మధ్య ప్రాచ్యంలో రగలనున్న అశాంతి..!

మధ్య ప్రాచ్యంలో రగలనున్న అశాంతి..!

సౌదీ అరేబియా మరియు ఇరాన్‌ల మధ్య ప్రాంతీయ ఆధిపత్యం కోసం అనేక దశాబ్దాలుగా పోరు ఉన్నప్పటికీ, ఇరాన్‌ వ్యతిరేకతతో ముందుకు సాగే ఒకే వ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతం కావడం మొత్తం ప్రాంతానికే విపత్తు కలిగించవచ్చు. ఇప్పటికే అనేక తప్పిదాలలో చిక్కుకున్న మధ్య ప్రాచ్యంలో అనాలోచిత చర్యలు మిగిలిన శాంతికి సైతం భంగం కలిగిస్తాయి.

నవంబరు 4న మబిస నేతృత్వంలోని అవినీతి నిరోధక బృందం 11 మంది సౌదీ రాజకుమారులతో సహా మరో 30 మంది మాజీ, ప్రస్తుత మంత్రులు; సౌది టి.వి. స్టేషన్ల అధిపతులను అరెస్టు చేశారు. వీరందరి ఆస్తులు జప్తు చేశారు. వీరందరిని రిట్జ్‌ కార్ట్‌టన్‌ హోటల్‌లో నిర్భందించారు.

అదే రోజు లెబనాన్‌ ప్రధానమంత్రి సాద్‌ హరిరి హిజ్‌బుల్లాపై హత్యా ప్రయత్నం ఆరోపిస్తూ రియాద్‌ నుండి తన రాజీనామా ప్రకటించారు. రాజ్యంలో వ్యాపార ప్రయోజనాల వలన సౌదీలో పెరిగిన అర్థ లెబనీయుడైన హరిరి సౌదీ రాజరికానికి కీలుబొమ్మగా ఉంటూ వచ్చారు. నవంబరు 3 న హరిరి సుప్రీం లీడర్‌ అలిఖమేని సలహాదారు అల్‌ అక్బర్‌ వేలాయతి నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని కలుసుకున్నారు. కాని మరుసటి రోజు అతడు సౌదీ వెళ్ళి, అక్కడ ప్రధానమంత్రిగా కొనసాగడానికి తన అయిష్టతను ప్రటించారు. ఆయన రాజీనామాకు ముందు ప్రముఖ సంఘటనలు ఏవీ జరగకపోవడంతో, సౌది అరేబియాలో ప్రారంభమైన పెద్ద అధికార రాజకీయాల గురించి సందేహాలు రేకెత్తాయి. పోయిన సంవత్సరమే ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన హరిరి, ఇరాన్‌ ప్రాపకం ఉన్న రాజకీయ సైనిక సంస్థ హిజ్‌బుల్లా కూడా ఉన్న ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. లెబనాన్‌లో సమాన అధికార పంపిణీకి ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, హిజ్‌బుల్లా గట్టి మిత్రుడు మైఖేల్‌ జౌన్‌ అధ్యక్షుడు కాగా రియాద్‌ మద్దతు కల హరిరి సున్ని ఆసక్తులకు ప్రాతినిధ్యం వహించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే హిజ్‌బుల్లాను నిరాయుధీకరించాలని హరిరి పిలుపునిచ్చారు. కాని లెబనాన్‌ భద్రత దృష్ట్యా అవసరమని అధ్యక్షుడు వాదించారు. నెమ్మదిగా బడ్జెట్‌ అంశాలపై పట్టు కోల్పోయి సిరియాకు రాయబారిని పంపాలనే హిజ్‌బుల్లా ఒత్తిడికి తలొగ్గవలసి వచ్చింది. క్షీణిస్తున్న హరిరి ప్రభావం సౌది అనుభవానికి రాసాగింది. లెబనాన్‌లోని స్థిరమైన ప్రభుత్వం హిజ్‌బుల్లాను చట్టబద్ధం చేసింది. హిజ్‌బుల్లా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టం కనుక హరిరి పదవీ విరమణకు ఆదేశించడం ద్వారా లెబనాన్‌లో సౌదీ గందరగోళం సృష్టిస్తుంది. హిజ్‌బుల్లా యుక్తి పరిమితమై అశాంతికి ఇరాన్‌ బాధ్యత వహించవలసి వస్తుంది. 2005లో హిజ్‌బుల్లాచే హత్యకు గురైన హరిరి తండ్రి రఫిక్‌ ద్వారా లెబనాన్‌పై తన నియంత్రణను సౌదీ చట్టబద్ధం చేసుకుంది. మధ్యప్రాచ్యంలో బలాల సంతులనానికి లెబనాన్‌ ఎల్లప్పుడూ కొలమానినిగా పనిచేసింది. ప్రస్తుతం, సిరియాలో యుద్ధాలు, యెమెన్‌ సంక్షోభంతో తలమునకలై ఉన్న ఇరాన్‌, లెబనాన్‌లో బలాల సంతులనంపై దృష్టి పెట్టలేకపోయింది. ఈ ప్రాంతంలో సౌదీ ప్రభావాన్ని నొక్కి చెప్పడానికి ఈ సందర్భాన్ని మబిస చక్కగా వాడుకొన్నారు.

సంక్షోభాన్ని మరింత దిగజార్చుతూ యెమెన్‌ నుండి ప్రయోగించిన ఒక బాలిస్టిక్‌ క్షిపణిని రియాద్‌లోని కింగ్‌ ఖలేద్‌ విమానాశ్రయం వద్ద అడ్డగించారు. మరణాలేవీ లేనప్పటికి, ఇరాన్‌కు వ్యతిరేకంగా తన కథనాన్ని తీవ్రతరం చేయడానికి సౌదికి తన కథనాన్ని తీవ్రతరం చేయడానికి మరో సాకు దొరికింది.

షియా ముస్లింలలో జైది తెగకు చెందిన హైతి తిరుగుబాటుదారులను సౌది నిర్ద్వంద్వంగా నిందించడంతోపాటు ఇరాన్‌ సైనిక సహాయం అందించిందని గట్టిగా నమ్మింది. క్షిపణి శిథిలాలు ఇరాన్‌ పాత్రను ధృవీకరించాయని పునరుద్ఘాటించిన సౌది తిరుగు సమాధానానికి సమయం తీసుకోలేదు. ఇది ‘ఇరాన్‌ పాలకులు పాల్పడిన కఠోర సైనిక ఆక్రమణ’గా వ్యాఖ్యానించిన రియాద్‌, ‘ప్రతిస్పందించే హక్కు’ను కాపాడుకున్నారు. క్షిపణి ప్రయోగం తరువాత సౌది అరేబియా దిగ్బంధనాన్ని కఠినతరం చేయడంతో యెమెన్‌లో మానవతా సంక్షోభం మరింత తీవ్రమయింది. మొత్తంమీద ఈ సంఘటనలు మధ్య ప్రాచ్యంలో బలాల సంతులనాన్ని మార్చివేశాయి.

2009లో మబిస రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తరువాత క్రమంగా అధికారంలోకి వచ్చారు. జనవరి 2015లో రాజు అబ్దుల్లా మరణించడంతో మబిస తండ్రి మహమ్మద్‌ సల్మాన్‌ రాజు అయ్యాడు. మబిస రక్షణమంత్రిగాను, కొత్తగా ఏర్పరచిన ఆర్థిక మరియు అభివృద్ధి వ్యవహారాల కౌన్సిల్‌ అధిపతిగాను నియుక్తులయ్యారు. యెమెన్‌ సంక్షోభం దిగజారుతుండగా హైతి తిరుగుబాటుదారులను సమర్థించిన ఇరాన్‌, ఉత్తర యెమెన్‌పై నియంత్రణ సాధించింది. పర్యవసానంగా, సౌది మద్దతు ఉన్న అధ్యక్షుడు అబ్బెరబ్బో మన్సూర్‌ హది రియాద్‌కు ప్రవాసం వెళ్ళారు.

2015 మార్చిలో జిసిసి భాగస్వాముల సంకీర్ణాన్ని సమీకరించిన మబిస సనాపై వాయుదాడులు చేసి, యెమెన్‌ యుద్ధానికి కారణమయ్యాడు. ఏప్రిల్‌ 2015 నాటి రాయల్‌ డిక్రీ (ఉత్తర్వు) ప్రకారం మొహమ్మద్‌ బిన్‌ నయెఫ్‌ క్రౌన్‌ప్రిన్స్‌ కాగా మబిస డిప్యూటి క్రౌన్‌ ప్రిన్స్‌ అయ్యారు. అతడు సౌది అరేబియా ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కంపెని బాధ్యతలు చేపట్టారు. డిసెంబరు 2015లో ఉగ్రవాదంపై పోరాడడానికి మబిస ఇస్లామిక్‌ నాటోగా ప్రశంసలు పొందిన 34-సున్ని ఇస్లామిక్‌ దేశాల సంకీర్ణంగా ఇస్లామిక్‌ సైనిక కూటమిని ఏర్పరచారు. ప్రపంచ వ్యాప్తంగా సంశయానికి కారణమైన ఈ ఉగ్రవాద వ్యతిరేక కూటమికి పాకిస్తాన్‌కు చెందిన రహీల్‌ షరిఫ్‌ కమాండర్‌గా దొరికాడు. నిలకడ లేని చమురు ధరలు, మరియు చమురు నిక్షేపాలపై ఆధారపడిన దేశం అయినందు వలన జాగ్రత్తపడిన ఆశావాది మబిస ఏప్రిల్‌ 2016లో ఆర్థికరంగాన్ని విస్తరించే యోజనతో విజన్‌ 2030 ప్రణాళికను ముందుకు తెచ్చారు. చమురుతో సంబంధం లేని ఆదాయాలను నిర్మించడం కోసం, మబిస సబ్సిడీలపై కోత విధించారు; కొత్త పన్నులు వ్యయాలను తగ్గించడానికి పొదుపు చర్యలు ప్రవేశపెట్టారు. అర్మాకోలా 5శాతం వాటా అమ్మడం ద్వారా 2 ట్రిలియన్‌ డాలర్ల సౌది సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ సృష్టించే ప్రణాళిక రచించారు. అయితే ఈ చర్య ఆలస్యం అయింది. నేషనల్‌ ట్రాన్ఫర్మేషన్‌ ప్రోగ్రాం పేరుతో ఆర్థిక సంస్కరణల శ్రేణి ప్రవేశపెట్టిన మబిస సౌది కాని నివాసులకు ‘గ్రీన్‌కార్డులు’ ఇచ్చే ఆలోచనను ముందుకు తెచ్చారు. రాజ్యానికి మతపర పరిమితుల నుండి విముక్తి కలిగించేందుకు సెప్టెంబరులో మహిళా చోదకులపై నిషేధాన్ని తొలగించిన మబిస స్టేడియంలు, థియేటర్లు వంటి బహిరంగ ప్రదేశాలలో మహిళల ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. యువ సౌదీల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న ఈ పురోగామి చర్య పాశ్చాత్యుల ప్రశంసలు పొందింది.

గత నెల ఇస్లామీకరణకు పిలుపునిచ్చిన మబిస బోర్డాన్‌, ఈజిప్టులను కలిపే ఎర్రసముద్ర తీరం వెంట నియోమ్‌ అనే నూతన నగరాన్ని నిర్మించే ప్రణాళికను ప్రకటించారు. సౌది అరేబియాను చమురు తరువాతి శకానికి సిద్ధం చేయడానికి సౌది సావరిన్‌ ఫండ్‌ ద్వారా నిధులు పొందే జీవ సాంకేతికత, తయారీ, వినోద రంగాలపై దృష్టిపెట్టారు.

పూర్వతరాల సౌది రాచరికానికి భిన్నంగా, 1991లో కువైట్‌ ఆక్రమణ మొదలుకొని గల్ఫ్‌లో అనేక అతి బాధాకర సంఘటనలను అనుభవించిన మబిసకు ఏకస్వామ్య రాచరిక పరిపాలన లోతు పాతులు బాగా తెలుసు. రాజ్య ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించటం, ఇరాన్‌కు పోటీగా ప్రాంతీయ శక్తిగా సౌదీ అరేబియా స్థానాన్ని పటిష్టం చేయడమనే జంట లక్ష్యాల సాయుధుడైన మబిస అధికారాన్ని కేంద్రీకరించే గొప్ప ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. తన లక్ష్యాల సాకారానికి, మధ్య ప్రాచ్య వ్యవహారాలను పర్యవేక్షించే అధ్యక్షుడు ట్రంప్‌ అల్లుడు జావెద్‌ కుష్నెర్‌తో వ్యక్తిగత సంబంధాలు ఏర్పరచుకొన్న మబిస అమెరికా పాలకులతో సంబంధాలు బలోపేతం చేసుకున్నారు. ట్రంప్‌ రియాద్‌ సందర్శన జరిగిన ఒక వారం తరువాత ఉగ్రవాదాన్ని బలపరుస్తోందని, ఇరాన్‌తో దగ్గరి సంబంధాలున్నాయనీ ఆరోపిస్తూ ఖతర్‌ను ఏకాకిని చేసే దౌత్య ఉద్యమాన్ని నిర్వహించారు. ఇతర గల్ఫ్‌ దేశాల మద్దతు సంపాదించిన మబిస స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్న ఆర్థికంగా బలమైన ఖతర్‌ ప్రభావాన్ని తగ్గించడంలో విజయవంతం అయ్యారు.

గల్ఫ్‌ ప్రాంతాన్ని విభజించిన ఈ సంఘటనతో వాషింగ్టన్‌ పరపతి పెరిగింది. సిరియా, ఇరాక్‌లలో ఇరాన్‌ విజయం, బీరుట్‌లో పెరుగుతున్న ప్రభావం, తరగని హైతి దాడులు ఈ ప్రాంతంలో షియావర్గాల ఆధిఖ్యత పెరుగుతుందనే సౌదీ భయాన్ని మరింత పెంచింది. సహజంగా, ఇరాన్‌ను తన సహజ శత్రువుగా పరిగణించే ఇజ్రాయెల్‌తో సన్నిహిత సంబంధాలను మబిస ఇష్టపడ్డారు. కొత్త అమెరికా ప్రభుత్వం సైతం కుష్నెర్‌ ద్వార అరబ్‌లు, ఇజ్రాయెలీల మధ్య సంబంధాలను సులభతరం చేసింది. ఇరాన్‌ ప్రభావాన్ని అరికట్టాలనే మబిస లక్ష్యానికి, ఇరాన్‌ పట్ల ట్రంప్‌ యుద్ధోన్మాదానికి ఏకీభావం కుదిరింది. మబిస భారీ ప్రణాళికలకు అమెరికా ఆమోదం నిజానికి ఆయనకు మరింత ధైర్యాన్నిచ్చింది.

ఇంతలోనే మబిస తన రాజకీయ ఉన్నతికి ఎదురయ్యే అవరోధాలను తెలివిగా తొలగించు కున్నారు. ఇంతకుముందు మార్ఫిన్‌, కొకైన్‌ వ్యసనాల కారణంగా క్రౌన్‌ ప్రిన్స్‌ స్థానం నుండి తొలగించబడిన పెద్దదాయాది (కజిన్‌) మహమ్మద్‌ బిన్‌ నయెఫ్‌ స్థానాన్ని మబిస భర్తీ చేశారు. తన వారసత్వానికి మరో ప్రత్యర్థి, సౌది అరేబియా నేషనల్‌ గార్డ్‌ అధిపతి ప్రిన్స్‌ మిట్టెబె బిన్‌ అబ్దుల్లాను అవినీతి నిరోధ ప్రచారం క్రింద తొలగించారు. రాజు అబ్దుల్లా వంశానికి చెందిన మిటెబ్‌ గణనీయమైన అధికారం చలాయించేవాడు. మరో సౌది రాజకుమారుడు, ప్రిన్స్‌ మక్రిన్‌ బిన్‌ అబ్దులజిజ్‌ కుమారుడు, మాజి నిఘా డైరెక్టరు, ఒకప్పటి క్రౌన్‌ ప్రిన్స్‌, ప్రిన్‌ మన్సూర్‌ బిన్‌ మక్రిన్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించాడు. అలాగే మరో వరిష్ట (సీనియర్‌) ప్రిన్స్‌ అగ్నిప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది.

సౌది కుటుంబంలోని వివిధ జాతుల మధ్య ఇప్పటివరకు ఎన్నో విభేదాలు ఉన్నప్పటికి, ఐక్యతను ప్రదర్శించారు. ఇప్పుడు ప్రిన్స్‌ల అరెస్టుతో మబిస శత్రువులను పెంచుకున్నారు.

ప్రస్తుతం మబిస ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సాయుధ దళాలను నియంత్రిస్తున్నారు. అలా ఏ విధంగా అయినా పోటికి వచ్చే అవకాశం ఉన్న సైనిక, రాజకీయ, ఆర్థిక, మీడియా సంబంధిత శక్తులను మబిస విజయవంతంగా తొలగించారు. దీనికితోడూ 2015లో తను రాజకీయ స్థానం పొందినప్పటి నుంచి, ఇరాన్‌ ఒక దురాక్రమణదారు అనీ, ఈ ప్రాంతంలో వివాదాలకు కారణమనీ చిత్రీకరించడం ప్రారంభించారు. మబిస తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాల పట్ల, ఆయన నిరంకుశ అణచివేత పట్ల పాశ్చాత్యుల ఉదాసీనత ప్రమాదకరం కావచ్చు.

సౌదీ అరేబియా మరియు ఇరాన్‌ల మధ్య ప్రాంతీయ ఆధిపత్యం కోసం అనేక దశాబ్దాలుగా పోరు ఉన్నప్పటికీ, ఇరాన్‌ వ్యతిరేకతతో ముందుకు సాగే ఒకే వ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతం కావడం మొత్తం ప్రాంతానికే విపత్తు కలిగించవచ్చు. ఇప్పటికే అనేక తప్పిదాలలో చిక్కుకున్న మధ్య ప్రాచ్యంలో అనాలోచిత చర్యలు మిగిలిన శాంతికి సైతం భంగం కలిగిస్తుంది. హరిరి రాజీనామా తరువాత తమపై లెబనాన్‌ యుద్ధం ప్రకటించిందని ఆరోపించిన సౌది, లెబనాన్‌ పౌరులను తమ దేశం విడిచి వెళ్ళాలని ఆదేశించింది. భద్రతా కారణాలు, పెరుగుతున్న ఇరాన్‌ మరియు దాని మిత్రుల ప్రభావం ఈ ప్రాంతానికి ప్రమాదకరం కాగలవని చెపుతూ ఇజ్రాయెల్‌ సైతం ఇదే విధానం అవలంబించింది. ఐసిస్‌ దాదాపు పూర్తిగా ఓటమి చెందిన దృష్ట్యా సిరియా ద్వారా ఇరాన్‌ను లెబనాన్‌తో కలిపే భూరహదారి నిర్మించడానికి ఇరాన్‌ ప్రణాళిక రచిస్తోంది. ప్రతిఘటన వార్తలేవీ లేనప్పటికి, మబిస చేపట్టిన ప్రక్షాళన దేశంలో గందరగోళం సృష్టించింది. పైగా మబిస చర్యలకు ట్రంప్‌ సమర్థన ఈ ప్రాంతంలో సౌది అరేబియా ప్రాధాన్యాన్ని బలోపేతం చేసింది. సౌది ఇరాన్‌ల సహనానికి లెబనాన్‌ ఒక ప్రయోగశాలగా మారింది. సౌది అరేబియా దురాక్రమణ ఈ ప్రాంతాన్ని సున్ని-షియా వర్గపోరాటానికి యుద్ధభూమిగా మార్చవచ్చు.

– డా||రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *