హిందువుల పట్ల చూపుతున్న వివక్షకు చరమగీతం పాడాలి

హిందువుల పట్ల చూపుతున్న వివక్షకు చరమగీతం పాడాలి

ప్రభుత్వానికి హిందూ ప్రముఖుల డిమాండ్‌

హిందూ సమాజంపై ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న సంస్థాగత దాడులు, హిందూ జీవన విధానాలను చులకన చేయడం, హిందూ ధార్మిక మూలాలను అవహేళన చేయడం విరివిగా సాగుతున్నాయి. ఈ చర్యలకు ఇక చరమగీతం పాడాలని, ఇలాంటి వివక్షను ఇకముందు కొనసాగనివ్వకూడదని ఢిల్లీలో సెప్టెంబర్‌ 22, 2018న సమావేశమైన హిందూ ప్రముఖులు తీర్మానం చేశారు. ఈ సదస్సులో ప్రముఖ హైందవ నాయకులు, ఆధ్యాత్మిక నేతలు, విద్యావంతులు, సంపాదకులు, వైద్యులు, ఇంజనీర్లు, జర్నలిస్టులు, మేధావులు పాల్గొన్నారు. వీరందరూ హిందూ సమాజంపై చట్టపరంగాను, న్యాయపరంగాను కొన్ని విషయాలపై ప్రభుత్వ వివక్షను విమర్శించారు.

చర్చల అనంతరం హిందూసమాజ నాగరికతను, దాని మూల స్వభావానికి నష్టం వాటిల్లకుండా భావితరాలకు అందించవలసిన అవసరం మనపై ఉందని, ధర్మంపై ఆధారపడిన హిందూ నాగరికతను రక్షించుకోవలసిన బాధ్యత మనపైనే ఉందని తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ క్రింది డిమాండ్లతో ఒక మెమోరాండం సమర్పించారు.

1. భారత ప్రభుత్వం హిందువుల పట్ల న్యాయపరంగాను, సంస్థాగతంగాను చూపుతున్న వివక్షను విడనాడాలి. నేడు మీరు చూపుతున్న వివక్ష అన్ని మతాలవారు సమానులే అన్న భావనకు వ్యతిరేకంగా ఉంది. హిందువుల పట్ల వివక్ష పోవాలంటే రాజ్యాంగంలోని 26 నుండి 30 వరకు గల అధికరణాలకు (ఆర్టికల్స్‌) సవరణ చేయాలంటూ 2016లో సత్యపాల్‌సింగ్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ మెంబర్‌ బిల్‌.నెం.226ను వచ్చే లోక్‌సభ సమావేశాలలో ఆమోదించాలి. దీనివల్ల 1. ప్రభుత్వ జోక్యం లేకుండా విద్యాలయాలు నడుపుకోవటం, 2. హిందూ ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేయటం, వాటిపై హిందువుల యాజమాన్య హక్కును పునరుద్ధరించటం, 3. హిందూ వారసత్వాన్ని కాపాడటం, ప్రచారం చేయటం వంటి విషయాలలో మిగతా మతాల వారితో సమానంగా హక్కులు లభిస్తాయి.

1995లో దివంగత సయ్యద్‌ షహబుద్దీన్‌ ఆర్టికల్‌ 30కి సవరణలు చేయాలని ప్రైవేట్‌ బిల్‌ నెం.36ను ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం ఆర్టికల్‌ 30లో ‘మైనారిటీ’ అనే పదాన్ని తొలగించి అక్కడి సమాజంలోని అందరు నాగరికులు అనే పదం జోడించమన్నాడు.

భారతదేశంలో నడుస్తున్న చాలా స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుండి ఆర్థిక సహాయం అందుతుందనడంలో ఏ మాత్రం సందేహంలేదు. కొన్ని సంస్థలు ప్రయోజనకరమైన పనులు చేస్తుండవచ్చు. కాని చాలామటుకు ఇలా వచ్చిన ధనం హిందువులలో చీలికలు తేవడానికి, లేదా మతమార్పిడులకు, లేదా హిందువులను కించపరిచే సాహిత్య సృష్టికి ఉపయోగపడుతున్నాయి.

మన దేశానికి విదేశాల నుండి వచ్చే ఎలాంటి ఆర్థిక సహాయమైనా తిరస్కరించాలి. ఎందుకంటే మన దేశ అవసరాలకు కావలసిన నిధులు మనమే అందరం కలిసి స్వయంగా సేకరించుకోవచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి ఇలా ప్రవహించే ధన సహాయాన్ని పూర్తిగా నిషేధించాలి. ఇపుడున్న ఎఫ్‌.సి.ఆర్‌.ఏ. చట్టాన్ని రద్దుచేసి విదేశీ ఆర్థిక సహాయ వనరుల నిషేధ చట్టాన్ని రూపొందించాలి.

3. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మతస్వేచ్ఛ బిల్లును అమలుచేయాలి. హిందువుల స్థానిక సంస్కృతి, మత ఆచారాలు, కట్టుబాట్లు, మతపరమైన చిహ్నాలు వీటన్నింటిపై ఇటు ప్రభుత్వాలు కాని అటు మిగతావారు కల్పించుకోకుండా రక్షణ కల్పించాలి.

4. కశ్మీర్‌లో హిందువుల మూకుమ్మడి వధ జరిగింది. మరికొంతమందిని తరిమివేశారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కింది డిమాండ్లను పరిశీలించ వలసిందిగా కోరుతున్నాము.

(క) జమ్ము-కశ్మీర్‌ను మూడు రాష్ట్రాలుగా అంటే కశ్మీర్‌, లడఖ్‌ మరియు జమ్ములుగా ఏర్పాటు చేయాలి.

(ఖ) జమ్ముకశ్మీర్‌ సమస్యకు మూల కారణమైన ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలి. 1954లో జమ్ముకశ్మీర్‌ కొరకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేక చట్టాలను రద్దుచేయాలి. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం భారతదేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలతో సమానమే. అందుకే ఆర్టికల్‌ 35ఏ కూడా రద్దుచేయాలి.

5. 2017 సంవత్సరానికిగాను మన దేశం పశుమాంసం ఎగుమతిలో ప్రపంచ రికార్డు సాధించింది. 14 లక్షల టన్నుల పశుమాంసం ఎగుమతి చేసింది. ఇది మన దేశానికి గౌరవం కాదు. పశుమాంసం ఎగుమతులు ప్రోత్సహించడం వలన పశుమాంస వ్యాపారులు పెరిగి లాభాపేక్షతో పశువులను అపహరించి వ్యాపారం కొనసాగిస్తున్నారు. పశువధ చేసిన తరువాత తయారయ్యే వ్యర్థాల వలన పర్యావరణం దెబ్బతింటోంది. కాబట్టి కేంద్రప్రభుత్వం పశుమాంస ఎగుమతిని తక్షణమే నిషేధించాలి. పర్యావరణాన్ని కాపాడాలి. దీనివల్ల శాంతిభద్రతలు కూడా మెరుగవుతాయి.

6. దేశంలో వేలాది దేవాలయాలు జీర్ణస్థితిలో ఉన్నాయి. కొన్ని ధ్వంసం అయ్యాయి. మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. వేద పాఠశాలలు, జానపద కళలు, సాహిత్యం, నృత్యం, సంగీతం, చిత్రకళ, శిల్పకళ, గృహనిర్మాణ కళ ఇవన్నీ మన సనాతన ధర్మానికి ఆలంబనలు. కాని నేడు ఇవన్నీ నిర్లక్ష్యం అవుతున్నాయి. కాబట్టి కేంద్రం జోక్యం కల్పించుకొని తక్షణమే ‘హైందవ సంస్కృతి జీర్ణోద్ధరణ కార్పోరేషన్‌’ను స్థాపించాలి. ఈ కార్పోరేషన్‌కు 10 వేల కోట్లు మూలధనం కేటాయించాలి. ప్రతి సంవత్సరం గ్రాంట్లు మంజూరు చేయాలి. ఈ కార్పోరేషన్‌ జీర్ణమైన దేవాలయాల ఉద్ధరణ చేస్తుంది. వేదపాఠశాలల ప్రోత్సాహం, వివిధ జానపద కళల పోషణ, సంగీతం, నృత్యం శిల్పకళ, చిత్రకళలను ప్రోత్సహిస్తుంది.

7. ఇతర దేశాల నుండి మన దేశానికి వచ్చే శరణార్థుల విషయంలో కేంద్ర ప్రభుత్వం 2016లో ఒక బిల్లు ప్రవేశపెట్టింది. అది ఇప్పటికీ అలాగే ఉంది. ఆ బిల్లులో మరికొన్ని అనుమానాలున్నాయి. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య రాష్ట్రాలకు ఈ విషయంలో ఎక్కువ సంబంధముంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ క్రింది చర్యలు చేపట్టాలి.

క) పెండింగ్‌లో ఉన్న పౌరసత్వ (అమెండ్‌ మెంట్‌) బిల్‌, 2016ను ఉపసంహరించుకోవాలి.

ఖ) రాజ్యాంగ సవరణ చేస్తూ దానిలో ఎనేబ్లింగ్‌ ఆర్టికల్‌ 11-ఎ చేర్చాలి.

గ) 1955 నాటి పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ నూతన పౌరసత్వ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టాలి.

8. నేడు భారతీయ భాషల పట్ల వివక్ష కొనసాగు తోంది. ఈ వివక్షను తొలగించే ప్రయత్నం చేయాలి. లేనట్లయితే దేశంలో చాలామంది ప్రజలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోతారు.

800 మిలియన్ల హిందువుల రక్షణ, ఉద్ధరణ కోసం తయారుచేసిన ఈ డిమాండ్ల పట్టికను హిందూ ప్రముఖులు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. భారతదేశంలో నివసిస్తున్న మిగతా మతాలవారితో సమానంగా, న్యాయం, స్వేచ్ఛ, ఆరోగ్యం హిందువు లకు అందాలి.

కేంద్ర ప్రభుత్వం ఈ దిశలో అడుగులు వేస్తే డా||బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ నాయకత్వంలో మరికొంతమంది కలిసి రూపొందించిన భారత రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలవారిని సమానంగా ఆదరించిన వారమవుతాము.

– డా || రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *