పాక్‌లో పరివర్తన వచ్చేనా !

పాక్‌లో పరివర్తన వచ్చేనా !

ఈ ఏప్రిల్‌ 16-20 తేదీల మధ్య భారత్‌ మరోసారి పాకిస్తాన్‌ మీద దాడి చేసే యోచనలో ఉన్నట్టు, ఇందుకు సంబంధించి తమ వద్ద విశ్వస నీయ సమాచారం ఉందని ఆ దేశం చెబుతోంది. పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషి ఈ మాట చెప్పారు. ఇలాంటి వ్యూహాత్మక ప్రకటనలు చేస్తున్నప్పటికీ, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న ప్పటికీ వాస్తవాలు వేరే విధంగా ఉన్నాయి. ఇవి పాకిస్తాన్‌కు పూర్తిగా తెలుసు. రెండు అణు దేశాల మధ్య ఘర్షణ కాబట్టి ఈ అంశం మీద పాకిస్తాన్‌ కంటే ప్రపంచ దేశాలకు ఆ వాస్తవాలు మరింత బాగా తెలుసు. ఫిబ్రవరి 14, 2019కి ముందు భారతదేశ వ్యవహారాలు వేరు. ఆ తేదీ తరువాతి వ్యవహారాలు వేరు. ఈ విభజన రేఖను పాకిస్తాన్‌ సహా ప్రపంచ దేశాలు పరిపూర్ణంగా గ్రహించాయి.

ఈరోజు ప్రపంచంలో పాకిస్తాన్‌ ఒంటరి. ఇది ఆ దేశ స్వయంకృతాపరాధం. పుల్వామా దాడి (ఫిబ్రవరి 14, 2019)కి పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైష్‌ ఎ మహమ్మద్‌ కారణం. ఇది ఆ సంస్థ స్వయంగా ప్రకటించుకుంది. దీనికి ప్రతీకారంగా భారత్‌ పాక్‌ భూభాగంలోని జైష్‌ ప్రధాన శిక్షణ కేంద్రం మీద ప్రతీకార దాడి చేసింది. ఈ ప్రతీకార దాడి భారత్‌ విదేశ వ్యవహారాలలో కొత్త మలుపు. ఈ విధంగా పాకిస్తాన్‌ భారత వ్యూహాత్మక విధానంలో కొత్త అధ్యాయాన్ని తెరిచేటట్టు చేసింది. పుల్వామా దాడితో భారత్‌ తన పాత విధానమైన చూసీ చూడనట్టు పోయే విధానానికి స్వస్తి పలికింది. స్వీయ రక్షణ పద్ధతికి మంగళం పాడింది. అలా అని భారత్‌ ఒంటెత్తు పోకడలకు పోవడం లేదు. ప్రపంచం ఏమనుకుంటున్నదో ఆలకిస్తున్నది. ప్రపంచ దేశాలు చెప్పే మాటలను కూడా వింటున్నది. అలాగే అంత ర్జాతీయ చట్టాల ఎడల మర్యాదను చూపుతున్నది. కానీ దేశ ప్రయోజనాలే ప్రధానంగా అడు గులు వేస్తున్నది. ఇప్పుడు భారత్‌ విదేశాంగ విధానంలో ఐదు కొత్త లక్షణాలను ప్రపంచం చూస్తున్నది.

ప్రస్తుతం భారత్‌ విధానం సూత్రాలు, సిద్ధాంతాలు ప్రాతిపదికగా సాగకపోవచ్చు. భారత్‌ అంతర్జాతీయ చర్చలు పరిణామ పథంలోకి మారు తున్నాయి. వేయబోయే అడుగులకు సిద్ధాంతాలు, సూత్రాలు మార్గదర్శకంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం భారత్‌ సిద్ధాంతాలు, సూత్రాలు అనే పంజరంలో మిగిలిపోవాలని అనుకోవడం లేదు. పుల్వామా తరువాతి పరిణామాలు పంజరం తలుపులను బద్దలు కొట్టాయి. భారత యుద్ధ విమానాలు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోకి కాదు, నేరుగా పాక్‌ భూభాగంలోకే చొచ్చుపోవడం ఈ మార్పును ప్రతిబింబిస్తున్న ఓ చిన్న ఉదాహరణ. కానీ ఈ చిన్న ఉదాహరణ భారత్‌-పాక్‌ సైనిక బలగాల మధ్య ఒక బలమైన హద్దును నిర్మించి పెట్టింది. అలాగే మీరు ఉగ్రవాదులను పంపిస్తే, మేం సైన్యాన్ని పంపిస్తాం అన్న సంకేతం ఇచ్చింది.

ఈ దాడులను మరింత పతాక స్థాయికి తీసుకుపోవడానికి కూడా భారత్‌ సిద్ధంగా ఉన్నట్టు వెల్లడవుతోంది. పాక్‌ భూభాగంలో ఉన్న జైష్‌ ప్రధాన శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి భారత్‌ 12 మిరాజ్‌ 2000 జెట్‌లను పంపించింది. అధీనరేఖ వరకు వీటిని పంపించి బాలాకోట్‌లో ఆ శిక్షణ కేంద్రాన్ని తుత్తునియలు చేయించింది. భారత్‌ వైపు నుంచి ఇంతటి ప్రతిఘటన గతంలో ఏనాడూ లేదు.

భారత్‌ ఒంటెత్తు పోకడలకు పోవాలని అనుకోవడం లేదని ప్రపంచ దేశాలకు తెలియ చేసింది. పుల్వామా దాడి జరిగిన రెండురోజులకి భారత విదేశ వ్యవహారాలశాఖ 25 ప్రముఖ దేశాల దౌత్యవేత్తలతో సమావేశం జరిపి పరిస్థితిని వివరించింది. ఇందులో పి5 దేశాలు (అమెరికా, చైనా, రష్యా, ఇంగ్లండ్‌, రష్యా), జపాన్‌, జర్మనీ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. పుల్వామా దాడి వెనుక పాక్‌ హస్తం ఉందని ఆ దేశాలకు భారత్‌ నమ్మకం కలిగేటట్టు చేయగలిగింది. ఫిబ్రవరి 27న బాలాకోట్‌ దాడి తరువాత మరొకసారి 12 దేశాలను పిలిచి తన వాదనలను వినిపించింది భారత విదేశాంగశాఖ. ఇందులో చైనా, సింగపూర్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘనిస్తాన్‌ ఉన్నాయి.

గతంలో మాదిరిగా పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేస్తే, ఇది పిరికిపందల చర్య, దీనిని ఖండిస్తున్నాం, మరొకసారి జరిగితే సహించ బోమని హెచ్చరిస్తున్నాం వంటి సాధారణ, నైతిక సూత్రాలు వ్యర్థమన్న అభిప్రాయం భారత్‌కు వచ్చింది. పుల్వామా దాడి తరువాత భారత్‌ భాష మారింది. పాక్‌ ఘోర తప్పిదానికి పాల్పడింది, అందుకు అది భారీ మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది, భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం వంటి ప్రకటనలు వెలువడ్డాయి. అంటే కార్గిల్‌ ఘర్షణ సమయంలో జరిగినట్టు భద్రతా బలగాలకు ఎలాంటి రాజకీయ ప్రతిబంధకాలు పెట్టడం లేదని భారత్‌ వెల్లడించింది.

పాక్‌ ప్రతిపాదనలను వినడంలో కూడా భారత్‌ కఠిన వైఖరి అనుసరించింది. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ పాక్‌ దళాలకు పట్టుబడినప్పుడు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చర్చల కోసం నరేంద్ర మోదీకి ప్రతిపాదన పంపించారు. దానిని మోదీ నిర్మొహ మాటంగా నిరాకరించారు. ఇదొక పెద్ద మార్పు. అయినా అభినందన్‌ను పాకిస్తాన్‌ తీసుకువచ్చి అప్పగించింది. 1989లో ముఫ్తీ మహమ్మద్‌ సయ్యద్‌ కుమార్తె రుబయాను విడుదల చేయడానికి, 1999లో భారత ప్రయాణికులను విడుదల చేయించడానికి ఉగ్రవాదుల షరతులకు లొంగినట్టు ఇప్పుడు భారత్‌ తలొగ్గదని చెప్పింది. అంతకు ముందే మసూద్‌ అజర్‌ను భారత భద్రతా దళాలు బంధించాయి. ఇతడిని విడిపించడానికే ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానాన్ని కాబూల్‌కు హైజాక్‌ చేశారు. దాదాపు 179 మంది ప్రయాణికులను బంధించారు. మసూద్‌ను విడిపించుకుని వెళ్లారు. అంటే మసూద్‌ను విడిపించుకు వెళ్లడానికి విమానం హైజాక్‌ దురంతం, పార్లమెంటు మీద దాడి, ఇప్పుడు పుల్వామా దాడి ఇవన్నీ జైష్‌ ఏ మహమ్మద్‌ సంస్థ పనులే. వీటికి ఆధారాలు చూపించాలని పాకిస్తాన్‌ అడగడం రివాజైపోయింది. ఎన్ని వందల సాక్ష్యాలు ఇచ్చిన ఇవి చాలవనే కొట్టి పారేసేది. అందుకే పుల్వామా దాడికి సంబంధించి పాకిస్తాన్‌కు మాత్రం సాక్ష్యాలు అందించే ప్రశ్న లేదని కూడా భారత్‌ తెగేసి చెప్పింది. 2016లో మోదీ ప్రభుత్వం మొదటిసారి సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేయడానికి కారణం కూడా జైష్‌ ఎ మహమ్మద్‌ సంస్థే. యురి, పఠాన్‌కోట భారత సైనిక శిబిరాల మీద ఆ సంస్థ ఉగ్రవాదులు దాడులు చేసి రక్తపాతం సృష్టించింది.

ఇవి పుల్వామా దాడితో భారత విదేశాంగ విధానంలో వచ్చిన గుణాత్మకమైన మార్పులే కావచ్చు. కానీ ప్రపంచంతో భారత్‌ జరపబోయే చర్చలను కూడా ఇప్పుడు ఈ కొత్త స్వరూపమే శాసించ బోతోంది. ఇది దక్షిణాసియా సంబంధాలలో కూడా పెద్ద మార్పును తీసుకువచ్చేదే.

పుల్వామా దాడి దరిమిలా జరిగిన బాలాకోట్‌ వైమానిక దాడిని ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్‌-పాక్‌ సంబంధాలను కొత్త దిశకు తిప్పిన పరిణామంగానే చూస్తున్నాయి. భారత్‌లో విపక్షాలు దీనికి ఎన్ని పేర్లయినా పెట్టవచ్చు. మోదీ కేంద్రంగా ఎన్ని ఆరోపణలయినా చేయవచ్చు. కానీ ప్రపంచ దేశాలు బాలాకోట్‌ దాడిని దౌత్య చరిత్రలో పెద్ద మలుపునకు కారణమైనదిగానే పరిగణిస్తున్నాయి. ఇంతకాలం భారత్‌ ఉగ్రవాదానికి సమాధానం ఇచ్చే పంథాకు పరిమితమైందనీ, ఇప్పుడు ఉగ్రవాదాన్ని ప్రతిఘటించే పంథాను తీసుకున్నదని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 1980 నుంచి గమనిస్తే ఉగ్రవాద దాడి జరిగిన ప్రతి సందర్భంలోను భారత్‌ కొన్ని ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవడం కనిపిస్తుంది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. సీసీ టీవీలను ఉపయోగించుకుంటున్నారు. ఉగ్రవాద నిరోధానికి ప్రత్యేక దళాలను తయారు చేసు కుంటున్నది భారత్‌. 2006 ముంబై రైళ్లలో పేలుళ్లు, 26/11 తరువాత ఈ చర్యలు బలంగా కనిపిస్తాయి. నిజానికి కార్గిల్‌ యుద్ధంలో కూడా భారత్‌ రక్షణ చర్యలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది. మన భూభాగాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకున్నాం. వాస్తవాధీన రేఖను ఆనాడు దాట లేదు. పాక్‌ కవ్వింపు చర్యలలో పరాకాష్ట అనదగిన భారత పార్లమెంటు మీద దాడి (ఇది కూడా జైష్‌ పనే) సమయంలో కూడా సరిహద్దులలో సైన్యాన్ని మోహరించింది. కానీ దాడి చేయలేదు. పాక్‌ చేస్తున్నది పరోక్ష యుద్ధమేనని భారత్‌ భావించినంత కాలం రక్షణ చర్యలకే పరిమితమైంది. అయితే స్వీయ రక్షణ చర్యలకే పరిమితమైతే యుద్ధం గెలుపు ఏనాడూ సాధ్యం కాదన్నదే సైనిక పాఠం. కానీ గడచిన 30 ఏళ్లుగా భారత్‌ ఈ స్వీయ రక్షణ చర్యలకే పరిమితమై ఉంది. కానీ పాక్‌ యుద్ధభాష ప్రయోగించడం మొదలుపెట్టి చాలా కాలమే అయింది. పైగా తన దగ్గర అణ్వాయుధాలు ఉన్నట్టు బెదిరిస్తూ యుద్ధం వస్తే అంతు చూస్తాం అన్న తీరులోనే వ్యవహ రించింది. బాలాకోట్‌లో భారత్‌ వైమానిక దళ విమానాలు చేసిన దాడితో ఎంత నష్టం జరిగిందన్నది అప్రస్తుతం. కానీ ఆ దాడి ఉప ఖండంలో ఒక ఎర్రని గీతను మాత్రం గీసిపెట్టింది.

భారత వైమానిక దళం దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్‌ పట్ల ఇక నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే పాక్‌ను నమ్మరాదనే వారి అభిప్రాయం. కాబట్టి భూ ఉపరితల దాడులకు, సముద్రం మీదుగా జరిగే దాడికి కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు. కారణం ఒక్కటే- రెండు అణ్వాయుధాలు కలిగిలిన దేశాలు. ఇక్కడే వారు పాక్‌ ప్రధాని చేసిన ప్రకటనను గుర్తు చేస్తున్నారు. మార్చి 26న ఇమ్రాన్‌ మాట్లాడుతూ, ఉద్రిక్తతలు తగ్గినా యుద్ధ మేఘాలు ఇంకా అలుముకునే ఉన్నాయి అన్నారు. అయితే ఆ మరునాడే భారత్‌ ఏ-శాట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. దీనితో భారత్‌ ఒక కొత్త శిఖరానికి చేరుకున్నట్టయింది.

ఇవన్నీ సరే, పుల్వామా నుంచి బాలాకోట్‌ వరకు జరిగిన పరిణామాలతో పాకిస్తాన్‌ ఏమైనా గుణపాఠం నేర్చుకున్నదా? ప్రస్తుతానికి మాత్రం పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద మూకలను కొంచెం అదుపులో ఉంచగలిగింది. జైష్‌ ఏ మహమ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థల మీద చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం గట్టిగానే వ్యవహరించడం ఖాయమని ఇటీవలనే పాకిస్తాన్‌ సమాచార శాఖ మంత్రి ప్రకటించారు. అయితే ఇది ఎప్పటిలోగా జరుగు తుందో చెప్పలేదు. కానీ తొందరలోనే ఇది జరుగు తుందని ఆయన అన్నారు. మరో ముఖ్య పరిణామం జైష్‌ అధినేత మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేస్తున్న యత్నాలకి ఇకపై పాకిస్తాన్‌ అడ్డు చెప్పరాదన్న నిర్ణయానికి వచ్చినట్టు కూడా వార్తలు వెలువడినాయి. మరొక అంశం కూడా ఉంది. భారత్‌-పాక్‌ మధ్య ఇంతటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడినప్పటికి కూడా పాక్‌లోనే పని చేసే జమాద్‌ ఉద్‌ దవా నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. భారత్‌ సైన్యం చేత సమాధానం ఇచ్చే పని మొదలు పెట్టిన క్షణం నుంచి పాకిస్తాన్‌ తన గడ్డ మీద ఉన్న ఉగ్రవాద సంస్థలను కొంచెం అదుపులో పెట్టుకుంది. మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి చైనా పెడుతున్న ఆటంకాల గురించి అమెరికా, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌ నిలదీయడం ఒక విధంగా పాక్‌ను గట్టిగా హెచ్చ రించినట్టయింది. ఉగ్రవాదం అంతర్జాతీయ సమస్య కాబట్టి ఇలాంటి విషయాలలో భారత్‌ మాటతోనే అంతా జరగాలని భావించరాదని, భారత్‌ ఒంటెత్తు పోకడలకు పోరాదని చైనా వాదించడం వింతగానే ఉంటుంది. మసూద్‌ను కట్టడి చేస్తే భారత్‌కు కొంత మేర శాంతి చేకూరుతుంది. ఇది పాకిస్తాన్‌కు నచ్చని సంగతి. అలాగే దక్షిణాసియాలో శ్రీలంక, బంగ్లాలతో పాటు పాక్‌ను తన పక్షాన్నే నిలబెట్టుకోవడానికి కూడా మసూద్‌ అజర్‌ను చైనా కాపాడుతోంది. ఈ సంగతి గురించే అమెరికా తీవ్రంగా స్పందించింది. మరొక సారి భారత్‌ మీద దాడి జరిగితే తాను ఊరుకునేది లేదని అమెరికాయే హెచ్చరించడం మరొక పరిణామం. కానీ మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించమని భారత్‌ ఏనాటి నుంచో ఐక్య రాజ్యసమితిని కోరుతూనే ఉంది. మొదట అగ్రరాజ్యాలు ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకోలేదు. అదొక తప్పిదం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *