గ్లాసుడు పాలు – గుప్పెడు ఆకుకూరలు

గ్లాసుడు పాలు – గుప్పెడు ఆకుకూరలు

ఫ్లోరోసిస్‌ : మన ముంగిట్లోనే కొన్ని నివారణోపాయాలు

ఫ్లోరోసిస్‌ సోకడానికి నీరు మాత్రమే కారణమని ఇంకా విశ్వసించడం సరికాదు. మొదట ఈ అభిప్రాయం నుంచి బయట పడాలి. ఆ వ్యాధికి పౌష్ఠికాహారం, వాతావరణం వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఇంత స్పష్టమైన చిత్రంలో ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వాలు, సంస్థలు తీసుకోగలిగిన చర్యలు కొన్ని ఉన్నాయని కూడా స్పష్టమవు తుంది. వెంటనే చేయగలిగనవి పౌష్ఠికాహారం, పరిశుభ్రమైన నీటి సరఫరా. దీనిని ప్రభుత్వం, సంస్థలు చేపట్టవచ్చు.

తిండి, పండే పంట కూడా ఈ వ్యాధికి కారణ మవుతున్నాయి. మన చుట్టూ ఉన్న, మనకు అందు బాటులో ఉన్న ఆహారంతో దీనికి అడ్డుకట్ట వేసుకో వచ్చు. ఫ్లోరోసిస్‌ను నిరోధించాలంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళికను ఆశ్రయించాలి. అందుకు మూడు నాలుగు దశాబ్దాలు పడుతుంది. ఇంతలో ఆ వ్యాధి బారిన పడకుండా ప్రజలను రక్షించడానికి ఉన్న మార్గాలనైనా కనీసంగా పరిశీలించకపోవటం, ఉపయోగించుకోకపోవడం పెద్ద విషాదం. అందు బాటులోనే ఉన్న ఆ నివారణ చర్యలను ప్రారంభిస్తే పదో ఏట సోకేది నలభయ్యో ఏటనో, యాభయ్యో ఏటనో సోకుతుంది. అకాల వార్థక్యాలు, మంచం మీది నరకాలు కొంచెం తగ్గుతాయి.

ఫ్లోరోసిస్‌ నిరోధించడానికి ఇప్పటికీ మన ముంగిట్లో కొన్ని అవకాశాలు ఉన్నాయి. వాతా వరణాన్ని, ప్రజల వృత్తులను ఇప్పుడే ఎవరూ మార్చలేరు. కాని కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు వారికి అందించడం ద్వారా వ్యాధి పీడీతులకు ఉపశమనం కల్గించవచ్చు. ఫ్లోరైడ్‌ ఉన్న ప్రాంతాలను దాని నుంచి రక్షించాలంటే తాగునీరు, సాగునీరు రెండింటిని పూర్తిగా ప్రక్షాళన చేయవలసి ఉంటుంది. ఇందుకు 30, 40 సంవత్సరాలు అవసరమవుతాయి. ఇంతలో జరగవలసిన నష్టం జరిగిపోతుంది. లక్షల మంది దీని బారిన పడతారు. ఇంతకాలం కేవలం తాగునీరు అందిస్తే చాలుననుకున్న నమ్మకాన్ని కాస్త సడలించి, ఇంకొంచెం విశాల దృష్టితో సమస్యను పరిశీ లించాలి. పరిశుభ్రమైన తాగునీరు అందించ డంతోపాటు ఆహారంలో లోపిస్తున్న విటమిన్లను, కాల్షియంను టాబ్లెట్ల ద్వారా భర్తీ చేయవచ్చు.

వ్యాధి నిర్మూలన పథకంలో దశలు

దేశంలో స్కెలిటల్‌ ఫ్లోరోసిస్‌ అనే ప్రాణాంతక వ్యాధిని నిర్మూలించడానికి ప్రణాళికలూ, పథకాలూ రచించే ముందు అది వ్యాపించే దశలను, అందుకు తోడ్పడే వాస్తవాలను గ్రహించడం అవసరం.

ఒకటో దశ : ఫ్లోరోసిస్‌ పొంచి ఉన్న గ్రామా లను, పట్టణాలను వెతికి పట్టుకోవాలి. పాఠశాలకు వెళ్లే పిల్లల పళ్లను పరిశీలించాలి. దానివల్ల నీటిలో ఫ్లోరైడ్‌ మోతాదుకు మించి ఉంటే ఈ వెంటనే బయటపడుతుంది. పిల్లల పళ్లు గారపట్టినట్టు పసు పుగా కనిపిస్తాయి. ఫ్లోరోసిస్‌ బెడద ఉన్న ప్రాంతాలలో పిల్లలు 1.5 పిపిఎంకు మించి ఉన్న ఆ నీరు తాగడంవలన ఫ్లోరోసిస్‌ వ్యాధి బారిన పడతారు.

రెండో దశ : ఆయా గ్రామాలు, పట్టణాలలో ఫ్లోరోసిస్‌ తీవ్రతను గుర్తించవలసి ఉంటుంది. దాని శాతం తక్కువగా ఉంటే కేవలం దంతవ్యాధులకు పరిమితమవుతుంది. అదే కొంచెం ఎక్కువైతే జెనువాల్గమ్‌, స్కెలిటల్‌ స్థాయి వరకు ఫ్లోరోసిస్‌ ముదిరిన సూచనలు కనిపిస్తాయి. ఫ్లోరోసిస్‌ తక్కువగా ఉన్న గ్రామాల ప్రజలకు, పిల్లలకు కాల్షియం, విటమిన్‌లు అందించడానికి ప్రయత్నించాలి. అంటే అది తీవ్ర రూపం దాల్చి జెనువాల్గమ్‌కు దారి తీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మూడో దశ : వ్యాధి తీవ్రస్థాయిలో ఉన్న కేసులను పరిశీలించాలి. అన్ని గ్రామాలలోని నీటిలో ఉన్న ఫ్లోరైడ్‌ అంచనాలను తయారు చేయాలి. అయితే ఫ్లోరైడ్‌ తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతాల లోని నీరు మొత్తం ఫ్లోరైడ్‌ మయమని చెప్పనక్కరలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఫ్లోరైడ్‌ ఉన్న గ్రామాలకు సమీపంలోనే తాగడానికి అనువైన నీరు ఉండవచ్చు. ఈ నీటనే వాడవలసిందని మిగిలిన గ్రామ ప్రజలకు సూచించవచ్చు.

నాలుగో దశ : వ్యాధి తీవ్రంగా ఉన్న గ్రామంలో అన్నిరకాల జలవనరులలోని మూలకాలను గుర్తిం చాలి. పొదిలి, దర్శి, కనిగిరి ప్రాంతాలలో కనుగొన్న 60 మూలకాలలో 15 మూలకాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయి. వీటిలో ఏ మూలకం భవిష్యత్తులో ఫ్లోరైడ్‌ను ఉధృతం చేయడానికి కారణ మవుతుందో ఇప్పుడు చెప్పలేం. కాబట్టి మూలకాలు తీవ్రంగా ఉన్న నీటిని మానిపించాలి.

ఐదో దశ : గ్రామాలలో ప్రజలు రోజూ తీసుకునే ఆహారంలో, తాగే నీటిలో దాగి ఉన్న ఫ్లోరైడ్‌ను అంచనా వేయాలి.

ఆరో దశ : పరిపూర్ణ ఆరోగ్యానికి మనుషులకు కాల్షియం ఎంతో అవసరం. ఇది గుర్తించాలి. కాల్షియం తగ్గితే పేరాథైరాయిడ్‌ హైపర్‌ యాక్టివిటీ కూడా వస్తుంది. దానితో మన శరీరాన్ని మోసే శక్తి కాళ్లలోని ఎముకలు కోల్పోతూ ఉంటాయి. దాని ఫలితమే కాళ్లు వంకర్లు పోవడమనే భయానక స్థితికి దారితీస్తుంది.

ఫ్లోరోసిస్‌ వ్యాప్తిలో నీటి పాత్ర తిరుగులేనిది. మనకి మూడు విధాలుగా నీరు లభిస్తుంది – వర్షపు నీరు, భూగర్భజలం, ఉపరితల జలాలు. ఇందులో వర్షపు నీరు ఎంతో స్వచ్ఛమైనది. తాగడానికి, వంట చేసుకోవడానికి దీనిని మించినది లేదు. ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితులతో ఇది సాధ్యమయ్యేది కాదు. జలాశయాలు కట్టి (ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాలలో) నీటిని నిల్వ చేసుకోవడం వెంటనే చేయగలిగిన పని కాదు. చెరువుల నీరు ఇప్పుడు ఆరోగ్యకరం కాదు. కలుషితమైన చెరువులే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. అయితే నాగార్జున సాగర్‌ జలాశయంలో నీరు తాగడానికి అనువైనదే. ఇందులో 0.4 నుంచి 0.5 పిపిఎం ఫ్లోరైడ్‌ మాత్రమే ఉంది. నదులలో నీరైనా ఏడాది పొడవునా ఒకే తీరులో ఉండదు. నదులలో, వాగులలో నీరు ఆయా ప్రాంతాలను బట్టి ఫ్లోరైడ్‌ను కలిగి ఉంటుంది. భూగర్భ జలాలైనా అంతే. అయితే ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాలలో మాత్రం తీవ్రంగా ఉంటుంది. ఇక ఫ్లోరైడ్‌ బాధితులకు అందుబాటులో తేగలిగినది ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకులలో పరిశుభ్రమైన నీరే. కాని ఇది తాత్కాలిక ఏర్పాటే. ఫ్లోరోసిస్‌కు శాశ్వత పరిష్కారం సాగర్‌జలాల పంపిణీయే.

ఫ్లోరోసిస్‌ బాధితులు రెండు మూలకాల గురించి, ఒక విటమిన్‌ గురించి తెలుసుకోవాలి. ఆ మూడు వారికి మూడు వరాలని చెప్పవచ్చు. అవి కాల్షియం, మెగ్నిషియం, విటమిన్‌-సి. ఈ మూడింటితో ఫ్లోరోసిస్‌ నివారణకు అవినాభావ సంబంధం ఉంది.

కాల్షియం : మనుషులకి కాల్షియం అత్యవసరం. మనిషిలో ఉండే 99 శాతం కాల్షియం ఎముకలలో ఉంటుంది. మనిషి శరీర బరువులో 2 శాతం దీనిదే. మనిషి పుట్టినప్పుడు 30 మిల్లీగ్రాములు ఉండాలి. తరువాత పసితనంలో 500 మిల్లీగ్రాములు, బాలల్లో 800 మిల్లీగ్రాములు ఉండాలి. పెద్దలలో 1200 నుంచి 1500 మిల్లీగ్రాముల కాల్షియం ఉండాలి. ఈ కాల్షియం తక్కువైతే ఆహారం ద్వారా ప్రేవులలోకి చేరుకున్న ఫ్లోరైడ్‌ శరీరంలో ఇంకిపోవడం మొదలవు తుంది. అదే కాల్షియం శరీరంలో ఉండవలసిన స్థాయిలో ఉంటే ఫ్లోరైడ్‌ను మలం ద్వారా బయటకు నెట్టివేస్తుంది.

మెగ్నీషియం : కాల్షియం చేసే పనినే మెగ్నిషియం కూడా చేస్తుంది. చిన్న తేడా అంతే. మెగ్నీషియం కూడా మానవ శరీరానికి అత్యంత ఆవశ్యకమైన పదార్థం. మనిషి శరీర బరువులో దీని వాటా 0.5 శాతం. శరీరానికి రోజుకు 350 నుంచి 500 మిల్లీగ్రాములు అవసరం. శరీరంలో నిల్వ ఉన్న ఫ్లోరైడ్‌ను ఇది మూత్రం ద్వారా బయటకు పంపుతుంది.

విటమిన్‌-సి : ఇది కూడా ఫ్లోరోసిస్‌ నివారణకు ఉపయోగపడుతుంది. ఇది పనిచేసే క్రమాన్ని ఇంకా కనుగొనవలసి ఉంది. ఆహారంలో విటమిన్‌-సి తక్కువగా తీసుకునే వారు ఫ్లోరోసిస్‌కు గురికావడాన్ని కొన్ని దశాబ్దాల క్రితమే నుగొన్నారు.

నల్లగొండ వంటి ప్రాంతంలో ఫ్లోరోసిస్‌ అంతగా వ్యాపించిపోవడానికి కారణం ఈ మూడు వారికి దొరకక కాదు. ఎందులో ఉంటాయో సరైన పరిజ్ఞానం లేకపోవడమే అసలు లోపం. ఇవి మనకు అందుబాటులో ఉండే ఆకుకూరలు, కాయగూరల లోనే ఉన్నాయి. అయితే ముందు పేర్కొన్నట్టు ఫ్లోరోసిస్‌కు అడ్డుకట్ట వేయడానికి పాలు అత్యంత ప్రాధాన్యం ఉన్న ఆహారం. పాలు చాలా కుటుంబా లకు ఖరీదైన ఆహారమే. కాబట్టి పాలు తీసుకోలేకపోతే ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ఇంకొన్ని పదార్థాలు కూడా ఉన్నాయి.

కాల్షియం, మెగ్నీషియం కోసం వంద గ్రాముల పాలు తీసుకుంటే ఎంత మంచిదో వంద గ్రాముల తోటకూర తీసుకున్నా అంతే ప్రయోజనమని గుర్తించాలి. ఈ రెండూ మూలకాలు, విటమిన్‌-సి బాధిత ప్రాంతాల ప్రజలకు క్రమపద్ధతిలో అందించా లంటే టాబ్లెట్ల రూపంలో కూడా ఇవ్వవచ్చు. నిజానికి మందుల కంపెనీలు ఆ మూడు కలిసి ఉన్న టాబ్లెట్‌ను బాధిత ప్రాంతాలలో విక్రయించాలన్నా కష్టం కాదు. చాలా చౌకగానే అందించవచ్చు. ప్రభుత్వం తలుచుకుని కొన్ని పన్నులు మినహాయిస్తే ఇంకా చౌకగా పంపిణీ చేయవచ్చు. ఆ ప్రాంతాలలో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ వ్యాధి నివారణకు అనుగుణంగా అమలు చేయడం మరో అవసరం. ఇదయినా ప్రభుత్వాలు చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *