రైతు బాగుపడాలంటే మద్దతు ధర పెంచాల్సిందే

రైతు బాగుపడాలంటే మద్దతు ధర పెంచాల్సిందే

–  రైతు లేకపోతే ఆహారమే లేదు
–  అందరికీ ఆహారాన్నిచ్చేది రైతే
–  మరి తమ పంటకు తగిన ధరను పొందే హక్కు రైతుకు లేదా ?

మన కోసం అహర్నిశలు శ్రమించి ఆహారం, పశుగ్రాసం, ఫైబర్‌, ఇంధనం వంటివి అందజేసే రైతులంటే మన మనస్సుల్లో చెప్పలేని అభిమానం. రైతుల క్షేమాన్ని, శ్రేయస్సును ఎల్లప్పుడూ కోరుకుంటాం. అలాంటప్పుడు రైతులు తాము పండించిన పంటకు తామే సరైన ధరను నిర్ణయించే హక్కును వారికి కల్పించాలని వారు కోరడంలో తప్పు లేదు!

పగలు, రాత్రులు మాసాల కొద్ది వ్యయ ప్రయాసలకోర్చి పంటను పండించే రైతన్నకు మార్కెట్లో మాత్రం అడుగడుగునా నిరాశే ఎదురవు తోంది. తగిన గిట్టు బాటు ధర లభించక జీవితం ఎండమావిని తలపిస్తోంది. అయినప్పటికీ పౌరులందరి ఆకలి మంటలను చల్లార్చడానికి ఎండా, వానలను సైతం లెక్క చేయకుండా భూమినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు రైతన్నలు. పండించిన పంటకు కూడా వెల కట్టుకోలేని దౌర్భాగ్య స్థితిని నేడు రైతులు ఎదుర్కొంటుండడం బాధాకరమైన విషయం. వారి ఉత్పత్తులకు వెల కడుతున్న దళారులు అటు రైతులను, ఇటు పౌరులను నిలువునా దోచుకుంటున్నారు. రైతన్నల కన్నీటికి, వారి కుటుంబాల వెనుకబాటుకు కారణమవుతున్నారు. ఇలా రైతులు మధ్యవర్తులను నమ్ముకొని కష్టాలపాలవుతున్నారు.
మన కోసం అహర్నిశలు శ్రమించి ఆహారం, పశుగ్రాసం, ఫైబర్‌, ఇంధనం వంటివి అందజేసే రైతులంటే మన మనస్సుల్లో చెప్పలేని అభిమానం. రైతుల క్షేమాన్ని, శ్రేయస్సును ఎల్లప్పుడూ కోరుకుంటాం. అలాంటప్పుడు రైతులు తాము పండించిన పంటకు తామే సరైన ధరను నిర్ణయించే హక్కును వారికి కల్పించాలని వారు కోరడంలో తప్పు లేదు! ప్రస్తుతం మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నప్పటికీ రైతులు లాభాలను మాత్రం  పొందలేకపోతున్నారు. నిజానికి మంచి ధర వచ్చినప్పుడు కూడా దళారులు, మధ్యవర్తుల కారణంగా వారు నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా  వివిధ కారణాల వల్ల తరచూ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరుగుతుంటాయి. వాటిలో సాధారణంగా పంట సరిగ్గా పండనప్పుడు ఉత్పత్తి తక్కువగా ఉండడం ఒకటి. అలాంటి సందర్భాలలో పంట ధరను పెంచి రైతు లబ్ది పొందేందుకు, కమీషన్‌ ఎజెంట్‌ / బ్రోకర్ల నుండి పరిహారం అందుకునేందుకు ప్రభుత్వాలు అవకాశాలను కల్పించాలి.
నిజానికి రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను పొందేందుకు పూర్తి హక్కుదారులు. వారికి గిట్టుబాటు ధరను చెల్లించడం ద్వారా మనం రైతన్నలకు గౌరవాన్ని ఇచ్చినట్లవుతుంది. అంతే కాకుండా రైతులు, వారి కుటుంబ సభ్యులు సమాజంలో ఎంతో గౌరవప్రదంగా జీవించగలుగు తారు. వారు లాభాలను కోరుకోవడంలో తప్పు కూడా లేదు. ఎందుకంటే పంట పండించేందుకు కూలీలు, ఇతర పంట నిర్వహణకు ఎంతో ఖర్చు పెడతారు.
నిజానికి రైతులు ఎప్పుడూ దాతలే. ప్రస్తుతం వారు మనకు వారి శ్రమను దానం చేస్తున్నారు. అటువంటి దాతల పరిస్థితి గత ఐదు దశాబ్దాల కాలంలో దయనీయంగా మారిపోయిందనడంలో ఎటువంటి ఆశ్యర్యం లేదు. రైతు చుట్టూ ఉన్నవారు బాగుపడుతున్నప్పటికీ అతను మాత్రం రోజురోజుకూ బక్కచిక్కిపోతున్నాడు. చివరికి అంతర్జాతీయ కంపెనీలు కూడా విత్తనాలు, ఎరువులు, రసాయనిక ఎరువులు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకుంటూ కోట్ల రూపాయలను గడిస్తున్నాయి. రైతుల పొట్టకొట్టి దళారులు, మధ్యవర్తులు కూడా కోటీశ్వరులుగా మారుతున్నారు. రైతులపై ఆధారపడే వ్యాపారులు కూడా నేడు వారిని పట్టించుకోవడం లేదంటే ఎంత దారిద్య్రంలో రైతులున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో కష్టాల పాలైన రైతులు తమ శ్వాసను కూడా విడిచి పెడుతున్న సంఘటనలు నిత్యకత్యమై వారి ఇంట కన్నీరు పెట్టిస్తున్నాయి. ధరలు పెరిగిన ప్రతిసారీ పేదల కోసం సబ్సిడీలను ఇవ్వడం ప్రభుత్వ విచక్షణకు అద్దం పడుతుందనే చెప్పుకోవాలి.
ఒకప్పుడు రైతే రాజు
గ్రామ స్వరాజ్యాన్ని సాధించడంలో ఒక విధంగా మన వ్యవస్థలు విఫలమయ్యాయనే చెప్పుకోవాలి. ఒక్కప్పుడు రైతునని, తమది వ్యవసాయ కుటుంబమని చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరూ గర్వపడేవారు. భారత్‌కు స్వాతంత్య్రం రాకమునుపు మన దేశానికి రైతే రాజు. గతంలో పాలకులకు లక్షలాది రూపాయల పన్నులను రైతులు చెల్లించేవారు. ఎటువంటి ఋణాలు చేయవలసిన అవసరం వారికి ఉండేది కాదు. వ్యవసాయం సిరి, సంపదలకు చిహ్నంగా ఉండేది. కాని ప్రస్తుతం దేశం లక్షల కోట్ల రూపాయల ఋణాల్లో కూరుకుపోయింది. పాలకుల వైఫల్యంతో పుట్టిన పసివాడు కూడా మన దేశంలో ఋణగ్రస్తుడే. వ్యవసాయం బాగున్నంత కాలం భారతీయులు సంపన్నులుగానే జీవించారు. మన సంస్కతి, సంప్రదాయాలు, నాగరికత అన్నీ వ్యవసాయంతో ముడిపడి ఉన్నవే. పురాతన కట్టడాలు కూడా మన వ్యవసాయ ఆధారిత సంపదకు చిహ్నాలే అనడంలో ఎటువంటి సందేహం లేదు.
గతంలో అభివద్ధి అనేది ప్రాథమిక రంగమైన వ్యవసాయం పైనే ఆధారపడి ఉండేది. అంతే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఒక సామాజిక వ్యవస్థగా ఉంటూ వ్యవసాయాన్ని ప్రోత్సహించేవారు. దీంతో రైతులు గర్వంగా తలెత్తుకుని జీవించేవారు. కాని గత రెండు దశాబ్దాల కాలంలో పరిస్థితులు పూర్తిగా మారాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే జాబితాలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం తగ్గిపోయిందనే చెప్పుకోవాలి. దేశంలోని అత్యధిక పౌరులు వ్యవసాయాన్ని నమ్ముకొనే జీవిస్తున్నప్పటికీ రైతుల పరిస్థితులు మాత్రం అధ్వాన్నంగా మారుతున్నాయి. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తులకు, వ్యవసాయ కూలీలకు కూడా అంతగా విలువ లభించడం లేదు. ప్రకతిని పణంగా పెట్టి చేపడుతున్న రసాయనిక ఎరువుల వంటి నూతన విధానాలు రైతులను దెబ్బతీస్తున్నాయి. ఈ నూతన విధానాలు అధిక దిగుబడులను సాధిస్తున్నప్పటికీ.. దీర్ఘకాలంలో భూమిని నాశనం చేస్తున్నాయి. అంతేకాకుండా స్వయంసమృద్ధంగా ఉండే రైతులను ఇతరులపై ఆధారపడి జీవించేలా చేస్తున్నాయి. రసాయనిక విధానం వలన అత్యధిక మోతాదులో విడుదలవుతున్న గ్రీన్‌హౌస్‌ వాయువులు వారి జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పులు, కాలుష్యం, పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం, సంకరజాతి వంగడాలు రైతులను పీకల్లోతు కష్టాల్లోకి నెడుతున్నాయి.
ఇలాంటి కష్ట సమయంలో మనం రైతుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అందుకు ఇదే సరైన సమయం. రైతుల ఉత్పత్తులకు సరైన ధర లభించేలా చేయడం ద్వారా వ్యవసాయం పునర్జీవం పోసుకునేలా చేయాల్సిన కర్తవ్యం మనపై ఉంది. తద్వారా దేశానికి ఎంతో గర్వకారణమైన మన రైతులను మరోమారు దాతలుగా నిలబెట్టగలుగు తాము. సబ్సిడీలను తమంతట తాము వదులుకునేలా చేయగలుగుతాము. సాంకేతికతను కూడా అందిపుచ్చు కొని మరెందరికో ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రోత్సహించగలము. విద్యుత్‌, నీటి సరఫరాలకు తగిన మొత్తాన్ని చెల్లించే స్థాయికి చేర్చగలము. అలా మరోమారు మనం ఋణ విముక్తమైన భారతావనిని చూడగలము. రైతులకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వటం ద్వారా దేశ వెన్నెముకను నిలబెట్టగలిగే సువర్ణ అవకాశం ఇప్పుడు మన చేతుల్లో ఉంది.

– డా||ఎన్‌.సాయి భాస్కర్‌ రెడ్డి, పర్యావరణవేత్త, జియో స్పిరిట్‌, హైదరాబాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *