బౌద్ధం, వైదికం వేర్వేరు కాదు

బౌద్ధం, వైదికం వేర్వేరు కాదు

– బౌద్ధం, వైదికం ఒకే వృక్షపు రెండు కొమ్మలు

– బుద్ధుని నుండి బంధుభావన, సంస్కరణ వాదాన్ని స్వీకరించాలి

– రెంటిని సమన్వయం చేయడం నేటి అవసరం

ఇప్పటికి 2600 సంవత్సరాల క్రితం ఒక రాజ కుటుంబంలో సిద్ధార్ధుడు జన్మించాడు. జ్యోతిష్యులు సిద్ధార్ధుడు గొప్ప ధర్మాచార్యుడు అవుతాడని జ్యోస్యం చెప్పారు. దీనికి భయపడి సిద్ధార్ధుని తండ్రి సిద్ధార్ధునికి ఎలాంటి కష్టాలు తెలియకుండా పెంచాడు. సిద్ధార్ధునికి వివాహం అయింది. కొడుకు కూడా పుట్టాడు. అయినా విధి రాతను ఎవరు మార్చగలరు?

ఒకరోజు సిద్ధార్ధునికి శరీరం ముడుతలు పడి నడవలేని స్థితిలో కర్ర ఊతంగా నడుస్తున్న వృద్ధుడు, ప్రాణం లేని మనిషి శరీరం (శవం) ఎదురయ్యాయి. దానితో సిద్ధార్ధునికి ప్రతి మనిషికి అనారోగ్యం, వార్ధక్యం, మరణం తప్పక వస్తాయని అర్ధమయింది. ఇవన్నీ మనిషికి దుఃఖాన్ని కలిగించేవని, ఈ దుఖాల నుండి మానవ జాతిని కాపాడాలని నిర్ణయం తీసుకున్నాడు సిద్ధార్ధుడు.

‘అసంతోషః శ్రేయోమూలం’ అనేది సంస్కృత సూక్తి. వ్యక్తిగతమయిన అసంతృప్తి దుఖానికి కారణమవుతుంది. సమాజంలో ఉన్న దుఖాన్ని పోగొట్టాలనే ఆలోచన మోక్షానికి దారిచూపుతుంది. సిద్ధార్ధుడు తనకు భవిష్యత్తులో ఎదురయ్యే దుఖాలకు భయపడలేదు. మానవాళి అంతటిని ఈ దుఃఖాల నుండి దూరం చేయడం, సుఖాలనిచ్చే సత్యాన్ని కనుక్కోడం కోసం రాత్రికి రాత్రే భార్యను, కుమారు డిని, రాజ్యాన్ని వదిలి శిరోముండనం చేయించుకుని కాషాయ వస్త్రధారియై బిక్షాటన చేస్తూ ఇంటి నుండి వెళ్ళిపోయాడు సిద్ధార్ధుడు.

ఈ సంఘటన అన్ని రాజ్యాలలోను కలకలం రేపింది. ఒక అందమైన యువకుడు రాజ్యాన్ని, భార్యను, సంతానాన్ని వదిలి ప్రజల ముక్తికోసం భిక్షాటన చేస్తూ తపస్సు చేయటం ప్రజలందరికి ఆశ్చర్యం కలిగించింది.

మెత్తని హృదయం

జన్మతః సిద్ధార్ధునిది మెత్తని హృదయం. సిద్ధార్ధుని సోదరుడు ఆకాశంలో పయనిస్తున్న ఒక హంసను బాణంతో కొట్టాడు. హంస నేలరాలింది. ఈ సంఘట నను చూసిన సిద్ధార్ధుడు బాణాన్ని తొలగించి వైద్యం చేసి ఆ హంసను బతికించాడు. ‘వేట క్షత్రియ లక్షణం. నేను వేటాడాను. కనుక ఈ హంస నాది’ అంటూ సిద్ధార్ధుని సోదరుడు వాదించాడు. ‘మరణపు అంచున ఉన్న హంసను గాయం మాన్పించి బ్రతికించాను. కనుక హంస నాది’ అంటూ సిద్ధార్ధుడు వాదించాడు. ‘ప్రాణాన్ని నిలబెట్టిన సిద్ధార్ధునికే హంస చెందుతుంది’ అంటూ మానవత్వం ఆధారంగా సిద్ధార్ధుని తండ్రి శుద్ధోధనుడు తీర్పు యిచ్చాడు. సిద్ధార్ధుని మానవతా హృదయానికి ఇదొక ఉదాహరణ.

ఇల్లు విడిచి వెళ్ళిన సిద్ధార్ధునికి ఎట్టకేలకు (బుద్ధ) గయలో జ్ఞానోదయం అయింది. బుద్ధుడయ్యాడు. భారతదేశ సాంప్రదాయం ప్రకారం ధార్మిక రంగంలో ఏ నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినా కాశీ పండితులను ఒప్పించాలి. అప్పుడే హిందూ సమాజం ఆ సిద్ధాంతాన్ని స్వీకరిస్తుంది. జ్ఞానోదయం పొందిన బుద్ధుడు కాశీ నగరానికి 11 కి.మీ.ల దూరంలో మొట్టమొదటి సారిగా తన బోధనలను వినిపించాడు. అనేకమంది పండితులు, మహారాజులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు బుధ్ధుని బోధనలను విన్నారు, చర్చించారు, తర్కించారు, స్వీకరించారు, బుద్ధుని శిష్యులయ్యారు.

నాటి పరిస్థితులు

బుద్ధుడు జన్మించేనాటికి హిందూ సమాజం ఆర్ధికంగా, పరిపాలనా పరంగా కళలలో, శాస్త్రాలలో అత్యున్నత స్థానంలో ఉంది. వైదిక ధర్మంలో చెప్పిన మూల సూత్రాలకు భిన్నంగా పురోహిత వర్గం అనేక అశాస్త్రీయమైన ఆచారాలను సమర్ధించసాగింది. వేదకాలం నాటి వర్ణ వ్యవస్థ క్షీణించి జన్మతః కుల వ్యవస్థగా రూపొందింది. బ్రాహ్మణ ఆధిపత్యం పెరిగింది. కులాల మధ్య అంతరాలు పెరిగాయి. కులధర్మాలు, ఆచారాలు పేరుతో సమాజంలో అడ్డుగోడలు ఏర్పడ్డాయి. మా ద్వారానే ముక్తి, మోక్షం లభిస్తుందని; మా చేతుల మీదుగా యజ్ఞ, యాగాదులు చేస్తేనే కష్టాలు పోయి కోరికలు తీరతాయని పురోహిత వర్గం చెబుతూ, తమ పిడికిట్లో సమాజాన్ని బిగించింది. ఈ పురోహితుల ఆధిపత్యం ముందు సమాజంలో మత ప్రవక్తల స్థానం కరువయింది. ఇలాంటి సమయంలో బుద్ధుడు జన్మించాడు. మత ప్రవక్తల సందేశాలకు భిన్నంగా సంకుచిత దృక్పధంతో పురోహితవర్గం ఇలా వ్యవహరించడం అన్ని మతాలలో ఉన్న చరిత్రే !

బుద్ధుని బోధనలేమిటి ?

ఈ ప్రకృతి, విశ్వం, నిర్మాణం వెనుక సర్వ శక్తిమంతుడయిన భగవంతుడున్నాడు అని అన్ని మతాలు నమ్ముతుంటాయి. ఈ కనబడని భగవంతుని మంచి చూపుకోసం సామాన్య ప్రజలు పురోహిత వర్గాన్ని ఆశ్రయిస్తారు. ఈ పురోహిత వర్గం చెప్పిందే ప్రమాణం. భగవంతుని ఆశీస్సులు పొందటం కోసం జంతువులను బలి ఇస్తారు. కొంతమంది చాదస్తులు తోటి మనుషులను, చివరకు సంతానాన్నయినా బలి ఇవ్వటానికి సిద్ధమవుతుంటారు. ఇది ప్రపంచ చరిత్ర.

ఈ స్థితిలో ‘దేవుడు’ కేంద్రంగా నిర్మాణమయిన మత సిద్ధాంతాలకు భిన్నంగా ‘మనిషి’ కేంద్రంగా నూతన మతాన్ని ఆవిష్కరించాడు బుద్ధుడు. దేవుడు ఉన్నాడని కాని, లేడని కానీ బుద్ధుడు చెప్పలేదు. ఈ చర్చే అనవసరం అన్నాడు. నిజానికి బుద్ధుడు ఆస్థికవాది కాదు, నాస్థికవాది కాదు. మానవులకు ఎదురవుతున్న దుఃఖాలకు కారణం అంతులేని కోరికలు. కోరికలు పరిమితం కావాలి. పక్కవారికి, సమాజానికి నష్టం కలిగించని రీతిలోనే, పరిమిత స్థాయిలోనే కోరికలను తీర్చుకోవాలి. ఇటువంటి జీవనం అష్టాంగ మార్గం ద్వారానే లభిస్తుంది అని బుద్ధుడు పేర్కొన్నాడు. ధర్మం, మోక్షం అనే రెండు గట్ల మధ్య అర్ధ కామాలు తీర్చుకోవాలని, తనకు అవసరమైన మేరకే ఆహారాన్ని తన వద్ద ఉంచుకోవాలని, అంతకన్నా ఎక్కువగా ఉంచుకోరాదని చెప్పిన వైదిక ధర్మపు ఆలోచనలకు బుద్ధుని సందేశానికి పెద్ద తేడా ఏముంది ? 10 గుణాలతో కూడిన ధర్మ నిర్వచనానికి 8 గుణాలతో కూడిన అష్టాంగ మార్గానికి ఎంతో సామీప్యం ఉంది.

విశ్వవ్యాప్తం

బుద్ధుడు కుల అసమానతలను వ్యతిరేకించాడు. స్త్రీ, పురుషుల మధ్య సమాన అవకాశాలను ప్రతిపాదించాడు. బౌద్ధ భిక్షు సంఘంలో అన్నికులాల వారికి, పురుషులకు, స్త్రీలకు స్థానం కల్పించాడు. ఈ పెద్ద మార్పు బుద్ధుడు సాధించిన ఘన విజయం. ఋషులు కనుగొన్న సత్యాలను కొన్ని శతాబ్దాలుగా పండిత, పూజారి వర్గం తన గుప్పింట్లోనే ఉంచుకున్నాయి. దీనికి భిన్నంగా బుద్ధుడు సుమారు 50 సంవత్సరాలు దేశమంతా పర్యటించి తన బోధనలను ప్రజలందరికి అందజేశాడు. ఈ బోధనలను విశ్వవ్యాప్తం చేయటం కోసం అవసరమైన బౌద్ధ బిక్షువుల పరంపరను నిర్మాణం చేశాడు.

బుద్ధుడు తన బోధనలను సంస్కృత భాషలో కాక సామాన్య ప్రజల వాడుక భాష అయిన ‘పాళీ’ భాషలో ప్రవచించారు. దాంతో బుద్ధుని బోధనలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ‘ఆత్మ దీపోభవ’ – నామీద ఆధారపడకండి, మీ సొంత ఆలోచనలతో, సొంత అనుభవాలతో ముందుకు వెళ్ళండి. నేను నిష్క్రమిస్తున్నానని విలపించకండి’ అంటూ తన తనువు చాలిస్తూ బుద్ధుడు తన అంతిమ సందేశాన్ని శిష్యులకు అందజేశాడు. బుద్ధుడు తనువు చాలించిన తరువాత శిష్యులందరూ సమావేశమై బుద్ధుని బోధనలను మననం చేసుకుని వాటన్నింటిని ‘త్రిపీటకములు’ అన్న పేరుతో గ్రంథస్థం చేశారు.

బౌద్ధ భిక్షువులు బుద్ధుని సందేశం ఆధారంగా సమాజాభివృద్ధికి అవసరమైన అనేక రంగాలలో అపారమైన సాహిత్యాన్ని ప్రచురించారు. బుద్ధుడు ఆత్మ శాశ్వతత్వాన్ని అంగీకరించకపోయినా బుద్ధుని జాతక కథలు మరోరకంగా పునర్జన్మను సమర్ధిస్థాయి. బుద్ధుని శిష్యులు ప్రపంచంలోని సుదూర దేశాలైన కొరియా, వియత్నాం, బర్మా, టిబెట్‌, శ్రీలంక, జపాన్‌, చైనా వంటి అనేక దేశాలకు వెళ్ళారు. ఆ దేశపు మతాలు, సిద్ధాంతాలను గౌరవిస్తూనే బుద్ధుని సందేశపు మూల సూత్రాలను వారివారి మత సిద్ధాంతాలకు సమన్వయం చేస్తూ జోడింపచేశారు. ఆ దేశ మత సంస్కృతులను కాపాడుతూనే బుద్ధుని బోధనల ఆధారంగా ప్రపంచ ప్రగతికి బౌద్ధ భిక్షువులు బాటలు వేశారు.

బుద్ధుని బోధనలలోని సత్యాలను భారతదేశ హిందూ సమాజం స్వీకరించింది. బుద్ధునికి హిందువులు దశావతారాలలో స్థానం కల్పించారు. ఇక్కడ ఇలా ఉంటే, ప్రపంచంలో వేరొకపక్క యూదు మతంలో జన్మించిన ఏసుక్రీస్తు యూదు మతపు బోధనలకు భిన్నంగా కొన్ని కొత్త బోధనలను ప్రవచించిన కారణంగా ఆ యూదు మతస్థులే ఏసుక్రీస్తును శిలువ కెక్కించారు. క్రీస్తు ప్రవచించిన బోధనలు క్త్రైస్తవ మతమై, వివిధ దేశాలలో ప్రవేశించి ఆ దేశపు మూల సంస్కృతులను సమూలంగా నాశనం చేసింది. ఉదాహరణకు అమెరికాలోని లక్షలాదిమంది స్థానిక రెడ్‌ ఇండియన్‌లు క్త్రైస్తవుల చేతుల్లో హతమయ్యారు. ఇదే పరిస్థితి ఆస్ట్రేలియా ఖండంలోని స్థానిక మతస్థుల పట్ల, లాటిన్‌ అమెరికా వంటి దేశాలలోని స్థానికులపట్ల కూడా జరిగింది. అలెగ్జాండర్‌ ఆయుధాల ద్వారా ప్రపంచ చక్రవర్తి కావాలని ప్రయత్నించగా, అలెగ్జాండర్‌కు 300 సంవత్సరాల ముందు బుద్ధుడు శాంతియుత పద్ధతుల ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజల హృదయాలను జయించాడు.

సమన్వయం చేయాలి

వైదిక ధర్మంలోని గొప్ప విలువలను; బౌద్ధ ధర్మంలోని సమానత్వము, సంస్కరణ వాదాలను జోడించి వీటిమధ్య సమన్వయం చేసిన మొదటి ధర్మప్రచారకుడు స్వామి వివేకానందుడు. బౌద్ధ ధర్మం నుండి మానవత్వాన్ని, సంస్కరణ వాదాన్ని, తార్కిక వాదాన్ని మనం స్వీకరించాలని స్వామి వివేకా నందుడు పేర్కొన్నారు. నాస్తికవాదం అంటూ బౌద్ధ ధర్మాన్ని కొట్టిపారేయడం కాక బౌద్ధధర్మంపై స్వామి వివేకానందుని ఆలోచనలను అధ్యయనం చేయటం నేటి హిందువుల ప్రధాన బాధ్యత. బుద్ధ గయలో కొందరు విదేశీ బౌద్ధులు వేర్పాటు వాదాన్ని ప్రచారం చేస్తుంటే సోదరి నివేదిత ‘బౌద్ధధర్మం, వైదిక ధర్మం రెండు భిన్నమయినవి కాదు, వీటి మధ్య ఎంతో సామీప్యం ఉంది. రెండింటి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను విదేశస్థులు మానుకోవాలి’ అంటూ 130 ఏళ్ళ క్రితమే తన భావాలను వ్యక్తం చేసింది.

25 సంవత్సరాల క్రితం విజయవాడ వద్ద అమరావతిలో జరుగుతున్న బౌద్ధ ఉత్సవాలలో పాల్గొనడానికి ప్రపంచ బౌద్ధగురువు దలైలామా హైదరాబాదుకు వచ్చారు. విమానం నుండి దిగుతూ పత్రికా విలేకర్ల సమావేశంలో ‘బౌద్ధమతం, సనాతన వైదిక మతం రెండు ఒకే వృక్షానికి చెందిన రెండు కొమ్మలు. వీటి మధ్యగల అనుబంధాన్ని బలోపేతం చేయాలి. ప్రపంచంలో గల వివిధ దేశాలలో ఉన్న బౌద్ధులు భారతదేశంలో ఉన్న హిందువులు కలిసి మెలిసి పని చేయాలి’ అని పిలుపిచ్చారు. ప్రపంచ బౌద్ధగురువు దలైలామా ఇలా మాట్లాడితే దానిని విమర్శిస్తూ హిందూ ధర్మానికి బౌద్ధమతానికి రెండింటి మధ్య పొంతనే లేదు అంటూ దలైలామాను విమర్శిస్తూ వరంగల్‌లో వరవరరావు నాయకత్వంలో పౌరహక్కుల సంఘం కార్యకర్తలు దలైలామ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ దేశంలోని కమ్యూనిష్టులు, తామే మేధావులమనుకునే మరికొందరు ఈ దేశంలో జన్మించిన వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయినప్పటికి 1956 లో డా|| బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ‘నేను విదేశీ మతాలను స్వీకరించను. ఈ దేశపు గడ్డపై జన్మించిన బౌద్ధ ధర్మాన్నే స్వీకరిస్తాను’ అంటూ బౌద్ధ ధర్మాన్నే స్వీకరిం చారు. బౌద్ధ ధర్మంలోని ప్రత్యేకతలను విశిష్టతలను గుర్తిస్తూ, స్వాగతిస్తూ; వైదిక, బౌద్ధ మతాలమధ్య సమన్వయం చేయటం నేడు మన బాధ్యత.

(30 ఏప్రిల్‌, 2018 న బుద్ధపూర్ణిమ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో బుద్ధజయంతి జరిగింది. ఆ కార్యక్రమంలో రచయిత చేసిన ప్రసంగ సారాంశం)

– కె.శ్యామ్‌ప్రసాద్‌, జాతీయ సంయోజకులు, సామాజిక సమరసత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *