బీజేపీ తెలంగాణ ఆత్మ బంధువు

బీజేపీ తెలంగాణ ఆత్మ బంధువు

‘కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితా అమరావతిలో తయారయింది. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితా దారుస్సలాంలో రూపొందింది’ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. జాతీయ వారపత్రిక ‘జాగృతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విమర్శ చేశారు. కాంగ్రెస్‌ జాబితా అమరావతిలో తయారయిందన్న మాట టీఆర్‌ఎస్‌ నాయకుల నోటి నుంచీ వినిపించింది. డాక్టర్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడినట్టు ఈ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తప్ప, మిగిలిన పార్టీలన్నీ సిగ్గు విడిచి వ్యవహరించాయంటే అతిశయోక్తి కాదు. ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి – మజ్లిస్‌; తెలంగాణ జన సమితి, సీపీఐ, తెలుగుదేశం, కాంగ్రెస్‌లతో ఏర్పడిన మహాకూటమి; సీపీఎం నేతృత్వంలోని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ – ఇవన్నీ అవకాశవాద కూటములే. ఆత్మగౌరవ నినాదంతో ఉద్యమించి, తరువాత అధికారం చేపట్టిన తెరాస ఆ ‘రహస్య’ పొత్తు కోసం అన్నీ వదిలేసుకుంది. ఈ కూటములూ, వాటి వాదాలూ ఏవీ తెలంగాణ చరిత్రతో, ఆ చరిత్రలోని పోరాట తాత్వికతతో, ఈ నేలతో ఆత్మీయబంధం కలిగినవి కావు. కానీ బీజేపీకీ, తెలంగాణకూ మధ్య ఉన్నది మాత్రం అలాంటి బంధమే.

భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానం మేరకు ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. 1948లో నిజాం నియంతృత్వం నుంచి విముక్తమైన హైదరాబాద్‌ సంస్థానంలోని తెలుగుభాషా ప్రాంతాలను, మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని తెలుగు భాషా ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్‌ పేరుతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడున్న చారిత్రక పరిస్థితులే ఇందుకు ఎక్కువగా దోహదం చేశాయి. నాయకుల అభిప్రాయాలు, మనోభావాలకు కొంచెం చోటు తక్కువే. నిజాం నియంతృత్వానికి రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి ఆర్థిక దోపిడీ. రెండు సాంస్కృతిక అణచివేత. నిజాం సంస్థానంలో హిందువులు అధి సంఖ్యాకులు. అయినా ద్వితీయ శ్రేణి పౌరులే. కేవలం అధికారులు, పాలకకుటుంబాలకు పరిమితమైన ఉర్దూ – అధికార భాష. తెలుగుకు స్థానం లేదు. ఈ అణచివేత మీద వెల్లువెత్తిన నిరసన 1947 నాటికే పతాకస్థాయికి చేరుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడే మద్రాస్‌ ప్రెసిడెన్సీకి స్వాతంత్య్రం వచ్చింది. కొన్ని సంస్థానాలు పాకిస్తాన్‌లో కలవాలనుకున్నాయి. అందులో హైదరాబాద్‌, జునాగఢ్‌ ఉన్నాయి. హైదరాబాద్‌ను భారత్‌లో విలీనం చేయడంలో పటేల్‌ నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకమైనది. ఇందుకు పటేల్‌ పూనుకోకుంటే ఏం జరిగేది? దేశ విభజనతో పెద్ద పాకిస్తాన్‌ భారత్‌కు అవతల ఏర్పడినా, మరో చిన్న పాకిస్తాన్‌ దక్షిణ భారతంలో మిగిలి ఉండేది. భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని నిలబెడుతూ, మహనీయుల జాతీయ ఆకాంక్షలను గుర్తిస్తూ పటేల్‌ హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. దీనితో స్వతంత్ర భారతానికి పరిపూర్ణత వచ్చింది. ఈ స్ఫూర్తిని తెరాస మరిచిపోవడం సరికాదు. 1948, సెప్టెంబర్‌ 17న ఎన్నో క్లిష్ట పరిస్థితులు, ఒత్తిళ్ల మధ్య నిజాంను లొంగదీశారు. ఈ మొత్తం అంశాలు, వీటి వెనుక ఉన్న సునిశిత హేతువులు తెలుగు ప్రాంతాలను కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి పరిస్థితులను వేగవంతం చేశాయి. కానీ రెండు దశాబ్దాలకే, 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభమైంది. జరిగిన రాజకీయ తప్పిదాలు కూడా తక్కువేమీ కాదు. ఆ వెంటనే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఆరంభమైంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ డిమాండ్లేవీ సాధ్యం కాదని పార్లమెంటులో ప్రకటించిన దరిమిలా సద్దుమణిగాయి. తరువాత కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మలుపులు తిరుగుతూనే ఉంది. ఇందుకు కొన్ని పరిస్థితులు దోహదపడుతూనే ఉన్నాయి. ఎటొచ్చీ పార్టీల పాత్రలు, నేతల వేషధారణ మారుతూ ఉండడమే గమనించవలసిన అంశం.

చరిత్ర మలుపులు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పి, ఐక్యతా వాదాన్ని వినిపించినది కాంగ్రెస్‌ పార్టీయే. కానీ, ‘ప్రత్యేక తెలంగాణ’ కోరిక చర్చకు వస్తూనే ఉంది. ఎమర్జెన్సీ అనే ఆత్మహత్యాసదృశమైన రాజకీయ తప్పిదంతో బీజేపీ అనే బలమైన శత్రుకూటమి ఆవిర్భావానికి కాంగ్రెస్‌ పార్టీయే బాటలు చూపించింది. బీజేపీయే చిన్న రాష్ట్రాల ఏర్పాటు విధానంతో తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదే 1997 నాటి కాకినాడ తీర్మానం. చిన్న రాష్ట్రాలతో దేశాభివృద్ది సాధ్యమని బీజేపీ సిద్ధాంతం. జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు కాకినాడ తీర్మానం తరువాత ఏర్పడినవే కూడా. తన విధానం పట్ల ఉన్న నిబద్ధతను బీజేపీ నిరూపించుకుంది. నిజానికి కాకినాడ తీర్మానం 1969 నాటి ఉద్యమానికి కొనసాగింపు అడుగు కాదు. అలాంటి ఉద్యమం మరొకదానిని పునరుద్ధ రించడం దాని ఉద్దేశం కాదు. అయినా 2014 ఫిబ్రవరిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టడానికి దారితీసిన పరిస్థితులకు, పరిణా మాలకు ఆ తీర్మానమే అంకురార్పణ చేసిందన్న చారిత్రక సత్యాన్ని అంగీకరించాలి.

తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా, ఆ సంస్థ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైందన్న మాట కాదనలేనిది. ఇక్కడే మరొకసారి చరిత్ర పరిణామాలలోని అనూహ్యతను గమనంలోకి తీసుకోవాలి. 1969 ఉద్యమం చల్లారినప్పటికీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్దేశం మాత్రం చాలామంది తెలంగాణ ప్రాంతం వారి మదిలో ఊగుతూనే ఉంది. మరొకసారి బయటపడే సమయం కోసం చూస్తూనే ఉంది. అలాంటివారిలో చంద్రశేఖర రావు ఒకరు. ఆయన ప్రత్యేక తెలంగాణ నినాదం అందుకున్న సందర్భం ఎలాంటిది? ఇది చరిత్ర వేయక తప్పని ప్రశ్న. కేసీఆర్‌ రాజకీయ జీవితంలో ఒక దశలో ఏర్పడిన నిరాశాపూరిత వాతావరణమే ఆ నినాదానికి జన్మనిచ్చింది. తెలుగుదేశం పార్టీలో చంద్రశేఖరరావు ప్రముఖులు. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. చంద్రబాబు తన సమీకరణల మేరకు నాటి చింతలపూడి ఎమ్మెల్యే విద్యాధరరావుకు మంత్రి పదవి అప్పగించి, చంద్రశేఖరరావుకు డిప్యూటీ స్పీకర్‌ పదవితో సరిపెట్టారు. ఆ తరువాతే చంద్రశేఖరరావుకు ప్రత్యేక తెలంగాణ అవసరం స్ఫురణకు వచ్చింది. 2000 ప్రాంతంలో ఉద్యమం మరోసారి నడక ఆరంభించింది. ఈ కీలక సమయం లోనే బీజేపీ తన వంతు పాత్రను నిర్వర్తించడానికి కొంత సమయం తీసుకుంది. బీజేపీ జాతీయ పార్టీ. దానికి కొన్ని పరిధులు ఉంటాయి. దేశంలో కొత్తగా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన బీజేపీ, ఆ కొత్త రాష్ట్రాలలో ప్రబలశక్తిగా అవతరించింది కూడా. కానీ తెలంగాణలో ఆ రాజకీయ పునరేకీకరణ, వైభవం పునరావృతం కాకపోవడం సామాన్య బీజేపీ కార్యకర్తకు ఇప్పటికీ మింగుడు పడడం లేదు. తెరాస ముందు వరసలోకి రావడానికీ, బీజేపీ వెనుక పడడానికి కొన్ని వెన్నుపోట్లు కారణం. చొరబాట్లు, కబ్జాలు కూడా కారణం. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో బీజేపీకి కొన్ని సీట్లు వచ్చాయి. రెండో అసెంబ్లీ ఎన్నికలలో ఆ నష్టాన్ని పూర్తిగా భర్తీ చేసుకోవడానికి పార్టీ తీవ్రంగానే శ్రమిస్తున్నది. కార్యకర్తలు కూడా తేరుకుని సమధికోత్సాహంతోనే పని చేస్తున్నారు. ఇక్కడే కొన్ని అంశాలను మననం చేసుకోవాలి.

కాంగ్రెస్‌కు మొదట తెలంగాణను ఇవ్వడం ఇష్టంలేదు. కానీ ఆ విషయం సూటిగా చెప్పకుండా నాన్చుడు ధోరణి అవలంబించింది. 2009 నుంచి 2013 వరకు తీవ్ర స్థాయిలో జరిగిన తెలంగాణ ఉద్యమంతో కాంగ్రెస్‌ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోరికను అంగీకరించక తప్పలేదు. 2013లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా హైదరాబాద్‌ వచ్చిన నరేంద్ర మోదీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. నిజానికి కాంగ్రెస్‌ చేత ఆగమేఘాల మీద విభజన బిల్లును పార్ల మెంటులో ప్రవేశపెట్టేటట్టు చేసినది ఈ పరిణామమే. లోక్‌సభలో ఫిబ్రవరి 18, 2014న, రాజ్యసభలో ఫిబ్రవరి 20, 2014న విభజన బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుకు కనుక బీజేపీ పూర్తి మద్దతు ఇవ్వకుంటే ఆమోదం పొందేది కాదన్నది నిర్వివాదాంశం.

భారత భౌగోళిక పటంలో తెలంగాణ అనే కొత్త రాష్ట్రం కనిపించింది. ఈ పరిణామాలు జరుగుతున్న సందర్బంలో చంద్రశేఖరరావు యూపీఏ ప్రభుత్వంలో మంత్రి. అందుకు బీజేపీని ద్వేషించారు. వెంటనే తెరాసయే అధికారంలోకి వచ్చింది. ఆ ద్వేషం అలాగే కొనసాగింది. దీనికి కారణం – మజ్లిస్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం). మజ్లిస్‌ తెరాసకు మధ్య సారూప్యత ఏమిటి? మజ్లిస్‌ తెరాస మౌలిక విధానంతో ఏకీభవించిన పార్టీ కాదు. మజ్లిస్‌ రాష్ట్ర విభజనకు వ్యతిరేకం. ఒకవేళ విభజన అనివార్యమైతే ‘రాయల తెలంగాణ’ కావాలని షరతు లాంటి కోరిక కోరింది. కడప, కర్నూలు ముస్లిం జనాభాను దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ అలాంటి వ్యూహాత్మక డిమాండ్‌ చేసిందన్న మాట నిజం.

అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్‌ వ్యవహార సరళి గురించి ఇంకొచెం చెప్పుకోవాలి. ఆయన ఉద్యమ ఆకాంక్షలను గౌరవించారా? తెలంగాణ సెంటిమెంట్‌ తాత్వికతను మన్నించారా? లేదని అలనాటి ఆయన సహచరులే సాక్ష్యం చెప్పారు. అధికారం నిలబడడమే తెరాస ప్రధానంగా భావిస్తున్నదని చెప్పడానికి తరువాతి పరిణామాలు చెబుతున్నాయి. ఉద్యమవేళ కేసీఆర్‌ ఒక హామీ ఇచ్చారు. నిజాం నవాబు లొంగిపోయిన సెప్టెంబర్‌ 17ను విమోచన దినంగా అధికారికంగా జరుపుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ఏలికలు దీనిని ఎందుకు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఆ రోజును తెలంగాణ ప్రజలంతా గుర్తు చేసుకోవాలన్నదే, ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమం జరపాలన్నదే ఈ ప్రాంతంలో చాలామంది మేధావుల అభిప్రాయం. ఆగస్టు 15 భారతదేశానికి ఎలాంటి విశిష్ట దినమో, సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రజలకు అంతటి జాతీయ ప్రాముఖ్యం కలిగిన దినమని చాలామంది నిశ్చితాభిప్రాయం. అందుకే అది ప్రజల ఆకాంక్ష అయింది. ప్రజల ఆకాంక్ష ఉద్యమ ఆకాంక్షగా వెలుగొందాలి. అధికారం నిలుపుకునే మార్గంగా మారిపోకూడదు. కేసీఆర్‌ సెప్టెంబర్‌ 17ను గాలికొదిలేశారు. కారణం – మజ్లిస్‌పై మమకారం. కేసీఆర్‌లోని ఉద్యమస్ఫూర్తి ఇంకిపోవడానికి ఇదే నాంది అన్న విమర్శలు వచ్చాయి. దీనితో నిజాంను బూజుగా భావించి, అతడి పాలన నుంచి విముక్తి పొందాలని ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసిన వారి ఆత్మలకు కేసీఆర్‌ క్షోభ కలిగించారు. ఉద్యమాన్ని గౌరవిస్తున్నట్టు చెబుతూనే ఉద్యమకారులను దూరంగా ఉంచే నేర్పు ఇక్కడే ఆరంభమైంది. చాలామంది ఉద్యమకారులలో అప్పటికీ సర్దార్‌ పటేల్‌ ఇచ్చిన స్ఫూర్తి స్థిరంగానే ఉంది. డా. లక్ష్మణ్‌ మాటలలో చెప్పాలంటే తెలంగాణ కోసం పోరాడిన పార్టీ మజ్లిస్‌ చెప్పిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చే స్థాయికి దిగజారింది. అందుకే ఇది తెలంగాణ చరిత్రలో అత్యంత విషాద సన్నివేశం.

ప్రత్యేక తెలంగాణ తొలి అసెంబ్లీలోనే కేసీఆర్‌ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డారు. తెలంగాణను తెచ్చిన కీర్తితో పాటు, ఆ రెండు చర్యలు కూడా చరిత్రలో ఆయన మీద మచ్చ వేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఇవన్నీ ఉద్యమకారునిగా కేసీఆర్‌ తనకు తానుగా ఇచ్చుకుంటున్న సర్టిఫికెట్‌ మీద మచ్చల వంటివే. అసలు కేసీఆర్‌ మనసులో ఏముంది? తెలంగాణ సెంటిమెంట్‌ను ఆయన ఇప్పటికీ విశ్వసిస్తున్నారా? అన్న ప్రశ్న దగ్గరకు తీసుకు వెళ్లేవే కూడా.

కేసీఆర్‌ నాలుక్కాలాల పాటు తెలంగాణలో సుస్థిరంగా ఉండాలంటే కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడకూడదు. అందుకే ఆయన పదే పదే కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశిస్తానని చెబుతున్నారు. ఆ పీఠాన్ని కాంగ్రెస్‌ చేజిక్కించుకుంటే కేసీఆర్‌కు ఇక కష్టాలే. విభజన బిల్లు ప్రవేశపెట్టినందుకు, తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా మన రెండు పార్టీలు కలసి పోటీ చేయాలని చెప్పి, సోనియాగాంధీతో కుటుంబ సభ్యులతో కలసి ఫోటోలు దిగారాయన. కానీ హైదరాబాద్‌ రాగానే నాది వేరు కుంపటి అని ప్రకటించారు. కాంగ్రెస్‌ దీనిని దగా కింద భావించకుండా ఉండడం సాధ్యం కాదు. తెలంగాణ సాధ్యం కాదంటూ ఇందిర చెప్పిన మాట, అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో హోంమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి విసిరిన విసుర్లు తెలంగాణ నాయకులు మరచిపోనట్టే, తెరాస చేసిన పొత్తు దగాను కాంగ్రెస్‌ కూడా మరచిపోదు. ఈ సంగతి బాగా తెలిసినవారు కాబట్టే కాంగ్రెస్‌ను ఢిల్లీ పీఠానికి ఎంత దూరంగా ఉంచగలిగితే అంత మంచిదని కేసీఆర్‌ భావిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్‌, బీజేపీలు లేని కూటమి అవసరమంటున్నా రాయన. బీజేపీతో కేసీఆర్‌కు రహస్య అవగాహన ఉందన్న మాటను కొట్టిపారేయ కుండా, పదే పదే వినిపించేటట్టు జాగ్రత్త పడుతున్నారు కూడా. బహుశా మజ్లిస్‌ మరీ పెట్రేగిపోకుండా జాగ్రత్తపడే చర్యలో భాగం కావచ్చు. ఇక కూటమి గురించి చూస్తే ఆ ప్రయత్నాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌తో ఆరంభించారు కేసీఆర్‌. అది కూటమి ఏర్పాటును విజయవంతం చేసే చర్యేనా? తృణమూల్‌ పార్లమెంటులో విభజన బిల్లును వ్యతిరేకించింది. గూర్ఖాలాండ్‌కు పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టు అవుతుందని తృణమూల్‌ నాయకురాలు మమతా బెనర్జీ ఉద్దేశం. ఆమె చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకి. ఇది కూడా కేసీఆర్‌లోని తెలంగాణ స్ఫూర్తికి విరుద్ధమే. పైగా బెనర్జీ యూపీఏ భాగస్వామి. కాబట్టి ఆమె దగ్గరకి వెళ్లి వేరే కుంపటి కోసం దేబిరించవలసిన అవసరం ఏమొచ్చింది? అందులో వేరే ఉద్దేశం ఏదైనా ఉన్నదీ ఉంటే, అది తెలంగాణ స్ఫూర్తిని చంపి వచ్చేదే.

తాను చేసిన అభివృద్ధి పనులతోనే మళ్లీ తాను గెలవగలనని ఆయన మనస్ఫూర్తిగా భావిస్తున్నారా? అంటే, అదీ లేదట. తెరాస చేవెళ్ల తాజా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాటలు ఇదే చెప్పాయి. అభివృద్ధికి ఓట్లు రాలవనీ, మాయమాటలతోనే ఓట్లు పడతాయనే కిటుకు మీదే కేసీఆర్‌కు ఎక్కువ నమ్మకమని విశ్వేశ్వరరెడ్డి (ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు) గాందీభవన్‌లో చెప్పారు. తెరాసలో జై తెలంగాణ నినాదం కనుమరుగై, జై కేసీఆర్‌, జై కేటీఆర్‌, జై కవిత నినాదం ముదిరిందని ఆయన బయటపెట్టారు. అంటే ఏక కుటుంబ పాలన, ఆధిపత్యం. విశ్వేశ్వర రెడ్డి ఎన్నికల నేపథ్యంలో ఈ మాటలు చెప్పినా, కొన్ని నమ్మక తప్పదని కేసీఆర్‌ చర్యలే చెబుతున్నాయి. తాను, తన ప్రభుత్వం చేసిన అభివృద్ధితోనే మళ్లీ గెలుస్తామని కేసీఆర్‌ ఎందుకు చెప్పరు? మిషన్‌ భగీరథ గురించి కంటే, తగ్గిన రైతుల ఆత్మహత్యల కంటే, తగ్గిన నేతన్నల ఆత్మహత్యల గురించి కంటే చంద్రబాబును, కాంగ్రెస్‌ను విమర్శించడానికే ఆయన ఎక్కువ సమయం తీసుకుంటున్నారు.

నిస్సందేహంగా కేసీఆర్‌ తెలివైన రాజకీయవేత్త. అందుకే మిగిలిన రాజకీయ వేత్తల కంటే ముస్లిం ఓటు బ్యాంకును ఆయన వినియోగించుకుంటున్న తీరు కొంచెం భిన్నంగా కనిపిస్తున్నది. కానీ ఈ వైఖరితో రజాకార్‌ వారసత్వానికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేస్తున్న సంగతిని ఆయన మరిచిపోతున్నారు. అందుకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అదే విషయాన్ని కొంచెం ఘాటుగానే కేసీఆర్‌కు గుర్తు చేయవలసి వచ్చింది. తెలంగాణతో పాటే జరుగుతున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థి కమల్‌నాథ్‌ ముస్లింలంతా కాంగ్రెస్‌కే ఓటు వేసేలా చూడడం అత్యవసరం అంటూ సందేశాలు ఇస్తున్నారు. ఇదే మాటను కొంచెం మార్పుతో ఇక్కడ మజ్లిస్‌ నేతలే చెబుతున్నారు. తమకు కేసీఆర్‌ సహజ మిత్రుడని చెబుతున్నారు. అంటే మజ్లిస్‌ అభ్యర్థి లేని చోటల్లా ముస్లింల ఓట్లు కేసీఆర్‌కు పడాలనే దానర్థం కదా! ఇలాంటి మతపరమైన దాష్టీకాన్ని అరికట్ట వలసిన అవసరం ఎప్పటికీ ఉంటుంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా నవంబర్‌ 25న తెలంగాణ రాష్ట్రంలో జరిపిన ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటలను గుర్తు చేసుకోవాలి.

‘2012 నుంచి నిర్మల్‌ పేరు వింటు న్నాను. మొదటిసారి నిర్మల్‌ వచ్చాను. అక్బరుద్దీన్‌ ఒవైసీ హిందూ దేవతలను అవమానించిన చోటు ఇదే. ఆ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో సవాలు చేసే సత్తా మీకు (తెరాస సహా ఇతర పార్టీలకు) ఉందా?’ అని అమిత్‌షా నిర్మల్‌ బహరంగసభలో గర్జించారు. అలాగే ముస్లిం రిజర్వేషన్ల మీద అసెంబ్లీలో తీర్మానం చేయించి కేసీఆర్‌ కేంద్రానికి పంపించి చేతులు దులుపుకున్న విషయాన్ని కూడా అమిత్‌ గుర్తు చేశారు. మైనారిటీల రిజర్వేషన్‌కు సంబంధించి ఒక రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే సరిపోతుందా? అయితే మత ప్రాతిపదికన బీజేపీ రిజర్వేషన్లు ఇవ్వదని కూడా చెప్పారు. అలాగే ఆదివాసీలు 12 శాతం రిజర్వేషన్లు కూడా ప్రకటించారు. యాభయ్‌ శాతం రిజర్వేషన్లు మించకూడదు కాబట్టి ఎవరి కోటాకు కోత వేస్తారో కేసీఆర్‌ చెప్పాలని అమిత్‌షా కోరారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయింది. ఇంకా సెంటిమెంట్‌ను పట్టుకుని ముందుకు వెళదామంటే అది కేసీఆర్‌ బలహీనతే. మజ్లిస్‌ మీద అంత మమకారం ఎందుకంటే, దానిని అర్థం చేసుకోవడం కష్టం కాదు. కేసీఆర్‌ బుజ్జగింపు రాజకీయాల వైపు మొగ్గుతున్నారు. ఈ రెండు కూడా అత్యంత ప్రమాదకర ధోరణులు. వాటి నుంచి, కేసీఆర్‌ ధోరణి నుంచి రాష్ట్రాన్ని కాపాడగలిగేది బీజేపీ ఒక్కటేనని అమిత్‌షా, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ చెబుతున్న మాట ఎవరూ కొట్టివేయలేనిది. తెలంగాణ విమోచనకు మూల పురుషుడు సర్దార్‌ పటేల్‌. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నది బీజేపీ మాత్రమే. తెలంగాణకు బీజేపీ ఆత్మ బంధువు అని చెప్పడానికి ఇది చాలు.

బీజేపీ అభ్యర్థిని కాల్చేస్తామని బెదిరింపు

పాతబస్తీ కేంద్రంగా ఉన్మాదులైన కొందరు మజ్లిస్‌ మద్దతుదారులు చేస్తున్న బెదిరింపులను బట్టే వారిలో రజాకార్‌ మనస్తత్వం పోలేదని చెప్పవలసి వస్తున్నది. భారతదేశం మొత్తం రాజకీయ మార్పుకు దగ్గరవుతున్న క్షణంలో నిజాం నవాబు, రజాకార్లు హైదరాబాద్‌ సంస్థానాన్ని మరింత దిగ్బంధంలో ఉంచారు. కొద్దిముందు అయితే మహమ్మదలీ జిన్నాను కూడా నిజాం ఒక సందర్బంలో బహిష్కరించాడు. తరువాత చాలామంది కాంగ్రెస్‌ నాయకులకు సంస్థానంలో ప్రవేశం ఉండేది కాదు. ఆఖరికి ఈ సంస్థానం గుండా వెళ్లే రైళ్లలో కూడా జాతీయ కాంగ్రెస్‌ నేతలు వెళ్లడానికి నిజాం ఆంగీకరించేవాడు కాదు. అదే పునరావృత మవుతోందనిపిస్తున్నది.

‘కొత్తగా ఎన్నికలలో నిలబడుతున్నావా? దేశాన్ని ఉద్ధరిస్తావా? నువ్వెంత, నీ బతుకెంత? తుపాకీ తీసి ఒక్క తూటాతో కాలిస్తే నీకు దిక్కెవరు?’ చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ పడుతున్న షహజాదాకు ఫేస్‌బుక్‌ ద్వారా వచ్చిన బెదిరింపు ఇది. ఈ మేరకు ఆమె సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజానికి నామినేషన్‌ వేసిన మూడో రోజు నుంచే ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయని ఆమె తెలియచేశారు. అబూ ఫైసల్‌ అనే వ్యక్తి ఈ బెదిరింపునకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేశారు. మెట్రోన్యూస్‌ పేరుతో తన ఫేస్‌బుక్‌ ఖాతాలోనే ఒక పోస్టింగ్‌ పెట్టారని, అందులో కూడా చంపుతామని బెదిరించారని ఆమె చెప్పారు. వీటిని ఆమె లెక్క చేయలేదు. దీనితో ఆమె ఫొటోలను అశ్లీలంగా తయారు చేసి పోస్టు చేయడం ఆరంభించారు. మజ్లిస్‌ ఇప్పటికీ హైదరాబాద్‌ను, గట్టిగా చెప్పాలంటే తెలంగాణను మత రాజ్యంగానే భావిస్తున్నది. వారికి ఇతర మతాల వారి మీద, విశ్వాసాల మీద గౌరవం లేదు. ఇందుకు అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రకటనలు గుర్తు చేసుకోవచ్చు. అలాగే స్త్రీలన్నా కూడా గౌరవం లేదు. ఇందుకు షహజాదా ఉదంతమే కొండగుర్తు.

కేసీఆర్‌ మాటలేనా ఇవి?

‘టీఆర్‌ఎస్‌ ఓడిపోయిందనుకో, నాకు వచ్చే నష్టం పెద్దగా ఏం లేదు. ఏముంటది! గెలిపిస్తే గట్టిగా పని చేస్తా. లేదంటే ఇంట్లో పడుకుని రెస్ట్‌ తీసుకుంటా. వ్యవసాయం చేసుకుంటా. నష్టపోయేదెవరు? తెలంగాణ ప్రజలు…’. ఈ ప్రకటన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నోటి నుంచి వెలువడడం తెలంగాణను నివ్వెర పరిచింది. ఖానాపూర్‌ ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ మాటలు అన్నారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీద నిజంగా కేసీఆర్‌కు ఆగ్రహం ఉంటే దానిని అర్థం చేసుకోవలసిందే. ‘తెలంగాణలో ప్రాజెక్టులు కట్టొద్దంటూ చంద్రబాబు 35 ఉత్తరాలు రాశాడు. ఇలాంటి వాళ్లు అధికారంలోకి వస్తే మన ప్రాజెక్టులు సాగనిస్తారా?’ అంటూ కేసీఆర్‌ విమర్శించడాన్ని కూడా తప్పు పట్టలేం (కానీ ఇలాంటి లేఖలేవీ చంద్రబాబు రాయలేదని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు నామా నాగేశ్వరరావు తరువాత ఖండించారు). ఇవి ఎన్నికలు. ఇది ఎన్నికల ప్రచారం. ఒకరిద్దరు తప్ప నాయకులంతా నోరు జారడం, తరువాత వెనక్కి తీసుకోవడం సర్వసాధారణం. అయినప్పటికీ కేసీఆర్‌ అలా మాట్లాడతారని ఎవరూ ఊహించి ఉండరు. అంటే ఆయన అధికారంలో ఉంటేనే తెలంగాణ సంక్షేమం, బాగోగులు పట్టించుకుంటారా? ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన సాగించిన ఉద్యమం, ఆ ఉద్యమ ఆకాంక్షలు ఇవన్నీ అధికారంలో ఉంటేనే గౌరవనీయాలు అవుతాయా? గెలిపిస్తేనే గట్టిగా పని చేస్తారట. కాబట్టి ఇంతటి పోరాటాన్నీ, దాని స్ఫూర్తినీ తెరాస అధినేత ఎన్నికల అంశంగానే ఎప్పటికీ భావిస్తారా? అధికారం ఉంటేనే ప్రజాసేవ అన్న దక్పథం ఒక ఉద్యమ నాయకుడికి ఉండవలసింది కాదు. తన నేల మీద, తన ప్రజల మీద మమకారం ఎన్నికలలో వేసే ఓట్లను బట్టి, కట్టబెట్టే అధికారాన్ని బట్టి మారిపోతూ ఉంటుందంటే, అలాంటి వారు నిజమైన నేతలని అనిపించుకుంటారా? ఈ ఎన్నికలలో ఫలితాలు ఏమైనా కావచ్చు. కానీ కేసీఆర్‌ అన్న ఆ మాటలు ఆయన చరిత్ర మీద ప్రభావం చూపక తప్పదు. చివరిగా, చంద్రబాబు, కాంగ్రెస్‌ వంటి వారి పంచన చేరవలసిన అవసరం లేదనీ, వారి మోచేతి నీరు తాగవలసిన అవసరం తనకు లేదనీ ఉద్యమం నుంచి వచ్చిన నేతగా కేసీఆర్‌ అంటే స్వాగతించదగినదే. ఆత్మ గౌరవం కూడా ఆయన ఉద్యమంలో కీలకమే మరి! కానీ, మజ్లిస్‌తో ఎందుకీ రహస్య బంధం? ఆ పార్టీకి ఎందుకు తలొగ్గడం’ ? ఎందుకు ‘సలాం’ కొట్టడం?రి

ఎవరైనా మాకు  సలాం కొట్టాల్సిందే!

‘రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా నా చెప్పుచేతల్లోనే ఉంటారు. ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా తమ ముందు వంగి సలాం కొట్టినవారే. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందరూ మా మాటలు విన్నారు… కాదు కాదు విని తీరాల్సిందే!’ ఇది చాంద్రాయణగుట్ట మజ్లిస్‌ అభ్యర్థి, ఆ పార్టీ ప్రముఖుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ చెప్పిన మాట. ఇదేదో పార్టీ సమావేశంలో గుట్టుగా చెప్పింది కాదు, రహస్యంగా అంటే ఎవరో లీక్‌ చేసినదీ కాదు. హైదరాబాద్‌ నగరం పాతబస్తీలోని రియాసత్‌ నగర్‌లో నవంబర్‌ 24న ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో బాహాటంగా అన్న మాట. ఇంకా చాలా చెప్పారాయన. కొత్త సీఎంను నిర్ణయించడంలో తానే కింగ్‌ మేకర్నని బల్లగుద్దారు. ఎవరిని ఆ స్థానంలో కూర్చోబెట్టాలో, ఎవరిని దించాలో ఆయనకి బాగా తెలుసునట. డిసెంబర్‌ 11 తరువాత తెలంగాణ ముఖ్యమంత్రిని నిర్ణయించేదే ఆయనట. సఖ్యత కోసం అంతటి ఇందిరా గాంధీయే దారుస్సలాంకు వచ్చారు, ఇక మీరెంత అన్న అర్థంలో అక్బరుద్దీన్‌ వ్యాఖ్యానించారు. మీ నానమ్మే ఇలా మా దగ్గరకొచ్చారంటే, అర్థం చేసుకోమని రాహుల్‌ని హెచ్చరించా రాయన. అలాగే మోదీ హిందుత్వకే పరిమితమట. మజ్లిస్‌ మాత్రం ఈ దేశమంతటి క్షేమాన్ని కోరుతుందట. ఒకటి రెండు మాటలు మినహాయిస్తే ఇందులో మిగిలినవన్నీ సత్యాలే. తెలుగుదేశం, తెరాస, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ప్రతిసారి మజ్లిస్‌ ముందు మోకరిల్లిన సంగతి నిజం. ఎన్నికల వేళ ఆయా పార్టీలతో తమకున్న అనుబంధాన్ని అక్బరుద్దీన్‌ ఇలా అరటి పండు ఒలిచి పెట్టిన రీతిలో చెప్పడం మంచిదే. ఓటర్లు విషయం అర్థం చేసుకుంటారు. నిరంతరం బీజేపీని మతతత్వ పార్టీ అంటూ గోల చేసే ఆ పార్టీలు గతంలో ఎంతగా సిగ్గు విడిచి మజ్లిస్‌తో అంటకాగాయో ఓటర్ల దష్టికి వస్తుంది. ఈ వాస్తవం బీజేపీ చెబితే ఎవరికీ వంట పట్టదు. అక్బరుద్దీన్‌ చెప్పడమే మంచిది. అదే చేశారాయన. ఇక ఓటర్ల నిర్ణయం. ఒకప్పుడు తెలంగాణను నెత్తురుటేరులతో ముంచెత్తిన రజాకార్లతో, మతోన్మాదంతో అణచివేసిన నిజాంతో బాంధవ్యం ఉన్న రాజకీయ సంస్థతో అంటకాగుతున్న పార్టీకి లేదా పార్టీలకు ఓటు వేసేదీ లేనిదీ ఓటర్లు త్వరగా తేల్చుకుంటారు. మజ్లిస్‌ పరోక్ష పాలన కిందకు మళ్లీ వెళ్లవలసిన అవసరం ఉందో లేదో కూడా నిర్ధారించుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *