ప్రధాని అకాంక్ష, శాస్త్రవేత్తల దీక్షతో ఏ-శాట్‌ మహా విజయం

ప్రధాని అకాంక్ష, శాస్త్రవేత్తల దీక్షతో ఏ-శాట్‌ మహా విజయం

ప్రపంచం ఇప్పుడు అంతరిక్షమే హద్దుగా ఎదుగుతోంది. యుద్దమంటూ వస్తే సైనిక, నౌక, వైమానిక శక్తులైన త్రివిధ దళాలతో పాటు అంతరిక్షంలో కూడా ఇవాళ సర్వసన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఈ 21వ శతాబ్దపు తొలినాళ్లలో.. ఇప్పటివరకు ఉపగ్రహాలను కూల్చే శక్తి కేవలం మూడు దేశాలకే పరిమితం. తాజాగా భారత్‌ నిర్వహించినఉపగ్రహ విధ్వంసక ప్రయోగంతో ఆ సామర్థ్యం కూడా సాధించు కున్నట్టయింది. మొన్న జరిగిన ఏ-శాట్‌ మిసైల్‌ ప్రయోగంతో భారత్‌ ప్రపంచంలో ఈ తరహా శక్తి కలిగిన నాలుగవ దేశంగా అవతరించింది. ప్రతి భారతీయుడూ రొమ్ము విరుచుకుని సగర్వంగా చెప్పుకునేలా చేసింది. ఇంతకీ స్పేస్‌ వార్‌ అంటే ఏమిటి? అంతరిక్షంలో యుద్ధం ఎలా జరుగుతుంది..? ఎవరితో జరుగుతుంది..?

మార్చి 27 బుధవారం: ఉదయం సరిగ్గా 11.16 నిమిషాలకు ఒడిశాలోని బాలాసోర్‌లో నిప్పులు కక్కుతూ, పొగలు చిమ్ముకుంటూ రాకెట్‌ లాంటిదేదో ఆకాశంలోకి దూసుకుపోయింది. డాక్టర్‌ అబ్దుల్‌ కలాం ఐలాండ్‌ లాంచ్‌ కాంప్లెక్స్‌లో నిపుణులు శాస్త్రజ్ఞులు, ప్రతినిధులతో హడావిడిగా ఉంది. అప్పటిదాకా అక్కడేం జరగనుందో ప్రపంచానికి తెలియదు. అక్కడ జరగనున్న మిషన్‌ శక్తి ఆపరేషన్‌ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. నిపుణుల సారథ్యంలో నింగిలోకి ఎగిసిన ఏ-శాట్‌ మిసైల్‌ కేవలం మూడు నిమిషాల్లోనే నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంది. డీఆర్‌డీవో విడుదల చేసిన వివరాల మేరకు భూమికి 275 కిలోమీటర్ల ఎత్తులో చాలా కాలంగా పనిచేయ కుండా ఉన్న భారత ఉపగ్రహాన్ని చేరుకుంది. మిసైల్‌ హీట్‌ షీల్డ్‌ తెరుచుకోగానే ఉపగ్రహాన్ని వెంటాడిన మిసైల్‌ క్షణంలో తునా తునకలుగా చేసింది. ఈ విషయం

ఈ ప్రయోగంతో మన ఉపగ్రహాలే కాదు, మన దేశ వ్యవహారాల గురించి గూఢచర్యం నిర్వహించే శత్రుదేశాల ఉపగ్రహాలనీ, మన ఉపగ్రహాలని ధ్వంసం చేయడానికి వచ్చే శత్రుదేశాల క్షిపణులనీ కూడా మన యాంటి శాటిలైట్‌ మిసైల్స్‌ ముక్కలు ముక్కలుగా చేసేస్తాయి. ఈ మిషన్‌ కోసం డీఆర్‌డీవో సొంతంగా రూపొందించిన బాలిస్టిక్‌ మిసైల్‌ డిఫెన్స్‌ ఇంటర్‌సెప్టర్‌ను, కైనటిక్‌ కిల్‌ అనే టెక్నాలజీలను ఉపయోగించారు. భూకక్ష్యలో ఉన్న ఉపగ్రహాన్ని పేల్చడం వల్ల అంతరిక్షంలో ఎలాంటి చెత్త పేరుకు పోకుండా ఉండేలా చూశారు. ధ్వంసమైన శాటిలైట్‌ శకలాలు కొన్ని వారాల వ్యవధిలో భూమ్మీద పడి పోతాయి. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు డీఆర్‌డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోవల్‌తో పాటు జాతీయ రక్షణ మండలి అధికారులు హాజరయ్యారు. అంతరిక్షంలో ఉన్న భారత ఉపగ్రహ వ్యవస్థను రక్షించుకునేందుకు ఈ ప్రయోగం చాలా అవసరమని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మిషన్‌ శక్తి పేరుతో నిర్వహించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఏ-శాట్‌ ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారత శాస్త్రజ్ఞులు రూపొందించిన ఈ పరిజ్ఞానంతో మనదేశం అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల సరసన చేరిందన్నారు. ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ‘భూమి, నీరు, గాలిలోనే కాదు ఇప్పుడు అంతరిక్షంలోనూ మనల్ని మనం కాపాడుకోగలం. ఇది మనం గర్వించాల్సిన క్షణ’మని ఆయన అన్నారు. ఏ-శాట్‌ మిసైల్‌ ఏ దేశానికీ వ్యతిరేకం కాదని, కేవలం మన ఆత్మరక్షణ కోసమేనని తెలిపారు. ప్రయోగంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు.

భూమికి 3 వందల కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే శత్రుదేశాల ఉపగ్రహాలు చాలాసార్లు మన దేశానికి సమస్యలు సృష్టించి పెడుతున్నాయి. అవి మన ఉపరితలంపై తిరుగుతూ మన దేశ రహస్యాలను చాటుమాటుగా సంగ్రహిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్‌, చైనా లాంటి దేశాలు ఈ తరహా విధానంలోనే మనదేశంలో చీమ చిటుక్కుమన్నా తెలుసుకుంటున్నాయి. చైనా సాయంతో ఇప్పటికే పదుల సంఖ్యలో ఈ తరహా గుఢాచార ఉపగ్రహాలను ఉపయోగించుకుంటోంది పాకిస్తాన్‌. వాటి సాయంతో దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పనులు చేస్తూ మన రక్షణ వ్యవస్థకు కంటిలో నలుసులా వ్యవహరిస్తోంది. భౌగోళికంగా మన రెండు దేశాలు కలసిపోయి ఉండటంతో అవి తమ దేశాల కోసం రూపొందించుకున్నామంటూ సర్ది చెప్పుకుంటోంది.

మానవ రహిత డ్రోన్‌ విమానాలతో పాటు అంతరిక్షపు లోయర్‌ ఆర్బిట్‌లో తిరిగే గుర్తు తెలియని ఉపగ్రహాలు మనకు అపారమైన నష్టం కలుగ జేస్తున్నాయి. మనకు తెలియకుండా మన దేశపు భౌగోళిక వివరాలను ఇతర దేశాలకు అమ్ము కునేందుకు కూడా తెగిస్తున్నాయి. కోట్లాది రూపాయలతో రూపొందించుకుని ప్రయోగించుకున్న మన ఉపగ్రహాలను సైతం శత్రుదేశాలు ధ్వంసం చేయడాన్ని ఇన్నాళ్లూ నిలువరించలేకపోయాం. కొన్నిసార్లు మన ఉపగ్రహాలు ఉన్నట్టుండి అంతర్ధాన మవడం వెనుక ఇలాంటి సీక్రెట్‌ ఆపరేషన్లు జరుగుతున్నాయని తేలింది. పరిజ్ఞాన లోపంతో ఈ విషయాన్ని గుర్తించలేకపోయాం. ఇకపై ఆ ప్రమాదం ఉండదు. శత్రుదేశం మన ఉపగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయోగించే మిసైల్‌ ను కూడా గుర్తించి వెంటాడి మట్టు పెట్టే బాలిస్టిక్‌ సాంకేతిక పరిజ్ఞానం మనకు అందుబాటులోకి వచ్చింది.

అంతర్జాతీయ అంతరిక్ష సరిహద్దులు దాటివచ్చే ఉపగ్రహాలను మిసైళ్లను కూల్చివేయడం మినహా మరో మార్గం లేదు. ఆ క్రమంలో లో ఎర్త్‌ ఆర్బిట్లో, అంటే అంతరిక్షంలో ముక్కలు ముక్కలుగా విడిపోయిన ఉపగ్రహ విడిభాగాలు కొన్ని రోజుల పాటు భూమి చుట్టూ తిరుగుతాయి. క్రమంగా ఎత్తును కోల్పోతూ భూవాతావరణంలోకి రాగానే వాటి గమనంలో వేగం పెరిగిపోయి మండిపోతాయి. లేదా భూమిపై పడతాయి. జనావాసాలపై పడిపోవడం ఆకాశంలో ప్రయాణించే విమానాలకు వీటి వల్ల నష్టం కలిగే అవకాశం ఉంటుంది. మిసైల్‌ ఎటాక్‌ పూర్తయిన 45 రోజులకు అవి భూమి వైపు దూసుకువస్తాయి. ఆ ఒక్క ప్రమాదాన్ని అమెరికా ఇప్పుడు ఎత్తిచూపుతోంది.

యుద్ధంలో క్షిపణులను ప్రయో గించాలన్నా, సైనికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నా, యుద్ధ విమానాలు మోహ రించాలన్నా అంతరిక్షం లోని ఉపగ్రహ కమ్యూనికేషన్‌ వ్యవస్థే కీలకం. దీనికి మూలం ఉపగ్రహాలు. వీటిని ధ్వంసం చేయడం ద్వారా శత్రుదేశాల వ్యూహాలను చిత్తు చేయొచ్చు. యుద్ధాల్లో వినియోగించే గైడెడ్‌ బాంబులు, క్షిపణులు అన్నీ ఉపగ్రహాల ఆధారంగా తమ లక్ష్యాలను ఛేదిస్తాయి. భారత్‌పై ఏ దేశమైనా క్షిపణి ప్రయోగిస్తే దాన్ని మార్గనిర్దేశం చేసే ఉపగ్రహాన్ని కూల్చి ముప్పును తప్పించుకోవచ్చు. అంతరిక్ష వ్యవస్థలపై సైబర్‌ దాడులు కూడా ఏ శాట్‌ ద్వారా నిర్వీర్యం చేసే వీలుంది. అయితే ఇప్పటివరకు ఏ యుద్ధంలోనూ వీటిని ఉపయోగించలేదు. ఎవరైనా అటువంటి ఆలోచనతో మనదేశపు అంతరిక్షపు హద్దుల్లోకి ప్రవేశిస్తే చాలు మన రాడార్లు, ఉపగ్రహాలు పసిగడతాయి.

శత్రుదేశ ఉపగ్రహం గూఢచర్యం కోసం వచ్చిందని రూఢి అయిందంటే చాలు, వాటి గమనాన్ని కమాండ్‌ కంట్రోల్‌ కంప్యూటర్లు లెక్కలు కడతాయి. ఆలర్ట్‌ సిస్టమ్‌ ద్వారా యాంటి శాట్‌ మిసైల్‌ రెడీ అయిపోతుంది. అధికారులు నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం – లో ఎర్త్‌ ఆర్బిట్లో తిరిగే ఉపగ్రహాన్ని పిన్‌ పాయింటెడ్‌గా గుర్తించి వెంటాడి వేటాడుతుంది. హీట్‌ షీల్డ్‌ తొలగించుకుని నేరుగా లక్ష్యాన్ని డీకొట్టి పేలిపోతుంది. ఉపగ్రహం నామ రూపాలు లేకుండా ధ్వంసమైపోతుంది. ఒకరకంగా ఒక్కో మిసైల్‌ను ఒక్కో అంతరిక్ష సైనికుడిగా భావించవచ్చు. ఈ మొత్తం కార్యక్రమం కేవలం మూడంటే మూడు నిమిషాల లోపులోనే పూర్తయి పోయింది. ప్రయోగం విజయవంతం అవడంతో మన దేశ రహస్యాలిక బయటకు వెళ్లే అవకాశాలు దాదాపు మృగ్యమైనట్టే.

భారత్‌ రహస్యాలపై కన్నేసేందుకు శత్రుదేశాలు ఉపగ్రహాలు ప్రయోగించే సాహసం చేయలేవు. మనం ఎలాగూ వాటిని కూల్చివేస్తామని తెలిస్తే..వాటి కోసం కోట్లాది డాలర్ల అనవసరపు ఖర్చు చేయడానికి ఏ దేశమూ ముందుకు రాదు. అయితే ఇన్నాళ్లూ ఈ పరిజ్ఞానం అమెరికా, రష్యా, చైనాల వద్దే ఉండేది. ఇప్పుడు మనం కూడా ఈ పరిజ్ఞానాన్ని సాధించు కోవడంతో శత్రువుకు దీటుగా జవాబు చెప్పే అవకాశం ఏర్పడింది. అంతే కాదు, వీటిని మరో ప్రయోజనం కోసం కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు పరిశోధకులు. నిత్యం మనం నివసించే భూమిపై ఉల్కలు, గ్రహశకలాలు వచ్చి పడుతుంటాయి. ఓ మోస్తరు ఆస్టిరాయిడ్‌ లాంటివి జనావాసాల్లో పడితే నష్టం తీవ్ర స్థాయిలో ఉండొచ్చు. మన దేశపు నగరాలపై వచ్చిపడే ఓ స్థాయి గ్రహశకలాలను అంతరిక్షంలోనే పేల్చివేసేందుకు కూడా ఈ తరహా మిసైళ్లు ఉపయోగపడతాయి.

డీఆర్‌డీఏ పూర్తి దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించిన ఏ-శాట్‌ ప్రయోగం విజయవంతం కావడంతో అగ్రరాజ్యాలు గుర్రు మంటున్నాయి. అమెరికా వెంటనే స్పందించింది. యాంటీ శాటిలైట్‌ వెపన్స్‌ ఉపయోగించడం ద్వారా అంతరిక్షంలో గందరగోళం సష్టించొద్దని అమెరికా తాత్కాలిక రక్షణ మంత్రి పాట్రిక్‌ షనాహన్‌ హెచ్చరించారు. మిషన్‌ శక్తి ప్రయోగం తర్వాత అంతరిక్షంలో ఏమైనా శాటిలైట్‌ శకలాలు మిగిలాయా అన్న విషయం గురించి ప్రత్యేక దృష్టి పెట్టింది అమెరికా. ఈ పరీక్షను తాము అధ్యయనం చేస్తున్నామని, ఎవరికీ అంతరిక్షాన్ని అస్థిరపరిచే హక్కు లేదని తెలిపింది. ఇప్పటికే వ్యర్థాలతో నిండిపోయిన అంతరిక్షాన్ని యాంటీ శాటిలైట్‌ పరీక్షలతో మరింతగా పెంచొద్దని కోరారు. దీనిపై స్పందించిన భారత్‌, తమ ద్వారా శాటిలైట్‌ శకలాల సమస్య ఎంతమాత్రం తలెత్తబోదని స్పష్టంచేసింది.

ఇకపోతే యాంటి శాటిలైట్‌ ప్రయోగంతో ఇటు పాకిస్తాన్‌ అటు చైనాలకు గుండెలు అదిరిపోయాయి పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ… అంతరిక్షం అందరిది, అక్కడ కూడా ఇలాంటి విన్యాసాలు తగవని భారతదేశం పేరును ప్రస్తావించ కుండా సన్నాయి నొక్కులు నొక్కారు. మరో ప్రకటనలో చైనా కూడా దాదాపు ఇలాగే స్పందిం చింది. ఎలాంటి పరీక్షలు చేసినా ప్రపంచంలోని అన్ని దేశాలు శాంతియుతంగా ఉండాలన్నదే తమ అభిమతం అని తెలిపింది. ఈ విజయంతో ప్రపంచ దేశాలన్నీ మన దేశంతో సంబంధాలు మెరుగు పరచుకుంటాయి. ఎప్పుడైనా అవసరం పడొచ్చన్న అభిప్రాయంతో ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యవహరిస్తాయి. అందులో ఏ మాత్రమూ సందేహం లేదు.

ఇప్పటి దాకా ఆ మూడు అగ్రదేశాలు మాత్రమే ఏ-శాట్‌ ప్రయోగాలు నిర్వహించాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. చైనా తమ దేశానికి చెందిన వాతావరణ ఉపగ్రహాన్ని కూల్చివేసేందుకు 2007 జనవరి 11న ఎస్సీ-19 ఏ-శాట్‌ అంతరిక్ష క్షిపణిని ప్రయోగించి విజయం సాధించింది. 2018 ఫిబ్రవరి 5న డాంగ్‌-నెంగ్‌-3 అనే మరో క్షిపణిని ప్రయో గించింది. 2015 నవంబరు 18న రష్యా కూడా పీఎల్‌-19 నుడాల్‌ పేరుతో ఏ-శాట్‌ను విజయ వంతంగా పరీక్షించింది. ఆ తర్వాత 2016 మే, 2016 డిసెంబరు, 2018 మార్చిలోనూ క్షిపణిని ప్రయోగించింది. ‘రిమ్‌ు161 స్టాండర్డ్‌ మిసైల్‌ 3 ఏబీఎమ్‌’ పేరుతో అమెరికా కూడా 2008 ఫిబ్రవరి 14న దీన్ని పరీక్షించింది. అంతరిక్షంలో భారత ప్రయోజనాలను కాపాడుకోవడానికి స్పేస్‌ వార్‌ కోసం ముందే సిద్ధపడాలంటున్నారు మన శాస్త్రవేత్తలు.

దేశ భద్రత కోసం అనేక దేశాలతో పోటీ పడి ఎన్నో ఉపగ్రహాలను మనం అంతరిక్షంలోకి పంపించాం.. మంగళ్‌యాన్‌ పేరుతో మార్స్‌పైకి రోవర్‌ను.. గగన్‌యాన్‌ పేరుతో మనిషిని అంతరిక్షం లోకి పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దేశ, రక్షణ, ఆర్థిక అవసరాల కోసం ఇలాంటి ప్రయోగాలు అత్యంత కీలకమైనవి. అంతరిక్షంలోని ఆస్తులను కాపాడుకోవడం, వాటికి ఎదురయ్యే ముప్పును గుర్తించి నివారించడం కూడా ఈ ప్రాజెక్టులో ఒక భాగమని చెబుతున్నారు. ఉదాహరణకు ప్రపంచ వాణిజ్యంలో అత్యధిక భాగం మహా సముద్రాల ద్వారానే జరుగుతుంది. హిందూ మహాసముద్రం పరిధిలో వేలాది నౌకలు చమురు, సరుకుల రవాణా కోసం తిరుగుతుంటాయి. ఈ ప్రాంతాల్లో నిఘా వేయడంలో ఉపగ్రహాలదే కీలకపాత్ర. మరి ఆ ఉపగ్రహాలను రక్షించుకునేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. పెరిగిపోతున్న సాంకేతికత నేపథ్యంలో దేశ భద్రతకు కొత్త ముప్పులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో భారత్‌ ఈ టెక్నాలజీని అభివద్ధి చేసింది.

యాంటీ శాటిలైట్‌ వెపన్‌ ప్రయోగం సక్సెస్‌ అవడాన్ని ‘అంతరిక్షంలో భారత్‌ నిర్వహించిన సర్జికల్‌ స్ట్రైక్‌’గా బీజేపీ అభివర్ణించింది. దీనిని విజయ వంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలను పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా అభినందించారు. డీఆర్‌డీవో సాధించిన ఈ విజయంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం ఆపాలని ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ అన్నారు. కాగా, ఏ-శాట్‌ పరీక్ష చేపట్టి మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, ఆయన ధైర్యం వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఇస్రో మాజీ చైర్మన్‌ మాధవన్‌ నాయర్‌ అన్నారు. ఎన్నికల నేపథ్యంలో పుల్వామా ఘటన జరిగింది..అలాగే అందుకు ప్రతిగా బాలాకోట్‌ సర్జికల్‌ స్ట్రైక్‌ కూడా జరిగింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ మాట్లాడిన ప్రతీ మాటనూ ప్రతిపక్షాలు తప్పుగా ఎత్తిచూపుతున్నాయి. కానీ శాస్త్రవేత్తల సాహసోపేత నిర్ణయాల వెనుక ఆయన ప్రోత్సాహం ఆర్థికంగా నిధుల మంజూరీలే ఈ విజయాలకు కారణమౌతున్న సంగతి ఎవరూ కాదనలేని సత్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *