సునామీలో చిక్కుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వదగిన సాక్ష్యం ఉందా?

సునామీలో చిక్కుకున్న సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వదగిన సాక్ష్యం ఉందా?

‘తమ అంతరాత్మలను అమ్ముకున్నవారుగా భావితరాలవారు మమ్ములను గుర్తించే అవకాశం (ప్రమాదం) ఉంది. కాబట్టి ఈ విషయం మాట్లాడ వలసి వస్తున్నది’. ఇటువంటి మాట ఎవరూ తేలికగా అనరు. అలా అనటం ఒక సాహసం. అందుకు బలమైన కారణాలు ఉండాలి. కొందరు ఇలా అంటూ పత్రికల ముందుకు వచ్చారంటే, నైతికతకు సంబంధించిన విషయాలుగా ప్రస్తావిస్తున్నా రంటే, ఆ సంస్థ అంతర్గత కల్లోలంలో ఉందని స్పష్ట మౌతుంది. వేలెత్తి చూపడానికి అవకాశం లేనివిధంగా, పేరు ప్రతిష్ఠలు గల్గిన సర్వోచ్ఛ న్యాయ స్థానపు న్యాయమూర్తులు నలుగురు గతంలో ఎన్నడూ లేనివిధంగా పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి, ప్రధాన న్యాయమూర్తితో తాము ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ‘సర్వోచ్ఛ న్యాయస్థానం నడుస్తున్న తీరు సవ్యంగానే ఉన్నదా?’ అని సందేహించదగిన స్థితి ఎదురౌతున్నదని వారు చెప్పారు. వారు లేవనెత్తిన అంశాలను తేలికగా కొట్టిపారేయలేము, వాటిని పట్టించుకొని తీరాలి. దీనిని ఏ విధంగా సర్దుబాటు లేదా సంస్కరణ చేయాలో ఆవిధంగా చేస్తే, అది న్యాయస్థానానికి నూతన శక్తిని సమకూరుస్తుంది. అయితే మనదేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థలు అందులోని వ్యక్తులు తమకుతామే ఎంతో ఘనులుగా ఊహించుకొనే స్వభావం గల వారైన కారణంగా అరాచక స్థితికి దిగజారిన ఎన్నో ఉదాహరణలు మనముందున్నవి. అలాంటి ప్రమాదం మరోసారి జరుగకుండా చూసుకోవటమే ఇప్పుడు మనముందున్న సవాలు.

ఇప్పుడు మనం తేల్చుకోలేని అయోమయావస్థలో పడుతున్నామంటే, దానికి కారణం నలుగురు న్యాయమూర్తుల ఆరోపణలో స్పష్టత లేకపోవటం. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ దీపక్‌ మిశ్రాగారి పట్ల నలుగురు న్యాయమూర్తులకు నమ్మకం లేదన్నది ఈ సమస్యలోని మౌలికాంశం. ఆయన అనుచితమైన రీతిలో వ్యవహరిస్తున్నాడని వారి ఆరోపణ. వారి ఆరోపణలు వ్యక్తిగత వ్యవహార శైలికి సంబంధించినవి. ప్రధాన న్యాయమూర్తుల అధికారాలు, న్యాయమూర్తుల నియామకంలో ‘సీనియర్‌ న్యాయమూర్తుల బృందం’ అనుసరించ వలసిన విధి విధానాలు, తదితర విషయాలు, వాటిలో భేదాభిప్రాయాలు నేపథ్యంలో ఉన్నవి. చాలా కేసుల్లో న్యాయస్థానం ఇష్టారాజ్యంగా వ్యవహ రిస్తున్నది. ఇది ఇప్పుడే మొదలు కాలేదు. చాలామంది న్యాయమూర్తులు సంవత్సరాలుగా ఇలా వ్యవహ రిస్తున్నందున ఈ సంక్షోభం నెలకొన్నది. కాగా ఇప్పటి ఈ సమస్య పైన పేర్కొన్న సమస్యల గురించి కాదు. వ్యవస్థాపరమైన సంస్కరణలు అవసరమను కొంటే, న్యాయమూర్తులు వాటిని చక్కగా సూచించ వచ్చు. వీరిలో కొందరైనా భవిష్యత్తులో ప్రధాన న్యాయ మూర్తులు అయినప్పుడు అటువంటి సంస్కరణల దిశలో చర్యలు తీసికొనే అవకాశాలూ ఉన్నవి. న్యాయవ్యవస్థకు సంబంధించిన సంస్కరణలు, వాటి నిమిత్తంగా చర్చలు – వాటికై ఇలా బహిరంగంగా ఆరోపణలు చేయవలసిన అవసరం లేదు. కాగా ఇక్కడ ఉన్న అసలు సమస్య ఇప్పటి ఈ ప్రధాన న్యాయమూర్తిగారి వ్యవహరశైలి సరిగా లేదన్నదే!

ఈ వ్యాసకర్త ప్రధాన న్యాయమూర్తిగారి అభిమాని కాడు. ఆయననకు వెనక వేసుకురావటం ఈ వ్యాసంలోని ఉద్దేశం కాదు. కాగా, ఇందులో ముడిపడి ఉన్న ప్రశ్నలను ఒకటొకటిగా వింగడించు కొని క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంది. గతంలో ఉన్న అనవాయితీలకు భిన్నంగా వ్యవహరిస్తూ, ప్రధాన న్యాయమూర్తి కేసులను న్యాయమూర్తులకు కేటాయించు తున్న తీరు అభ్యంతరకరంగా ఉంటున్నదని వీరి వాదనలోని ప్రధానాంశంగా ఉంది. ఈ వాదాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా అర్థం చేసుకున్నా, అది గంభీరమైన స్థితినే తెలియజేస్తుంది.

మొదటిది – ఇది కేవలం అనవాయితీకి భిన్నంగా పోవటమే కాదు, ఆ కేసులలో బహుశః (ముఖ్యంగా) రాజకీయంగా కీలకం కాగల కేసులలో రాగల తీర్పులను ప్రభావితం చేసేందుకే ఇలా చేయబడు తున్నది-అని అనుకోవలసి ఉంటుంది. ఈ కారణంగానే నలుగురు న్యాయమూర్తుల ఆరోపణలకు ప్రాధాన్యం ఏర్పడుతున్నది. ఈ అంశం లేదనుకున్న ట్లయితే – ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణల్లో పస ఏమున్నది? ఈయనకు తగినంత అనుభవం, పాలనా పరమైన నేర్పు, వివేచనా లేనందున ప్రక్రియను అనుసరించటంలో పొరపాట్లు జరుగుతున్నవనేగా! అలాగని ఇవి పట్టించుకోదగినవి కాదని కాదు. కాని ఇవి మాత్రమే అయినట్లయితే, ఈ దుర్గంధాన్ని భరిస్తూ కొంతకాలం ముక్కు పట్టుకొని కూర్చొని ఉండేవారేమో. దుర్గంధం భరించరాని స్థాయిని దాటినప్పుడే గదా, దానిగురించి మాట్లాడవలసి వచ్చేది!

రెండవది-ఎవరికైతే, రాజకీయంగా కీలకం కాగల కేసులు కేటాయించబడుతున్నవో ఆ న్యాయమూర్తులు – ప్రధాన న్యాయమూర్తి అంచనాలో నైనా-లొంగిపోతారని, అనుకూలంగా వ్యవహ రిస్తారని అనుకొంటున్నట్లే గదా! దీనినిబట్టి ఈనాటి సమస్య నలుగురు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తితో వివాదానికి దిగటం మాత్రమే కాదు, వారు తమ సహచర న్యాయమూర్తులనూ అనుమానిస్తు న్నారన్నమాట! దీనివల్ల ఏమవుతున్నది? దేశంలో రాజకీయ నాయకులందరినీ అనుమానాస్పదమైన దృష్టితో చూసినట్లుగానే, న్యాయస్థానాల నిజాయితీని కూడా శంకించవలసిన పరిస్థితి ఏర్పడినట్లే గదా!

ఈ సమస్య పరిష్కరించుకోవటం ఎలా? రెండు రకాల కష్టాలు ఎదురౌతున్నవి. వారు చేసిన ప్రధాన ఆరోపణపై తీర్పు ఇవ్వటం ఎలా? ఆరోపణ గంభీరమైనది. బహుశః అది నిజమయి ఉండవచ్చు నేమో! అయితే తీర్పు ఇవ్వడానికి అవసరమైన సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఆరోపణ నిజంగా ఎంతో గంభీరమైనది కనుక, వారివద్ద సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే, ప్రధాన న్యాయమూర్తిపై విచారణ జరిపితీరవలసిందే. ఏ రాజకీయపక్షం వద్దనైనా దీనికి సంబంధించిన (తీర్పు ఈ విధంగానే ఉండాలి అనుకొని అందుకు తగినట్లుగానే, లోబడిపోయే న్యాయమూర్తులకే కేసులు కేటాయిస్తున్నట్లుగా) సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే వారు తప్పక ‘అభిశంసన’ తీర్మానం ప్రతిపాదించాలి. అప్పుడు బహిరంగంగా ఆరోపణలు చేసిన న్యాయమూర్తులు తమవద్ద ఉన్న ఆధారాలతో హాజరు కావాలి.

అలా కాకుండా, వారు చేసిన ఆరోపణలలో ఇంత ‘గంభీరత’ లేనట్లయితే, వారివద్ద పరిశీల నార్హమైన సాక్ష్యాధారాలు ఏవీ లేనట్లయితే, ప్రధాన న్యాయమూర్తిపై ఈ విధంగా బహిరంగంగా ఆరోపణలు చేయటం సమంజసమేనా? ఈ విధంగా నిగ్గదీయటం, పరిశీలనార్హమైన సాక్ష్యాలు చూపించండని కోరటం నేడు మనకు అలవాటైన ధోరణుల మధ్య ఉన్నత ప్రమాణాలను ఆశించటంగా తోచవచ్చు; కాని ఎంతో గంభీరమైన ఆరోపణలు చేసినప్పుడు ఇది తప్ప మరో మార్గం లేదు. న్యాయ వ్యవస్థలో ఉన్న ఎందరో ప్రముఖులు-వారు అధివక్తలు (న్యాయవాదులు) కావచ్చు; లేదా న్యాయ నిర్ణేతలే కావచ్చు – ఎక్కడో, ఏదో, ఎవరో చెప్పిన దానిని ఆధారం చేసుకొని ఒకరిని దోషిగానో, అమాయకుని (నిరపరాధి) గానో ప్రకటిస్తూ ఉండటం ప్రమాదకర మైన ధోరణి కాదా? ఇది మనలను అరాజకత్వం వైపు లాక్కొని పోవటం లేదా? తెలిసీ తెలియకుండానే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన దురుద్దేశాలను ఆపాదించటం-మొత్తం వ్యవస్థ ఈ తీరులోనే నడవటం ఏ విధంగా సమంజసమౌతుంది? పాపం న్యాయమూర్తి కర్ణన్‌ తాను న్యాయమూర్తులపై ఇదమిత్థంగా చేసిన ఆరోపణలు న్యాయస్థాన ధిక్కరణగా పరిగణింపబడటమేమిటని విస్మయ చకితుడై ఉంటారు.

అపరాధి – నిరపరాధి – ఈ రెండింటికి మధ్య ఏదీకాని స్థితి అనేది లేదు. న్యాయమూర్తులు ఏర్పరచిన పత్రికా ప్రతినిధుల సమావేశం, ఏ విధమైన స్పష్టత లేకుండా ఒడుపుగా వ్రాయబడిన లేఖ – అటువంటి స్థితి ఒకటున్నట్లుగా సూచిస్తున్నవి. సరే, ఇప్పుడైతే, వారు ప్రజల వద్దకు ఈ విషయాన్ని తీసుకొని పోయారు గదా, తాము చేసిన ఆరోపణలోని ‘గంభీరత’ను గమనించుకొని, జరగవలసిన కథను ముందుకు నడిపించవలసి ఉంది. అది జరగకపోతే – ఏదోవిధంగా కొంత ఒత్తిడి చేసి, మరేదో సాధించుకోవటమే వారి ఉద్దేశమని అనుకోవలసి వస్తుంది. ఈ విధమైన ఒత్తిడిచేసే వ్యూహాలు ప్రమాదభరితమైనవి. ఎందుకంటే రాబోయే రోజులలో ‘ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు’గా భావించబడే (ప్రచారం చేయబడే) ఏ తీర్పు వెలువడినా – ‘ఇది సరైనా తీర్పేనా?’ ప్రధాన న్యాయమూర్తి లోబడిపోయే స్వభావం గల న్యాయమూర్తుల ద్వారా చెప్పించిన తీర్పు గదా’ అని వ్యాఖ్యానాలు ఆరంభమవుతాయి.

ప్రశ్న ఏమిటంటే – ప్రధాన న్యాయమూర్తిపై దోషారోపణ చేసినప్పుడు తీర్పు చెప్పగలవారెవరు? ఈ ప్రశ్న వేసుకోకుండా దాటవేయగల స్థితి ఇప్పుడు లేదు. మరో ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. సంస్థాగతంగా న్యాయ వ్యవస్థలోనూ సంస్కరణలు అవసరమని, కాబట్టి జరిగినదంతా మంచికేనని కొందరు అంటున్నారు. ప్రధాన న్యాయమూర్తి అధికారాలు కూడా స్పష్టంగా నిర్వచించటం అవసరమన్న భావన బలపడుతున్నది.

అయితే ఇప్పటి ఈ ఆరోపణలో – ఆ సంస్కరణల గురించిన ప్రస్థావన లేదు. మనం పరిశీలించవలసి ఉన్న ఒకే ఒక్క విషయం – తప్పు దారిన పోతున్న ప్రధాన న్యాయమూర్తిని శిక్షించగలవారెవరు? ఏ విధంగా? మన రాజ్యాంగ సంవిధానం న్యాయ వ్యవస్థకు ఎంత స్వాతంత్య్రాన్ని ఇచ్చిందో తెలుసు గదా! న్యాయమూర్తులపై చర్య తీసికోవటం దాదాపు అసాధ్యమే. న్యాయమూర్తులకు గల ఈ విధమైన రక్షణను పలచన చేయాలని మీరు కోరుతున్నారా? ఇప్పటికే న్యాయవ్యవస్థను ప్రభావితం చేయడానికి ప్రభుత్వం ఎన్నోవిధాల యత్నిస్తున్నదని, అందుకు సులభ మార్గాలను వెదుకుతున్నదనే ఆరోపణలు వినబడటం లేదా?

న్యాయమూర్తులను నియమించటంలో, తప్పుదారిన పోకుండా నియంత్రించటంలో ప్రభుత్వాలకు గల పాత్రను పెంచేటట్లయితే అది న్యాయ వ్యవస్థను బలపరుస్తుందా, లేక బలహీన పరుస్తుందా? అన్న ద్వైదీభావం మనలను వెంటాడుతున్నది గదా! న్యాయవ్యవస్థలో ఉన్నవారు తమకు తామే ఎసరు పెట్టుకొనే (సెల్ఫ్‌గోల్‌) పనులు చేస్తే, వ్యవస్థను పటిష్టం చేసేందుకు, న్యాయమూర్తులను జవాబుదారీగా ఉండేలా చేసేందుకు కొత్త పద్ధతులు, నిబంధనలు అవసరమనే వాదనలు పెరగవా? అలా అమలులోకి వచ్చే కొత్త పద్ధతులు, నిబంధనలు న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని బలోపేతం చేస్తాయా? లేక దిగజార్చుతాయా? ఒకరిని శిక్షించి తీరాలనే బుద్ధితో న్యాయ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న యత్నాల ఫలితంగా ఏర్పడిన సంక్షోభానికి రాజకీయ నాయకులు అందించే ఔషధం ఎటువంటి సంస్కరణలకు దారి తీస్తుంది?

ఈ ప్రమాదభరితమైన, సంభ్రమితమైన స్థితినుండి న్యాయవ్యవస్థ తేరుకోగలదా? ప్రధాన న్యాయమూర్తి తాను సహచర న్యాయమూర్తుల బృందం విశ్వాసాన్ని కోల్పోయిన వాస్తవాన్ని గ్రహించుకొని, తాను ఏమి చేయవలసి ఉన్నదో ఆలోచించుకొని, విశ్వాసాన్ని తిరిగి పొందగల మార్గాన్ని కనుగొనేటట్లయితే, అది సాధ్యపడవచ్చు. అది అంత సులభం కాదు. అందుకు గల అవకాశాలు చాలా తక్కువ. చేయబడిన ఆరోపణలను పరిగణనలోకి తీసికొంటే, తర్కసంగత మైన ముగింపు చాలా దుష్కరమైనది. ఆ నలుగురు న్యాయమూర్తులు తాము చేసిన ఆరోపణలకు, అనువర్తి చర్యగా ఏమి చేయవలసి ఉన్నదో, అది చేయకపోయి నట్లయితే, జరిగినదంతా ఒక కుట్రగానో, ఒత్తిడి ప్రయోగించే వ్యూహంగానో, అవమాన పరచడానికి చేసిన అస్పష్టమైన వ్యాఖ్యగానో భావించవలసి ఉంటుంది. ఇది భవిష్యత్తుకు శుభసూచకం కాదు.

సాధారణంగా ఇటువంటి సమస్యలకు భారతీయ మైన పరిష్కారం కూర్చొని, మాట్లాడుకోవటం. ఎంతో ప్రాముఖ్యం గల కేసులు పరిశీలనకు రానున్న ఈ సంవత్సరంలో న్యాయవ్యవస్థ తమ అంతర్గత సహకారంతో, హేతుబద్ధమైన విచార విమర్శలతో ఈ ఊబి నుండి బయటపడి, తమ నిజాయితీని ప్రకాశింప జేసుకొంటూ, తన ప్రతిష్ఠను నిలబెట్టు కోగలితే, అది మబ్బులమధ్య మెరుపులాగ, ఇంతటి సంక్షోభంలోనూ ఒక ఆశాస్పదమైన అంశం కాగలదు.

– ప్రతాప్‌ భాను మెహతా సుప్రసిద్ధ పత్రికా రచయిత మరియు వైస్‌ ఛాన్సలర్‌, అశోకా యూనివర్సిటీ.

– ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ నుండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *