రైతుకు పట్టం

రైతుకు పట్టం

మనది గ్రామీణ భారతం. ఇది రైతన్నల భారతం. 70 శాతం మంది వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న ప్రజల నేల ఇది. అందుకే గ్రామాలు స్వయంసమృద్ధి చెందాలని, అప్పుడే మన దేశం మళ్లీ రామరాజ్యాన్ని తలపించగలదని జాతిపిత మహాత్మా గాంధీ ఎన్నోసార్లు చెప్పారు. అది ఆయన కల. కాని ఆయన పేరు పెట్టుకున్న కాంగ్రెస్‌ నాయకులు, ప్రధానమంత్రులు, వారి ప్రభుత్వాలు ఆ దిశగా ఏవో మొక్కుబడి ప్రయత్నాలు చేశాయే తప్ప కర్షకుడికి నిజమైన భరోసానిచ్చే విధానాలను ఎప్పుడూ రూపొందించలేదు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేటి ఎన్‌డిఎ ప్రభుత్వం కొలువుతీరిన మరుసటి రోజు నుండే రైతు సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఆ దిశగా ఎన్నో పథకాలను, విధానాలను ప్రవేశపెట్టింది. వాటి అమలుపైనా అంతే శ్రద్ధ పెట్టి పనిచేస్తోంది. ఆ క్రమంలోనే ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో రైతుకు పెద్ద పీట వేసింది. రైతు సంక్షేమానికి మరిన్ని పథకాలు ప్రకటించింది.

ఎన్నికల సంవత్సరం కావడంతో మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌తో ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరిచే ప్రయత్నం చేసింది. రైతులు, మధ్యతరగతి, పేదలపై ఎక్కువ శ్రద్ధ చూపింది. ముఖ్యంగా వివిధ సమస్యలతో అతలాకుతలమౌతున్న చిన్నకారు రైతాంగాన్ని ఆదుకునేందుకు ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ని ఏర్పాటు చేసింది. దీనివల్ల దేశంలోని 12 కోట్లమంది చిన్నకారు రైతులు లబ్ధి పొందనున్నారు. మరోవైపు అసంఘటిత రంగంలో పనిచేసే 10 కోట్లమంది కార్మికులకు పెన్షన్లను అందించే మరో కార్యక్రమానికి కూడా ఈ బడ్జెట్‌లో శ్రీకారం చుట్టారు.

ఆర్థికశాఖ బాధ్యతల్ని తాత్కాలికంగా చేపట్టిన రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ 1 ఫిబ్రవరి 2019న లోక్‌సభలో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. రూ.27.84 లక్షల కోట్ల వ్యయ అంచనాలతో 2019-20 ఆర్థిక సంవత్సరానికిగానూ ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. మధ్యతరగతి వారికి మేలు చేసే విధంగా ఆదాయపు పన్నులో మినహాయింపులు తీసుకువచ్చారు. 5 లక్షల వరకూ ఆదాయ పన్నును మినహాయించారు. వివిధ మినహాయింపు సౌకర్యాలతో మరో 4 లక్షల వరకు కూడా పన్ను రిటర్నులు పొందే అవకాశం కల్పించారు. అంటే మొత్తం సంవత్సర ఆదాయం 9 లక్షల వరకు ఉన్న వారికి పన్ను రూపేణా ఒక్క రూపాయి కోల్పోవలసిన అవసరం లేదు.

రక్షణ రంగానికి కేటాయింపులు 3లక్షల కోట్లకు పెంచారు. ఈశాన్య రాష్ట్రాలకు అత్యధికంగా 58,166 కోట్ల రూపాయలు కేటాయించారు. హర్యానాలో నూతనంగా ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. సినిమా రంగానికి ఏకగవాక్ష పద్ధతిలో అన్ని అనుమతులను మంజూరు చేయనున్నామని బడ్జెట్‌లో ప్రకటించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయల కల్పనకు, బలహీనవర్గాల వారికి ఈ బడ్జెట్‌లో అత్యధికంగా నిధులను కేటాయించారు. మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్‌కు అన్నివర్గాల నుంచి మద్దతు లభించడం విశేషం.

రైతుపై ప్రత్యేక శ్రద్ధ

దేశవ్యాప్తంగా సమస్యలను ఎదుర్కొంటున్న రైతాంగంపై కేంద్రం ఈ బడ్జెట్‌లో ప్రత్యేక శ్రద్ధ చూపింది. వారి కష్టాలను తగ్గించే దిశగా కొంత ప్రయత్నం ప్రారంభించింది. తాజా బడ్జెట్‌లో రైతుల సంక్షేమం కోసం ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ అనే కొత్త పథకం తీసుకువచ్చారు. విత్తనాలు, ఎరువులు, పనిముట్లు, కూలీల వంటి పెట్టుబడి వ్యయాలు సమకూర్చుకునేందుకు పేదరైతులకు ఆదాయ మద్దతు కల్పించాల్సిన అవసరం నెలకొన్న పరిస్థితుల్లో ఈ కొత్త పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద 5 ఎకరాలలోపు వ్యవసాయభూమి ఉన్న రైతులకు ఏడాదికి 6వేల రూపాయలను నేరుగా రైతుల బ్యాంక్‌ ఖాతాలో జమచేస్తారు. దీనిని రైతులు మూడు విడతల్లో అందుకుంటారు. ఇది చిన్నకారు రైతులకు పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుంది. చిన్న, మధ్య తరహా రైతులకు ఆర్థిక సహకారం అందజేయడమే ప్రధానమంత్రి కిసాన్‌ పథకం ప్రధాన లక్ష్యం. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకానికి 75 వేల కోట్ల రూపాయలను కేటాయిం చారు. 2018-19 ఏడాదికి మరో 20 వేల కోట్ల రూపాయలను అందించనున్నారు.

1 డిసెంబరు 2018కి మొదటి విడతగా అందించవలసిన 2 వేల రూపాయల సాయాన్ని 31 మార్చి 2019 నాటికి రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ సాయం బాధిత రైతు కుటుంబాలకు అదనపు ఆదాయ హామీని ఇవ్వడమే కాకుండా పంట సీజన్‌కు ముందే అత్యవసర ఖర్చులకు ఈ మొత్తం సహాయకారిగా ఉండగలదు. రైతులు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా గౌరవంగా జీవించడానికి ఇది తోడ్పడుతుంది.

ప్రస్తుతం వ్యవసాయరంగం సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకం రైతులకు కొంత ఉపశమనం కల్పించే అవకాశం ఉంది. దేశంలో మొత్తం 26 కోట్ల 30 లక్షల మంది రైతులు ఉండగా 2016-17 నాబార్డ్‌ సర్వే ప్రకారం ఒక్కో రైతు కుటుంబంపై సగటున 1.04 లక్షల రుణభారం ఉంది. మొత్తం రైతుల్లో 52 శాతం మంది అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ వెల్లడించింది. గత ప్రభుత్వాలు రుణమాఫీలను ప్రకటించినా ఎక్కువ మంది రైతులకు దీనివల్ల మేలు జరగలేదు. రుణమాఫీ వలన పెద్ద రైతులు, వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేసిన వారు లబ్ధి పొందుతున్నారు. నిజానికి వారికి ఈ మాఫీ అవసరం లేదు. మరోపక్క సంస్థాగత రుణాలు అందించే బ్యాంకులు చిన్న సన్నకారు రైతులకు రుణాలు అందించడానికి అంత శ్రద్ధ చూపడంలేదు. అందుకే సన్న, చిన్న కారు రైతులు ఎక్కువగా ప్రయివేటు వడ్డీ వ్యాపారుల దగ్గర పంట పెట్టుబడికి రుణాలు తీసుకుంటున్నారు. ఈ వడ్డీ వ్యాపారులు పంట పండిన తర్వాత తక్కువ ధరలకే రైతు నుండి పంటలను కొనుగోలు చేస్తారు. దాంతో రైతు రెండు రకాలుగానూ నష్టపోతున్నాడు. ఈ అన్ని సమస్యలను అధ్యయనం చేసిన ప్రభుత్వం రైతు సంక్షేమం దృష్ట్యా ఈ కొత్త పథకాన్ని ముందుకు తెచ్చింది.

తెలంగాణలో అమలు పరుస్తున్న రైతుబంధు, ఒడిశాలో అమలవుతున్న కలియా పథకాలను అధ్యయనం చేసి వాటి కంటే మెరుగ్గా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త (ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి) పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద పెట్టుబడి సాయాన్ని 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు పరిమితం చేయడంతో సాయం అవసరం ఉన్న చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. తెలంగాణ రైతుబంధు పథకంలో ఒక లోపం కొట్టొచ్చి నట్టు కనబడుతోంది. 5 ఎకరాలు ఉన్న చిన్న రైతుతో పాటు 50 ఎకరాలు ఉన్న పెద్ద రైతుకూ ప్రభుత్వ సాయం అందుతోంది. ఈ పెద్ద రైతు నేరుగా వ్యవసాయం చేయడు. అలాగే తనకు లభించిన సొమ్మును వ్యవసాయంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అతనికి ఉండదు. దానితో ఆ రైతుకిచ్చిన 4 లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్ము వ్యవసాయానికి ఉపయోగపడకుండా వృథా అవుతోంది. ఈ లోపాన్ని పసిగట్టిన కేంద్రం తన పథకం కింద 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులను మాత్రమే అర్హులుగా ప్రకటించింది. దీనివల్ల సాయం అవసరం అయిన రైతుకు సాయం అందుతుంది. ప్రభుత్వ సొమ్ము వృథా కాకుండా ఉంటుంది.

ఇది ప్రారంభమే..

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకం కింద ఐదెకరాలు, ఆ లోపు వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు 6 వేల రూపాయలు సహాయంగా అందించడాన్ని ప్రతిపక్ష పార్టీలు, రైతుకు రోజుకు కేవలం 17 రూపాయలే దక్కుతాయంటూ ఈ పథకాన్ని హేళన చేస్తున్నాయి. అయితే ప్రధాని మోదీ కశ్మీర్‌లో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ ‘ఏసీ గదులలో కూర్చునేవారికి 6 వేలు పెద్ద మొత్తంగా కనబడదు’ అంటూ వారి విమర్శను తిప్పికొట్టారు. వాస్తవానికి దేశాన్ని అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ రైతుకు కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదనేది చేదు వాస్తవం. మోదీ తన మేనిఫెస్టో లోనే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రకటించి, గత ఐదేళ్లుగా దానికోసం ఎంతో కృషి చేశారు. అయితే కేంద్రం రైతులకు ఇస్తున్న 50 శాతం అదనపు మద్దతు ధరలను రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయనేది కూడా గమనించవలసిన అంశం. రైతుకు 6 వేలు సాయం అందించే కిసాన్‌ సమ్మాన్‌ పథకం కోసం మోదీ ప్రభుత్వం రూ. 95 వేల కోట్లను ఖర్చు చేస్తోంది. 12 కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు మేలు చేసే ఈ పథకం ఇప్పుడు ప్రారంభ దశలోనే ఉంది. కనుక రానున్న రోజుల్లో ఈ సాయం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

ఈ బడ్జెట్‌లో వ్యవసాయ అనుంధ రంగాల అభివృద్ధికి 1,49,981 కోట్ల రూపాయలను కేటాయించారు. ఎరువుల సబ్సిడీకి 74,986 కోట్ల రూపాయలను కేటాయించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా తాజా బడ్జెట్‌లో వ్యవసాయ రంగ బలోపేతానికి ప్రభుత్వం వివిధ పథకాలను ప్రారంభించింది. ఈ బడ్జెట్‌కి ముందే కిందటి సంవత్సరం జులైలోనే గుర్తించిన 22 పంటలకు కనీస మద్దతు ధరను పంట ఉత్పత్తి కన్నా 50 శాతం ఎక్కువగా నిర్ణయించింది.

ఎన్‌డిఎ ప్రభుత్వం కొలువుదీరిన సమయం నుండే రైతుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం బీమా యోజనను అమలు చేసింది. అదే ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన. ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రైతుల్లో దీనిపై ఇప్పుడిప్పుడే పూర్తి అవగాహన వస్తోంది. రైతులంతా స్వచ్ఛందంగా బీమా ప్రీమియం చెల్లించడానికి ముందుకు వస్తున్నారు. అలాగే మార్కెటింగ్‌ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. దేశ వ్యాప్తంగా 22 వేల గ్రామ సంతలను గ్రామీణ వ్యవసాయ మార్కెట్లుగా అభివృద్ధి చేసేందుకు చర్యలను ప్రారంభించింది. వ్యవసాయ మార్కెట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు 2 వేల కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసింది. దేశంలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్లను అనుసంధానిస్తూ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ను ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా రైతులకు మట్టి పరీక్షా పత్రాలను అందజేసి ఆయా ప్రాంతాల్లో నేలలో ఉన్న పోషకాలను గుర్తించి అందుకు అనుగుణంగా ఎరువులను సిఫారసు చేస్తోంది. దీనివల్ల ఎరువుల దుబారా తగ్గటమే కాకుండా రైతులకు పెట్టుబడి వ్యయం కూడా తగ్గింది.

మత్స్యరంగంపై దృష్టి

ఈ బడ్జెట్‌లో మత్స్యరంగం అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా మత్స్యశాఖను ఏర్పాటు చేయనుంది. ఈ రంగంలో 7 శాతం వృద్ధికి కృషిచేస్తోంది. దేశవ్యాప్తంగా 1.45 కోట్ల మంది మత్స్యకారులు ఉపాధికోసం మత్స్యరంగంపై ఆధారపడ్డారు. ఈ రంగంపై దృష్టి కేంద్రీకరించి వారికి స్థిరమైన ఆదాయం లభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా రుణాలను అందుకునే రైతులకు; పాడి పరిశ్రమ, చేపల పెంపకానికి తీసుకునే రుణాలపై 2 శాతం వడ్డీ తగ్గింపును ప్రభుత్వం ప్రకటించింది. సకాలంలో రుణాలను చెల్లించే రైతులకు మరో 3 శాతం వడ్డీ రాయితీని ప్రకటించింది. విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు జాతీయ విపత్తు ఉపశమన నిధి ద్వారా అందించే రుణాలపై కూడా 2 శాతం వడ్డీ రాయితీని కేంద్రం ప్రకటించింది. పాడిరంగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి ఈ బడ్జెట్‌లో 750 కోట్ల రూపాయలను కేటాయించారు. గోసంపదను జన్యుపరంగా తీర్చిదిద్దేందుకు; ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచేందుకు రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు. గోవులకు సంబంధించి చట్టాలు, సంక్షేమ పథకాల్ని ప్రభావశీలంగా అమలు చేసేలా ఆయోగ్‌ పర్యవేక్షిస్తుంది. ఉద్యాన పంటల అభివృద్ధికి దేశ వ్యాప్తంగా 99 క్లస్టర్లను ఏర్పాటుచేశారు. పంటల సాగు, శుద్ధి, మార్కెటింగ్‌ వంటివన్నీ ఈ క్లస్టర్లలో ఉంటాయి. సేంద్రియ వ్యవసాయానికి, ఆ ఉత్పత్తులను అమ్మడానికి మహిళా స్వయంసహాయక సంఘాలను ప్రోత్సహిస్తున్నారు.

గ్రామానికి పెద్ద పీట

ప్రభుత్వం రైతులు, మత్స్యకారులు, ఇతర అసంఘటిత రంగ ప్రజల సంక్షేమంతో పాటు ఆ గ్రామ అభివృద్ధికి తోడ్పడే వివిధ ఇతర పథకాలకూ ఈ బడ్జెట్‌ పెద్ద పీట వేసింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి 60 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల రోడ్ల అనుసంధానానికి సంబంధించిన ప్రధానమంత్రి గ్రామీణ్‌ సడక్‌ యోజనకు కేటాయింపులు 19 వేల కోట్లకు పెంచారు.

ఇవే కాక గ్రామాభివృద్ధికి ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది. గ్రామంలో సొంత ఇల్లు లేనివారికి ఇంటిని నిర్మించి ఇచ్చే పథకం ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం’ కింద 2014-18 మధ్య దేశం మొత్తం మీద 1 కోటి 53 లక్షల గృహాలను ప్రభుత్వం నిర్మించి ఇచ్చింది. అలాగే ఇప్పటికే దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ అందించిన ప్రభుత్వం 2019 మార్చి నాటికి అన్ని ఇళ్లకు విద్యుత్‌ సౌకర్యం కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 143 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను పంచారు. దీనివల్ల ఏడాదికి 50 వేల కోట్ల రూపాయల విలువైన విద్యుత్‌ ఆదా అయ్యింది. దేశంలో గ్రామీణ పేద ప్రజలకు ఉచిత గ్యాసు కనెక్షన్‌ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఉజ్వల పథకం సత్ఫలితాలను ఇచ్చింది. దేశ వ్యాప్తంగా 8 కోట్ల గ్యాసు కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకూ 6 కోట్ల మంది పేద ప్రజలకు ఆ ఇంటి మహిళ పేరుతో గ్యాసు సౌకర్యం కల్పించారు.

రానున్నవి మరిన్ని మంచి రోజులు

గత ప్రభుత్వాల హయాంలో వివిధ కార్పొరేట్‌ సంస్థలకు విరివిగా అందించిన రుణాలు గుట్టలుగా పేరుకుపోయాయి. వీటిని తిరిగి పొందడానికి కావల్సిన చట్టపరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది. ఇలా వచ్చిన వసూళ్లను, కొత్త పన్నుల విధానాల ద్వారా వస్తున్న పన్నులను భవిష్యత్తులో దేశ ప్రజలకు సక్రమంగా అందేవిధంగా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. గత కొంత కాలంగా దేశంలో పేదరికం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రభుత్వం విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. వృద్ధిరేటుకూడా నిలకడగా 7 శాతానికి పైగా ఉండటంతో దేశం కొన్ని రంగాల్లో వేగంగా ముందుకు వెళుతోంది. పారిశ్రామిక రంగం అభివృద్ధికి తీసుకువచ్చిన మేకిన్‌ ఇండియా పథకం కొంతమేర సత్ఫలితాలను ఇచ్చినా దేశ ఆర్థిక రంగాన్ని మలుపు తిప్పే విధంగా ఏం మారలేదు. వ్యవసాయ రంగంలో వృద్ధి భారీగా పెరగాలి అంటే సాగునీటి పారుదల, ఉత్పాదకత పెరగాల్సి ఉంది. తూర్పు ప్రాంతంలో వరదలు ఉంటే పశ్చిమ ప్రాంతంలో తీవ్ర క్షామం నెలకొంటున్నది. దీన్ని నివారించాలంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం. దీనికోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న భారత్‌ ఈ దశలో ఇంత పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చుకునే స్థితిలో ప్రస్తుతం లేదు. రానున్న 10 ఏళ్ల కాలంలో భారత్‌ ఇటువంటి సమస్యలను అవలీలగా ఎదుర్కోగల స్థాయికి చేరుకోగలదని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

అలాగే దేశంలో వ్యవసాయరంగం ఎక్కువ మందికి ఉపాధి అందిస్తోంది. ఈ రంగంలో ఇంతమంది అవసరం లేకున్నా వేరే ఉపాధి లేక ప్రజలు ఈ రంగంలోనే ఉంటున్నారు. పేదరికం, నిరుద్యోగానికి ఇది ప్రధాన కారణంగా ఉంది. సరైన నైపుణ్యాలు లేకపోవడం వలన గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు ఉపాధి పొందలేకపోతున్నారు. ప్రభుత్వం వారి నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించి అమలు చేస్తోంది. రైతులు కూడా వాణిజ్య పంటలను కాకుండా చిరుధాన్యాలు, సాంప్రదాయ పంటల వైపు మరలాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాలైన కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమపై శ్రద్ధ పెట్టాలి. అప్పుడు రైతులకు పలు రకాలైన ఆదాయాలు వస్తాయి కనుక రైతులపై రుణ ఒత్తిడి ఉండదు. చిత్తూరు జిల్లా రైతులను తీసుకుంటే తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నా కాని ఈ జిల్లాలో రైతు ఆత్మహత్యలు లేవు. ఇందుకు ప్రధాన కారణం అక్కడి రైతులు వ్యవసాయానికి అనుబంధంగా గోవులను పెంచుతున్నారు. ఆవు ఉంటే ఆత్మహత్యలేదు అనడానికి ఇది మంచి ఉదాహరణ. పశుపోషణను వ్యవసాయానికి అనుబంధంగా మలచుకుంటే రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురుకావు. దేశంలో ప్రజలు ఆర్థికంగా బలవంతులవుతుండటంతో వారి కొనుగోలు శక్తి పెరిగింది. సగటు పాల వినియోగం కూడా పెరుగుతోంది. రైతులు ఎంత పెద్ద ఎత్తున పాడి పశువులను పెంచినా సరైన మార్కెట్‌ లభిస్తున్నది. కూరగాయలు, పండ్లకు కూడా మంచి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఈ దిశలో అడుగులు వేస్తున్నది కనుక రానున్న రోజుల్లో వ్యవసాయం పండుగలా ఉండనుంది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం జైజవాన్‌ జైకిసాన్‌ నినాదంతో ముందుకు వెళ్లడమే. త్వరలోనే రైతు స్వయంసమృద్ధ భారతం ఏర్పడుతుందని ఆశిద్దాం.

– రామచంద్రారెడ్డి ఉప్పుల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *