భారత్‌ ప్రపంచ దష్టికి తీసుకువెళ్లడంలో విజయం సాదించింది. దీనితో ఐక్యరాజ్య సమితి భద్రతామండలి పాక్‌ కేంద్రంగా జైష్‌ ఏ మహమ్మద్‌ సాగిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలను తీవ్రంగా ఖండించింది. ఇది భారత్‌కు గొప్ప దౌత్య విజయం. దౌత్యపరంగా పాక్‌ను ఏకాకిని చేసే ప్రయత్నాలలో భాగంగా పఠాన్‌కోట్‌ దాడికిగాను జైషే సంస్థతో పాటు, దాని కమాండర్లు, మసూద్‌ అజర్‌, అతడి బంధువులు అబ్దుల్‌ రవూఫ్‌ అస్ఘర్‌, ఇబ్రహీం అతర్‌, షాహిద్‌ లతీఫ్‌ల మీద నిషేధాన్ని విధించాలంటు ఫ్రాన్స్‌ భద్రతామండలిలో తీర్మానం ప్రవేశపెట్టింది.

పాకిస్తాన్‌కు హెచ్చరికగా దేశంలో ఉన్న ఆ దేశ సానుభూతిపరులు, మద్దతుదారులపై కూడా భారత్‌ చర్యలు చేపట్టింది. 155మంది కశ్మీరీ వేర్పాటు వాదులకు భద్రత తొలగించింది. అలాగే జమ్ము కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ నేత యాసీన్‌ మాలిక్‌, జమాత్‌ ఈ ఇస్లామీ నేతలను అదుపులోకి తీసుకుంది. 100 కంపెనీల అదనపు బలగాలను లోయకు తరలిం చింది. జె కె ఎల్‌ ఎఫ్‌ నాయకుల ఇళ్లపై దాడులు చేసి, సోదాలు జరిపిన జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్‌ఐఎ) వీరికి పాకిస్తాన్‌ ఏజెంట్లకు మధ్య జరిగిన హవాలా లావాదేవీల ఆధారాలను సేకరించింది.

పుల్వామా దాడి జరిగిన తరువాత సరిగ్గా 13వ రోజున భారత వైమానిక దళానికి చెందిన విమానాలు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు, నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. 1971 యుద్ధం తరువాత మొదటిసారిగా భారతీయ సైనిక విమానాలు పాకిస్తాన్‌లో ప్రవేశించి దాడులు నిర్వహించాయి. కార్గిల్‌ యుద్ధ సమయంలో కూడా యుద్ధ విమానాలు వాస్తవాధీన రేఖ దాటి వెళ్లలేదు. అధికారిక సమాచారం ప్రకారం 1000 కిలోల పేలుడు పదార్ధాలతో 12 మిరాజ్‌ 2000 విమానాలు జైషే, లష్కరే, హిజాబుల్‌ స్థావరాలపై దాడులు చేశాయి. ఈ దాడులు 21 నిముషాల్లో ముగిశాయి. యుద్ధ విమానాలు తెల్లవారు ఝామున 3.45 గంటలకు బాలాకోట్‌ పై, 3.48 గం.లకు ముజాఫరాబాద్‌, 3.58 గం.లకు చకోటి పై దాడి చేశాయి. భారత వైమానిక దళంలో ఉన్న ప్రధాన అస్త్రంగా భావించే మిరాజ్‌ విమానాలు కార్గిల్‌ యుద్ధ సమయంలో కూడా కీలక పాత్ర పోషించాయి. లేజర్‌ బాంబులతో కూడిన ఆధునికరించిన మిరాజ్‌లు ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడి పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం చేశాయి.

ఖైబర్‌పక్తున్‌ వా ప్రాంతంలో ఇస్లామాబాద్‌కు 185 కి.మీ. దూరంలో, నియంత్రణ రేఖకు 50 కి.మీ. దూరంలో ఉన్న బాలాకోట్‌ ప్రధాన ఉగ్రవాద కేంద్రం. ఒకప్పుడు సిక్కు సామ్రాజ్యాన్ని సవాలు చేసి ఖలీఫాను స్థాపించడానికి ప్రయత్నించిన, పిడివాద దేవబంద్‌ సిద్ధాంతాన్ని ప్రవచించిన సయ్యద్‌ అహ్మద్‌ బరేల్వి ఈ బాలాకోట్‌ నే స్థావరంగా చేసుకుని పని చేశాడు. బాలకోట్‌ యుద్ధంలోనే రాజా రంజిత్‌ సింగ్‌ సేనలు దేవబంద్‌ సైన్యాన్ని ఓడించాయి. ఇక్కడే కొండపై జైషే ఉగ్రవాద శిక్షణా కేంద్రం ఉంది. ఇందులో ఆత్మాహుతి దళాలకు శిక్షణనిస్తారు.

ఇంతకుముందు పద్ధతికి భిన్నంగా వైమానిక దాడుల గురించి భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్‌ అబద్ధాలను బయటపెడుతూ మసూద్‌ అజర్‌ నేతత్వంలోని జైషే సంస్థ బహవల్‌పూర్‌్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఈ సంస్థే పుల్వామాతో పాటు పఠాన్‌కోట్‌, 2001 పార్లమెంట్‌ దాడులకు కూడా కారణమని విదేశాంగ శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఉగ్రవాద సంస్థ గురించి, అది సాగిస్తున్న కార్యకలాపాల గురించి గతంలో ఎన్ని సాక్ష్యాధారాలు ఇచ్చినా పాకిస్తాన్‌ మాత్రం జైషేను అదుపుచేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరిన్ని ఆత్మాహుతి దాడులు నిర్వహించడానికి జైషే సిద్ధపడుతున్నట్లుగా గూఢచారి సమాచారం అందిన మీదట భారత్‌ కేవలం ఉగ్రవాద స్థావరాలపై ముందస్తు, నివారణ దాడులను నిర్వహించింది. ఆత్మరక్షణ నిమిత్తం ఇలాంటి దాడులు జరపవచ్చనే ఐక్యరాజ్యసమితి చార్టర్‌ ప్రకారం బాలాకోట్‌ స్థావరంపై దాడులు నిర్వహించినట్లు స్పష్టం చేసింది. ఈ దాడుల్లో మసూద్‌ అజర్‌ బంధువు, బాలాకోట్‌ ఉగ్ర స్థావరాన్ని నిర్వహిస్తున్న మౌలానా యూసుఫ్‌ అజర్‌తో పాటు అనేకమంది శిక్షకులు, కమాండర్లు, ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఉగ్ర స్థావరం పూర్తిగా నేలమట్టమయింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే తమ సంకల్పాన్ని మరోసారి ప్రకటించిన భారత్‌ ఈ దాడులను సమర్ధించుకుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు తమ భూభాగాన్ని ఉపయోగించుకో నివ్వమని గతంలో ఇచ్చిన హామీని పాకిస్తాన్‌ నిలబెట్టు కోవాలని 2004లోనే భారత్‌ కోరింది. కానీ అప్పటి నుంచి పాకిస్థాన్‌ ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

కేవలం అంతర్జాతీయ వేదికలపై ఫిర్యాదులు చేయడంతోనే తప్తి పడకుండా అవసరమైతే అనుకున్న సమయానికి, ఎంచుకున్న లక్ష్యం మీద దాడులు కూడా నిర్వహిస్తామని ఈ వైమానిక దాడుల ద్వారా భారత్‌ స్పష్టం చేసింది. పాకిస్తాన్‌లోనూ, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోనూ ఉన్న ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసిన భారత్‌ అవసర మైతే సరిహద్దు దాటి ఉగ్ర శిబిరాలపై దాడి చేస్తామని హెచ్చరించింది. అంతేకాదు వైమానిక దాడుల గురించి ప్రకటన జారీ చేయడం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టిపరిస్థితిలోను సహించేది లేదని, దానికోసం ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనని తేల్చి చెప్పింది. అణుబాంబులు ఉన్నాయంటూ పదేపదే పాకిస్తాన్‌ చేసే బెదిరింపులకు వెనక్కు తగ్గేది లేదని చెప్పింది.

పుల్వామా దాడుల తరువాత ఉరి తరహా సర్జికల్‌ దాడులు జరిగే అవకాశం ఉందని ముందే పసిగట్టిన పాకిస్తాన్‌ భద్రతను చాలా కట్టుదిట్టం చేసింది. అయినా పాకిస్తాన్‌ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లిన భారత యుద్ధ విమానాలు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి సురక్షితంగా తిరిగివచ్చాయి. ఉగ్ర శిబిరాలను పూర్తిగా నేలమట్టం చేసిన విమానాలు జనావాసాలకు ఏమాత్రం నష్టం కలగకుండా తమ ఆపరేషన్‌ పూర్తిచేశాయి. ఇది భారత వైమానికదళ నైపుణ్యాన్ని, భారత దేశపు పరిణతి చెందిన ధోరణిని ప్రపంచానికి తెలియ జేసింది. ఈ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్‌ ప్రతిదాడులు చేయాలని భావించినా భారత్‌లో ఎలాంటి ఉగ్రవాద స్థావరాలు లేవు. మిలటరీ, పౌర లక్ష్యాలపై దాడి అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధం కాబట్టి ప్రపంచ దేశాల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.

పాకిస్తాన్‌ను దారికి తెచ్చేందుకు భారత్‌ బహుముఖమైన వ్యూహాన్ని అనుసరించాలి. వైమానిక దాడులతో భారత్‌ ధోరణి, వ్యూహంలో వచ్చిన మార్పును స్పష్టం చేస్తున్నాయి. అయితే రాజకీయ పార్టీలే ఈ మార్పును ఒప్పుకోలేకపోతున్నాయి. ముంబై దాడుల తరువాత కూడా వైమానికదళం ఇలాంటి దాడుల ప్రణాళికనే అప్పటి యూపిఏ ప్రభుత్వం ముందుంచింది. కానీ అప్పటి ప్రభుత్వం అందుకు అనుమతినివ్వలేకపోయింది. అలాగే 1981- 1983 మధ్య కాలంలో కూడా ఇలాంటి దాడులనే నిర్వహించాలని ప్రభుత్వం భావించినా ధైర్యం చేయలేకపోయింది. పుల్వామా దాడి తరువాత ఫిబ్రవరి 15న భద్రతపై కేబినెట్‌ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశం తరువాత పుల్వామా దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. సరిగ్గా 12 రోజుల తరువాత ఉగ్రదాడికి ప్రతీకారం జరిగింది. సంయమనంతో భారత వైమానిక దళం కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేయడంతో, చైనా భయపడినట్లుగా పూర్తిస్థాయి యుద్ధానికి అది దారితీయలేదు. వైమానిక దాడులు నిర్వహించినట్లు భారత్‌ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఉగ్రవాదులను అదుపుచేయడంలో పాకిస్తాన్‌ వైఫల్యాన్ని ఎండగడుతూ ఆస్ట్రేలియా ప్రకటన జారీ చేసింది. వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆ దేశాన్ని కోరింది. పుల్వామా దాడిని ఖండించడంలో జాప్యం చేసిన చైనా ఉగ్ర స్థావరాలపై భారత్‌ దాడిచేయడాన్ని మాత్రం విమర్శించింది. సాంకేతిక కారణాలు చూపుతూ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా భద్రతామండలి ప్రకటించ కుండా అడ్డుపడుతున్న చైనా, ”ఉగ్రవాద శిబిరాలపై చర్యకు పాల్పడ్డామని భారత్‌ చెపుతున్నప్పటికీ, ఉగ్రవాదంపై పోరు ప్రపంచదేశాలన్నిటికి సంబంధిం చినది. అంతర్జాతీయ సహకారంతో దానిని సాగించాల్సిఉంటుంది. అందుకు తగిన వాతా వరణాన్ని భారత్‌ అంతర్జాతీయంగా ఏర్పరచడానికి కషి చేయాలి” అంటూ ఉపదేశాలు చేసింది. ఈ ప్రకటన ఉగ్రవాదంపై పోరుకు, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చర్య చేపట్టడానికి చైనా ఏమాత్రం సుముఖంగా లేదని చెప్పకనే చెపుతోంది.

– డా|| రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *