వడ్ల ఒలుపు

వడ్ల ఒలుపు

చైత్రమాసం!

అక్కడ భద్రాద్రిలో సీతారామ కల్యాణ మహోత్సవానికి సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయి.

ఇక్కడ భీమవరం శ్రీరామ చైతన్య సంఘం ఆధ్వర్యంలో రాములవారి కల్యాణానికి తలంబ్రాలు బియ్యం కోసం వడ్లు ఒలుపు గోదావరి ఒడ్డున ప్రారంభమైంది.

చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వందలాది భక్తులు గోటితో ధాన్యం గింజలను ఒలిచే కార్యక్రమం ప్రారంభించారు. భక్తి ప్రపత్తులతో కోటి తలంబ్రాలను సిద్ధం చేసే విధంగా వ్యూహరచన చేశారు. ఇరవై బృందాలు ఈ బృహత్తర కార్యానికి నడుం బిగించాయి. భక్తులు శుచిగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, నుదుటన తిలకం ధారణం చేసుకుని, పవిత్రంగా శ్రీరామ జపం చేస్తూ దీక్షలో పాల్గొన్నారు. పునర్వసు జన్మ నక్షత్రీయుడైన సూర్యవంశ ఆదర్శమూర్తి స్మరణలతో ప్రాంగణం హోరెత్తింది.

”వడ్ల ఒలుపు ఉద్దేశం సీతారాముల కల్యాణానికి తలంబ్రాల బియ్యం సిద్ధం చేయడం మాత్రమే కాదు. వడ్లగింజలో బియ్యపు గింజలాగే అంతర్లీనంగా లోతైన సందేశం ఉంది. వడ్లగింజను ఒలిస్తే లోపల ఉన్న బియ్యం గింజ కనిపిస్తుంది. బియ్యం కోసం వడ్లు ఒలిచిన చందాన మనం మనల్నీ, మన ఆలోచనలనీ గమనించాలి. కపటం, స్వార్థం, అవినీతి, హింస, కామం, క్రోధం, రాగద్వేషాలు, దురాశ, దు:ఖం, ఆశ్రిత పక్షపాతం వంటి వాటిపి వడ్లుపై పొట్టు ఒలిచినట్లు ఒలవాలి. అప్పుడు నిజ జీవితం అగుపిస్తుంది. దైవ ప్రసాదమైన జీవితంలోని మాధుర్యం జ్ఞానం, శాంతి, ప్రేమ, సుఖం పవిత్రత, శక్తి మనకు అర్థమవుతాయి” అని వడ్లు ఒలుపు రహస్యం విప్పారు, దీక్ష ఆరంభించిన సంఘం నాయకుడు శేషాద్రిశర్మ.

అంతా బావుంది. భక్తుల ఏకాగ్రతనీ, మానసిక ప్రశాంతతని భగ్నం చేస్తున్న ఆ ఒక్క గొంతు తప్ప.
బృంద నాయకురాలు వసుంధరాదేవి పెద్ద గొంతుతో మాట్లాడుతోంది. అనవసరంగా హడావుడి చేస్తోంది. అప్రస్తుతము, అభ్యంతకరాలు అయిన ప్రసంగాలు కూడా చేస్తోందామె. పైగా అధికారం చెలాయించే రీతిలో వ్యవహరించడం వడ్ల ఒలుపు భక్తులకు తలనొప్పిగా పరిణమించింది. ఆమె నాయకురాలే. కానీ ఎదిరించడం సమస్య కాదు. కానీ దానితో ఆ మంచి వాతావరణం, ప్రశాంత చిత్తత ఎక్కడ చెడుతుందోనని అందరూ మిన్నకున్నారు.

పరిస్థితిని గమనించిన శర్మగారు సమావేశ అనంతరం వసుంధరాదేవిని ప్రక్కకి పిలిచి మాట్లాడారు.

ఆమె మాటల్లో తన అత్తగారి పెత్తనం వల్ల పడుతున్న కష్టాలు అర్థమయ్యింది. ఆమెలోని ఆ అలజడికీ, అశాంతికీ, ఆందోళనకీ, అధికారం చెలాయించాలనే తత్వాలకు మూలం అత్తగారి ఆరళ్లేనని గ్రహించారు శర్మ. అత్త మీద కోపం దుత్తమీద చూపిన చందాన ఆమెకి అవకాశం ఉన్న ఈ కార్యక్రమంలో వివిధ రూపాలుగా పదిమంది లోనూ ప్రదర్శిస్తోందని తెలుసుకున్నారు. అత్త గొణుగుడు, సూటిపోటి మాటలు తమ సంసారానికి ఆటంకంగా నిలుస్తున్నాయని ఆమె కళ్లనీళ్లు పెట్టుకుంది. అర్థం చేసుకున్న శర్మగారు, మొదట కోడలిలో మార్పు తేవాలని ఇలా చెప్పారు.

”మీ అత్తగారిని తప్పుపట్టలేం. ఆమె పెరిగిన వాతావరణం, ఎదుర్కొన్న సమస్యలు, కట్టుబాట్లు ఆవిడని అలా మార్చేసి ఉంటాయి. వారి విద్య, శారీరక, మానసిక, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక స్థాయి కూడా వారి ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసి ఉంటుంది. అత్తా ఒకింటికి కోడలే అని విని ఉంటావు కదా! ఎవరి అనుభవాలు వారివి. ఆమె అత్తమామల ప్రభావం, కుటుంబ నేపథ్యం కూడా కారణమై ఉంటుంది. దానికి తోడు వయోభారంతో చాదస్తం పెరిగి అనారోగ్యంతో బలహీనపడి కూడా వారు వింత ధోరణులతో వ్యవహరిస్తూ ఉండవచ్చు. ఏ తల్లీ తన కొడుకు కాపురం నాశనం కావాలని కోరుకోదు కదా! కాబట్టి అత్త మాటల్లో అంతరార్థం గమనించాలి కానీ అనర్థాలు వెదకరాదు. మీ అత్తగారైనా, మరొకరైనా పెద్దవారితో సానుభూతితో వ్యవహరించాలి. ఆమె స్థానంలో మీరే ఉంటే ఎలా వ్యవహరించేవారో పరిశీలించండి. ఘర్షణకి దిగకండి. మొదటిలో ఆమె చెప్పినట్లు వింటూ చిన్న చిన్నగా ఆమెలో మార్పును తీసుకువచ్చే ప్రయత్నం చేయండి. సమస్య సులభంగా పెనం మీద వెన్నలా కరిగిపోతుంది. అత్తాకోడళ్లు స్నేహితులై పోతారు. మీరు ఘర్షణ పడుతుంటే ఇంటి మగవారు మానసికంగా బలహీనమైపోతారు. కుటుంబ అభివృద్ధి ఆగిపోతుంది. మనస్పర్థలే మిగులుతాయి. ఇతరులను సంస్కరించటం కష్టం. మనల్ని మనం సంస్కరించుకోవడం సులభం. అత్త గొణుగుడు వల్ల జరిగే నష్టం కన్నా, అత్తా కోడళ్ల ఘర్షణ వల్ల జరిగే నష్టం ఎక్కువ. కొన్నిచోట్ల సర్దుకుపోండి. నిత్యకల్యాణం – పచ్చతోరణంలా మీ సంసారం దినదిన ప్రవర్ధమానమవుతుంది” అని సముదాయించారు శర్మ.

రెండు వారాలు గడిచింది.

ఒడ్లు ఒలుపు కార్యక్రమం పూర్తయ్యే రోజు రానే వచ్చింది. కోటి తలంబ్రాల పని పూర్తయింది.

మేళ తాళాలతో, బాజా భజంత్రీలతో సీతారామ, లక్ష్మణ, హనుమంతుల పంచలోహ ఉత్సవ మూర్తులను పౌర్ణమి వెలుగులో గోదావరీ నదీ తీరాన పారిజాతం చెట్ల మధ్యన ఉంచారు పూజారులు. విగ్రహాలకు పట్టువస్త్రాలు కట్టి విశేష ఆభరణాలతో పుష్పమాలలతో అలంకరించారు.

భక్తులు శ్రీరామ సంకీర్తనలు చేశారు.

పౌరాణికులు శ్రీమద్రామాయణంలోని శ్రీరామ జనన వృత్తాంతాన్ని శ్రావ్యంగా పఠించారు.

27 వత్తులతో అమర్చిన వెండిదీపం వెలిగించి 27 జ్యోతులతో నక్షత్ర హారతి ఇచ్చారు. నిర్వాహకులు పురాణ పఠనం చదివిన పౌరాణికులకు తాంబూల సత్కారం చేశారు. పురోహితులు విచ్చేసిన భక్తులకు పుష్ప ప్రసాద చందన శఠారి వినియోగం చేశారు. విజయవంతమైన వడ్లు ఒలుపు తలంబ్రాల బియ్యానికి పసుపు కుంకుమలు సుగంధ ద్రవ్యాలు పూసి వేద పండితులు మంత్రాలు పట్టిస్తుండగా తలంబ్రాలను బుట్టలలో నింపడంతో దీక్ష దిగ్విజయంగా ముగిసింది.

ఒకరికొకరు ఆసరాగా ఆప్యాయంగా సన్నిహిత స్నేహితుల వలె ప్రసాదం స్వీకరిస్తూ కనిపించారు ఆ అత్తాకోడళ్లు. మంచిమాటలతో, మంచిబుద్ధి ప్రసాదించిన శర్మగారికి కోడలు వసుంధరాదేవి అత్తతో కలసి నమస్కారం చేసుకుంది.

శేషాద్రిశర్మ కళ్లతోనే ఆశీర్వదించారు.

– ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *