హిందువులకు మత హక్కు లేదా ?

హిందువులకు మత హక్కు లేదా ?

పెక్యులరిజం – 18

‘తమాషా ఏమిటంటే సమాజం ముందుగా సమర్ధించరాని ఒక రూలు తెచ్చిపెడుతుంది. తరవాత దాన్ని సమర్థించుకుందుకు వివరణలు, నిరూపణలు ! మానవత్వాన్ని బాధపెట్టే వైఖరి సమర్ధింపు కోసం మానవాళి ప్రాచీనకాలం నుంచీ కారణాలు వెతుకుతున్నది. మానవ విలువలనేవి కాగితాల మీదే మిగిలాయి. చారిత్రకంగా స్త్రీలు అసమానతకు గురయ్యారు. అందుకే వారు హక్కుల కోసం పోరాడేది. ప్రసిద్ధ ఫెమినిస్టు సుసాన్‌ ఆంధోనీ చక్కగా చెప్పింది ఇలా :

మగాళ్లకు హక్కుల కంటే ఎక్కువ ఏమొద్దు

మహిళలకు హక్కుల కంటే తక్కువ ఏమొద్దు

ఇది స్పష్టమైన సందేశం’.

ఏమిటిది ? ఫెమినిస్టు పార్టీ మేనిఫెస్టోనా ? మహిళా ఉద్యమ విధాన పత్రమా ? స్త్రీ విమోచనపై సిద్ధాంత వ్యాసమా ?

కాదండి ! కాదు ! ఈ దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం ఈ సెప్టెంబర్‌ 28న శబరిమల ఆలయప్రవేశం కేసులో వెలువరించిన ప్రశస్తమైన తీర్పులోని మొట్టమొదటి వాక్యాలివి !!

విచారణాంశం సామాన్యమైనది కాదు. వందకోట్ల హిందువుల సెంటిమెంటుకూ, కోట్లాది అయ్యప్ప భక్తుల ప్రగాఢ విశ్వాసానికీ, జాతీయ హిందూ సమాజానికి జీవనాడి అయిన ఆలయ వ్యవస్థ పవిత్రతకూ, మతాచారాలను పాటించడానికి దేశ జనాభాలో 80 శాతం ఉన్న మెజారిటీ కమ్యూనిటీ రాజ్యాంగ హక్కులకూ సంబంధించిన అతిముఖ్య సమస్య అది. పన్నెండేళ్లుగా రగులుతూ కోటానుకోట్ల అయ్యప్ప భక్తులకూ, భక్తురాళ్లకూ చికాకు కలిగిస్తున్న వృధా వివాదమది.

ఒక మహమ్మదీయుడు నడిపే న్యాయవాద సంఘం శబరిమలలోని హిందూ ఆలయంలో ఒక వయోవర్గపు స్త్రీలను రానివ్వకపోవటం రాజ్యాంగవిరుద్ధమంటూ పెట్టిన తనకుమాలిన కేసును మొదట ముగ్గురు జడ్జిల సుప్రీంకోర్టు బెంచి విచారించింది. అసలు ఆ దశలోనే ఆ పనికిమాలిన పితూరీని సుప్రీంకోర్టు విచారణకు కూడా తీసుకోకుండా కొట్టివేసి ఉండాల్సింది.

ఎందుకంటే – శబరిమల ఆలయంలో తరతరాలుగా వస్తున్న ఆ ఆచారంలో అభ్యంతరకరమైనది, కోర్టు కలగచేసుకోవలసింది ఏమీ లేదని కేరళ హైకోర్టు ఎప్పుడో 1993లోనే తీర్పు చెప్పింది. (AIR 1993 Kerala 42). దానిని ఎవరూ సవాలు చేయలేదు. అపీలు చేయకుండా అన్ని పక్షాలూ ఆ తీర్పును అంగీకరించినప్పుడు అదే ఖరారు ! పదమూడేళ్ల తరవాత పనిలేని వాళ్లెవరో వచ్చి పేచీ పెట్టినంతమాత్రాన, బలమైన కారణాలు లేకుండా సుప్రీంకోర్టు దానిని తిరగదోడాల్సిన పనిలేదు.

కాని ముగ్గురు జడ్జిల బెంచి కొట్టివేయకపోగా ఆ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్‌ చేసింది. ఇంతోటి కేసును భేదించటానికి స్వయానా భారత ప్రధాన న్యాయమూర్తి (జస్టిస్‌ దీపక్‌మిశ్రా) పెద్దరికంలో ఐదుగురు జడ్జిల పెద్ద బెంచి కొలువుతీరింది. ఈ సెప్టెంబర్‌ 28న సదరు ధర్మాసనం ప్రకటించిన సంచలనాత్మక తీర్పు సొగసుకు పైన ఉటంకించిన తొలివాక్యాలు మచ్చుతునలు!

అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం 10 నుంచి 50 ఏళ్లలోపు స్త్రీలను శబరిమల సన్నిధానానికి అనుమతించకపోవటం సబబేననీ, 15,25,26 అధికరణాల ప్రకారం అది రాజ్యాంగ విరుద్ధం కాదనీ 1993 తీర్పులో హైకోర్టు ప్రకటించింది. అది తప్పు అని ఇప్పుడు సుప్రీంకోర్టు పెద్ద బెంచి తేల్చింది.

ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ఆచరించి, మతాచారాలను పాటించుకునేందుకు రాజ్యాంగం 25వ అధికరణం… తమ మత సంస్థలను తాము కావలసినరీతిలో నడుపుకునేందుకు 26వ అధికరణం గొప్ప వరం ఇచ్చినట్టు ఇప్పటిదాకా హిందువులు తెగ మురిసిపోతున్నారు. వారి మొగాలకు అంతటి ప్రాప్తం లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇప్పుడు చెప్పకనే చెప్పింది.

మత వ్యవహారాలను సొంతంగా మేనేజ్‌ చేసుకునేందుకు, మత సంస్థలను నడుపుకునేందుకు ప్రతి తీవశ్రీఱస్త్రఱశీబర సవఅశీఎఱఅa్‌ఱశీఅ (మత శాఖ) కూ హక్కు ఉన్నదని 26వ అధికరణం గ్యారంటీ ఇచ్చిన మాట నిజమే. కాని ఆ గ్యారంటీ శబరిమల అయ్యప్ప గుడికి వర్తించదని తాజా తీర్పులో మెజారిటీ జడ్జిలు ప్రకటించారు.

ఎందుకు వర్తించదట ?

అయ్యప్ప గుడి ‘రిలిజియస్‌ డినామినేషన్‌’ కిందికి రాదట!

ఎందుకు రాదు – అన్నదానికి తాజా తీర్పులో మెజారిటీ జడ్జిలు చెప్పింది ఇది :

‘డినామినేషన్‌’ అన్న పదానికి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ అనేక అర్థాలను ఇచ్చిందట! వాటి ప్రకారం చూస్తే ‘డినామినేషను’గా గుర్తింపు పొందాలంటే కొన్ని లక్షణాలు ఉండి ఉండాలట. అవి ఏమనగా –

1. కొన్ని నమ్మకాలు, సిద్ధాంతాలు కలిగిన వ్యక్తుల సముదాయమై ఉండటం

2. ఉమ్మడి వ్యవస్థకు చెంది ఉండటం

3. ఒక ప్రత్యేకమైన పేరుతో పిలవబడటం.

ఈ పై యోగ్యతల్లో ఏ ఒక్కటీ అయ్యప్ప భక్త సమాజానికి లేదని సుప్రీంకోర్టు వారు ఇప్పుడు తేల్చారు.

అలా ఎలా అనగలరు ? అయ్యప్ప భక్తులకు ప్రత్యేకమైన నమ్మకాలు, సూత్రాలు ఉన్నాయి కదా? అయ్యప్ప సమాజానికి పెద్ద వ్యవస్థే ఉంది కదా? మాల వేసుకున్న ప్రతి భక్తుడూ ‘అయ్యప్ప’ అనే ప్రత్యేకమైన పేరుతోనే పిలవబడుతున్నాడు కదా?

కావొచ్చు. కాని సుప్రీంకోర్టు ఒప్పుకోదు.

‘There is no identified group called Ayyappans. Every Hindu devotee can go to the temple… There is nothing on record to show that the devotees of Ayyappa have any common religious tenets peculiar to themselves… other than those which are common to the Hindu religion. Therefore, the devotees of Lord Ayyappa are just Hindus and do not constitute a separate religious denomination. For a religious denomination, there must be a new methodology provided for a religion. Mere observance of certain practices, even though from a long time, does not make it a district, religion on that count.
(అయ్యప్పలు అని గుర్తింపు పొందిన గ్రూపు ఏదీ లేదు… హిందూ మతానికి కామన్‌ అయినవి కాకుండా, తమకు మాత్రమే ప్రత్యేకమైన మత సిద్ధాంతాలు అయ్యప్ప భక్తులకు ఉన్నాయని చూపేందుకు ఏ రికార్డూ లేదు. కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులు జస్ట్‌ హిందువులు. వేరే రిలిజియస్‌ డినామినేషను దేనికీ వారు చెందరు. రిలిజియస్‌ డినామినేషను అనేదానికి ఒక మతానికి నిర్దేశించబడిన కొత్త మెథడాలజీ ఉండి తీరాలి. ఏవో కొన్ని ఆచారాలను చాలాకాలం నుంచీ పాటిస్తున్నారన్న ఒక్క కారణం చేతనే వారిది ఆ ప్రకారంగా ప్రత్యేకమైన మతం అయిపోదు.)

సుప్రీంకోర్టు వారు ఏమన్నారో విన్నారా ? అయ్యప్పస్వామి భక్తులు జస్ట్‌ హిందువులు! ఏవో కొన్ని ఆచారాలను చాలాకాలం నుంచీ పాటిస్తున్నంతమాత్రాన మతపరంగా ప్రత్యేకమైన డినామినేషను అనిపించుకునే యోగ్యత వారికి ఉండదట.

సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన ఈ ఒక్కమాటతో హిందూ సమాజానికి ఇప్పటిదాకా కమ్మిన భ్రమలు తొలగాలి. తాను గొప్పగా మురిసిపోతున్న రాజ్యాంగంలో తన స్థానం ఏమిటో, విలువ ఏమిటో దానికి అర్థం కావాలి.

దేవాలయాలలాంటి మత సంస్థలను నడుపుకోవటానికీ, మతానికి సంబంధించిన ఆచారాలను స్వేచ్ఛగా పాటించడానికీ, మత వ్యవహారాలను కోరుకున్న రీతిలో జరిపించుకోవడానికీ మతపరమైన ప్రతి డినామినేషనుకూ హక్కు ఉన్నదని 26వ అధికరణంలో రాసిపెట్టారు. తమది దేశంలోకెల్లా పెద్ద మతం కాబట్టి, అందులో ఎన్నోశాఖలు, ఎన్నో సంప్రదాయాలు, మార్గాలు, పరంపరలు ఉన్నాయి కనుక 26వ అధికరణంలో చెప్పిన ప్రాథమిక హక్కులన్నీ వాటన్నిటికీ సహజంగా వర్తిస్తాయని హిందూసమాజం ఇప్పటిదాకా భావిస్తున్నది.

ఆ అభిప్రాయం శుద్ధ తప్పు. శాఖ అనండి; సంప్రదాయం అనండి; మార్గం అనండి; పరంపర అనండి. వాటికీ హిందూమతానికీ కామన్‌గా కొన్ని సిద్ధాంతాలో, విశ్వాసాలో కర్మంచాలక ఉన్నాయా? ఇక వాటికి 26వ అధికరణం కింద వేరే డినామినేషనుగా గుర్తింపు పొందే యోగ్యత ఉండదు. వ్రతాలూ, పూజా విధానాలూ, డ్రస్‌కోడు, కట్టుబాట్లు ఎంత వేరు అయినాసరే ! వాటిని అనుసరించే వారందరూ జస్ట్‌ హిందువులే – అని సుప్రీంకోర్టు తాజా తీర్పు ఉవాచ !

‘అయ్యప్ప భక్తులది ప్రత్యేకమైన మతం అయిపోదు. 26వ అధికరణం కింద వారిది వేరే డినామినేషను కాదు. వారు జస్ట్‌ హిందువులే’ అని సుప్రీంకోర్టు అన్నదంటే అర్థమేమిటి ? వేరే మతాలకే తప్ప హిందూమతానికీ, అందులోని అనేకానేక శాఖలకూ, సంప్రదింపులకూ 26వ అధికరణం కింద మతస్వాతంత్య్రానికి రాజ్యాంగ రక్షణ లేదనే కదా? ఆ రక్షణ కావాలనుకునే వారు హిందూమతంతో తెగతెంపులు చేసుకోవలసిందేనా? హిందూ మతానికీ తమకూ కామన్‌గా ఏదీలేదని రుజువు చేసుకుంటేగానీ మత డినామినేషనుగా గుర్తింపు రాదా ?

ఔను – అయ్యప్ప భక్తులు హిందూమతంలో భాగమే! అయితే ఏమిటట? వారికంటూ పూర్వం నుంచీ వస్తున్న ఆచారాలు, కట్టుబాట్లు ఉన్నాయి కదా? వాటికి విలువ లేదా? శబరిమల సన్నిధానంలో సాక్షాత్తూ అయ్యప్పస్వామే చేసిన శాసనాన్ని పాటించనక్కర్లేదా? అక్కడి స్వామి నైష్ఠిక బ్రహ్మచారి అయినందున 50 ఏళ్లలోపు మహిళలు దర్శించకూడదన్న పూర్వాచారాన్ని గౌరవించవద్దా?

అవసరం లేదట. ఎందుకని?

ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో ‘డినామినేషను’ అన్నమాటకు దొరలు కొన్ని అర్థాలు ఇచ్చారు.

వాటిని పట్టుకుని సుప్రీంకోర్టు వారు అరవై ఏళ్ల కింద శిరూర్‌మఠం కేసులో రిలిజియస్‌ డినామినేషనుకు ఫలానా లక్షణాలు ఉండాలని కనిపెట్టారు.

కాబట్టి 26వ అధికరణం కింద మాదీ డినామినేషనే అని ఎవరైనా అనదలచుకుంటే సుప్రీంకోర్టు తెచ్చిపెట్టిన ఆ ఫలానా లక్షణాలు తమకూ ఉన్నాయని రుజువు చేసుకోగలగాలి.

ఆ లక్షణాలు అయ్యప్ప సమాజానికి లేవు. కాబట్టి వారిది డినామినేషను కాదు. డినామినేషను కానప్పుడు ఆచారాలు, పూర్వం నుంచి వస్తున్న కట్టుబాట్లు అంటే కుదరదు. డినామినేషను కిందికి రానప్పుడు శబరిమల ఆలయం మామూలు పబ్లిక్‌ టెంపుల్‌ మాత్రమే అవుతుంది.

పబ్లిక్‌ టెంపుల్‌లోకి వెళ్లే హక్కు అందరికీ ఉంది. ‘అందరికీ’ అని 25వ అధికరణం చెప్పిందీ అంటే – ఆడామగా అన్న తేడా లేదని అర్థం. హిందువు అయితే చాలు – ఏ స్త్రీ అయినా పురుషుడు అయినా గుడిలోకి వెళ్లవచ్చు. మహిళలను రానివ్వము అంటే 25వ అధికరణం పౌరులందరికీ ఇచ్చిన ప్రాథమిక హక్కుకు భంగకరం. 15వ అధికరణం కింద అది మహిళల పట్ల వివక్ష.

ఇదిగో ఇదీ రాజ్యాంగ ధర్మాసనంలోని 5గురిలో నలుగురు జడ్జిల లాజిక్‌!

ఏడ్చినట్టుంది. అసలు ‘డినామినేషను’ అన్నమాటే క్రైస్తవ మతపరంగా పుట్టుకొచ్చినట్టిది. కాథలిక్‌, ప్రొటెస్టంటు, ఈస్టర్న్‌ ఆర్థోడాక్స్‌ చర్చి, ఓరియంటల్‌ ఆర్ధొడాక్స్‌ అంటూ క్రైస్తవంలో ఉన్నటువంటి డినామినేషన్లు హైందవంలో లేవు. ఇతర మతాలు కళ్లు తెరవటానికి వేల సంవత్సరాల పూర్వం నుంచీ ఉన్న సనాతన ధర్మంలోని శాఖలను, ఉపశాఖలను, సంప్రదాయాలను ఈ దేశ పరిస్థితులను బట్టి కదా వింగడించవలసింది? పాశ్చాత్యపు తూనికలతో మన ప్రాచీన మత వ్యవస్థలను తూచటమేమిటి? వేర్వేరు సంప్రదాయాలు, మార్గాలు ఎన్ని ఉన్నా అవేవీ లెక్కలోకి రావా? అన్నీ హిందూమతం పులుసులోనే పడతాయా? డినామినేషను కాని పాపానికి హిందూమతానికి, అందులోని శాఖోపశాఖలకు మతహక్కుల ఉండవా? మతాచారాలను, కట్టుబాట్లను నిష్ఠగా పాటించే ప్రాప్తం వాటికి లేదు – అనేకదా సుప్రీంకోర్టు మెజారిటీ తీర్పు అంతరార్థం! అది ఎంత అన్యాయం?!

‘Having stated that the devotees of Lord Ayyappa do not constitute a religious denomination… (they) are the followers of Hindu religion. Now what remains to be scan is whether the exclusion of women of the age group of 10 to 50 years is an essential practice under the Hindu religion… the exclusionary practice being followed at the Sabarimala Temple can not be designated as one, the non-observance of which will change or alter the nature of Hindu religion… It is neither an essential nor an intagral part of the Hindu religion without which the Hindu religion will not survive’.
‘అయ్యప్పస్వామి భక్తులది మతపరమైన డినామినేషను కాదు; వారు హిందూ మతానికి చెందినవారు – అది చెప్పాక ఇక చూడాల్సిందల్లా ఒకటే! 10 నుంచి 50 లోపు వయోవర్గం మహిళలను బయట ఉంచటం హిందూ మతం ప్రకారం అత్యవసరమైన ఆచారమా – అని! శబరిమలలో అనుసరిస్తున్నటువంటి పద్ధతిని పాటించటం మానేస్తే హిందూమతం స్వభావమే మారిపోతుందని ఎవరూ చెప్పలేరు. అది హిందూమతంలో అత్యవసరమైన, సమగ్రభాగం కాదు. అది లేనంతమాత్రాన హిందూమతం బతకకుండానూ పోదు’.

ఇది పెద్ద బెంచివారి మెజారిటీ నిర్ణయం.

చూశారా – ఎక్కడి నుంచి ఎక్కడికి లాగారో?!

అయ్యప్ప భక్త సమాజాన్ని, దానికి ప్రాణమైన శబరిమల సన్నిధానాన్ని, అక్కడ తప్పనిసరి అయిన ఆచారాన్ని ధర్మాసనంలోని ఏకైక మహిళాజడ్జి ఇందూ మల్హోత్రా వలె సానుభూతితో, మతధర్మాల పట్ల కాస్త గౌరవంతో పరిశీలించి ఉంటే ఆమెలాగే మిగతా జడ్జిలు కూడా ‘it is an essential religious practice at the Sabarimala Temple’ (శబరిమల గుళ్లో అది అత్యవసరమైన మతాచారం) అని అంగీకరించవలసి వచ్చేది. కాని సుసాన్‌ ఆంధోనీ లెవెల్లో మహిళా హక్కులను, స్త్రీ వాదాన్ని నిలబెట్టి తీరాలని ముందే కంకణం కట్టుకున్న న్యాయమూర్తులకు సహజంగానే అది ఇష్టం లేకపోయింది. అందుకని వారు అయ్యప్ప సమాజం లాగా చూడకుండా దాన్ని తీసుకుపోయి హిందూమతానికి ముడిపెట్టారు.

గుళ్లోకి ఒక వయసు ఆడవాళ్లని రానివ్వకపోవటం హిందూమత ఆచారమేమీ కాదు కదా ? అలాంటి ఆచారం లేకపోయినా హిందూమతం బతుకుతుంది కదా? కాబట్టి శబరిమలలో ఆ ఒక్క గుళ్లోకి ప్రత్యేక కారణాల వల్ల ఒక వయోవర్గపు మహిళలను రానివ్వకపోవటం కూడా తప్పనిసరి మతాచారం – అని మెజారిటీ జడ్జిల భలే వాదన!

– (ఇంకా ఉంది)

– ఎం.వి.ఆర్‌.శాస్త్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *