భారత మహిళ

భారత మహిళ

మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినోత్సవ ప్రత్యేకం

నేడు అనేక రంగాలలో కృషి చేస్తూ తమని తాము ఋజువు చేసుకుంటున్న మహిళలు తమ కుటుంబం గురించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకో వాలి. ఎంత గొప్ప ఉద్యోగ బాధ్యతలు మోస్తున్నా స్త్రీ సహజ లక్షణాలను కోల్పోకూడదు. విధి నిర్వహణలో కూడ తమదైన తీరులో మానవతా విలువలు నిలబెట్టేలా నిర్ణయాలు తీసుకోగలగాలి.

బుద్ధి జ్ఞానాలకి, సంపదకి, శక్తికి స్త్రీలని అధిదేవతలుగా చేసి కొలిచిన గొప్ప హిందు భావనలకి నెలవు మన దేశం. ఇక్కడ స్త్రీలు వారి రక్షణ కోసం గాని; హక్కులు, అధికారాల కోసం గాని పోరాడవలసిన అవసరం ఏనాడూ మన పెద్దలు కలగనివ్వలేదు. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో పుత్రులూ ఆమె సంరక్షణా భారం వహించాలని నిర్ణయించారు. గృహిణిగా ఆమెకు ఎన్నో బాధ్యతలు అప్పచెప్పారు. సామ్రాజ్ఞివై మా అందరినీ పాలించమని నూతన వధువు ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఆమె భర్త కోరతాడు. ఒక ప్రశాంతమైన కుటుంబ వ్యవస్థ, తృప్తిగా ఆనందంగా సాగే జీవన విధానం రూపొందించారు.

విదేశాల సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఇక్కడ ప్రవేశించేవరకు భారత స్త్రీ-పురుషుల మధ్య బేధభావాలు పొడసూపలేదు. అలా ఎన్నో యుగాలు భరతఖండంలో శాంతి సౌహార్దాలతో కూడిన సమాజం విలసిల్లింది. కాబట్టే ఇక్కడ విజ్ఞానం, శాస్త్రం, కళలు ఒకదానితో ఒకటి పోటీపడి వృద్ధి చెందాయి. ఆ మూడూ ఉన్న చోటు సహజంగానే సంపదలకి ఆలవాలమౌతుంది కదా. ఇక ప్రపంచ దేశాలన్నిటి కన్నూ మనదేశం మీదే పడింది.

విదేశీ దాడుల ప్రభావం

గడచిన రెండు వేల సంవత్సరాలలో అనేక జాతుల వారు మనపై దండెత్తి, మన సంపదని తరలించుకు పోవడమే కాకుండా మన జీవన విధానం మీదా, ధర్మం మీదా, సంస్కృతీ సాంప్రదాయాల మీదా తిరుగులేని ప్రభావాన్ని చూపి ఎంతో హాని చేశారు. ఏ జాతి మీదైనా దాడి జరిగితే ముందుగా బలయ్యేది మహిళలు, పిల్లలే. మనదేశంలోనూ అదే జరిగింది. మన జాతి గౌరవాన్ని కాపాడుకోవాలనే ఆరాటంతో మనవారే మహిళల మీద అనేక ఆంక్షలు విధించారు. ముష్కరుల కంటబడితే ప్రమాదమనే భయంతో మహిళలని ఇళ్ళల్లోనే ఉంచసాగారు. అందువలన వారికి విద్య, ప్రపంచ జ్ఞానం, ధైర్యం, సాహసం వంటివి కనుమరుగవ సాగాయి. దాంతో సామాజిక, ఆర్ధిక వ్యవహారాలలో, వారి పాత్ర నామమాత్ర మయ్యింది. పురుషుల నీడలో మాత్రమే మనవలసి వచ్చింది. గోరు చుట్టుపై రోకలి పోటులా ఈ పరిస్థితిని ఇంకా దిగజారుస్తూ బాల్య వివాహాలు, కన్యాశుల్కం, వరకట్నం, బహు భార్యాత్వం, సతీ సహగమనం వంటి ఎన్నో దురాచారాలు మన సమాజాన్ని కలుషితం చేశాయి.

వృద్ధి బాటలో..

దెబ్భై సంవత్సరాల క్రితం మన దేశం ఆంగ్లేయుల పరిపాలన నుంచి విముక్తమైనప్పుడు మనదేశంలో మహిళల పరిస్థితి అదీ. కేవలం మహిళలే కాదు. దేశ ఆర్ధిక, రాజకీయ, పరిపాలన, రక్షణ, న్యాయ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయి. దీనికి తోడు దేశంలో తెల్లదొరలు కుల, మత, ప్రాంత చిచ్చులు రగిల్చి గొడవలతో రగులుతున్న దేశాన్ని మనకు అప్పచెప్పారు. ఈ డెబ్భై సంవత్సరాలలో ఈ అన్ని పరిస్థితులను చక్కబెట్టడానికి తగినంత కృషి జరిగింది. అందులో ప్రధానమైనది మహిళా విద్య. వారికి కూడా పురుషులతో సమానంగా విద్యావ కాశాలు లభించాయి.

నెమ్మదిగా ఆడపిల్లలు పాఠశాల విద్య, ఆ తరువాత తరాలు కళాశాల విద్య అభ్యసించడం, ఆ తరువాత తరాలలోని మహిళలు వత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో భాగస్వామ్యం వహించడం మొదలయ్యింది. సుమారు ముప్ఫై సంవత్సరాల నుంచీ మన ఆర్ధిక వ్యవస్థలో జరిగిన మార్పులు, ప్రపంచీకరణ ప్రభావం వలన ప్రజల జీవన విధానంలో; ముఖ్యంగా మహిళల జీవితాలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా తమని తాము మలచుకోవలసి వచ్చింది. ఈ సవాళ్ళన్నిటినీ మహిళలు ధైర్యంగా, నిశ్శబ్దంగా ఎదుర్కొని ఎన్నో విజయాలు సాధించారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు తమవంతు సేవలందించారు.

ఏ మార్పూ పూర్తిగా మేలు చేస్తుందని కానీ, లేదా కీడు చేస్తుందని కానీ చెప్పలేం. పెద్ద వరదగా వచ్చి ఊరు అంతటిని ముంచిన నది వెళ్ళేటప్పుడు పొలాలకు ఒండ్రు మట్టిని ప్రసాదించి వెళుతుంది. అలాగే భరించలేని వేడిని కలిగించే వేసవి కాలం రాబోయే వర్షాకాలానికి అవసరమైన మేఘాలను తయారు చేస్తుంది. కాబట్టి ఏ కాలంలోనైనా మార్పుల వలన మంచీ, చెడూ రెండూ ఉంటాయి.

మరిన్ని కొత్త సమస్యలు

స్వతంత్ర భారతంలో జరుగుతున్న మార్పులను గమనించి స్వయంగా కొత్త బాధ్యతలను స్వీకరిస్తున్న మహిళా లోకం నేడు మరిన్ని కొత్త సమస్యల నెదుర్కోవలసి వస్తోంది. వాటిలో ముఖ్యమైనవి బలహీనపడుతున్న కుటుంబ వ్యవస్థ, విశ్వాసాన్ని కోల్పోతున్న వివాహ వ్యవస్థ, అధిక శ్రమ వలన కలిగే వత్తిడి, అందువలన గాయపడుతున్న భార్యాభర్తల సంబంధాలు, పిల్లల ఆలనా పాలనా – పెద్దల సేవా సంరక్షణపై తగ్గుతున్న శ్రద్ధ, ఆదుర్దా కలిగించే తన ఆరోగ్య సమస్యలు, తోటి ఉద్యోగులు కొందరు కలిగించే ఇబ్బందులు మొదలైనవి ఎన్నో. పెరుగుతున్న వివాహేతర సంబంధాల సమస్య కూడా విస్మరించలేనిది కావటం విచారకరం. వీటికి తోడు మారుతున్న జీవన ప్రమాణాలు, ఎప్పటికప్పుడు ఇంకా అధిక సంపాదన కోసం ప్రయత్నం, ఐనా తీరని కోరికలు. ఈ భౌతికవాదపు వెల్లువలో కొట్టుకుపోతున్న మన ప్రజలకు శాంతి, విశ్రాంతి అందని కుసుమాలవుతున్నాయి.

పూర్వకాలంలో అధిక సంతానం, చాలా పరిమితమైన ఆదాయం ఐనప్పటికీ కుటుంబాలు ఉన్నంతలో సంతోషంగా బతికేవి. ఇప్పుడు చాలా ఇళ్ళల్లో భార్యాభర్తలిరువురూ సంపాదనాపరులే. ఒకరో ఇద్దరో మాత్రమే సంతానం. వచ్చిపోయే బంధువులెవరూ ఉండరు. ఐనా సంతోషం కరువు. ఏదో భయం, అభద్రతా భావం, చిరాకులు, తమరిదయ్యాక పిల్లల భవిష్యత్తు గురించిన చింత. లేదా ఏదైనా అనారోగ్యం వస్తుందేమోననే భయం. ఇటువంటి మానసిక సమస్యలు మగవారిపై కన్నా మహిళపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

ఏదో వెలితి..

మన దేశం బాగుండాలంటే మన సమాజం బాగుండాలి. అంటే మన కుటుంబాలు బాగుండాలి. కుటుంబం బాగుండాలంటే ఆ ఇంటి ఇల్లాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. క్షమాగుణానికి, ఒర్పుకి, ప్రేమకి, సహనానికి చిరునామాగా ఉండే స్త్రీలు నేడు ఆ లక్షణాలన్నిటినీ కోల్పోతున్నారు. తమపై ఆధారపడ్డ కుటుంబ పెద్దలకి గాని, తాము కన్న సంతానానికి గాని సేవలందించేందుకు వారు పూర్తి సిద్ధంగా ఉండటం లేదు. తమ సమయాన్ని, ఉద్యోగా లని, సంపాదనని స్వేచ్ఛని త్యాగం చేసేందుకు ఇష్టపడట్లేదు. అందువలన కుటుంబా లలో పెద్ద వెలితి ఏర్పడుతోంది. మొన్న మొన్నటి వరకూ మన భారతీయ కుటుంబ వ్యవస్థ పట్ల ప్రపంచంలో ఎనలేని గౌరవముండేది. ఒక దశలో మనం గర్వంగా చెప్పుకోగలిగినది మన కుటుంబాలు, అపేక్షలు, ఒకరికోసం ఇంకొకరు చేసే త్యాగాలు, బాధ్యతలు పంచుకోడాలు, కష్ట సుఖాలు ఒకటిగా అనుభవించ డాలు వీటి గురించే. కానీ చూస్తూ ఉండగానే అన్ని కనుమరుగై పోతున్నాయి. ప్రేమ, త్యాగం, క్షమ, ఓర్పు స్థానంలో స్వార్ధం, ఈర్ష్య, దురాశ, చోటు చేసుకుంటున్నాయి. గతంలో మన కుటుంబ వ్యవస్థ అంత పేరు పడిందన్నా, నేడు అదే వ్యవస్థలో విలువలు దిగజారిపోతున్నాయి అన్నా ఆ పరిణామంలో మహిళల పాత్రను తక్కువ అంచనా వేయలేం. ఇంటి వద్ద పిల్లలకు జీవిత విలువలను చెప్పే సమయమే తల్లులకు ఉండడం లేదు. పిల్లల సమయమంతా పాఠశాల చదువులకే సరిపోతోంది. అక్కడ కూడా మానవతా విలువల గురించి చెప్పేవారు లేరు. ఇంక మన దేశంలో ఎటువంటి విలువలుంటాయని ఆశించగలం ?

స్త్రీ సహజత్వం కోల్పోవద్దు

నేడు అనేక రంగాలలో కృషి చేస్తూ తమని తాము ఋజువు చేసుకుంటున్న మహిళలు తమ కుటుంబం గురించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకో వాలి. జీవితమంటే కేవలం అప్పటి అవసరాలు మాత్రమే కాదు. తమ నూరేళ్ళ జీవితానికి అనువైన మార్గాన్ని ఎన్నుకోవాలి. ఎంత గొప్ప ఉద్యోగ బాధ్యతలు మోస్తున్నా స్త్రీ సహజ లక్షణాలను కోల్పోకూడదు. విధి నిర్వహణలో కూడ తమదైన తీరులో మానవతా విలువలు నిలబెట్టేలా నిర్ణయాలు తీసుకోగలగాలి. తామొక్కరూ బాగుంటే చాలదనీ తమ కుటుంబమూ, సమాజమూ బాగుంటేనే తాము క్షేమంగా ఉండగలమనీ తెలుసుకోవాలి. తమ రాష్ట్రంలోను, దేశంలోను, ప్రపంచంలోను జరిగే పరిణామాల గురించి అవగాహన కలిగి ఉండాలి. ఆర్ధిక, రాజకీయ, శాస్త్రీయ పరిశోధనల గురించి కొంతైనా పరిజ్ఞానం ఉండాలి. కేవలం తన భర్త, పిల్లలు అని గిరిగీసుకు కూచోకుండా ఆత్తవారింటి వైపు బంధువులతో కూడ మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అలాగే ఇరుగు పొరుగుతోను, కార్యాలయాలలో స¬ద్యోగులతోను సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే సహాయం చేసేది వారే. కుటుంబ సభ్యుల ఆరోగ్యంతో పాటు తన ఆరోగ్యం విషయంలో కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

కుటుంబం ముఖ్యం

ఆర్ధికమైన లక్ష్యాలు ఎంత ముఖ్యమనిపించినా అవేవీ కుటుంబ క్షేమం కన్నా గొప్పవి కాదు. ప్రేమ మయమైన కుటుంబం ఇచ్చే ఆనందం ప్రపంచంలో మరేదీ ఇవ్వలేదు. అటువంటి ఆనందమయమైన వాతావరణాన్ని సృష్టించగలిగినది స్త్రీ మాత్రమే. అన్ని బాధ్యతలను సంతోషంగా స్వీకరించి కుటుంబ వ్యవస్థను ప్రపంచ దేశాలలో అగ్ర స్థానంలో నిలబెట్టిన భారతీయ మహిళ నేడు తన కుటుంబమూ, దేశంపట్ల తన కర్తవ్యాలను గుర్తించి సఫలీకృతం కాగలదు.

 

– డా|| సోమరాజు సుశీల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *