వీళ్లని రక్షించండి !

వీళ్లని రక్షించండి !

చెట్టు తొర్రలలో కనిపించే వంకర టింకర వేళ్లను మరిపిస్తూ ఉంటాయి వాళ్ల శరీరాంగాలు. తారు రోడ్డు మీద నడుస్తున్న మనిషి పొరపాటున చిన్న గతుకులో కాలు వేసి జారినా, అంత బలమైన కాలి ఎముక కూడా సుద్దముక్క విరిగినంత సులభంగా పుటుక్కుమంటుంది. మరమ్మతు కోసం ఆటోను ఎత్తే పనిలో పట్టు జారి పడినా వెన్నెముక విరిగిపోతుంది. అన్నీ సమకూడి ఈ పనులకు దూరంగా, జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా గడిపినా కొన్నేళ్లకి కాలమే వాళ్లని మంచం ఎక్కిస్తుంది. వాళ్ల శరీరంలో తిష్ట వేసిన ఆ జబ్బు వాళ్లని ఆ స్థితికి తెస్తుంది. చేతులనీ, కాళ్లనీ ఎండిన చెట్టు కొమ్మల్లా భయానకంగా తయారు చేస్తుంది. ఇదీ నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ పీడిత ప్రాంతాలలో చాలాచోట్ల కనిపించే వాస్తవదృశ్యం. నిజం చెప్పాలంటే అక్కడి నేల మీద నడిచినా కూడా ఆ వ్యాధి సోకుతుందేమోనన్నంత భయం కలుగుతుందంటే అతిశయోక్తి కాదు. (అందుకే కాబోలు నాయకులు ఎన్నికలప్పుడు తప్ప అటు వైపు కూడా చూడరు).

భారతదేశ ప్రజానీకం ఈ వ్యాధితో ఎనిమి దిన్నర దశాబ్దాలుగా పోరాడుతోంది. ఫ్లోరోసిస్‌ వ్యాధి పీడితులకి జరుగుతున్న అన్యాయం అంచనాకు అందనిది. ఆరోగ్యం ప్రాథమిక హక్కు అనుకుంటే, అందుకు నోచుకోని వారిలో ప్రప్రథములు ఫ్లోరోసిస్‌ పీడిత ప్రాంత పౌరులే. ఈ పీడ నల్లగొండ జిల్లాకో, తెలంగాణ ప్రాంతానికో పరిమితమనుకుంటే పెద్ద పొరపాటు. ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తున్నది. నేలని కలుషితం చేస్తున్నాం. దీనితో నీరు కలుషిత మవుతోంది. నీటితో పండే పంట కలుషితమవు తోంది. ఆ పంట నోటి దగ్గర ముద్దగా మారినా కాలుష్యాన్ని వీడడం లేదు. అది తిన్న మనిషి రోగ గ్రస్థుడవుతున్నాడు. పశుపక్ష్యాదులు కూడా దీని బారిన పడుతున్నాయి. పాత నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌తో తీవ్ర స్థాయిలో పోరాడుతున్న గ్రామా లలో తిరిగితే హృదయం ద్రవిస్తుంది. మనసు వికల మవుతుంది. వృద్ధులు, నడి వయసువారు, ఆఖరికి పిల్లలు ఈ వ్యాధి కోరలలో చిక్కుకుని ఉన్న కఠోర వాస్తవం అవగతమవుతుంది.

ఇది ప్రపంచ సమస్య

ఫ్లోరోసిస్‌ ప్రభావాన్ని పలు ప్రపంచ దేశాలు, అలాగే ఆసియా దేశాలు కూడా ఎదుర్కొంటున్నాయి. భారత్‌ కూడా అందులో ఉంది. ఇప్పుడు భారత్‌ ఎదుర్కొంటున్న అతి పెద్ద బెడదలలో ఒకటి- ఫ్లోరోసిస్‌ వ్యాధి.

భారత్‌తో పాటు చైనా, ఆస్ట్రేలియా, కెన్యా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు కూడా ఆ సమస్య బారిన పడినట్టు కనిపిస్తాయి. మన పక్కనే ఉన్న చైనాలో 30 కోట్ల మందిలో ఈ వ్యాధి జాడలు ఉన్నాయి. కొద్దికాలం క్రితం వెలువడిన గణాంకాల ప్రకారం అక్కడ నాలుగు కోట్ల మందికి వ్యాధి ప్రాథమిక దశలో ఉంది. అంటే పళ్లు గారపట్టినట్టు కనిపి స్తాయి. 30 లక్షల మందికి ఆ దశను దాటిపోయి ఎముకలను తాకింది. పాకిస్తాన్‌, జపాన్‌, థాయ్‌ లాండ్‌, న్యూజిలాండ్‌, అర్జెంటీనా, ఇరాన్‌, ఇరాక్‌, లిబియా, అల్జీరియా, ఈజిప్ట్‌, టర్కీ, టాంజానియా, మొరాకో, సిరియా, జోర్డాన్‌ వంటి దేశాలలో కూడా ఈ వ్యాధి తన ఉనికిని చాటుతోంది. కానీ అక్కడ నీటిలో ఫ్లోరైడ్‌ వాంఛనీయమైన స్థాయిలోనే ఉంది.

21 రాష్ట్రాలకు ఫ్లోరోసిస్‌ కాటు

ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాలలో మినహా మిగిలిన భారత దేశమంతటా ఫ్లోరోసిస్‌ వ్యాపించింది. దేశంలోని 275 జిల్లాలలో దీని ప్రభావం కనిపిస్తోంది. ఇవి 21 రాష్ట్రాలలో విస్తరించుకుని ఉన్న జిల్లాలు. దేశ జనాభాలో ఆరున్నర కోట్ల మంది ఆ వ్యాధి కోరలకు సమీపంగా ఉన్నారు. అరవై లక్షల మంది ఆ వ్యాధి కోరలకు చిక్కుకుపోయి అలమటిస్తున్నారు. కాళ్లూ చేతులూ వంకరపోయి దుర్భర జీవితం గడుపుతున్నవారు వీరే. లేదా ఆ దుస్థితికి సమీపంగా ఉన్నారు. ఇవన్నీ అధికారిక గణాంకాలు. తమిళనాడు, రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లలో కూడా ఈ వ్యాధి ఉంది. మన తరువాత కొంచెం ఎక్కువగా సమస్యను ఎదుర్కొంటున్న రాష్ట్రాలు పంజాబ్‌, హర్యానా. పది పన్నెండు సంవత్సరాల క్రితం ఫ్లోరోసిస్‌ బాధితులు నల్లగొండ, ప్రకాశం జిల్లాలోనే ఉండేవారు. కొంత వరకు రంగారెడ్డి జిల్లాలలో కూడా ఈ వ్యాధి ఉంది. ఇప్పుడు ఆదిలాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, కర్నూలు, కడప, చిత్తూరు, కృష్ణ, గుంటూరు జిల్లాలలో కూడా కనిపిస్తున్నది. అత్యంత నివాసయోగ్యమైనదని చెబుతున్న హైదరాబాద్‌ నగరంలో కూడా దీని ప్రభావం ఉంది.

ఎనిమిదిన్నర దశాబ్దాల యుద్ధం

ఫ్లోరోసిస్‌ తెలుగు ప్రాంతాన్ని దాదాపు ఎనిమి దిన్నర దశాబ్దాల నుంచి వేధిస్తున్నది. ప్రపంచంలోను, మన ఇరుగు పొరుగు రాష్ట్రాలలోను ఈ సమస్య ఉంది. కాని పాత నల్లగొండ జిల్లా వాసులు అనుభ విస్తున్నంత నరకం అక్కడి వారు అనుభవించడం లేదు. కుష్ఠు, క్షయ, మశూచి, ఆఖరికి కేన్సర్‌ వంటి వ్యాధులు సోకడం తగ్గుతూ ఉంటే, ఫ్లోరోసిస్‌ విస్తరిస్తున్నది. తన వికృతత్వాన్ని రోజూరోజుకూ పెంచుకుంటూ ప్రజలను అతలాకుతలం చేస్తున్నది. వైద్యశాస్త్రానికి సవాలు విసురుతోంది. బాధితులకు గాని, ప్రభుత్వాలకు గాని ఈ వ్యాధి మీద, దాని నిర్మూలన మీద పరిపూర్ణమైన అవగాహన లేకపోవడంతో ఈ విపత్కర పరిణమాలు మరింత తీవ్రమైనాయి. పరిశోధనలలో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. అయినా ఫ్లోరోసిస్‌ నీటితో సంక్రమించే వ్యాధేనన్న అభిప్రాయంతో ఉండి పోవడం ప్రజలూ, ప్రభుత్వాలూ కూడా చేస్తున్న ఘోర తప్పిదం.

మనకే ఎందుకీ శిక్ష?

తాగే నీరు, తినే ఆహారం ఏ జీవికైనా అవసరం. ఇది మానవాళికి, పశుపక్ష్యాదులకు కూడా సమంగా వర్తించే సూత్రం. కాని, భారతదేశంలో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలకు ఆ నీరు, ఆహారాలే ప్రజలకు శాపాలుగా మారాయి. తాగే నీటిని, తినే తిండిని విషతుల్యం చేసిన ఆ శక్తి ఫ్లోరోసిస్‌. భూమి మీద ఉన్న మొత్తం జన బాహుళ్యం నీరు తాగుతుంది. అందులో అంతో ఇంతో ఫ్లోరైడ్‌ ఉంటుంది. అది అత్యధికులకు చేసేది మేలే. కాని, భారతదేశంలో మాత్రం అది హాని చేస్తున్నది.

ఫ్లోరైడ్‌ ఉన్న తెలుగు ప్రాంతాలలోని నీటికి 1 నుంచి 3 పిపిఎం (పార్ట్స్‌ పెర్‌ మిలియన్‌ లేదా లీటరు నీటిలో ఒక మిల్లీలీటర్‌) మాత్రమే ఆ లక్షణం ఉంది. కొన్ని చోట్ల చాలా పరిమితంగా 6 పిపిఎం కనిపిస్తుంది. ఇది అంత ఎక్కువేమీ కాదు. పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ లలో కూడా ఇదే స్థాయిలో ఫ్లోరైడ్‌ కనిపిస్తుంది. ‘ఫ్లోరైడ్‌, మానవ ఆరోగ్యం’ అన్న అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ 1970లో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం 5 పిపిఎం ఫ్లోరైడ్‌ ఉన్న నీటిని వినియోగించుకుంటు న్నప్పటికీ స్కెలిటల్‌ ఫ్లోరోసిస్‌ సంక్రమించే అవకాశం లేదు. ఆఖరికి 8 పిపిఎం ఫ్లోరైడ్‌ ఉన్న నీటిని తాగినా స్కెలిటల్‌ ఫ్లోరోసిస్‌ రావడానికి కేవలం పది శాతం అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధి సోకడానికి అవకాశం ఉన్న ప్రపంచ దేశాలలో గాని, మన ఇరుగు పొరుగు రాష్ట్రాలలో గాని దీని తీవ్రత అంతగా కనిపించదు. ఆస్ట్రేలియాలో 13.5 పిపిఎం ఫ్లోరైడ్‌ ఉన్నా ఫ్లోరోసిస్‌ జాడలు లేకపోవడానికి, 6 పిపిఎం కూడా మించని తెలంగాణలో ఈ వ్యాధిగ్రస్థులు కురూపులుగా మారి పోవడానికి హేతువు ఏమిటి? మనకే ఎందుకీ శిక్ష?

1945-1975 మధ్య వచ్చిన మార్పుల వల్లనే

నిజాంకు వైద్య, ఆరోగ్య, సలహాదారుగా ఉన్న దేవర్‌ 1945లో నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ బాధితులను గుర్తించారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలను ఆయన చూడలేదు. అప్పుడు కాళ్లు, చేతులు వంకర్లు పోయిన వారు లేరు. కాని 1971 ప్రాంతంలో ఈ పరిణామం దాపురించింది. మరో నాలుగేళ్లకి తీవ్రమైంది. 1945లో ఉన్న పరిస్థితులు ఏమిటి? 1975లో జరిగిన మార్పు ఏమిటి? దీనిని పరిశీలిస్తే పౌష్ఠికాహారం ప్రాధాన్యం కూడా తెలుస్తుంది. ఆ 30 సంవత్సరాలలో సామాజికంగా తీవ్రమైన మార్పులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలు సంప్రదాయిక బంధాలను వదులుకుని వాణిజ్య ప్రభావానికి లోనయినది కూడా ఆ కాలమే. 1975, ఆ తరువాత గ్రామాలలో పాడి బాగా ఉండేది. దానిని తొలత ఇంటి అవసరాలకు ఉపయోగించుకొని, మిగిలినది ఉచితంగా పంచేవారు. తరువాత పాడి పట్టణాలకు, నగరాలకు తరలించడం ప్రారంభమైంది. పాలు, వెన్న, నెయ్యి గ్రామీణులు సొంతానికి వాడుకోవడం తగ్గిపోయింది. అలాగే కూరగాయలు, ఆకుకూరలు కూడా.

మరో కీలక పరిణామం ఎరువుల వాడకం పెరగడం. ఎరువులతో మూడు శాతం భూమిలోను, పండే పంటలో కొంత వరకు ఫ్లోరైడ్‌ చేరుతుంది. ఉన్న ఫ్లోరైడ్‌కు ఇది అదనం. గ్రామాలలో 40 దశకం తరువాత కొత్త పరిణామం తేనీటి సేవనం. ఇది కూడా (ముఖ్యంగా వ్యాధి పీడిత ప్రాంతాలలో) ప్రజానీకాన్ని ఫ్లోరోసిస్‌ బారిన పడవేసేదే. మనం తాగే ప్రతి టీ కప్‌లోను 5 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్‌ ఉంటుంది. నిజాం సలహాదారు దేవర్‌ నల్లగొండ ఫ్లోరోసిస్‌ వ్యాధిగ్రస్థులను గురించి బహిర్గతం చేయడమే కాకుండా, దానికి దారితీసిన కారణాలలో పౌష్ఠికాహార లోపం కూడా ఒకటని తెలియజేశారు. 1955లో ఉస్మానియా ఆస్పత్రిలో ఫిజీషియన్‌గా ఉన్న అబుల్‌ హసన్‌ సిద్దిఖీ దీనిని ధృవీకరించారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నూట్రిషన్‌ సంస్థకు చెందిన శ్రీకాంతయ్యతో కలసి విశేష పరిశోధనలు చేసిన సిద్దిఖీ నల్లగొండ ఫ్లోరోసిస్‌ బాధితులు తీసుకుంటున్న కాల్షియం శాతం ఎంతో పరిమితమని వెల్లడించారు. ఇక్కడి ప్రజలు రోజుకు 300 మిల్లీ గ్రాముల కాల్షియం తీసుకుంటున్నారు. అయితే పంజాబ్‌ వాసులు 900 మిల్లీ గ్రాముల కాల్షియం తీసుకుంటు న్నారు. కాల్షియం ఎంతో తక్కువ తీసుకున్నట్టు చెప్పినా నల్లగొండలో జెనువాల్గమ్‌ కేసులను అప్పుడు సిద్దిఖీ ఉదహరించకపోవడం విశేషం. అయితే ఇప్పుడు నల్లగొండ ప్రాంతంలో జెనువాల్గమ్‌ అంత ఎక్కువ ఎందుకు ఉందో ఆ ఒక్క వాస్తవం వెల్లడి స్తుంది. ఇప్పుడు కాల్షియం పరిమాణం ఇంకొంచెం తగ్గిందనే చెప్పాలి. పెరిగిన ఎరువుల వాడకం, పెరిగిన బోర్లు ఫ్లోరైడ్‌ శాతాన్ని పెంచేవే. ఇప్పుడు ఎంతో లోతుకు వెళితేగాని నీరు లభించడం లేదు. మరీ లోతు నుంచి వచ్చే నీటిలో ఫ్లోరైడ్‌ ఎక్కువగా ఉంటుందన్నది మరో వాస్తవం.

ప్రత్యక్ష నరకం

వయోభేదం లేకుండా వెన్నెముక, చేతులు, కాళ్లు పరమ వికృతంగా మారిపోయిన వీరి అష్టావక్ర రూపాన్ని మిగిలిన సమాజం చూడడం ఒక ఎత్తయితే, ఆ వ్యాధితో వీరు భరించే శారీరక బాధ మరో ఎత్తు. శరీరాన్ని మోసే కాలి ఎముకలు శక్తిని కోల్పోతాయి. దానితో రెండు నిమిషాలలో చేరవలసిన చోటికి పావుగంట సమయం పడుతుంది. వ్యాధికి పరాకాష్ఠ అన్న దశకు చేరాక ఇక వెన్నెముక నిటారుగా నిలబడే వీలే లేదు. రోజురోజుకీ వీరు వంగిపోతూ ఉంటారు. నడవలేరు. కూర్చోలేరు. అలా అని పడుకోనూలేరు. ఎండుకొమ్మల్లాగ, చెట్టు బెరలాగ శరీరాలు రూపు దాల్చడం ఈ వ్యాధిలోనే కనిపిస్తుంది. పదేళ్ల పిల్లలు ఎనభయ్‌ సంవత్సరాల వృద్ధుల్లా కర్రలు పట్టుకు నడుస్తారు. లేదంటే దీర్ఘరోగుల్లా భారంగా నడుస్తూ ఉంటారు. ఇక వెన్నుముకకు సోకితే వారి బాధ వర్ణనా తీతం. పెళుసెక్కి వెన్నెముకలో కదలిక ఉండదు. కాస్త కిందకుగాని పైకిగాని వంగలేరు. వీరికి శస్త్రచి కిత్స చేసే డాక్టర్‌ కూడా విపరీతంగా శ్రమించాలి.

ఫ్లోరోసిస్‌ వ్యాధిగ్రస్థులంటే లోకానికి తెలిసిన ఎముకలు వంకర్లు పోయిన వారు మాత్రమే కాదు. వారు ఇంకా మధుమేహం, నరాల బలహీనత, హృద్రోగ సమస్యలు, కండరాల క్షీణత, కీళ్లనొప్పులు, రక్తప్రసరణలో లోపాలు, జీర్ణకోశ వ్యాధులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఒక దశ తరువాత మూత్ర పిండాలను కూడా అది పాడుచేస్తుంది. కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, వికారం, ఆకలి మందగించడం, నీళ్ల విరేచనాలు, విరేచనంలో రక్తం వంటి సమస్యలు కూడా వారు ఎదర్కొంటూ ఉంటారు ఇక నీరసం ఆ వ్యాధి సహజ లక్షణం. వీరు పడుకున్న గది చూరు నుంచి మంచం వరకు ఒక తాడును వేలాడ దీసి దాని సాయంతో వారు లేస్తూ ఉంటారు.

ఫ్లోరోసిస్‌ను కొనుగొని మూడు వందల సంవత్సరాలు గడిచిపోతున్నా, ఆ వ్యాధి నానాటికీ విశ్వరూపం దాలుస్తూ ఉన్నా ఈనాటికీ దాని నివారణకు సరైన మందులు లేవు. కనుగొనలేదనే చెప్పాలి. శస్త్రచికిత్స కూడా ఆవిర్భవించలేదు. ఫ్లోరోసిస్‌ లక్షణాలు కనిపించిన తరువాత అలా వదిలేస్తే అది కొన్ని పరిస్థితులలో ఎముకలకు విస్తరిస్తుంది. అప్పుడు ఏం చేసినా ప్రయోజనం లేదు. వ్యాధితో అంతరించి పోవలసిందే. అయితే దాదాపు ఎనభై సంవత్సరాల నుంచి ఈ వ్యాధి గురించిన పరిశోధనలో కొంత కృషి జరిగిందని అంగీకరించ వచ్చు. ఈ వ్యాధి గురించి ప్రత్యేకంగా చర్చించిన ‘ఇంటర్నేషనల్‌ ఫ్లోరైడ్‌ జర్నల్‌’ (అమెరికా నుంచి వెలువడుతున్నది) నల్లగొండ, ప్రకాశం జిల్లాలలో సమస్యలతో సహా పలుసార్లు భారతదేశంలో ఫ్లోరోసిస్‌ పరిస్థితిని గురించి వ్యాసాలు ప్రచురించి దానిని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లింది కూడా. ‘నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌’ కూడా ఈ వ్యాధి గురించి విస్తారంగానే సమాచారం ఇచ్చింది. అయినా ప్రపంచంలో తగినంత కదలిక లేదు. బహుశా దీని తీవ్రత భారతదేశం వంటి వెనుకబడిన దేశానికి పరిమితం కావడం కూడా ఇందుకు ఒక కారణమేమో!

సరైన దిశలోనే వెళుతున్నామా?

వెళ్లడం లేదు. ఫ్లోరోసిస్‌ నీటి నుంచి సంక్రమిస్తుందని 1937లో వచ్చిన నివేదికనే ప్రభు త్వాలు ఇప్పటికీ నమ్ముతున్నాయేమోననిపిస్తుంది. కాని ఫ్లోరోసిస్‌ మన మీద అంత దారుణంగా పంజా విసరాడానికి కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి.

మనదేశంలో వేసవి సంగతి చెప్పనక్కర్లేదు. ఉష్ణోగ్రత 115 నుండి 116 ఫారెన్‌హైట్‌ డిగ్రీకు కూడా వెళుతుంది.వాతారణాన్ని బట్టి కాయకష్టం చేసేవారు నీరు విపరీతంగా తీసుకుంటారు. నల్ల గొండ ప్రాంతంలో గ్రామ కరణానికి వ్యాధి కనిపించ లేదు. కాయకష్టం చేసేవారిలోనే కనిపించింది. కాయకష్టం చేసేవారు నీరు ఎక్కువ త్రాగుతారు. ఫ్లోరైడ్‌ కూడా శరీరంలో ఎక్కువ మొత్తంలో చేరుతుంది. ఈ మూడు కారణాలు కూడా ఫ్లోరోసిస్‌ వ్యాధికి మూలాలుగా పరిగణించవలసి ఉంది.

పౌష్టికాహార లోపమూ కారణమే!

ఒక దశాబ్దం క్రితం మా పరిశీలనలో తేలిన విషయం ఏమంటే పౌష్ఠికాహార లోపం కూడా ఫ్లోరోసిస్‌ వ్యాధికి ఒక కారణం. పంజాబ్‌ జలాలలో ఫ్లోరైడ్‌ ఉన్నప్పటికీ మనుషుల అవయవాలు వంకర్లు పోకుండా సహజంగా ఉండడానికి కారణం వారు తీసుకునే ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు బాగా ఉన్నాయి. ముఖ్యంగా కాల్షియం తగినంతగా ఉంటుంది. భారతదేశంలో అంటువ్యాధుల గురించి జరిపిన అధ్యయనంలో ఇదే వెల్లడైంది. కొన్ని ప్రాంతాలలో తరచూ ప్రజలు అంటువ్యాధులకు లోను కావడానికి ఎక్కువ కారణం పౌష్ఠికాహార లోపమేనని కూడా అధ్యయనం స్పష్టం చేసింది. ఫ్లోరోసిస్‌ వ్యాధి సోకకుండా ఉండాలంటే ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్‌ సి అందించాలని జపాన్‌ కూడా ఒక నివేదికలో సూచించింది. చైనాలో 4 పిపిఎం ఫ్లోరైడ్‌ ఉన్న ప్రాంతాలలో ఫ్లోరోసిస్‌ వ్యాపించకుండా ఆ ప్రభుత్వం సూచించిన చర్యలలో పౌష్ఠికాహారానికే అగ్రస్థానం ఇచ్చారు. పౌష్ఠికాహార లోపంతో పాటు, తీసుకునే ఆహారంలో కాల్షియం, ప్రోటీన్లు లేక పోవడం వల్ల స్కెలిటల్‌ ఫ్లోరోసిస్‌ బారిన పడినవారు 62 శాతం కనిపిస్తే, మంచి ఆహారం తీసుకుంటున్న వారిలో 43.8 శాతమే ఈ వ్యాధికి గురైనవారు ఉన్నారు. ఫ్లోరోసిస్‌ తాకిడిని నిరోధించడంలో పౌష్ఠికా హారం కీలకపాత్ర వహిస్తుందని 2002లో విడుదలైన ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక కూడా ధృవీక రించింది. ఇది పసివాళ్లు, బాలల విషయంలో మరింత వాస్తవం.

ముందుజాగ్రత్తే మేలు

ఫ్లోరోసిస్‌ వ్యాధిని నివారించడమనే ఆలోచన కంటే, అసలు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. ఫ్లోరోసిస్‌ బాగా ముదిరితే నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. అప్పుడు శస్త్రచికిత్స కోసం వస్తారు. ఆపరేషన్‌ సులభం కాదు. ఆ ఎముకలు అంత మోటుబారిపోతాయి. కష్టపడి ఆపరేషన్‌ చేసినా ఫలితం యాభయ్‌ శాతం కూడా ఉండదు. ఆపరేషన్‌ తరువాత మళ్లీ అతడు స్వస్థలానికే పోతాడు. మళ్లీ అదే సమస్య. కాబట్టి వ్యాధి సోకకుండానే జాగ్రత్తలు తీసుకోవడం ఫ్లోరోసిస్‌ విషయంలో నూటికి నూరుపాళ్లు మంచిది.


దాహెద్‌లో మోదీ కృషి

గుజరాత్‌లో దాహెద్‌ జిల్లా కూడా ఫ్లోరోసిస్‌ బారిన పడింది. నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ వ్యాధి నుంచి బాధితులను రక్షించడానికి ఇక్కడ జరిగిన కృషి చెప్పుకోదగినది. 1997లో ఏర్పాటయిన ఈ జిల్లా జనాభా 21,26,558 (2011 జనాభా ప్రకారం). నిజానికి ఇంకొన్ని ప్రాంతాలు కూడా గుజరాత్‌లో ఫ్లోరోసిస్‌ బారిన పడినాయి. మోదీ ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే ఈ సమస్య మీద దృష్టి సారించారు. ఆయన సమస్యను అర్థం చేసుకున్న తీరును మొదట గమనించాలి. ఆయన సీఎం అయిన తరువాత బాధితులతోను, నీటి సరఫరా అధికారులు, ఇంజనీరింగ్‌ విభాగంతోను సమావేశం జరిపారు. బాధితులు నర్మద నీటితో సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. అధికారులు, ఇంజనీర్లు నీరు పైకి ఎక్కదని అన్నారు. అంతా విన్న తరువాత మోదీ వచ్చే సంవత్సరం ఇదే తేదీకి ఆ ప్రాంతానికి నర్మద జలాలు వెళ్లాలి అని ఆదేశించారు. అది అమలయింది. అలాగే మధ్యప్రదేశ్‌లోని జబవా జిల్లాలో కూడా ఈ వ్యాధి నివారణకు అక్కడి ప్రభుత్వం చేసిన ప్రయత్నం చెప్పుకోదగినది.

గుజరాత్‌లోని దాహెద్‌ మారుమూల గిరిజన ఆవాస ప్రాంతం. కనీసం రోడ్డు కూడా లేదు. అలాంటి చోటికి మొదట 24 గంటలు విద్యుత్‌ సరఫరా అయ్యేటట్టు మోదీ చేశారు. అందుకు సంప్రదాయ విధానంతో పాటు, సోలార్‌ ప్యానల్స్‌ విధానాన్ని కూడా ఎంతో నేర్పుగా వాడుకున్నారు. అక్కడ ఉన్న చిన్న చిన్న నదుల మీద విరివిగా చెక్‌ డ్యామ్‌లు కట్టించారు. దీనితో సేద్యం పెరిగింది. అక్కడి నీటిమట్టం పెరిగింది. అలాగే పౌష్టికాహారాన్ని అందించేందుకు (ఫార్టిఫైడ్‌) ఐరన్‌, కాల్షియం కలసి ఉన్న టాబ్లెట్లను సరఫరా చేయించారు మోదీ. నీళ్లలో కలుపుకుని తాగడానికి అనువైన ఒక రెడీమేడ్‌ ఆహారాన్ని తయారు చేసి సరఫరా చేయించారు కూడా. ఇటీవల అముల్‌ విస్తరణలో కూడా ఇదే ధ్యేయం ఉంది.


ఫ్లోరిన్‌.. ఫ్లోరైడ్‌.. ఫ్లోరోసిస్‌…

ఇంతవరకు నమోదు చేసుకున్న 118 రసాయన మూలకాలలో ఫ్లోరిన్‌ ఒకటి. దీనికి స్పందన గుణం ఎక్కువ. అందుకే ప్రకృతిలో ఫ్లోరైడ్‌ రూపంలో ఏర్పడుతూ ఉంటుంది. భూమి మీద సర్వసాధారణంగా కనిపించే 13 మూలకాలలో ఫ్లోరైడ్‌ ఒకటి. ఇది సర్వవ్యాప్తి. అంటే మానవాళి తీసుకునే ఆహారంలో, సేవించే ద్రవ పదార్థాలలో దీని ఉనికి తప్పించలేనిది. కాబట్టి మానవుల ఆరోగ్యం మీద ఫ్లోరైడ్‌ ప్రభావం గణనీయంగా ఉంటుంది. ఇది శరీరంలో ప్రవేశించే మోతాదును బట్టి ఇటు మేలు, అటు కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో ప్రవేశించిన ఫ్లోరైడ్‌లో 96 నుంచి 99 శాతం లోపలే ఉండిపోతుంది. కాల్షియం వలెనే దీనికి ఎముకలను ఆశ్రయించే గుణం ఉన్నది కాబట్టి అస్థిపంజర నిర్మాణంలోను, నోటిలో పళ్లకు పరిమితమవుతుంది. అవసరమైన మేర ఫ్లోరైడ్‌ శరీరంలోకి వెళితే అది పళ్లకు పరిమితం. ఎక్కువ తీసుకుంటే ఎముకలు గుల్లబారిపోయే రోగం సోకుతుంది. ఫ్లోరిన్‌ ఒక మూలకం (ఎలిమెంట్‌). ప్రకృతిలో ఎక్కువగా ఉండే మూలకాల వరసలో 17వ స్థానం దీనిదే. ప్రపంచ వ్యాప్తంగా ఫ్లోరిన్‌ 90 మిలియన్‌ టన్నులు ఉంటే అందులో ఆరో వంతు మనదేశంలోనే ఉంది. నీటిలోను, ఆహారంలోను, భూమిలోను, మొక్కల్లోను, రాతిపొరల్లోను, ఆఖరికి గాలిలో కూడా ఫ్లోరిన్‌ ఉంటుంది. షీలే అనే శాస్త్రవేత్త 1771లో మొదటిసారి దీనిని గురించి ప్రపంచానికి వెల్లడించగా, 1886లో హెన్రీ మాయిజన్‌ దీనిని విడదీసి వెలికితీశాడు.

ఫ్లోరోసిస్‌ వాయురూపంలో ఉంటుంది. అసలు రూపంలో అది కనపడదు. ఇతర మూలకాలతో కలసి ఫ్లోరైడ్స్‌గా లభిస్తూ ఉంటుంది. ఫ్లోరైడ్‌ తగు మోతాదులో ఉంటే ఆరోగ్యమే. మోతాదు మించితే పళ్లు, ఎముకల మీద ప్రభావం కనిపిస్తుంది. దానికే ఫ్లోరోసిస్‌ వ్యాధి అని పేరు పెట్టారు. అయితే 1925 వరకు దీని గొడవ ఎవరికీ పట్టలేదు. ఇది దంతాలకు మేలు చేయగలదని అమెరికా శాస్త్రవేత్తలు బయటపెట్టడంతో నీటిని ఫ్లోరిడేషన్‌ చేయడం ప్రారంభమైంది. నీటిలో ఫ్లోరిన్‌ ఒక పిపిఎం (పార్ట్స్‌ పెర్‌ మిలియన్‌ లేదా లీటరు నీటిలో ఒక మిల్లీలీటర్‌) ఉంటే మనుషులకు మేలు చేయగలదు. కాని 1925 తరువాత క్రిస్టియాని, గాటియర్‌ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు నీటిలో ఫ్లోరిన్‌ ఎక్కువైతే ప్రమాదమన్న సంగతిని బయటపెట్టారు. ఇది జరిగిన పన్నెండు సంవత్సరాలకు అంటే 1937లో నీటితో ఈ వ్యాధి పోకుతుందని మొదటిసారి కనుగొన్నారు. వ్యాధి బాగా ముదిరితే నరాల మీద అది చూపించే ప్రభావం గురించి 1937 నాటి నివేదికలోనే హెచ్చరించారు. కాళ్లు, చేతులు వంకర్లు పోయే పరిస్థితిని జెనువాల్గమ్‌ అని, వెన్నెముక కట్టెలా బిగుసుకుంటే దానిని స్కెలిటల్‌ ఫ్లోరోసిస్‌ అని పిలిచారు.

పలువరసల మీద పసుపు రంగు ఈ వ్యాధికి ప్రారంభ దశ. అది ఎముకలకు కూడా విస్తరిస్తుందని (స్కెలిటల్‌ ఫోరోసిస్‌) మొదటిసారి ప్రపంచానికి తెలియచేసిన ప్రాంతం ప్రకాశం జిల్లా. 1937లో పొదిలి, దర్శి, కనిగిరిలో ఇది ఉన్నట్టు కనుగొన్నారు.

వ్యాసకర్త : డా|| డి.రాజారెడ్డి అపోలో ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌. ఫ్లోరోసిస్‌పై విశేష అధ్యయనం చేశారు. భారత్‌తో పాటు విదేశాలలోను ఫ్లోరోసిస్‌ పీడిత ప్రాంతాలను చూశారు. సలహాలు ఇచ్చారు. తెలుగువారి పురాతన నాణేల మీద లోతైన పరిశోధన కూడా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *