కాంగ్రెస్‌కు లోకసభలో లెంపకాయ, రాజ్యసభలో మొట్టికాయ

కాంగ్రెస్‌కు లోకసభలో లెంపకాయ, రాజ్యసభలో మొట్టికాయ

రాజ్యసభ ఉపాధ్యక్ష పదవి ఎన్నిక రానున్న ఎన్నికలకు రాజకీయ రిహార్సల్‌! వివిధ కూటముల బలాబలాల మొహరింపుకు ఇది ముందస్తు సూచన. కాంగ్రెస్‌ కొత్త మిత్రులను పొందలేకపోతోందన్న వాస్తవాన్ని ఈ ఎన్నిక ఎత్తి చూపింది. మరో విషయం ఏమిటంటే కాంగ్రెస్‌కు లోకసభలో అవిశ్వాస పరాజయం, రాజ్యసభలో ఉపాధ్యక్ష ఎన్నికలో ఓటమి – ఈ రెండింటి పుణ్యమా అని ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా జరగటం గమనార్హం.

రాజకీయాల్లో వారం అంటే చాలా కాలం కింద లెక్క. అలాంటిది మూడు నెలల కాలం ఒక యుగానితో సమానం. మూడు నెలల క్రితం కాంగ్రెస్‌ నాయకత్వంలో ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడిపోతాయని, నరేంద్ర మోదీ కుర్చీ కాళ్లు విరిచేస్తామని బెంగుళూరులో కుమారస్వామి ప్రమాణ స్వీకార సమయంలో కాంగ్రెస్‌, మరికొన్ని పార్టీలు ప్రగల్భించాయి. దేశంలో కొన్ని పత్రికలు కూడా ఈ గోరంత పరిణామాన్ని కొండంత పరిమాణంలో చూపించేందుకు శాయశక్తులా కషి చేశాయి.

కానీ మూడు నెలలు కూడా కాకుండానే కథ తారుమారైంది. రాజకీయ పెండ్యులం అటు నుంచి ఇటు వైపుకు వచ్చింది. రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్‌ దాదాపు ఏకపక్షంగా ప్రకటించింది. దానితో కాంగ్రెసేతర, బిజెపియేతర పార్టీల్లో ఉన్నట్టుండి పంతం పెరిగింది. ఒక పార్టీ కూడా రాహుల్‌ అభ్యర్థిత్వానికి సాహో అనలేదు. ఒక్క జనతాదళ్‌ రాహుల్‌ను సమర్థించింది. అది వాళ్ల ఖర్మం. ఎందుకంటే కర్నాటక కుంటి ప్రభుత్వానికి కాంగ్రెస్‌ పార్టీయే కృత్రిమ కాలు లాంటిది. వాళ్లకు తప్పదు. కానీ నాలుగైదు రోజుల్లోనే దేవెగౌడ మాట మార్చేశాడు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అయితే 2019 ఎన్నికల ఫలితాలు వెలువడ్డాకే ప్రధానమంత్రి ఎవరన్నది నిర్ణయిస్తామని ప్రకటించింది. దీని వెనువెంటనే లోకసభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలోనూ విపక్షాలు ఖంగు తిన్నాయి. సంఖ్యాబలం బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా ఉందన్న విషయం అందరికీ తెలిసినదే అయినా, కాంగ్రెస్‌ విపక్షాలన్నిటినీ కూడట్టుకోవడంలో విఫలమైంది. పలు ప్రాంతీయ పార్టీలు మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వోటు వేశాయి. బిజూ జనతా దళ్‌ వంటి పార్టీలు వోటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. దీనితో విపక్షాల మొత్తం ప్రయత్నం బెడిసికొట్టింది. ఎన్‌డీఏ మరింత బలోపేతమైంది.

రాజ్యసభలో పప్పులో కాలేసిన కాంగ్రెస్‌

ఈ వెనువెంటనే రాజ్యసభ ఉపాధ్యక్ష పదవి ఎన్నిక జరిగింది. దీనిలో ఎన్‌డీఏ అభ్యర్థి హరివంశ నారాయణ్‌ సింగ్‌ విజయం ఊహించినదే. ఆయనకు 125 వోట్లు వచ్చాయి. యూపీయే అభ్యర్థి బికె హరిప్రసాద్‌కి 105 వోట్లు పడ్డాయి. వాస్తవానికి బిజెపి నేతృత్వంలోని కూటమికి 93 వోట్లే ఉన్నాయి. ఎన్‌డీఏకి గెలిచేందుకు 123 ఓట్లు కావాలి. అంటే మరో ఇరవై ఓట్లు సాధించుకోవాలి. కానీ బిజెపి 125 వోట్లు సంపాదించుకుంది. కాంగ్రెస్‌ నేతృత్వం లోని విపక్షాలకు 115 వోట్లు ఉన్నాయి. మరో ఎనిమిది ఓట్లు మాత్రమే సంపాదించుకోవాలి. తటస్థంగా ఉన్న వోట్లు 35. కానీ కాంగ్రెస్‌ ఈ 35 ఓట్లలోనుంచి ఒక్క ఓటును కూడా సాధించలేదు. వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు ఇద్దరు, మహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ సభ్యులు ఇద్దరూ వోటింగ్‌లో పాల్గొనకుండా ఉండిపోయారు. తమాషా ఏమిటంటే కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా ఉన్న డీఎంకే సభ్యులనూ వోటింగ్‌కు రప్పించుకోలేకపోయింది. పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు కూడా వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. దీనిని బట్టే కాంగ్రెస్‌ చిల్లు కుండను నీటితో నింపేందుకు అనవసరంగా ఆవేశపడిందని అర్థమైపోయింది.

2019కి రాజకీయ రిహార్సల్‌

నిజానికి రాజ్యసభ ఉపాధ్యక్ష పదవి ఎన్నిక అసలు ప్రాధాన్యం ఏమిటంటే ఇది రాబోయే రోజుల్లో రానున్న ఎన్నికలకు రాజకీయ రిహార్సల్‌! వివిధ కూటముల బలాబలాల మొహరింపుకు ఇది ముందస్తు సూచన లాంటిది. అన్నిటికన్నా ప్రధానమైన విషయం ఏమిటంటే రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నిక కాంగ్రెస్‌ కొత్త మిత్రులను పొందలేక పోతోందన్న వాస్తవాన్ని ఎత్తి చూపింది. ఆఖరికి బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పీడీపీ, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ లను కూడా దగ్గరకు తెచ్చుకోవడంలో కాంగ్రెస్‌ వ్యూహకర్తలు వైఫల్యం చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు ఉండే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేయలేదన్నది సుస్పష్టం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సహకరించిన మరో కొత్త పార్టీ తెలుగుదేశం పార్టీయే. అంతకు ముందు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సమయం లోనూ టీడీపీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేసింది. దాదాపు నాలుగు దశాబ్దాల కాంగ్రెస్‌ వ్యతిరేక రాజకీయాలకు తిలాంజలి ఇచ్చి, ఎన్టీఆర్‌ ఆలోచనా విధానాన్ని పాతరేసి తెలుగుదేశం రాజకీయ ఆత్మహత్యకు రెడీ అయింది. ఇది ఇరు పార్టీలకూ ఉపయోగపడని కూటమి. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి మంత్ర సానితనం చేసిన ఫెడరల్‌ ఫ్రంట్‌ కానీ, మమతా బెనర్జీ ప్రతిపాదించిన మూడవ ఫ్రంట్‌ కానీ, వామ పక్షాలు ముందుకు తెస్తున్న బిజెపియేతర, కాంగ్రెసే తర ఫ్రంట్‌ కానీ పుట్టకుండానే చచ్చిపోయాయన్నది రాజ్యసభ ఎన్నికల ఫలితం చెప్పక చెబుతున్న సందేశం.

బిజెపి పరిపక్వ రాజకీయ వ్యూహం

కానీ బిజెపి పరిపక్వ రాజకీయ వ్యూహాన్ని, పరిణతిని ప్రదర్శించింది. జనతాదళ్‌ యునైటెడ్‌ అభ్యర్థిని ముందుకు తెచ్చి ఆ పార్టీ వేరే వైపు చూడకుండా నిలువరించగలిగింది. మరోవైపు అవిశ్వాసం సమయంలో తటస్థంగా ఉన్న బిజూ జనతాదళ్‌, తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్డీయే అభ్యర్థికే వోటు వేశాయి. అన్నాడీఎంకె, బిజూ జనతాదళ్‌, టీఆర్‌ఎస్‌లు కాంగ్రెస్‌ వైపు తక్షణం వెళ్లే అవకాశాలు తక్కువ. అలాగే శివసేన అదుపు తప్పిన వృషభంలా ఎన్ని రంకెలు వేసినా చిట్టచివరికి బిజెపితో ఉంటేనే మేలని కాస్త ఆలస్యంగానైనా గుర్తించింది.

రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల్లో తేటతెల్లమౌతున్న మరో అంశం ఏమిటంటే దేశ రాజకీయం స్పష్టంగా రెండు కూటముల దిశగా వెళ్తోంది. ఒకటి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే. రెండవది బిజెపిని వ్యతిరేకించే పార్టీలు. తృణమూల్‌, సమాజవాదీ, ఆర్‌జేడీ వంటి పార్టీలు కాంగ్రెస్‌తో పాటే ఉండ బోతున్నాయి. అయితే ఆ కూటమికి నాయకత్వం వహించేదెవరన్నదే ఆసక్తికరమైన ప్రశ్న.

ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్‌లో లోకసభ ఎన్నికల దృష్ట్యా విపక్షాల ఎన్నికల పొత్తు విషయంలో చర్చలు జరుగుతున్నాయి. అఖిలేశ్‌ యాదవ్‌ నాయకత్వంలోని సమాజవాదీ పార్టీ, మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్‌ పార్టీ, మాజీ ప్రధాని చౌధురీ చరణ్‌ సింగ్‌ కుమారుడ్‌ అజిత్‌ సింగ్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ లోకదళ్‌లు కలిసి సీట్ల పంపకం గురించి విడతల వారీగా చర్చలు జరుపు తున్నాయి. ఈ చర్చల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఆహ్వానమే లేదు. మా పంపకం తేలిన తరువాత సీట్లు మిగిలితే అవి కాంగ్రెస్‌కి ఇస్తాం అని అఖిలేశ్‌ యాదవ్‌ నిర్మొహమాటంగా ప్రకటించారు. కాబట్టి ఎప్పట్లాగే కాంగ్రెస్‌ యూపీ, బీహార్లలో ఆటలో అరటిపండుగా మాత్రమే మిగిలిపోనుంది. యూపీ బీహార్లలో ఆటలో అరటిపండుగా, తమిళనాడు, గుజరాత్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో పదిహేనేసి ఏళ్లుగా అధికారం పొందలేని కాంగ్రెస్‌ బిజెపి వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించగలుగుతుందా? రాహుల్‌ నాయకత్వాన్ని మిగతా పార్టీలు అంగీకరిస్తాయా అన్నది రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల తరువాత ఖచ్చితంగా చర్చకు వస్తుంది.

ఓటమితో చతికిలబడ్డ విపక్షాలు

లోకసభ అవిశ్వాస పరాజయం, రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికలో ఓటమి – ఈ రెండింటి పుణ్యమా అని ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చాలా సజావుగా జరిగాయి. 2000 వ సంవత్సరం తరువాత ఇంత ఫలప్రదంగా జరిగిన పార్లమెంటు సమావేశాలు ఇవే కావడం గమనార్హం. పార్లమెంటు ఎజెండా ప్రకారం జరిగింది. ఈసారి సమావేశాల్లో 21 బిల్లులు, సవరణలు ఆమోదం పొందాయి. అందులో షెడ్యూల్డు కులాలు, తెగలపై అత్యాచార నివారణ చట్టం సవరణ బిల్లు, మనుషుల అక్రమ రవాణా నిరోధక బిల్లు, వెనుకబడిన తరగతుల జాతీయ కమీషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే బిల్లు వంటివి ముఖ్యమైనవి. అదేవిధంగా ఎన్నారైలు తమ ప్రతినిధుల సాయంతో ఓటు వేసేందుకు వీలు కల్పించే బిల్లు కూడా ఉంది. మొత్తం ఇరవై బిల్లులను ప్రవేశపెట్టగా అందులో 18 బిల్లులు ఆమోదం పొందాయి. ఇది కూడా ఒక మంచి పరిణామం. అదే విధంగా ఈ వర్షాకాల సమావేశాలలో ప్రశ్నోత్తరాల సమయం ఈ పదహారవ లోకసభలో ఇప్పటి వరకూ అత్యుత్తమ సమయం. రాజ్యసభ కూడా లెజిస్లేటివ్‌ బిజినెస్‌ను చాలా బాగా కొనసాగించగలిగింది. లోకసభ సభా నిర్వహణకు కేటాయించిన సమయాన్ని మించి మరీ పనిచేసింది. లోకసభ 110 శాతం సమయం పనిచేసింది. రాజ్యసభ కూడా 66 శాతం సమయాన్ని సమర్థ వంతంగా ఉపయోగించుకోగలిగింది.

మొత్తం మీద రాగల రోజులలో కాగల కార్యాన్ని తీర్చేందుకు కావలసిన సమీకరణలు, సంతులనాలను రాజ్యసభ ఉపాధ్యక్ష పదవి ఎన్నిక చూపించేసింది. కాంగ్రెస్‌, బిజెపి వ్యతిరేక పార్టీలకు ఈ పాటికే చాలా విషయాలు అర్థమైపోయి ఉంటాయి.

– రాకా సుధాకర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *