ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు తెంచుకుంటున్న చైనా

ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు తెంచుకుంటున్న చైనా

చైనా రూపొందించిన ప్రపంచపటంలో భారతదేశంలో కశ్మీర్‌ను ‘ఇండియా కంట్రోల్డ్‌ కశ్మీర్‌’ అని ముద్రించి తన కుటిలత్వాన్ని ప్రకటించుకుంది. చైనాలో ఓ చలన చిత్రంలో జమ్ముకశ్మీర్‌ గురించి తప్పుగా చూపించినా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేట్‌ అభ్యంతరాలు తెలుపలేదు. మనదేశంలో అంతర్భాగమైన కశ్మీర్‌ గురించి అభ్యంతరకరంగా రూపొందించిన ఆ సినిమా మొదటివారంలోనే అక్కడ 56 కోట్లు సంపాదించింది. దీన్ని ప్రపంచమంతటా ప్రదర్శిస్తున్నారు. ఇలా చేస్తే ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు అందుతాయన్న స్పృహ కూడా సీబీఎఫ్‌సీ అధికారులకు లేకుండాపోయింది. అన్నిచోట్ల మెతకవైఖరి మంచిది కాదు. చైనా పట్ల మనం అవలంబిస్తున్న వైఖరి వల్ల ఆ దేశం ధైర్యంగా ఉండి దూకుడుగా ముందుకు వెళ్తుంటే మనదేశం పిరికిగా ఉంటున్నదని మిగతావారు భావిస్తున్నారు.

చైనా స్వభావమే అంత. తన దేశ సరిహద్దులను పెంచుకోవాలనే తాపత్రయం. అందుకే తన నుండి విడిపోయిన ‘తైవాన్‌’ను ఊపిరి తీసుకోనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఈ సంవత్సరం జులై మొదటివారంలో చైనా ప్రభుత్వం ‘ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌’ కంపెనీకి ఒక ఆదేశం జారీ చేసింది. ‘తైవాన్‌’ అనే పేరుకు బదులుగా ‘తైపీ’ రాయమంది. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ అలానే చేసింది. చైనాను సంతృప్తి పరచడానికి భారతదేశం మొగ్గు చూపిందని విశ్లేషకులు వ్యాఖ్యానాలు చేశారు. కాని తొందరలోనే అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌తో సహా చైనాకు విమాన సర్వీసులు నడుపుతున్న అన్ని దేశాలవారు తమ చార్టులలో ‘తైవాన్‌’కు బదులు ‘తైపీ’ అనే రాయడం ప్రారంభించారు. తైవాన్‌ పేరును ‘తైపీ’గా రాయడానికి చైనా జులై 25ను ఆఖరు తేదీగా ప్రకటించిందని విమానయాన సంస్థలు చైనా ఆదేశాన్ని పాటించాయి. స్వతంత్ర దేశమైన ‘తైవాన్‌’ గొంతు నొక్కడానికి చైనా ఎలా నడుచుకుంటున్నదో ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.

విదేశీ కంపెనీలపై బలవంతం

జీఏపీ అనే ప్రముఖ బట్టల కంపెనీ చైనా, దాని సరిహద్దుల గురించి తప్పుగా ముద్రించిందని దానివల్ల ఆ దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలుగు తుందని ఆ కంపెనీతో క్షమాపణలు చెప్పించుకుంది.

జనవరి నెలలో చైనా ప్రభుత్వం ‘మారియట్‌’కు సంబంధించిన వెబ్‌సైట్‌ను మూసివేసింది. కారణం దాని ఆన్‌లైన్‌ సర్వేలో టిబెట్‌, హాంగ్‌కాంగ్‌, తైవాన్‌, మకావులను దేశాలుగా చూపించింది. ‘మారియట్‌’ తన వాణిజ్యం చైనాలో సజావుగా నడవడానికై దిగివచ్చి ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. చైనా సార్వభౌమాధికారానికి హాని చేసే ఏ విషయాన్ని మేం ప్రోత్సహించమని ఈ సందర్భంగా చైనా ప్రభుత్వం పత్రిక ప్రకటన కూడా ఇచ్చింది.

దలైలామా గురించి మెర్సిడెస్‌-బెంజ్‌ సంస్థ ఇన్‌స్టాగ్రాంలో చేసిన ‘Look at the situation from all angles, and you will became more open’ పోస్టును చైనా ప్రభుత్వం ఆ సంస్థపై ఒత్తిడి తెచ్చి తొలగింపచేసింది. దలైలామా అంటే చైనా కమ్యూనిష్టు పార్టీకి పడదు. అతడిని కాషాయ దుస్తుల్లో ఉన్న తోడేలుగా కమ్యూనిష్టులు వర్ణిస్తారు. చైనా ప్రజలలో అత్యధికులు దలైలామాను వ్యతిరేకిస్తారు. ఇన్‌స్టాగ్రాంలలో దలైలామాకు అనుకూలంగా ‘పోస్ట్‌’ చూడగానే వేలాదిమంది చైనీయులు మెర్సిడెస్‌పై విరుచుకుపడ్డారు. దాంతో వెంటనే ఆ సంస్థ ఆ పోస్ట్‌ను తొలగించింది. వారం కిందట గూగుల్‌ చైనాలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సెన్సారు చేసి తమ సేవలను అందిస్తామని తెలిపింది.

చైనా ప్రభుత్వం ‘One – China’ విధానాన్ని దేశంలో ఉన్న అన్ని కంపెనీలపై కఠినంగా అమలుచేస్తోంది. ప్రపంచ దేశాలన్ని పాకిస్తాన్‌ ఎన్నికల గురించి, ఇస్లామాబాద్‌ IMF రుణం గురించి, విలువ తగ్గుతున్న ఇరాక్‌ రియాల్‌ గురించి, చైనా-అమెరికాల మధ్య నెలకొన్న వాణిజ్యపోరు గురించి ఆలోచిస్తున్నాయి. ఈ సమయంలోనే చైనా తాను అనుకున్నది అమలులో పెట్టింది. ‘తైవాన్‌’ విషయంలో ప్రపంచ దేశాల దృష్టిపడకుండా చేయగలిగింది.

హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్యం అణచివేత

జీ జిన్‌పింగ్‌ తిరిగి చైనా అధ్యక్షుడిగా ఎన్నికవగానే పరిపాలనలో మార్పులు వేగవంత మయ్యాయి. స్వతంత్ర ప్రతిపత్తి గల టిబెట్‌ కూడా ప్రకంపనలకు లోనైంది. హాంగ్‌కాంగ్‌ చైనా ఆధీనంలోకి వచ్చిన తర్వాత అక్కడ చైనా పాలన ప్రభావం ప్రజలపై పడింది.

హాంగ్‌కాంగ్‌ విజ్ఞప్తులను చైనా తిరస్కరించి నందుకు ప్రజాస్వామ్యవాదులు 2014లో ‘Umbrella’ ఉద్యమాన్ని చేపట్టారు. బీజింగ్‌ ఈ ఉద్యమాన్ని ఉక్కు పిడికిలితో అణచివేసింది. ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉన్న వ్యక్తులను ఎన్నికలలో పోటీ చేయకుండా చేసింది. ఎన్నికైన వారిలో అలాంటి వారుంటే తొలగించింది. న్యాయవ్యవస్థలో జోక్యం కల్పించుకొని నిర్ణయాలన్నీ బీజింగ్‌కు అనుకూలంగా వచ్చేలా చేసింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను విశ్వవిద్యాల యాల నుండి డీబార్‌ చేసింది. హాంగ్‌కాంగ్‌లో స్వాతంత్య్రం గురించి మాట్లాడే ప్రతిఒక్కరిని బీజింగ్‌ వెంటాడింది. 2017లో చాలామంది వ్యాపారస్థులు ఉన్నట్టుండి అదృశ్యమయ్యారు. వీళ్లందరూ చైనా అధీనంలో ఉన్నారని తేలింది. చైనాకు అనుకూలంగా ఉండే వ్యక్తిని ‘హాంగ్‌కాంగ్‌’ ముఖ్యునిగా నియమించి అక్కడ ఊపిరి పోసుకుంటున్న ‘స్వాతంత్య్ర ఉద్యమం’ గొంతు నులిమింది.

అధ్యక్షుడిగా ఎన్నికైన నెలలోనే ‘జీ’ ఒక ప్రకటన చేశాడు. చైనా జాతిని పునర్‌యవ్వనం చేస్తానని అన్నాడు. ప్రధానంగా రెండు లక్ష్యాలను ప్రజల ముందుంచాడు. 1. సంయమిత సమృద్ధి సమాజం 2. పూర్తిగా అభివృద్ధి చెందిన, ధనవంతమైన, శక్తివంతమైన దేశంగా ఎదగటం. చైనా గత వైభవం పొందాలంటే మనం ఈ విధంగా ఉండటం తప్పనిసరని ప్రజలకు హితబోధ చేశాడు. ఈ లక్ష్య సాధనకు టిబెట్‌, జినియాంగ్‌, హాంగ్‌కాంగ్‌, చైనాలు కలిసిపోవాలన్నాడు. చైనా స్వర్గానికి భూమికి మధ్య ఉండాలనేదే తన ప్రయత్నం అని తెలియజేశాడు. ప్రజలు-నాయకుల మధ్య సైద్ధాంతిక ఏకత్వం రావాలన్నాడు. తన పాలనకు అనుగుణంగా లేని అధికార గణాలను మార్పులు చేర్పులు చేశాడు. సైన్యాధికారులలో కూడా మార్పులు చేశాడు. సముద్రతీరంలో కూడా చైనా పట్టు సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టాడు. తైవాన్‌ ప్రజల హృదయాలను ప్రేమతో గెలుచుకునే బదులు అధికారంతో వారిపై పెత్తనం చెలాయించడానికి పావులు కదిపాడు.

రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా, తైవాన్‌

1949 సంవత్సరం నుండి తైవాన్‌లో స్వయం పాలకుల అధికారం ఉంటూ వచ్చింది. కువోమింటంగ్‌కు చెందిన చియాంగ్‌ కైషెక్‌కు, చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావోజ్జీటుంగ్‌లకు మధ్య జరిగిన సివిల్‌వార్‌లో చియాంగ్‌ కైషెక్‌ ఓడిపోయాడు. చియాంగ్‌ను తైవాన్‌కు బహిష్కరిం చారు. 1949 నుండి తైవాన్‌ను చియాంగ్‌ కైషెక్‌ పరిపాలించడం మొదలుపెట్టాడు. దానికి అతడు రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా అని పేరు పెట్టాడు. చియాంగ్‌ 1975లో చనిపోయాడు. ‘చైనీయులకు ప్రతినిధులం మేమే’ అని చియాంగ్‌ ప్రపంచ దేశాలకు తెలియ జేశాడు. పశ్చిమ దేశాలు, కమ్యూనిస్టు దేశాలు పీఆర్‌సీని గుర్తించడానికి నిరాకరించాయి. తైవాన్‌లో ప్రస్తుతం 23 మిలియన్ల ప్రజలున్నారు. 1895లో జరిగిన సింకో-జపాన్‌ యుద్ధంలో గెలిచిన జపాన్‌కు ఈ దీవి స్వంతమైంది. 1945లో జరిగిన రెండవ ప్రపంచయుద్ధంలో ఓడిన జపాన్‌ తైవాన్‌ను చియాంగ్‌ సైనికాధికారులకు అప్పజెప్పింది. 1945లో ఆర్‌ఓసీ, యునైటెడ్‌ నేషన్స్‌లో సభ్యత్వం తీసుకొంది.

1961లో మంగోలియా స్వతంత్రం పొందింది. UN జనరల్‌ అసెంబ్లీ తీర్మానం 1668 ప్రకారం UNSCలో ROC బదులుPRC కి సభ్యత్వం ROC= Repulic of China, PRC: Peoples Repulic China) కల్పించారు. 1971 సంవత్స రంలో జనరల్‌ అసెంబ్లీ తీర్మానం 2758 ప్రకారం పీఆర్‌సీయే న్యాయబద్ధమైన చైనా అని గుర్తించారు. ఆ విధంగా చైనా UNSCలో శాశ్వత సభ్యత్వం పొందింది. తైవాన్‌ చైనీస్‌ తైపీగా గుర్తించబడింది. అమెరికా తన స్వార్థ ప్రయోజనాలకై ఆనాటి చైనా అధ్యక్షుడితో చేతులు కలిపి తను One China ను సమర్థిస్తున్నానని ప్రకటించింది. తైవాన్‌ చైనాలో భాగమని పేర్కొంది. ఆ తర్వాత తైవాన్‌ (ROC)  ఒత్తిడి వల్ల జిమ్మి కార్టర్‌ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న కాలంలో తైవాన్‌ రిలేషన్స్‌ ఆక్ట్‌ (TRA) ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల అమెరికా తైవాన్‌కు ఆయుధాలను అమ్ముకోవడం సాధ్యమైంది.

1949లో జరిగిన సివిల్‌వార్‌ తరువాత కూడా వీటి మధ్య తరచుగా యుద్ధాలు జరిగాయి. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా తైవాన్‌పై మిస్సైల్స్‌ కూడా ప్రయోగించింది.

అమెరికా తైవాన్‌తో స్నేహ బంధం మొదలు పెట్టగానే చైనా మూడవ ప్రపంచ దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకోవడం ప్రారంభిం చింది. చైనా ఒత్తిడి మేరకు అమెరికా తైవాన్‌కు ఆయుధాల సరఫరా 1982 నుండి తగ్గించింది. కాని తైవాన్‌ చైనాలో భాగమని మాత్రం ప్రకటించ లేదు. అధికారికంగా తైవాన్‌తో సంబంధాలు పెట్టుకోమని అమెరికా ప్రకటించింది. కాని సాంస్కృతికంగా, వాణిజ్యపరంగా, ఆర్థికపరంగా ఇచ్చిపుచ్చుకోవడాలు సాగుతూనే ఉన్నాయి. ఈ పనులన్నీ ‘అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌ ఇన్‌ తైవాన్‌’ అనే సంస్థ ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఈ సంస్థ వీసాలు కూడా ఇస్తుంది.

తైవాన్‌ 1987 వరకు మిలిటరీ (చియాంగ్‌) పాలనలోనే ఉంది. అతడి మరణం తరువాత తైవాన్‌లో క్రమంగా ప్రజలు ప్రజాస్వామ్యం వైపు మొగ్గు చూపారు. ఆ విధంగా 1992లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1996లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. తైవానీయులు ‘వన్‌ చైనా’ విధానాన్ని తిరస్కరించారు. చైనాకు దూరంగా ఉండాలనుకున్న వాళ్లు 2000లో అధికారంలోకి వచ్చారు. వీరు 2008 వరకు అధికారంలో ఉన్నారు. ప్రస్తుతం KMT తిరిగి అధికారంలోకి వచ్చింది.

– డా||రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *