డిజిటల్‌ ఇండియా – ఒక పరిచయం

డిజిటల్‌ ఇండియా – ఒక పరిచయం

డిజిటల్‌ ఇండియా అంటే ప్రభుత్వ సేవలను నూటముప్ఫై కోట్లకు పైగా ఉన్న భారతీయులకు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో డిజిటల్‌ రూపంలో అంద జేయడం. అంటే ఇంటర్నెట్‌ మాధ్యమంగా పెన్ను పేపర్‌ లేకుండా వంద శాతం సురక్షితంగా, అరక్షణంలో పని పూర్తయ్యేలా ఓ వ్యవస్థను రూపొందించడం. ఇదీ డిజిటలైజేషన్‌ ఇండియాకు సూక్ష్మ రూప విశ్లేషణ. ఈ వ్యవస్థ వల్ల ఎవరికి లాభం? ప్రతీ భారతీయుడికి అన్నదే ప్రధాని నరేంద్రమోదీ మాట. దేశంలో మొట్టమొదటి సారిగా 2015 జులై 1న ప్రధాని మోదీ ప్రారంభించిన విప్లవాత్మక డిజిటల్‌ ఇండియా లాంచింగ్‌ అయిన తరువాత వేగంగా అడుగులు పడ్డాయనే చెప్పుకో వచ్చు. అంతరిక్ష ప్రయోగాలతో దూసుకుపోతున్న ఇస్రో కారణంగా ఉపగ్రహ వ్యవస్థ మరే దేశంలో లేనంతగా మనదేశంలో అభివృద్ధి చెందింది. డిజిటల్‌ ఇండియా నినాదానికి అది చక్కగా ఊతమిచ్చింది. మేకిన్‌ ఇండియా నినాదంతో దేశంలో పెరిగిన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. దాంతో దేశంలోని అపారమైన పల్లెలు, పట్టణాలకు ఇంటర్నెట్‌ సేవలు, వాటితో పాటే డిజిటల్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్‌ అక్షరాస్యత అద్భుతంగా పెరిగింది. దీంతో ఉద్యోగావ కాశాలు మెరుగయ్యాయి. ప్రస్తుతానికి వస్తే 2014లో యునైటెడ్‌ నేషన్స్‌ నిర్వహించిన ఈ-గవర్నమెంట్‌ సర్వే ప్రకారం గత పదిహేనేళ్లలో ఈ-గవర్నమెంటు డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌ సూచీలో ముందున్న 193 దేశాలలో భారతదేశం 118వ స్థానానికి పైకి చేరుకుంది. ఇది ప్రతీ భారతీయుడు గర్వించదగిన విషయంగా ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించింది.

ఒకప్పుడు పాస్‌ పోర్టు కావాలంటే..

గతంలో పాస్‌ పోర్టు కావాలంటే పొడవాటి క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చేది. రోజుల పాటు ఆ లైన్లలో నిలబడిన సంగతి ఎలా మరచిపోగలం? మరి ఇప్పుడో.. సింపుల్‌గా దేశంలో ఎక్కడివారైనా తమకు దగ్గరలోని సెంటర్లో స్లాట్‌ బుక్‌ చేసుకోవడం, అన్ని వివరాలు ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేయడం, ఆపై కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే స్పీడ్‌పోస్టులో మీ ఇంటికే పాస్‌పోర్టు వచ్చేయడం ఉంది చూసారూ.. ఇదీ డిజిటలైజేషన్‌ అందిస్తూన్న చక్కటి ప్రయోజనం. దీనివల్ల సమయం కలసిరావడం, బ్రోకర్లకు డబ్బులు చెల్లించే అవసరం లేకపోవడం ప్రధాన లాభాలు. అయితే విశాల భారతావనిలోని అపారమైన వ్యవస్థలో ఇదొక శాంపిల్‌ మాత్రమే.

విమర్శలు, బాలారిష్టాలు..

వందకోట్లు దాటి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా ఎదిగిన మన దేశంలో ఓ కొత్త ఆవిష్కరణ పురుడు పోసుకుని పెద్దవాలంటే ఎన్నో బాలారిష్టాలు దాటాల్సి ఉంటుంది. మరెవరో అక్కర్లేదు.. మనదేశపు విపక్ష నాయకులే మన దేశాభివృద్ధిని ప్రశ్నించేందుకు, అడ్డుపుల్లలు వేసేందుకు సిద్ధంగా ఉంటారు. తమ వాదనను నెగ్గించుకోడానికి దేశ ప్రయోజనాలను కూడా పణంగా పెట్టేస్తారంటే అతిశయోక్తి కాదు. డిజిటలైజేషన్‌ ప్రక్రియలో భాగంగా 2016 నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడింది. కొత్త నోట్లు రావడంలో కొంత ఆలస్యం జరిగి ప్రజలు ఎటిఎంల చుట్టూ తిరిగిన మాట వాస్తవమే. అయితే నోట్ల రద్దు తరువాత ఐటీ రిటర్నులు పెరిగాయి. ఉగ్రవాద నిధులకు కూడా అడ్డుకట్ట పడింది. డిజిటల్‌ లావాదేవీలు ఊపందుకున్నాయి.

బిల్‌ గేట్స్‌ సానుకూల వ్యాఖ్యలు

పెద్ద నోట్ల రద్దు తరువాత భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోన్న మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ తన అభిప్రాయాన్ని సానుకూలంగా వ్యక్తం చేసారు. రద్దు నిర్ణయం మంచిదేనన్న ఆయన.. ఈ చర్య వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని, చాటుమాటు ఆర్థిక వ్యవస్థకు కళ్ళెం పడుతుందని చెప్పారు. ‘పరివర్తన చెందుతున్న భారతదేశం’ అనే అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడిన బిల్‌ గేట్స్‌ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని సమర్థించారు. రాబోయే కొన్నేళ్ళలోనే భారతదేశంలో డిజిటల్‌ లావాదేవీలు నాటకీయంగా పెరుగుతాయన్నారు. పరిమాణంలోనే కాకుండా దామాషాలో కూడా అత్యధిక డిజిటలైజేషన్‌ జరిగిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారతదేశం రూపొందుతుందన్నారు. విస్తృతమైన అంతర్గత మార్కెట్‌ను విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మౌలిక సదుపాయాలు, సమర్థ మార్కెట్ల నిర్మాణం, భూమి, కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

డిజిటలైజేషన్‌కు అడ్డంకులు

ఇంత పెద్ద దేశంలో పూర్తిస్థాయి డిజిటలైజేషన్‌ సాధించేందుకు ఉన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు.

– దేశంలో సాధారణ అక్షరాస్యత, డిజిటల్‌ అక్షరాస్యత చాలినంతగా లేకపోవడం ప్రధాన అడ్డంకి.

– డిజిటల్‌ ఇండియా సాకారం విషయంలో ప్రధాన పాత్ర పోషించేవి స్మార్ట్‌ ఫోన్లు. అవి ఇంకా గ్రామీణ భారతంలో అందరికీ అందుబాటులోకి రాలేకపోయాయి. ముఖ్యంగా చాలినంతగా లేకపోవడం లేదా ధరలు అందు బాటులో లేకపోవడం అని చెప్పుకోవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు అన్ని సేవలు అందుకు నేందుకు అవకాశం ఉండటమే ఇందుకు కారణం.

– దేశంలో ఉన్న భాషలు లెక్కకు మిక్కిలిగా ఉండటం, వాటిని దేశవ్యాప్త టెక్నాలజీలతో సమన్వయపరడం, ఏకీక్రుతం చేయడం శ్రమతో కూడుకున్నది కావడం.

– దేశంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఇంటర్నెట్‌ వ్యవస్థలపై దాడి చేస్తున్న సైబర్‌ నేరాలను అరికట్టే వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం.

– ప్రధాన నగరాలు, పట్టణాల వరకు ఓకే. కానీ క్షేత్రస్థాయికి పూర్తిస్థాయి కనెక్టివిటీ లేకపోవడం ఓ సమస్యగానే నిపుణులు చెబుతున్నారు.

– నగరాల్లోనూ రద్దీ సమయంలో పీఓఎస్‌ యంత్రాలు పనిచేయకపోవడం శాపంగా మారుతున్నాయి. పైగా వినియోగదారుడి అకౌంట్‌ నుంచి డబ్బులు చెల్లించినట్టు చూపిస్తోన్నా.. దుకాణదారుడి అకౌంట్లో జమ అవకపోవడం లాంటి ఇబ్బందులు తప్పడం లేదు.

– అపరిమితమైన రద్దీ విషయానికి వస్తే ఇటీవలే ప్రవేశపెట్టిన జీఎస్టీ పోర్టల్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు రిటర్నులు ఫైల్‌ చేద్దామన్నా ఓవర్‌ లోడ్‌ కారణంగా పోర్టల్‌ డౌన్‌ అన్న సమాచారమే కనిపిస్తోంది.

– అప్పుడప్పుడు వస్తోన్న ఆధార్‌ సమాచారం లీకవుతోందన్న సమాచారం విన్నవారికి ఎంతో విలువైన తమ సమాచారం సంగతేంటన్నది ఆందోళన కలిగించే అంశంగానే మిగులు తోంది.

– ప్రభుత్వ వ్యవహారాల కోసం, ఇతర డిజిటల్‌ సర్వీసుల కోసం తమ ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నెంబరు, ఆధార్‌ నెంబరు, పాన్‌ నెంబర్ల లాంటి వ్యక్తిగత సమాచారం అందజేయడం అంటే భయపడుతుండటం సహజం. ఎందుకంటే ఈ వ్యవహారాలన్నీ చూసే అతి పెద్ద సర్వర్‌ విదేశీ కంపెనీలు నిర్వహిస్తున్నాయి మరి.

– చాలా ప్రాంతాలలో ఇంటర్నెట్‌ ఇంకా ఎదగక పోవడం కూడా డిజిటల్‌ ఇండియా లక్ష్యాన్ని వెనక్కులాగుతున్న అంశం.

– సెంట్రలైజ్‌డ్‌ పరిష్కారం అందుబాటులో లేకపోవడం మరో తలనొప్పి కలిగేంచే అంశం. డిజిటల్‌ ఇండియా కాన్సెప్టులో వేలాదిగా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ వీటి కోసం ఏయే సైట్లను వెతకాలన్నది తెలుసు కోవడం చాలా కష్టం. ఆన్‌లైన్‌ నాలెడ్జీ లేని వారికి ఇది చాలా కష్టమైన పని.

– ముఖ్యమైనది చివరిది అయిన అంశం జనంలో డిజిటల్‌ ఇండియా పట్ల దృక్పధం లేదా మైండ్‌సెట్‌ మారకపోవడం. వీటికితోడు డిజిటల్‌ ఇండియా కాన్సెప్టును దెబ్బతీయడం కోసం పుంఖానుపుంఖాలుగా వచ్చే పనికిరాని ఆర్టికల్స్‌ సామాన్యులను తప్పదోవ పట్టించడం కూడా ఓ సమస్యగానే చూడాల్సి వస్తోంది

డిజిటల్‌ వైపు దేశం అడుగులు

ఇన్ని సమస్యలున్నా దేశం డిజిటల్‌ వైపు అడుగులు వేస్తోంది. ముందు తడబడినా, పోటురాళ్లు తగిలి కిందపడినా మళ్లీ అడుగులు పడుతున్నాయి. ఈసారి మరింత వేగంగా సురక్షితంగా నడక మొదలైంది. అది పరుగుగా మారేందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఇబ్బందులు ఎన్నున్నా వాటిని అధిగమిస్తూ ముందుకు కదలడాన్ని ఆర్థిక రంగ నిపుణులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. జనం ఆలోచనను, డిజిటల్‌ ఇండియా లక్ష్యాన్ని ఉపయో గాన్ని గమనిస్తూ ముందుకు సాగుతున్న పద్ధతిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామంగా చెబుతున్నారు. ఇంట్లోనే కూర్చుని బ్యాంకు వ్యవహారాలు చక్కబెట్టడాన్ని ముచ్చటగా గమనిస్తున్నారు. నిత్యం కొత్తకొత్త పథకాలు సేవలు ప్రవేశపెడుతూ ప్రజల్ని పూర్తి స్థాయి డిజిటల్‌ వైపు నడిపిస్తూన్న భారత ప్రభుత్వ తీరును ప్రపంచం ముక్కున వేలేసుకుని చూస్తోంది. సొంత టెక్నాలజీని వాడుకుంటూ కనెక్టివిటీ పెంచుకునేందుకు కృషి చేస్తోంది. ఇందుకోసం డిజిటల్‌ ఇండియా సాకారానికి అవసరమైన ఇంటర్నెట్‌ బ్యాండ్‌ విడ్త్‌ పెంచుకుంటోంది. ‘భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌’ (బీబీఎన్‌ఎల్‌) ప్రాజెక్టుతో 2018 డిసెంబరు మాసం లోగా 6,25,000 గ్రామాలను ఇంటర్నెట్‌ కనెక్టివిటీలోకి తెచ్చే లక్ష్యంతో పనిచేస్తోంది.

దేశం మొత్తం ఒక్కతాటిపై

డిజిటలైజేషన్‌ అంటే దేశంలోని అన్ని టెక్నాలజీ లను ఒక్కత్రాటిపైకి తేవడం. జనం నిత్యజీవితంలో భాగంగా మార్చడం. శ్రమ తగ్గించడం. మరీ ముఖ్యంగా విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించు కోవడం ద్వారా అపారమైన ఖర్చును తగ్గించు కోవడం. భారత్‌ లాంటి భారీ స్థాయి దేశవ్యాప్త మౌలిక వసతులను అత్యంత మారుమూల గ్రామానికి కూడా చేరుకునేలా చేయడం. కామన్‌ సర్వీస్‌ డెలివరీ అవుట్‌లెట్ల ద్వారా అన్ని ప్రభుత్వ సేవలు పారదర్శ కంగా, విశ్వసనీయతతో కూడిన సమర్థతతో సామాన్యుడిని చేరడం. భారత్‌ ఆ లక్ష్యాన్ని త్వరలోనే చేరనుంది. గత ఏడాది విశాఖలో జరిగిన 2017 సీఐఐ భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశంలో కేంద్ర మంత్రి వైఎస్‌ చౌదరి అన్న మాటలు ఎవరూ మరచి పోలేరు. ఆయన మాటల్లోనే చెప్పుకోవాలంటే భారత దేశంలో డిజిటలైజేషన్‌ సహా తయారీ రంగంతో డిజిటల్‌ సాంకేతికత సమన్వయం ద్వారా నాలుగో పారిశ్రామిక విప్లవ తరహా వాతావరణం నెలకొం టోంది. ఇది భారతదేశం గర్వించదగిన రోజులను చూడబోతోందని ఆయన వ్యాఖ్యల సారాంశం.

ఆధార్‌, జన్‌ధన్‌తో డిజిటల్‌ విప్లవం

భారత్‌లో డిజిటల్‌ విప్లవం 2010లో ఆధార్‌ రాకతో ఆరంభమైంది. ప్రతి భారత పౌరుడికి 12 అంకెలతో కూడిన ఒక వైవిధ్యమైన సంఖ్యను అందించింది ప్రభుత్వం. వేలిముద్ర లేదా ఐరిస్‌ను స్కాన్‌చేయడం ద్వారా దానిని తనిఖీ చేయడం సాధ్యమవుతుంది. దాదాపు 1.3 బిలియన్ల భారత ప్రజలు ప్రస్తుతానికి ప్రభుత్వ డిజిటల్‌ డేటాబేస్‌లో నమోదై ఉన్నారు. ఇంతటి ప్రాధాన్యతను ఆధార్‌ కార్యక్రమం అంతటితో ఆగక భారత్‌లో ప్రతి ఒక్కరు బ్యాంక్‌ఖాతా కలిగి ఉండేలా జన్‌ధన్‌ పేరిట మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి కూడా మార్గం చూపింది. 2014లో ప్రారంభ మైన ఈ కార్యక్రమం కారణంగా భారతీయులు దాదాపు 300 మిలియన్ల బ్యాంక్‌ఖాతాలను తెరిచారు.

వడివడిగా నగదు రహిత లావాదేవీలు

భారత్‌లో 1,500 వ్యాపారాలపై సర్వే జరిపి నప్పుడు వాటిలో 59 శాతం ఆర్థిక లావాదేవీలకు ఇప్పటికీ నగదును వినియోగిస్తున్నాయి. ఈ పద్ధతిలో చాలా మార్పు కనిపిస్తోంది. జన్‌ధన్‌కు ముందు ఒక అంచనా ప్రకారం దేశంలో 35 శాతం కుటుంబాలకు బ్యాంక్‌ఖాతా లేదు. అయితే మారుమూల పల్లె నుంచి మహానగరాల దాకా మొబైల్‌ఫోన్ల వినియోగం విస్తృతం కావడం, అందులో స్మార్ట్‌ఫోన్లు అగ్ర తాంబూల అందుకోవడంతో అతి తక్కువ కాలంలోనే నగదు రహిత లావాదేవీలు ఊపందుకున్నాయని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.

డిజిటలైజేషన్‌ను పుణికిపుచ్చుకున్న భారతం

నేటి భారతం డిజిటలైజేషన్‌ను పుణికిపుచ్చు కుంటున్నది. అన్ని రంగాల్లోనూ దీని ప్రభావం అద్వితీయంగా కనిపిస్తున్నది. ఇదే ఒరవడి ఇలాగే కొనసాగితే ప్రస్తుత ప్రపంచ ఆర్థిక ముఖచిత్రంపై ఏడవ స్థానంలో ఉన్న భారతదేశం మరో దశాబ్దానికి అంటే 2027 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని పలు అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా డిజిటలైజేషన్‌ పుణ్యమా అని 1991లో ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాల ఫలాలను అందుకున్న రీతిలో ప్రైవేట్‌ఉద్యోగాలకు తోడు స్వయం ఉపాధి పొందే సాధికారతను పొందనుంది.

దశాబ్దంన్నర కాలంలో అంతా యువభారతమే

మరేదేశానికి లేని సౌలభ్యం భారతదేశానికి ఉంది. అది మన దేశ జనాభాలో సింహభాగాన్ని యువత దక్కించుకోవడం. రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో యువతరం ఉపాధి, ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఈ యువతరానికి సంప్రదాయ బ్యాంకింగ్‌ అలవాట్లు ఉండవు. మొబైల్‌ఫోన్లు, స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు, చెల్లింపులు సాగిస్తుంటారు. అన్ని విషయాలు అప్పటికప్పుడు ఆన్‌లైన్లో జరుపే యువతరం రానుందని బ్యాంకింగ్‌రంగ నిపుణులు చెబుతున్నారు. మునుపటి తరాల కంటే అత్యంత వేగంగా డిజిటల్‌ బ్యాంకింగ్‌ను అందిపుచ్చుకుంటారని అంటున్నారు. ఇది రాబోయే భారతావనిలో జరగబోతోన్న డిజిటల్‌ విప్లవంగానే విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి ప్రధాని మోదీ కన్నకలలు సాకారం కానున్నాయనడంలో సందేహం లేదు.

సత్ఫలితాల దిశగా ఆర్థిక సంస్కరణలు

ఆధార్‌, నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఇలా గడచిన ఎనిమిదేళ్ళలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సత్ఫలితాలు ఇవ్వనున్నాయని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు భవిష్యవాణి వినిపిస్తున్నారు. ఇప్పటిదాకా బాలారిష్టాల్లో ఉన్న భారతీయ ఆర్థిక వ్యవస్థ 2019 నుంచి చురుకైన ఆర్థిక కార్యకలాపాలతో నిమగ్నం కానుందని అంచనా వేస్తున్నారు. మరో పదేళ్ళకు భారత్‌ 6 ట్రిలియన్‌ డాలర్ల స్థూల దేశీయ ఉత్పాదకతను చవిచూస్తుందని స్పష్టం చేస్తున్నారు. అదే క్రమంలో ఆర్థిక సేవలు, పెరుగుతున్న వినియోగ దారుల అవసరాలతో ప్రస్తుతం 10వ స్థానంలో భారత్‌ ఈక్విటీ మార్కెట్‌ ఐదవ స్థానానికి ఎగబాకు తుందని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. ఇ-కామర్స్‌లో వృద్ధి, వినియోగ వృద్ధి, ఆర్థిక ఉత్పత్తులు, పెట్టుబడులు భారత్‌ను ప్రపంచవ్యాప్తంగా కార్పొ రేట్లకు ఒక కీలకమైన మార్కెట్‌గా అవతరింప జేస్తాయి. మరీ ముఖ్యంగా ఈ క్రమంలో భారత్‌ విజయం సాధించిన పక్షంలో అది అభివృద్ధి చెందు తున్న దేశాలకు తోడు అభివృద్ధి చెందిన దేశాలకు సైతం సరికొత్త పాఠాలు నేర్పుతుంది.

– శ్రీనివాసరావు దాసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *