సాంస్కృతికంగా మనం ఒక్కటవ్వాలి

సాంస్కృతికంగా మనం ఒక్కటవ్వాలి

దేశం ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందినా ప్రజలలో సాంస్కృతిక ఐక్యత లేకపోతే జాతి మనుగడ ప్రశ్నార్ధకమవుతుంది. అందుకే మనమంతా విభేదాలు మరచి సాంస్కృతికంగా ఒక్కటవ్వాలి. అప్పుడే స్వాతంత్య్రఫలాలు అందరికీ అందుతాయి. అప్పుడు భారత్‌ తిరిగి పునర్వైభవం సాధించగలుగుతుంది.

స్వతంత్ర భారతం ఈ ఆగస్టు 15కి 71 సంవత్సరాలు పూర్తి చేసుకొని 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నది. ఈ దేశం ముక్కలై కూడా 71 సంవత్సరాలయింది. దేశ విభజన జరిగి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజులలోనే భారత్‌లో అంతర్భాగమైన కశ్మీర్‌లో కొంతభూభాగం పాకిస్థాన్‌ ఆక్రమణలోకి వెళ్లింది. భారత్‌లో మిగిలిన కశ్మీర్‌ అప్పటి నుండి రగులుతూనే ఉంది. ఆ సమస్యకు పరిష్కారం కనుచూపు మేరలో కనబడటం లేదు.

వీటితోపాటు 71 ఏళ్ల స్వతంత్ర భారతంలో మత, కుల సంఘర్షణలు పెరుగుతున్నాయి. స్వతంత్ర పోరాటం జరుగుతున్న రోజులలో ఈ దేశంలో ప్రారంభమైన కొన్ని సంస్థలు నేటివరకు సైద్ధాంతిక సంఘర్షణకు లోనవుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని సంస్థలు దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికీ సవాళ్లు విసురుతున్నాయి.

ఈ దేశాన్ని వేల సంవత్సరాలుగా ఒకే దేశం, ఒకే జాతిగా నిలబెట్టిన విషయాలు ఈ దేశ ఆధ్యాత్మిక శక్తి, సంస్కృతి, ధర్మం. వాటికి ఈ రోజున ఎంత ప్రాధాన్యముందో మనకు తెలుసు. ఆధ్యాత్మిక జీవనం స్థానంలో విలాసవంతమైన భౌతిక జీవనం ప్రవేశించింది. మనం స్వీకరించిన ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ముఖ్యమైనది. ఈ స్వేచ్ఛ మితిమీరి చివరికి మనం మన ధర్మం, సంస్కృతులకు దూరంగా జరుగుతున్నాం. మనదేశానికి సంబంధించిన చరిత్రను, మన పరంపరగాత శాస్త్ర విజ్ఞానాన్ని, మన సామాజిక ఐక్యతను ప్రతి దానిని ప్రశ్నార్థకం చేసుకున్నాం.

రాజకీయపరంగా చూస్తే రాజకీయుల లక్ష్యం అధికారం అందుకోవటమే అవుతోంది. అధికార లక్ష్యంతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ కుల, మత సంఘర్షణలకు కారణమవుతున్నారు. చివరకు జాతి భద్రతను సైతం తమ రాజకీయ స్వార్థం కోసం వినియోగించుకుంటున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న నాయకులు స్వాతంత్య్ర పోరాటం అంటే సత్యం కోసం జరిగే పోరాటంగా భావించారు. కాని ఇప్పటి నాయకులు అన్ని పోరాటాలూ అధికారం కోసమే అని భావిస్తున్నారు.

స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న నాయకులకు భారత్‌ ఒక ఆధ్యాత్మిక ప్రేరణ. ‘వందేమాతరం’ నినాదం ఒక మంత్రం. భారత్‌ అంటే భూమి, ప్రజలు, పర్వతాలు, నదులు, లోయలు మాత్రమే కాదు, మాతృభూమి కూడా. నేడు అటువంటి నాయకత్వం కనబడటం లేదు.

ప్రపంచంలో మానవత్వాన్ని వికసింప చేయటం భారతదేశ కర్తవ్యం. అది గుర్తించి దానికోసం పని చేయాలి. ప్రస్తుతం ఆలోచనలు కనబడటం లేదు.

ప్రపంచంలో ప్రారంభమైన నూతన సిద్ధాంతాల ప్రభావం మన దేశ నాయకత్వంపై ప్రభావం చూపటం ప్రారంభమైంది. ఉదాహరణకు యూరప్‌, రష్యా దేశాలలో పోరాటాలు మనవాళ్లకు స్ఫూర్తిగా కనపడ్డాయి. దానిలో రష్యా ప్రభావం ఎక్కువగా ఉండేది. దానితో మనలోని కొంతమంది సోవియట్‌కు విధేయత చూపడం ప్రారంభించారు.

దేశంలో విలువలు పెంచేది విద్య మాత్రమే. విద్య ద్వారా మాత్రమే అవి భావితరాలకు అందుతాయి. విద్య కూడా ఇప్పటి మన దేశంలో విలువలకు దూరంగా నడుస్తోంది. పాశాత్య వ్యామోహ ప్రభావంతోనే సాగుతున్నది. ఇప్పుడు మనదేశంలో విద్యార్థులకు చెపుతున్న చరిత్ర అంతా విదేశీయుల పాలనలోనే మన జాతీయత, మానవత్వం వికాసం చెందాయి అనేదే. ఇది మన జాతికి చాలా నష్టం కలిగించింది. కలిగిస్తూనే ఉంది. ఇటువంటి విద్య చదివిన వారంతా ఈ దేశానికి వ్యతిరేకంగా తయారవుతున్నారు. నక్సలైట్లు, వేర్పాటువాదులు, మావోయిస్టులుగా తయారవు తున్నారు. ఈ దేశాన్ని ముక్కలు చేస్తామని నినదిస్తున్నారు. ఆ మధ్య ఢిల్లీలో విశ్వవిద్యాలయ విద్యార్థులు ఈ దేశాన్ని ముక్కలు చేస్తామంటూ నినాదాలు చేశారు. ఇది ఒక దేశం, ఒక జాతి కాదు అని మాట్లాడుతున్నారు.

హిందుత్వం అంటే వాస్తవ జీవన విధానం. మానవత్వానికి ప్రేరణ. భారతదేశం పదే పదే ఉద్ధరింపబటానికి కారణం హిందుత్వమే. భారతోద్ధరణ స్వప్రయోజనం కోసం కాదు, దుర్బలలను కబలించటానికీ కాదు. తన దివ్యమైన ఆధ్యాత్మిక బలంతో ప్రపంచాన్ని చైతన్యం చేయటానికి, తద్వారా ప్రపంచ కల్యాణం, శాంతి సాధించటానికి’. కాని నేడు హిందుత్వం మతతత్వం అని ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య ఒక కాంగ్రెసు నాయకుడు ‘హిందు పాకిస్థాన్‌’ అన్నాడు. పాకిస్థాన్‌లో లాగానే ఇక్కడ హిందూ తాలిబనిజం పెరుగుతున్నదని ప్రచారం చేస్తున్నాడు.

స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న నాయకులు ‘ధర్మం’ అనే శబ్దం తరచుగా ఉపయోగించేవారు. కాని నేడు అది అంటరానిదయింది. దానిలో మతతత్వం కనబడుతున్నది. దాని స్థానంలో ఇంకొక నూతన పదం తెచ్చారు. అదే ప్రస్తుతం అందరి చర్చల్లోనూ నలుగుతున్న ‘సెక్యులరిజం’. నిజానికి హిందుత్వంలో సెక్యులరిజం అంటే వాస్తవ అర్థం ‘ఏ మతానికి ప్రభుత్వంలో ప్రాధాన్యం ఉండదు. అన్ని మతాలు సమానమే’ అనేది. కాని ‘మైనారిటీ మతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం’గా సెక్యులరిజం అర్థాన్ని మార్చేశారు. అందుకే అది కుహనా సెక్యులరిజం అయింది. స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలను కదిలించిన విషయాలలో ప్రధానమైనది స్వదేశీ భావన. నేడు ఆ స్ఫూర్తి కనబటం లేదు. దాని స్థానంలో పాశ్చాత్య అనుకరణ ఎక్కువయింది.

ఇవన్నీ సాంస్కృతిక సమస్యలే. దేశం ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందినా ప్రజలలో సాంస్కృతిక ఐక్యత లేకపోతే జాతి మనుగడ ప్రశ్నార్ధకమవుతుంది. అందుకే మనమంతా మనలోని విభేదాలు మరచి సాంస్కృతికంగా ఒక్కటవ్వాలి. అప్పుడే స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందుతాయి. అప్పుడు మన భారత దేశం తిరిగి పునర్వైభవం సాధించ గలుగుతుంది. ప్రపంచానికి వెలుగులను అందించ గలుగుతుంది. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మన నాయకులు ఆశించింది ఇదే.

– రాంపల్లి మల్లికార్జునరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *