సిలువ మీద క్రైస్తవం

సిలువ మీద క్రైస్తవం

క్రైస్తవేతరులంతా ‘పాపులు’ అని ప్రకటిస్తూ ఉంటుంది క్రైస్తవం. కేథలిక్‌ చర్చ్‌ అయితే పవిత్రత అన్నమాట పలకడానికి తాను తప్ప ఇతర మతాలలో ఏ ఒక్కటీ కూడా అందుకు అర్హత లేనిదేనని చెప్పుకుంటుంది. కానీ బయటపడిన కొన్ని వాస్తవాల పట్ల కేథలిక్‌ చర్చ్‌ కంగు తిన్నదని అనుకోలేం. ఆ పని గతంలోనే పూర్తయింది. ఆ దశ దాటిపోయి చాలా కాలమే అయింది. తప్పని పరిస్థితులలో ఇప్పుడు అవి నిజాలేనని అంగీకరిస్తోంది కేథలిక్‌ చర్చ్‌. ఆ వాస్తవాలన్నీ ఘోరమైనవి. అమానవీయమైనవి. ”నిజమే, మేం భ్రమల్లో బతుకుతున్నాం. మా చర్చ్‌ పూజారులు, మత పెద్దలు పాపపు పనులు చేస్తున్న సంగతిని అంగీకరిస్తున్నాం’ అని వెల్లడించింది వాటికన్‌ నగరంలో జరుగుతున్న నాలుగు రోజుల గోష్ఠి. ఈ గోష్ఠిని ఏర్పాటు చేయడమంటే జరుగు తున్న తప్పిదాలు ఎంత ఘోరమైనవో అంగీకరించడమే. ఎంత విస్తృతంగా జరిగిపోతున్నాయో గుర్తించడమే. వాటి పట్ల భక్తులలో ఎంత క్షోభ ఉన్నదో వెల్లడించడం కూడా. ఇందులో పోప్‌ ఫ్రాన్సిస్‌తో పాటు 190 దేశాలకు చెందిన 114 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవడం మనముందు ఉన్న కర్తవ్యమని కేథలిక్‌ చర్చ్‌ పెద్దలు ఎలాంటి శషభిషలు లేకుండా అంగీకరించారు. నిజానికి ఈ ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు వాటికన్‌ నగరంలో జరిగిన ఈ గోష్ఠి కేథలిక్‌ క్రైస్తవ మత చరిత్రలోనే ప్రముఖంగా చెప్పుకునే ఘట్టంగా నమోదవుతుంది.

వాటికన్‌ సిటీలోనే హోలీ సీ సభా ప్రాంగణంలో ఏర్పాటైన ఈ గోష్ఠి ప్రధాన ఉద్దేశం – కేథలిక్‌ చర్చ్‌లో బాలల మీద జరుగుతున్న లైంగిక అత్యాచారాలు, వాటి నివారణ. 23వ తేదీన పోప్‌ మొత్తానికి ఒక ప్రకటన చేశారు. కేథలిక్‌ చర్చ్‌లో బాలుర మీద జరుగుతున్న లైంగిక అత్యాచారాలు క్రైస్తవేతర మతాలలో జరిగే జంతుబలులతో సమానమని అన్నారు. ఇక్కడ కూడా ఆయన అహంకారమే ప్రదర్శించారు. పాగన్‌ మతాలలో జంతుబలులతో బాలుర మీద జరుగుతున్న అత్యాచారాలను పోల్చడం అహంకారమే. కానీ ఈ మతాలలో కొన్ని జంతువులను చంపుతున్నారు. అక్కడ మానవ బాల్యం బలిపీఠం మీద నిలబడుతోంది.

‘బాధితులు చెప్పేది నమ్మడం అవసరం’ అన్నారు కేథలిక్‌ చర్చ్‌ పెద్దలు. పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రధానోపన్యాసం చేశారు. ఇలాంటివి జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో, వాటిలోని నిజా నిజాలను ఎలా గుర్తించాలో తెలియ చెప్పేందుకు పూజారులకీ, మత పెద్దలకీ కొన్ని సూచనలు చేస్తామని, తర్ఫీదు కూడా ఇస్తామని పోప్‌ స్వయంగా తయారు చేసి ఇచ్చిన 21 అంశాల ప్రణాళికలో హామీ ఇచ్చారు. దీనికి వాటికన్‌ బయట వేలాదిగా వేచి ఉన్న ప్రజలు, బాధితులు, వారి న్యాయవాదులు ‘ఇంతేనా!’ అంటూ పెదవి విరిచారు. కొందరు ఆగ్రహంతో మండిపడ్డారు. చర్చ్‌ బాధితులకు మద్దతుగా ఏర్పడిన ‘ఎండింగ్‌ క్లెర్జీ అబ్యూజ్‌’ (పూజారుల అత్యాచారాలకు అంతం కావాలి) సంస్థ అధ్యక్షుడు టిమ్‌ లా కూడా వీరిలో ఉన్నారు. ప్రస్తుతం పాశ్చాత్య దేశాలలో కేథలిక్‌ చర్చ్‌ పట్ల ప్రజలలో ఉన్న భావన ఇదే. ఆగ్రహం, క్షోభ, దగా పడ్డామన్న ఆవేదన.

కేథలిక్‌ చర్చ్‌లో చిన్నారులపై పూజారులు, మత పెద్దలు, చర్చ్‌ అధికారులు లైంగిక అత్యాచారాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఇప్పటివి కాదు (ఫైడోఫిలియా: బాలల మీద లైంగిక అత్యాచారాలకు ప్రేరేపించే మానసిక వ్యాధి. చర్చ్‌ మీద వస్తున్న బాలల లైంగిక అత్యాచారం ఉదంతాలను ఈ వ్యాధి పేరుతోనే ఉటంకించి చెబుతున్నారు). కానీ ఆ అత్యాచారాల మీద చర్యలు లేవు. బాధితులకు న్యాయం లేదు. దీని మీద ఎవరు గొంతెత్తినా వారిపైన మతద్వేషులుగా, దైవద్రోహులుగా ముద్ర వేయడం మరొకటి. చర్యల సంగతి అటుంచితే, ఆ వ్యవహారాలను విన డానికి కూడా పెద్దలు నిరాకరిస్తున్నారు. అంటే నిర్దాక్షణ్యంగా నోరు నొక్కుతున్నారు. ఐర్లాండ్‌, ఆస్ట్రేలియా, చిలీ దేశాలలో ఇలాంటి ఆరోపణలు గడచిన ముప్పయ్‌ సంవత్సరాలుగా వినిపిస్తున్నాయి. చర్చ్‌కు అప్ప గించిన బాలలు కనిపించకుండా పోయిన ఘటనలు జరిగాయి. అనుమానాస్పద పరిస్థితులలో చనిపోయి ఉండగా కనుగొన్న ఉదంతాలు కూడా ఉన్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల కేథలిక్‌ చర్చ్‌ మీద కూడా ఇలాంటి ఆరోపణలకు కొదవలేదు. ఎట్టకేలకు 2002 సంవత్సరంలో ‘ది బోస్టన్‌ గ్లోబ్‌’ పత్రిక బాంబులాంటి వార్తను లోకం మీదకు విసిరింది. బోస్టన్‌లోని క్రైస్తవ డైకోసిస్‌ అకృత్యాలకు సంబంధించిన వార్త అది. బాలల మీద జరిగిన అత్యాచారాలే అవన్నీ. దీనితో ఈ సమస్య పట్ల చర్చ్‌లో, బయటివారిలో ఆలోచన మొదలయింది. ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన వాస్తవాలు సమస్య తీవ్రతను వెల్లడించాయి. అక్కడ ఇలాంటి లైంగిక అత్యాచారాల గురించి ఆరోపణలను చర్చ్‌ కప్పి పెట్టింది. తమను శంకించడం, దురుద్దేశాలను ఆపాదించడం వంటి చర్చ్‌ చర్యలు కూడా బాధితులను తీవ్ర క్షోభకు గురి చేశాయి. విధి లేక బాధితులంతా గళం ఎత్తారు. చాలా దేశాలలో బిషప్‌లు, పూజారులు చేస్తున్న లైంగిక అత్యాచారాల గురించి క్రైస్తవ సన్యాసినులు (నన్స్‌) కూడా గొంతెత్తుతున్నారు. వీరి గాథలు మరింత విషాదం. మన దేశంలో కేరళలో జరిగింది కూడా అదే. ఈ నేపథ్యంలో ఇంత కాలం తరువాత మొత్తానికి పోప్‌ ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఆయన ఎంతో సంఘర్షణ పడ్డారని కూడా చెబుతున్నారు. ఇలాంటి ధోరణులు ప్రబలడం అంటే అది పోప్‌ వైఫల్యమన్న విమర్శలు కూడా చెలరేగడంతో అనివార్య పరిస్థితు లలో ఆయన ఇలా అందరి అభిప్రాయాలు వినడానికి ఇంత విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. ఇంకొక అంశం కూడా స్పష్టమవుతోంది. ఈ మధ్య పోప్‌ వెలుబుచ్చిన కొన్ని సామాజిక, లౌకిక అంశాల పట్ల మిగిలిన మత పెద్దల నుంచి కనీస స్పందన ఉండడం లేదు. దీనితో ఆయన మాటకు విలువ తగ్గుతోందన్న భావన బయలుదేరింది. ముఖ్యంగా వలసల గురించి, కాందిశీకుల గురించి, పేదరికం గురించి పోప్‌ ఆక్రోశించినా చర్చ్‌ ఆయన తరఫున మాట్లాడడం లేదు. ఈ నేపథ్యంలోనే పోప్‌ ఎంతో కీలక ప్రకటన చేస్తూ, ‘మాకు న్యాయం కావాలని కోరుతున్న పీల గొంతులను వినడానికే మనం ఇక్కడ సమావేశమయ్యాం’ అనడంలోనే ఆయన ఆవేదన కూడా అర్థమవుతుంది. ఇంకా, ‘ప్రజలు మన నుంచి కేవలం అత్యాచారాల పట్ల ఖండనమండనలనే కోరుకోవడం లేదు. ఇలాంటి వాటి పట్ల చర్చ్‌ గట్టిగా వ్యవహరించాలని వారు ఆకాంక్షిస్తున్నారు’ అని కూడా ఈ గోష్ఠిలోనే అన్నారు.

హోలీ సీ సభా ప్రాంగణంలోకి కేవలం చర్చ్‌ పూజారులు, కొన్ని దేశాలకు చెందిన బిషప్‌ సంఘాల అధ్యక్షులు, ఉన్నతాధికారులను అనుమతించారు. అందుకే వాటికన్‌ బయట నిరసనకారులు, బాధితుల తరఫువారు, ఉద్యమకారులు మీడియాతో నిరంతరం మాట్లాడుతూ సమస్య తీవ్రతను మరింత స్పష్టంగా ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇప్పుడు చర్చ్‌ విశ్వసనీయతతో పాటు పరువు కూడా మట్టి కలిసిందన్న పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని పెద్దలు గ్రహించబట్టే ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుని గోష్ఠి ఏర్పాటు చేశారు. ఇందుకు సంబం ధించిన వార్తలన్నీ వాషింగ్టన్‌ పోస్ట్‌, న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలలో ఫిబ్రవరి 21వ తేదీ నుంచి చూడవచ్చు. బీబీసీ ఈ విషయాలను సవివరంగా వ్యాఖ్యా నించింది. నిజానికి ప్రపంచ మీడియా ఈ అంశం మీద దృష్టి సారించింది. మన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో కూడా 22వ తేదీన ఒక వార్త వెలువడింది. ఫిబ్రవరి 25న ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ది హిందులలో కూడా ఇందుకు సంబంధించి పోప్‌ చెప్పిన విషయాలను వార్తల కాలమ్‌లలో గమనించవచ్చు.

ఈ విశేష గోష్ఠి ఐదుగురు బాధితుల కథనాలను విన్నది. వీరంతా నేరుగా హాజరు కావడానికీ, పేరు వెల్లడించడానికీ నిరాకరించినవారే. అందుకే ముందుగా రికార్డు చేసిన వారి వాంగ్మూలాలను గోష్ఠి ఆలకించింది. ఇందులో ఆఫ్రికాకు చెందిన ఒక మహిళ గాథ మరీ హృదయ విదారకంగా ఉంది. ప్రీస్ట్‌ (చర్చ్‌ పూజారి) 13 సంవత్సరాల పాటు తనపై లైంగిక అత్యాచారం సాగించాడనీ, మూడుసార్లు గర్భం దాల్చగా, మూడుసార్లు కూడా గర్భస్రావం చేయించుకోవలసిందంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆ పని చేయించాడని, ఇందుకు తనను ఒప్పించడానికి భౌతికదాడికి కూడా పాల్పడ్డాడని ఆమె వివరించారు. ఈ దురాగతం 13 సంవత్సరాలు కొనసాగడమే కాదు, ఆమె 15వ ఏట ఆరంభమైంది. అంటే మైనర్‌ బాలికగా ఉండగానే ఆమె అత్యాచారానికి బలైంది. మరొక బాధితుడు లేదా బాధితురాలు ‘మీరు ఆత్మలకు స్వస్థత చేకూర్చే వైద్యులు. కానీ కొందరు ఇందుకు మినహాయింపు. వారు ఆత్మలకు స్వస్థత కూర్చే వారిగా కాకుండా వాటిని హత్య చేసే హంతకులుగా పరిణామం చెందారు’ అని ఆ గొంతు వాపోయింది. నా మీద పూజారి లైంగిక అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేశాను. పెద్దలు పట్టించుకోకపోగా తనను చర్చ్‌ పాలిట ద్రోహిగా చిత్రించడం ఆరం భించారు. చర్చ్‌ బాధితులను విశ్వసించడం లేదు అని ఆ గొంతు ఆక్రోశించింది. చిలీకి చెందిన జాన్‌ కార్లోస్‌ క్రజ్‌ కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు.

ఇదంతా విని ఫిలిప్పీన్స్‌ నుంచి వచ్చిన కార్డినల్‌ లూయి ఆంటోనియో గద్గద స్వరంతో ఇలా అన్నారు, ‘బిషప్పులు చేసిన గాయాలు వారిని బాధిస్తున్నాయి. మనం సాయం అందించవలసి ఉంది’. వీటిపై చర్యలు తీసుకోవడానికే చర్చ్‌ మొగ్గు చూపుతోందని చర్చ్‌ లైంగిక నేరాల దర్యాప్తు అధికారి ఆర్చిబిషప్‌ చాల్స్‌ సిక్లునా విలేకరుల సమావేశంలో చెప్పడం మరొక విశేషం. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు చర్చ్‌ అధికారులు పౌర అధికారులకు సహకారం ఇచ్చి అయినా నిందితులను బాధ్యులను చేయాలని, తప్పించుకునే అవకాశం ఇవ్వరాదని కొందరు కోరుతున్నారు. అంటే ఇంటిదొంగను శిక్షించే సాహసం మీకు లేకుంటే బాధితులకు న్యాయం జరగడానికి పౌర అధికారుల జోక్యాన్ని అనుమ తించాలని వారు బాహాటంగానే కోరినట్టయింది. అసలు చర్చ్‌ని అడ్డం పెట్టుకుని అత్యాచారాలకు పాల్పడేవారి పట్ల అణు మాత్రం సహిష్ణుత అవసరం లేదని బాధితుల తరఫువారు వాదిస్తున్నారు.

ఇప్పుడు మొత్తంగా కేథలిక్‌ చర్చ్‌ తనకు తానై బోనులో నిలబడింది. చిన్నారులపై లైంగిక అత్యా చారాల గురించి చర్చించేందుకు ఏర్పాటైన ఈ గోష్ఠిలోనే ‘కేథలిక్‌ చర్చ్‌లో విస్తారంగా వ్యాపించి ఉన్న స్వలింగ సంపర్కం’ గురించి కూడా కొందరు చర్చించాలని అనుకున్నారు. అసలు ఈ అంశం మీద 550 పేజీల పుస్తకాన్ని విడుదల చేశారు. కేథలిక్‌ చర్చ్‌ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద స్వలింగ సంపర్క కేంద్రమని అందులో రాసుకున్నారు. అంతా చూస్తే చర్చ్‌ మొదట తన అంత:శత్రువులతో పోరాడ వలసి వస్తోందని అర్థమయిందని కొందరు బిషప్పులు, పూజారులు పేర్కొనడం విశేషం.

క్రైస్తవ చర్చ్‌ పూజారుల వల్ల క్రైస్తవ సన్యాసినులు లైంగిక అత్యాచారాలకు గురి కావడం అంతటా ఉందని సాక్షాత్తు పోప్‌ ఫ్రాన్సిస్‌ అంగీకరించడం (ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఫిబ్రవరి 7, 2019) విశేషం. ఈ ప్రకటన కూడా ఫ్రాన్సిస్‌ వాటికన్‌ నగరం నుంచే చేయడం మరీ విశేషం.

(కేథలిక్‌ చర్చ్‌) పూజారులు క్రైస్తవ సన్యాసినులను (నన్స్‌)లైంగిక బానిసలుగా ఉపయోగించుకున్నారనీ, ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉండవచ్చునని ఆయన అన్నారు. ఇది కేథలిక్‌ చర్చ్‌కు సంబంధించిన సంక్షోభాలలో ఒక కొత్త అధ్యాయమని ఆనాడు వ్యాఖ్య వినిపించింది. వారిని పూజారులు, బిషప్పులు లైంగికంగా ఉపయోగించుకుంటున్నారని ఆయన బాహాటంగానే అంగీకరించారు. పోప్‌ నుంచి ఇలాంటి వ్యాఖ్య వినపడడం చరిత్రలో ఇదే ప్రథమ మని వాటికన్‌ నుంచి వెలువడే మహిళల పత్రిక ఎడిటర్‌ లుసెట్టా స్కార్ఫియా అన్నారు. చిన్నారుల మీద, క్రైస్తవ సన్యాసినుల మీద లైంగిక అత్యాచారాల ఆరోపణలు వెల్లువెత్తాయని, ఎందరినో సస్పెండ్‌ చేయడం కూడా జరిగిందని వాటికన్‌ తరువాత వివరణ ఇచ్చింది.

ఈ స్థితిలో ఉన్న కేథలిక్‌ చర్చ్‌ ఇతర మతాలను దూషించే పనికి స్వస్తి చెప్పడం మంచిది. వారే తీర్మానించుకున్నట్టు ముందు వారి ఇల్లు చక్కబెట్టు కుంటే మంచిది. భారతదేశంలో క్రైస్తవ సంస్థల ఆగడాలకు మితిలేకుండా పోతోంది. ప్రలోభాలతో మత మార్పిడులకు పాల్పడడం సర్వసాధారణంగా మారింది. అలాంటి అమాయకులు కేథలిక్‌ చర్చ్‌ స్వీయ దోషాంగీకారం గురించి తెలుసుకుంటే మంచిది. క్రైస్తవ మత పెద్దల గురించి స్థానికుల నుంచి కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటిని అయినా దృష్టిలో ఉంచుకుని అమాయకంగా మతం మారే పద్ధతికి స్వస్తి పలకాలి. పాపుల విముక్తికి క్రీస్తు సిలువ ఎక్కాడు. ఇప్పుడు ఆ మత పెద్దలు పాపపు పనుల కోసం క్రైస్తవాన్ని సిలువ ఎక్కించారు.

కేరళలో ఏం జరుగుతున్నదో చూడరాదా!

కేరళ కేథలిక్‌ చర్చ్‌లో ఇలాంటి దారుణాలు రెండు దశాబ్దాల క్రితమే చోటు చేసుకున్నాయి. ఇందుకు తిరుగులేని సాక్ష్యం క్రైస్తవ సన్యాసిని మేరీ చాందీ (67, అప్పటి వయసు). ఆమె తన ఆత్మకథ కూడా రాశారు. దీని పేరు ‘స్వాస్థి’. చర్చ్‌లో లైంగిక అత్యాచారాల గురించి అంతకు ముందు మరొక పుస్తకం గురించి కూడా ఆమె చెప్పారు. అది సిస్టర్‌ జిస్మే రాసిన ‘ఆమెన్‌: ది ఆటోబయోగ్రఫి ఆఫ్‌ ఏ నన్‌’.

ఈ సంగతులు వాటికన్‌కు తెలుసో లేదో మరి! కేరళ కేథలిక్‌ చర్చ్‌ అధీనంలోని ప్రెజెంటేషన్‌ కాన్వెంట్‌లో మేరీ చాందీ క్రైస్తవ సన్యాసినిగా ఉండేవారు. ఒక ప్రీస్ట్‌ తనపై అత్యాచారం చేయడం, ఆ సంగతి మత పెద్దలకు చెబితే తనను సన్యాసినిగా ఉండడానికి అనర్హురాలివంటూ ముద్ర వేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన చాందీ చివరకు ఆ దీక్షకు స్వస్తి పలికి, ఒక చిన్న అనాథాశ్రమం ఆరంభించారు (మార్చి 31, 2012 నాటి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ఈ కథనం వెలువడింది). చర్చ్‌లో తను చూసిన ‘వ్యభిచారం’ గురించి ఆ పుస్తకంలో రాయాలని ఆమె సంకల్పించారు. లైంగిక కోరికలను చంపుకోలే మనుకున్నప్పుడు ఇలాంటి దీక్షకు పూనుకోరాదు. బ్రహ్మచర్యం గురించి చెప్పరాదు’ అన్నారామె. కాన్వెంట్‌లలో (చర్చ్‌ విభాగాలలో) యువ క్రైస్తవ సన్యాసినుల మీద అత్యాచారాలు, తరువాత వారు గర్భం దాల్చడం, పసికందులను టాయ్‌లెట్లలో పెట్టి చంపేందుకు సిద్ధం కావడం మామూలేనని ఆమె వివరించారు. అయితే అలా చంపబోయిన ఒక పసికందును ఆమె రక్షించి పెద్ద చేశారు. అప్పుడు ఆ సంగతులన్నీ గడప దాటలేదు.

ఇటీవలి కాలంలో చూస్తే, కేరళ చర్చ్‌లో యువ క్రైస్తవ సన్యాసినులు తమ దీక్షకు స్వస్తి పలికి లౌకిక ప్రపంచంలోకి రావడం సాధరణంగా జరుగుతూనే ఉంటుంది. అక్కడి కాన్వెంట్లు అంత దారుణంగా ఉంటాయని ఆరోపణ. కాని ఈ సంప్రదాయానికి కొత్త అంశం వచ్చి చేరింది. అలా చర్చ్‌ సేవకు వీడ్కోలు పలుకుతున్న పలువురు క్రైస్తవ సన్యాసినులు తమ మీద లైంగిక దాడులు జరిగాయంటూ ఆరోపణలు చేయడం కొత్త పరిణామం. ఈ సంగతి వాటికన్‌ సిటీకి తెలుసునో లేదో!

కేరళలో చర్చ్‌ దురాగతాలకు తలమానికమైనది ఇటీవలనే జరిగింది. అది ఫ్రాంకో ములక్కల్‌ వ్యవహారం. అక్కడ జలంధర్‌ బిషప్‌ ములక్కల్‌ (సిరో మలబార్‌ చర్చ్‌) మీద లైంగిక అత్యాచారం ఆరోపణ స్పష్టంగా వచ్చింది. ఈ కామ పిశాచి మీద చర్య తీసుకోవలసిందేనని ఆ రాష్ట్ర డీజీపీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఇప్పుడు అతడు ఆ పదవిలో లేడు. అయినా అక్కడ సీపీఎం ప్రభుత్వం ములక్కల్‌ను నిస్సుగ్గుగా రక్షించింది. ఇతడు ఒక క్రైస్తవ సన్యాసినిపై లైంగిక అత్యాచారం చేశాడని ఆరోపణ. దీని మీద గొడవ జరిగింది. దేశం, చర్చ్‌ కూడా కంగు తిన్నాయి. దీనితో ఒక క్రిమినల్‌ రాజకీయవేత్తను మించి ములక్కల్‌ వ్యవహరించారు. మొదట ఆ బాధితురాలి బదిలీ కోసం ఆమె సోదరుడు తనను హత్య చేస్తానని బెదిరిస్తున్నాడని ములక్కల్‌ తన సహాయకుని ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జూన్‌ 23, 2018న జరిగింది. తరువాత ఆమె (మిషనరీస్‌ ఆఫ్‌ జీసస్‌ సంస్థ) ఫిర్యాదు పోలీసులకు అందింది. 2014, మే నెల నుంచి తనను బిషప్‌ వెంటాడుతున్నాడంటూ ఆమె ఇచ్చిన ఫిర్యాదులో అన్నీ వాస్తవంగానే ఉన్నాయి. ఆమె పనిచేస్తున్న కాన్వెంట్‌ నుంచి సందర్శకుల జాబితాలో ఇందుకు సంబం ధించి గట్టి ఆధారమే దొరికింది. ఇతడిని జలంధర్‌లో ప్రశ్నించారు. ఆ సమయంలో ఆ వార్తను తీసుకోవ డానికి వెళ్లిన మీడియా మీద అతడి అనుచరులు దౌర్జన్యం చేశారు. ఇంకా చిత్రం ఏమిటంటే, బాధితురాలి కుటుంబాన్ని కొనడానికి కూడా ఈ ములక్కల్‌ ఎర వేశాడు. కొంత భూమి, డబ్బు ఇస్తామంటూ బాధితురాలి సోదరుడితో రాయబారం నడిపేందుకు ములక్కల్‌ యత్నించాడు. నిజానికి కేరళ చర్చ్‌లో ఏ వివాదం వచ్చినా గడప దాటదు. లోపలే అణగిపోతుంది. అలాంటిది సెప్టెంబర్‌ 8, 2018న చర్చ్‌కు సంబంధించిన పూజారులు, క్రైస్తవ సన్యాసినులు హైకోర్టు వరకు నిరసన ప్రదర్శన నిర్వ హించారు. బాధితురాలు పనిచేస్తున్న కురవిలింగాడ్‌ కాన్వెంట్‌ నుంచి ఈ ప్రదర్శన ప్రారంభమైంది. దీని తరువాత మరో ఇద్దరు క్రైస్తవ సన్యాసినులు నోరు విప్పారు. తాము ములక్కల్‌ను అరెస్టు చేసేవరకు నిరసన విరమించబోమని వారు హెచ్చరించారు. కేరళ చర్చ్‌ రిఫార్మేషన్‌ మూవ్‌మెంట్‌ పేరుతో లోపలి అత్యాచారాల మీద తిరుగుబాటు మొదలయింది.

చిత్రం ఏమిటంటే అక్కడి సీపీఎం ప్రభుత్వం ములక్కల్‌ను వెనకేసుకురావడం. ములక్కల్‌ మీద చర్య అనివార్యమేనని డీజీపీ నివేదిక ఇచ్చాడు. అయినప్పటికీ ఎలాంటి చర్యకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించలేదు. కానీ అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశం మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని చూసింది. అలాగే ములక్కల్‌ మీద చర్య తీసుకునే విషయంలో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తున్నది. ములక్కల్‌ ఆమె మీద 2014-2016 మధ్య 13 సందర్భాలలో లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణ.

ఐదేళ్ల నాడే చీకొట్టిన ఐరాస

కేథలిక్‌ చర్చ్‌ పూజారుల చేతిలో బాలురు లైంగిక అత్యాచారాలకు బలౌతున్న సంగతి తనకు ఇవాళే తెలిసినట్టు పోప్‌ వ్యవహరించవచ్చు. ఇంత పెద్ద గోష్ఠి పెట్టి మాట్లాడవచ్చు. కానీ ఈ అంశాన్ని 2014 ఏప్రిల్‌ మాసంలోనే ఐక్య రాజ్యసమితి పిల్లల హక్కుల సంఘం లేవనెత్తింది. అసలు పిల్లల మీద పూజారులు లైంగిక అత్యాచారాలు జరిపేందుకు వీలు కల్పిస్తూ వాటికన్‌ ఒక పద్ధతి ప్రకారం విధానాలను రూపొందిస్తున్నదని ఆనాడు ఐక్య రాజ్యసమితి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ దారుణాలు కేథలిక్‌ చర్చ్‌ విశ్వసనీయతను ప్రశిస్తున్నాయని కూడా ఆయన చెప్పారు. అలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారి మీద ఆంక్షలు విధించవలసిందేనని కూడా ఎలుగెత్తి చాటారు. కానీ అప్పటి నుంచి బాలల మీద ఇలాంటి అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఈ గోష్ఠిని బట్టి అర్థం కావడం లేదా?

నిజానికి బాలుర మీద కేథలిక్‌ చర్చ్‌ పూజారులు చేస్తున్న లైంగిక అత్యాచారాల గురించి బహిరంగంగా విచారించడానికి 1970 వరకు అవకాశమే ఉండేది కాదు. కానీ 1980 దశాబ్దంలో అమెరికా, కెనడాలలో వెలుగు చూసిన ఇలాంటి అత్యాచారాలు మొదటిసారి చర్చనీయాంశంగా మారాయి. అప్పుడు కూడా ఆ బాలలకు న్యాయం జరగలేదు. 1975-2004 మధ్య ఇలాంటి తీవ్ర ఆరోపణల గురించి చర్చించడానికి వినడానికీ డబ్లిన్‌ ఆర్చ్‌బిషప్పులు అనుమతించేవారే కాదు. కానీ 1990 దశాబ్దంలో ఐర్లాండ్‌ కేథలిక్‌ చర్చ్‌లో ఇదొక సర్వసాధారణ వ్యాధిగా కొనసాగుతోందని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ తరువాత పన్నెండు దేశాలలో ఇదే విధంగా ఆక్రోశం వినిపించింది.

ఈ నేపథ్యంలోనే 2010లోనే బిషప్పులు, పూజారుల వైఖరి గురించి మరొక తీవ్ర అంశం బయటపడింది. ఇది కూడా ఐర్లాండ్‌లోనిదే. 1975లో అక్కడి కేథలిక్‌ చర్చ్‌లో ఒక సమావేశం ఏర్పాటయింది. అందులో కార్డినల్‌ సీన్‌ బ్రాడే పాల్గన్నారు. తమపై లైంగిక అత్యాచారాలు జరిగాయంటూ ఫిర్యాదు చేసిన బాలురు అందరి చేత ఇక ఆ అంశం మాట్లాడబోమని అక్కడ ప్రమాణ పత్రాలు రాయించారు. తాము ఫాదర్‌ బ్రెండన్‌ స్మిత్‌ చేతిలో అత్యాచారానికి బలైనట్టు అంతకు ముందు ఆ బాలలు ఫిర్యాదులు రాశారు.తరువాత ఎప్పుడు పోప్‌ బెనడిక్ట్‌ 16 ఇలా కేథలిక్‌ చర్చ్‌కి క్షమాపణ పత్రాలు రాసి ఇచ్చిన వారందరికీ క్షమాపణలు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *