కమలం వికసించా వచ్చు….!

కమలం వికసించా వచ్చు….!

‘అంత శ్రద్ధగా పేపరు చదువుతున్నారు గదా! ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అనుకొంటున్నారో చెప్తారా?’

‘నీ ప్రశ్న కొంచెం డొంక తిరుగుడుగా ఉంది. నువ్వు అడుగుతున్నది – ఎవరు గెలుస్తారనా? ఎవరు గెలుస్తారని ఎవరెవరు ఏమనుకుంటున్నారనా?’

‘ఎన్నికలు ఇంకో రెండు మూడు నెలల తరవాత గానీ జరగవు. కాబట్టి ఎవరు గెలుస్తారని అనుకుంటు న్నారన్నదే ఇప్పటి విషయం.

‘అయితే ముందు నేనడిగే మూడు ప్రశ్నలకు జవాబులు చెప్పాలి!’

‘మీరు తిరిగి నాకే పరీక్ష పెడ్తున్నారు! ప్రయత్ని స్తాను, సెలవీయండి!’

‘1) తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎవరికి భయపడి ఎన్నికలు ముందుకు తెచ్చాడు? 2) క్రిందటిసారి ఎన్నికలలో ద్వితీయ స్థానంలో ఉన్నది ఎవరు? 3) వివిధ పార్టీల లేదా కూటముల బలా బలాలలో ఎటువంటి మార్పులు వచ్చాయి?’

‘మొదటి రెండింటికి ఒక్క మాటలో చెప్పే జవాబులే గనుక అవి నాకు కష్టమనిపించటం లేదు. మూడవ ప్రశ్నకు జవాబు చెప్పగల స్థితి ఉంటే, ఇంకా అర్థంకానిది, అడిగి తెలుసుకోవలసింది ఏముం టుంది ? ఆటోమేటిక్‌ జవాబు వచ్చేస్తుంది గదా!’

‘మీ దృష్టిలో ఉన్న జవాబులేవో చెప్పండి’

‘అదే ఆలోచిస్తున్నా! ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తదితర కాంగ్రెసు నాయకులకు కెసిఆర్‌ భయపడటం లేదు. రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, దిగ్విజయ్‌సింగ్‌, కుంతియా, జైరాం రమేష్‌లకూ భయపడటం లేదు. చంద్రబాబునాయుడికి భయపడటం లేదు. రేవంత్‌ రెడ్డికి, కిషన్‌రెడ్డికి, డా|| లక్ష్మణ్‌కీ భయపడటం లేదు. తమ్మినేని వీరభద్రం, డా||నారాయణ, చాడ వెంకట రెడ్డి, ఒవైసీ సోదరులకు -వీరెవరికీ భయపడటం లేదు. వీరందరినీ ఎలాగో ఒకలా ‘మేనేజ్‌’ చేయగలననే విశ్వాసం ఆయనకుంది. ఆయన ఎవరికైనా భయ పడుతున్నాడంటే, అది మోదీకే. శాసనసభ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలూ ఒకేసారి వస్తే, మోదీ ప్రభంజ నంలో తానెగిరిపోతానేమోనన్న భయం ఉంది. అందుకే కలిపి జరగాల్సిన ఎన్నికలను బుద్ధిపూర్వ కంగా, యోజనాపూర్వకంగా విడదీసి శాసనసభ ఎన్నికలను ముందస్తుగా జరిపించేస్తున్నారు.’

‘బావుంది. నీ అబ్జర్వేషన్‌ సరిగానే ఉంది. మోదీకి, ఒకమేరకు అమిత్‌షాకు తప్పించి కె.సి.ఆర్‌. మరెవ్వరికీ భయపడటం లేదని పరిశీలకులందరూ అంగీకరిస్తారు. మరి రెండవ ప్రశ్నకు జవాబేమిటి?’

‘క్రిందటి శాసనసభ ఎన్నికలలో కె.సి.ఆర్‌.గారి తెరాస ప్రథమ స్థానం సంపాదించగా, కాంగ్రెసు 20 స్థానాలతో, దాదాపుగా 20 శాతం ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. 15 స్థానాలు గెలిచి, 14 పైగా శాతం ఓట్లు సాధించిన తెదేపాది తృతీయ స్థానం. 5 స్థానాలు గెలిచి 7 శాతం ఓట్లు సాధించిన భాజపా చతుర్ధ స్థానంలో ఉంది. 7 స్థానాల్లో గెలుపొందిన 3 శాతం ఓట్లు సంపాదించగా మిగిలిన వారు కూడా ఆ దరిదాపులలోనో, అంతకు తక్కువ గానో ఉండిపోయారు.’

‘మీ అబ్జర్వేషన్‌ను నేను కొంచెం సవరిస్తే ఏమీ అనుకోరు గదా! 32 శాతం మించిన ఓట్లతో తెరాస ప్రథమస్థానం వహించగా 22 శాతం మించిన ఓట్లతో భాజపా-తెదేపా కూటమి ద్వితీయస్థానంలో నిలిచింది. 20 స్థానాలు సాధిం చింది. కాంగ్రెసు కూడా 20 స్థానాల్లో గెలిచింది. కానీ అది సాధించిన ఓట్లు 20 శాతమే. ఆ విధంగా కాంగ్రెసు 3వ స్థానానికి పడింది!’

‘ఇలా లెక్కలేయటం ఎందుకు? దీనివల్ల ఒనకూడేదేమిటి?’

‘2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెరాస, భాజపా-తెదేపా కూటమిల తర్వాత 3వ స్థానానికి దిగజారిన కాంగ్రెసు తెలంగాణలో పుంజుకొన్నదనడానికి ఎలాంటి దాఖలాలూ లేవు. ప్రజల మెప్పు సంపాదించినట్లు చెప్పడానికి ఎలాంటి నిదర్శనాలు లేవు. కాబట్టి ఈసారి కాంగ్రెసు తెరాసను ఓడించగలదని ఎవరైనా అంచనా వేస్తే అది వారి భ్రమ. క్రిందటిసారి 22 శాతంపైగా ఓట్లు సంపాదించుకున్న భాజపా-తెదేపా కూటమి ఓట్ల నుండి తెరాసకు గాని, కాంగ్రెస్‌కు గాని పోయేవి పెద్దగా ఉండవు. చెదరు మదరుగా ఒకటి-రెండు శాతం పోతేపోతాయేమో! అయితే తెదేపాతో జత కట్టినందుకు నిరసనగా భాజపా అభిమానులూ, సానుభూతిపరులూ, అభిమానులూ ఎందరో తెరాసకు ఓటు వేశారు. ఈసారి భాజపా తెదేపాతో ఎలాంటి బేరసారాలు చేయటం లేదు. చర్చలు జరపటం లేదు. మొత్తం 119 స్థానాలకూ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నది. కాబట్టి 2014లో తెరాసకు పడిన ఓట్లలో నుండి పెద్ద భాగం ఓట్లు ఈసారి భాజపాకు పడతాయి. ఆ విధంగా ప్రథమ స్థానానికి చేరుకొని ప్రభుత్వాన్ని ఏర్పరచగల అవకాశాలు కనిస్తున్నాయి’.

‘నేను అడిగిన మూడవ ప్రశ్న దీనికి సంబంధిం చిందే. కొంచెం శ్రద్ధగా గమనించండి. 2014 ఎన్నికల నాటికి – నేటికీ ఎన్నో మార్పులు వచ్చాయి. 2014లో రెండు తెలుగు రాష్ట్రాలలో భాజపా తరఫున వ్యూహరచన, సీట్ల సర్దుబాట్ల చర్చలూ చేసినవారు చంద్రబాబునాయుడు. ఆయన మాటకు ఎదురు చెప్పగల్గిన వారు లేరు. తత్ఫలితంగా భాజపాకు అతి తక్కువ స్థానాలు కేటాయించారు. అవైనా గెలిచే అవకాశాలు లేనివే ఎక్కువగా కేటాయించారు. నరేంద్ర మోదీ ఫోటో చూపించి, సైకిలు గుర్తుకు ఓటు వేయటమంటే నరేంద్రమోదీని ప్రధానమంత్రిగా చేయడానికి ఓటు వేయటమేనని చెప్పి తెదేపా వారు బాగా లబ్ధిపొందారు. ఇలా మోసపోయే ప్రమాదం నుండి భాజపా ఈసారి బయటపడుతున్నది. తెలం గాణలో ప్రభుత్వం ఏర్పరచగలమన్న విశ్వాసంతో మొత్తం 119 స్థానాలకు కూడా పోటీ చేస్తున్నది. దీనికి నాయకత్వం వహిస్తున్నవారు మోదీ, అమిత్‌షా వంటి అనుభవజ్ఞులు. హర్యానా, ఝార్ఖండ్‌, మణిపూర్‌, త్రిపురల్లో ఇంతకంటే తక్కువ స్థానాలున్న స్థితి నుండి పూర్తి మెజారిటీ సంపాదించి పెట్టిన అనుభవం వారిది.

2014 ఎన్నికల సమయంలో కెసిఆర్‌ తెలంగాణను సాధించి పెట్టిన హీరోలా కనిపించాడు. అతడు అరచేతిలో స్వర్గం చూపిస్తే నిజమేననుకున్నారు. ఇటు ప్రక్కన భాజపా వారికి చెప్పుకోదగిన రికార్డు ఏమీలేదు. పైగా తెదేపాతో సీట్ల సర్దుబాటు కుదుర్చుకొంది. ఈ కారణాలతో ఓట్లను ఆకర్షించటంలో విఫలమైంది. కాగా నాలుగున్నర సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రజల అనుభవం.. కెసిఆర్‌ మాటలు వినడానికి ఇంపుగా, సొంపుగా ఉన్నా అవేవీ కార్యరూపం ధరించలేదు. ఈ నాలుగున్నరేళ్లలో గజ్వేల్‌, సిద్ధిపేట, సిరిసిల్ల ఆ పరిసర ప్రాంతాలు ఏదో ఒక మేరకు లబ్ధిపొంది ఉండవచ్చు. మిగిలినచోట్ల శుష్కప్రియాలు శూన్యహస్తాలలు- ఇదే ప్రజల అనుభవం. అందువల్ల కెసిఆర్‌ మాటకారితనాన్ని, మోసగాని తనాన్ని ప్రజలు స్పష్టంగా గుర్తిస్తున్నారు. కులాలవారీగా, మతాల వారీగా ఆయన పంచుతున్న తాయిలాలు కొద్దిమంది నాయకులకూ, పరాన్నభుక్కులకూ ప్రీతి చేకూర్చవచ్చుగాక, కాని సామాన్యులకు అందుతున్నదేమీ లేదు. అందువల్ల అసంతృప్తి వెల్లువెత్తుతూ ఉంది. అది ఈ ఎన్నికలలో వ్యక్తమౌతుంది.

మరో ప్రక్కన నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్రప్రభుత్వం చేపట్టిన చర్యలు-వాటివల్ల అతిసామాన్య ప్రజలకు కూడా కలుగుతున్న ప్రయోజనాలూ అందరికీ అనుభవంలోకి వస్తున్నవి. మీ కులమేమిటి, మీ మతమేమిటి – అని అడగకుండా అందరికీ 24 గంటల విద్యుత్తు లభిస్తున్నది. అన్ని గ్రామాలకూ విద్యుచ్ఛక్తి అందుబాటులోకి వచ్చింది. రహదారులు నిర్మాణమయ్యాయి. కాపలాలేని లెవెల్‌ క్రాసింగ్‌ల స్థానంలో రైలు పట్టాల క్రింద నుండి రోడ్లు నిర్మాణమయ్యాయి. వంటగ్యాసు కనెక్షన్లు అందరికీ లభ్యమయ్యాయి. ఇంటిలో ఒకరైనా బ్యాంకు ఖాతా కలిగి ఉండే విధంగా బ్యాంకుల సేవలు విస్తృతమయ్యాయి. అనేకరకాల సబ్సిడీలు, రాయితీలు నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ అవుతున్నాయి. పరోక్ష పన్నులు తగ్గిన కారణంగా ఎన్నో వస్తువులు గతంలో కంటే చౌకగా లభ్యమవుతున్నాయి. ఏ వస్తువుకూ కొరత లేదు. నాయకుల చుట్టూ లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిన స్థితి లేదు. దేశమంతటా శాంతి భద్రతల పరిస్థితి ఎంతో మెరుగైంది. రైలు ప్రయాణాలు, విమాన ప్రయాణాలు సులభంగా, మెరుగైన సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చాయి. స్వచ్ఛత విషయంలో ఇంకా సాధించవలసి ఉన్నమాట నిజమే అయినా, ఆ దిశలో ముందుకు పోతున్నామన్న విషయంలో సందేహం లేదు. ఇన్ని విషయాలు స్పష్టంగా అనుభవంలోకి వచ్చిన తర్వాత పైసలిచ్చిన వారికే ఓటు వేయాలనే ప్రలోభాలు ఏమాత్రం పనిచేయవు. అందువల్ల ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో వచ్చే ఫలితాలు సర్వేలు – సెఫాలిజిస్టుల కులమతాల వారీ లెక్కలతో కూడిన అంచనాలపై ఆధారపడి ఉండవు. తెరాస గతంలో సాధించిన 37 శాతం ఓట్ల నుండి ఎంత లేదన్నా 10 శాతం ఓట్లను కోల్పోతుంది. భాజపా గతంలో భాజపా-తెదేపా కూటమిగా పొందిన 22 శాతం ఓట్లకు అదనంగా ఎంత లేదన్నా 10 శాతం ఓట్లను అధికంగా సాధిస్తుంది. 4 లేక 5 ఫ్రంట్లు పోటీపడే ఈ ఎన్నికలలో భాజపా ప్రథమ స్థానంలోకి రావటం ఏ మాత్రం ఆశ్చర్యకరమైన పరిణామం కాబోదు’

‘అయ్యా! మీరు చెప్పేది బాగానే ఉంది కాని, తెలంగాణ భాజపా కార్యకర్తలు ఇంతటి విజయాన్ని స్వీకరించే సంసిద్ధతతో ఉన్నారా?’

‘మళ్లీ కలసినప్పుడు ఆ సంగతి ముచ్చటించు కుందాం!’

– సత్యవాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *