సులభ వైద్యం హోమియో

సులభ వైద్యం హోమియో

హోమియో వైద్యంలో ప్రతి రోగికి మందు విడిగా ఉంటుంది. అంటే ఒకేరకం వ్యాధి వచ్చిన వారందరికీ ఒకే రకం మందు ఉండదు. మొదట రోగిని పరిశీలించి, తరువాత అతని రోగాన్ని పరిశీలించి మందు సూచిస్తారు. అంటే రోగి శారీరక, మానసిక వేదనలను సరిగా రాబట్టాలి. హోమియో వైద్యంలో రోగితత్వానికి ప్రాధాన్యం ఉంటుంది. రోగిలోని ఏ అంశం అతని ఆరోగ్యాన్ని పాడుచేస్తుందో దానికి మాత్రమే మందు సూచిస్తారు.

అల్లోపతి వైద్యం శాస్త్రపరంగా అభివృద్ధి సాధించినప్పటికీ దీర్ఘకాల వ్యాధులకు అందులో ఇంకా సరైన వైద్యం లేదనే చెప్పవచ్చు. ఇతర వైద్య విధానాలలో బాగుకాని అనేక దీర్ఘకాల వ్యాధులు హోమియో, ఆయుర్వేదం ద్వారా నయమవు తున్నాయి. ఈ మందుల వలన దుష్ఫలితాలు ఉండవు. ముఖ్యంగా హోమియోలో ఖర్చు తక్కువ. పేదలకు వరం లాంటిది. ఇతర వైద్య విధాన వైద్యులు కూడా హోమియో విశిష్టతను గుర్తిస్తున్నారు. అంటువ్యాధులు (Epidemic Diseases) వ్యాపించినప్పుడు హోమియో సమర్థవంతంగా పనిచేస్తున్నది. కొంతకాలం క్రితం తెలుగు రాష్ట్రాలలో వచ్చిన మెదడు వ్యాపు వ్యాధికి బెల్లడోన, కండ్ల కలకకి యుఫ్రేపియ, చికెన్‌ గున్యా, డెంగ్యూ జ్వరాలకు రుస్టాక్‌, యుపటోరియం ఫర్ప్‌ మొదలైన ¬మియో మందులు ఆయా వ్యాధుల కట్టడికి ఏ విధంగా ఉపయోగపడినది అందరికీ తెలుసు. సర్జరీ అవసరమైన కేసులలో తప్ప మిగతా అన్ని కేసులలో హోమియో మందులు అద్భుతంగా పని చేస్తాయి.

జర్మనీ దేశానికి చెందిన డాక్టర్‌ క్రిస్టియన్‌ ఫ్రెడ్రిక్‌ శామ్యూల్‌ హానిమన్‌ హోమియో వైద్య విధానాన్ని కనుగొన్నారు. శామ్యూల్‌ హానిమన్‌ 1755, ఏప్రిల్‌ 10న జర్మనీ దేశంలో మెయిసన్‌ గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు.

హానిమన్‌కి ముందు హిప్పోక్రటీస్‌, పారాసిల్‌సన్‌ ఉపయోగించిన పద్ధతులు హోమియోకి దగ్గరగా ఉన్నాయి. కాని వాటి గురించి సుదీర్ఘమైన పరిశోధనలు చేసి శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించి మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడేలా అందజేసిన మహానీయుడు హానిమన్‌. అందుకే హానిమన్‌ను హోమియో వైద్య పితామహుడు అంటారు.

హానిమన్‌ యూరోపియన్‌ భాషలైన జర్మనీ, ఇంగ్లీషు, ఇటలీ, ఫ్రెంచి, గ్రీకు, లాటిన్‌, అరబిక్‌ భాషలలో ప్రావీణ్యం సాధించారు. హానిమన్‌ ఇలా అన్నాడు ‘నా వైద్య విధానం సరైనదని నిరూపణ అయినప్పుడు దాని మహిమను దైవానికి ఆపాదించండి’. అంతటి నిస్వార్థపరుడు హానిమన్‌.

హోమియో ఆవిర్భావం

హోమియో వైద్యం పరిశీలన, పరిశోధన, అనుభవం మీద అభివృద్ధి చెందిన వైద్యశాస్త్రం. ఈ వైద్య సూత్రాలు, మందులు సుమారు 220 సంవత్సరాల నుండి మార్పు లేకుండా కొనసాగు తున్నాయి. ఈ మందులు శక్తివంతమైనవి. ప్రకృతి సిద్ధమైనవి. దుష్ఫలితాలు కలిగించనివి.

హోమియో వైద్యంలో ప్రతి రోగికి మందు విడిగా ఉంటుంది. అంటే ఒకేరకం వ్యాధి వచ్చిన వారందరికీ ఒకే రకం మందు ఉండదు. ముందు రోగిని పరిశీలించి, తరువాత అతని రోగాన్ని పరిశీలించి మందు సూచిస్తారు. అంటే రోగి శారీరక, మానసిక వేదనలను సరిగా రాబట్టాలి. హోమియో వైద్యంలో రోగితత్వానికి ప్రాధాన్యం ఉంటుంది. రోగిలోని ఏ అంశం అతని ఆరోగ్యాన్ని పాడుచేస్తుందో దానికి మాత్రమే మందు సూచిస్తారు.

మనిషి అంటే అవయవాలు మాత్రమే కాదు. దేహం, మనస్సు, ప్రాణం. ఈ మూడింటి సమాహారం. అభౌతికమైన ప్రాణశక్తి భౌతికమైన శరీరంలోని మనస్సును, ఇతర అవయవాలు, వాటి ధర్మాలను, స్పర్శాదులను నియంత్రిస్తుంది. ప్రాణశక్తి లేదా జీవశక్తి సహకారం లేనిదే మనస్సు, శరీరం ఎటువంటి కార్యకలాపాలు జరపలేదు. దేహంలోని ప్రాణశక్తి కలత చెందినప్పుడు లేదా వ్యాధి గ్రస్తమైనప్పుడు మనస్సును, దేహాన్ని, క్రమవిరుద్ధంగా పనిచేసేటట్లు ప్రేరేపిస్తుంది. దీనినే వ్యాధి అని సంబోధిస్తున్నాం. ఈ విధంగా వ్యాధి జీవశక్తి వైకల్యంగా ప్రారంభమై జీవ కార్యాలలో మనో వ్యాపకాలలో మార్పు కలగజేసి, చిట్టచివరికి అవయవాలలో వ్యక్తమవుతుంది. ప్రాణశక్తి వ్యాధి లక్షణాలను మానసిక, శారీరక లక్షణాల రూపంలో ప్రకటిస్తుంది. హోమియో వైద్యంలో లక్షణ సము దాయాన్ని గ్రహించి వాటిని తొలగించడం ద్వారా మాత్రమే రోగిని తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయవచ్చు.

ప్రాణశక్తి అభౌతికమైనది. దేహానికి కలిగిన వ్యాధి కూడా అభౌతికమైనదే. కనుక వ్యాధి నివారణకు వాడే ఔషధం ప్రాణశక్తిలోకి చొచ్చుకుపోయి వ్యాధిని నివారణ చేయగల సూక్ష్మస్థాయిలో ఉండాలి. మందులు ఎంత సూక్ష్మ రూపంలో ఉంటే వాటి నివారణ శక్తి అంత ఎక్కువగా ఉంటుందని అనుభవం మీద గ్రహించిన హోమియో పితా మహుడు హానిమన్‌ ఈ మందులను సూక్ష్మీక రించాడు. దీనినే శక్తి ‘గుణీకరణ’ లేదా ‘పొటెంటైజేషన్‌’ అంటారు. సూక్ష్మీకరించిన మందులు మానవుని మనస్సు, శరీరంపై సున్నితంగా పనిచేసి వ్యాధులను త్వరితంగా, శాశ్వతంగా నివారిస్తాయి. హోమియో వైద్య విధానానికి సూక్ష్మత, సారూప్యత అనేవి రెండు స్థూల నియమాలు. హోమియో ద్వారా చాలా కేసులలో సర్జరీ (ఆపరేషన్‌) అవసరం రాకుండా చేయగలిగిన సందర్భాలున్నాయి.

హోమియోపతిలో వాడే మందుల ముడి పదార్థాలను వృక్ష సంబంధమైన వేర్లు, బెరడులు, ఆకు రసాల నుండి; జంతువులు, కీటకాల నుండి; ఖనిజాలు, రసాయన పదార్థాల నుండి తయారు చేస్తారు. ఈ విధానంలో ఆర్సెనిక్‌, పాదరసం లాంటి విష పదార్థాలను, ఎలాంటి ఔషధ గుణాలు లేని ఉప్పు, ఇసుక లాంటి పదార్థాలను శక్తి గుణీకరణ ద్వారా దివ్యమైన ఔషధాలుగా మార్చిన ఘనత హానిమన్‌కే దక్కుతుంది.

¬మియో మందులను దశాంశ పద్ధతి, శతాంశ పద్ధతి, 50 మిల్లిస్‌యల్‌ పద్ధతి అనే మూడు రకాల పొటెన్సీలలో తయారు చేస్తారు.

దశాంశ పద్ధతి : దీనినే డెసియల్‌ పొటెన్సీ అంటారు. శుద్ధి చేసిన మూల పదార్థాన్ని ఒక భాగం తీసుకొని దానికి తొమ్మిది భాగాలు పాల పంచదార కలిపి బాగా నూరటం ద్వారా లేదా 9 భాగాలు ఆల్కహాల్‌ లేదా డిస్టిల్‌ వాటర్‌ను కలిపి బాగా కుదపటం ద్వారా 1వ దశాంశ పొటెన్సీ తయారు అవుతుంది. దీనిని ఆ మందు పేరుతో కలిపి 1x గా సూచిస్తారు. ఈ 1x పొటెన్సీలో ఒక భాగం తీసుకొని దానిని 9 భాగాలు విడగొట్టి, పాలు పంచదార కలిపి బాగా నూరటం లేదా ఆల్కహాల్‌ లేదా డిస్టిల్‌ వాటర్‌ కలిపి బాగా కుదపటం ద్వారా 2x పొటెన్సీ తయారవుతుంది. ఇలా 1x నుండి 200x పొటెన్సీ వరకు తయారు చేయవచ్చు. మార్కెట్‌లో 3x, 6x, 12x, 30x, 200x పొటెన్సీలలో మందులు లభ్యమవుతాయి.

శతాంశ పద్ధతి : వీటిని సెంటియల్‌ పోటెన్సీలు అంటారు. శుద్ధి చేసిన మూల ఔషధం ఒక భాగం తీసుకొని దానికి 99 పాళ్లు పాల పంచదార కలిపి బాగా నూరటం లేదా 99 పాళ్ల ఆల్కహాల్‌ లేదా డిస్టిల్‌ వాటర్‌ కలిపి బాగా కలిపితే 1 శతాంశ లేదా 1c పవర్‌ అవుతుంది. ఈ 1c పొటెన్సీని ఒక భాగం తీసుకొని దానికి మరో 99 భాగాలు పాల పంచదార కలిపి, ఆల్కహాల్‌ లేదా డిస్టిల్‌ వాటర్‌ కలపడం ద్వారా 2c పొటెన్సీ తయారుచేస్తారు. ఇలా 3c, 6c, 30c, 200c, 1m, 10m, 50m, Cmలుగా సూచిస్తారు. మార్కెట్లో ఈ అన్ని రకాల పొటెన్సీలు లభ్యమవుతాయి.

50 మిల్లిస్‌యల్‌ పొటెన్సీ : ఈ పద్ధతిలో 1:50000 నిష్పత్తిలో పదార్థాలు కలిపి తయారు చేస్తారు. ఈ పద్ధతిలో 0/1, 0/2, 0/30 పొటెన్సీలు తయారు చేస్తారు.

హోమియో మందులను నాలుగు రకాలుగా ఉపయోగిస్తారు.

మాతృ ద్రవాలు : ఔషధాల నుండి ముడి పదార్థాలను ఆల్కహాల్‌ నందు నిల్వచేయటం ద్వారా మదర్‌ టింక్చర్లు తయారుచేస్తారు. వీటిని మందు పేరు తర్వాత ‘క్యు’ అనే అక్షరంతో సూచిస్తారు.

పొటెన్సీ ద్రవరూపం : వీటిని ఒక్క చుక్క (5 ml) నీటితో కలిపి ఇవ్వవలసి ఉంటుంది. తరువాత వ్యాధి తీవ్రదశలో ఉన్నప్పుడు లేదా రోగి మాత్రలను చప్పరించే పరిస్థితులలో లేనప్పుడు ఈ డైల్యూషన్‌ నీటిలో వేసి ఇస్తారు. ఇది త్వరితంగా పని చేస్తుంది.

సన్నని మాత్రలు : ఇవి పాల పంచదారతో తయారు చేసిన సన్నని మాత్రలు. ఇటువంటి 1 డ్రమ్‌ మాత్రలలో పైన తెలిపిన పొటెన్సీ రూపంలో ఉన్న ద్రవరూప మందును 5 చుక్కలు వేసి వాడతారు. చిన్న పిల్లలకు 2, పెద్ద వారికి 4 లేదా 5 మాత్రల చొప్పున నాలుక మీద వేస్తారు. ఇవి చప్పరిస్తే 1 నిమిషంలో కరిగి నాలుకపై గల నాళాలలో కలిసి శరీరంలోకి సంపూర్ణంగా మందు చొచ్చుకుపోతుంది.

పొడులు, మాత్రలు : హోమియో మందులను పొడి రూపంలోనూ, బిళ్లల రూపంలోనూ తయారు చేస్తారు. పిల్లలకు 2 గ్రెయినుల పొడి లేదా 2 మాత్రలు, పెద్దలు 4 గ్రెయినుల పొడి లేదా 4 మాత్రలు చొప్పున రోజుకు 2 లేక 3 సార్లు ఇస్తారు. వీటిని కూడా నాలుక మీద వేసుకొని చప్పరించాలి. ద్వాదశ లవణాలు ఈ విధంగానే తయారు చేస్తారు.

హోమియో వైద్యంలో ముందు మందును ఎంపిక చేసుకొని, తర్వాత పొటెన్సీ నిర్ణయిస్తారు. వ్యాధి నివారణ రోగికి ఉద్రేకం కలిగించనంత సున్నితంగా ఉండాలని హానిమన్‌ కోరిక. అందువల్ల తక్కువ పొటెన్సీతో వైద్యం ప్రారంభించడం మంచిదని మేధావుల అభిప్రాయం.

హోమియో పితామహుడు హానిమన్‌ 1810లో ‘ఆర్గనాన్‌ ఆఫ్‌ రేషనల్‌ హీలింగ్‌’ గ్రంథాన్ని రాశారు. 1811 నుండి లీప్‌జిగ్‌ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేశారు. వీరికి అనేకమంది ఉత్సాహవంతులైన శిష్యులు లభించారు. హానిమన్‌ వీరి సహకారంతో అనేక ఇతర మందులపై నిర్విరామంగా ప్రయోగాలు జరిపి వాటి ఫలితాలను వివరిస్తూ 1821లో ‘మెటీరియో మెడికా ప్యూరా’ గ్రంథాన్ని రచించారు.

శామ్యూల్‌ హానిమన్‌ 88 సంవత్సరాలు జీవించి 1843, జూలై 2న తుది శ్వాస విడిచారు. అకుంఠిత దీక్షాపరుడు, ప్రతిభాశాలి, బహుభాషా కోవిదుడు, రసాయన, వ్యవసాయ, వైద్య శాస్త్ర ప్రవీణుడు అయిన హానిమన్‌ తన జీవితకాలమంతా నిర్విరామ, నిరంతర కృషి సలిపి అద్భుతమైన వైద్య విధానాన్ని మానవాళికి అందించారు. ఇందుకు మానవ జాతి ఆయనకు ఎంతో ఋణపడి ఉంటుంది. ఆయన సమాధిపైన ఉన్న స్మారక ఫలకంపై ‘నా జీవితం వృథా కాలేదు’ అని చెక్కిన మాటలు పూర్తిగా సార్థకమయ్యాయి.

– ఎం.ఎం.డి.రఫీ, 9949731408

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *