మోదీ ఆఫ్రికా పర్యటన

మోదీ ఆఫ్రికా పర్యటన

– రువాండాకు 2 లక్షల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించిన మోదీ

– ఉగాండా పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగం

– ఆఫ్రికా అభివృద్ధికి సహకరిస్తామని ప్రకటన

ఆఫ్రికా దేశాలతో భారత్‌ సంబంధాలను పటిష్టపరచే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఐదు రోజులపాటు మూడు ఆఫ్రికా దేశాల్లో పర్యటించారు. రువాండాతో ప్రధాని పర్యటన ప్రారంభమైంది. ఈ ఆఫ్రికా దేశాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధాని మోదీయే. రువాండా దేశాధ్యక్షుడు పాల్‌ కాగెమే విమానాశ్రయంలో మోదీకి స్వాగతం చెప్పారు.

ఒకప్పుడు ఆఫ్రికా అంటే వెనుకబడిన ప్రాంతమనే అభిప్రాయం ప్రపంచమంతటా ఉండేది. కానీ 2000 సంవత్సరం తరువాత ఆఫ్రికా దేశాల స్థితిగతుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఇప్పుడు ఆ దేశాలు ఆర్ధికాభివృద్ధికి చిరునామాగా మారుతున్నాయి. ఆరు ఆఫ్రికా దేశాలు ప్రపంచంలోనే వేగంగా ఆర్ధికాభివృద్ధి సాధిస్తున్న దేశాలుగా గుర్తింపు పొందాయి. 2015లో ఆఫ్రికా యూనియన్‌ 2063 విజన్‌ను తన ముందుంచుకుని ఆఫ్రికా అభివృద్ధికి బాటలు వేసింది. అలాగే ఆఫ్రికా అభివృద్ధి బ్యాంక్‌ కూడా 2016లో ‘హై 5 ఎస్‌’ అనే పేరుతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. ఆఫ్రికాను విద్యుత్‌ రంగంలో స్వయంసమృద్ధివంతం చేయడం, ఆకలి చావులు లేకుండా చేయడం, పారిశ్రామిక అభివృద్ధి, ఆఫ్రికా సమైక్యత, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం అనే ఐదు లక్ష్యాలతో ఈ ప్రణాళిక రూపొందింది. ఆర్ధికాభి వృద్ధిపై దృష్టి పెట్టిన ఆఫ్రికా దేశాలు ఇతర సంప్రదాయ, ప్రగతి సాధిస్తున్న ఆర్ధికవ్యవస్థలతో భాగస్వామ్యానికి కూడా ప్రయత్నిస్తున్నాయి. ఆఫ్రికా దేశాల ఆసక్తిని గుర్తించిన భారత్‌ గత నాలుగేళ్లలో ఈ దేశాలతో ఉన్న దౌత్యసంబంధాలను మరింత పటిష్ట పరుచుకుంది. 2015 మార్చ్‌లో సీషెల్స్‌, మారిషస్‌లలో పర్యటించిన ప్రధాని మోదీ ఆ తరువాతి సంవత్సరంలో కెన్యా, టాంజానియా, మొజాంబిక్‌, దక్షిణ ఆఫ్రికాలను సందర్శించారు. ఆఫ్రికాతో సంబంధాలను బలపరుచు కునేందుకు భారత్‌ 2015 అక్టోబర్‌లో న్యూఢిల్లీలో ఇండో-ఆఫ్రికన్‌ సమావేశాలను నిర్వహించింది. దీనిలో అన్ని ఆఫ్రికా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆఫ్రికాలో అభివద్ధి ప్రాజెక్ట్‌ల కోసం భారత్‌ 10 బిలియన్‌ డాలర్ల ఋణాన్ని ప్రకటించింది.

భారత్‌, చైనాలతో ఆఫ్రికా సంబంధాలు

భారత, ఆఫ్రికాల మధ్య ప్రాచీన కాలం నుంచి సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు ఉన్నాయి. సామ్రాజ్యవాదానికి, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఆఫ్రికా సాగించిన పోరాటానికి భారత్‌ గట్టి మద్దతునిచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన దేశం ఆఫ్రికా దేశాలతో సంబంధాలను మరింత బలపరచుకుంది. రాజకీయ, ఆర్ధిక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసమానతలకు వ్యతిరేకంగా ఆఫ్రికా దేశాలతో కలిసి గళమెత్తింది. మరోవైపు చైనా ఆఫ్రికా ఖండంలో తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది. ఆఫ్రికా దేశాలతో వివిధ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. 1950 తరువాత ఆఫ్రికా ఖండంలో అడుగుపెట్టిన చైనా మౌలిక సదుపాయాల కల్పన, సైన్యం, సహజ వనరులు, ఆర్ధిక సహాయం, ఋణాల రంగాల్లో ఈ ఒప్పందాలు చేసుకుంది. ఆఫ్రికా దేశాలకు ఆయుధాలు సరఫరా చేసే ప్రధాన దేశమైన చైనా ఇటీవల 50 ఆఫ్రికా దేశాల రక్షణ మంత్రులతో చైనా-ఆఫ్రికా సైనిక, రక్షణ ఫోరం సమావేశాలు నిర్వహించింది. ఆఫ్రికా దేశాలకు సైనిక శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. బాబా మోయో, టాంజానియాల్లో సైనిక శిక్షణ కేంద్రాలను ప్రారంభించింది కూడా. అంతర్జాతీయంగా మంచి పేరు సంపాదించడానికి, ఆఫ్రికాలో ప్రాబల్యం పెంచుకునేందుకు ఆఫ్రికా శాంతి దళాల్లో తమ సైనికుల్ని కూడా చేర్చింది. చైనా, ఆఫ్రికాల మధ్య వాణిజ్యం 220 బిలియన్‌ డాలర్లకు మించిపోయింది. అదే భారత్‌, ఆఫ్రికాల మధ్య వాణిజ్యం కేవలం 70 బిలియన్‌ డాలర్లే ఉంది. పరిమిత వనరుల వల్ల భారత్‌ ఈ విషయంలో చైనాతో పోటీపడలేక పోతోంది.

రువాండా

చిన్నదైన తూర్పు ఆఫ్రికా దేశం రువాండాకి భారత ప్రధాని మోదీ వెళ్ళడం అనేకమందిని ఆశ్చర్యపరచింది. ఒకప్పుడు బెల్జియం కాలనీగా ఉన్న రువాండా 1962లో స్వాతంత్య్రం పొందింది. అయినా విదేశీ పాలకులు అక్కడి హుటు, టుట్సి తెగల మధ్య నాటిన విభేదాలు, వైషమ్య బీజాలు పెరిగి పెద్దవై తీవ్రమైన హింసకు దారితీసాయి. 1994లో నరమేధం జరిగింది. 1994 ఏప్రిల్‌లో శాంతి చర్చల్లో పాల్గొని వస్తున్న హుటు నాయకుడు జువెనల్‌ హబైరిమానా ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేయడంతో పెద్ద ఎత్తున ప్రజాపోరాటం ప్రారంభమైంది. ఇందులో 8 లక్షలకు పైగా టుట్సిలు చనిపోయారు. దీనితో ఉగాండాకు వలసపోయిన టుట్సిలు రువాండా పేట్రియాటిక్‌ ఫ్రంట్‌ (ఆర్‌పిఎఫ్‌) అనే సంస్థను స్థాపించుకున్నారు. వారికి మేజర్‌ పాల్‌ కాగెమే నాయకత్వం వహించారు. సరిహద్దు అవతల వైపు నుండి దాడులు జరిపిన టుట్సిలు చివరికి హుటులపై విజయం సాధించగలిగారు. 1994లో ఏర్పడిన ప్రభుత్వంలో హుటులకు చెందిన బిజిముంగు అధ్యక్షుడుగా, కాగెమే ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారు. కానీ 2000 సంవత్సరంలో బిజిముంగు రాజీనామా చేయడంతో కాగెమే అధ్యక్షుడయ్యారు. అప్పటి నుంచి వరుసగా 2003, 2010, 2017లలో జరిగిన ఎన్నికల్లో నెగ్గి కాగెమే అధ్యక్ష పీఠాన్ని కాపాడుకున్నారు. ఇటీవల తెచ్చిన రాజ్యాంగ సవరణతో కాగెమే 2034 వరకు ఈ బాధ్యతలోనే ఉంటారు.

2000 సంవత్సరం తరువాత రువాండా మంచి ప్రగతిని సాధించింది. ఆర్ధిక సంస్కరణల వల్ల వేలాదిమంది పేదరికం నుండి బయటపడగలిగారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల్లో ఒకటైన రువాండా ప్రధానంగా వ్యవసాయ దేశం. మారణకాండ వల్ల పేదరికంలో కూరుకుపోయిన దేశ ప్రజలను ఆ ఊబి నుండి కాపాడటం కోసం కాగెమే ఒక పథకాన్ని అమలు చేశారు. గిరింక అనే ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఒక ఆవును ఇచ్చారు. ఆవును గొప్ప సంపదగా రువాండా ప్రజానీకం భావిస్తారు. ఆవు పాలు, బయో గ్యాస్‌ ఉత్పత్తి, సహజ ఎరువుల వల్ల గ్రామీణ ప్రజలు ఎంతో లాభపడ్డారు. క్రమంగా పేదరికం నుండి బయటపడ్డారు. ప్రభుత్వం నుండి ఆవును పొందినవారు ఆ ఆవులకు సంతానం కలిగితే వాటిని పక్కవారికి ఉచితంగా ఇవ్వాలని నియమం విధించారు. దీనివల్ల హుటు, టుట్సిల మధ్య వైషమ్యాలు సమసిపోయాయి. గో దానాన్ని రువాండా ప్రజలు గొప్పగా భావిస్తారు కాబట్టే ప్రధాని మోదీ తన పర్యటనలో 200 ఆవులను వారికి బహుమతిగా అందజేశారు. మోదీ చర్య రువాండా, భారత్‌ల మధ్య సంబంధాలను మరింత పటిష్టపరుస్తుందనడంలో సందేహం లేదు.

ప్రజాయుద్ధం తరువాత రువాండా, భారత్‌ల మధ్య సైనిక ఒప్పందాలు కుదిరాయి. వీటికింద భారత్‌ రువాండా దళాలకు శిక్షణ ఇవ్వడానికి అంగీకరించింది. పేదరికాన్ని తొలగించడంలో కాగెమే ప్రభుత్వం చేపట్టిన చర్యలకు వివిధ దేశాల ప్రసంశలు లభించాయి. పొరుగు దేశాలతో పోలిస్తే అవినీతిని బాగా అరికట్టిన రువాండా విదేశీ పెట్టుబడులను బాగా ఉపయోగించుకోగలిగింది. దేశ రాజధాని కిగాలి ఆఫ్రికాలోనే శుభ్రమైన నగరాల్లో ఒకటిగా పేరుపొందింది.

భారత్‌ – రువాండా సంబంధాలు

తూర్పు ఆఫ్రికా ముఖద్వారమైన రువాండా ఆఫ్రికా యూనియన్‌ అధ్యక్ష స్థానంలో ఆఫ్రికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి నాంది పలికింది. ఈ ఒప్పందంపై ఇప్పటికి 44 దేశాలు సంతకాలు చేశాయి. ఒకసారి ఇది అధికారికం అయితే డబ్ల్యూటిఒ తరువాత ఎక్కువ భాగస్వామ్య దేశాలు ఉన్న ఒప్పందం అవుతుంది. దీనిద్వారా ఆఫ్రికా మార్కెట్‌లో ప్రవేశించడానికి భారత్‌కు ఎంతో అవకాశం ఉంది. కేంద్ర ఆఫ్రికా రిపబ్లిక్‌లో కూడా రువాండా కీలక పాత్ర పోషిస్తోంది. 2017లో వైబ్రెంట్‌ గ్లోబల్‌ సమావేశాలకు హాజరు అయ్యేందుకు కాగెమే గుజరాత్‌ వచ్చినప్పుడు భారత్‌, రువాండాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడింది.

మోదీ, కాగెమేలు ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపి, రక్షణ, వాణిజ్యం, పాల ఉత్పత్తులు, సాంస్కృతిక వినిమయం, వ్యవసాయం మొదలైన వివిధ రంగాలకు సంబంధించి 8 ఒప్పందాలపై సంతకాలు చేశారు. ర్వేరు నమూనా గ్రామాన్ని సందర్శించిన ప్రధాని మోదీ 200 ఆవులను బహుకరించడంతోపాటు గిరింక కార్యక్రమానికి 2 లక్షల డాలర్ల ఆర్ధిక సహకారాన్ని కూడా ప్రకటించారు. అలాగే ఆడపిల్ల చదువు కోసం రువాండా ప్రథమ పౌరురాలు (దేశాధ్యక్షుని భార్య) నిర్వహిస్తున్న కిగాలి ఫౌండేషన్‌కు 10వేల డాలర్లు విరాళం కూడా ఇచ్చారు.

భారత్‌ – ఉగాండా సంబంధాలు

కిగాలి నుండి ప్రధాని మోదీ కంపాలా చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. 1997లో అప్పటి భారత ప్రధాని ఐకె గుజ్రాల్‌ ఇక్కడ పర్యటించారు. భారత, ఉగాండాల మధ్య చారిత్రక, సంప్రదాయ, వాణిజ్య సంబంధాలు ఉండేవి. కానీ భారత వ్యతిరేక ధోరణి అవలంబిం చిన ఇడి అమీన్‌ కాలంలో ఈ సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు మూసేవేనీ ఈ భారత వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పారు. 1970లో అమీన్‌ ద్వారా బహిష్కరణకు గురైన భారత సంతతి వారిని తిరిగి రావలసిందిగా మూసేవేనీ ఆహ్వానించారు. ప్రస్తుతం ఉగాండాలో నివశిస్తున్న 30 వేలమంది భారతీయ సంతతికి చెందినవారు అక్కడ 1 బిలియన్‌ డాలర్ల కంటే అధిక పెట్టుబడులు పెట్టారు. 3కోట్ల 50వేల జనాభాలో కేవలం 0.1 శాతం ఉన్న వీరు 60శాతం పన్నులు చెల్లిస్తున్నారు.

తూర్పు ఆఫ్రికా సముదాయానికి అధ్యక్షత వహిస్తున్న ఉగాండా తమ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించింది. ఇలాంటి ఆహ్వానం అందుకున్న ప్రధానుల్లో మోదీయే ప్రథములు. ఉగాండాను ‘ఆఫ్రికా ముత్యం’గా అభివర్ణించిన మోదీ అధికారికంగా దీపావళి ఉత్సవాలు జరుపు తున్నందుకు అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. నైల్‌ నది ఉద్గమ స్థానం, గాంధీ అస్తికలలో కొంతభాగం నిమజ్జనం చేసిన ప్రదేశమైన జింజ వద్ద గాంధీ స్మృతిమందిరాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. చైనా ప్రస్తావన చేయకుండా ఆఫ్రికా అవసరాలకు అనుగుణంగానే భారత్‌ సహాయసహకారాలు ఉంటాయని, తమ అవసరాల ప్రకారం కాదని మోదీ స్పష్టం చేశారు. ఆ విధంగా ఆఫ్రికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చారు.

భారత్‌, ఉగాండాల మధ్య ఆఫ్రికా యూనియన్‌, ద్వైపాక్షిక సంబంధాలు, స్థానిక ఆర్ధిక బృందాలు అనే మూడు స్థాయిల్లో సంబంధాలు నెలకొన్నాయి. ఆఫ్రికాతో సంబంధాలను మరింత పటిష్టపరచుకునే దిశగా రాగల కాలంలో 18 రాయబార కార్యాల యాలు ఏర్పాటు చేస్తామని మోదీ ప్రకటించారు. ఆఫ్రికాలో ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడం వంటి చర్యల ద్వారా భారత్‌ ఆర్ధిక సంబంధాలను మెరుగుపరచుకుని, చైనా విస్తరణ వాదాన్ని అడ్డుకోవచ్చును. ఆ దిశగా భారత్‌ అడుగులు వేయాలి.

– డా|| రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *