మానవ కంప్యూటర్‌ ‘శకుంతలా దేవి’

మానవ కంప్యూటర్‌ ‘శకుంతలా దేవి’

ప్రొఫెసర్‌ గిన్స్‌బర్గ్‌ పర్యవేక్షణలో శకుంతలా దేవిని పరీక్షించడానికి నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాండర్డ్స్‌కు చెందిన యూనివాక్‌ 1105 కంప్యూటర్‌కు 201 అంకెలు గల సంఖ్యను ఫీడ్‌ చేస్తే 4883 డేటాలో దాదాపుగా 13366 ఇన్‌స్ట్రక్షన్‌ ఫీడ్‌ చేసుకొని 45 మంది కంప్యూటర్‌ నిపుణుల పర్యవేక్షణలో ఆ కంప్యూటర్‌ 546372891 అన్న సమాధానాన్ని 62 సెకన్లలో ఇచ్చింది. అప్పట్లో ప్రపంచంలోనే అతి వేగంగా కాలిక్యులేషన్‌ చేయగల కంప్యూటర్‌ అది. శకుంతలా దేవి 50 సెనక్లలో చెప్పిన సమాధాన్ని యూనివాక్‌ 1105 కంప్యూటర్‌ 62 సెకన్లలో చెప్పింది. అందుకే శకుంతలా దేవిని హ్యూమన్‌ కంప్యూటర్‌ (Human Computer) అంటారు.

శకుంతలా దేవి బెంగళూరులోని ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో 1929 నవంబర్‌ 4వ తేదిన జన్మించారు. ఈమె తండ్రి పూజారి. శకుంతలా దేవి తన తల్లిదండ్రులకు 14వ సంతానం. పొట్ట గడవడం కష్టం కావడంతో శకుంతలా దేవి తండ్రి వీధి గారడీలు, వినోదాలు ప్రదర్శిస్తూ జీవనం సాగించేవారు.

శకుంతలా దేవి తన బాల్యంలో తీవ్రమైన పేదరికాన్ని అనుభవించారు. ప్రాథమిక విద్యతో పాటు ఆట, పాటలకు దూరమయ్యారు. శకుంతలా దేవి తన మూడో యేట తండ్రితో పాటు వీధి గారడీలు చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆ వయసులోనే శకుంతలా దేవి ఏ పనైనా తేలికగా, తెలివిగా, శ్రద్దగా చేసేవారు. అప్పుడు ఆమె నేర్చుకున్న అంకెలే తనకు, తన కుటుంబానికి పట్టెడన్నం తెచ్చిపెడతాయని తాను ఎప్పుడూ ఊహించలేదని శకుంతలా దేవి అనేవారు.

శకుంతలా దేవి ఆరు సంవత్సరాల వయసులోనే తన తండ్రితో పాటు సర్కస్‌ కంపెనీలో చేరారు. సర్కస్‌లో వివిధ విన్యాసాలు చేసే జంతువులు, పక్షులు, మనుషుల్ని చూసి తాము కూడా అంకెలతో ఇలాంటి విన్యాసాలు చేయలేమా ? వినోదాన్ని అందించలేమా ? అనే ఆలోచనతో అంకెలపై మరింత పట్టు సాధించారు.

చిరు ప్రాయంలోనే మైసూరు విశ్వవిద్యాల యంలో, అన్నామలై విశ్వవిద్యాలయంలో అంకెలతో, సంఖ్యలతో ముడిపడి ఉన్న అనేక సమస్యలను శకుంతలా దేవి అవలీలగా పరిష్కరించి అందర్ని అబ్బుర పరిచేవారు.

గుణకారం, భాగహారం, తీసివేత, కూడిక, వర్గమూలాలు, ఘనమూలాలు, గణిత చతుర్విధ పరిక్రియలు ఉపయోగించి తక్కువ సమయంలోనే జవాబులు చెప్పగలిగేవారు. గణిత మేధావులు సైతం శకుంతలా దేవి ప్రదర్శనను చూసి ఆశ్చర్య పోయేవారు.

1977 సంవత్సరంలో జనవరి 24వ తేదీన అమెరికాలో సదర్న్‌ మెడడిస్ట్‌ యూనివర్సిటీ అసెంబ్లీ హాల్లో సాయంత్రం నాలుగు గంటల సమయంలో డయాస్‌ మీదున్న బోర్డు మీద డాక్టర్‌ రోవ్‌ గిన్స్‌బర్గ్‌ అనే గణిత శాస్త్రవేత్త 201 అంకెలను వరుసగా ఒకదాని పక్కన ఒకటి రాశారు. అలా రాయడానికి ఆయనకు 10 నిమిషాల సమయం పట్టింది. ఆ సంఖ్య దాదాపుగా బోర్డు మీద 10 వరుసలు వచ్చింది. ఆ సంఖ్య 23వ మూలం కనుక్కోవాలి. ఆ సమస్యకు సమాధానం చెప్పమని శకుంతలా దేవిని అడిగారు. అప్పుడు ప్రతి ఒక్కరిలో ఆందోళన, భయం మొదలైంది. ప్రొఫెసర్‌ స్టాప్‌ వాచ్‌ ఆన్‌ చేశారు. కేవలం 50 సెకన్లలోపే శకుంతలా దేవి ఆ సంఖ్యకు 23వ మూలం 546372891 అని బోర్డు మీద రాశారు. ఆ సందర్భంలో కరతాళ ధ్వనులతో ఆ ప్రాంగణమంతా మార్మోగింది. వివేకానందుని తర్వాత అమెరికా ప్రజల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి శకుంతలా దేవి మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ప్రొఫెసర్‌ గిన్స్‌బర్గ్‌ పర్యవేక్షణలో శకుంతలా దేవిని పరీక్షించడానికి నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాండర్డ్స్‌కు చెందిన యూనివాక్‌ 1105 కంప్యూటర్‌కు 201 అంకెలు గల సంఖ్యను ఫీడ్‌ చేస్తే 4883 డేటాలో దాదాపుగా 13366 ఇన్‌స్ట్రక్షన్‌ ఫీడ్‌ చేసుకొని 45 మంది కంప్యూటర్‌ నిపుణుల పర్యవేక్షణలో ఆ కంప్యూటర్‌ 546372891 అన్న సమాధానాన్ని 62 సెకన్లలో ఇచ్చింది. అప్పట్లో ప్రపంచంలోనే అతి వేగంగా కాలిక్యులేషన్‌ చేయగల కంప్యూటర్‌ అది. శకుంతలా దేవి 50 సెనక్లలో చెప్పిన సమాధాన్ని యూనివాక్‌ 1105 కంప్యూటర్‌ 62 సెకన్లలో చెప్పింది. అందుకే శకుంతలా దేవిని హ్యూమన్‌ కంప్యూటర్‌ (Human Computer) అంటారు.

లండన్‌లోని ఇంఫీరియల్‌ కాలేజీలో కంప్యూటర్‌ విభాగంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వరుసగా 13 అంకెలను వేరే 13 అంకెలతో గుణించగా వచ్చే జవాబును శకుంతలా దేవి 28 సెకన్లలో కంప్యూటర్‌ కంటే వేగంగా చెప్పారు. దీనికి ఆమె 1982లో గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. దీనిని కంప్యూటర్‌ 45 సెకన్లలో చెప్పింది.

999ని విడదీస్తే 938742089 వస్తుందని ఇంకా పూర్తిగా సాధిస్తే ఆ సంఖ్య 428124773… అంకెలతో ప్రారంభమై 9తో ముగుస్తుందని శకుంతలా దేవి వివరించారు. ఆ సంఖ్య మొత్తంలో 369 మిలియన్‌ల నెంబర్లు ఉంటాయని, ఈ సంఖ్యను పూర్తిగా రాయడానికి వెయ్యి కిలోమీటర్ల కన్న ఎక్కువ పొడవున్న పేపరు కావాలని, ఆ సంఖ్యలోని నెంబర్లు అన్ని చదవాలంటే ఒక సంవత్సరం పైనే పడుతుందని చెప్పి అందరిని అశ్చర్యపరిచారు.

గత శతాబ్దానికి చెందిన తేదీ, నెల చెబితే ఆ రోజు ఏ వారమో చెప్పేవారు శకుంతలాదేవి. అంతేగాక పుట్టిన తేదీ, నెల చెబితే ఆ రోజు ఏ వారమో ఇట్టే చెప్పేసేవారు. ఆయా రోజులలో ఏ ఏ తేదీలు వస్తాయో వివరించేవారు.

శకుంతలా దేవి ప్రపంచంలోని అనేక దేశాలలో పర్యటించారు. గణిత శాస్త్రంలో కాలిక్యులేటర్స్‌, ఆధునిక కంప్యూటర్లను సైతం ఛాలెంజ్‌ చేస్తూ యూనివర్సిటీలలోను, కాలేజీలలోను, అనేక విద్యా సంస్థలలోను విరివిగా ప్రదర్శనలు ఇస్తూ ఆమె తన విజయ పరంపరను కొనసాగించారు.

శకుంతలా దేవి అనేక పుస్తకాలను సైతం రచించారు. అందులో ముఖ్యమైనవి ‘ద జాయ్‌ ఆఫ్‌ నెంబర్స్‌, మోర్‌ ఫజిల్స్‌ ఫర్‌ యు, బుక్‌ ఆఫ్‌ నెంబర్స్‌, ఫజిల్స్‌ టు ఫజిల్‌ యు’ మొదలైనవి. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ వదిలేసిన సమస్యలను సైతం శకుంతలా దేవి పరిశీలించి విజయం సాధించారు.

‘భారతదేశం లేకుంటే సున్నా (0) లేదు. సున్నా (0) లేకుంటే గణిత శాస్త్రం లేదు’ అని శకుంతలా దేవి చమత్కరించేవారు. శకుంతలా దేవి బెంగళూరులో 6 నుండి 20 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఉచితంగా గణిత శాస్త్రాన్ని భోదించేవారు. ఆమెకు ప్రపంచ నలుమూలల నుండి గణిత సమస్యలకు సంబంధించిన అనేక ఫోన్లు వచ్చేవి. వాటన్నిటికి సమాధానాలు చెబుతూ వారి నుండి ప్రశంసలు పొందేవారు.

శకుంతలా దేవి 2013 ఏప్రిల్‌ 21వ తేదీన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తుది శ్వాస విడిచారు.

– ఎం.డి .రఫి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *