సాకారమవుతున్న డిజిటల్‌ ఇండియా స్వప్నం

సాకారమవుతున్న డిజిటల్‌ ఇండియా స్వప్నం

డిజిటల్‌ ఇండియా..

అనేక చారిత్రక కారణాలతో పారిశ్రామిక విప్లవ ఫలితాలకు సుదూరంగా ఉండిపోయింది భారతదేశం. ఆ అగాథాన్ని ఐటీ విప్లవం ద్వారా పూరించుకోవాలన్న సంకల్పం ఇప్పుడు కనిపిస్తోంది. దానికి పరాకాష్ట డిజిటల్‌ ఇండియా పథకం. అటల్‌ బిహారీ వాజపేయి అంకురార్పణ చేసిన ఈ ఐటీ యజ్ఞాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ అప్రతిహతంగా ముందుకు సాగించాలని నడుం కట్టారు. జూలై 1, 2015న డిజిటల్‌ ఇండియా పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ప్రధానోద్దేశం ఒక పటిష్ట ఆర్థిక వ్యవస్థగా, బలీయమైన ఆర్థిక శక్తిగా భారత్‌ అవతరించడమే. ఇంకా డిజిటల్‌ లాకర్‌, ఈ-విద్య, వాణిజ్యం, కాగిత రహిత పాలన, 18 లక్షల మందికి ఉద్యోగాల కల్పన, గ్రామాలలో వెలుగు వంటి ఎన్నో అద్భుత ఆశయాలు డిజిటల్‌ ఇండియా పథకంలో ఉన్నాయి. రెండున్నర లక్షల గ్రామాలను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయడం, గ్రామీణ వ్యవసాయోత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేయడం కూడా ఇందులో భాగమే. ఇలాంటి అద్భుత పథక రచనకీ, అందులోని పరిణామాలకీ, ప్రస్థానానికీ ప్రత్యక్షసాక్షి, ఈ పథక రూపశిల్పులలో ఒకరు డాక్టర్‌ త్రిపురనేని హనుమాన్‌ చౌదరి. వారితో జాగృతి ప్రత్యేక ఇంటర్వ్యూ.

నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన పథకం డిజిటల్‌ ఇండియా. ఈ పథకంలో కీలకమైన డిజిటల్‌ లిట్రసీ అంటే ఏమిటి ?

డిజిటల్‌ లిట్రసీ అంటే ఎలక్ట్రానిక్స్‌, టెలీకమ్యూ నికేషన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ- ఈ మూడు మేళవించినది. దీని ద్వారా పూర్వం ఏ పద్ధతిలో మన కార్యకలాపాలను నిర్వహించు కున్నామో, వాటినే వేరే పద్ధతిలో నిర్వహించుకోవడమే డిజిటల్‌ లిట్రసీ ప్రయోగం ఆశయం. ఇదివరకు బ్యాంకుకి స్వయంగా వెళ్లేవాళ్లం. పాస్‌బుక్కు తీసుకెళ్లేవాళ్లం. చెక్కు, డ్రాప్ట్‌, మరొకటో ఇచ్చి లావాదేవీలు నిర్వ హించుకునేవాళ్లం. బ్యాంకు అనగానే ఒక కార్యాలయం ఉండాలి. దానికొక ప్రతిపత్తి, అందులో సిబ్బంది ఉండాలి. సంతకాలు ఉండాలి. వాటిని తనిఖీ చేయాలి. అంతా కాగితాల మీద ఉండాలి. భౌతికంగా ఒక మౌలిక వ్యవస్థ కనిపించాలి. కానీ అవన్నీ లేకుండానే అరచేతిలో చిన్న పరికరం తోనే ఇవన్నీ చేయవచ్చు. ఈ పరిజ్ఞానాన్నే డిజిటల్‌ లిట్రసీ అంటున్నారు. ఒక పుస్తకమో, మరేదో వస్తువో కొనాలంటే ఆ చిన్న పరికరం ద్వారానే చెల్లింపులు జరపవచ్చు. అలాగే ఒక బ్యాంకు అకౌంట్‌ నుంచి వేరే అకౌంట్‌కి నగదు బదలీ కూడా. ఇది లిట్రసీయే కదా! కేవలం ఆ పరికరంలోని బటన్స్‌ను ఉపయో గించుకుని ఇదంతా చేస్తున్నాం. ఒకేచోట ఉండి అరచేతిలోని పరికరం లోని బటన్లు నొక్కి ఇవన్నీ సాధ్యం చేసుకోవచ్చు. దీనికి మొదటిగా ఒక మౌలిక వ్యవస్థ అవసరం. అదే టెలీకమ్యూనికేషన్స్‌.

ఆ వ్యవస్థ ఎలా ఉంటుంది ? అదేమిటి ?

సంప్రదాయం ఏమిటంటే వస్తువులని ఒకచోట నుంచి వేరొక చోటికి బదలీ చేయాలంటే రోడ్డు ద్వారా చేస్తాం. సముద్రమార్గం, రైలు, వైమానిక మార్గాల ద్వారా కూడా చేస్తాం. కానీ ఇన్ఫర్మేషన్‌ సంగతి ఏమిటి? మనం మాట్లాడేది ఇన్ఫర్మేషనే. పుస్తకాలలోని టెక్స్ట్‌ కూడా ఇన్ఫర్మేషనే. డిజిటల్‌ కెమేరా తీసే ఫొటోలు మరొకటి. ఈ ఇన్ఫర్మేషన్‌ను ఒక చోటి నుంచి మరొకచోటికి బదలీ చేసుకోవాలంటే సంప్రదాయకంగా కాకుండా, వేరే విధమైన రవాణా వ్యవస్థ అవసరమవుతుంది. ఇప్పుడు ఇవన్నీ – మాట, టెక్స్ట్‌, ఫొటో… కొన్ని పరికరాల ద్వారా ఎలక్ట్రానిఫై అవుతున్నాయి. ఎలక్ట్రానిఫై చేసిన ఈ ఇన్ఫర్మేషన్‌ను ఎలా పంపాలి? అందుకు అవసరమైనదే ఇన్ఫర్మేషన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టమ్‌. ఇందులో ఉపయోగపడేది ఎలక్టానిక్‌, ఫోటానిక్‌, రేడియో మాధ్యమం.

పూర్వం రాగి తీగలు ఉండేవి. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉపయోగించినవవ్నీ రాగితీగలే. కానీ సమాచార రవాణాకు వాటికి ఉన్న సామర్థ్యం తక్కువ. అవి కాకుండా గ్లాసు నుంచి తయారు చేసిన తీగలు ఉపయోగిస్తారు. అదే ఫైబర్‌ ఆప్టిక్స్‌ విధానం. అందులో కరెంట్‌ కాకుండా, లైట్‌ని పంపడమే పద్ధతి. భూమి పొరలలోను, సముద్రంలోను దీనిని ఉపయోగిస్తారు. రెండో విధానం టెరస్ట్రియల్‌ రేడియో. భూమి మీద ఉండే టవర్స్‌ ద్వారా జరుగుతుంది. మూడో విధానం ఉపగ్రహాలు. అంటే సంచార ఉపగ్రహాలు. వీటి ద్వారా సమాచారాన్ని నెట్‌వర్క్‌లోకి పంపుతాం.

ఇందులో ఇంటర్నెట్‌, వెబ్‌సైట్ల పాత్ర ఏమిటి ?

రవాణా చేయడానికి ఎలక్ట్రానిఫై చేసిన సమాచారాన్ని ఒకచోట నిల్వ చేయవలసి ఉంటుంది. అంటే ఇన్ఫ్‌ర్మేషన్‌ను స్టోర్‌ చేయాలి. ఇదివరకు సమాచారం కోసం లైబ్రరీలకి వెళ్లేవాళ్లం. సమాచారం పుస్తకాలలో ఉండేది. పుస్తకాలు గ్రంథాలయాలలో ఉండేవి. ఇప్పుడు గ్రంథాలయాల స్థానంలో వచ్చినవే వెబ్‌సైట్లు. ఈ వెబ్‌సైట్లలో దృశ్యం, శబ్దం, టెక్ట్స్‌ మూడింటినీ నిక్షిప్తం చేయవచ్చు. ఈ వెబ్‌సైట్లను నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసేదే ఇంటర్నెట్‌. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది వెబ్‌సైట్లను దీనితో అనుసంధానం చేయడమే ఇక్కడ విశేషం. అంటే ఫోటానిక్‌, ఎలక్ట్రానిక్‌, రేడియో మాధ్యమాల ద్వారా ఎలక్ట్రానిఫై అయిన సమాచారాన్ని వెబ్‌సైట్‌ల ద్వారా ఇంటర్నెట్‌తో అనుసంధానం చేస్తారు. కేవలం అరచేతిలో పట్టే చిన్న పరికరంలోని బటన్లు నొక్కుతూ వేళలతో నిమిత్తం లేకుండా, దూరంతో సంబంధం లేకుండా పనులను చేసుకోవచ్చు. ఆ అవకాశం ఈ వ్యవస్థ కల్పిస్తున్నది.

మెమరీ అనేది ఏమిటి ?

ఒక్కసారి కంప్యూటర్‌, ఇంటర్నెట్‌, మెమరీల మధ్య సంబంధాన్ని చూద్దాం. కంప్యూటర్లు ఏర్పాటు చేసుకోవడానికి మొదట్లో ఒక పెద్ద హాలంత చోటు అవసరమయ్యేది. పైగా అప్పటి కంప్యూటర్లు రెండువేల కిలోవాట్స్‌ విద్యుత్‌ను తీసుకునేవి. కానీ వేగం సంగతి మాత్రం ఇప్పుడు చెప్పుకోకూడదు. ఆ వేగం తలుచుకుంటే నవ్వొస్తుంది. కానీ పరిణామ క్రమంలో పెద్ద హాలు నుంచి చిన్న టేబుల్‌ మీద సర్దుకుంది కంప్యూటర్‌. అక్కడ నుంచి ఇంకా చిన్న అవతారం దాల్చి అరచేతిలో ఇమిడిపోయింది. ఎలక్ట్రానిఫై అయిన సమాచారం యావత్తు ఈ కంప్యూటర్‌ మెమరీలోనే నిక్షిప్తమై ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్‌ మెమరీని తలుచుకుంటే మనందరికీ విభ్రాంతి కలుగుతుంది. నిజంగా అనూహ్యం. నేను ఇంజనీరింగ్‌ చేసిన తరువాత ఆకాశవాణి, న్యూఢిల్లీ కేంద్రంలో చేరాను. స్టూడియోలో పనిచేసేవాళ్లం. ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయాలంటే ముందే రికార్డు చేయాలి. ఆ సంగీత విద్వాంసుడో, మరో గాయనో, ఇంకొక నాయకుడో అర్థరాత్రీ, అపరాత్రీ రారు కదా! కాబట్టి వారి కార్యక్రమాలను పగటివేళ, వారికి అనువైన సమయాలలో రికార్డు చేయాలి. దానిని ‘స్టోర్‌’ చేయాలి. కానీ ఆ రోజులలో ఈ స్టోర్‌ సౌకర్యం చాలా పరిమితం. డిస్క్‌లు ఉండేవి. ఇంకా 60 ఆర్‌పీఎంలని ఉండేవి. వీటి మెమరీ సామర్థ్యం కేవలం మూడున్నర నిమిషాలు. తరువాత టేపులు వచ్చాయి. వీటికి గంట నుంచి గంటన్నర వరకు మెమరీ సామర్థ్యం ఉండేది. ఆ తరువాత సీడీలు వచ్చాయి. ఇవి ఇంకా మెరుగైనవి. ఇప్పుడో! పెన్‌డ్రైవ్‌! ఇదిగో, నా వద్ద ఉన్న ఈ ఒక్క పెన్‌డ్రైవ్‌లో వివిధ గోష్టులలో చదివిన నాలుగువేల పత్రాలు ఉన్నాయి. రెండువేల వ్యాసాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే కంప్యూటర్‌ మన మెదడుకు సమాంతరంగా రూపొందుతోంది. కానీ ఒకటి. భగవంతుడు సృష్టించిన మానవ మెదడుకు ఉన్న మెమరీ ఒక అద్భుతం. అసాధారణం. అనితర సాధ్యం. దీనితో సమానమైన పరికరాన్ని ఇప్పటికీ ఏ శాస్త్రవేత్త కూడా కనుగొనలేదు. మెదడుకున్న స్టోరేజీ సామర్థ్యం పరమాద్భుతం. ఎటోచ్చి ముసలితనం వస్తే మరుపు వస్తూ ఉంటుంది. అయినా ఒకసారి బుర్రలోకి వెళ్లిన విషయాలను నెమరు వేసుకోవలసి వచ్చినప్పుడు కొన్ని లిప్తలోనే గుర్తుకొస్తాయి. ఇంకొన్ని గంటలో, ఇంకొన్ని రోజులో గుర్తుకు వస్తూ ఉంటాయి. అంటే వయసును బట్టి. కంప్యూటర్‌లో మాత్రం ఇలా జరగడం లేదూ! సెర్చింజన్‌ అంటాం. సమాచారం పూర్తిగా నాశనం కాదన్నమాట. ఇప్పుడు మెమరీ సామర్థ్యం డిస్క్‌ నుంచి పెన్‌డ్రైవ్‌ వరకు వచ్చింది. ఆ తరువాత ఇంకెంత చిన్న సైజులోకి మారుతుందో!

సాఫ్ట్‌వేర్‌ పాత్ర ఏమిటి ?

మరో అద్భుతం చూశారా! అరవై వేలో, డెబ్బయ్‌ వేలో పెట్టి ఒక స్మార్ట్‌ఫోన్‌ కొనక్కుంటే అందులో విశ్వవీక్షణం చేయవచ్చు. దీనికి అవసరమైన భాషే సాఫ్ట్‌వేర్‌ అంటే. పాణిని మహర్షి వ్యాకరణం వలెనే తిరుగులేని రీతిలో సాఫ్ట్‌వేర్‌ భాష ద్వారా ఏ సమాచారాన్నయినా మనం ఇంటర్నెట్‌ ద్వారా మన అరచేతిలోకి తెచ్చుకోవచ్చు. ఇదే డిజిటల్‌ వరల్డ్‌. ఆఖరికి చంద్రుని మీద మనిషి నడకను కూడా చూడవచ్చు. ఇంతింతై వటుడింతై అన్నట్టు వామనుడు పెరిగినట్టు డిజిటల్‌ సామర్థ్యం విశ్వవ్యాప్తం అయింది. ప్రపంచం కుంచించు కుంటుంది. ఇదేకదా, భారతీయ తత్వం. గీతాకారుడు కూడా ఇలాగే అన్నాడు. అయితే ఈ దశలో డిజిటల్‌ టెక్నాలజీ తాత్వికుల ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనిషి పుట్టినప్పటి నుంచి రూపొందిన గణాంకాలన్నీ డిజిటల్‌ రూపం దాల్చాయి. ఇప్పుడు రోబోల మీదకు మన దృష్టి వెళ్లింది.

రోబోల ప్రాధాన్యం పెరుగుతోంది, ఎందుకు ?

రోబోలకు లభిస్తున్న ప్రాధాన్యం చూస్తే విస్తుపోతాం. అసలు మనిషి చేయవలసిన పని వేరే వ్యవస్థతో చేయించవచ్చునా? అదెలాంటి పరిణా మాలకు దారి తీస్తుంది? ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అంటున్నాం. అంటే మనిషి సొంతంగా చేతులతో, కాళ్లతో, తెలివితేటలు ఉపయోగించి చేసే కార్యకలా పాలని రోబోలకు అలవాటు చేస్తున్నాం. ఇదే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌. మనిషి హోమోసెపియన్‌ దశ నుంచి ఈ దశకు రావడానికి దాదాపు లక్ష సంవత్సరాలు పట్టింది. ఈ సుదీర్ఘ కాలంలో మనిషి ఎంత జ్ఞానం సంపాదించుకున్నాడు! ఆ జ్ఞానం మొత్తాన్ని ఇప్పుడు మరమనుషులకు ధారాదత్తం చేస్తున్నాం. చదవడం, పనిచేయడం, సేవలు చేయడం ఇవన్నీ మరమనుషులతో చేయించాలని మన కోరిక.

జపాన్‌లో టయోటో అనే కార్ల కంపెనీ ఉంది కదా! ఈ కంపెనీ రోజుకు 15 కార్లు ఉత్పత్తి చేస్తుంది. కానీ ఇందులో పనిచేసే మనుషులు అరవై మంది. రోబోలు 350. వెల్డింగ్‌, నిర్మాణం, రంగు వేయడం అన్నీ వాటికి అప్పగించారు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. జపాన్‌లో భవిష్యత్తులో వృద్ధులే అధిక సంఖ్యలో ఉంటారు. ఈ పరిస్థితిని అధిగమించ డానికి జపాన్‌ వారు ఏటా పరిశోధన మీద చేసే వ్యయంలో యాభయ్‌ శాతం రోబో నిర్మాణ పరిశోధన మీదే వెచ్చిస్తున్నారు. అమెరికా వారికి ఆ అవసరం వేరు. వారికి సంతానం తగ్గిపోతోంది. అందుకే వాళ్లు మనుషులను దిగుమతి చేసుకుంటున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాళ్లు కూడా రోబోలనే నమ్ముకుంటున్నారు. అక్కడ ఒక హోటల్‌ను రోబోల సాయంతో ఒక్క మనిషి నడుపు తున్నాడు. చిత్రం! చైనా కూడా రోబోలనే నమ్ము తోంది. షాంగైలో రెండు వందల మందికి ఆతిథ్యం ఇవ్వగలిగిన హోటల్‌ను ఒక్క మనిషే రోబోలతో నిర్వహిస్తున్నాడు.

స్మార్ట్‌ఫోన్‌ల పాత్ర ఏమిటి ?

ఇప్పుడు ప్రపంచ జనాభా 750 కోట్లు. వీరిలో 600 కోట్ల మందికి స్మార్ట్‌ ఫోన్‌లు ఉన్నాయని చెబుతున్నారు. ఫోన్‌ గురించి బొత్తిగా తెలియని మూడేళ్లు లోపు పిల్లలు, కళ్లు కనిపించక, ఫోన్‌ పట్టుకోలేనంత వృద్ధాప్యంలో ఉన్నవారికి తప్ప అందరికి ఈ ఫోన్లు ఉన్నాయి. ఆఖరికి యాచకులు సైతం ఉపయోగిస్తున్నారు. ఒకసారి తిరుపతిలో చూశాను. ఒక యాచకుడు సమాచారం ఇస్తున్నాడు. అక్కడి ప్రాంతానికి బొంబాయి వాళ్లు వచ్చారు. ఇక్కడికి వచ్చెయ్యమని వేరే వాళ్లకి సమాచారం ఇస్తున్నాడు. ఒకటి మాత్రం నిజం. సెల్‌ఫోన్‌తో చాలా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయి. ఎవరైనా గానీ నలభయ్‌ నిమిషాలకు మించి ఫోన్‌ మాట్లాడితే భవిష్యత్తులో బ్రెయిల్‌ ట్యూమర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఎవరికీ పట్టడం లేదు. అదే విషాదం.

ఐటీ ద్వారా ఉద్యోగాలు విశేషంగా పెరిగాయంటారు!

పెరిగాయి! ఎలా పెరిగాయో తెలుసుకోవడం అవసరం కూడా. 2000 సంవత్సరం రావడానికి ముందు తలెత్తిన వైటుకె సమస్య తెలుసు కదా! కంప్యూటర్‌ సైన్స్‌లో ఎంతో ముందంజలో ఉన్న దేశాలు కూడా గడగడ వణికిపోయాయి. ఇంతకీ ఆ సమస్య ఏమిటి? 2000 సంవత్సరం వచ్చింది. కొత్త సహస్రాబ్ది. కానీ అంతవరకు కంప్యూటర్లలో నిల్వ చేసుకున్న ప్రతి కార్యక్రమంలోను సంవత్సరం నమోదు చేయడం దగ్గర చిన్న పొరపాటు జరిగింది. సంవత్సరం అంటే నాలుగు అంకెలు వేయాలి. కానీ చివరి రెండు అంకెలే వేశారు. ఇదే మొత్తం కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లను నాశనం చేస్తుందని అనుకున్నారు. ఇలా సంవత్సరం గురించి రెండం కెలలో ప్రస్తావించిన ప్రతి చోట నాలుగు అంకెలకు మార్చాలి. దీనికి ఎందరు నిపుణులు అవసరమవు తారో తెలుసుకదా! ఆ ప్రమాదాన్ని చాలామంది ముందే పసిగట్టారు. ఈ పరిణామం ద్వారా వచ్చిన సదవకాశాన్ని కూడా కొందరు ముందే ఊహించారు. నేను కూడా 1997 నుంచి అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి గారి దగ్గర ఐటీ సలహాదారుగా ఉన్నాను. ఐటీ రంగంలో ఉద్యోగావ కాశాలు విశేషంగా పెరగబోతున్నాయి కాబట్టి మన రాష్ట్రం ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని సలహా ఇచ్చాను. అందుకే అప్పటికి రాష్ట్రంలో 32 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉంటే, ఆ విద్యలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించాం. 2004కి 250 కాలేజీలయ్యాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది అమెరికాలో ఐటీ నిపుణుడిగా ఉన్నారు కదా!

ఐటీతో మన దేశానికి వచ్చిన లబ్ధి ఎలా ఉంది ?

ఇవాళ భారతదేశంలో 50 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా నేరుగా ఆ రంగంలో పనిచేస్తున్నవాళ్లే. ఒక్క హైదరాబాద్‌ సిటీలోనే ఇలాంటి ఉద్యోగులు ప్రస్తుతం ఐదు లక్షలు. టీసీఎస్‌కు చెందిన ఐటీ నిపుణులు ఒక్క హైదరాబాద్‌లోనే 32,000. ఈ సంస్థకి ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలలో కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం మూడున్నర లక్షల మంది పనిచేస్తున్నారు. ఇక ఇన్ఫోసిస్‌లో దాదాపు 22వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఈ సంవత్సరం ఒక్క హైదరాబాద్‌ నగరం నుంచి అందిన సాఫ్ట్‌వేర్‌ సేవల విలువ రూ.లక్ష కోట్లు. భారతదేశం నుంచి జరిగిన సేవల విలువ రూ 9 లక్షల కోట్లు. మనం చమురు దిగుమతులకు వినియోగించేది రూ. 8 లక్షల కోట్లు. చెల్లుకు చెల్లు. మరో లక్ష కోట్లు మిగులుతోంది.

ఆరోగ్య రంగంలో ఐటీ సేవలు ఎలా ఉన్నాయి ?

ఐటీ ద్వారా అత్యవసర ఆరోగ్య సేవలు అందించే విప్లవాత్మక ప్రక్రియ హైదరాబాద్‌లోనే ఆరంభయింది. ఈ ఘనత సత్యం కంప్యూటర్స్‌దే. 108 సత్యం కంప్యూటర్సే ఆరంభించింది. ఈ ప్రక్రియలో అంబులెన్స్‌లో ట్రాన్స్‌మిషన్‌ పవర్‌ ఏర్పాటు చేశాం. ఒక అనుసంధాన కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. దీని ద్వారా రోగి పరిస్థితిని ప్రతి నిమిషం తెలుసుకుంటూ ఆస్పత్రికి తీసుకొచ్చే ఏర్పాటు జరిగింది. అలాగే రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి సత్వర చికిత్స అందించే ప్రయత్నం కూడా ఇక్కడే మొదలైంది.

డిజిటల్‌ ఇండియాతో బ్యాంకింగ్‌ సేవలు ఆశించిన మేర అందుబాటులోకి వచ్చాయా ?

నిస్సందేహంగా వచ్చాయి. ఆర్‌టీజీ, నెఫ్ట్‌, ఐఎమ్‌పిఎస్‌ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి కదా! ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు నగదును నిమిషాలలో బదలీ చేసుకుంటున్నారు. ఏటీఎంల సేవలు ఇప్పుడు ఏ స్థాయిలో జనానికి మేలు చేస్తున్నాయో, ఎంత వేగవంతమైనాయో వేరే చెప్పాలా? అసలు ఇప్పుడు బ్యాంకుల నిర్వహణ కోసం ఇంతింత వ్యయం ఎందుకు అనిపించేటట్టుగా డిజిటల్‌ ఇండియా సేవలు ఉపందుకున్నాయి.

వ్యవసాయ రంగానికి కూడా డిజిటల్‌ ఇండియా ద్వారా సేవలు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ఆ దిశగా ఏం జరిగింది ?

వ్యవసాయం మీద రైతులలో అవగాహన పెంచడంలో, పంటలను నిర్ణయించుకోవడంలో వారికి సహకరించడంలో డిజిటల్‌ ఇండియా సేవలు ఇప్పటికే మొదలయ్యాయి. ఐటీసీ కంపెనీ 20,000 గ్రామాలను ఎంపిక చేసుకుంది. డిజిటల్‌ ఇండియా సాయంతో ఆయా గ్రామాలలో ఉపగ్రహ ఎర్త్‌ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఏ పంట వేయాలి? ఏ పంట వేయకూడదు? ఏ మందు వాడాలి, ఎంత ఎరువు వాడాలి? ఇవన్నీ సలహాలు ఇస్తున్నది. ప్రభుత్వం కూడా ఈ సంస్థ నుంచే కొన్ని సలహాలు తీసుకుని నెట్‌ ద్వారా రైతులకు అందిస్తున్నది. దీనితో రైతుల ఆదాయం పదిశాతం పెరిగింది. భవిష్యత్తులో ఎంత పంట వేశారు, ఏ పంట దిగుబడి ఏ గోదాములో ఎంత నిల్వ ఉన్నది అనే గణాంకాలు కూడా అందు తాయి. అలాగే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌తో మన రైతును అనుసంధానం చేయడంలో కూడా పురోగతి ఉంది.

భారత్‌ నెట్‌ ప్రోగ్రామ్‌ (హైస్పీడ్‌ డిజిటల్‌ హైవే) లో 2.5 లక్షల పంచాయతీలను అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావించింది. అది నెరవేరిందా ?

హాత్‌హాత్‌ మే టెలిఫోన్‌, గావ్‌గావ్‌ మే ఇంటర్నెట్‌ అన్నది నా నినాదం. దేశంలో 6,25,000 జనావాసాలు ఉన్నాయి. ఇందులో రెండున్నర లక్షల పంచాయతీలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించి మొత్తం గ్రామాలను అనుసంధానం చేయడమే భారత్‌ నెట్‌ లక్ష్యం. ఇది మోదీగారి ఆశయం. బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవలంటే ఇదే. ఇందుకు అయ్యే ఖర్చు రూ. 70,000 కోట్లు. దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? కానీ నిజానికి నిధులకు కొరత లేదు. టెలీకమ్యూనికేషన్స్‌ వ్యవస్థకు అనుమతులు ఇచ్చినప్పుడు అనుమతులు తీసుకునే ప్రతి సంస్థ యూనివర్సల్‌ సర్వీస్‌ ఫండ్‌ కింద ఐదు శాతం చెల్లించాలని కోరాం. దీనితో లక్షన్నర కోట్లు సమకూరాయి. భారత్‌నెట్‌ పథకం పూర్తి చేయడానికి ఈ నిధులే ఉపయోగించాలని అనుకున్నారు. కానీ ఇది తగినంత వేగంగా నడవడం లేదు. అలా అని విఫలమైందని అనలేం. నత్తనడకన సాగుతోంది. దీనిని అప్పగించిన సంస్థ లోపమది. ఏమైనప్పటికీ 2019 నాటికి డిజిటల్‌ ఇండియాకు పూర్తి స్వరూపం ఇవ్వాలన్నదే నరేంద్ర మోదీ ఆశయం.

ఇది సాధ్యమవుతుందని అనుకోవచ్చా ?

జాతి ప్రయోజనాల కోణం నుంచి చూస్తే ఇది సకాలంలో పూర్తి కావాలని అంతా ఆకాంక్షించాలి. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలలో ఇదొకటి కదా! ప్రభుత్వం కూడా డిజిటల్‌ ఇండియా వంటి ఒక గొప్ప పథకాన్ని జాతికి అందించిన ఘనతను నమోదు చేసుకోవాలనే కోరుకుంటుంది!

పారిశ్రామిక విప్లవానికి మించినది డిజిటల్‌ విప్లవం. భవిష్యత్తులో ఈ విప్లవం ప్రయాణం ఏ విధంగా ఉండబోతుందని అనుకోవచ్చు? ప్రపంచ డిజిటల్‌ విప్లవం, అందులోనే భాగమైన భారత డిజిటల్‌ ప్రస్థానం ఎలా ఉంటుందని ఊహించవచ్చు?

2100 సంవత్సరానికి మనిషి కంటే కంప్యూటర్‌ తెలివైనదని నిర్ద్వంద్వంగా తేలిపోతుంది. కంప్యూటర్లు మనుషులని చంపేస్తాయి. 1818లో మేరీ షెల్లీ (1797-1851) అనే ఇంగ్లిష్‌ రచయిత్రి విక్టర్‌ ఫ్రాంకిన్‌స్టీన్‌ (లేదా ది మోడరన్‌ ప్రొమోథియస్‌) అనే నవల రాశారు. ఇందులో కథానాయకుడే ఆ ఫ్రాంకిన్‌స్టీన్‌. ఇతడు రసాయనిక చర్యల పరిణామం గురించి చదివి, మానవ వికాసం పతనదశలో తను సృష్టించిన ఒక ఆకారానికి ప్రాణప్రతిష్ట చేస్తాడు. ఇదే చివరికి పెద్ద విధ్వంసక శక్తి అవుతుంది. ఇప్పుడు కంప్యూటర్‌ పరిస్థితి ఏమిటి? 1990 దశకంలో పెద్ద క్విజ్‌ కార్యక్రమం ఒకటి జరిగితే అందులో ఎవరు నెగ్గారో తెలుసా? డీప్‌బ్లూ కంప్యూటర్‌. ఇది ఐబీఎం వాళ్లు తయారు చేశారు. ఐబీఎం వాళ్లే మరొక కంప్యూటర్‌ని కూడా తయారు చేశారు. ఇది చాలా ఆధునిక పరిజ్ఞానంతో తయారుచేసినది కూడా. దీనికి వ్యాట్సన్‌ అని పేరు పెట్టారు. ఇది ఆస్పత్రుల అవసరాల కోసం ఉద్దేశించినది. చేయవలసిన శస్త్ర చికిత్సల గురించి ప్రతి వారంతంలో సమావేశం జరుపుకుంటారు. శస్త్ర చికిత్సల మీద సమీక్ష కూడా చేస్తారు. అందులో శస్త్ర చికిత్సల గురించి పెద్ద పెద్ద డాక్టర్ల కంటే వ్యాట్సన్‌ తీసుకున్న నిర్ణయాలే 95 శాతం విజయవంతమయ్యాయని తేలింది. ఇది ఎక్కడో కాదు, మన మణిపాల్‌లోనే ఉంది. ఆస్ట్రేలియా వారు మరొక కంప్యూటర్‌ తయారు చేసుకున్నారు. ఇది కూడా వైద్య ఆరోగ్య విభాగంలోనే సేవలు అందిస్తున్నది. మొత్తం ఆస్ట్రేలియా పౌరులందరి ఆరోగ్యం, దానికి సంబంధించిన రికార్డు ఆ ఒక్క కంప్యూటర్‌లోనే నిక్షిప్తం చేశారు. అయితే అక్కడ వ్యక్తిగత సమాచారం వెల్లడించడం గురించి చాలా కట్టుదిట్టమైన వ్యవస్థ ఉంది కాబట్టి ఆ సమాచారానికి భద్రత ఉంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనండి లేదా కంప్యూటర్‌ వ్యవస్థ అనండి. ఇప్పుడు ప్రపంచం మీద వాటి ఆధిపత్యం ఈ స్థాయిలో ఉందని చెప్పడానికే వీటి గురించి ప్రస్తావించుకున్నాం. కాబట్టి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కి కూడా విచక్షణ అవసరం. ఆధునిక యుగంలో ఫ్రాంకిన్‌స్టీన్‌ ఆరాచకం పునరావృతం కాకూడదు. మనిషికి మంచీచెడూ విచక్షణా జ్ఞానం ఇంకా కొంచెమైన మిగిలి ఉంది. ఇలాంటి విచక్షణని కంప్యూటర్ల నుంచి ఆశించలేం. ఇంకోమాటలో చెప్పాలంటే విజ్‌డమ్‌ అవసరం. కానీ ఎలా? ఐఇఇఇ (ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ఇంజనీర్స్‌) ఈ విషయం గురించే ఆలోచిస్తోంది. ఆ సంస్థ ఆలోచన సంగతి ఎలా ఉన్నా, భారతీయ జీవన విధానంలో కనిపించే విజ్ఞత, వినయ విధేయతలు భవిష్యత్తులో కూడా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు గుర్తు చేసుకోవలసిన అవసరం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *