కమలం విశ్వాసం, కాంగ్రెస్‌లో నీరసం

కమలం విశ్వాసం, కాంగ్రెస్‌లో నీరసం

ఏప్రిల్‌ 11 నుంచి 17వ లోక్‌సభ సమరం

స్వతంత్ర భారతదేశ చరిత్రలో జాతీయవాద శక్తులు, దానికి ప్రాధాన్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ మరో కీలక పరీక్షను ఎదుర్కొన వలసిన సందర్భం వస్తోంది. 17వ లోక్‌సభను ఎన్నుకునే ఘడియలు సమీపించాయి. మార్చి 10వ తేదీన భారత ఎన్నికల సంఘం ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇక జాతీయవాద శక్తులు పాంచజన్యం పూరించి బరిలోకి దిగవలసి ఉంది.

16వ లోక్‌సభలో జాతీయవాద శక్తులకు ఆధిపత్యం చూపించాయి. బుజ్జగింపు రాజకీయాలకు కొంతమేర అడ్డుకట్ట వేయగలిగాయి. భారతీయత, హిందుత్వలను నిరంతరం వ్యతిరేకించే వారిని కట్టడి చేయగలిగాయి. పొరుగున ఉన్న పాకిస్తాన్‌ ఈ ఏడు దశాబ్దాల చరిత్రలో మరోసారి తలొగ్గింది. తొలిసారి పూర్తిగా ఏకాకి అయింది. ముస్లిం దేశాలు సైతం మొండిచెయ్యి చూపాయి. భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్రమోదీ నాయకత్వంలో తొలిసారి ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు బాసటగా నిలబడ్డాయి. ఇది పూర్తిగా మోదీ ప్రభుత్వ ఘనతే. మోదీ తలాక్‌ దురాచారాన్ని ఆపారు. యోగాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. దేశంలో కమ్యూనిస్టుల కారణంగా కొన ఊపిరికి వచ్చిన మన సంస్కృతి మళ్లీ కోలుకుంది.

ఇవన్నీ దేశహితం కోసమే బీజేపీ – ఎన్‌డిఏ ప్రభుత్వం చేసిందన్న సంగతిని ప్రజలు విశ్వసించారని చెప్పడానికి 17వ లోక్‌సభలోను విజయం సాధించవలసి ఉంది. ఇందుకోసం కార్యకర్తలు కృషి చేయవలసి ఉంది.

ఈ నేపథ్యంలోనే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా 17వ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను ప్రకటించారు. ఏప్రిల్‌ 11 నుంచి మే నెల 19 వరకు ఏడు దశలలో పోలింగ్‌ జరుగుతుంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏప్రిల్‌ 11న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అధికార, విపక్షాల స్థితిగతుల గురించి అవలోకిద్దాం.

రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ ముందుగానే ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో పొత్తులు ఖరారు చేసుకొని దూసుకుపోతుంటే, కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారైంది. మహాకూటమి వ్యూహం నెలరోజుల కిందే బెడిసికొట్టింది. ప్రతిపక్షాలను ఏకం చేసి పొత్తులు కుదుర్చుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఏన్డీయే కూటమికి వెలుపల ఉన్న ప్రాంతీయ పార్టీలు తతీయ ఫ్రంట్‌, ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీని అసలు విశ్వాసంలోకే తీసుకోవడం లేదు. దక్షిణాదిన డిఎంకే, జేడీఎస్‌ తప్ప ఇతర పార్టీలు కాంగ్రెస్‌ను దూరంగా పెట్టాయి. ముఖ్యంగా మమత, మాయా, అఖిలేష్‌, కేజ్రీవాల్‌, చంద్రబాబు వ్యూహం ముందు రాహుల్‌ చిత్తయిపోయారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా అంగీకరించే విషయంలో వారు భిన్నస్వరాలు వినిపిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికలకు ముందే బీజేపీ మళ్లీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయని స్పష్టమైపోయింది. పరిస్థితులన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతే తమను గెలిపిస్తుందనే నమ్మకంతో నరేంద్రమోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన దుష్ప్రచారం పెద్దగా ఫలించలేదు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ తదితర అంశాలు బీజేపీకి ప్రతికూలంగా మారతాయని కాంగ్రెస్‌ పార్టీ భావించింది. కానీ అభివద్ధి మంత్రంతో అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తున్న బీజేపీపై ప్రజల విశ్వాసం చెక్కు చెదరలేదని, మళ్లీ కేంద్రంలో మోదీ సర్కారు ఖాయమని సర్వేలన్నీ చెప్పుతున్నాయి. దీంతో దిక్కుతోచని రాహుల్‌ గాంధీ లేని రఫేల్‌ కుంభకోణాన్ని పట్టుకొని అబద్దాలకోరుగా ముద్ర వేసుకున్నారు.

హస్తానికి హ్యాండ్‌ ఇచ్చిన మిత్రులు

ప్రసుత్తం దేశంలోని పరిస్థితులన్నీ సానుకూలంగా కనిపించడంతో టీడీపీ తప్ప పాత మిత్రులందరితో తిరిగి పొత్తులను కుదుర్చుకుంది బీజేపీ. ఎన్డీఏ కూటమిలోని మిత్ర పక్షాలందరితో బీజేపీ తిరిగి పొత్తులు పెట్టుకొని దూసుకుపోతుంటే, కాంగ్రెస పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది.

గత ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన అరకొర ఫలితాన్ని చూసుకొని సార్వత్రిక ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకుంది కాంగ్రెస్‌ పార్టీ. కానీ అది అక్కడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభావం తప్ప అసలైన గెలుపు కాదు అని తెలియడానికి పెద్ద సమయం కూడా పట్టలేదు.

బీజేపీ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నింటినీ కూడగట్టుకొని మహాకూటమి ఏర్పాటు చేస్తామని బీరాలు పలికారు రాహుల్‌ గాంధీ. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీకి నిజంగా వ్యతిరేక వాతావరణం ఉంటే, త తీయ కూటమి పేరుతో మళ్లీ చక్రం తిప్పాలని ఆశలు పెట్టుకున్నాయి కొన్ని ప్రాంతీయ పార్టీలు. ఈ కారణం వల్లే కాంగ్రెస్‌తో అంటీ అంటనట్లుగాను ఉంటున్నాయి.

ఎస్పీ, బీఎస్పీల వ్యూహానికి చిత్తు

దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీలతో కలసిపోటీ చేయాలని రాహుల్‌గాంధీ భావించారు. అయితే కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని ముందే గ్రహించి సీట్లన్నీ అఖిలేష్‌, మాయావతి పంచేసుకున్నారు. సోనియా గాంధీ, రాహల్‌ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ మాత్రమే కాంగ్రెస్‌ కోసం వదిలిపెట్టారు. దీంతో షాక్‌ తిన్న రాహుల్‌ తన సోదరి ప్రియాంకను ఒప్పించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అయితే ప్రియాంకతో పెద్దగా ప్రయోజనం కనిపించటం లేదని క్షేత్రస్థాయి వాస్తవాలు చెబుతున్నాయి. పైగా కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు పెరగడం వలన ఎస్పీ, బీఎస్పీ కూటమికే నష్టం అని తెలుస్తోంది. యూపీలో మూడు దశాబ్దాల క్రితం కోల్పోయిన ప్రాభవం ఇక ఎప్పటికీ తిరిగి సాధించలేమని కాంగ్రెస్‌కు అర్థం కావటానికి మరికొంత సమయం పట్టవచ్చు.

దీదీ దోబూచులాట

పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యూహం ముందు రాహుల్‌ ఎత్తులు ఫలించడం లేదు. కేంద్రంలో బీజేపీకి అధికారం తిరిగి దక్కకుంటే తాను చక్రం తిప్పుతాననే భ్రమల్లో ఉన్నారు మమత. కాంగ్రెస్‌తో ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోవడంకన్నా, ఎన్నికల తర్వాత ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని ఆమె భావిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో తణమూల్‌ పార్టీని కాదని వామపక్షాలతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా కాంగ్రెస్‌ పార్టీకి లేవు. కేరళలో నేరుగా కాంగ్రెస్‌ పార్టీతో తలపడుతున్న వామపక్షాలు బెంగాల్‌లో చేతులు కలిపితే మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నాయి.

బాబుకు ముందే దూరం

ఎన్టీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు, మోదీ మీద కోపంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కోరి మరీ పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ చిత్తుగా ఓడిపోతే, అంతకన్నా అవమానకర ఫలితం టీడీపీకి మిగిలింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడమే మంచిదని భావిస్తూ వచ్చారు చంద్రబాబు. కానీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి టీడీపీతో పొత్తు అసలు ఇష్టం లేదు. చంద్రబాబుతో కలిసిపోతే నష్టమే ఎక్కువ అనే వారి వాదనతో కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఏకీభవించినట్లే కనిపిస్తోంది. అయినప్పటికీ జాతీయ స్థాయిలో రాహుల్‌ గాంధీతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు చంద్రబాబు. చివరికి అది ఎటు దారితీస్తుందోనని ఎపి కాంగ్రెస్‌ వర్గాలు భయపడు తున్నాయి.

కేజ్రీతో కూడా చిక్కే

ఢిల్లీలో బీజేపీకి చెక్‌ పెట్టాలంటే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ భావించాయి. రాహుల్‌గాంధీ ఈ విషయంలో ఆసక్తి చూపించినా, మాజీ సీఎం షీలాదీక్షిత్‌ మోకాలడ్డారు. దీంతో పొత్తు బెడిసికొట్టింది. మరోపక్క ఢిల్లీలో పొత్తుకు బదులుగా హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో తమ పార్టీకి ఎక్కువ సీట్లు కావాలని అరవింద్‌ కేజ్రివాల్‌ డిమాండ్‌ చేశారు. అది ఇష్టం లేని కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా వెళ్లేందుకే మొగ్గు చూపుతోంది.

ఆ ముగ్గురే మిగిలారు

సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు పెట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీకి నికరంగా మిగిలిన పెద్ద ప్రాంతీయ పార్టీలు మూడు మాత్రమే. కర్ణాటకలో కీలుబొమ్మ కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్‌, లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌కు 10 సీట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్‌, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీలు చెరిసగం సీట్లకు పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇక తమిళనాడుతో డీఎంకే కూటమి కాంగ్రెస్‌ పార్టీకి 10 సీట్లను కేటాయించి సరిపెట్టింది. బిహార్‌లో లాలూ పార్టీ ఆర్జేడీతో కాంగ్రెస్‌కు పొత్తు ఉన్నా అంతగా కలిసి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

రాహుల్‌ ప్రధానా? నో..

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ వస్తే తానే ప్రధానిని అవుతానని ఏడాది క్రితమే ప్రకటించుకున్నారు రాహుల్‌గాంధీ. ఇందుకు మిత్రపక్షం డీఎంకే తప్ప ఇతర విపక్ష పార్టీలు సానుకూలంగా స్పందిచలేదు. రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని తాను బలపరుస్తున్నానని స్టాలిన్‌ ప్రకటించగానే గగ్గోలు పుట్టింది. స్టాలిన్‌ ప్రకటన సొంత అభిప్రాయమని తమకు సంబంధం లేదని మమత, అఖిలేష్‌, మాయా స్పష్టం చేశారు. ప్రధాని అభ్యర్ధి ఎవరు అనేది నిర్ణయించాల్సింది ఎన్నికల తర్వాతేనని వారు చేప్పేశారు. రాహుల్‌ ప్రధాని అని ముందు ప్రకటిస్తే, తమ రాష్ట్రాల్లో వచ్చే ఓట్లు, సీట్లు కూడా రావని, కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం తమకు పోతుందని వారి భయం.

రాహుల్‌ గాంధీ ప్రధాని అభ్యర్థి అని ప్రకటిస్తే, సార్వత్రిక ఎన్నికలు ‘మోదీ వర్సెస్‌ రాహుల్‌’ గా సాగి తమకు నష్టం జరుగుతుందని బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే మహాకూటమిని ముందు ఏర్పాటు చేసి ప్రకటించడం కన్నా, ఎన్నికల తర్వాత హంగ్‌ ఏర్పడితే అప్పుడు కూటమిగా ఏర్పడి క్రియాశీలపాత్ర పోషించాలన్నది ప్రాంతీయ పార్టీల వ్యూహంగా కనిపిస్తోంది.

కాంగ్రెస్‌ ఆశలు గల్లంతే

ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీని ఓడించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీకి మారిన పరిస్థితుల్లో ఆ రాష్ట్రాల నుంచి పెద్దగా సీట్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి బలంగా ఉండటంతో అక్కడా పెద్దగా సీట్లు వచ్చే అవకాశం లేదు. బీహార్‌లో ఆశలు ముందే గల్లంతయ్యాయి. బెంగాల్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిషాలలో కాంగ్రెస్‌ పప్పులు ఉడకవు. ఉత్తరప్రదేశ్‌లో ఒంటరి పోరు నష్టం కలిగించడం ఖాయం. మిగతా చిన్న రాష్ట్రాల్లో వచ్చే ఒకటి, అరా సీట్లతో పెద్దగా ఫలితం ఉండదు.

ఈ లెక్కలన్నీ కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. ప్రధానమంత్రి అవ్వాలనే ఆశ సంగతి పక్కన పెడితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష నాయకుని హోదాకు అవసరమైన సీట్లు వస్తాయా లేదా అనే బెంగ పట్టుకుంది రాహుల్‌ గాంధీకి. ఈ కారణం వల్లే అసహనంతో రగిలి పోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వ్యక్తిగత దూషణల పర్వానికి తెరలేపారు. ఇది కాంగ్రెస్‌ పార్టీకి మరింత నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మోదీకి పెరిగిన ఆదరణ

మరోపక్క పుల్వామా ఉదంతం, ఆ తరువాత పాక్‌పై జరిపిన మెరుపు దాడులు, పాక్‌ను అంతర్జాతీయంగా ఒంటరి చేయటం, అభినందన్‌ను మూడు రోజుల వ్యవధిలోనే దేశానికి రప్పించటం వంటి గగుర్పొడిచే సంఘటనలతో సగటు భారతీ యునిలో దేశభక్తి భావన ఉప్పొంగింది. ఫలితంగా ప్రస్తుత ప్రధాని మోదీపై సహజంగానే ప్రజల్లో ఆదరణ పెరిగింది. దానితోపాటు వ్యక్తిగతంగా మోదీపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోవటం, ఆయన పరిపాలనపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోవటం వంటి సానుకూల అంశాలతో మోదీ మరింత ప్రజాదరణను పొందారు. దీనివలన ఎన్నికలు ప్రక్రియ ప్రారంభమైన ఈ సమయంలో భాజపాలోకి వలసలు పెరిగే అవకాశం లేకపోలేదు. పెరిగే వలసలతో ఓట్లు, సీట్లు కూడా మరిన్ని పెరగవచ్చు. మొత్తంమీద 2019 ఎన్నికలలో కూడా అధికార భాజపాకు తిరుగులేదనే విషయం స్పష్టమవుతున్నది.

– క్రాంతిదేవ్‌ మిత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *