అది రెండు దేశాలకూ మంచిది

అది రెండు దేశాలకూ మంచిది
  •  వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటన

  •  కుదిరిన ఎస్‌-400 మిసైల్‌ ఒప్పందం

  •  భారత్‌కు అమెరికా ఆంక్షల నుండి మినహాయింపు

వివిధ రంగాల్లో సహాయ సహకారాన్ని పెంపొందించుకోవాలనే భారత్‌, రష్యా రెండు దేశాల ఆలోచన ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఈ ప్రాంతంలో కలుగుతున్న ఆందోళనకరమైన పరిణామాలకు విరుగుడు కాగలదు. అనేక భాగస్వామ్య దేశాలతో నాణ్యమైన సంబంధాలను కలిగి ఉండాలన్న భారత్‌ విదేశాంగ సూత్రం ఇందులో భాగం కాగలదు.

ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచుకునేందుకు భారత, రష్యాలు 2000 సంవత్సరం నుంచి వార్షిక సంయుక్త సమావేశాలు నిర్వహించుకుంటున్నాయి. ప్రచ్చన్న యుద్ధ కాలం నుంచి భారత్‌ పూర్వ సోవియట్‌ యూనియన్‌ (ఇప్పటి రష్యా) తో సత్సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది. ఈ సత్సంబంధాలకు పునాది రక్షణరంగ సహకారం.

అక్టోబర్‌ 4 నుండి రెండు రోజులపాటు భారత్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పర్యటన అంతర్జాతీయంగా పలువురి దృష్టిని ఆకర్షించింది. దీనికి కారణం 5.2 బిలియన్‌ డాలర్ల ఎస్‌-400 ట్రింఫ్‌ భూమి నుండి ఆకాశంలోకి ప్రయోగించగలిగే మిస్సైల్‌ వ్యవస్థ కొనుగోలుపై కుదిరిన ఒప్పందం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి అమెరికా, రష్యాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. అంతేకాదు ఉత్తర కొరియా, ఇరాన్‌, రష్యా వంటి ప్రత్యర్ధి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలపై ఆర్ధిక ఆంక్షలు విధించడానికి వీలు కల్పించే చట్టాల ద్వారా అమెరికా ప్రత్యర్ధులను నిలువరించే చట్టం CAATSA ను అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించింది కూడా. గత నెల రష్యా నుంచి ఎస్‌-400 మిస్సైల్‌ వ్యవస్థను కొనుగోలు చేసిన చైనాపై అమెరికా ఈ చట్టాన్ని ప్రయోగించింది. దానితో ఈ మిస్సైల్‌ వ్యవస్థను కొనుగోలు చేయాలనుకున్న భారత్‌కు కూడా ఆంక్షల ప్రమాదం ఏర్పడింది. కానీ అమెరికాతో రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఇటీవల జరిగిన మంత్రుల స్థాయి ద్వైపాక్షిక సంభాషణాల్లో COMCASA ఒప్పందంపై భారత్‌ సంతకం చేసింది. అంతేకాదు రష్యాతో రక్షణ ఒప్పందానికి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా చూసుకునేందుకు పుతిన్‌ పర్యటనకు మినహాయింపు ఇవ్వాలని, CAATSA బలోపేతం చేసేందుకు ఎస్‌-400 మిస్సైల్‌ వ్యవస్థ చాలా అవసరమని గుర్తించినప్పటికి, దీని కొనుగోలు విషయమై ఎలాంటి వ్యాఖ్య చేయకుండా అమెరికా మౌనం వహించింది. అమెరికా ఆర్ధిక ఆంక్షల భయం ఉన్నప్పటికి భారత్‌ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందం ఖరారు అయిన విషయాన్ని సంయుక్త ప్రకటనలో క్లుప్తంగా, ఏకవాక్యంలో పేర్కొన్నారు.

ఈ ఒప్పందానికి సంబంధించిన పరిణామాలను నిశితంగా పరిశీలించిన అమెరికా దీని విషయమై ఒక అనధికారిక ప్రకటన కూడా చేసింది. అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి ఒకరు ‘CAATSA లోని పరిచ్ఛేదం 231 కింద మినహాయింపులు కొనుగోళ్ళ వారీగా నిర్ణయిస్తాము. అంతేకాని అన్నింటికీ ఒకే రకం నిర్ణయాలు ఉండవు. రష్యా తన అనుచితమైన వ్యవహారానికి మూల్యం చెల్లించుకోవడం కోసం, రష్యా రక్షణ రంగానికి నిధులు అడ్డుకునేందుకు CAATSA ఆంక్షలు ఏర్పరచాం. అంతేకాని మా భాగస్వాములు, మిత్రుల రక్షణ సామర్ధ్యాన్ని ప్రభావితం చేయడం కోసం కాదు’ అని అన్నారు.

భారత్‌ తన రక్షణ కొనుగోళ్ళకు తమపై ఎక్కువగా ఆధారపడాలన్నదే అమెరికా ఉద్దేశ్యం, వ్యూహంగా కనిపిస్తోంది. అలాగే రక్షణ ఒప్పందాల విషయంలో రష్యా నుండి దూరంగా ఉండేట్లు భారత్‌ను ఒప్పించాలన్నది కూడా ఆ వ్యూహంలో భాగమే. కానీ భారత్‌ మాత్రం జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఎస్‌-400 మిస్సైల్‌ వ్యవస్థ కొనుగోలు అంతర్జాతీయ నిపుణులను ఆశ్చర్యపరచింది.

‘భారత్‌ ఇప్పుడు రాయి, గట్టి ప్రదేశానికి మధ్య ఉంది’ అంటూ ఒక పక్క అమెరికా, మరోపక్క రష్యాల వైపు నుంచి ఎదురయ్యే ఒత్తిళ్ళను గురించి వాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా ఆంక్షల కత్తి వెళ్లాడుతున్నా ఏ ధైర్యంతో భారత్‌ రష్యాతో రక్షణ ఒప్పందం చేసుకుందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.

పశ్చిమ దేశాల వ్యతిరేకత పెరగడంతో రష్యా తన స్థానాన్ని కాపాడుకునేందుకు చైనాతో సంబంధాలను బలపరచుకునే ప్రయత్నాలు చేసింది. సంయుక్త సైనిక విన్యాసాలతోపాటు రెండు దేశాలు ఆర్ధిక, రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. చైనాతో స్నేహాన్ని పెంచుకునే ప్రక్రియలో భాగంగా రష్యా పాకిస్థాన్‌కు కూడా స్నేహ హస్తాన్ని అందించా లనుకుంది. కానీ ట్రంప్‌ ఆ ప్రయత్నాలను కొనసాగనివ్వలేదు.

ఎస్‌-400 మిస్సైల్‌ వ్యవస్థ 2020 నాటికి భారత్‌కు అందుతుంది. ఈ వ్యవస్థలో పది బెటాలియన్‌లు ఉంటాయి. ఒక్కో బెటాలియన్‌లో 8 మిస్సైల్‌ లాంచర్‌లు, 112 మిస్సైళ్లు, నియంత్రణ వ్యవస్థ, రాడార్‌, అనుబంధ వాహనాలు ఉంటాయి. ఎస్‌-400 వ్యవస్థ మూలంగా భారత, పాకిస్థాన్‌ల మధ్య రక్షణ బలాల విషయంలో భారత్‌దే పైచేయి అవుతుందని పాకిస్థాన్‌ రక్షణ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇలాంటి తరహా మిస్సైల్‌ వ్యవస్థను కొనుగోలు చేయడానికి పాకిస్థాన్‌ కూడా ప్రయత్నించవచ్చని ముందుగా ఊహించిన భారత్‌ ఈ వ్యవస్థనుగాని, మరే మిస్సైల్‌ వ్యవస్థనుగాని పాకిస్థాన్‌కు విక్రయించకుండా రష్యాతో ముందస్తు ఒప్పందం చేసుకుంది. భారత్‌ వ్యూహాత్మకంగా అమెరికాకు దగ్గర కావడంతో అసంతృప్తి చెందిన రష్యా బదులుగా పాకిస్థాన్‌ను దువ్వడానికి ప్రయత్నించింది. సెర్గిలవ్రోవ్‌ ఈ ప్రణాళికను అమలు చేశారు. ఆ ప్రణాళికలో భాగంగానే 2014లో రష్యా నాలుగు ఎం-35, ఎం-కార్గో హెలికాప్టర్‌లను పాకిస్థాన్‌కు విక్రయించింది. పాకిస్థాన్‌ను దగ్గర చేసుకోవడమనే వ్యూహాన్ని 2002లోనే రష్యా అమలు చేసింది. ట్రంప్‌ అధికారం చేపట్టిన తరువాత రష్యా, పాకిస్థాన్‌ల చెలిమి మరింత పెరిగింది.

ఆగస్ట్‌లో మొదటి రష్యా-పాకిస్థాన్‌ సైనిక సంయుక్త సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగిన తరువాత తమ మిలటరీ కాలేజీల్లో పాకిస్థాన్‌ సైనికులను చేర్చుకుని శిక్షణ ఇచ్చేందుకు రష్యా అంగీకరించింది. కరాచీ అణు కేంద్రాన్ని అన్ని రకాల దాడుల నుండి రక్షణ కల్పించే అధునాతన రాడార్‌ వ్యవస్థను విక్రయించడానికి రష్యా ముందుకు వచ్చింది. ‘తీవ్రవాదంపై పోరాడే పాకిస్థాన్‌ సామర్ధ్యాన్ని పెంచడం ఈ ప్రాంతమంతటికి మంచి చేస్తుంది’ అని సెర్గిలావ్రోవ్‌ అన్నారు. కానీ నిపుణులు మాత్రం చైనా, పాకిస్థాన్‌, ఇరాన్‌లతో రష్యా స్నేహం కేవలం అమెరికాను ఈ ప్రాంతం నుండి దూరంగా ఉంచడానికేనని అంటున్నారు. తీవ్రవాదంపై భారత్‌-రష్యా సంయుక్త ప్రకటన ‘తీవ్రవాదాన్ని ఎలాంటి ద్వంద్వ వైఖరి లేకుండా ఖండించాలి’ అంటూ పేర్కొన్నా పాకిస్థాన్‌ పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఒకప్పుడు తాలిబన్‌లతో అమెరికా చర్చలు జరపడాన్ని వ్యతిరేకించిన రష్యా ఇటీవల అలాంటి చర్చలనే జరిపింది.

పాకిస్థాన్‌తో సంబంధాలను బలపరచు కునేందుకు ఇటీవల రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఆసియాలో ప్రబల శక్తిగా స్థానాన్ని సంపాదించుకునే వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు యూరోపియన్‌ శక్తిగా గుర్తింపు పొందడానికే రష్యా ఇష్టపడింది. కానీ క్రమంగా తన ప్రాబల్యం తగ్గడం, వివిధ పాశ్చాత్య దేశాలు రష్యాను వ్యతిరేకించడంతో ఆసియాలో బలాన్ని పెంచు కోవడం ద్వారా వాటికి తగిన పాఠం చెప్పాలని రష్యా భావించింది. కానీ చైనా, భారత్‌ వంటి పెద్ద దేశాలు ఉన్న ఈ ప్రాంతంలో ప్రాబల్యం పెంచుకోవాలంటే ఆర్ధిక బలాన్ని మరింతగా చూపించాల్సి ఉంటుంది. అందుకే పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌లకు దగ్గర కావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

అయితే ఆసియాలో చైనా విస్తరణ వాదాన్ని అడ్డుకోవాలంటే భారత్‌కు రష్యా సహాయ సహకారాలు అవసరం. కనుక రష్యాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం కోసం భారత్‌ ప్రయత్నించాలి. ఏడు దశాబ్దాల ఇండో-రష్యా సంబంధాల్లో స్పష్టమైన దృష్టి, బహుముఖ ప్రయోజనాలను సాధించే ఆలోచన కొరవడ్డాయి. అందుకే రెండు దేశాలు సహాయ సహకారాలను పెంపొందించుకోవాల్సిన రంగాలను గుర్తించడంలో విఫలమయ్యాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు రక్షణ ఒప్పందాలపైనే ఆధారపడ్డాయి. విద్యుత్‌, పౌర అణు సహకార విషయాలు చాలా ఆలస్యంగా రంగంలోకి వచ్చాయి. అందుకే రెండు దేశాల మధ్య వాణిజ్యం ఎప్పుడూ 10 బిలియన్‌లు దాటి పోలేదు. ఈ విషయాన్ని గుర్తించిన రెండు దేశాలు 2025 నాటికి వాణిజ్యం 30 బిలియన్‌ డాలర్లను దాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి.

ఇండో-రష్యా వ్యాపార సమావేశంలో భారత, రష్యాలు ఆర్కిటిక్‌ ప్రాంతంలో కలిసి పనిచేయా లంటూ పుతిన్‌ ప్రతిపాదించారు. ‘ఇది చాలా ప్రయోజనకరమైన, దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌ అవుతుంది. దీని నుంచి ప్రతిఫలం కూడా బాగా ఉంటుంది. సర్వత్ర వాతావరణ మార్పులు వస్తున్న తరుణంలో ఉత్తర సముద్ర మార్గం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది’ అని ఆయన అన్నారు. రష్యా భూభాగంలో, పెచొర, ఒఖోత్స్క్‌ సముద్రాల్లో చమురు అన్వేషణను సంయుక్తంగా సాగించాలని రెండు దేశాల అధినేతలు అభిప్రాయపడ్డారు.

వివిధ రంగాల్లో సహాయ సహకారాన్ని పెంపొందించుకోవాలనే రెండు దేశాల ఆలోచన ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఈ ప్రాంతంలో కలుగుతున్న ఆందోళనకరమైన పరిణామాలకు విరుగుడు కాగలదు. అనేక భాగస్వామ్య దేశాలతో నాణ్యమైన సంబంధాలను కలిగి ఉండాలన్న భారత్‌ విదేశాంగ సూత్రం ఇందులో భాగం కాగలదు.

– డా||రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *