పటాలం ప్రతిష్ఠిస్తున్న ప్రధాని

పటాలం ప్రతిష్ఠిస్తున్న ప్రధాని

అంతా అనుకున్నట్లే పాకిస్తాన్‌ ఎన్నికలలో ఇమ్రాన్‌ఖాన్‌ విజేతగా నిలిచారు. కానీ విచ్చలవిడిగా రిగ్గింగ్‌, ఇతర అక్రమాలు జరిగాయన్న ఆరోపణల మధ్య ఇమ్రాన్‌ దేశ నాయకత్వం అందుకోబోతున్నారు. క్రికెట్‌ పిచ్‌ నుంచి ప్రధాని పీఠానికి సాగించిన ప్రయాణంలో ఇమ్రాన్‌ అనేకసార్లు తనను తాను మార్చుకున్నారు. అనేక ముసుగులు తొడుక్కున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయోనని ఎదురు చూస్తున్నది. కారణం.. ఆయనకు ఉన్న గందరగోళ, సందిగ్ధ ధోరణి, అనుభవ లేమి. ఇందువల్ల ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న పాకిస్థాన్‌ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.

కొన్ని హింసాత్మక సంఘటనల మధ్య పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. క్వెట్టాలోని ఒక పోలింగ్‌ బూత్‌లో బాంబు పేలి 31మంది చనిపోయారు. ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ ఐఎస్‌ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాదానికి పుట్టినిల్లు అయిన పాకిస్తాన్‌ ఇప్పుడు అదే తీవ్రవాదానికి బలి అవుతోంది. ఇదొక్కటే కాదు. ప్రచారవేళ మస్తుంగ్‌, పెషావర్‌, బన్నూ మొదలైన చోట్ల జరిగిన బాంబుదాడుల్లో వందకు పైనే ప్రాణాలు పోయాయి. ఒకవైపు పాకిస్తాన్‌ను తీవ్రవాద భూతం పీడిస్తుంటే, మరోపక్క ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అప్పులు, వాణిజ్యలోటు పెరిగిపోవడం, విదేశీమారక నిల్వలు తరిగి పోవడంతో ఏడు నెలల్లోనే పాకిస్తాన్‌ రూపాయి విలువ మూడుసార్లు పడిపోయింది. తీవ్రవాదులకు నిధులు సమకూర్చకుండా చర్యలు చేపట్టడంలో విఫలమైనందుకు ఆ దేశాన్ని ఆర్ధిక ఆంక్షలు, నిబంధనల (ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌) కింద గ్రే జాబితాలో చేర్చారు. దీనితో 15 నెలలలోపు 26 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేసి బ్లాక్‌ లిస్ట్‌లో చేరకుండా జాగ్రత్తపడతామని పాకిస్తాన్‌ ప్రకటించింది. హామీ అయితే చేసింది కానీ ఇప్పటి వరకు తీవ్రవాదులకు నిధులు అందకుండా దారులు మూసేందుకు పాక్‌ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సమాజంలో పాతుకు పోయిన జిహాది తీవ్రవాదులు ఆ దేశానికి సవాలుగా మారారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య సైన్యం, గూఢచారి, అధికార, న్యాయ విభాగాలతో కూడిన సైనిక పాలనావ్యవస్థ ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రధాని అభ్యర్ధిగా నిలబెట్టింది.

విచ్చలవిడిగా రిగ్గింగ్‌ జరిగిందన్న ఆరోపణల మధ్య అంతా అనుకున్నట్లే ఇమ్రాన్‌ఖాన్‌ విజేతగా నిలిచారు. ఎన్నడూ లేని విధంగా ఎన్నికల ఫలితాలు రెండు రోజుల ఆలస్యంగా ప్రకటించారు. ఆశ్చర్యకరంగా సైన్యం సమర్ధన ఉన్నప్పటికి, ఖాన్‌ పార్టీ (పాకిస్థాన్‌ తెహరీక్‌-ఎ-ఇన్సాఫ్‌.. పిటిఐ) కనీస మెజారిటీ (137 స్థానాలు) సాధించడంలో విఫలమైంది. రిగ్గింగ్‌ బాగా జరిగింది కాబట్టి ఎన్నికల ఫలితాలను తిరస్కరిస్తున్నట్లు అన్ని పార్టీలు ప్రకటించాయి. పారదర్శకమైన పద్ధతిలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే దేశవ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరించాయి కూడా. అంతిమ సమాచారం మేరకు మొత్తం 269 స్థానాలకుగాను 118 స్థానాల్లో విజయం సాధించిన ఖాన్‌కు చెందిన పిటిఐ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బలాన్ని కూడగట్టు కునేందుకు చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది. పిటిఐ నేతత్వంలోని సంకీర్ణంలో చేరే ప్రసక్తే లేదని రెండు ప్రధాన పార్టీలు పిపిపి, పిఎమ్‌ఎల్‌(ఎన్‌) స్పష్టం చేశాయి. ‘తాలిబాన్‌ ఖాన్‌’ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు సైన్యం ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా పౌరపాలనా వ్యవస్థను కూడా తమ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం సైన్యం చేస్తున్నది. ఇందుకు పంజాబ్‌ ప్రాంతం చాలా కీలకమైనది. అందుకే పంజాబ్‌లో గట్టి పట్టున్న పిఎమ్‌ఎల్‌(ఎన్‌) తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిటిఐ వ్యూహాలు రచిస్తోంది.

రెండవసారి సజావుగా ప్రభుత్వాన్ని మార్చ గలిగామని, స్వేచ్ఛాయుత, పారదర్శక పద్ధతిలో ఎన్నికలు నిర్వహించామని సైన్యం సంబరపడుతున్నా, ఎన్నికల ముందు భావప్రకటన స్వేచ్ఛను నియంత్రిస్తూ సైన్యం విధించిన నిబంధనలు, ఎన్నికల తీరు గురించి అమెరికాతో సహా యూరోప్‌ దేశాలు తమ అసంతప్తిని, సందేహాలను వ్యక్తం చేశాయి. సైన్యానిదే పూర్తి పెత్తనం కావడంతో 2018 ఎన్నికలు ఇంతకు ముందుకంటే ఎక్కువ నిరంకుశమైన, రహస్యమైన పద్ధతిలో జరిగాయి. భారీగా రిగ్గింగ్‌ జరిగింది. దేశంపై తిరుగులేని పట్టు సాధించాలనుకున్న సైన్యం ప్రయత్నాలను ముందునుంచి వ్యతిరేకిస్తున్న నవాజ్‌ షరీఫ్‌ను సైన్యం జైలుకు పంపింది. పాలనవ్యవస్థపై పట్టును నిలబెట్టు కునేందుకు, తిరిగి ఎన్నికల్లో విజయం సాధించడానికి నవాజ్‌ చేసిన ప్రయత్నాలను మొదట్లోనే తుంచేయడానికి గత సంవత్సరం న్యాయస్థానాల తిరుగుబాటును లేవదీసింది. సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందు పిపిపి (పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ)కి చెందిన ఆసిఫ్‌ జర్దారీ, అతని సోదరిపై అవినీతి ఆరోపణలు తెచ్చిన సైన్యం ఆ పార్టీ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించకుండా అడ్డుకుంది. ఇప్పటికే ప్రజల్లో ఆదరణ తగ్గిన పిపిపి దీనితో తమకు పట్టున్న సింధ్‌ ప్రాంతానికే పరిమితమయ్యింది. వారసత్వ రాజకీయాలకు చరమ గీతం పాడటంలో విజయం సాధించిన సైనిక పాలనాయంత్రాంగం తీవ్రవాద సంస్థలను బలపరచేందుకై ఎన్నికల్లో వాటి అభ్యర్ధులకు కూడా అవకాశం కల్పించింది. ఏకంగా 250 మంది తీవ్రవాదులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.

పోలింగ్ రోజున క్వెట్టా పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి

దాదాపు 30 సంవత్సరాలుగా పాకిస్తాన్‌లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సైన్యానిదే పైచేయి. పరిపాలనా యంత్రాంగం పూర్తిగా సైన్యం చేతిలోనే ఉంది. ఈసారి కూడా అదే జరిగింది. తమకు అనుకూలమైన, నగర ప్రాంతానికి చెందిన అభ్యర్ధి కోసం చూసిన సైన్యం నవాజ్‌ షరీఫ్‌ను ప్రోత్సహించింది. ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది. కానీ తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు, పాలనా వ్యవస్థపై పూర్తి పట్టు సాధించేందుకు షరీఫ్‌ ప్రయత్నించడంతో సైన్యం ఇప్పుడు కొత్తగా మరో అభ్యర్ధిని తెరపైకి తెచ్చింది. ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్న, రాజకీయాల్లో నిలబడేందుకు ఇబ్బంది పడుతున్న ఖాన్‌కు మద్దతిచ్చింది. అయితే రాజకీయాల్లోకి వచ్చిన రెండు దశాబ్దాల తర్వాతగాని ఖాన్‌కు ప్రధాని పీఠం ఎక్కే అవకాశం రాలేదు. నవాజ్‌ షరీఫ్‌ త్వరగానే అధికారం పొందగలిగారు. షరీఫ్‌, ఇమ్రాన్‌ఖాన్‌ల మధ్య మరికొన్ని పోలికలు ఉన్నాయి. ఇద్దరూ విదేశాల్లో చదుకున్నవారే. ఇద్దరికీ క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. క్రీడారంగంలో షరీఫ్‌ ముందుకు వెళ్లలేకపోయినా ఇమ్రాన్‌ఖాన్‌ మాత్రం పాకిస్తాన్‌కు ప్రపంచ కప్పు తెచ్చిపెట్టి క్రికెటర్‌గా విపరీతమైన ప్రజాభిమానాన్ని పొందగలిగారు.

మతమౌఢ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదివినప్పటికి దురదష్టవశాత్తు ఇమ్రాన్‌ఖాన్‌ ఈ ఎన్నికల్లో మతమౌఢ్య, పిడివాద సంస్థల మద్దతునే తీసుకున్నారు. ఇమ్రాన్‌ రాజకీయ ఆలోచనలు చాలా స్వేచ్ఛాయుతమైనవి, విశాలమైనవని పాశ్చాత్య ప్రపంచం భావిస్తు న్నప్పటికీ, నిజానికి అవి అంత విశాలమైనవి ఏమీ కావు. ఖాన్‌ ఎప్పుడూ తాలిబాన్‌ను సమర్ధిస్తూనే వచ్చారు. అలాగే తన పార్టీ అధికారంలో ఉన్న ఖైబర్‌ ఫక్తున్‌ ఖవా ప్రాంతంలో ఇస్లామిక్‌ మతమౌఢ్యాన్ని నూరిపోసే మదర్సాలకు ప్రభుత్వ నిధులు అందజేశారు. ఇప్పుడు అహమదియా వ్యతిరేక మూఢత్వాన్ని ప్రచారం చేసే నరహంతక బరేల్వి ముస్లిములను మంచి చేసుకుంటున్నారు.

క్రికెట్‌ పిచ్‌ నుంచి ప్రధాని పీఠానికి సాగించిన ప్రయాణంలో ఇమ్రాన్‌ఖాన్‌ అనేకసార్లు తనను తాను మార్చుకున్నారు. అనేక ముసుగులు తొడుక్కున్నారు. అతని గందరగోళ, సందిగ్ధ ధోరణి, అనుభవ లేమి వల్ల ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న పాకిస్థాన్‌ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. తీవ్రవాద భయం, దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్థ, అణు ఆయుధాలతో పెరుగుతున్న ముప్పు వంటి సమస్యల సుడిగుండంలో ప్రస్తుతం పాకిస్థాన్‌ చిక్కుకుని ఉంది. ఇప్పటివరకు ఇమ్రాన్‌ఖాన్‌ అవినీతి వ్యతిరేక, నీతివంతమైన రాజకీయ నేతగా ప్రజల ముందుకు వచ్చారు. కానీ అతని పార్టీకి నిధులు సమకూర్చిన వారు అంత నీతిమంతులేమీ కాదు. పారదర్శకత, స్వేచ్ఛా రాజకీయాల పేరుతో అందరికీ పార్టీ తలుపులు బార్లా తెరిచేసిన ఖాన్‌కు ముందు ముందు అసలు సమస్య ఎదురవుతుంది. ఏదో ఆశించి పార్టీలోకి వచ్చినవారు తమ డిమాండ్లు తీర్చాల్సిందే నని పట్టుపట్టడానికి సిద్ధమవుతున్నారు. అన్నింటికి మించి పాకిస్థాన్‌ సైన్యం చేతిలో ఖాన్‌ కీలుబొమ్మే అన్నది పచ్చి నిజం. షరీఫ్‌ స్థానంలో అతన్ని తెచ్చిపెట్టింది అక్కడి సైన్యం.

2008లో పర్వేజ్‌ ముషారఫ్‌ పాలన అంతమైన తరువాత ప్రజాపాలన వ్యవస్థను సైన్యం తిరిగి చేజిక్కించుకోకుండా అడ్డుకోవాలని పిఎంఎల్‌(ఎన్‌), పిపిపి పార్టీలు నిర్ణయించుకున్నాయి. దీనివల్లనే 2013లో అధికార బదలాయింపు శాంతియుతంగా, ఎలాంటి సమస్యలు లేకుండా జరిగిపోయింది. దానితో పాకిస్తాన్‌లో ప్రజస్వామ్యం స్థిరపడుతోందని అంతా ఆశించారు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇమ్రాన్‌ఖాన్‌ 2013 ఎన్నికలపై సందేహాలను లేవనెత్తారు. ఆ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ జరిగిందంటూ ఆరోపణలు సంధించారు. నిజానికి పాక్‌ చరిత్రలో 2013 ఎన్నికలే అత్యంత సజావుగా, పారదర్శకంగా జరిగాయని ప్రపంచం భావిస్తోంది. ఖాన్‌ లేవదీసిన అలజడి చివరికి అరాచకంగా మారి అల్లరి మూకలు పార్లమెంట్‌ను ముట్టడి చేసేవరకు వెళ్లింది. ఇదే అదనుగా సైన్యం తిరిగి రంగంలోకి దిగింది. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో షరీఫ్‌ అధికారాలను బాగా తగ్గించేసిన సైన్యం జాతీయ భద్రత, విదేశీ వ్యవహార శాఖల్ని పూర్తిగా చేజిక్కించుకుంది. ఖాన్‌ రాజకీయ ఆశలు చివరికి సైన్యానికి వరంగా పరిణమించాయి. అలా పైకి మెత్తగా, నిజాయితీగా, నాగరికంగా కనిపించే ఇమ్రాన్‌ఖాన్‌ ‘సైన్యం తొత్తు’గా మారారు. ‘ఇమ్రాన్‌ ఎవరి చేతిలోనూ కీలుబొమ్మ కాడు, కాబోడు’ అంటూ అతను ఎంతగా గొంతుచించుకున్నా, నిజమేమిటంటే సైన్యం గీసిన గీతను దాటే పరిస్థితి అతనికి లేదు. అలా దాటాలని ప్రయత్నిస్తే ముందున్నవారికి ఏ గతి పట్టిందో అదే ఆయనికీ పడుతుంది.

క్రికెట్‌ మైదానంలో అతని దూకుడు చూసిన పాకిస్తానీ యువత ఇప్పటికీ అతను గర్జించే సింహమే అనుకోవచ్చు. కానీ 20మంది ఉండే క్రికెట్‌ జట్టును నడపడం వేరు. 20కోట్ల మందితో కూడిన దేశాన్ని నడిపించడం వేరు. నిజానికి 22 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆజ్ఞలు జారీచేయడం కంటే అందరినీ కలుపుకుని పోవడం చాలా కష్టమని ఖాన్‌ గ్రహించే ఉంటారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పరుగులు పెట్టి రాజకీయ విశ్వసనీయతను కోల్పోయిన వ్యక్తి ఇమ్రాన్‌.

‘నూతన’ పాకిస్తాన్‌ను నిర్మిస్తానని ఖాన్‌ చెపుతున్నా, విదేశాంగ విధానం పట్ల, కుంగుతున్న ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడం పట్ల ఆయన వద్ద ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక కనిపించడం లేదు. మీడియాపై సైన్యం విధించిన ఆంక్షలు, విమర్శలను ఉక్కుపాదంతో అణచివేయడం, జర్నలిస్ట్‌లపై చర్యలు మొదలైన విషయాల్లో ఇమ్రాన్‌ ప్రతిస్పందన ఏ మాత్రం సజావుగా లేదు. అలాగే ఎన్నికల్లో రిగ్గింగ్‌ భారీగా జరిగిందన్న ఆరోపణలను కూడా పట్టించు కోకపోవడం ప్రజస్వామ్యంపై అతని చిత్తశుద్ధి పట్ల అనుమానాలు కలిగిస్తోంది.

ఎన్నికల విజయంపై ఖాన్‌ వ్యాఖ్యలు కూడా ఈ ఆందోళనను మరింత పెంచేవిధంగా ఉన్నాయి. ‘పేదలు, వితంతువులకు పూర్తి రక్షణ కలిగే మదీనా తరహా పాలన వ్యవస్థ నా ఆశయం. మదీనాలో అలాంటి ఆదర్శవంతమైన వ్యవస్థను ఏర్పరచిన ఆఖరి ప్రవక్తే నాకు స్ఫూర్తి. పాకిస్తాన్‌ను నేను అలా తీర్చిదిద్దాలనుకుంటున్నాను’ అని ఇమ్రాన్‌ తన విజయోత్సవ సభలో అన్నారు. ఈ వ్యాఖ్యలు భారత్‌లో కూడా ఆందోళన కలిగించాయి. పాకిస్తాన్‌ను ప్రపంచంలోని ముస్లిములందరికి రక్షణ కల్పించే, ముస్లిముల ఆదర్శ రాజ్యంగా రూపొందించాలన్నదే ఆ దేశ నిర్మాతల ప్రధాన లక్ష్యమనే అభిప్రాయాలను నిజం చేసే విధంగా ఇమ్రాన్‌ ప్రసంగం ఉంది. పాక్‌ నిర్మాతల ఆలోచనలను వెంకట్‌ ధూళిపాళ తన ‘క్రియేటింగ్‌ ఏ న్యూ మదీనా : స్టేట్‌ పవర్‌, ఇస్లాం అండ్‌ క్వెస్ట్‌ ఫర్‌ పాకిస్థాన్‌ ఇన్‌ లేట్‌ కొలోనియల్‌ నార్త్‌ ఇండియా’ అనే పుస్తకంలో వివరించారు. ప్రవక్త మక్కా నుండి మదీనాకు వలస వచ్చినప్పుడే మొట్టమొదటసారిగా పాకిస్తాన్‌ ఏర్పడిందన్న ముల్లాలు, మౌల్వీల ప్రగాఢ విశ్వాసం నుండే ఇప్పటి పాకిస్తాన్‌ పుట్టింది. బ్రిటిష్‌ ఇండియా నుండి సష్టించిన ఈ దేశం చరిత్రలో రెండవ ఇస్లామిక్‌ రాజ్యం. కానీ భారత్‌లో పాక్‌ సానుభూతిపరులు, పాకిస్తాన్‌లోని ఉదారవాదులు ఈ వాదనను అంగీకరించరు. అయినా ఇస్లామిక్‌ ఖలిఫత్‌ను నిర్మించడమే పాకిస్తాన్‌ నిర్మాణానికి వెనకున్న ప్రధాన లక్ష్యమన్నది నిర్వివాదాంశం. పాకిస్తాన్‌ ప్రజాస్వామ్య దేశమని భావించడమంటే భారత్‌ తనను తాను మోసగించుకోవడమే అవుతుంది.

ఖాన్‌ తన ప్రసంగంలో ఇంకా ఇలా అన్నారు: ‘హిందూస్తాన్‌ నాయకత్వం సిద్ధపడితే మేము భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకునేందుకు సిద్ధం. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే మేము రెండడుగులు వేస్తాం’. క్రికెట్‌ వీరునిగా ఇమ్రాన్‌ జ్ఞాపకాలను మరచిపోలేని భారత్‌లో కొందరు విశ్లేషకులు గతంలో ఆయన చూపిన భారత్‌ వ్యతిరేక ధోరణిని మరచిపోయి ఆలస్యం చేయకుండా చర్చలకు సిద్ధం కావాలంటూ ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు. కానీ భారత్‌ మళ్ళీ ద్వైపాక్షిక చర్చలు అనే ఊబిలో పడకుండా జాగ్రత్తపడాలి. పిడివాద ఇస్లామిక్‌ భావాలను పుణికిపుచ్చుకున్న ఖాన్‌ భారత్‌తో క్రికెట్‌ పోటీ అంటే తనకు జిహాద్‌తో సమానమని స్పష్టంగా ప్రకటించేవారు. అంతేకాదు ఇస్లామిక్‌ పిడివాదులకు ఆయన ఇచ్చే మద్దతు పాకిస్తాన్‌ ఎలా ఉండాలన్న ఆలోచనలను చెప్పకనే చెపుతోంది. గతంలో అనేకసార్లు తాలిబాన్‌, హక్కాని సంస్థల సానుభూతిపరుడైన ఖ్వాజీ హుస్సైన్‌ అహ్మద్‌ నిర్వహించిన సభల్లో ఖాన్‌ పాల్గొన్నారు. పాకిస్తాన్‌లో తీవ్రవాద సంస్థల ఏర్పాటు, తీవ్రవాదుల నియామకం, శిక్షణ మొదలైన విషయాలను స్వయంగా పర్యవేక్షించిన మాజీ ఐఎస్‌ఐ అధినేత హమీద్‌ గుల్‌ మార్గదర్శకత్వంలోనే ఇమ్రాన్‌ఖాన్‌ రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. హమీద్‌ గుల్‌ను పిటిఐ పార్టీ సహ వ్యవస్థాపకుడని భావిస్తారు. ఖాన్‌ తన పాశ్చాత్య వ్యతిరేక ధోరణిని గుల్‌ నుంచే నేర్చుకున్నాడని అంటారు. ఇప్పటివరకు ఎప్పుడూ ఇమ్రాన్‌ఖాన్‌ సైనిక పాలకులైన జియా ఉల్‌ హక్‌, పర్వేజ్‌ ముషారఫ్‌ లను విమర్శించలేదు. దీనికి కారణం కూడా అతనికి హమీద్‌ గుల్‌, ఐఎస్‌ఐ లతో ఉన్న అనుబంధమే. ఇమ్రాన్‌ ప్రధాని అయితే పాకిస్తాన్‌లో సైన్యానిదే పైచేయి అవుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ ‘తాలిబాన్‌ ఖాన్‌’ హయాంలో సరిహద్దు ఉద్రిక్తతలు నిత్యకత్యమవు తాయన్నది ఆందోళన కలిగించే విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *