గాయపడిన జీవితానికి శాంతి ‘నోబెల్‌’

గాయపడిన జీవితానికి శాంతి ‘నోబెల్‌’

‘యుద్ధాలలో, సాయుధ సంఘర్షణలలో లైంగిక హింసను ఒక ఆయుధంగా ఉపయోగించడాన్ని నిరోధించడానికి ఆ ఇరువురు చేసిన మహోన్నత కృషికి’ ఈ సంవత్సరం నోబెల్‌ శాంతి పురస్కారం ప్రకటించినట్టు స్వీడిష్‌ అకాడమి ప్రకటించింది. ఆ ఇరువురు- కాంగో వైద్యుడు డాక్టర్‌ డెన్నిస్‌ ముక్విగ్‌, ఇరాక్‌లోని యాజిది మైనారిటీ మతానికి చెందిన యువతి నదియా మురాద్‌. నదియా వయసు కేవలం 25 సంవత్సరాలు.

అతి చిన్న వయసులోనే ఇంతటి పురస్కారానికి ఎంపికైన నదియా గుండె నిజానికి ఒక అగ్ని పర్వతమే. ఈమె కంటే చిన్న వయసులో అదే పురస్కారానికి ఎంపికైన మరొక యువతి మలాలా యూసుఫ్‌ జాయ్‌ (2014). చిత్రంగా ఇద్దరూ ఇస్లాం ఉగ్రవాదుల కర్కశత్వానికి బలైన వారే. ఆ ఉగ్రవాద ముఠాలను ఎదిరించడానికి జీవితాలను అంకితం చేసినవారే.

మలాలా జీవితగాథ, చదువు కోసం తపించిన ఆ బాలిక పట్ల ముస్లిం ఉగ్రవాదులు ప్రదర్శించిన క్రూరత్వం ప్రపంచ ప్రజల చేత కన్నీరు తెప్పిస్తుంది. కానీ నదియా మీద జరిగిన అమానుషత్వం విశ్వ మానవాళి చేత రక్తకన్నీరు పెట్టిస్తోంది. ఇదంతా మతం పేరుతో జరిగిన దాడి. ‘లాస్ట్‌ గర్ల్‌’ పేరు తో నదియా రాసుకున్న పుస్తకంలో, ఐక్య రాజ్యసమితిలో ఆమె చెప్పిన అనుభవాలలో ఆ అమానుషమంతా ప్రతిబింబించింది. అయితే ఇప్పుడామె నోటి నుంచి వచ్చే ప్రతి పలుకు మతోన్మాదుల పాశవికతను కళ్లకు కడుతోంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవు. అందుకే కాబోలు, ఆమె గురించి ప్రగతి వాదులు పెద్దగా చర్చించడం లేదు. మైనార్టీ మతోన్మాదం కంటే, మెజార్టి మతోన్మాదం తీవ్రమైనది కదా వారి ఉద్దేశంలో. అక్కడ నదియా మైనారిటీ కావచ్చు. కానీ ఇక్కడ ముస్లింలు మైనారిటీలు. ఇన్ని కోట్ల మంది ముస్లింలలో పదులలో అయినా ఐఎస్‌ను సమర్థించేవారున్నారని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయినా మైనారిటీలకు మనస్తాపం కలిగించడం ఇష్టం ఉండదు. ఛిద్రమై పోయిన నదియా జీవితం ఎదురుగా కనిపిస్తున్నా, ఐఎస్‌ గురించి మన మేధావులు నోరు విప్పరు.

నదియా మురాద్‌ బాసి తాహా ఆమె అసలు పేరు. ఐఎస్‌ ఉగ్రవాదుల చెరలో ఆమె కొన్నినెలలు మాత్రమే ఉంది. అయినా ఆ అనుభవం జీవితం మీద చేసిన గాయం, ఆ గాయం తాలూకు సలుపు ఆమె ముఖంలో ఇప్పటికీ చెరిగిపోలేదని అనిపిస్తుంది. ఆమె ముఖంలో ఒక బాధ తాండవిస్తూనే ఉన్నట్టు అనిపిస్తుంది. 1993లో ఉత్తర ఇరాక్‌లోని కోచో అనే గ్రామంలో పుట్టింది. ఇది సింజార్‌ జిల్లాలో ఉంది. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కలిగిన నదియా కుటుంబం యాజిది అనే మైనారిటీ మతానికి చెందుతుంది. ‘ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ ది లెవాంట్‌’ అనండి, లేదా ‘ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అల్‌షామ్‌’ అని పిలవండి, అందరికీ తెలిసిన ‘ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా’ (ఐఎస్‌ఐఎస్‌)… దీనికే అధికారికంగా ఉన్న పేరు ‘ఐఎస్‌’. అరబిక్‌లో క్లుప్త నామం ‘దయెష్‌’. ఇప్పుడు ప్రపంచాన్ని తన మతోన్మాదంతో భయపెట్టాలని ప్రయత్నిస్తున్న ఐఎస్‌ కన్ను సెప్టెంబర్‌ 15, 2014న నదియా స్వగ్రామం కొచో మీద పడింది. ఆ రోజున ఆ సంస్థ ఉగ్రమూకలు ఆ గ్రామాన్ని చుట్టుమట్టాయి. అప్పుడు నదియాకు 19 ఏళ్లు. అదే రోజున 600 మందిని అక్కడికక్కడే చంపేశారు. వీరంతా పురుషులు. ఇందులో నదియా బంధువులు, సోదరులే ఆరుగురు ఉన్నారు. తరువాత స్త్రీలు, బాలల మీద వాళ్ల దృష్టి పడింది. నదియాను పట్టుకుని ఒక ఉగ్రవాది లాక్కుపోయాడు. అప్పటికే ఆమె తల్లి ఈ బీభత్సాన్ని చూడలేక కొనప్రాణంతో నదియా తొడ మీద తలపెట్టుకుని పడుకుని ఉంది. ఆమె నుంచి అత్యంత పాశవికంగా నదియాను లాక్కుపోయారు. అప్పుడు తల్లి నోటి నుంచి వెలువడిన ఆఖరిమాట ‘నేను బతకను’. తరువాత నదియా తన తల్లిని ఎప్పటికీ చూడలేకపోయింది. తనను పట్టుకున్న ఆ ఉగ్రవాది కొంచెం దూరంలో ఉన్న బస్సు దగ్గరకు తీసుకుపోయి పశుబలంతో అందులోకి ఎక్కించాడు. అప్పటికే అందులో అలాంటి యువతులు ఎందరో ఉన్నారు.

ఆ ఉగ్రముఠా పెద్ద ఒకడు వచ్చి మతం మారు అని అరిచాడు. ఆమె తల అడ్డంగా తిప్పింది. మరోసారి అడిగాడు, మళ్లీ అదే సమాధానం. మతం మారడానికి ఆమె సిద్ధంగా లేదు. ఇలా మతం మారడానికి అంగీకరించని యువతులందరి పట్ల ఆ బస్సులోనే మతోన్మాద ఉగ్రభూతాలు సాగించిన అమానుష లైంగిక హింస గురించి నదియా తన ఉపన్యాసంలో వివరించింది.

నదియాను, మిగిలిన యువతులను మోసుల్‌ చేర్చారు. అక్కడే వారికి అసలు సంగతి చెప్పారు. దొరికిన ఈ యువతులంతా ఇక తమకు లైంగిక బానిసలే అని. అక్కడ నుంచి మొదలైంది. నరక యాతన. రోజూ ఎవరో వచ్చేవారు. ఆ యువతులలో అందంగా ఉన్నవారిని ఎంచుకుని, వివరాలు రాయించుకుని తీసుకుని వెళ్లిపోయేవారు. అలా తనను హజీ సల్మాన్‌ అనే ఉగ్రవాది ఎంత దారుణంగా లైంగిక అత్యాచారం చేశాడో ఆమె చెప్పింది. మతం మారడానికి అంగీకరించని వారికి ఐఎస్‌ వేసే శిక్ష ఇదే. లైంగిక అవసరాల సేవికలుగా విక్రయించడమే. 2015 అక్టోబర్‌ ఆరంభంలో తనను కొనుగోలు చేసిన వ్యక్తి ఇంట్లో పెట్టి సరిగ్గా తాళం వేయకుండా వెళ్లిపోయిన సంగతి గుర్తించిన నదియా అక్కడ నుంచి బయటపడింది. ఏ దేశంలో అయినా, ఎలాంటి మనుషుల మధ్య అయినా మానవత్వం ఉన్నవారు కనిపిస్తారు. తనను బంధించి ఉంచిన ఇంటికి దగ్గరలోనే ఒక కుటుంబం నదియాకు సాయం చేసింది. మొత్తానికి మోసుల్‌ను దాటించింది. అక్కడ నుంచి ఐఎస్‌ ప్రభావం లేని ప్రాంతానికి పంపించింది. అక్కడ నుంచి నదియా జర్మనీకి కాందిశీకురాలిగా వెళ్లి అక్కడ రక్షణ పొందింది. ఇప్పటికీ ఆమె అక్కడే ఉంది. ఆ మరుసటి సంవత్సరమే ఆమె స్విట్జర్లాండ్‌ వెళ్లి ఒక సభలో తనకు జరిగిన అన్యాయం, మొత్తంగా యాజిది తెగకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించింది. ఐఎస్‌లో ఉండే పెద్ద నాయకులనే కాదు, వాళ్ల అకృత్యాలను సమర్థిస్తున్న సాధారణ పౌరులను కూడా విచారించవలసిందేనని నదియా ఘోషించింది.

అసలే ఉగ్రవాదులు. ఆపై మతోన్మాదం. దీనికి తగ్గట్టు చేతిలో ఆయుధం ఉంది. నదియాతో పాటు ఆమె మేనకోడళ్లను కూడా ఉగ్రవాదులు తీసుకుపోయి లైంగిక అవసరాల బానిసలుగా మార్చారు. వారు ఇంకా చిన్నపిల్లలు. సెక్స్‌స్లేవ్స్‌గా కొనుక్కున్న వాడి ఇంటిలో కూడా వీరి యాతన అంతా ఇంతా కాదు. బహుశా అక్కసుతో కాబోలు, అతడి అసలు భార్య వీరందరినీ నీచంగా చూసేదట. ఆహారం కూడా ఆమె దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండేదట.

నదియా ప్రాతినిధ్యం వహిస్తున్న యాజిది మత శాఖ ఇరాక్‌లో ఇస్లాం కంటే ముందే ఉన్నది. సింజర్‌ కొండలు వీరి నివాసం. ఐఎస్‌ బలపడిన తరువాత ఈ తెగను నిర్మూలించాలని పంతం పట్టింది. అందులో భాగమే పురుషులను అంతం చేయడం. స్త్రీలను సెక్సు బానిసలుగా విక్రయించడం. అందుకే ఇప్పుడు నదియా తమ మైనారిటీ మత తెగకు రక్షణ కల్పించాలని, సింజర్‌ కొండల నుంచి బయటపడి చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న తమ మతస్థులను ఏకం చేయాలని కోరుతోంది. ఇప్పుడు వారి హక్కుల పరిరక్షణకే ఆమె ప్రపంచంలోని సంస్థలను వేడుకుంటోంది.

ఐఎస్‌ ఉగ్రవాదుల నీచ మనస్తత్వం ఎంతకు దిగజారిపోయిందో నదియా చెప్పిన ఒక ఉదంతంతో తెలుసుకోవచ్చు. ఉగ్రవాదులు ‘దబిక్‌’ అనే ఒక పత్రికను నడుపుతున్నారు. అరబిక్‌లో ప్రచురించే ఆ పత్రికలో ఐఎస్‌లో చేరవలసిందంటూ ఒక ప్రకటన వెలువరించారు. ఇది యువకులకు ఉద్దేశించినది. అందులో ఐఎస్‌లో చేరిన వారికి సబయా (సెక్స్‌ స్లేవ్‌)లను ప్రోత్సాహకాలుగా అందుబాటులో ఉంచుతామని పేర్కొనడం విశేషం. ఇంత నైచ్యానికి ఏ మతమైనా అంగీకరిస్తుందా? ఏ మత గ్రంథమైనా ఇలాంటి వికృతాన్ని ప్రబోధిస్తుందా? అయినా ఐఎస్‌ను సమర్థిస్తున్న నీచ వ్యవస్థలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. వాటికి ఆయుదాలు, డబ్బు ఇస్తున్నాయి.

ఇదంతా మతం ముసుగులో జరుగు తోంది. నదియా పట్టుదల, ధైర్యం గొప్పవి. కానీ అలాంటి ధైర్యం ప్రపంచంలో పౌరహక్కుల సంస్థలకు లేదు. అందుకే ఇప్పటికీ నదియా కష్టాన్ని, ఆమె గాయాన్ని మతోన్మాదం కోణం నుంచి చూడడానికి భయపడుతున్నాయి. మారణ ¬మాలలో, సాయుధ సంఘర్షణలలో, యుద్ధాలలో ఇలాంటివి జరగడం మామూలే అన్నట్టు, కాబట్టి వాటిని నిరోధించడానికి కృషి చేసినందుకు పురస్కారాలు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. అదే సమయంలో ఆ మతోన్మాదుల, ఉగ్రవాదుల గురించి, వారి పీడ గురించి నాలుగు ముక్కలు చెప్పలేరా?

ఇతర రంగాలు

వైద్యశాస్త్రం – జేమ్స్‌ పి అలిసన్‌ (అమెరికా), తసూకు హొంజో (జపాన్‌).

భౌతికశాస్త్రం – ఆర్థర్‌ అష్కిన్‌ (అమెరికా), జెరార్డ్‌ మొరు (ఫ్రాన్స్‌), డోనా స్ట్రిక్‌ల్యాండ్‌ (కెనడా).

రసాయనిక శాస్త్రం- ఫ్రాన్సిస్‌ హెచ్‌ ఆర్నాల్డ్‌ (అమెరికా), జార్జి స్మిత్‌ (అమెరికా), సర్‌ గ్రెగ్‌ పి వింటర్‌ (బ్రిటన్‌).

అర్థశాస్త్రం – విలియం నోర్దాస్‌, పాల్‌ రొమెర్‌ (అమెరికా)

‘మీటు’ అలజడి కారణంగా ఈ సంవత్సరం సాహిత్య నోబెల్‌ పురస్కారాన్ని స్వీడిష్‌ అకాడమి నిలిపివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *