సమస్య పరిష్కారానికి సరైన సమయం

సమస్య పరిష్కారానికి సరైన సమయం

కాల్పుల విరమణ తరువాత, అంతకు ముందు తీవ్రవాదుల పట్ల ఎలా నడుచుకున్నారో సైన్యం ఇప్పుడు అలానే నడుచుకుంటుంది. సాధ్య మైనంత మేర సమానాంతర నష్టం జరగకుండా నడుచుకుంటుంది. స్థానిక తీవ్రవాదులు లొంగిపోతే, వారు జీవన స్రవంతిలో కలిసి పోవడానికి అవసరమైన ఏర్పాట్లను గవర్నర్‌ చేస్తున్నారు.

జమ్మూ-కశ్మీర్‌లో గత ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవడంతో అక్కడ పిడిపి, బిజెపిలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇరు పార్టీల ఎజెండాలకు పొంతన లేకపోయినా ప్రజాస్వామ్యంపై గౌరవంతో బిజెపి పిడిపికి మద్దతిచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు దారి సుగమం చేసింది. భాజపా మూడు సంవత్సరాలుగా ఓపికతో ప్రభుత్వంలో కొనసాగింది. పిడిపి తీసుకున్న రాష్ట్ర వ్యతిరేక విధానాల వల్ల కొద్ది రోజుల కిందట బిజెపి తన మద్దతును ఉపసంహ రించుకుంది. గత్యంతరం లేక పిడిపి ముఖ్యమంత్రి మెహబూబా రాజీనామా చేశారు. దాంతో అక్కడ గవర్నర్‌ పాలన విధించారు.

రాజకీయ విశ్లేషకులు అక్కడ ఈ పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదని ముందే ఊహించారు. అయితే ఇలాంటి సమయంలో బిజెపియే ముందుగా మద్దతు ఉపసంహరించు కుంటుందని ఎవరూ అనుకోలేదు.

జమ్మూ-కశ్మీర్‌లో సైన్యం, పోలీసుల నిరంతర గస్తీ, కృషి వల్ల తీవ్రవాదుల ఆగడాలు కొంతవరకు అదుపులో ఉన్న మాట వాస్తవమే అయినా మెహబూబా ప్రభుత్వం సైనికులపై రాళ్ళ వర్షం కురిపించే కశ్మీర్‌ యువత పట్ల కఠినంగా ప్రవర్తించక పోవడం, రంజాన్‌ మాసంలో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి ఏకపక్షంగా కాల్పుల విరమణకు ఒప్పించడం భాజపాకు సహించలేదు. భారత సైన్యంతో ఏకపక్షంగా కాల్పుల విరమణ గావించిన సమయంలో తీవ్రవాదులు, పాక్‌ సైన్యం భారతీయులపై కాల్పులు కొనసాగించాయి. అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్నాయి. మెహబూబా ఒక రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని, భాజపాను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ పాలన కొన సాగించారు. దాంతో అధికార భాగస్వామ్యం నుండి బిజెపి వైదొలగింది.

రాష్ట్రంలో టెర్రరిజం, హింస పెరిగిపోయాయి. పౌరుల ప్రాథమిక హక్కులు అపాయంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులను అదుపులో పెట్టలేకపోయింది. భారతదేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర గవర్నర్‌కే పాలన పగ్గాలు అందించడం భావ్యం అని భాజపా ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ పేర్కొన్నారు.

భాజపా మద్దతు ఉపసంహరించుకున్న వెంటనే నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ నేతలు రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధించాలని, ఎన్నికలు జరపడానికి అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని తద్వారా త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. క్లిష్ట పరిస్థితులు నెలకొన్న రాష్ట్రంలో శాంతి, భద్రతలు నెలకొల్పడానికి తమ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని అధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా గవర్నర్‌కు తెలియజేశారు. కాంగ్రెస్‌ ఏ పార్టీకి సంకీర్ణ ప్రభుత్వానికి సహకరించ బోమని తెలియజేసింది. దీనివల్ల పిడిపికి ఎటూ పాలుపోలేదు. ఒంటరి అయిపోయింది. దాంతో రాష్ట్రపతి అక్కడ గవర్నర్‌ పాలనకు ఆమోదం తెలిపారు.

ఒక రకంగా ఈ సంకీర్ణం భాజపా ప్రతిష్ఠను దెబ్బ తీసిందనడంలో సందేహం లేదు. గత మూడు సంవత్సరాల పిడిపి పాలనలో జమ్మూ-కశ్మీర్‌లో పరిస్థితులు, శాంతి, భద్రతలు పూర్తిగా దిగజారి పోయాయి.

మెహబూబా ముఫ్తి తీవ్రవాదుల పట్ల మెతక వైఖరి అవలంబించడం వలన రాష్ట్రంలో భద్రతా వ్యవస్థ క్షీణించింది. తమకు ప్రభుత్వం అను కూలంగా ఉందని తీవ్రవాదులు, గుండాలు రెచ్చిపోయారు. శాంతి భద్రతలు ఎంతగా దిగజారిపోయాయంటే అక్కడ సుజాత్‌ బుఖారీ అనే జర్నలిస్టు పట్టపగలే హత్యకు గురయ్యాడు. మరో రోజు సైన్యంలో పని చేస్తున్న ఔరంగజేబును ఎత్తుకెళ్ళి చంపివేశారు. ఈ సంఘటనలను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొంది. భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఔరంగజేబు ఇంటికి వెళ్ళి అతడి కుటుంబ సభ్యులను కలిసి వారికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో గవర్నర్‌ పాలన మొదలు కాగానే అక్కడి మీడియా సైన్యంపై దుష్ప్రచారం మొదలెట్టింది. టెర్రరిజంతో తలపడడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారట. ఇక సైన్యం ఉక్కుపిడికిలితో తీవ్రవాదులను మట్టుబెడుతుందని అక్కడి మీడియా దుష్ట ప్రచారం చేసింది.

రంజాన్‌ నెల సందర్భంగా చాలా మంది రక్షణ విశ్లేషకులు కాల్పుల విరమణను వ్యతిరేకించారు. కాని పిడిపి, మెహబూబా ఒత్తిడి వల్ల, కేంద్రం నిర్ణయం వల్ల భారతసైన్యం కాల్పుల విరమణను గౌరవ ప్రదంగా అమలు చేసింది. కాల్పుల విరమణ తరువాత, అంతకు ముందు తీవ్రవాదుల పట్ల ఎలా నడుచుకున్నారో సైన్యం ఇప్పుడు అలానే నడుచుకుంటుంది. సాధ్యమైనంత మేర సమానాంతర నష్టం జరగకుండా నడుచుకుంటుంది. స్థానిక తీవ్రవాదులు లొంగిపోతే, వారు జీవన స్రవంతిలో కలిసిపోవడానికి అవసరమైన ఏర్పాట్లను గవర్నర్‌ చేస్తున్నారు.

కొన్ని విదేశీ శక్తులు జమ్మూ-కశ్మీర్‌లో మత ఛాందసవాదాన్ని పెంపొందించడానికి తీవ్రమైన కృషి చేస్తున్నాయి. ఇలాంటి వారిని ఇప్పటి వరకు చూసి చూడనట్లు వదిలేశారు. ఈ మధ్య మీడియా మరో విషయాన్ని బయట పెట్టింది. అధికారంలో ఉన్నప్పుడు పిడిపి ప్రభుత్వం ‘జమాయతే వలే కుదస్‌’ అనే సంస్థకు 6 ఎకరాల భూమిని ఇవ్వాలని నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని బిజెపి వ్యతిరేకించింది.

ప్రస్తుతం జమ్మూ- కశ్మీర్‌లో రెండు విధానాలు అవలంబించాలి. కశ్మీర్‌ నాగరికతలో సూఫీ తత్త్వం, కాశ్మీర్‌తత్త్వం కలగలిసేలా చర్యలు చేపట్టాలి. అదే సమయంలో ఛాందసవాద శక్తులను అణచి వేసే చర్యలు చేపట్టాలి.

కశ్మీర్‌లో ప్రింట్‌ మీడియా ధనవంతుల అధీనంలో ఉంది. పత్రికా స్వేచ్ఛ అపాయకర స్థితిలో ఉంది. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడానికి ఇది కూడా ఒక కారణం.

ఇక్కడ ప్రింట్‌మీడియా విదేశీ శక్తుల ప్రాబల్యంలో సామాన్యుల ఆలోచనలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఇది మిగతా మీడియా మాధ్యమాలను డామినేట్‌ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీడియా అధిపతులకు ప్రకటనలు వస్తాయి. ఈ ప్రకటనలు వేర్పాటువాదాన్ని, జాతి వ్యతిరేకతను ప్రోత్సాహించేలా చేస్తున్నాయి.

పత్రికా స్వేచ్ఛ అంటే జాతీయ వ్యతిరేకతను పెంచడం కాదు. ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుంది. జాతి వ్యతిరేకతను పెంపొందించే యెల్లో జర్నలిజాన్ని, జాతి వ్యతిరేక ఉద్రేకాలను రెచ్చగొట్టే జర్నలిజాన్ని తక్షణమే ప్రతిబంధించాలి.

కశ్మీర్‌ ప్రజలు ముందుగా తమ పిల్లలను తీవ్రవాదం వైపు మళ్ళకుండా చేయాలి. స్థానిక పిల్లలు తీవ్రవాదం వైపు మళ్ళకుండా ఉంటే అక్కడ వీలైనంత త్వరగా శాంతి, భద్రతలు నెలకొంటాయి.

జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్రంలో కశ్మీర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. జమ్మూ, లడఖ్‌లను చిన్న చూపు చూస్తారు. రోహింగ్యా శరణార్థుల విషయంలో ఒక తీరున, భారత సరిహద్దులలో నివసిస్తున్న ప్రజల పట్ల మరొక తీరున ప్రవర్తించింది పిడిపి ప్రభుత్వం.

జమ్మూ ప్రజలు గవర్నర్‌ పాలనను ఆనందంగా స్వాగతించారు. రాష్ట్రంలో పరిస్థితులను చక్కపరచి ఎన్నికలకు అనువైన పరిస్థితిని కల్పించే బాధ్యత ప్రస్తుతం గవర్నర్‌పై ఉంది.

– జైబాన్స్‌ సింగ్‌

– ఆర్గనైజర్‌ నుండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *