ప్రజా సమస్యల మీద చర్చలా ? ప్రజాస్వామ్యానికి మచ్చలా ?

ప్రజా సమస్యల మీద చర్చలా ?  ప్రజాస్వామ్యానికి మచ్చలా ?

ఒక దేశం, ఒక జాతి ఆధునికతతో కలసి అడుగులు వేస్తున్నదని చెప్పడానికి కావలసినదేమిటి? అక్కడ ప్రజాస్వామ్యానికి ఉన్న విలువ. ప్రజల ఆలోచనల మీద ఆ గొప్ప భావన పరచిన జాడ. దానితో వారు సంతరించుకున్న చైతన్యం. దేశ రాజకీయ నాయకత్వానికి ఆ సిద్ధాంతం పట్ల ఉన్న నిబద్ధత కూడా. దేశవాసులందరిని సోదరులుగా భావిస్తూ, అన్నింటా సమానావ కాశాలు కల్పిస్తూ, పాలనలో అందరినీ భాగస్వాములను చేసుకుంటూ దేశాన్ని సమున్నత స్థితికి తీసుకుపోవాలన్న ఆలోచన అక్కడ ఉన్నదని చెప్పడానికి రుజువు కూడా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న తీరులోనే కనిపిస్తుంది. పార్లమెంటరీ వ్యవస్థలలో ప్రజాస్వామ్యమనే తాత్వికతకి స్ఫూర్తి కేంద్రంగా అలరారేదే పార్లమెంటు. ప్రపంచంలో పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థకి నమూనాగా నిలిచిన మన భారతదేశంలో కూడా ప్రజాస్వామ్య చింతనకి కేంద్రబిందువు పార్లమెంటే.

ఆరున్నర దశాబ్దాల క్రితం స్వతంత్ర భారతదేశం పార్లమెంట్‌ను ప్రతిష్టించుకుంది. బ్రిటిష్‌ సామ్రాజ్యం పరిధి నుంచి విముక్తమైన తొలి వలసదేశం భారత్‌ కావడం ప్రపంచ చరిత్ర నమోదు చేసుకున్న ఒక విశేషమైతే, అలాంటి సామ్రాజ్యవాద వ్యవస్థలో అన్ని దశాబ్దాలు మగ్గిపోయినా ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించుకోగలగడం మరొక చరిత్రాత్మక ఘట్టమే అవుతుంది. ఈ మహోన్నత చారిత్రక వాస్తవాన్ని గమనించడంలో ప్రపంచ ప్రజానీకం విఫలం కాలేదు కూడా. 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, 1885 నుంచి సాగిన భారత జాతీయ కాంగ్రెస్‌ ఉద్యమం, అసంఖ్యాకంగా జరిగిన సామాజికోద్యమాలు, గిరిజనోద్యమాలు, రైతాంగ పోరాటాలు, విదేశీ గడ్డ మీద నుంచి సాగిన గదర్‌ వీరుల పోరు వంటివెన్నో మనకి ఈ స్వేచ్ఛా వాయువులను ప్రసాదించాయి. ఎన్నో రక్త తర్పణలు, ఎన్నెన్నో త్యాగాలు, ఎంతో కన్నీరు పునాదులుగానే మన పార్లమెంట్‌ ఆవిర్భవించింది. కాబట్టి స్వతంత్ర భారతదేశంలో, ఈ ఆరున్నర దశాబ్దాల పార్లమెంట్‌ ప్రస్థానాన్ని మనం సింహావలోకనం చేసుకోవాలి. బ్రిటన్‌ ఆధిపత్యం పతనమై ఏడు దశాబ్దాలు గడచిన తరువాత జరుపుకుంటున్న ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన పార్లమెంట్‌ గురించి ఒక సమీక్ష జరుపుకోవడం సందర్భోచితం కూడా.

ఆరున్నర దశాబ్దాల పాటు పార్లమెంటరీ వ్యవస్థ అప్రతిహతంగా కొనసాగడం అరుదు. భారత్‌తో పాటే స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశాలలో వచ్చిన రాజకీయ, సామాజిక మార్పులను గమనించిన తరువాత మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య నిలయం మీద ఇలాంటి సమున్నత అభిప్రాయం కలగడం ఎంతమాత్రం అసహజమనో, మితిమీరిన దేశాభిమానమో అనిపించదు. కానీ ఒక వ్యవస్థ అప్రతిహతంగా కొనసాగడమొక్కటే దాని గొప్పతనంగా పరిగణనలోనికి తీసుకోలేం. అది జాతికి అందించిన ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇంకెలాంటి ఫలితాలను జాతి ఆశించవచ్చు? నిజంగానే జాతి ఆశయాలకీ, ఆకాంక్షలకీ ఆ వ్యవస్థ అద్దం పడుతున్నదా? కానీ, ఇంతకాలం గడిచిన తరువాత, ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇన్ని కుదుపులూ పరిణామాలూ సంభవించిన తరువాత మార్పు అనివార్యం. ఆ మార్పు సానుకూలంగా చూడదగినదా, కాదా? అన్నదే ప్రశ్న. మార్పుల ఫలితంగా ఎదురైన చేదు వాస్తవాలను చాటుకోవడం, అంగీకరిచడం, సరిదిద్దుకోవడం ఆ ప్రశ్నకి సమాధానం కాగలదు. నేటి అవసరం కూడా అదే.

స్వతంత్ర భారతదేశంలో లోక్‌సభ, రాజ్యసభ మే 13, 1952న సమావేశాలు ప్రారంభించాయి. ఇప్పుడు మనం పదహారో లోక్‌సభ దగ్గర ఉన్నాం. ఇది గొప్ప ప్రయాణం. జీవీ మౌలాంకర్‌ (లోక్‌సభ స్పీకర్‌), ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్‌ (రాజ్యసభ చైర్మన్‌) ఆ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ప్రజలతో సాన్నిహిత్యం కలిగిన మహావక్తల వేదికగా మన పార్లమెంట్‌ ఆనాడు పరిఢవిల్లింది. తొలినాళ్లలో స్వాతంత్య్రోదమ స్ఫూర్తి సభ్యులలో ప్రస్ఫుటంగా కనిపించింది. ప్రభుత్వం పార్లమెంటుకు జవాబుదారు. పార్లమెంట్‌ ప్రజలకు జవాబుదారు. ఈ రకమైన అత్యున్నత భావన పట్ల విశేషమైన మర్యాద కూడా కనిపిస్తుంది. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూతో పాటు, ఎందరో మహనీయులు, స్వాతంత్య్ర పోరాటయోధులు, రాజనీతిజ్ఞులు, విద్యావేత్తలు ఆనాటి పార్లమెంటుకు శోభను తెచ్చారు. పార్లమెంట్‌ అంటే దేశానికి అవసరమైన చట్టాలు చేసే సభ మాత్రమే అనుకోరాదని నెహ్రూ భావించారు. ఆధునిక భారతానికి చిహ్నమే పార్లమెంట్‌ అని ఆయన నమ్మారు. ప్రసంగించేవారు విశేషమైన అధ్యయనం చేసి వచ్చేవారు. సభలో ఉన్నవారు చర్చలను అత్యంత గౌరవంతో ఆలకించేవారు. కానీ 1952 నాటి పరిస్థితులు, శ్రద్ధాసక్తులు ఇటీవలి కాలపు పార్లమెంటరీ సమావేశాలలో ఆశించడం కష్టం. నాటి రాజకీయ దృష్టి వేరు. సామాజిక ప్రాధమ్యాలు వేరు. ప్రాంతీయ పార్టీల వైఖరి ఉనికి నామమాత్రం. వాటి ధోరణి కూడా వేరు. ఇప్పుడు అంతా మారింది. విలువలు దిగజారాయని చెప్పడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఈ పరిస్థితి పట్ల నిరాశాపూరితమైన ధోరణితో ఉండడం సరికాదు. అసలు ప్రపంచమంతటా పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలలో విలువలు దిగజారుతున్నాయన్న విమర్శ ఉంది. పార్లమెంటరీ వ్యవస్థకు తల్లి వంటిదని చెప్పే బ్రిటిష్‌ పార్లమెంట్‌పై కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం కావడం గమనించదగినది. ఇదంతా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కొత్తరూపును సంతరించుకుంటున్న కాలం. ఏకధ్రువ ప్రపంచంలో, ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న విపరిణామాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పార్లమెంటులు వాటి రూపును అంతో ఇంతో మార్చుకుంటున్నాయి. అయినా రాజ్యాంగకర్తల, స్వాతంత్య్ర పోరాటయోధుల మౌలిక ఆశయాలను విస్మరించడం సరైన పంథా అనిపించుకోదు. కాబట్టి పార్లమెంటరీ వ్యవస్థలో, పార్లమెంటు స్వరూపస్వభావాలలో చోటు చేసుకుంటున్న పరిణామం నిర్మాణాత్మకంగా ఉండడానికి కొంత చర్చ జరగాలి. ఇలాంటి చర్చను స్వాగతించాలి.

పార్లమెంట్‌ ప్రధానంగా జాతీయ స్థాయి కలిగిన అంశాలను లేవనెత్తేందుకూ, క్లిష్టమైన పరిస్థితులను చర్చించేందుకూ వేదికగా ఉపయోగపడాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, అటల్‌ బిహారీ వాజపేయి, ఇతర సంకీర్ణ ప్రభుత్వాల యుగాలలో పార్లమెంట్‌ సమావేశాలు వేర్వేరు తీరులలో నడిచాయి. అంతా అంగీకరించే వాస్తవాలు మూడు.. ఒకటి -తొలినాటి పార్లమెంటులో విలువలను కాపాడే ప్రయత్నం జరిగింది. రెండు -1980 తరువాత పార్లమెంట్‌ పరిస్థితి దిగజారింది. మూడు -రాజకీయాలు నేరమయం కావడంతో ఆ ప్రభావం పార్లమెంటు మీద తీవ్రంగా ఉంది.

ఈ మార్పులకు దేశ రాజకీయ, సామాజిక వాతావరణం కారణం. కాంగ్రెస్‌ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యంలో పార్లమెంట్‌ పని తీరు వేరు. అత్యవసర పరిస్థితి దరిమిలా పార్లమెంట్‌ సంతరించుకున్న రూపం వేరు. పదహారో లోక్‌సభకు ప్రత్యేకత రావడానికి కారణం దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఒక పార్టీకి పూర్తి ఆధిక్యం రావడమే. ఈ మధ్యలో ప్రాతీయ పార్టీలు పెరిగాయి. అవి శాసనసభలకే పరిమితం కాకుండా, పార్లమెంటులో కూడా ప్రవేశిస్తున్నాయి. చర్చల విషయంలో పార్లమెంట్‌ ప్రాధామ్యాలను ఈ పరిణామం మార్చివేసింది. చర్చనీయాంశాల పరిధి పెరిగింది. ఆ మేరకు జాతీయాంశాలు అనూహ్యంగా వెనక్కి పోతున్నాయి. 1980 నుంచి పార్లమెంట్‌ ప్రతిష్ట బాగా దిగజారిందని చెప్పడానికి ప్రధాన హేతువు రాజకీయ అవినీతి పెరగడమే. అలాగే రాజకీయాలు నేరమయం కావడం కూడా జోరందుకుంది. ఈ అంశాలను బట్టి పార్లమెంటును అంచనా వేయాలి. 2014లో ఎన్నికైన పదహారవ లోక్‌సభ భిన్నమైన వ్యవహార సరళిని ప్రదర్శించిందన్న వాదన ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

సమావేశాల సరళి

1950-1960 దశాబ్దంలో లోక్‌సభ సంవత్సరానికి 120 రోజులు సమావేశాలు జరుపుకుంది. అదే 2007-2017 దశాబ్దంలో సంవత్సరానికి సగటున 70 రోజులు మాత్రమే పనిచేసింది. 2016లో లోక్‌సభ ద్వారా నెరవేరవలసిన ప్రయోజనం నెరవేరినది కేవలం 14 శాతం. రాజ్యసభ 20 శాతం ప్రయోజనం నెరవేర్చింది. చిత్రం ఏమిటంటే, గడిచిన పదిహేను సంవత్సరాలలో బ్రిటిష్‌ పార్లమెంట్‌ సంవత్సరానికి 150 రోజులు పనిచేసింది. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ 140 రోజులు పనిచేసింది. ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, పార్లమెంటు సమావేశాల మీద ఎంపీలలో నానాటికీ పెరిగిపోతున్న అలసత్వం గురించి, పడిపోతున్న హాజరు గురించి గుర్తు చేయడానికే. కొద్దికాలం క్రితం కోరం కూడా లేకపోవడంతో సభాధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి.

పార్లమెంట్‌ ఏర్పడిన కొత్తలో రెండు సభలలోను ఒకే పార్టీ ఆధిక్యం ఉంది. ఆ ఘనత కాంగ్రెస్‌కు ఇవ్వవచ్చు. అప్పుడు పార్లమెంట్‌ కొన్ని ప్రమాణాలతో పనిచేసిన మాట ఎంత నిజమో, అదే పార్టీ నాయకత్వంలో ఆ మహా వ్యవస్థలో చాలా దిగజారుడు కూడా సంభవించింది. ఉదాహరణకి, 2009లో పార్లమెంట్‌ సభ్యుల హాజరు కంటే 1952 నాటి పార్లమెంట్‌ సభ్యుల హాజరు రెండు రెట్లు.

చర్చలలో ప్రమాణాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తున్న మరొక అంశం. సభా కార్యకలాపాలను నిరోధించడం, అందుకోసం వాకౌట్లు, ధర్నాలు, బలమైన కారణం ఏదీ లేకుండానే మంత్రులను ఘెరావ్‌ చేయడం వంటి వాస్తవాలు పార్లమెంట్‌ ప్రతిష్ట మసకబారేటట్టు చేస్తున్నాయని అనిపిస్తుంది. అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చివేత, ఉమ్మడి పౌరస్మృతి మీద చర్చ, మహిళలకు పార్లమెంటులో 33 శాతం స్థానాల కేటాయింపు అంశంపై చర్చ జరిగినప్పుడు, కొన్ని బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు అలాంటి దృశ్యాలను భారతదేశం చూసింది. సభ్యులలో హుందాతనం లోపిస్తోంది. క్రమశిక్షణ, దేశ సమస్యల పరిష్కారం పట్ల నిబద్ధత నానాటికీ కరువైపోతున్నాయి. దేశ నిర్మాణ కార్యక్రమంలో పార్లమెంట్‌ సభ్యులు చూపే శ్రద్ధ ఇదేనా అనిపించే రీతిలో కొందరి ప్రవర్తన ఉంటోంది కూడా. 2010లో 22 రోజుల పాటు పార్లమెంట్‌ స్తంభించింది. 2000 సంవత్సరం నుంచి పరిశీలిస్తే ఆ సంవత్సరం ఒనగూడిన ప్రయోజనం కనాకష్టమన్నమాట. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో బడ్జెట్‌ సమావేశాలలో జరిగిందేమిటి? నెలపాటు సాగిన లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు నిరసనల మధ్యనే సాగాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం, దేశంలో విగ్రహాల విధ్వంసం, ఎస్‌సి,ఎస్‌టి బిల్లు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంశం వంటి అంశాలతో ‘సభ్యుల గందరగోళం మధ్య’ పదేపదే సభలు వాయిదా పడినాయి. పార్లమెంటులో ఎలా వ్యవహరించినా చెల్లిపోతుందన్న ధోరణి కూడా కొందరు సభ్యులలో స్పష్టంగా కనిపిస్తున్నది.

లోక్‌సభ 29 సమావేశాలు జరిపింది. అంటే 127 గంటల 45 నిమిషాలు. కానీ కార్యకలాపాలు సాగినది మాత్రం 34 గంటల, ఐదునిమిషాలు. మిగతా తొంభయ్‌ గంటలు వృధాగా పోయాయి. రాజ్యసభ 30 సమావేశాలు జరిపింది. అంటే దాదాపు 121 గంటలు. సద్వినియోగమైన సమయం 45 గంటలే. మిగిలిన 75 గంటలు వ్యర్థంగా కాలగర్భంలో కలసిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉండడం వల్లనే చర్చకు రాని బిల్లులు గిలెటోన్‌ అవుతాయి. ప్రభుత్వాలు ఆర్డినెన్సులను ఆశ్రయిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి సరిపడని సంస్కృతి. పార్లమెంటు సమావేశాలకు ఒక నిమిషానికి అయ్యే ఖర్చు రూ. 2.5 లక్షలు. ఈ పరిస్థితులలో ప్రజాధనానికి మన ఎంపీలు ఇస్తున్న విలువ ఇదా అన్న ప్రశ్న రాకుండా ఎలా ఉంటుంది?

వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికో, పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించేందుకో పార్లమెంటును వేదికగా చేసుకునే అవాంఛనీయ వాతావరణం కూడా పెరిగిపోతోంది. ఫలితమే ఎంతమాత్రం ప్రమాణాలు లేని ఉపన్యాసాలు, చర్చలు. తరచు గందరగోళం తలెత్తడం వల్ల ప్రశ్నోత్తరాల సమయం రెండు సభలలోను రద్దయ్యే పరిస్థితి వస్తున్నది. మంత్రిత్వ శాఖల కార్యకలాపాల మీద సభ్యులు ప్రశ్నలు సంధించడానికి వీలు కల్పించే కార్యక్రమం అది. కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలతో కొందరు ఎంపీల ప్రవర్తన అనూహ్యంగా మారిపోతోందనీ, తమ నియోజక వర్గ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఇదొక మార్గమని వారు భావిస్తున్నారని ఒక విమర్శ ఉంది. కానీ సభలో ఎవరి ప్రవర్తన ఎలా ఉన్నదో, ఎవరు అడ్డుపడుతున్నారో ప్రజలకు ఈ ప్రత్యక్ష ప్రసారాలే తెలియచేస్తున్నాయి. అది వారు తెలుసుకోలేకపోతున్నారేమో!

సహజమైన అధికారాన్ని వదులుకుంటున్నారు

చట్టాల రూపకల్పన, అందుకు సంబంధించిన ఆలోచన పార్లమెంటు సొంతం. కానీ నానాటికి బలపడుతున్న అవాంఛనీయ వాతావరణంలో ఆ బాధ్యత కార్య నిర్వాహక విభాగం పరిధిలోకి వెళ్లిపోతోంది. నిజం చెప్పాలంటే చట్టాలు పార్లమెంటు బయట రూపుదిద్దుకుంటున్నాయి. ఇది పార్లమెంట్‌ విలువను మరింత ప్రశ్నార్థకం చేసే అంశమే. దీనికి తోడు ఒక బిల్లును రూపొందించ డానికి అవసరమైన పరిశోధన, అధ్యయనం లోపిస్తున్నాయన్న ఆరోపణ కూడా బలపడుతోంది. పైగా బిల్లులను కూడా హడావుడిగా రూపొందిస్తున్న సంగతి వాస్తవమే. అలాగే సభలో వాతావరణాన్ని బట్టి అంతే హడావుడిగా ఆమోదిస్తున్నారు. 20 నిమిషాలలో 16 బిల్లులను ఆమోదించిన ఘటన 2008లో జరిగింది. కాబట్టి విధాన నిర్ణయాలకు సంబంధించి పార్లమెంటు సభ్యుల తోడ్పాటు నిమిత్త మాత్రమే అవుతోంది. ఇది శాసన నిర్మాణ (చట్టసభలు), కార్య నిర్వాహక (ప్రభుత్వం, అధికార యంత్రాంగం) వ్యవస్థల మధ్య రాజ్యాంగ కర్తలు ఆశించిన సమతౌల్యాన్ని పూర్తి భగ్నం చేయడం లేదా?

నేరమయ రాజకీయాల ప్రభావం

మొదట చెప్పుకున్నట్టు 1980 తరువాత పార్లమెంట్‌ సభ్యుల తీరుతెన్నులు వేరు. అప్పటిదాకా రాజకీయాలు నేరగాళ్లను ఉపయోగించుకునేవి. ఆ తరువాత నుంచి నేరగాళ్లే రాజకీయుల అవతారం ఎత్తారు. 15వ లోక్‌సభలో కొత్తగా లోక్‌సభకు వచ్చినవారు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలిస్తే విస్తుగొలిపే సమాచారం తెలుస్తుంది. తమ మీద కొన్ని క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని 162 మంది ఎంపీలు (29.83 శాతం) నమోదు చేశారు. ఇందులో 76 మంది మీద తీవ్ర అభియోగాలే ఉన్నట్టు తేలింది. పదహారో లోక్‌సభలో నేరారోపణలను ఎదుర్కొంటున్నవారు 34 శాతం ఉన్నారని కొన్ని సంస్థలు వెల్లడించాయి. 2004 తరువాత క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్న ఎంపీల సంఖ్య పెరిగింది. 2004లో ఎన్నికైన వారిలో 128 మందిపై కేసులున్నాయి. చిత్రం ఏమిటంటే 2010-2013 నాటికి తీవ్రస్థాయి క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్న వారి సంఖ్య కొంచెం తగ్గింది. కానీ తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేయడం, రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం, తప్పుడు ఆధారాలు ఇవ్వడం వంటి కేసులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరిగిపోయింది. పెరిగిన ఎన్నికల వ్యయం కూడా నేర చరిత్ర కలిగిన వారు చట్టసభలలో ప్రవేశించే అవకాశం కల్పిస్తున్నది. ఇలాంటి లెక్కలు గణాంకాలు చెప్పుకుంటూ పోతే వాటికి అంతూ దరీ ఉండవు. మొత్తానికి తేలేదేమిటి? మన పార్లమెంట్‌ విలువలు జారుడు మెట్ల మీద ఉన్నాయనే.

న్యాయ వ్యవస్థతో సంబంధాలు

పార్లమెంటు నిర్ణయం ఎప్పుడూ సమున్నతమేనని మన రాజ్యాంగ కర్తలు, ఆనాటి పెద్దలు నిర్ద్వంద్వంగా చెప్పిన మాట నిజం. కానీ పార్లమెంట్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలను సమీక్షించే అవకాశం న్యాయ వ్యవస్థకు ఇచ్చారు. ఇది కూడా నిజమే. కానీ ఈ మధ్య కాలంలో ఈ సమతౌల్యం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఓబీసీ కోటా (27 శాతం కేటాయింపు) విషయంలో న్యాయ వ్యవస్థ అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు నాటి ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌, లోక్‌పభ స్పీకర్‌ ‘పరిధులు అతిక్రమించవద్ద’ని న్యాయవ్యవస్థకు సూచించిన సందర్భం కూడా వచ్చింది.

ఆశాభావంతోనే ఉండాలి

పార్లమెంటులో ప్రస్తుతం కనిపిస్తున్న అవాంఛనీయ ధోరణులకు అనేక చారిత్రక కారణాలు ఉన్నాయి. వీటిని ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించుకోవాలే తప్ప ఆ గొప్ప వ్యవస్థ మీద నిరాశను పెంచుకోవడం ఆరోగ్యకరం కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం చూస్తున్న అనేక పాలనా రీతులలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే అత్యుత్తమమని తేలింది. భారతదేశం ఆ వ్యవస్థ ఆధారంగా ఇంత దూరం ప్రయాణించింది. భిన్నవర్గాలు, మతాలు, ఆచార వ్యవహారాలు కలిగిన భారత్‌ వంటి దేశానికి ఆ వ్యవస్థ తప్ప మరోమార్గం లేదు. మొదట పార్లమెంటు సమావేశాల సంఖ్య పెరగాలి. ప్రతి చట్టం అక్కడే రూపొందాలి. మన పార్లమెంటుకు తనకు తాను సమావేశమయ్యే అధికారం లేదు. అయినా ఏటా లోక్‌సభ 120, రాజ్యసభ 100 రోజులు తప్పనిసరిగా సమావేశాలు జరిపే విధంగా ఒక విధానాన్ని రూపొందించుకోవాలి (ఇలాంటి చక్కని నిర్ణయాన్ని ఒడిశా ప్రభుత్వం తెచ్చుకున్నది. సంవత్సరానికి 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశం కావాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించుకుంది). ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు చాలినంతగా, తగిన స్థాయిలో జరగకుంటే దాని ప్రభావం కార్యనిర్వాహక వ్యవస్థ మీద పడుతుంది.

అందరికీ చట్టసభలలో ప్రాతినిధ్యం అన్న ఆలోచనను ఇప్పటికైనా అమలులో పెట్టాలి. రాజకీయాధికారం ఇప్పటికీ పురుషుల అధీనంలోనే ఉంది. రాజ్యసభలో లేదా లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం 12 శాతానికి మించడం లేదు. 2012 లెక్కల ప్రకారం పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి మన దేశం ప్రపంచంలో 20వ స్థానంలో ఉంది. అందుకే పార్లమెంటులో 33 శాతం స్థానాలు కేటాయించే మహిళా రిజర్వేషన్‌ బిల్లును (108వ సవరణ) వెంటనే ఆమోదించడం అవసరం.

దేశానికి ఆరోగ్యవంతమైన పార్లమెంట్‌ ఉండాలని దేశం మొత్తం కోరుకోవాలి. అందుకు తమ వంతు కర్తవ్యం నిర్వహించాలి. నేరగాళ్లను, అవాంఛనీయ శక్తులను పార్లమెంటులోకి రాకుండా కాపాడేందుకు జనం దగ్గర ఓటు అనే ఆయుధం ఉండనే ఉంది. దానిని సక్రమంగా వినియోగించు కుంటే అదే ఆరోగ్యకరమైన పార్లమెంటుకు చక్కని పరిష్కారం.

– జాగృతి డెస్క్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *