లాభసాటి సేంద్రియం శాస్త్రవేత్తల లక్ష్యం

లాభసాటి సేంద్రియం శాస్త్రవేత్తల లక్ష్యం

చక్కటి పరిశోధనలతో, ఆచరణ యోగ్యమైన, నూతన సేంద్రీయ సాగు పద్ధతులను ఆవిష్కరించి, నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులతో, రైతులకు లాభసాటి సాగును సుసాధ్యం చేసి, జనావళికి ఆరోగ్యకరమైన జీవితాన్నిచ్చే దిశగా శాస్త్రవేత్తలు సత్సంకల్పంతో ముందడుగు వేయాలి.

నేపథ్యం

ప్రాచీన కాలం నుండే మనిషి తన మనుగడకు తన చుట్టూ సహజ సిద్ధంగా ఉన్న నేల, నీరు, వాతావరణం వంటి ప్రకృతి వనరులను తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ జీవిస్తున్నాడు. అందులో భాగంగానే తన ఆహార, నివాస, వస్త్రాలు తదితర అవసరాలకు ప్రకృతి నుండి లభ్యమయ్యే వనరులను వినియోగించుకొంటూ తరాలుగా భూమిని దున్ని వ్యవసాయం చేస్తూ అభివృద్ధి పథంలో పయనిస్తున్నాడు. వ్యవసాయంతో పాటు దానికి అనుబంధంగా అనేక ఇతర వృత్తులు చేపట్టి సుఖంగా జీవిస్తున్నాడు. వ్యవసాయంలో క్రమంగా స్వానుభవంతోను, ఇతరుల అనుభవాల నుండి తగిన జ్ఞానాన్ని పెంచుకుంటూ వ్యవసాయంలో నూతన పోకడలను దిగ్విజయంగా చేపడుతూ మానవాళికి ఆరోగ్యవంతమైన ఆహారం అందిస్తున్నాడు.

ఇందుకు నిదర్శనం మన ప్రాచీన గ్రంథాలైన వేదాలలోనే కనిపిస్తుంది. అందులో వ్యవసాయాన్ని గురించి పలు సాంకేతిక విషయాలు, పలు పద్ధతుల గురించి సవివరంగా ఉన్నాయి. మన పూర్వీకులు వీటన్నింటిని చక్కగా ఆచరిస్తూ, ప్రకృతి వనరులకు విఘాతం కలగకుండా వ్యవసాయం ద్వారా జీవనాన్ని సాగించారు. ఇలా వేల సంవత్సరాలుగా మనదేశంలో వ్యవసాయం ప్రకృతికి అనుగుణంగా, సహజ వనరులకు దెబ్బ తగలకుండా జరుగుతూ సహజ వ్యవసాయం లేదా సేంద్రీయ వ్యవసాయంగా స్థిరపడింది.

జనాభా పెరుగుదల – రసాయన విధానం

అనంతరం సుమారు రెండువందల సంవత్సరాల క్రితం మనిషి జీవితకాలం సగటున 25 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు పెరిగింది. అందుకు అనేక నూతన ఆవిష్కరణలు కారణాలయ్యాయి. ఈ క్రమంలోనే మన దేశ జనాభా కూడా పెరిగి, వారి ఆహార, ఇతర అవసరాల కోసం వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెంచవలసిన ఆవశ్యకత ఏర్పడింది.

పెరిగిన జనాభా ఆహార అవసరాల నిమిత్తం తక్షణం ఉత్పత్తి పెంచవలసి రావడంతో దానికోసం ఇతర దేశాలపై ఆధారపడవలసిన దుస్థితి ఏర్పడింది. వ్యవసాయం ద్వారా ఉత్పత్తులను పెంచుటకు అనువైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నూతన వంగడాలను, రసాయనిక ఎరువులను, క్రిమిసంహారక మందులను పాశ్చాత్య దేశాల నుండి అరువు తెచ్చుకోవలసి వచ్చింది. వీటి ద్వారా మన రైతాంగం తమ ప్రతిభను చూపి వ్యవసాయోత్పత్తులను గణనీయంగా పెంచింది.

ఇలా రసాయన విధానంలో ఉత్పత్తులను పెంచాలనే అత్యాశతో మన రైతులు రానురానూ రసాయనిక ఎరువులను, క్రిమిసంహారకాలను అవసరానికి మించి విచక్షణారహితంగా వాడడంతో సహజవనరులైన నేల, నీరు వాతావరణం కలుషితమై, పలుచోట్ల నేలలోని భూసారం నిర్వీర్యమై, పంటల దిగుబడులు తగ్గాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో క్రిమిసంహారక మందులలోని రసాయనిక అవశేషాలు ఎక్కువవుతున్నాయి. వాటిని తినడం వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతిని ఆసుపత్రుల పాలవటం మనందరికి ఆందోళన కలిగిస్తున్న విషయం. ఈ రసాయనాలతో మనిషితో పాటు ఇతర జీవరాశుల మనుగడ కూడా ప్రశ్నార్థకమైంది.

సేంద్రియమే మార్గం

ఈ నేపథ్యంలో ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, రైతులు, పర్యావరణవేత్తలు, సమాజం పట్ల అనురాగం ఉన్న మేధావులు, సేవాభావం గల్గిన పలు వర్గాలు ఏకమై రసాయనిక వ్యవసాయాన్నుండి రసాయన రహిత వ్యవసాయం దిశగా మరలాలని ఆలోచిస్తున్నారు. అందుకు మార్గంగా ప్రకృతి వనరులకు హాని కల్గకుండా ఆరోగ్యవంతమైన పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఉత్పత్తులను అందించే సేంద్రీయ వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. సేంద్రియ వ్యవసాయంలో సహజ వనరులు, జీవన ఎరువులతో జీవ నియంత్రణ పద్ధతులను సమగ్రంగా ఆచరించి, నాణ్యమైన, రసాయన రహిత, ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను పొందవచ్చు.

సేంద్రీయ వ్యవసాయం ఇప్పటికే దేశ విదేశాలలో ప్రాముఖ్యం పొందింది. సేంద్రీయ వ్యవసాయం ప్రస్తుతం మన దేశంలో 4.72 మి.హెక్టార్లలోను, ప్రపంచ వ్యాప్తంగా 43.7 మి.హెక్టార్లలోను సాగు అవుతోంది. సేంద్రీయ ఉత్పత్తుల ప్రాముఖ్యాన్ని ప్రజలు గుర్తించినందున సేంద్రీయ ఉత్పత్తులకు డిమాండు బాగా పెరిగింది. అంతర్జాతీయంగా ఈ డిమాండ్‌ ప్రతి యేటా 20 శాతం పెరుగుతున్నదని అంచనా. ఇంతటి ప్రభావం కలిగిన సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రభుత్వం, తన ఆధీనంలోని పలు ప్రభుత్వ శాఖలు, వ్యవసాయ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఒక ఉద్యమ స్ఫూర్తితో విస్తృతంగా ప్రచారం చేసి, హెచ్చు విస్తీర్ణంలో సాగు చేసేటట్లు రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. ఈ పని మరింత వేగంగా జరగాలి.

సేంద్రీయ వ్యవసాయ ప్రచారం కోసం శాస్త్ర వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు పలుచోట్ల రైతులతో ప్రాంతీయ, దేశీయ, అంతర్జాతీయ స్థాయి సమావేశాలు ఏర్పాటుచేసి, కూలంకషంగా చర్చించి తగిన కార్యాచరణ పథకాలతో ముందుకు వెళుతున్నాయి.

సమస్యలు – పరిష్కారాలు

ఈ సమావేశాల్లో సేంద్రియ వ్యవసాయానికి ఎదురవుతున్న ఆటంకాలు, సమస్యలు మొదలైన అంశాలు చర్చకు వచ్చాయి. అవి..

– సేంద్రీయ వ్యవసాయాన్ని విస్తృత స్థాయిలో చేయడానికి అవసరమైన జీవన ఎరువులు, జీవ రసాయనాలు, జీవ నియంత్రణ పద్ధతులు అందుబాటులో లేకపోవటం. ఉన్నచోట్ల ధరలు ఎక్కువగా ఉండటం.

– సేంద్రీయ సాగు చేపట్టిన మొదటి మూడు సంవత్సరాల్లో పలుచోట్ల దిగుబడులు తగ్గటం.

– సేంద్రియ ఉత్పత్తులకు లాభసాటిగా ధరలు లభించకపోవటం.

సేంద్రియ వ్యవసాయం విస్తృతం కావాలంటే పైన పేర్కొన్న సమస్యలను అధిగమించాలి.

– సేంద్రియ సాగులో ఏ జీవన ఎరువులను ఏ పరిమాణంలో వాడితే మంచి దిగుబడులు వస్తాయి అనే అంశాలపై పరిశోధనలు ముమ్మరంగా జరగాలి.

– చీడపీడలను నియంత్రించుటకు ఆచరణ యోగ్యమైన జీవ నియంత్రణ పద్ధతులను, జీవరసాయనాలను రూపొందించి, సరళమైన ధరలకే రైతులకు అందుబాటులోనికి తేవాలి.

– సేంద్రియ ఉత్పత్తులకు తగిన ధృవీకరణ పత్రాలు రైతులకు అందించాలి. మార్కెట్‌లతో రైతులకు అనుసంధానాన్ని కల్పించి, వ్యవసాయ ఉత్పత్తులకు తగిన ధర రైతులకు లభించేలా మార్కెట్‌ సౌకర్యాలను పెంపొందించాలి.

– సేంద్రీయ వ్యవసాయ ప్రోత్సాహానికి, మార్కెట్‌ వసతులు, పరిశోధన, విస్తృత మౌలిక సౌకర్యాల కల్పన, తగిన ప్రోత్సాహకాలు, తగిన ఆర్థిక వనరులు మొదలైన వాటిని ప్రభుత్వం కల్పించాలి.

– రసాయనిక వ్యవసాయం వల్ల జరిగే చెడును గురించి, సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల వల్ల జరిగే ఆరోగ్యం, ఇతర మేలు గురించి సమగ్రంగా, విస్తృతంగా రైతులలోను, ప్రజల్లోను ప్రాచుర్యం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, ముఖ్యంగా వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉంది.

శాస్త్రవేత్తలు కృషి చేయాలి

ప్రాచీనకాలం నుండి మనది సేంద్రీయ సాగే. జనాభా పెరుగుదలకు అనుగుణంగా పంట పెంచాలనే ఉద్దేశ్యంతో గత 50 సంవత్సరాల నుండే మన రైతులు రసాయనిక ఎరువులు వాడటం ప్రారంభించారు. వీటిని విపరీతంగా వాడటంతో నేల నిర్వీర్యమై, వ్యవసాయ ఉత్పత్తులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా తయారయ్యాయి. వీటికి తోడు పంట ఉత్పత్తులను చీడపీడల నుండి కాపాడ టానికి సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టకుండా, విచక్షణా రహితంగా క్రిమిసంహారక మందులు వాడి వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాల నిల్వకు కారణమైంది.

ఈ మధ్య చేపట్టిన రసాయన వ్యవసాయ ఉత్పత్తులలో పలుచోట్ల పలు పంటలు, కూరగాయలు, పండ్లలలో నిర్దిష్ట పరిమాణాలకన్నా ఎక్కువగా పురుగు మందుల అవశేషాలు ఉండటం ఆందోళన కల్గించిన విషయం అందరికి తెలిసిందే. అందుకే సేంద్రియ వ్యవసాయ శాస్త్రవేత్తలు సేంద్రియ దిశగా తగిన చర్యలు తీసుకుని, రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి.

గత 50-60 సంవత్సరాల్లో రసాయన ఎరువుల, పురుగు మందుల దుష్ఫలితాలను గ్రహించి; భూసారాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి తగిన కార్యక్రమాలను, సేంద్రీయ సాగుపై తగిన పరిశోధనలు చేపట్టారు. ఆ ప్రయోగ ఫలితాలను చక్కగా విశ్లేషించి, అవసరం మేరకు సేంద్రీయ ఎరువులపై మరిన్ని పరిశోధనలు విస్తృతంగా జరిపి, ప్రతి పంటకూ తగిన విధంగా సేంద్రీయ సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని రూపొందించాలి. అదేవిధంగా జీవ రసాయనాలను రూపొందించి పలు పంటల్లో వచ్చే చీడపీడలను నియంత్రించటానికి ఉపయోగించవలసిన మోతాదులను నిర్ధారించాలి.

పంటల సాగులో రసాయనిక ఎరువులను పూర్తిగా తగ్గిస్తే పంట దిగుబడులు తగ్గుతాయని, తదనుగుణంగా ఆహార భద్రతకు భంగం కల్గుతుందని పలు శాస్త్రవేత్తల్లో ఒక దురభిప్రాయం ఉంది. ఇది వాస్తవం కాదు.

ఎందుకంటే తక్కువ పోషకాలతోనే మంచి దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్తలే పలు పరిశోధనలు చేసి నిరూపించారు. అదే స్ఫూర్తితో మానవాళి మనుగడ కాపాడుకుంటూ సుస్థిరమైన దిగుబడులతో సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి కేంద్రీకరించి యుద్ధ ప్రాతిపదికన రైతులు ఆచరించ దగిన రీతిలో సేంద్రియ విధానాలు రూపొందించి ప్రాచుర్యం చేయాలి.

కొత్తగా రసాయనిక ఎరువులు ప్రవేశపెట్టినపుడు మన అధికారులే స్వయంగా రైతుల పొలాలకు వెళ్ళి బలవంతంగా పొలంలో ఎరువులను వాడించి, వాటి ఫలితాలను రైతులను అర్థమయ్యే విధంగా చూపించి ప్రాచుర్యం చేశారు. అదేవిధంగా ఇప్పడు కూడా పలు పంటల్లో ఆచరణ యోగ్యమైన సేంద్రియ సాగు పద్ధతులను శాస్త్రీయంగా నిర్ధారించి, ప్రదర్శనా క్షేత్రాల ద్వారా రైతులకు అవగాహన కల్గించి, ఆచరింప చేయాలి.

ముందుగా ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పంటలు సేంద్రీయ సాగుకు అనుకూలమో నిర్ధారించి ఆయా పంటల్లో చేపట్టవలసి సేంద్రియ సాగు పద్ధతులను ఆచరింపచేసి రైతులను ప్రోత్సహించాలి. ఆయా ప్రాంతాల్లో పాటించవలసిన పంటల సరళిని, పంటలను, పంటలలో తక్కువ ఎరువును ఉపయోగించుకొనే దేశీ వంగడాలను, సేంద్రీయ సాగు పద్ధతులు, జీవ నియంత్రణ పద్ధతులను పంట ప్రదర్శనల ద్వారా రైతులకు చూపించి, ఒప్పించి, ఆచరింపజేసి ప్రోత్సహించాలి.

మరోవైపు సేంద్రీయ వ్యవసాయంపై జరిపే పరిశోధనలను ముమ్మరం చేసి నూతన ఆవిష్కరణలతో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను రసాయనిక వ్యవసాయ ఉత్పత్తులకు దీటుగా సాధించి వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనా పటిమను, నైపుణ్యాలను మరోసారి నిరూపించాలి.

చక్కటి పరిశోధనలతో, ఆచరణ యోగ్యమైన, నూతన సేంద్రీయ సాగు పద్ధతులను ఆవిష్కరించి, నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులతో, రైతులకు లాభసాటి సాగును సుసాధ్యం చేసి, జనావళికి ఆరోగ్యకరమైన జీవితాన్నిచ్చే దిశగా శాస్త్రవేత్తలు సత్సంకల్పంతో ముందడుగు వేయాలి.

– ప్రొ|| పి.రాఘవరెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌, రిటైర్డ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *