చైనా నయా వలసవాదాన్ని అడ్డుకున్న మలేషియా

చైనా నయా వలసవాదాన్ని అడ్డుకున్న మలేషియా

వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ (OBOR) ను చైనా కొత్త పేరుతో బెల్ట్‌ రోడ్‌ పధకం (BRI) అని పిలుస్తోంది. దీని ద్వారా చైనా ఆర్ధిక సామ్రాజ్యవాద విధానపు వలలో చిక్కి అనేక దేశాలు విలవిలలాడుతున్నాయి. ఈ పధకాల వల్ల తమతో కలిసే దేశాలకు లాభమే చేకూరుతుంది తప్ప నష్టం లేదని చైనా చెపుతున్నా, నిజానికి చైనా అమలుచేస్తున్న ఈ కొత్త తరహా ‘అప్పుల ఊబి దౌత్యవిధానం’ వల్ల ఆయా దేశాలు కుదేలవుతున్నాయి. చైనాకు తమ హంబన్‌తోట నౌకాశ్రయాన్ని 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చిన శ్రీలంక ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. అయినా చైనా తన ఆర్ధిక సామ్రాజ్యవాద ప్రయత్నాలకు స్వస్తి చెప్పలేదు. నిరంకుశ పాలనలో ఉన్న, ఆర్ధికంగా చితికిపోయిన చిన్న దేశాలపై తన పంజా విసురుతోంది. చైనా బెదిరింపులు, ఆర్ధిక పరిస్థితుల వల్ల ఆయా దేశాలు కూడా చైనాను కాదనలేకపోతున్నాయి.

ఇటీవల మలేషియా ఎన్నికల్లో కూడా పెరుగుతున్న అప్పులే ప్రధాన అంశమయ్యాయి. 22 ఏళ్లపాటు దేశ ప్రధాని బాధ్యతలు నిర్వర్తించి, బాధ్యతలకు దూరంగా ఉన్న మహతిర్‌ మహ్మద్‌ దిగజారుతున్న దేశపు ఆర్ధిక పరిస్థితి, పెరిగిపోయిన అప్పులను చూసి మళ్ళీ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారు. మలేషియా అప్పు 290 బిలియన్‌ డాలర్లకు మించడానికి కారణం చైనా ఆర్ధిక విధానాలను అనుసరించడమేనని ఆయన కుండబద్దలు కొట్టారు.

2012 వరకు మలేషియాలో చైనా పెట్టుబడులు చాలా తక్కువ. అప్పటి వరకు మొత్తం ఆసియన్‌ దేశాల్లో అత్యధిక పెట్టుబడులు సింగపూర్‌లో ఉండేవి. ూదీూ= పథకం ద్వారా నౌకాయాన రంగంలో తిరుగులేని ఆధిపత్యం సంపాదించాలనుకున్న చైనా ఇందుకు మలేషియా వ్యూహాత్మకంగా కీలకమైనదని గుర్తించింది. దానితో మలేషియాలో చైనా పెట్టు బడులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2015లో మలేషియా ప్రధాని నజీబ్‌ రజాక్‌ చైనా పర్యటన కూడా చేశారు. ఆ పర్యటనలో అనేక ఒప్పందాలపై సంతకాలు చేశారు. 2013 నుండి 2017 మధ్య కాలంలో మలేషియాలో చైనా పెట్టుబడులు ఏకంగా 350 శాతం పెరిగిపోయాయి. అవినీతిలో కూరుకు పోయిన రజాక్‌ ప్రభుత్వం దేశ ఆర్ధిక రంగాన్ని చక్కదిద్దేందుకు చైనా పెట్టుబడులను ఆహ్వానించింది.

విపరీతంగా వచ్చిపడుతున్న చైనా పెట్టుబడులను చూసి మలేషియాలో ఆర్ధికవేత్తలు నిర్ఘాంతపోయారు. ఈ విషయమై రజాక్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉన్న నౌకాశ్రయాలు నిరుపయోగంగా పడి ఉన్నప్పుడు కొత్తవాటిని నిర్మించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. మలేషియాలో తమ ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాలు సజావుగా సాగేందుకు చైనా రైల్వేలు, పోర్ట్‌ల నిర్మాణంలో అధికంగా పెట్టుబడులు పెట్టింది. కౌంటన్‌ పోర్ట్‌ నిర్మాణంలో చైనా ఆసక్తి చూపడానికి ఇదే కారణం.

తెబ్రావు ప్రాంతంలోని దీవులపై ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ఫారెస్ట్‌ సిటీ వ్యూహాత్మకంగా, పర్యావరణ పరంగా దేశానికి నష్టం చేస్తుందని మలేషియా నిపుణులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ ప్రాంతాన్ని చదును చేయడం వల్ల మలేషియా, సింగపూర్‌ల మధ్య తీరప్రాంతం తగ్గిపోతుంది. అలాగే ఈ సిటీలో 250 వేల డాలర్ల ఖరీదైన అపార్ట్‌మెంట్‌లు నిర్మించడం పట్ల మధ్యతరగతి మలేషియా వాసులు అసంతప్తి చెందుతున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు చైనా వాసులు మాత్రం పోటీపడుతున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో చైనా వారి జనాభా పెరిగిపోయే ప్రమాదం ఉంది. అలాగే పర్యావరణం దెబ్బతినడం వల్ల మత్స్యకారులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలా చైనా ప్రాజెక్ట్‌ల పట్ల అనేక అభ్యంతరాలు, తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా వాటిని పునః సమీక్షించడానికి మాత్రం రజాక్‌ ప్రభుత్వం నిరాక రిస్తూ వచ్చింది. దీనితో చివరికి చైనా ప్రతిష్టాత్మక బిఆర్‌ఐ ప్రాజెక్ట్‌లో మలేషియా ముఖ్యమైన భాగస్వామి అయింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా చైనా అనేక దేశాలపై ఆధిపత్యాన్ని సంపాదించాలనుకుంది. అందులో 15 చైనాకు పొరుగున ఉన్న దేశాలైతే, 24 ఆఫ్రికా, యూరోప్‌, ఆసియా దేశాలు, 7 లాటిన్‌ అమెరికా దేశాలు ఉన్నాయి.

చైనా పెట్టుబడులు మలేషియా ఆర్ధిక రంగాన్ని మరింత కుంగదీశాయి. ఆ పెట్టుబడుల నుంచి బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని రజాక్‌ దారిమళ్ళించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. రజాక్‌ ప్రభుత్వపు అవినీతి విధానాలు, దిగజారుతున్న మలేషియా ఆర్ధిక పరిస్థితిని చూసి 92 ఏళ్ల మహతిర్‌ మహ్మద్‌ తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించు కున్నారు. 2017 ఆగస్ట్‌లో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఆయన కొత్త పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడింది. అధికారంలోకి వస్తే చైనా పెట్టుబడులను పునఃసమీక్షిస్తామని హామీ ఇచ్చింది. రజాక్‌ అవినీతి ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉన్న ప్రజానీకం మహతిర్‌కు మళ్ళీ అధికారం కట్టబెట్టారు.

వత్తిరీత్యా డాక్టర్‌ అయిన మహతిర్‌ యునైటెడ్‌ మలయ్స్‌ నేషనల్‌ ఆర్గనైజేషన్‌లో సభ్యుడిగా చేరి 1964లో మొట్టమొదటసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 1976లో కేంద్రమంత్రి అయిన ఆయన 1981లో ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అయిదుసార్లు అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పాలనా కాలంలో మలేషియా ఆర్ధికరంగం బాగా అభివద్ధి చెందింది. దేశం ఆధునికత వైపు అడుగులు వేసింది. ప్రధానంగా వ్యవసాయాధారిత దేశమైన మలేషియా ఆధునిక పారిశ్రామిక వ్యవస్థగా మారింది. 2003 నాటికి అభివద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలైన ‘టైగర్‌ ఎకానమీస్‌’ జాబితాలో చోటు సంపాదించింది. అంతేకాదు 1998లో వచ్చిన అంతర్జాతీయ ఆర్ధికమాంద్యాన్ని కూడా సమర్ధవంతంగా తట్టుకుని నిలబడింది. 1990 నాటికి ఆసియాలో ప్రజాస్వామ్య వ్యవస్థ కంటే నిరంకుశ పాలన పట్ల మొగ్గు ఎక్కువైంది. కానీ 1990 ఆర్ధిక సంక్షోభం తరువాత దక్షిణ కొరియా, ఇండోనేషియా, తైవాన్‌ వంటి అనేక దేశాలు ప్రజస్వామ్యం వైపుకే మొగ్గు చూపాయి.

వ్యక్తిగత హక్కుల కంటే సమష్టి ప్రయోజనాలకే పెద్దపీట వేసిన మహతిర్‌ పాలనా విధానం మలేషి యాను పూర్తిగా మార్చేసింది. అభివద్ధి మార్గంలో పరుగులు పెట్టించింది. అయితే ప్రత్యర్ధులు, మతేతర వ్యక్తులు, మీడియాపై మహతిర్‌ ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధించింది. పౌర హక్కులను పక్కకు పెట్టింది, పాశ్చాత్య ఆర్ధిక నమూనాను పూర్తిగా నిరాకరించింది.

రాజకీయాల నుండి విరమించుకున్న తరువాత కూడా మహతిర్‌ జాతీయ, అంతర్జాతీయ వ్యవహా రాలపై తన అభిప్రాయాలను ప్రకటిస్తూనే వచ్చారు. ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. నజీబ్‌ రజాక్‌ ఎంపికలో చురుకైన పాత్ర పోషించారు కూడా. ఆయనకు అనేక అంశాల పట్ల దృఢమైన అభిప్రాయాలూ ఉన్నాయి. స్థానిక జాతులు, ముస్లిం మలయ్‌ ప్రజానీకపు ప్రయోజనాలను కాపాడాలని అంటూనే చైనా ప్రజలు చాలా తెలివైనవారు, కష్టపడి పనిచేసేవారని మెచ్చుకునేవారు.

చైనాను తీవ్రంగా వ్యతిరేకించకపోయినా తిరిగి ఎన్నికైతే చైనా పెట్టుబడులను సమీక్షిస్తానని ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దేశపు అత్యంత వృద్ధ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ హామీని నిలబెట్టుకున్నారు కూడా. ఆగస్ట్‌ 19న ఐదు రోజుల చైనా పర్యటనకు వెళ్ళిన మహతిర్‌ రెండు చైనా ప్రాజెక్టులను రద్దు చేశారు. ఈ ప్రాజెక్టులు రెండు చైనా తలపెట్టిన OBORలో భాగమా, కాదా అన్నది ఇంకా తేలలేదుకానీ ఈ రెండు ప్రాజెక్టులపై చైనా పెట్టుబడులు మలేషియాలో మొత్తం పెట్టుబడుల కంటే ఎక్కువని మాత్రం తేలింది.

బీజింగ్‌లో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ‘అవసరానికి మించి డబ్బు వచ్చిపడితే ఎవరికైనా సమస్యే. మాకు వెంటనే అవసరం లేని ఈ ప్రాజెక్టుల కోసం అప్పులు చేయడం, వాటిని తీర్చడంలో అర్ధం లేదు. ఈ అప్పుల విషయంలో జాగ్రత్త పడకపోతే మేము దివాళా తీసే ప్రమాదం ఉంది’ అని తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుల కోసం మలేషియా కొంత మొత్తాన్ని ఇప్పటికే చెల్లించినప్పటికీ భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా ఆ ప్రాజెక్టులను వదులుకోవడమే మంచిదని మహతిర్‌ భావించారు. ప్రాజెక్టులపై తన అనుమానాలు, అభ్యంతరాలను చైనా అధ్యక్షుడికి సూటిగా ఇలా తెలియజేశారు ‘అన్ని దేశాల అభివృద్ధి ఒకేరకంగా లేదు. కొత్తరకం సామ్రాజ్యవాదం అంగీకరించలేము. ఎందుకంటే పేద దేశాలు సంపన్న దేశాలతో పోటీపడలేవు. కనుక మాకు స్వేచ్ఛా వాణిజ్యం అవసరం’.

చైనా పెట్టుబడుల్లో కొట్టుకుపోతున్న అనేక దేశాలకు మహతిర్‌ ముక్కుసూటి అభిప్రాయాలు కనువిప్పు కావాలి. చైనా ప్రాజెక్టుల కోసం వచ్చి పడుతున్న పెట్టుబడుల గురించి మరోసారి ఆలోచించుకోవాలి.

అమెరికాతో వాణిజ్య యుద్ధం సాగిస్తున్న తరుణంలో తన అతిపెద్ద ఆసియన్‌ భాగస్వామితో గొడవకు దిగేందుకు చైనా సిద్ధంగా లేదు. అందుకే మహతిర్‌ వ్యాఖ్యలపై చైనా ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయలేదు. దక్షిణ చైనా సముద్ర వ్యవహారంలో కూడా మహతిర్‌ కచ్చితమైన వైఖరినే అవలం బించారు. ఈ ప్రాంతంలో సైనికీకరణకు చైనా చేస్తున్న ప్రయత్నాలను ప్రశ్నించారు. ‘నౌకలు, యుద్ధ నౌకలు ఈ ప్రాంతంలో తిరగడం సమస్య కాదు. ఇక్కడ తిష్ట వేసుకుని కూర్చోవాలనుకోవడం సమస్య. అది ఎవరికీ మంచిది కాదు. అనవసరంగా ఉద్రిక్తత లను సృష్టించుకోవడం ఎందుకు?’ అని ప్రశ్నించారు.

దిగజారిన ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు మహతిర్‌ ప్రభుత్వం ‘ఆసియా వైపు దృష్టి’ అనే విధానాన్ని అవలంబించింది. తన మొట్టమొదటి అధికారిక పర్యటనను జపాన్‌తో ప్రారంభించిన మహతిర్‌ తూర్పు ఆసియా ఆర్థిక కూటమి (EAEC) ని పునరుద్ధరించడానికి చొరవ తీసుకుంటున్నారు. మలేషియా తిరిగి జపాన్‌కు దగ్గర అవుతున్న ఈ తరుణంలో భారత్‌ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మూడు దేశాలకు సంబంధించిన అను సంధాన ప్రాజెక్టులను పూర్తిచేయడానికి చొరవ తీసుకోవాలని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకు నిరంకుశ పాలకుడిగా విమర్శలు ఎదుర్కొన్నా మహతిర్‌ను ఇప్పుడు ఇతర ఆసియన్‌ దేశాలు కొత్త నాయకుడుగా చూస్తున్నాయి. చైనా విస్తరణవాదాన్ని ప్రశ్నించడం, ప్రాజెక్టులను రద్దు చేయడం వంటి చర్యలు అంతర్జాతీయంగా కూడా మహతిర్‌కు కొత్త గుర్తింపును తెచ్చాయి. మొత్తానికి మహతిర్‌ ముక్కుసూటి ధోరణితో చైనా తలపెట్టిన OBOR ప్రాజెక్ట్‌ ఇప్పుడు సంకటంలో పడింది.

– డా.రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *