కుటుంబ, కుల రాజకీయాలను సాగనంపుదాం !

కుటుంబ, కుల రాజకీయాలను సాగనంపుదాం !
  •  బీజేపీకి అవకాశం ఇస్తే రెండు రెట్ల అభివృద్ధి చేస్తాం
  •  తెలంగాణ ఓటర్లకు నరేంద్రమోదీ పిలుపు
  •  నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ ప్రచార సభల్లో ప్రసంగాలు
  •  కార్యకర్తలు, నాయకులలో ఇనుమడించిన ఉత్సాహం

తెలంగాణలో డిశంబర్‌ 7న జరుగబోతున్న శాసనసభ ఎన్నికలలో మెజారిటీ స్థానాలు గెలిచి అధికారంలోకి రావాలని ఏ పార్టీ కలలు కనదు..!

మళ్లీ అధికారంలోకి రావాలని అధికార పార్టీ, ఈ సారైనా అధికారం కైవసం చేసుకోవాలనిప్రతిపక్ష పార్టీ భావించడం సహజమే కదా..!

అయితే ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న అన్ని పార్టీలు అధికార పార్టీతో సహా ప్రచార పర్వం ప్రారంభమయ్యే వరకు కొంత డీలాగానే కనిపించాయి. కానీ అభ్యర్థుల ఖరారు పూర్తయి, ప్రచార పర్వంలోకి దిగిన వెంటనే డీలా నుండి ఒక్కసారిగా బయటపడి నూతనోత్సాహంతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అధికార టిఆర్‌ఎస్‌ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పర్యటన ఉత్సాహం నింపితే, ఇతరులతో జట్టు కట్టిన కాంగ్రెస్‌ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు, చైర్మన్‌లు పర్యటించడంతో ఉత్సాహం మరింత పెరిగింది. కానీ మరో ప్రముఖ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో మాత్రం రాష్ట్ర, ఇతర జాతీయ నాయకులు ఎంత ప్రయత్నించినా ఉత్సాహం ఇనుమడించటం లేదు అని కార్యకర్తలు వాపోతున్న సమయంలో నవంబర్‌ 27న పార్టీ జాతీయ స్థాయి నాయకుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోజంతా రాష్ట్రంలో పర్యటించారు. ఆ పర్యటనతో ఆ పార్టీలో ఉన్న నిస్పృహ ఒక్కసారిగా వదిలినట్లుగా, అందరిలోనూ నూతనోత్సాహం నిండినట్లుగా భావిస్తున్నారు. అందుకు కారణం మోదీ ప్రభావవంతమైన ప్రసంగాలే.

మోదీ ఒకే రోజు మొదట నిజామాబాద్‌లోనూ, తరువాత మహబూబ్‌నగర్‌లోనూ తన వాడి వేడి ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. సూటిగా మాట్లాడుతూ, అభివృద్ధే తమ మంత్రం అని, సబ్‌ కా సాథ్‌ – సబ్‌ కా వికాస్‌ తమ నినాదమని చెబుతూ, తాము కేంద్రంలో ఏం చేశామో, రాష్ట్రానికి ఏమిచ్చామో, ఇక్కడ అధికారంలోకి వస్తే ఇంకా ఏం చేస్తామనే విషయంలో చక్కని స్పష్టతనిచ్చారు.

అధికార టిఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌లను ఒకే నాణానికి రెండు వైపుల ఉండే బొమ్మలని చెబుతూ, రెండూ కుటుంబ పార్టీలే అని, రెండూ కుల రాజకీయాలు చేస్తూ, అభివృద్ధిని గాలికొదిలేశాయని చెప్పారు. రెండూ ముస్లిం రిజర్వేషన్ల విషయాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాయని, హిందూ ముస్లింల మధ్య, కులాల మధ్య, నగరాల గ్రామాల మధ్య విభేదాలు సృష్టిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నాయని చెబుతూ, అటువంటి పార్టీలు ఇప్పుడు మనకు ఇంకా అవసరమా ? అని గ్యాలరీలలోని ప్రేక్షకులను ప్రశ్నిస్తూ వారి నుండి సమాధానాలు రాబడుతూ వారిలోనూ, కార్యకర్తలలోనూ ఉత్సాహం నింపారు.

అభివృద్ధి చేయకుండా, ఎప్పటికప్పుడు కుల, కుటంబ రాజకీయాలు చేస్తూ మళ్లీ ఓట్లు అడిగే పరిస్థితి గత 50 ఏళ్లలో సాగిందని, కానీ ఇప్పుడు అది కుదరటం లేదని చెప్పారు. అభివృద్ధి చేయకపోవడం వల్ల నేడు కాంగ్రెస్‌ను అన్ని రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారని, గత 40 ఏళ్లుగా అది ఎక్కువ రాష్ట్రాలలో అధికారంలోకి రాలేకపోతున్నదని, టిఆర్‌ఎస్‌ కూడా అదే బాటలో పయనిస్తున్నదని చెప్పారు. అభివృద్ధి చేయని కాంగ్రెస్‌ను మళ్లీ రానివ్వొద్దని చెప్పారు. అభివృద్ధే మంత్రంగా పనిచేస్తున్న బీజేపీకి ఓటు వేసినట్లయితే ఈ రాష్ట్రంలో రెండు రెట్లు అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రకటించారు. మహిళ, రైతు, యువత, ఇంకా అనేక వర్గాల ఉన్నతి కోసం పనిచేస్తామని చెప్పారు.

ఇక్కడి ముఖ్యమంత్రికి తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధేమీ లేదని, అధికారం నిలబెట్టుకోవడమే ఆయన, ఆయన కుటుంబం లక్ష్యమని మోదీ అన్నారు. ఈ ముఖ్యమంత్రి మొదట చంద్రబాబు వద్ద శిక్షణ పొందారని, తరువాత మేడమ్‌ సోనియా వద్ద శిక్షణ పొందారని, కుటుంబ పార్టీల శిక్షణలో తయారైన వ్యక్తి తన కుటుంబం బాగోగుల గురించి కాక మొత్తం రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి ఎలా ఆలోచించగలరని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం ఒక్క కుటుంబం పోరాడితే సాకారమైనది కాదని, అనేకమంది ప్రజల పోరాటం వల్ల, బలిదానాల వల్ల సాధ్యమైందని, అటువంటి తెలంగాణ ఏర్పడి నాలుగున్నరేళ్లు అయినప్పటికీ రాష్ట్రం అభివృద్ధి వైపు ఎందుకు దూసుకుపోవటం లేదని, ఎందుకు అస్తవ్యస్త అవుతున్నదని ప్రశ్నించారు. ఇది ఎన్నికల సమయం అని; యువత, రైతులు, బీద, బడుగు, బలహీన, వెనుకబడిన, గిరిజన వర్గాల విషయంలో ఏం చేశారని అడగాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల ఆదాయం రెండు రెట్లు పెరిగేలా ప్రతి సంవత్సరం చర్యలు తీసుకుంటున్నామని, 2022 నాటికి ఆ లక్ష్యం సాధించే దిశగా మద్దతు ధరలు పెంచుతున్నామని, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని అన్నారు. అలాగే యువత, మహిళ, ఇంకా అనేక వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు.

ఇవి కాక నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ సభలలో మరిన్ని ప్రత్యేక విషయాలు ప్రస్తావించారు. అవి మోదీ మాటలలోనే..

నిజామాబాద్‌ సభలో..

ప్రజలందరికీ నా శుభాభివందనాలు. అందరికీ నా నమస్కారాలు. (తెలుగులోనే).

నా ప్రియమైన సోదర సోదరీమణులారా..

ఇంతమంది నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నిజామాబాద్‌కు చెందిన మాలావత్‌, పూర్ణ అనే ఇద్దరు గిరిజనులు ఎవరెస్టు శిఖరంపై భారత జాతీయపతాకాన్ని ఎగరేసి, మొహమ్మద్‌ హుస్సేన్‌ అనే క్రీడాకారుడు కామన్‌వెల్త్‌ క్రీడలలో పతకం సాధించి భారత ప్రతిష్టను పెంచారు. వీళ్లు ఈ దేశ యువత ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు. నేను ఈ ఎన్నికల సందర్భంగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలలో కూడా పర్యటిస్తున్నాను. అన్నిచోట్ల ఇదే ఉత్సాహం కనబడుతోంది.

ఇక్కడి ప్రస్తుత ముఖ్యమంత్రి నిజామాబాద్‌ను లండన్‌లా స్మార్ట్‌సిటీ చేస్తానని అన్నారు. స్మార్ట్‌ సిటీ చేయటం తరువాత సంగతి. కనీసం విద్యుత్తు, తాగునీరు, రోడ్లు లేవు. నేను ఈ జిల్లా అంతా హెలికాప్టర్‌ ద్వారా తిరిగాను. అంతా అస్తవ్యస్తంగా ఉంది. అభివృద్ధి లేమి కనబడుతోంది. ముఖ్యమంత్రి లండన్‌ వెళ్లి 5 సంవత్సరాలు ఉండి వస్తే అప్పుడు ఆయనకు అభివృద్ధి గురించి తెలుస్తుందేమో..! అలాగే ఇక్కడ భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (డ్రైనేజి) నిర్మాణం పనులు జరుగుతున్నాయి. కాని అది చూస్తే డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం జరుగుతోందా? లేక నగర నాశనం జరుగుతోందా ? అనిపిస్తోంది.

ఏదీ పూర్తిగా చేయరు

ఇక్కడి ముఖ్యమంత్రి తాను ప్రజలకు ఇచ్చిన హామీలను, చేపట్టిన పనులను, ప్రాజెక్టులను దేనినీ పూర్తిగా చేయలేదు. నాలుగున్నర ఏళ్లలో సగమే చేశారు. అంతెందుకు..! ఆయనకు 5 ఏళ్ల కాలం పాలించమని ఇస్తే అదికూడా పూర్తిగా చేయలేదు. కానీ ఇటువంటి పాలన నుండి ప్రజలకు కొన్ని నెలల ముందు ముక్తి కలగడం సంతోషకరం.

నిజామాబాద్‌ ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్నారు. ముఖ్యమంత్రి ఇంటింటికి గోదావరి నీటిని ఇస్తానని, అలా చేయలేకపోతే ఇక వచ్చేసారి ఓట్లు అడగనని అన్నారు. కాని నాలుగున్నరేళ్ల తరువాత ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇంటింటికి గోదావరి నీరు రాలేదు కానీ, ముఖ్యమంత్రి మళ్లీ ఓట్లు అడగటానికి వస్తున్నారు. ఆయనకు మీరంతా వీడ్కోలు పలకండి.

దానివల్ల బీదలు నష్టపోయారు

ధనికులకు అనారోగ్యం వస్తే కార్పొరేట్‌ ఆసుపత్రి నుండి డాక్టర్లను ఇంటికి పిలిపించుకుని వైద్యం చేయించుకోగలరు. అదే బీదవారికి రోగాలు వస్తే ఏం చేయగలరు ? అటువంటి వారి కోసం ప్రభుత్వం అండగా నిలవాలి. వైద్య సదుపాయాలు పెంచాలి. కానీ ఇక్కడి వైద్యకళాశాలే చాలా కష్టాల్లో ఉన్నట్లు కనబడుతోంది. ఇంక వైద్య సదుపాయాలేం ఉంటాయి ! ఇక మేం కేంద్రప్రభుత్వ పథకంగా దేశవ్యాప్తంగా 50 కోట్లమంది బీదలకు ఆరోగ్యం విషయంలో లబ్ది చేకూర్చే ‘ఆయుష్మాన్‌ భారత్‌’ ప్రవేశపెట్టాం. ఈ పథకం కింద అర్హులైన వారికి సంవత్సరానికి 5 లక్షలు రూపాయల వైద్య ఖర్చులు కేంద్రం భరిస్తుంది. కిడ్నీ సమస్య, హృదయ రోగాలు, కేన్సర్‌ వంటి అనేక పెద్ద, చిన్న రోగాలకు ఈ పథకం కింద ఉచితంగా చికిత్స లభిస్తుంది. 2 నెలల క్రితం ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటికే 3 లక్షల మంది నాణ్యమైన చికిత్స పొందారు. అటువంటి పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అమలు చేయడానికి నిరాకరించారు.

ఆయనెప్పుడూ అభద్రతలో ఉంటున్నారు. దాని నుండి బయట పడటానికి మంత్రం, తంత్రం, నిమ్మకాయ, మిరపకాయ అంటూ ఏవో పూజలు చేస్తుంటారు. ఆ అభద్రత భావంతోనే బీదలకు ఆరోగ్య భద్రతనిచ్చే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని రాష్ట్రంలో అమలు కాకుండా అడ్డుకున్నారు. దానివల్ల బీదలు నష్టపోతున్నారు.

దేశవ్యాప్తంగా గ్రామాలలోని మహిళలు కట్టెల పొయ్యితో వచ్చే పొగ వలన ఎన్నో రోగాల బారిన పడుతున్నారు. మేం అధికారంలోకి రాగానే పొగబారిన పడుతున్న మహిళలను ఆ బాధల నుండి తప్పించాలని సంకల్పించాం. ఫలితంగా ఉజ్వల పథకం కింద దేశవ్యాప్తంగా ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేశాం. ఇప్పటివరకు ఈ పథకం కింద 6 కోట్ల మంది మహిళలు గ్యాస్‌ కనెక్షన్లు పొందారు. తెలంగాణలో 5 లక్షలు కనెక్షన్లు ఇచ్చాం.

మేం రాకముందు కరెంటు పోవటం అనేది సర్వసాధారణం. మేం దానిని కూడా పరిష్కరించాం. ఉదయ్‌ పథకం కింద దేశంలోని అన్ని గ్రామాలను విద్యుత్‌తో అనుసంధానించాం. త్వరలోనే అన్ని ఇళ్లకు విద్యుత్‌ ఇచ్చే లక్ష్యం నెరవేరుతుంది.

మేం రాకముందు పెన్షన్‌ పొందాలంటే ఒక దళారీని ఆశ్రయించాల్సి వచ్చేది. ప్రభుత్వం నుంచి ఏ లబ్ది పొందాలన్నా దళారీలు లేకుండా పని జరిగేది కాదు. కాని మేం దానిని మార్చాం. అందరికీ జన్‌ధన్‌ యోజన కింద ఉచిత బ్యాంక్‌ ఖాతాలు ఇప్పించాం. ప్రభుత్వ లబ్దిని, సబ్సిడీలను, పెన్షన్‌లు, ఇంకా అనేక పథకాల నిధులను అర్హులకు నేరుగా తమ ఖాతాలలోకి వచ్చేలా ఏర్పాట్లు చేశాం. దానితో అర్హులకు ఎంతో మేలు జరుగుతోంది. అలా దళారీల బారిన పడకుండా సుమారు 90 వేల కోట్ల రూపాయలు కాపాడాం.

అదేవిధంగా 2008 నుండి 2014 వరకు అప్పటి ప్రభుత్వం ధనార్థులకు బ్యాంకుల నుండి ఎడాపెడా రుణాలు ఇచ్చేసింది. వాటిని వసూలు చేసే పని చేపట్టలేదు. దాంతో ధనార్థులు బ్యాంకులను లూటీ చేసే విధానాలకు పాల్పడ్డారు. మేం రాగానే ఆ విధానాలకు తాళం వేశాం. రుణాలు తీసుకున్న వారిని ప్రశ్నించడం మొదలుపెట్టాం, చట్టాలు మార్చాం. చాలామంది దగ్గర నుండి రుణాలను వసూలు చేశాం. ఇప్పటికీ రుణం చెల్లించని వారి ఆస్తులను త్వరలోనే జప్తు చేస్తాం.

మహబూబ్‌నగర్‌ సభలో..

ఈ సారి మాకు అవకాశం ఇస్తే ఈ ఐదేళ్లలో జరగాల్సిన అభివృద్ధి లెక్కకట్టి వడ్డీతో సహా చేస్తాం.

కృష్ణా, తుంగభద్ర నదులు పుష్కలంగా ప్రవహిస్తున్న ఈ నేలలో నీటి చుక్క కోసం ఎందుకు ఎదురుచూడాల్సి వస్తోంది ? నోరు ఎందుకు ఎండబెట్టుకోవాల్సి వస్తోంది ?

ఆంధ్రప్రదేశ్‌ని కాంగ్రెస్‌ రెండు రాష్ట్రాలుగా అడ్డదిడ్డంగా విభజించింది. అడ్డగోలు, హడావిడి విభజన వల్ల రేగిన ఘర్షణలు ఇప్పటికీ సద్దుమణగ లేదు. ఫలితంగా రెండు రాష్ట్రాలలోనూ అభివృద్ధి కుంటుపడింది. కానీ బీజేపీ ఇంతకుముందు మూడు రాష్ట్రాలను విభజించి ఆరు రాష్ట్రాలుగా చేసింది. ఈ పనిని చక్కగా అందరి ఆమోదాన్ని తీసుకుని ప్రశాంతంగా చేసింది. విభజిత రాష్ట్రాల మధ్య, కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాల మధ్య ఎటువంటి ఘర్షణ లకు తావు లేకుండా ఈ పని జరిపింది. ఫలితంగా ఈ 6 రాష్ట్రాలు ఎటువంటి ఘర్షణలు లేకుండా అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నాయి.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యుత్తు, జన్‌ధన్‌ ఖాతాలు, గ్యాస్‌ కనెక్షన్లు, రోడ్లు, రైళ్లు, స్మార్ట్‌సిటీలు, పేదలకు ఇళ్లు ఇచ్చింది. యూపీఏలో కేంద్రమంత్రిగా పనిచేసిన కెసిఆర్‌ తెచ్చిన నిధులకన్నా రెండు రెట్ల నిధులను బీజేపీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఇస్తున్నది. రైలు మార్గాలు, హైవేలను అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్టు లన్నింటి కోసం 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇంకా హైదరాబాద్‌కు మెట్రో ప్రాజెక్టు కేటాయించింది.

60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలోనూ, నాలుగున్నరేళ్ల టిఆర్‌ఎస్‌ పాలనలోనూ రైతుల గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. వారి గురించి మాట్లాడే హక్కు వారికి లేదు. మన తొలి ప్రధాని పటేల్‌ అయితే ఈ దుస్థితి ఉండేది కాదు. ఆయన వల్లే మన హైదరాబాద్‌ విముక్తమైంది. లేదంటే ఇక్కడికి రావటానికి వీసా తీసుకోవలసి వచ్చేది. అంతటి ధీరుడు కనుకే పటేల్‌కు గుజరాత్‌లో అతి పెద్ద విగ్రహం నిర్మించాం. ఇక బీజేపీ ప్రభుత్వంలో రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. యూపీఏ హయాంలో రైతుల స్థితిగతులపై స్వామినాథన్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికలో రైతులకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఇవ్వాలని చెప్పారు. కాంగ్రెస్‌ దీనిని తుంగలో తొక్కింది. మేం రాగానే ఆ విషయంలో శ్రద్ధ తీసుకున్నాం.

తెలంగాణ కోసం పోరాడితే మీపై తుపాకీలు పేల్చిన కాంగ్రెస్‌ను మళ్లీ నమ్మకండి. తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌ పెద్దలైన తల్లీ కొడుకులు పాల్గొని, తెరాసను కుటుంబ పార్టీ అని, దానికి వ్యతిరేకంగా పోరాడమని చెబుతున్నారు. ఇది అతి పెద్ద జోక్‌.

మేం వచ్చాక అందరికీ ఇళ్లు మంజూరు చేసే పథకం ప్రారంభించాం. ఆ ఇంటిని ఇంటి ఇల్లాలైన మహిళ పేరు మీద రిజిస్టర్‌ చేస్తున్నాం. ఇక్కడి ముఖ్యమంత్రి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని వాగ్దానం చేశారు. అవి ఎక్కడ ఇచ్చారు ? ఎప్పుడు ఇచ్చారు ? అసలెక్కడైనా కట్టారా ? ఇది అసత్యం కాదా?

మేం 2022 నాటికి అందరికీ ఇళ్లు ఇవ్వాలని సంకల్పించాం. ఆ ఇల్లు మహిళల పేరుమీద రిజిస్టరు చేయిస్తాం. ఆ ఇంటిలో నల్ల ఉంటుంది, నల్లాలో నీళ్లు ఉంటాయి, టాయిలెట్‌ ఉంటుంది. విద్యుత్‌ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పటివరకు 1.25 లక్షల ఇళ్లు నిర్మించాం. వారు ఈ సంవత్సరం దీపావళి పండుగను ఆ ఇళ్లలోనే జరుపుకున్నారు.

మీరు ఈసారి బీజేపీకి ఓటు వేయండి. ఒక్క అవకాశం ఇవ్వండి. మీ అభివృద్ధి రెండు రెట్లు అవుతుంది. కుటుంబ, కుల రాజకీయాలు చేసే టిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌లను సాగనంపండి. డిశంబర్‌ 7న జరిగే ఎన్నికలలో బిజెపి మీట నొక్కి తెలంగాణ అభివృద్ధికి బాటలు వేయమని కోరుతున్నాను.

భారత్‌మాతాకీ జై.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *