పాకిస్తాన్‌ మతపరమైన దౌత్య వలలో భారత్‌ చిక్కుకుందా?

పాకిస్తాన్‌ మతపరమైన దౌత్య వలలో భారత్‌ చిక్కుకుందా?

ఇటీవల పాకిస్తాన్‌ మతపరమైన దౌత్య విధానాన్ని అవలంబించడానికి, భారత్‌ను కూడా అందులోకి దింపడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాక్‌ వైఖరి స్పష్టంగా బయటపడింది. ఆ కార్యక్రమానికి హాజరైన నవజోత్‌ సింగ్‌ సిద్దునే అందుకు ఉపయోగించుకుంది. పాకిస్థాన్‌లో తన స్నేహితులందరిని కలిసి వచ్చిన సిద్దు అసలు విషయాన్ని మెల్లగా మీడియాకు చెప్పాడు. గురునానక్‌ 550 జయంతి సందర్భంగా డేరా బాబా నానక్‌ (కర్తార్పూర్‌) నడవాను తిరిగి తెరవాలను కుంటున్నట్లుగా పాక్‌ సైన్యాధ్యక్షుడు ఖమర్‌ బజ్వా తెలిపారంటూ సిద్దు మీడియా ముందు వెల్లడించారు. కర్తార్పూర్‌ మన సరిహద్దుకు అవతల 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సిక్కులకు పవిత్రమైనది. ఇప్పటి వరకు సిక్కులు అక్కడకి వెళ్లడానికి వీలులేక సరిహద్దు ఇవతలనుంచే శక్తిమంతమైన టెలిస్కోప్‌ ద్వారా ఆ ప్రదేశాన్ని దర్శించుకుని త ప్తిపడుతున్నారు. 1999లో లాహోర్‌ కు బస్సులో ప్రయాణించి శాంతి సందేశాన్ని వినిపించిన అప్పటి ప్రధాని వాజపేయి కర్తార్పూర్‌ నడవా తెరవాలని పాకిస్థాన్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే భారత్‌ వైపున ఉన్న గురుద్వారా నుంచి కర్తార్పూర్‌ మందిరం వరకు వంతెన నిర్మించి, సిక్కు యాత్రికులకు మాత్రం వీసా లేకుండా అక్కడికి అనుమతిస్తామని 2000 సంవత్సరంలో పాకిస్థాన్‌ ప్రతిపాదించింది. కానీ ఆ తరువాత ఆ ప్రతిపాదనపై రెండు దాయాది దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు.

18 ఏళ్ల సుదీర్ఘ కాలం తరువాత కాంగ్రెస్‌ నాయకుడు సిద్దు ద్వారా పాకిస్తాన్‌ మళ్లీ కర్తార్పూర్‌ ప్రస్తావన తెచ్చింది. ఇలా భార తీయుల, ముఖ్యంగా సిక్కుల, మత, సాంస్కతిక భావాలను ఆధారం చేసుకుని తన పబ్బం గడుపుకోవాలన్న పాక్‌ ధోరణి అనేక అనుమానా లకు తావిచ్చింది. పీకలలోతు ఆర్ధిక సంక్షోభం, అంతర్జాతీయ స్థాయిలో ఏకాకి కావడం, డబ్బు అక్రమ రవాణాను అరికట్టే చట్టాలను అమలు చేయడంలో విఫలం కావడంతో ఖీూుఖీ బ్లాక్‌లిస్ట్‌లో చేరిపోవడంతో పాకిస్థాన్‌ పరిస్థితి దారుణంగా తయారయింది. ఈ స్థితి నుంచి బయటపడేందుకు భారత్‌ ను మంచి చేసుకోవా లన్న ప్రయత్నం ప్రారంభించింది. ప్రధానిగా అధికారం చేపట్టి మూడునెలల్లో దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా కుంగిపోకుండా చూసేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ నానాతంటాలు పడుతున్నారు. ఈ మూడు నెలల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ నిధుల కోసం రెండుసార్లు సౌదికి వెళ్లివచ్చారు. ఆ తరువాత వెంటనే చైనాకు పరుగులు పెట్టారు. రెండు దేశాలు ఎలాంటి నిధులు అందించకపోయినా అనేక ఒప్పందాలు మాత్రం చేసుకున్నాయి. అలాగే అరబ్‌ ఎమిరేట్స్‌కు కూడా వెళ్లిన ఖాన్‌ కాస్త నిధులతో తిరిగి రాగలిగారు. పాకిస్తాన్‌ విజ్ఞప్తి మేరకు ఖచీ+ూ సమావేశాల సందర్భంగా విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశాలకు భారత్‌ మొదట అంగీకరించినా కశ్మీర్లో అనేక మంది సైనికుల మరణానికి కారణమైన తీవ్రవాది బుర్హాన్‌ వాని తపాలా బిళ్లను పాకిస్థాన్‌ విడుదల చేయడం పట్ల నిరసన తెలుపుతూ సమావేశాలలో పాల్గొనరాదని నిశ్చయించు కుంది. దీనితో కంగుతిన్న పాకిస్థాన్‌ తన అసంతప్తిని వ్యక్తంచేసింది. ”శాంతి చర్చలు కొనసాగించాలని మేము చేసిన ప్రయత్నం భారత్‌ నకారాత్మక, మొండి వైఖరి కారణంగా విఫల మయింది. దూరదష్టి లేని సంకుచిత ధోరణి కలిగిన వారు పెద్ద పదవులు అలంకరిస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు”అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి ఇమ్రాన్‌ ఖాన్‌ తన అక్కసు వెళ్లగక్కారు. ఇలా ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అన్నిరకాల ఎత్తులు వేస్తున్న పాకిస్థాన్‌ తన సహజ స్వభావాన్ని మాత్రం వదులుకోలేకపోతోంది.

పాకిస్థాన్‌ మోసపూరిత, ద్వంద్వ వైఖరితో భారత్‌ మాత్రమే కాదు అమెరికా కూడా విసిగిపోయింది. దీనితో ఆ దేశానికి ఆర్ధిక సహాయం పూర్తిగా ఆపేస్తామని హెచ్చరించింది కూడా. మైక్‌ పామ్పియో పర్యటనకు ముందు అమెరికా మెప్పుపొందేందుకన్నట్లుగా ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్థాన్‌ తాలిబాన్‌ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్‌ హక్కాని మరణించినట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది. తీవ్రవాదాన్ని అదుపు చేస్తున్నమంటూ మోసపుచ్చిన పాకిస్థాన్‌ ఇప్పుడు నిజంగా చర్యలు తీసుకోవాలన్నా ఆ స్థితిలో లేదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (Iవీఖీ) ఆర్ధిక సహాయం పొందడానికి అమెరికాను మంచి చేసుకోవడం తప్పనిసరని పాకిస్థాన్‌ గ్రహించింది. ఇప్పటికే ఆర్ధిక సహాయం కోసం పాకిస్థాన్‌ 12సార్లు ద్రవ్యనిధి సంస్థ తలుపులు తట్టింది. పాకిస్థాన్‌ ధోరణితో విసుగుచెందిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘పాకిస్థాన్‌ ఇప్పటివరకు మాకోసం ఏమి చేయలేదు’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిఐ సమాచారం ప్రకారం ఈ ఏడాదికిగాను ఇవ్వాల్సిన 3 బిలియన్‌ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని అమెరికా నిలిపివేసింది. దీనికితోడు అంతర్జా తీయంగా కూడా పాకిస్థాన్‌ పరపతి పూర్తిగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితి నుంచి బయట పడేందుకే తాజాగా కర్తార్పూర్‌ నడవా విషయాన్ని పాకిస్తాన్‌ తెరపైకి తెచ్చింది.

దశాబ్దాలుగా కర్తార్పూర్‌ నడవాను నిర్మించాలని సిక్కులు కోరుతున్నారు. దీనిపై ఎట్టకేలకు రెండు దేశాలు అంగీకారం తెలపడం పట్ల అంతర్జాతీయ సమాజంలో కూడా హర్షం వ్యక్తమయింది. పాకిస్థాన్‌ ప్రభుత్వం నుంచి తగిన సహాయసహకారాలను కోరిన భారత ప్రభుత్వం ఈ విషయంలో సందేహాలు కూడా వ్యక్తం చేసింది. ”ఖలిస్తానీ ప్రభావం, పాకిస్థాన్‌ అధికారులు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు సిక్కు యాత్రికులకు ఇబ్బందులు కలగజేసే ప్రమాదం ఉంది. కనుక ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్త వహించాలి” అన్న భారత ప్రకటన ఈ సందేహాలను బయటపెట్టింది.

ఈ చరిత్రాత్మక నిర్ణయం పట్ల సర్వత్ర చర్చ జరిగింది. ‘ఈ నిర్ణయం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు బాగా మెరుగుపడతాయి’ అని అలిసా ఏరిస్‌ అన్నారు. ఫాస్ట్‌ పోస్ట్‌ కు చెందిన శ్రీమొయి తాలుక్దార్‌ ‘సొంత ఇంటిలో రాజకీయ అంశాలు వ్యూహాత్మక విషయాలను ప్రభావితం చేయడం సరైనది కాదు’ అంటూ ఎన్నికల వేళలో రాజకీయ ప్రయోజనాన్ని సాధించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. అయితే ‘జాతీయవాద పార్టీ’గా ముద్రపడిన బిజెపి ఆధ్వర్యంలో సాగుతున్న ప్రభుత్వం పాకిస్థాన్‌తో సంబంధాలను మెరుగుపరచుకునేందుకు మాత్రం వెనుకాడలేదు. ఈ ప్రయత్నం ప్రశంసనీయ మైనది. మాజీ దౌత్య అధికారి వివేక్‌ కట్జు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో రాసిన ‘ఆ బ్రిడ్జ్‌ టూ లాంగ్‌’ అనే వ్యాసంలో అటల్‌ బిహారీ వాజపేయి శాంతి యాత్ర, కర్తార్పూర్‌ నడవా నిర్మాణ ప్రతిపాదనలను ప్రస్తావించారు. కానీ కొన్ని నెలల వ్యవధిలోనే కార్గిల్‌ యుద్ధాన్ని పాకిస్థాన్‌ కానుకగా ఇచ్చింది. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా కర్తార్పూర్‌ నిర్ణయం ద్వారా మరోసారి స్నేహహస్తాన్ని అందించడానికి ప్రయత్నిం చారు. కానీ ఇలాంటి సద్భావానికి పాకిస్థాన్‌కు అర్హత ఉన్నదా అనేదే ప్రశ్న. పాకిస్థాన్‌ మోసపూరిత చరిత్ర చూస్తే ఈ ప్రయత్నం ఏమాత్రం ఫలితాలనివ్వదని అనిపిస్తుంది.

కర్తార్పూర్‌ నిర్ణయం తీసుకున్న రోజునే పాకిస్థాన్‌ తన మోసపూరిత వైఖరిని బయట పెట్టుకుంది. నానకాన సాహిబ్‌ గురుద్వారాలోకి భారతీయ దౌత్యాధికారుల ప్రవేశాన్ని నిరాకరించింది. అలాగే నిరంకారి ఆశ్రమంలో జరిగిన బాంబుదాడి వెనుక పాకిస్థాన్‌ హస్తం ఉందని పంజాబ్‌ పోలీసుల దర్యాఫ్తులో తేలింది. ఈ దాడిలో ముగ్గురు చని పోయారు, 20మంది గాయపడ్డారు. ఇలా పాకిస్థాన్‌ ఎప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగానే పనిచేస్తోంది. ఖలిస్థాన్‌ ఉద్యమానికి మళ్లీ ఊపిరులూదడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో పాకిస్థాన్‌ కు స్నేహహస్తం చాచడంలో పెద్దగా ప్రయోజనం ఏమి ఉండబోదు.

వీటన్నిటికి తోడు 26 నవంబర్‌న గుర్దాస్‌ పూర్‌ డేరా బాబా నానక్‌ దగ్గర ఈ నడవా పనులకు శంకుస్థాపన జరిగింది. ఆ కార్యక్రమంలో ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ పాల్గొన్నారు. ముంబై దాడులు (26/11)దాడులు జరిగి 10 ఏళ్లు కావస్తున్నా, దానికి బాధ్యులైనవారికి శిక్షలు పడకుండా పాకిస్థాన్‌ అడ్డుపడుతున్నా భారత ప్రభుత్వం మాత్రం కర్తార్పూర్‌ నడవా నిర్మాణానికి అంగీకారం తెలిపినందుకు పాకిస్థాన్‌ ప్రభుత్వానికి క తజ్ఞతలు తెలిపింది. ఇలా ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశాలలో నిర్లక్ష్య ధోరణి మంచిది కాదు.

అయితే విదేశాంగ వ్యవహారాల్లో ఒక కొత్త ఒరవడి, వేగాన్ని తేవడంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించిందన్నది మాత్రం నిజం. కానీ పాకిస్థాన్‌ పట్ల మాత్రం సందిగ్ధ ధోరణి కొనసాగు తోంది. దీనివల్లనే పాకిస్థాన్‌ తనకు తోచిన విధంగా ప్రవర్తించడానికి అవకాశం కలుగుతోంది.

– డా|| రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *