‘కాంగ్రెస్‌ జాబితా అమరావతిది! – తెరాస జాబితా దారుస్సలాంది!’

‘కాంగ్రెస్‌ జాబితా అమరావతిది! – తెరాస జాబితా దారుస్సలాంది!’

బీజేపీతో 38 ఏళ్ల అనుబంధం, ఎన్నికల పోరులో పాతికేళ్లుగా గడించిన అనుభవం డాక్టర్‌ కె.లక్ష్మణ్‌లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన తరువాత జరుగుతున్న ఈ అసెంబ్లీ పోరులో బీజేపీ ఆయన నాయకత్వంలో బరిలోకి దిగింది. ఏబీవీపీ నాయకుడిగా, విద్యార్థి సంఘ నేతగా, బీజేపీ హైదరాబాద్‌ నగర అధ్యక్షునిగా వివిధ ¬దాలలో పనిచేసిన ఉద్దండుడు డాక్టర్‌ లక్ష్మణ్‌. నామినేషన్ల గడువు ముగిసి, అసలు సిసలు సమరం మొదలైన రెండో రోజునే ప్రచార సంరంభంలో తలమునకలై ఉన్నప్పటికీ ఆయన జాగృతికి ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యమంత్రి, తెరాస నేత కె.చంద్రశేఖరరావు ఎంత అవకాశ రాజకీయ నాయకుడో, చంద్రబాబునాయుడు కూడా అంతే అవకాశవాది అని డాక్టర్‌ లక్ష్మణ్‌ చెప్పారు. కాంగ్రెస్‌, తెలుగుదేశం పొత్తు; తెరాస-మజ్లిస్‌ మధ్య ఉన్న అవగాహన కూడా పచ్చి అవకాశవాద వ్యవహారాలని ఆయన దుమ్మెత్తి పోశారు. మచ్చ లేని మోదీ పాలన, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న బీజేపీ వైఖరి ద్వారా తెలంగాణ ప్రజలు తమను తప్పనిసరిగా గుర్తుంచుకుంటారని ఆయన చెప్పారు. రద్దయిన అసెంబ్లీలో డా. లక్ష్మణ్‌ ముషీరాబాద్‌ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. మళ్లీ అక్కడి నుంచే ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.

మూడున్నర దశాబ్దాల వైరాన్ని వదిలేసి తెలుగు దేశం కాంగ్రెస్‌ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకుంది. ఈ పరిణామాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఆ పొత్తు భవిష్యత్తు ఏమిటి?

ఇది పూర్తిగా పచ్చి అవకాశవాద పొత్తు. స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు.. మహాను భావుడు.. తెలుగువారి ఆత్మగౌరవం నినాదం ఇచ్చారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేసిన చరిత్ర ఆయనది. కానీ ఇవాళ అదే కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఎన్‌టి రామారావుగారి ఆత్మ ఘోషించే విధంగా వ్యవహ రించారు చంద్రబాబునాయుడు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టిన ప్రబుద్ధుడు చంద్ర బాబు నాయుడు. ఆత్మగౌరవం కోసం నాడు ‘దుష్ట’ కాంగ్రెస్‌ నాయకత్వంలోని కేంద్రంతో పోరాటం చేసిన ఘనత రామారావుగారిది. ఎన్‌టిఆర్‌ పేరు చెప్పుకుంటూ, ఆయన పార్టీని నడుపుతూ ఇవాళ చంద్రబాబు అదే కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఇందుకు నరేంద్రమోదీని కారణంగా చూపుతున్నారు.

మహాకూటమిలో సీట్ల పంపకం వ్యవహారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు గురించి తెలుగు దేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతం చెప్పింది. ఆ విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న పార్టీ అది. కాబట్టి ఈ రాష్ట్రంలో బలహీనపడింది. మళ్లీ ఇప్పుడు మనుగడ కోసం ఆరాటపడుతున్నది. ఈ క్రమంలోనే తన రాజకీయ భవిష్యత్తును కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టింది. ఇక వందేళ్ల పైబడిన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ కూడా నాలుగు సీట్ల కోసం తెలుగుదేశం పార్టీతో రాజీ పడింది. తెలంగాణలో పోటీచేసే కాంగ్రెస్‌ అభ్యర్థులను చంద్రబాబునాయుడి చేత ఖరారు చేయించే స్థితికి ఆ జాతీయ పార్టీ దిగజారిపోయింది. ఇదంతా దేని కోసం? నోట్ల కోసమా? సీట్ల కోసమా? ఈ సంగతిని ప్రజలు గ్రహించలేరని వారు అనుకుంటే పొరపాటు. ఓటర్లు గమనిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా అమరావతిలో ఖరారయింది. అభ్యర్థులను చంద్ర బాబు నిర్ణయించారు. ఇది ఒకరకం. మరొకరకం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితా దారుస్సలాం (మజ్లిస్‌ కేంద్ర కార్యాలయం)లో రూపుదిద్దుకుంది. ఏ అభ్యర్థి ఏ నియోజక వర్గంలో పోటీచేయాలో నిర్ధారించినవారు అసదుద్దీ ఓవైసీయే. ఒక్క బీజేపీ మాత్రమే కార్యకర్తలు, స్థానికుల అభిప్రాయం మేరకు వ్యవహరించింది. నియోజక వర్గ స్థాయి కార్యకర్తల అభిప్రాయం తీసుకుని, సంప్రతించిన తరువాత రాష్ట్ర పార్టీ శాఖలోని అభ్యర్థుల ఎంపిక కమిటీ పరిశీలించింది. తరువాత కేంద్ర నాయకత్వం ఖరారు చేసింది, పార్లమెంటరీ బోర్టు ఆమోదముద్ర వేసింది. ఇలా ఒక పద్ధతి ప్రకారం జరిగింది.

టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పేరు అడ్డం పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలంగాణ సెంటి మెంట్‌ను లేవనెత్తి ఈ ఎన్నికలలో కూడా గెలవాలని అనుకుంటున్నారా?

కేసీఆర్‌ గానివ్వండి, చంద్రబాబు గానివ్వండి. ఇద్దరు కూడా పచ్చి అవకాశవాద రాజకీయ నాయకులు. ఎవరి అవకాశాల కోసం వారు అవతలి వారిని వాడుకుని తరువాత వదిలివేయడం వారికి పరిపాటి. ఒకటి వాస్తవం. ఇప్పుడు కేసీఆర్‌కు మజ్లిస్‌ తోడు. కాంగ్రెస్‌, టీడీపీ, కోదండరాం, సీపీఐ ఒక కూటమి. దీనికి మహా కూటమి అని పేరు. ఇందులో ఒక పార్టీకి, మరొక పార్టీకి ఏదైనా సాదృశ్యమైన అంశం ఉందా? పరస్పర విరుద్ధభావాలు, విరుద్ధ ఆలోచనలు ఉన్నవాళ్లు ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ రెండు కూటములు ఎన్నికల తరువాత ఏకం కావన్న గ్యారంటీ ఏమీ లేదు. ఏ రోటి దగ్గర ఆ పాట. ఏ పూటకు ఆ మాట. కేసీఆర్‌గారు చంద్ర బాబు గతంలో కలసి లేరా? కేసీఆర్‌ కాంగ్రెస్‌ కలసి పనిచేయలేదా? కర్ణాటక రాజకీయ పరిణామాలే ఇందుకు తాజా ఉదాహరణ. కేసీఆర్‌ చెబితేనే నేను ముఖ్యమంత్రినయ్యాను అని కుమారస్వామి బాహాటంగానే చెప్పారు. అదికూడా కాంగ్రెస్‌తో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆయన చెబితేనే అందుకు సిద్ధమయ్యానని కూడా కుమారస్వామి అన్నారు. నిజం, ఇది కుమారస్వామి స్వయంగా చేసిన వ్యాఖ్య. చంద్రబాబు చేస్తేనే కాంగ్రెస్‌ చేయూతతో నేను ముఖ్యమంత్రిని అయ్యాను అని కూడ అన్నారు కుమారస్వామి. ఇప్పుడు చంద్ర బాబుని, కేసీఆర్‌ని ఎలా వేరుచేసి చూడగలం? ఒకరోజు ముందు వెళ్లి కేసీఆర్‌గారు శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. మరునాడు చంద్రబాబు, రాహుల్‌ గాంధీ ఒకే వేదిక మీదకు వచ్చి కుమారస్వామికి ముఖ్యమంత్రి మకుటధారణం చేశారు. ఇవన్నీ ఒకే తాను ముక్కలు. ఒకే గూటి పక్షులు. వీటితో కలవని దల్లా సూత్రబద్ధ రాజకీయాలకు కట్టుబడి, ఒంటరి గానే పోరాడుతూ, తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎవరితో బడితే వారితో పొత్తులు పెట్టుకోని ఒక్క బీజేపీ మాత్రమే. కేసీఆర్‌తో ఏనాడూ బీజేపీ కలవలేదు.

‘ప్రధాని మోదీకి ఒక భీమార్‌ ఉంది. హిందువులు, ముస్లింలు అంటూ విభజన తెస్తాడు’ అని కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభలలో చెబుతున్నారు. దీని ఉద్దేశం ఏమిటి?

భీమార్‌ ఏదైనా ఉన్నదీ అంటే అది కేసీఆర్‌కే ఉంది. కులం పేరు మీద తాయిలాలు ప్రకటించడం, మతాల పేరు మీద పండగల సందర్భంలో బట్టలు, బిర్యానీలు పందారం చేయిస్తారాయన. అదే విధంగా మతపరమైన కార్యక్రమాలకు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బుల ఖర్చు చేయడం, ప్రజలు కట్టే పన్నులతో లౌకికవాద దేశంలో మతాల పేరు మీద ఓటు బ్యాంకు రాజకీయాలు నడపడం కేసీఆర్‌కు అలవాటు. ఇవాళ మజ్లిస్‌ పార్టీలో ఎలాంటి లౌకిక వాదం కనిపించిందాయనకు? మజ్లిస్‌ ఎలాంటి లౌకికవాద పార్టీ అని వారితో కలసి పోటీ చేస్తున్నారు? వారిని తన సహజ మిత్రులని అంటు న్నారు? అంత తెలుసుకోలేనంత అమాయకులు కారు తెలంగాణ ప్రజలు. ఇవాళ అక్బరుద్దీన్‌ ఓవైసీ రెచ్చగొట్టే ఉపన్యాసాలు, వ్యాఖ్యలు చేసి, ఒక మతాన్ని, ఆ మతానికి చెందిన దేవుళ్లను కించపరిస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోలేదు కేసీఆర్‌ ప్రభుత్వం. వరంగల్‌ నడిబొడ్డున ఒక పూజారిని హత్య చేస్తే దాని మీద స్పందించలేరు కేసీఆర్‌. కానీ ఏనాడో నాలుగేళ్ల క్రితం ఏవో వ్యాఖ్యలు చేశారంటూ స్వామీ పరిపూర్ణానందకు మాత్రం నగర బహిష్కరణ విధిస్తారు. ఇది దేనికి సంకేతం? ఎవరి మెప్పుకోసం చేస్తున్నట్టు? దీనిని అర్థం చేసుకోలేనంత అమాయ కులు కారు ప్రజలు.

తెరాస, మజ్లిస్‌ నడుమ అవగాహన ఉందన్న వాదన ఉంది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి?

తెరాస, మజ్లిస్‌ల మధ్య పొత్తు పచ్చి అవకాశ వాద పొత్తు. మజ్లిస్‌ ఎవరు అధికారంలో ఉంటే వారితో అంట కాగుతూ ఉంటుంది. ఆ ప్రభుత్వాలు కూడా మజ్లిస్‌కు మోకరిల్లుతూ ఉంటాయి. ఇవాళ ఒక్క తెరాస మాత్రమే కాదు, తెలుగుదేశం, కాంగ్రెస్‌ లేదా మరొక పార్టీ ఏదైనా కూడా మజ్లిస్‌ అజెండానే అమలు చేస్తాయి. అలా చేయనిది బీజేపీ ఒక్కటే. అందుకే ఈ రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మజ్లిస్‌ ప్రమేయం, ప్రభావం లేని రాజకీయాలు ఒక్క బీజేపీకి మాత్రమే సాధ్యం. ఆ సామర్థ్యం, సత్తా బీజేపీకే ఉన్నాయని ప్రజలు గుర్తిస్తున్నారు.

ఈ ఎన్నికలలో బీజేపీ మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చింది. అలాగే నరేంద్ర మోదీ సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఈ రెండు అంశాలను ప్రచారాంశా లుగా చేసుకోవడంలో రాష్ట్ర బీజేపీ కొంచెం వెనుకపడిందన్న మాట వినిపిస్తున్నది. ఏమంటారు?

లేదు, మా కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ఇక సామాజిక న్యాయం పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధత ఎటువంటిదో ఖరారైన మా అభ్యర్థుల జాబితాను చూస్తే అర్థం కాగలదు. సామాజిక న్యాయానికి కట్టుబడిన అసలు సిసలు పార్టీ బీజేపీయే. అలాగే మహిళలకు బీజేపీ ఎప్పుడూ సమున్నత స్థానమే కల్పించింది. సగౌరవంగా చూస్తున్నది. కేంద్రంలో అతి కీలకమైన రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ నరేంద్ర మోదీ మహిళలకు అప్పగించారు. లోక్‌సభ స్పీకర్‌గా మహిళే ఉన్నారు. మహిళలకు ఇంతటి సమున్నత స్థానం సామాజిక న్యాయం గురించి పదే పదే చెప్పే ఏ పార్టీలు ఇచ్చాయి?

మా అభ్యర్థుల జాబితా చూడండి! మహిళలకు 15 సీట్లు ఇచ్చాం. బీసీలకు 34 స్థానాలు ఇచ్చాం. బీసీలలో మెజారిటీ కులాల వారికి టిక్కెట్లు ఇచ్చాం. ఎస్‌సీ రిజర్వుడు స్థానాలు రాష్ట్రంలో 19 మాత్రమే. కానీ మా పార్టీ 21 స్థానాలు వారికి కేటాయించింది. అంటే జనరల్‌ నియోజకవర్గాలలో కూడా ఎస్‌సి అభ్యర్థులను నిలిపింది. ఎస్‌టిలకు, ఇద్దరు ముస్లిం లకు కూడా బీజేపీ సీట్లు ఇచ్చింది.

ఈ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని అంటు న్నారు. మరి తెరాసను ప్రజలు ఎలా చూస్తున్నారు?

రాష్ట్రంలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ పార్టీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పడి పాలించింది. 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. నిజానికి ఉద్యమ సమయంలో ప్రస్తా వించిన ఆకాంక్షలను కూడా నెరవేర్చలేదు తెరాస. వాటిని పూర్తిగా విస్మరించింది. ఒకే కుటుంబం ప్రయోజనం కోసం పనిచేయడం, పరిమితం కావడం ప్రభుత్వం వంతయింది. దీనితో సాధారణ ప్రజలు మొదలుకొని, ప్రత్యేక రాష్ట్రం కోసం కలలు కని, కేసీఆర్‌కు ఊతమిచ్చిన ఉద్యమకారులు కూడా ఆగ్రహావేశాలతో మండిపడుతున్నారు.

ఇవే గెలుపు అంశాలని బీజేపీ భావిస్తున్నదా?

ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత వాస్తవం. అయినా బీజేపీ ఆ వ్యతిరేకత మీదే ఆధారపడి లేదు. బీజేపీ సంస్థాగత నిర్మాణం, మా పార్టీ అమలు చేస్తున్న సామాజిక న్యాయం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారి పని తీరు, ఈ నాలుగున్నరేళ్లలో కేంద్రంలో అవినీతి రహితంగా సాగిన బీజేపీ పాలన వంటి చాలా అంశాలు మా విజయానికి తోడ్పడతాయని మా నమ్మకం. ఇంకా తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన నిధులు ఉన్నాయి. ఇక్కడి పేదల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు ఉన్నాయి. ఇలాంటివే తెలంగాణలో బీజేపీని ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి దోహదం చేశాయి. వాస్తవానికి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్ర నిధులను దారి మళ్లించింది. కేంద్ర పథకాలకు పేర్లు మార్చి తమవిగా చెప్పుకుంది. సొమ్మొకరిది సొకొకరిది అన్న రీతిలో వ్యవహరించింది. అయినా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ ఒక ప్రబల శక్తిగా అవతరించడానికి అన్ని విధాలా ప్రోత్సహించారు. మేం ప్రజలకి అందుబాటులో ఉంటాం. మమ్మల్ని ప్రజలు ఏనాడు మరచిపోరు.

– ఇంటర్వ్యూ వి.కాంతారావు, కె.హరీశ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *