‘మదర్సాలతో ముప్పు!’

‘మదర్సాలతో ముప్పు!’

మదర్సాలంటే ఇస్లాం మత వ్యవస్థలో పాఠశాలలు. అక్కడ ప్రధానంగా మత బోధ జరుగు తుందన్నది ఓ బహిరంగ రహస్యం. మత గురువులను, పురోహితులను అవి తయారుచేస్తాయి. ఇటీవలి కాలంలో ఈ విషయాన్ని అంగీకరించడానికి చాలామంది ముస్లింలు వెనుకాడడం లేదు కూడా. కానీ మదర్సాలు ఇలాంటి బోధనలకే కట్టుబడి ఉన్నాయా? లేదు. భారతదేశంలోని మదర్సాల మీద రాను రాను పెరుగుతున్న ఆరోపణలు కలవర పరిచేవిగా కూడా ఉన్నాయి. ఆ విద్యాలయాలు తీవ్ర ఆరోపణలతో అపకీర్తిని మూట కట్టుకుంటున్నాయి. ఏ భాషలో అయినా కావచ్చు, అక్కడ బోధించేది అసలు సిసలు విద్యే అయితే అభ్యంతరం ఉండక్కర లేదు. కానీ విద్వేషం నూరిపోస్తేనే ప్రమాదం. కానీ జరుగుతున్నది అదే. అవి విద్వేషాన్ని, అసహనాన్ని నూరిపోస్తున్నాయని బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. మదర్సాల విద్యా బోధన మీద అనుమానాలు బలపడుతున్నాయి. ఇది భారతదేశం లోని మదర్సాల మీద మాత్రమే ఉన్న ఆరోపణ కాదు. ఆ ఆరోపణలు, అనుమానాలు హఠాత్తుగా మొదలైనవి కూడా కాదు. లేదా కొన్ని పత్రికలు, దొంగ సెక్యులరిస్టులు ప్రచారం చేస్తున్నట్టు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల దుష్ప్రచారం కాదు. 9/11 తరువాత విశ్వవ్యాప్తంగా మదర్సాల మీద నిఘా పెరిగింది. వాటి మీద ప్రపంచానికి ఉన్న అభిప్రాయం ఎలాంటిదో చెప్పడానికి ఇది చాలు. ఇది దురదృష్ట కరం. పైగా ‘జీహాదీ బిల్‌ సైఫ్‌’ (కత్తితో పవిత్ర యుద్ధం) నినాదం మరిన్ని అనుమానాలు రేకెత్తించేదిగా కనిపించింది. మదర్సాలకు తాళం వేయడం తక్షణావసరం అంటూ ఇటీవల ఉత్తరప్రదేశ్‌ షియా వక్ఫ్‌ బోర్డ్‌ అధ్యక్షుడు వసీం రిజ్వి భారత ప్రధానికి లేఖ రాయడంతో ఈ వివాదం మళ్లీ తెర మీదకు వచ్చింది.

ప్రాథమిక స్థాయి మదర్సాలు ఐఎస్‌ఐఎస్‌ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాయని, కాబట్టి వాటన్నిటిని తక్షణం మూసివేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌ షియా వక్ఫ్‌ బోర్డ్‌ అధ్యక్షుడు వసీం రిజ్వి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ (జనవరి 21, 2019) రాయడం సంచలనమైంది. ఆ మదర్సాలకు వెంటనే తాళాలు వేయకపోతే, వచ్చే పదిహేనేళ్లలో భారత ముస్లిం జనాభాలో సగం మంది ఐఎస్‌ సిద్ధాంతానికి మద్దతుదారులుగా మారిపోతారని కూడా ఆ లేఖలో ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఐఎస్‌ను (ఇప్పుడు ఇస్లామిక్‌ స్టేట్‌ అని పిలుస్తున్న ఆ ముస్లిం మత ఛాందస సంస్థనే కొంతకాలం క్రితం వరకు ఐఎస్‌ఐఎస్‌ అని పిలిచేవారు) ప్రపంచంలోనే అతి ప్రమాదకర ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నారు. మహమ్మదీయ కుటుంబాల చిన్నారులు మదర్సాలలో చేరాలని ఒకవేళ అనుకుంటే, ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత ఆ పని చేయవచ్చునని కూడా రిజ్వి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ప్రపంచంలో చాలా ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాల కోసం పిల్లలను లక్ష్యంగా చేసుకోవాలని చూస్తున్నాయని, ఐఎస్‌ఐఎస్‌ అతి ప్రమాదకర ఉగ్రవాద సంస్థగా అవతరించిందని, ఇది క్రమంగా ప్రపంచంలోని ముస్లిం జనాభా మీద పట్టును పెంచుకుంటున్నదని రిజ్వి పేర్కొన్నారు. మన దేశంలో మారుమూల గ్రామీణ ప్రాంతాలలో కూడా మదర్సాలు పని చేస్తున్నాయని, ఈ ప్రాథమిక స్థాయి మదర్సాలు విరాళాల పేరుతో మన చిన్నారుల భవిష్యత్తును ధ్వంసం చేస్తున్నాయని, ఇవే ఐఎస్‌ఐఎస్‌ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాయని రిజ్వి ఆరోపించారు. ఈ రకం ప్రచారం మన పిల్లలనే కాకుండా, దేశాన్ని కూడా నాశనం చేస్తుందని హెచ్చరించారు. పిల్లలకు డబ్బులు చెల్లించి మదర్సాలకు రప్పించే కశ్మీర్‌లో ఐఎస్‌ఐఎస్‌కు బాహాటంగా మద్దతునివ్వడం కనిపిస్తున్నదని, అక్కడ మహమ్మదీయ విద్య పేరుతో పిల్లలను మిగిలిన సమాజం నుంచి దూరం చేస్తున్నారని రిజ్వి ఆరోపించారు. ఒకవేళ ఉన్నత పాఠశాల విద్య తరువాత మదర్సాలలో ప్రవేశం పొందినప్పటికీ మత ఛాందస బోధల నుంచి బయటపడే విజ్ఞత వారికి వస్తుందని రిజ్వి అభిప్రాయపడ్డారు (ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, జనవరి 23, 2019, 9వ పేజీ). రిజ్వి అయోధ్య రామ మందిర నిర్మాణం డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నారు. అలాగే ఉమ్మడి పౌర స్మృతి ఆశయానికి కూడా ఆయన అనుకూలురు.

ఇది ముస్లింలలోనే ఒక వర్గానికి చెందిన నాయకుడు చేసి ఉండవచ్చు. లేదా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలురు చేసి ఉండవచ్చు. అంతమాత్రానికే మదర్సాలకు తాళాలు బిగించాలని ఎవరూ చెప్పరు. కానీ, వాటి చరిత్ర, భారతదేశంలో వాటి పనితీరు రిజ్వి అభిప్రాయంతో ఏకీభవించక తప్పని పరిస్థితిని కల్పిస్తున్నాయి. కశ్మీర్‌లోయలో ఐఎస్‌ జాడలు సుస్పష్టం. శ్రీనగర్‌లో మొగలుల కాలం నాటి గ్రాండ్‌ మాస్క్‌ మీద ఐఎస్‌ జెండాను ఆ సంస్థ వలలో పడినవారు ఎగురవేసిన సంగతీ దేశానికి తెలుసు. అయినా రిజ్వి ఆవేదనలోని, లేఖలోని నిజానిజాలను గురించి ఆలోచించడానికి మన మేధావులు, మీడియా సిద్ధంగా లేవు. రిజ్వి లేఖకు అవి ఇచ్చిన ప్రాచుర్యమే ఇందుకు నిదర్శనం. మరొక అంశమైతే మీడియా, మేధావులు ఈపాటికి గళాలను సవరించేవారే. కత్తులు నూరేవారే. ఈ సందర్భంలోనే ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. 2014 సెప్టెంబర్‌లో ఉన్నావ్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నాయకుడు సాక్షి మహరాజ్‌ పార్లమెంటులోనే ఒక అంశాన్ని లేవనెత్తారు. ‘మదర్సాలలో ఉగ్రవాద విద్యను బోధిస్తున్నారు. అక్కడ చదువుకుంటున్న వారిని అవి ఉగ్రవాదులుగా, పవిత్ర యుద్ధవాదులుగా (జీహాదిస్టులు) తయారు చేస్తున్నాయి. వాటిలో చదివే యువకులకు డబ్బు ఆశ చూపి లవ్‌ జీహాద్‌కు పురిగొల్పుతున్నారు. సిక్కు యువతిని వలలో వేసుకుంటే 11 లక్షలు, హిందూ బాలిక అయితే 10 లక్షలు, జైన బాలిక అయితే 7 లక్షల వంతున ఇవ్వజూపుతున్నారు. మదర్సాలలో బోధిస్తున్న విద్య జాతీయ ప్రయోజనాలను ఉద్దేశించినది కాదు. ఆగస్టు 15, గణతంత్ర దినోత్సవం జనవరి 26 తేదీలలో త్రివర్ణ పతాకం ఆవిష్కరించే ఒక్క మదర్సాను నాకు చూపించండి! చాలావరకు ఇతర పాఠశాలలు ఎలాంటి నిధులకు నోచుకోవు. కానీ జాతీయ వాదానికి దూరంగా ఉండే మదర్సాలకు మాత్రం నిధులు వెళుతున్నాయి’ అన్నారు సాక్షి మహరాజ్‌. దీనికి సహజంగానే సెక్యులరిస్టుల నుంచి, ‘సెక్యుల రిస్టు’ మీడియా నుంచి తీవ్రమైన దాడి ఎదురయింది. విపక్షాలకు, మీడియాకు వాస్తవాలు అక్కరలేదు. సాక్షి మహరాజ్‌ తమ పార్టీ సిద్ధాంతం దృక్కోణం నుంచి చూస్తూ వాస్తవాన్ని మరచిపోతున్నారని ఒక ప్రముఖ ఆంగ్ల వారపత్రిక ధ్వజమెత్తింది.

నిజానికి సరిగ్గా సాక్షి మహరాజ్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాన్నే జనవరి 17, 2002న సిలిగురిలో ఒక సభలో నాటి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య కూడా వ్యక్తం చేశారు. మరి ఆయన వ్యాఖ్యల మాటేమిటిి? కానీ ఆ వ్యాఖ్య చేసినందుకు బుద్ధదేవ్‌ చాలా ప్రతిఘటన ఎదుర్కొన్నారు. సీపీఎం సీనియర్‌ నాయకుడు, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు కూడా బుద్ధదేవ్‌ మీద మండిపడ్డారు. బుద్ధదేవ్‌ మీరు తప్పు చేశారు అని బాహాటంగానే విమర్శించారు. ఆలస్యం లేకుండా నష్ట నివారణ చర్యలు తీసుకోమని హుకుం జారీ చేశారు. ఇక సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు, కార్యకర్తలు, ముస్లింల ఆగ్రహావేశాలకు హద్దే లేకుండా పోయింది.. ఇంతకీ బుద్ధదేవ్‌ ఏమన్నారు? ‘మదర్సాలలో విద్యాబోధనను ఆధునీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అధికారికంగా రిజిస్టరు కాని సంస్థలలో అరబిక్‌, థియాలజీ (మతాంశాలు) బోధిస్తున్నారు. ఆధునిక కాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకునే విధంగా విద్యార్థులను తీర్చి దిద్దడానికి ఇవి చాలవు. చాలా సంస్థలు సమాజానికీ, ఆ వర్గానికీ భారంగా పరిణమించాయి. అక్కడ ఇంగ్లిష్‌, కంప్యూటర్స్‌, ఆధునిక పాఠ్యాంశాలను బోధించడం అవసరమని మా అభిప్రాయం. ఇవాళ సంస్కృతాన్ని మాత్రమే బోధించే విద్య యువకులను ఉద్యోగాలకు అర్హులను చేయగలుగుతుందా? ఇదే కాకుండా కొన్ని మదర్సాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు మాకు సమాచారం ఉంది. అలాంటి వాటిని మూసివేయడానికి ప్రభుత్వం సంకోచించదు’ అని అన్నారాయన. ఈ ప్రకటనను బీజేపీ అగ్రనేత ఎల్‌కె అడ్వాణీ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో (2002, ఫిబ్రవరి) ప్రసంగించినప్పుడు ప్రస్తావించారు. ఇది బెంగాల్‌ వామపక్షంలో మరింత రగడకు కారణమైంది. కాబట్టి సాక్షి మహరాజ్‌ బీజేపీ సభ్యుడైనంత మాత్రాన ఆయన చెప్పిన అంశం తప్పనిసరిగా ముస్లింల మీద విద్వేషంతో చేసినదే అని తీర్పు చెప్పడం సరికాదు. కానీ ఇలాంటి తీర్పులే ఇప్పుడు ఎక్కువ వినిపిస్తున్నాయి.

భారత్‌లో ఇస్లాంకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలన్న ఆకాంక్ష కొన్ని ముస్లిం అనుకూల సంస్థలలో ఉన్న మాట కాదనలేనిది. ప్రపంచ పటం మీద ఇస్లాం జెండా ఎగురవేయాలన్న ఆశయం కూడా ఉగ్రవాదులు కొన్ని సందర్భాలలో వెలుబుచ్చిన సంగతి మరచిపోరాదు. ఇస్లాంకు పూర్వ వైభవం తీసుకురావడంలో మదర్సా (మదర్సా అనే అరబిక్‌ పదానికి బహువచనం మదర్సి)ల సేవ కూడా ఉంటుందని దారుల్‌ ఉలుమ్‌ దేవ్‌బంద్‌ వంటి వ్యవస్థలు నమ్ముతాయన్నది కూడా వాస్తవమే. మదర్సాల విస్తరణ వివరాలను చూస్తే ఈ ఆరోపణ నిరాధారమని అనలేం. ప్రొఫెసర్‌ ముషిరుల్‌ హక్‌ అనే మేధావి మదర్సాల విస్తరణ గురించి విస్తుపోయే వివరాలు ఇచ్చారు. భారతదేశంలో 1947 నాటికి కేవలం 88 ఉన్న మదర్సాలు, 2006 నాటికి ఐదు లక్షలకు చేరుకున్నాయి. ఇందులో చదువుతున్నవారి సంఖ్య దాదాపు ఐదు కోట్లు. కాబట్టి మదర్సాలలో చదివే విద్యార్థులు నాలుగు నుంచి ఐదు శాతానికి పరిమితమంటూ సచార్‌ కమిషన్‌ చేసిన సూత్రీకరణ వాస్తవం కాదని దీని ప్రాతిపదికగానే పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రముఖ ముస్లిం మేధావి డాక్టర్‌ అర్జుమంద్‌ అరా కూడా అక్షరాల ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. డాక్టర్‌ అరా ‘మదర్సాస్‌ అండ్‌ ది మేకింగ్‌ ముస్లిం ఐడెంటిటీ’ పేరుతో రాసిన వ్యాసాన్ని ‘రి డిఫైనింగ్‌ ఉర్దూ పాలిటిక్స్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో వెలువడిన పుస్తకంలో (ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌, న్యూఢిల్లీ, 2006) చేర్చారు. అందులో డాక్టర్‌ అరా ఇలా రాశారు, ‘ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలో అర మిలియన్‌ (ఐదు లక్షలు) మదర్సాలు నడుస్తున్నాయి. వాటిలో యాభయ్‌ మిలియన్‌ల విద్యార్థులు చేరారు (ఐదు కోట్లు. అప్పటి ముస్లిం జనాభా పదిహేను కోట్లు) చేరారు. ఇందులో పార్ట్‌టైమ్‌, సాయంకాల మదర్సాలను చేర్చలేదు’. ఆమె కూడా ఈ ఐదు కోట్ల మంది ముస్లిం బాలల భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. ఆ వ్యాసాన్ని ఆమె ఆగస్ట్‌ 17, 2002 టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వెలువరించిన వార్తతో ఆరంభించారు. ఇదీ ఆ వార్త, ‘మీరట్‌కు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న బసాలా గ్రామంలో 200 మంది విద్యార్థులు పాకిస్తాన్‌ జెండా ఎగరేసి పాక్‌ అనుకూల నినాదాలు చేశారు. ఒసామాకు అను కూలంగా నినాదాలు ఇచ్చారు.’ ఇదంతా మదర్సా విద్య ప్రభావం.

2002లో బుద్ధదేవ్‌ చేసిన ప్రకటన సంగతిని మళ్లీ ప్రస్తావించుకుందాం. ఆయన తను చేసిన ప్రకటనకు పశ్చాత్తాపం ప్రకటించకపోవడం విశేషం. తన వ్యాఖ్య గురించి బుద్ధదేవ్‌ తరువాత మౌనం వహించినా, ఆయన చెప్పినది వాస్తవమేనని 2017లో రుజువైంది. పశ్చిమ బెంగాల్‌లో మూడు రకాల మదర్సాలు ఉన్నాయి. సాధారణంగా ఎక్కడైనా ఇలాగే ఉంటాయి. ప్రభుత్వ గుర్తింపు, నిధులతో నడిచేవి. ప్రభుత్వ గుర్తింపు ఉండి నిధులు కేటా యింపు లేనివి. గుర్తింపు, నిధులు, నిఘా కూడా లేనివి ఇంకొన్ని. నిజానికి ఈ చివరి రకం మదర్సాలే 90 శాతం ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 6000 మదర్సాలు ఉన్నాయి. బుద్ధదేవ్‌ ప్రకటన వెనుక ఉన్నవి నిజాలేనని చెప్పడానికే ఇదంతా. సాక్షి మహరాజ్‌ బీజేపీ దృష్టితో మదర్సాలపై ఆరోపణలు చేస్తున్నారని వాదించేవారికి బుద్ధదేవ్‌ భట్టాచార్య ప్రకటనను మించిన సమాధానం వేరొకటి ఉండదు.

బుద్ధదేవ్‌ ప్రకటన పట్ల ఆయన పార్టీ సీపీఎం ధ్వజమెత్తి ఉండవచ్చు. ఆయన గొంతు నొక్కే యత్నం చేయడంలో విజయం సాధించి ఉండవచ్చు. కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవాలను ఎవరూ కాదనలేరు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 24 పరగణాలు జిల్లాలో ఓ గ్రామం బసిర్హాత్‌. బంగ్లా, భారత్‌ సరిహద్దుల దగ్గరి గ్రామం. ఇక్కడ 2017లో కొన్ని రోజుల పాటు మత ఘర్షణలు జరిగాయి. ఆ తరువాత మదర్సాల మీద పోలీసులు దృష్టి పెట్టక తప్పని పరిస్థితులు ఎదురయ్యాయి. బసిర్హాత్‌ చుట్టుపక్కల ఉన్న దాదాపు 600 మదర్సాలు ఎదుర్కొంటున్న ఆరోపణలే ఇందుకు కారణం. 2014లో బర్ద్వాన్‌ జిల్లాలో జరిగిన అల్లర్లలో నిందితులకు, ఈ మదర్సాలకు సంబంధం ఉందని తేలింది. ఆ నిందితులకు ఆయుధ శిక్షణ ఇక్కడి మదర్సాలలోనే లభించినట్టు ఆధారాలు దొరికాయి.

మార్క్సిస్టుల మరో కోట కేరళలోను మదర్సాలు కావలసినంత అపకీర్తిని సంపాదించుకున్నాయి. ఇక్కడ నడుస్తున్న ఎక్కువ మదర్సాలు పీస్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ అధీనంలో ఉన్నాయి. కేరళతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలలోను ఆ ఫౌండేషన్‌ స్కూళ్లను నడుపుతున్నది. ఇందులో బోధించే పాఠాలు మత సామరస్యానికి భంగకరమని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది సీపీఎం పాలిత రాష్ట్రంలో జరిగిందన్న సంగతి మరచిపోరాదు. అలాగే 21 మంది యువకులు హఠాత్తుగా ఆచూకి లేకుండా పోయిన ఘటన కూడా మదర్సాలను వేలెత్తి చూపే విధంగా మలుపు తీసుకుంది. వీరంతా ఐఎస్‌లో చేరడానికి దేశం వీడి వెళ్లారని అంతా విశ్వసించారు. ఈ యువకులంతా కూడా ఆ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న పాఠశాలల్లో పనిచేస్తున్నవారే.

ఇంతకీ భారతదేశంలోని మదర్సాల పాఠ్య ప్రణాళిక ఏమిటి? అది ఎలా ఉంటుంది? ఎవరు రూపొందించినది? ఈ ప్రశ్నలు అడిగితే భావ ప్రకటనా హక్కుకు భంగకరమంటూ ఎదురుదాడి చేస్తారు సెక్యులరిస్టులు. ఆ హక్కు ఎవరికీ లేదని వెంటనే నిరసన వస్తుంది. ఇలాంటి వారి కోసం ఓ వివరణ. మదర్సాలలో బోధిస్తున్న విద్యకీ, ముస్లింలు వెనుకబడి ఉన్నారన్న వాస్తవానికీ దగ్గర సంబంధం ఉంది. నవంబర్‌ 21, 2017న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించిన ఓ వార్తా కథనాన్ని పరిశీలిస్తే ఈ అంశం మీద ఒక అంచనాకు రావచ్చు. ‘ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలు ఫోన్‌ యాప్‌లు తయారుచేస్తున్నారు. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలలో కూడా అంతటి ప్రతిభ కనిపిస్తుంది. కానీ ఢిల్లీలో 3000 పైగా ఉన్న మదర్సాలలో విద్య మాత్రం 18వ శతాబ్దం దగ్గరే ఆగిపోయింది. ఖురాన్‌, ఉర్దూ, పర్షియన్‌లను బోధించడం వల్ల వాటిలో చదివే 3.6 లక్షల మంది పిల్లల భవిష్యత్తు, అవకాశాలు కుంచించుకు పోయాయి.’ ఇవి ఆ వార్తా కథనం ఆరంభవాక్యాలు.

ఇంతకీ మదర్సాలకు ప్రామాణికమైన పాఠ్య ప్రణాళిక ఏదీ లేదు. దీని వల్ల దర్స్‌ ఇ నిజామీ విద్యావిధానాన్ని వాటిలో అమలు చేస్తున్నారు. ఈ విధానాన్ని 1700 సంవత్సరం ప్రాంతానికి చెందిన ముల్లా నిజాముద్దీన్‌ అనే లక్నో పండితుడు రూపొందించారు. మదర్సాలలో కూడా పలు రకాలు ఉన్నాయి. పలు స్థాయిల విద్యను బోధించేవి ఉన్నాయి. చిత్రం ఏమిటంటే ఇస్లాం అంటే ఎవరి విశ్లేషణ వారికి ఉంది. అలాగే అన్ని మదర్సాలు పాత విద్యా విధానాన్నే ఆశ్రయించుకుని ఉండాలని అనుకోవడం లేదు. ఈజిప్ట్‌లో అల్‌ అజర్‌ విశ్వ విద్యాలయం కొత్త పాఠ్య ప్రణాళికను అమలులోకి తీసుకువచ్చింది. అక్కడ మదర్సాలు ఆ పాఠ్య ప్రణాళికను అమలు చేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రయత్నం భారతదేశంలో ఎందుకు జరగడం లేదన్న ప్రశ్న ముస్లింలలో కొంచెం ముందుచూపు ఉన్న ఒక వర్గం నుంచి వినిపిస్తున్నది. ‘మదర్సాలలో పెద్ద సంఖ్యలో మౌల్వీలను (మత గురువులు) తయారు చేస్తున్నారు. అందులో కొందరికి మాత్రమే వ్యవస్థలో అవకాశాలు దక్కుతున్నాయి. మిగిలిన వారంతా ముస్లిం సమాజానికి భారంగా పరిణమిస్తున్నారు. ఎందుకంటే ముస్లిం సమాజానికి సంపదగా పరిగణించే విధంగా ఆ విద్యార్థులను తయారు చేయలేదు’ అని ఫిరోజ్‌ భక్త్‌ అహమ్మద్‌ అనే సామాజిక కార్యకర్త చెప్పారు. రచయిత, సామాజిక కార్యకర్త సాదియా దేహ్లవి, ‘మదర్సాలు ఎప్పుడూ ఇస్లామిక్‌ విద్య మీదే దృష్టి పెడతాయి. కానీ అక్కడ చదివే విద్యార్థులను పోటీ తత్వానికి సంసిద్ధులయ్యే విధంగా చేయడానికి మదర్సాలను ఆధునీకరించవలసి ఉంది. వాటిని ఆధునీకరించిన మాట నిజమే. అది ఇంకా జరగాలి.’ అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి దృష్టి మదర్సాల విద్యార్థులు కొందరిలో కూడా ఉంది. పలువురు ఉదయం నుంచి సాయంత్రం వరకు మదర్సాలలో చదువుతూనే, సాయం కళాశాలలకు వెళ్లి లౌకిక విద్యను కూడా అభ్యసిస్తున్నారు. కేవలం మదర్సాలలో చదివితే ఉద్యోగావకాశాలు ఉండవని వారు గమనించారు. ముస్లింల సంక్షేమం పరిధిలోనే విద్యారంగంలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థ నవా ఇ హక్‌. ఈ సంస్థ అధ్యక్షుడు అసద్‌ ఘాజీ. ‘ఖురాన్‌, ఉర్దూ, పర్షియన్‌ మాత్రమే చెబితే విద్యార్థులకు కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. అందులో చదువు కుంటున్న వారు ఆధునిక విద్యకు నోచుకోకుండా దూరంగా ఉండిపోతున్న సంగతిని జాతీయ మానవ హక్కుల సంఘం పరిగణనలోనికి తీసుకోవాలి’ అని ఘాజీ అన్నారు. ఇదే విధానం కొనసాగితే జరిగే ప్రమాదం ఏమిటో కూడా ఘాజీ చాలా ఘాటుగానే చెప్పారు. ‘ఇంకో ఇరవై సంవత్సరాలు ఇదే విధానం కొనసాగితే ఆధునిక ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగులుగా ఉండక తప్పని ముస్లిం యువతరమే మిగులుతుంది. ఇది సంక్షోభానికి దారి తీస్తుంది’ అని ఆయన వాస్తవికంగానే అభిప్రాయపడ్డారు. ఇదంతా చూస్తే మదర్సా విద్య పరిమితులను ముస్లిం సమాజం కూడా గుర్తిస్తున్నదనే అనుకోవాలి. కానీ అలాంటి వారి గొంతు బలంగా లేదు. వీటిని ఆధునీకరించ డానికి నయీ మ్యాంజిల్‌ పేరుతో జామియా మిలియా ఒక పథకం కూడా ఆరంభించింది.

ముస్లింల నుంచే మదర్సాల మీద ఇలాంటి అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంటే మీడియా ఆ పురాతన విద్యా విధానంతో నష్టం లేదన్న పద్ధతిలో అభిప్రాయాలను పంచుతున్నది. ఇలాంటి వాదం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా ఉన్న శిబిరాల మెప్పును పొందవచ్చు. కానీ భావి ముస్లిం సమాజా నికి మాత్రం ముప్పు తెస్తుంది. ఇది వాస్తవాలను దాచి పెట్టడమే. ఉదాహరణకి సెప్టెంబర్‌ 15, 2014 నాటి ఔట్‌లుక్‌ ఆంగ్ల వారపత్రిక వ్యాసం. ఇది సాక్షి మహరాజ్‌ వ్యాఖ్యకు ఖండన.

మదర్సాలు తమ విద్యార్థులను ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొనేటట్టుగా ప్రేరేపించినట్టు, అందుకు తర్ఫీదు ఇచ్చినట్టు ఆధారాలేమీ లేవు. కొందరు ఉగ్రవాదుల వ్యక్తిగత వివరాలను బట్టి వారు కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో చదివి వచ్చిన వారని తెలుస్తుంది. ఇంకొందరు ఉగ్రవాదులు కొంతకాలం మదర్సాలతో సంబంధం కలిగి ఉన్నారన్న మాటా వాస్తవమే. అంతమాత్రన అంటే దీనర్థం మదర్సాలు జీహాదీ ఉగ్రవాదులను ఉత్పత్తి చేసే కేంద్రాలని కాదు అని ఆ పత్రిక రాసింది. ఈ వాదనకు సమర్థనగా ఇంకొక అంశం కూడా రాసింది. ఒమర్‌ సయీద్‌ బ్రిటిష్‌ జీహాదీ. ఇతడు లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో చదివి వచ్చాడు. అంతమాత్రాన లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ను జీహాదీ కర్మాగారం అనగలమా అని ప్రశ్నించింది. కానీ, ఆధునిక ప్రపంచంలో మదర్సా విద్యార్థులకు అవకాశాలు దొరకని మాట నిజం. ఆ మేరకు వాటిని పూర్తిగా సంస్కరించవలసి ఉన్నది అని కూడా అదే వ్యాసంలో ఆ పత్రిక వ్యాఖ్యా నించడం విశేషం. అంటే మదర్సాల గురించిన వాస్త వాలను వెల్లడించడంలో మీడియాలో, మేధావులలో ద్వైదీభావం స్పష్టంగా కనిపిస్తుంది.

మదర్సాలకు పూర్తి స్వేచ్ఛ ఉండాలన్నట్టు, వాటిలో జోక్యం తగదన్నట్టు గుడ్డిగా వ్యవహరించడం ఓటు బ్యాంకు రాజకీయాల వికృతరూపానికి నిలువెత్తు నిదర్శనం. ఈ నేపథ్యంలో వసీం రిజ్వి ప్రధానికి రాసిన లేఖ ప్రాధాన్యాన్ని అంతా గుర్తిం చాలి. మదర్సాల వైఖరి మళ్లీ ముస్లిం సమాజానికే చేటు చేసే విధంగా ఉంది. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అందులోని అన్ని వర్గాలకు లౌకిక అంశాలలో ఒకే ఆలోచన ఉండాలి. ఆధునికతను దృష్టిలో ఉంచుకో వాలి. చదువులను, దృష్టి కోణాన్ని కాలానుగుణంగా మలచుకోవాలి. అంతేకాని మౌఢ్యంలో కొట్టుకుపో రాదు. మత గురువుల గుప్పిట్లో చిక్కుకున్న మదర్సా లను, అందులో బోధిస్తున్న పాఠాలను సంస్కరించడం అవసరం. ఓటు బ్యాంకు రాజకీయం భారత రాజకీయ వేత్తలకు ఒక మత్తులా ఆవహించినా, కొన్ని అంశాలలో అయినా వాస్తవి కంగా వ్యవహరించా లన్న ఇంగిత జ్ఞానం వారికి ఉండాలి. ముస్లిం యువత జకీర్‌ నాయక్‌నీ, బుర్హాన్‌ వానీని ఆదర్శంగా తీసుకోరాదు. ఎంసీ చాగ్లా, ఏపీజే అబ్దుల్‌కలాం వంటివారిని ఆదర్శంగా తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *